-వైదేహి శశిధర్
విరిగిన కొమ్మలా వాలిన
తండ్రి చేతిని తన గుప్పెటలో బంధించి
ఘనీభవించిన కన్నీళ్ళ నావై
వేదనల తెరచాపలెత్తి
ఆ వైపు నిశ్శబ్దంగా నిలచిన ఆమె
కదిలే కారుణ్య వీచికనై
చార్టులో రిపోర్టులను మధించి
కరిగిపోతున్న కాలంతో
ఏకదీక్షగా పోరాడుతూ
ఈ వైపు కర్తవ్య నిమగ్ననై నేను
నివురు గప్పిన గాండీవాలై
మా మధ్య రెప్పవేయక చూస్తూ
రెస్పిరేటర్లు, డీఫిబ్రిలేటర్లూ
ప్రతిరోజూ అమ్ములపొది సర్దుకుని
రుగ్మతలపై యుధ్ధానికి
సన్నధ్ధమవుతూనే ఉంటాను.
కాలం గడచినా, వ్యక్తులు మారినా
యుద్ధం మాత్రం నిరంతరం
సాగుతూనే ఉంటుంది,
వేలాది గాయాలను మాన్పుతూ
డా. వైదేహీ శశిధర్ గారు పుట్టింది నరసరావుపేట, పెరిగింది గుంటూరు జిల్లాలో. మెడికల్ విద్య -ఆంధ్రా మెడికల్ కాలేజ్, విశాఖపట్నం. గత పన్నెండేళ్ళుగా అమెరికాలో కుటుంబంతో నివాసం. ప్రస్తుతం న్యూజెర్సీలో ఫిజిషియన్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు. సాహిత్యం, ప్రత్యేకించి కవిత్వం, సంగీతం అభిమాన విషయాలు. అభిమానకవి తిలక్. ‘నిద్రితనగరం’ కవితాసంకలనం ప్రచురించారు. దీనికి 2009 ఇస్మాయిల్ పురస్కారం లభించింది. అప్పుడప్పుడూ ఇంగ్లీషులో కూడా కవితలు రాస్తూంటారు.
మాడం,
మంచి పొయెం ….ఆర్ద్రంగా,ఆర్తిగా,ఆత్మీయంగా…
క్షత గాత్రుల గాయాలు
మూల్గుల, నిట్టూర్పుల
కన్నీళ్ళ వేదనల మాన్ప
సాగే నిత్య సమరంలో
అమృత హస్తానికి
కలం చేరువ కావడం
ముదావహం…
chaalaa baavundandi.
చాలా బావుందండీ!
వైద్య సన్నద్ధం కవిత్వ వస్తువు చెయ్యడం బాగుంది. సందర్భంలోని ఆర్తి కూడా బాగా తెచ్చారు. నివురు కప్పిన గాండీవం అన్న వాడుక అంతగా నప్పలేదు.
లోతు చిక్కక పైపైన సాగిపోయినట్టుంది వైదేహి గారు. ఆమె గురించో, అమె నాయన గురించో మరో రెండు మూడు లైన్లు వ్రాసుండాల్సింది. అది కూడా కాకపోవచ్చు, కానీ ఎందుకో మనసులో చిన్న గాటు కూడా పెట్టలేదు.
రవికిరణ్ తిమ్మిరెడ్డి.
“యుద్ధం” పై తమ అభిప్రాయాలు తెలిపిన సాహితీమిత్రులందరికీ కృతజ్ఞతలు.
Your poem is very fine..
వైద్యవృత్తిలోని సమరస్పూర్తిని త్యాగాన్ని సహనశీలతని చాటే రచనలెన్నో చదివాను కానీ కవితారూపంగా ఇదేనండి. నా స్నేహితురాలు కవి కాదు కానీ ప్రతి యుద్దపు గెలుపు ఓటములు తనని కదపటం చూస్తూనే ఉంటాను. అలాగే మా మావయ్య. అందరినీ కాకపోయినా కొందరి మరణాన్ని సులభంగా దిగమింగలేరు. వారి మీద రాసుకున్న పంక్తులివి.
*** బందీ
స్వపరమెరుగని బాంధవ్య సంకెళ్ళు,
కనుమరగవని కన్నీళ్ళ ఉప్పెనలు,
విడుదల అడగని నీకు శిక్షపై శిక్షలు,
వెలకట్టలేనివి నీవు చెల్లించు జరిమానాలు.