చిలకపలుకులు అంటూ మొదలుపెట్టి, చెత్తకుండీకి ఓ మనసుంటే అని ఆలోచింపచేసి, అంతలోనే అల్లరా-నేనా! అంటూ గొడవ చేసి, శ్రీవారే బదులిస్తే అంటూ మధురోహల్లో ఓలలాడించి, సూసైడ్ నోట్ అంటూ కంగారుపెట్టి…నెలపొడుపుగా ఉన్నా అక్షరాల్ని నిండుపున్నమిగా చేయడమే అంటూ తన ఊసులన్నింటినీ మనకి అందించిన పూర్ణిమకి పరిచయం అనవసరం!! తన గురించిన మరికొన్ని ఊసులు-ఊహలు…
1. పుస్తకాలతో మీ పరిచయం ఎలా మొదలయ్యింది.. మీ కుటుంబ నేపధ్యం, మీరు చదివిన స్కూల్, మీ స్నేహితులు, టీచర్స్ ఏమైనా తోడ్పడ్డాయా..?
ఎ.బి.సి.డీలు నేర్పడానికి మా వాళ్ళు నాకో పుస్తకం తెచ్చారు. అది పుస్తకంతో నా తొలి పరిచయం. “నా పుస్తకం” భావన భలే గమ్మత్తుగా ఉండేది, తొలి పేజీలో నా పేరు (తప్పు స్పెల్లింగ్ తో, నా పేరు సరిగ్గా రాయడం నాకు చాన్నాళ్ళు చేత కాలేదు) రాసుకోవటం ఓ సంబరం. నేను ఉద్యోగంలో చేరిన ఏడాది వరకూ కూడా, నా పుస్తకాలూ అంటే పాఠ్య పుస్తకాలే. మా ఇంట్లో ఎవరూ అంతగా పుస్తకాలు చదవరు. మా అమ్మకి తెలుగు నవలలు, అప్పట్లో వచ్చిన తెలుగు-హిందీ సినిమాలూ, ఫుట్ బాల్, క్రికెట్ అంటే చాలా క్రేజ్. తన నుండి నాకు క్రికెట్ క్రేజ్ ఒక్కటే వచ్చింది. మా ఇంటి చుట్టుపక్కల లైబ్రరీల లాంటివేం ఉండేవి కావు. చిన్నప్పటి స్నేహితులు పుస్తకాలంటే ఆమడ దూరం పరిగెత్తేవాళ్ళే! ఇప్పటికీ నా స్నేహితుల్లో అత్యధిక భాగం పుస్తకాలంటే ’అమ్మో’ అనే అంటారు. స్కూల్ లైబ్రరీ పెద్ద పేరున్నది కాకపోయినా, ఉన్నవాటినే చదివేదాన్ని. అడపాదడపా డిబేట్, వ్యాసరచన పోటీల్లో బహుమతులుగా వచ్చిన పుస్తకాలే. శ్రీశ్రీ మహాప్రస్థానం అలానే వచ్చింది.
పుస్తకాలు దొరకపుచ్చుకునే అవకాశం లేకున్నా, చదవాలనే ఆసక్తి చాలా ఉండేది. చిత్తుకాగితాలనూ చదివాకే పడేసేదాన్ని. టీచర్స్ ప్రభావం అంటే, నాకు మా తెలుగు టీచర్, శ్రీమతి ఇందిర గారు అంటే చాలా ఇష్టం. ఆవిడ మాకు పాఠ్యాంశాలు ఎంత బాగా చెప్పేవారంటే, తెలుగు చదవడం అన్నా, రాయడమన్నా నాకు innate అనిపించేంత. (తెలుగులో బాగా రాయలేకపోవడమనేది నా దురదృష్టమనుకుంటా!)
ఉద్యోగంలో ఓ ఏడాదో ఏడాదిన్నరో గడిచాక, నా మేనేజర్ నన్ను పిల్చి, “ఉద్యోగమే జీవితమనేలా ఉంటే కష్టం. ఇది ఈ రోజు నీకు నచ్చుతుంది కాబట్టి ఎంజాయ్ చేస్తున్నావ్. రేపు ఇష్టం లేకపోయినా పని చేయాల్సి వస్తుంది. అప్పుడు దీని మీద విరక్తి రావచ్చు. అందుకని ఉద్యోగమే కాక, వేరే ఏదైనా వ్యాపకం ఉండాలి” అని అన్నారు. ఆ మాటలు నాపై చాలా ప్రభావం చూపించాయి. అందుకే బ్లాగ్ మొదలెట్టాను. బ్లాగ్ మొదలెట్టటం వల్ల, నా రాతలు ఎంత మెరుగుపడ్డాయో ఏమో కాని, నా పఠనం వెయ్యి రెట్లు మెరుగుపడింది. “నీకా రచయిత తెలీదా, ఉరి తీస్తా!”, “ఆ పుస్తకం తెలీదనకు, మేడ మీద నుండి తోసేస్తా” అని విసుక్కున్నా నాకు కొత్త రచయితలనీ, పుస్తకాలనీ పరిచయం చేస్తూనే ఉంటారు (బ్లాగర్) ఫ్రెండ్స్. ఇహ, నేనెంత విసిగించినా, ఓపిగ్గా నా స్థాయికి వంగి అక్షరాలు దిద్దించినట్టు, సాహిత్యపు విశేషాలు చెప్పుకొచ్చిన స్నేహితులూ ఉన్నారు. ఏవో మాటల మధ్య ఏదైనా పుస్తకాన్ని ప్రస్తావిస్తే, కొన్నాళ్లకి “మొన్న దీని గురించి మాట్లాడుకున్నాం కదా, నీకోసమే పుస్తకం” అని చెప్పి ఇచ్చే స్నేహితులు కూడా. అందరూ బ్లాగ్స్ ద్వారా పరిచయం అయ్యినవారే. నా బ్లాగు మూసేసినా, వాళ్లు బ్లాగులు ఉన్నా, లేకున్నా మంచి స్నేహితులుగా మిగిలాం.
ఇంత చెప్పుకొచ్చింది ఎందుకంటే, I’m immensely thankful to the Telugu blog-o-sphere and people in it, which has helped me better myself over the past few years. బ్లాగుల వల్ల చేదు అనుభవాలు కలిగినా, వాటి వల్ల నాకు జరిగిన మేలుని విస్మరించలేము.
2. ఎలాంటి పుస్తకాలు ఇష్టపడతారు? అప్పటికి, ఇప్పటికి ఎప్పటికి నచ్చే పుస్తకం(లు)
నాకు మాయ చేసి, మభ్య పెట్టి, మాజిక్ కార్పెట్ మీద మరో ప్రపంచానికి తీసుకుపోయే రచనలు ఎప్పుడూ నచ్చవు. నాకు ఈ ప్రపంచమే కావాలి పుస్తకాల్లో కూడా, మనుషులే ఉండాలి వాటిలోనూ. జీవితం కావాలి. మరణం కావాలి. వాటి మధ్య అనేకానేకమైన సంఘర్షణలే కావాలి. జీవితం – with all its terms and conditions – నాకిష్టం. దానితో నా అనుబంధాన్ని పెంచే రచనలే కావాలి. అలా అని దాన్ని glorify చేసేవే కావాలని కాదు. బైరాగి అన్నట్లు “జీవితమొక వ్యర్థ వినోదం – జీవితమొక క్షణికోన్మాదం” లాంటి రచనలు కూడా. గాయం మాన్పేవి కాదు. గాయాల్ని అలవాటు చేసే పుస్తకాలు ఇష్టం. ప్రపంచం గాయపరిస్తే పుస్తకాల్లో తలదాచుకోవటం నాకు చేత కాదు. జీవితంలో లేని దేన్నో పుస్తకాల్లో వెతుక్కోవటం అంతకన్నా రాదు.
సత్యనారాయణ, ప్రభాకరరెడ్డి విలన్లుగా ఉండే పాత తెలుగు సినిమాల్లో, విలన్లు ఉండే నివాసంలో ఒక స్విచ్ నొక్కగానే, అప్పటి దాకా అరలా కనిపించినది, తలుపులా తెరుచుకొని, కొత్త దారులని చూపిస్తాయే.. అలానే ప్రతి మనిషిలో కూడా ఉంటాయనుకుంటాను. మనకి తెలీని మనలోని ద్వారాలను తెరవడానికి కావాల్సిన స్విచ్‍లు పుస్తకాలని నా నమ్మకం.
అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికి నచ్చేవి ఇలాంటి రచనలే – నన్ను మెరుగుపరిచేవి.
3. ఒక మనిషి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో, అలవాట్లలో పుస్తకాల పాత్ర ఉంటుందనుకుంటున్నారా? ఉంటే ఎలాంటి పాత్ర, మీ పై ఎలాంటి ప్రభావం ఉంది..?
ఇప్పుడు నా లాప్‍టాప్ లో చాలా ఈ-బుక్స్ ఉన్నాయి. నా గదిలో అరల్లో పుస్తకాలున్నాయి. వాటిని చదివితే నా మెదడులో కూడా డంప్స్ ఏర్పడతాయి. కాని మెదడులో ఉన్న ఆ ఇన్ఫోతో నేనేం చేస్తున్నా అన్నదాని బట్టే నాలో, నా వ్యక్తిత్వంలోనూ మార్పులు వచ్చినా, రాకున్నా. పుస్తకాలు చదవటం వల్ల మాత్రమే ఎవరూ గొప్పవారు కాలేరు. పుస్తకాలు చదవరని ఎవర్నీ తక్కువ చేసి మాట్లాడాల్సిన పని లేదు. ఎన్ని పుస్తకాలు చదివుంటే అంత గొప్ప అనేది కూడా నేను ఒప్పుకోను. కొందరికి వాటి అవసరం ఉండకపోవచ్చు.
పుస్తకాలు చదవటం, ఆటలు ఆడ్డం లాంటివన్నీ వ్యక్తిత్వ వికాసాలే! కాని అంత మాత్రాన, వాటి వల్లే వాళ్లు మహావ్యక్తులు అవుతారని నాకు నమ్మకం లేదు.
నా విషయంలో ఏమవుతుందంటే, నాకు కబుర్లు వినడం ఇష్టం. మన జీవితంలో కలిసే మనుషులు Time and space limited కాబట్టి, గతించిన కాలంలోని వాళ్ళేమనుకున్నారో, ఏం చేసారో నాకు తెల్సుకోవాలని ఉంది కాబట్టి నేను పుస్తకాలు చదువుతున్నాను. కొందరు ఈ విశేషాలను కబుర్లుగా చెప్తారు, ఇంకొందరు రసవత్తరమైన కథలుగా చెప్తారు. నాకు అవీ-ఇవీ రెండూ ఇష్టమే.
4. మొదటినుండి ఉన్న నిశ్చితాభిప్రాయాలు పుస్తకాలు చదవడం వల్ల సమూలంగా మారిపోయిన సంగతులు-సందర్భాలు
నిశ్చితాభిప్రాయాలు మారడం.. హమ్మ్! ఉన్నాయ్! నిజం ఒప్పుకోవాలంటే, పుస్తకాలు చదవడం ఇష్టపడేదే దీని కోసం; నా ఆలోచనలూ, అభిప్రాయాలూ, నమ్మకాలు ఎలా మారతాయోనన్న ఉత్సుకత!
నేను స్కూల్లో ఉండగా, పాఠం చెబుతూ, “గాంధీ మహాత్ముడు అవతారపురుషుడు. అందుకే భారతదేశాన్ని ఒక్క తాటిపై నడిపించగలిగాడు.” అని ఒకరు వ్యాఖ్యానించారు. నాకు నచ్చాయ్ ఆ మాటలు. అలానే అనుకున్నాను. నమ్మటం మొదలెట్టాను. గాంధీ ఆత్మకథ చదువుతున్న కొద్దీ ఈ నమ్మకం మెల్లిమెల్లిగా నశించింది. మహాత్మాగాంధీ కాక, ఆ పేరు వెనుకున్న మనిషి పరిచయమయ్యే కొద్దీ అవతారపురుషుడు అనేది విస్మరించగలిగాను. గాంధీని ఒక మనిషిగా చూడ్డం మొదలెట్టాను. ఆ పుస్తకం పూర్తయ్యేసరికి మనిషి ఎంత గొప్ప పనులు చేసి, ఎంత కీర్తిని ఆర్జించినా, మనిషి కాకుండా పోడు అని తెల్సొచ్చింది.
ఇది చదివిన కొన్నేళ్ళకి లాన్స్ ఆర్మ్ స్ట్ర్రాంగ్ ఆత్మకథ చదివాను. స్పోర్ట్స్ బాగా ఫాలో అవుతా కాబట్టి, ఈ మనిషి గురించి కాస్తో కూస్తో తెల్సు. పుస్తకం అంతా బానే అనిపించింది. నాకు నచ్చింది. అందులో లాన్స్ కన్నా, నాకు వాళ్ళ అమ్మా, భార్యా చాలా నచ్చారు. వాళ్ల కోసమే పుస్తకం మళ్లీ చదివాను కూడా. కొన్నాళ్ళకి లాన్స్, అతని భార్యా విడిపోయారని తెల్సింది. అసహజ పద్ధతుల్లో తన బిడ్డకు జన్మనిచ్చి, తండ్రి కాలేని అతనికి ఒక అద్భుత వరం ఇచ్చిందావిడ అని పుస్తకం ద్వారా తెల్సుకున్న నాకు, ఈ వార్త నచ్చలేదు. కోపం వచ్చింది. లాన్స్ అంటే చిరాకేసింది. కాని అతణ్ణి ద్వేషించలేకపోయాను. మృత్యువునూ, టూర్ డి ఫ్ర్రాన్స్ నీ ఎంతటి విపరీత పరిస్థితులోనైనా నెగ్గే “ఛాంపియన్” కూడా ఒక మనిషే! మానవ సంబంధాలు విఫలమవ్వటంలో పెద్ద వింత లేదుగా!
ఇలా చాలా సందర్భాలు ఉన్నాయి. కాఫ్కాది ఒక మంచి కోట్ ఉంది. దాన్ని ఇక్కడ యధాతధంగా ఇస్తున్నాను.
“Altogether, I think we ought to read only books that bite and sting us. If the book we are reading doesn’t shake us awake like a blow on the skull, why bother reading it in the first place? So that it can make us happy, as you put it? Good God, we’d be just as happy if we had no books at all; books that make us happy we could, in a pinch, also write ourselves. What we need are books that hit us like a most painful misfortune, like the death of someone we loved more than we love ourselves, that make us feel as though we had been banished to the woods, far from any human presence, like a suicide. A book must be the axe for the frozen sea within us. That is what I believe.”
5. కవిత/కవిత్వం గురించి మీ మాటల్లో
హహహ.. నన్నెందుకీ ప్రశ్న అడగాలనిపించింది? అంటే కథ, నవల – వీటిని గురించి కాక, కవితే ఎందుకని?
నా అనుభవంలోనిది చెప్తాను, అది అందరికీ వర్తించకపోవచ్చు. తాను అనుభవించిన చిన్న సైజు స్వర్గాన్నో, నరకాన్నో లయబధ్థంగా అతి కొద్ది పదాల్లో అమర్చి, అది చదివిన వారి గుండె తీగలను మీటటమో, లేక లాగి వదలటమో చేసేది కవిత్వం. Condensed form of intensified emotion. కవిత్వం చదివితే ఏదో జరుగుతుందనే తెలుస్తుంది, ఏం జరుగుతుందో తెలీదు. కవిత్వాన్నీ, హాస్యాన్నీ వివరించకూడదు. విశ్లేషించకూడదు. అనుభవించాలంతే!
6. పుస్తకం.నెట్ నేపధ్యం.. సౌమ్య పాత్ర
మొదటి ప్రశ్న చివర్నుండీ కథ కొనసాగుతుంది. అలా నా బ్లాగ్ స్నేహాల వల్లా, పరిచయస్థుల వల్లా బోలెడేసి పుస్తకాలు కొంటూ కొంటూ, విశాలాంధ్ర మీద ఒకానొక దాడి తదనంతరం, నేను ఆన్‍లైన్ వస్తే, “ఏం కొన్నావ్? పుస్తకాల పేర్లేంటి?” అని ఒక ముగ్గురు నలుగురు అడిగితే వాళ్ళకి సమాధానాలిచ్చాను. ఐదో మనిషొచ్చి, “వెళ్లావా విశాలాంధ్రకి? ఏం కొన్నావ్?” అని అడిగేసరికి, ఇలా కాదనుకొని, పుస్తకాల పేర్లతో ఒక టపా రాసేసి, చివరాఖరున అతి తెలివితో “పుస్తకాలకీ ఒక ప్రత్యేక సైటుంటే బాగుణ్ణు కదా!” అని నిప్పు అంటీ అంటించకుండా వదిలేసా. బ్లాగుల్లో ఇంతమంది ఉన్నారు కదా, ఎవరో ఒకరు చేస్తారులే అనుకున్నాను. అనుకున్నట్టే ఆ పోస్టు చదివిన సౌమ్య వీరావేశంగా బ్లాగు ప్రముఖులకి “ఆలోచన ఇది, మీరేమంటారు?” అని ఓ మెయిల్ కొట్టింది. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకొచ్చారు. అందరిదీ ఒకే మాట, “ఆలోచన బాగుంది.. కాని లీడ్ ఎవరు తీసుకుంటారూ?” అని. కాస్త సందిగ్థావస్థ తర్వాత, మరెవరూ ముందుకి రాకపోవటంతో భయంభయంగానే సౌమ్య, నేనూ చేద్దాం అనుకున్నాం. ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో అర్థంకాలేదు. పొద్దు టీం ని సంప్రదించాం. పుస్తకం.నెట్ అనేది మొదలయ్యింది. The rest, as they say, is history. 🙂
సౌమ్య, నేనూ టెక్నికల్ విషయాలను తప్పించి, పుస్తకం.నెట్ అనేది నడవడానికి కావాల్సినవన్నీ చేస్తాం. పుస్తకం.నెట్ అనే ఆలోచన నాదైతే, అది ఆలోచనగానే మిగలకుండా చూసింది మాత్రం సౌమ్య. ఇక సైటు నిర్వహణలో పాత్రలూ, పాత్రధారులూ అంటూ ఏం లేవు. పనివిభజన, అది-నీ-ఏరియా-ఇది-నా-ఏరియా లాంటివేం ఉండవు. వీలైనంత వరకూ ఏదైనా కల్సే చేస్తాం. ఒకరు అందుబాటులో లేనప్పుడు, మరొకరు చూసుకుంటాం. అంతే!
7. పుస్తకం.నెట్ కోసం ఇన్ని ఇంటర్వ్యూలు చేస్తున్నారు కదా, వీటి వెనుక ఏమైనా థీం ఉందా? అన్నింటిలోకి కష్టమైన, ఇష్టమైన ఇంటర్వ్యూ?
యెస్.. పుస్తకం అంటే ఒక రచయితా, ఒక పాఠకుడే కాదు కదా! వీళ్ళద్దరితో సహా పుస్తకంతో ముడిపడి ఉన్న ప్రతి వృత్తిలో వారినీ పరిచయం చేయాలని. అదే థీం.
“కష్టమైన..” – డెఫినట్‍గా ఆబిడ్స్ ఇంటర్వ్యూలు. నాకు టెన్షన్, వాళ్ళకి అనుమానాలు.
ఇష్టమైన – కొత్తపల్లి పత్రిక వాళ్లతో జరిపిన మెయిల్ సంభాషణ. కదంబి రామకృష్ణాచార్య గారిది కూడా ఇష్టం. ఫోన్ చేసిన ప్రతిసారి ఆయన నన్ను ఆటపట్టించడం మరీ ఇష్టం. 🙂
వీటికి జవాబులు రాస్తున్నప్పుడే, మేం ఎ.వి.కె.ఎఫ్ అధినేత అప్పలజోస్యగారిని కల్సాం. అదీ మరపురాని అనుభూతి. ఇక బాపూ, రమణ గార్లతో ముఖాముఖీ అనేది నా జీవితంలో ఉండాల్సిన అధ్యాయం కాదది. దేవుడెక్కడో తడబడ్డాడు, పొరబడ్డాడు. నన్ను వాళ్ళ ముందు నిలబెట్టాడు.
8. పుస్తకం.నెట్ వల్ల మీ దైనందిన జీవితంలో ఏమైనా మార్పులు..?
అరబ్బు కథలో దయతలచి లోనికి రానిస్తే, ఎడారిలో ఉన్న టెంట్ మొత్తం ఆక్రమించుకునే ఒంటెలా పుస్తకం.నెట్ ని తయారవ్వకుండా జాగ్రత్తపడగలను కాబట్టి, దైనందన జీవితంలో మార్పులు అంటూ ఏవీ ఉండవు. నా రోజువారీ పనులన్నీ అరలో సర్దిన పుస్తకాలనుకుంటే, మీరు అర దగ్గరకి వచ్చి, జాగ్రత్తగా గమనిస్తే తప్ప “పుస్తకం.నెట్” అనే పుస్తకం కనపడదు.
9. అవునూ ఒంటిచేత్తో ఇన్ని సమీక్షలు, పరిచయాలు, ఇంటర్వ్యూలు ఎలా వ్రా(చే)స్తున్నారు..?
🙂
10. పుస్తకం.నెట్ కి వస్తున్న స్పందన, ఇంకా చేయాలనుకుంటున్న మార్పులు, చేర్పుల గురించి…
పుస్తకం.నెట్ కి స్పందన – అమేజింగ్! ఊహాతీతం (మేం పెద్దగా ఊహించుకోలేదనుకోండి). సచిన్ భాషలో చెప్పాలంటే, మాకు సంతోషమే కాని అప్పుడే తృప్తి పడదల్చుకోలేదు. చేయాల్సినవి చాలానే ఉన్నాయి. అలా అని అన్నీ చేసేయాలనీ లేదు. పుస్తకంకి రాసే నా స్నేహితులతో అంటూ ఉంటా, “జీవితమూ, ఉద్యోగమూ వల్ల కలిగే డెడ్‍లైన్స్ మధ్య పుస్తకాన్ని బతికించుకోగలిగితే చాలు” అని. ఏ ప్లాన్నైనా దీన్ని ఆధారంగా చేసుకొని అమలుపరుస్తాము.
11. మొన్నామధ్య ఒక చోట రచనా వ్యాసంగం మీద అంత ఆసక్తి లేదు అన్నారు.. అప్పట్లో మీ బ్లాగ్లో కొన్ని కధలు వ్రాశారు.. ఈ మధ్యలో ఏమైనా వ్రాశారా/వ్రాస్తున్నారా?
రాసాను. రాస్తున్నాను. రాస్తాను కూడా. వాటిని ప్రచురించడంపై ప్రస్తుతం వ్యాఖ్యానించలేను.
12. మరి ఆసక్తి లేదని అన్నారు?
ఆసక్తి లేదూ అంటే, రచన ప్రక్రియ అనేది నా నుండి ఎంత తీసుకోగలదో, “అంత” ఇవ్వడానికి నేను సిద్ధంగా లేనని అర్థం. ఏదో హాబీలా అంటే సరే కాని, ఒంటి కాలి మీద తప్పస్సు చేసేంత పట్టుదలతో రాసే ఉద్దేశ్యం లేదని.
నేను చూస్తున్నది ఏంటంటే, ఎంత బాగా (బాగా = ఎక్కువ, మంచి రెండూనూ) రాస్తే అంత మంచి రచయిత అని అంటుంది ప్రపంచం. బతకడానికి రాసేవాడు రచయిత అవునో కాదో నేను చెప్పలేను గాని, రాయకుండా బతకలేని వాడే నా ఉద్దేశ్యంలో రచయిత. అంటే, నా ఉద్దేశ్యంలో నేను రచయితను (పోనీ, రచయిత్రినీ) కానే కాను. 🙂
(ఈ (నా) కొత్త థీసిస్ కాస్త గందరగోళంలా అనిపించొచ్చు. కాని, నేను దానికే కమిట్ అయ్యాను.)
13. పుస్తకాలు, బ్లాగులు, పుస్తకం.నెట్ కాకుండా తీరిక సమయంలో ఏం చేస్తుంటారు?
నిద్రపోతాను. నిద్రపోతాను. నిద్రపోతాను.
పైన పుస్తకం.నెట్ ని అరబ్బు కథలో ఒంటెగా మారనివ్వటం లేదని చెప్పాగా. కానీ అలా నన్ను పూర్తిగా ఆక్రమించుకున్నది మాత్రం క్రికెట్. ఐదు రోజుల పాటు, రోజుకు ఎనిమిది గంటలు తదేకంగా క్రికెట్ చూడ్డం నాకలవాటు. ఏడాదిలో భారత క్రికెట్ జట్టు ఎంత ఆట ఆడుతుందో తెల్సు కదా, అంతా నేను చూస్తానన్న మాట, ఏ టైమ్ జోన్ అయినా. నిద్ర, క్రికెట్ ఒక్కోసారి క్లాష్ అవుతూ ఉంటాయి. టెన్నిస్ చూడ్డం కూడా చాలా ఇష్టం. గ్రాండ్ స్లామ్స్ మిస్స్ అయ్యే సమస్య లేదు.
క్రికెట్, నిద్ర లేకుండా తీరిక ఉంటే “Eat. Shop. Celebrate.” అన్న సెంట్రల్ వాడి ఉవాచను తు.చ తప్పకుండా పాటిస్తూ ఉంటాను. స్నేహితులతో ఉంటే సమయమే తెలీదు నాకు. బొమ్మలు గీయడం, బొమ్మలు చేయడం కూడా ఇష్టమే.. ఎప్పుడో మూడ్ వచ్చినప్పుడు.
14. మిమ్మల్ని అండమాన్ దీవిలో ఒంటరిగా వదిలేస్తూ వీటిలో ఏదో ఒకదాన్ని ఎంచుకోమంటే … ఒక బుట్టలో పుస్తకాలు, ఇంకో దాంట్లో ఉత్తరాలు(మీరు వ్రాసిన, మీ ప్రాణస్నేహితులవి, ప్రముఖులవి గట్రా), మరో దాంట్లో సినిమాల డివిడిలు (అన్నీ మీకు బాగా నచ్చిన సినిమాలవే)
బుట్టలో పుస్తకాలు! – అని అంటా అనుకున్నారు కదూ?! 🙂 నేనలా అనాలంటే, మీరీ కింది ప్రశ్నలకు జవాబులు ఇవ్వాలి..
దీవిలో నన్నెందుకు వదిలేస్తున్నారు? మళ్ళీ నన్ను తీసుకెళ్ళడానికి ఎవరు వస్తారు? ఎన్ని రోజులుండాలక్కడ? అక్కడ నరసంచారం ఉంటుందా? నేనుండడానికి చోటో? భోజనానికి, నిద్రకి సదుపాయాలూ? బుట్టలో పుస్తకాలు ఎలాంటివి? నా కలెక్షన్ నుండి తెచ్చినవేనా? నాకు నచ్చేవేనా? ఎంతటి బుట్టసలు? ఈ బుట్ట నేనే మోసుకోవాలా? డివిడిలు అన్నారు… మరి డివిడి ప్లేయరో? దేనిపై చూడాలి సినిమాలు? సినిమాల బుట్ట ఎక్కువ బరువా? పుస్తకాలది బరువా?
స్నేహితులు రాసిన ఉత్తరాలు మాత్రం పట్టుకెళ్లను. అవి మనలో ఉండాలే కాని, మనతో కాదు.
వీటిన్నింటికన్నా ఒక లైట్‍వెయిట్ లాప్‍టాప్ ఇస్తే సరిపోతుంది, వీలైతే ఇంటర్నెట్ తో సహా! :p
15. మీ వ్రాతలు చూస్తుంటే, చాలా భావుకత ఉన్నవారిలా అనిపిస్తారు.. ? What do you say?
నా బ్లాగు చదివిన పది మందిలో తొమ్మిది మంది ఖచ్చితంగా ఈ ప్రశ్న అడిగారు / అడుగుతున్నారు. వారిని వెంటనే నేను అడిగే ప్రశ్న, భావుకత అంటే ఏంటి? అని. మొదట్లో నాకీ పదం అర్థం కాక అడిగేదాన్ని. తర్వాత్తర్వాత “భావుకత” అన్న పదానికి ఎవరికి వారు ఇచ్చుకునే నిర్వచనాలు ఎక్కువ అని తెల్సాక “అవును / కాదు” అని చెప్పడానికి ముందు ప్రశ్న అడుగుతున్నాను – భావుకత అంటే మీ ఉద్దేశ్యం?
16 మిమ్మల్ని మీరే ఇంటర్వ్యూ చేసుకుంటే, ఎలాంటి ప్రశ్న అడుగుతారు, దానికి సమాధానం ఏమిటి?
I loved this question. 🙂 ఏం ప్రశ్నలు అడుగుతానన్నది చెప్పలేను కాని, I’ll be playing Karan Thapar’s Devil’s Mind for sure! 😉
17. మొదట బ్లాగు, అటు నుండి పుస్తకం.నెట్ మరి తరువాత..? Next is What..!?
హహహ.. తెలుగులో కొద్దో గొప్పో రాస్తుంటే కనీసం అక్షరాలన్నా మర్చిపోకుండా ఉంటానని బ్లాగు మొదలెట్టాను. పుస్తకం.నెట్ అనే ఐడియా ఇచ్చి ఇరుక్కుపోయాను, అక్కడికీ భుజాన వేసుకోకూడదనే అనుకున్నాను. సౌమ్యని ఒప్పించలేకపోవటం వల్ల కథ కొనసాగుతోంది. ఈ రెండూ ఎంత అన్‍ప్లాన్‍డో నేను మున్ముందు చేయబోయేవి కూడా అంతే unplannedగా ఉంటాయి. సో, మీ “what next?”కి నా సమాధానం, “వేచి చూద్దాం!”
18. చివరిగా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?
హహహ.. ఈ ప్రశ్న వచ్చే వరకూ నేను ఆగలేదు. మొదటి ప్రశ్నలోనే చెప్పేశాను. 🙂
— మేధ
🙂 బాగుంది.
పూర్ణిమా, నువ్వూ మనిషివేనా ? 🙂
ఇంత బాగా ఎలా చెప్పగలుగుతావు?
నువ్వు చెప్పేవన్నీ (రాసేవి) నేను ఒప్పుకుంటానని కాదు.
కాని చాలా బాగా రాస్తావు.
నమ్మలేను నువ్వు ఉద్యోగంలో చేరాకే వేరే పుస్తకాలు చదవడం మొదలు పెట్టావంటే.
“పుస్తకాలు చదవటం వల్ల మాత్రమే ఎవరూ గొప్పవారు కాలేరు. పుస్తకాలు చదవరని ఎవర్నీ తక్కువ చేసి మాట్లాడాల్సిన పని లేదు. ఎన్ని పుస్తకాలు చదివుంటే అంత గొప్ప అనేది కూడా నేను ఒప్పుకోను. కొందరికి వాటి అవసరం ఉండకపోవచ్చు.” ఒప్పుకుంటాను.
“నాకు మాయ చేసి, మభ్య పెట్టి, మాజిక్ కార్పెట్ మీద మరో ప్రపంచానికి తీసుకుపోయే రచనలు ఎప్పుడూ నచ్చవు. నాకు ఈ ప్రపంచమే కావాలి పుస్తకాల్లో కూడా, మనుషులే ఉండాలి వాటిలోనూ. జీవితం కావాలి. మరణం కావాలి. వాటి మధ్య అనేకానేకమైన సంఘర్షణలే కావాలి. జీవితం – with all its terms and conditions – నాకిష్టం.” – interesting. అందుకే అని చెప్పలేను కానీ నాకూ అర్థమయ్యింది నేను కొన్ని కాల్పనికాలే నిజంగా enjoy చెయ్యగలను అని. జీవిత చరిత్రల మీద నాకు ఆసక్తి ఉందనీ ఈ మధ్యే తెలిసింది. నువ్వన్నట్లు అందరూ మనుషులే కాబట్టి, హీరోలుగా అనిపించే వారూ మనుషులే అని తెలుసుకున్నాక వారి మీద గౌరవం పెరుగుతుంది, మన గురించి మనకు ఇంకొంచెం అర్థమౌతుంది, మనిషిగా, కాబట్టి అనుకుంటున్నాను, నా విషయంలో.
“నాకు కబుర్లు వినడం ఇష్టం. మన జీవితంలో కలిసే మనుషులు Time and space limited కాబట్టి, గతించిన కాలంలోని వాళ్ళేమనుకున్నారో, ఏం చేసారో నాకు తెల్సుకోవాలని ఉంది కాబట్టి నేను పుస్తకాలు చదువుతున్నాను. ” – చాలా బాగా వ్యక్తీకరించావు(express చేశావు). బహుశా నేను ఏది చదివినా అందుకేనేమో, బ్లాగులతో సహా.
“మనకి తెలీని మనలోని ద్వారాలను తెరవడానికి కావాల్సిన స్విచ్‍లు పుస్తకాలని నా నమ్మకం” – ఇది ఇక నా నినాదం అవుతుందేమో.
నిజంగా నిన్ను పుస్తకం పూర్తిగా ఆక్రమించుకోవడం లేదు అంటే నమ్మ బుద్ధి కావడం లేదు.
నిన్ను అభినందిస్తూ నా గురించి రాస్తున్ననేంటి అనిపించినా, నా స్నేహితురాలి మాటలు, “It gives me a chance to express too.” గుర్తు చేసుకుని నీ వ్యక్తీకరణ ద్వారా నా ఆలోచనలకు మార్గం ఏర్పడింది కనక నేనూ express చేస్తున్నాను.
నీకూ, సౌమ్యకూ పుస్తకం.నెట్ కి ప్రాణం పోసినందుకు అన్నో అభినందనలు.
Best wishes.
Best and sincere wishes to Purnima and Soumya for pustakam.net.
ఈ ఇంటర్యూలో లేనిది – నిజాయితి, ఎక్కువైపోయింది: ఆత్మస్తుతి.
“మేం పుస్తకాలు చదవం, రివ్యూలు రాయటంకోసం తిరగేస్తాం” అనుండుంటే బాగుండేది.
if Purnimagaaru is so keen to master writing Telugu without typos, then why doesn’t she do something about it? She only says this in every forum, as if just to legitimize her horrendous typos.
Poddu has published some wonderful interviews so far — especially the interview with Sannapareddy is one of a kind. This is the worst article I have read in your entire magazine till date — what is there in it other than someone bragging about herself?
పొద్దు వాళ్ళు భాస్కర్ గారి వ్యాఖ్యని ప్రచురించాల్సిన అవసరమేముందో నాకు అర్ధం కావడం లేదు. ఆ వ్యాఖ్య ని ఏ కోణం లో చూసినా అది పొద్దుకి కానీ, పూర్ణిమ గారికి కానీ మేలు చేసే విమర్శ లా లేదు. ఇలాంటి వ్యాఖ్యలని పొద్దు వాళ్ళు అనుమతిస్తున్నారంటే, ఇక ముందు ఇంటెర్వ్యూలు ఇచ్చే వాళ్ళు ఉత్తి పుణ్యాన తమని తామే శిక్షించుకోడానికి సన్నద్ధమవుతున్నట్టు ఉంటుంది. దానికి పొద్దు సహకరించినట్టవుతుంది.
@ మేధ
ప్రవాహంలా సాగిపోయిన ఒక మంచి ఇంటెర్వ్యూ.
తన గురించి చెప్పమని అడిగినప్పుడు పక్కోళ్ళ గురించి చెప్పాలని పాపం పూర్ణిమకు తెలియలేదు.వదిలేయండి భాస్కర్ గారూ.నిజాయితీ లోపించింది ఇంటర్వ్యూలో కాదండి….ఒకసారి మీ కామెంటు చూసుకోండి తెలిసిపోతుంది.
తన గురించి చెప్పమని అడిగినప్పుడు పక్కోళ్ళ గురించి చెప్పాలని పాపం పూర్ణిమకు తెలియలేదు.వదిలేయండి భాస్కర్ గారూ.నిజాయితీ లోపించింది ఇంటర్వ్యూలో కాదండి….ఒకసారి మీ కామెంటు చూసుకోండి తెలిసిపోతుంది
@Radhika: :))
సరిగ్గా ఇదే అనుకుంటూ ఉన్నాన్నేను – ఇంటర్వ్యూ అంటే తన గురించే కదా చెప్పుకుంటారు ఎవరన్నా? ఇక మళ్ళీ ఇంటర్వ్యూల్లో ఆత్మస్తుతి…అంటే ఏం చెప్తాం? అనుకుంటూ ఉన్నాను.
ఇదేదో వ్యక్తిగతంగా ఉన్న గ్రడ్జ్ వల్ల రాసిన వ్యాఖ్యలా అనిపిస్తోంది నాకైతే. మనకి నచ్చని మనిషి ఏం చేసినా అందులో తప్పులే వెదుకుతాం కదా…
“కవిత్వం. Condensed form of intensified emotion.” — well said.
సత్యనారాయణ, ప్రభాకరరెడ్డి విలన్లుగా ఉండే పాత తెలుగు సినిమాల్లో, విలన్లు ఉండే నివాసంలో ఒక స్విచ్ నొక్కగానే, అప్పటి దాకా అరలా కనిపించినది, తలుపులా తెరుచుకొని, కొత్త దారులని చూపిస్తాయే.. అలానే ప్రతి మనిషిలో కూడా ఉంటాయనుకుంటాను. మనకి తెలీని మనలోని ద్వారాలను తెరవడానికి కావాల్సిన స్విచ్‍లు పుస్తకాలని నా నమ్మకం.
– This is beautifully said!!