ఇలా మాట్లాడుకుంటూ చారుదత్తుడి ఇల్లు చేరుతారు. వసంతసేన విటుడిని పంపించివేసి, చారుదత్తుడితో సంభాషించడానికి అతణ్ణి సమీపించి, దగ్గర ఉన్న ఓ శిలపై ఆసీనురాలవుతుంది. వసంతశోభ లాంటి వసంతసేన వర్షానికి కాస్త తడిచింది. ఆమె చెవిలో అలంకరించుకున్న కడిమి పూవు చివర నుండి ఓ వర్షపు బిందువు జారి, ఆమె కుచం మీద పడ్డది.
వర్షోదక ముద్గిరతా శ్రవణాంతవిలంబినా కదంబేన |
ఏకస్తనో2భిషిక్తో నృపసుత ఇవ యౌవరాజస్థః ||
అలా కదంబకుసుమం చివరగా జారిన వర్షపుచుక్కతో అభిషేకించబడ్డ ఆమె పయోధరం – యౌవరాజ్య పట్టాభిషిక్తుడైన యువరాజుకు మల్లే ఉందట! ఎంత అపురూపమైన చిత్తరువులాంటి దృశ్యం! వర్ణనలో ఎంతటి అనుపమానమైన సౌకుమార్యం!
పై శ్లోకానికి తిరుపతి వెంకటకవుల తేట తెనిగింపు –
తే.గీ ||
కలికి చెవి మీద నిరుకొన్న కడిమిపువ్వు
నుండి జాఱెడు వర్ష బిందువుల చేత
దడుపబడుచున్నదీ పయోధరము రాచ
బిడ్డ యభిషేకమొనరింప బడ్డ రీతి.
మరొక చమక్కు.. తృతీయాంకంలో చారుదత్తుడు బహుళాష్టమి నాటి చంద్రుణ్ణిలా వర్ణిస్తాడు.
అసౌ హి దత్వా తిమిరావకాశమస్తం వ్రజత్యున్నతకోటిరిందుః |
జలావగాఢస్య వనద్విపస్య తీక్ష్ణం విషాణాగ్రమివావశిష్టమ్ ||
అడవియేనుగొకటి నీళ్ళల్లో జలకమాడుతూ, మునిగింది. దాని దంతం తాలూకు చివర మాత్రం నీళ్ళనుంచి పైకి కనిపిస్తున్నది. అలానే కొమ్ములా ఉన్నాడట గగనంలో రేరాజు. చీకటికి లోకమంతా వ్యాపించడానికి అవకాశం ఇస్తూ.
నాలుగవ అంకంలో వసంతసేన ఇంటిలో ఎనిమిది ప్రకోష్టాలను విదూషకుడు ఒక్కొక్కటిగా ప్రాకృత గద్యలో వర్ణిస్తూ వెళతాడు. ఆ సొగసు అనుభవైక వైద్యం.
మొదటి ప్రకోష్ట వర్ణనలో ఒకింత:
చంద్రునితో, శంఖముతో, తామరతూళ్ళతో సమాన కాంతి కలిగి, వెదజల్లబడ్డ కర్పూర గంధ మిశ్రమాలతోనూ, వివిధ మణులు పొదగబడ్డ బంగారు మెట్లతోనూ, వ్రేలాడగట్టబడ్డ ముత్యాలతో శోభించే గవాక్షాలతోనూ, చంద్రుడిలా పైనుండి ఉజ్జయినీ నగరాన్ని చూస్తున్నట్టున్న సౌధశ్రేణులతోనూ ఒప్పుతున్నదిది.
(ఇధో వి పఢమే పఓట్టే నసిసంఘ ముణాలసచ్చాఓ విణిహిద చూణ్ణ మట్టిపాండురాఓ వివిహ రఅణ పడిబద్ధ కంచణ సోవాణ సోహిదాఓ పాసాదపంతిఓ ఓలంబిదముత్తాదామేహిం ఫటి అవాదాఅణ ముహచందేహిం ణిజ్ఘాఅంతీ విఅ ఉజ్జఇణం.)
వ్యావహారికాలు
ఈ నాటకం ప్రాకృత సంస్కృతాల కలయిక అని చెప్పుకున్నాం. ఈ వ్యావహారికాలు, అక్కడక్కడా కొన్ని పద ప్రయోగాలూ గిలిగింతలు పెడతాయి.
కపాటమూలే నిక్షిప్తం కపిత్థమివ తవ శిర మడమడాయిష్యామి: (వాకిలి మూలలో ఇరికించిన వెలగపండును వాకిలితో మూసి నలిపివేసినట్టు, నీ తలను పటపట లాడించేస్తాను!) ఇటువంటిదే మడమడాయితం అన్న ప్రయోగం భవభూతి ఉత్తరరామచరితంలో ఉన్నది.
చూహూ చూహూ చుక్కు చూహూ చూహూత్తి: ఈ ప్రయోగాన్ని ఈ నాటకంలో ప్రతినాయక పాత్ర చేయడం విశేషం. లొట్టలు వేసుకుంటూ తిందువులే అన్న అర్థంలో వాడబడింది. (అయితే ధ్వనిసారూప్యాన్ని బట్టి – వేడిగా ఉన్న మాంసఖండాన్ని ఊదుకుంటూ, దాని సువాసనను ఆఘ్రాణిస్తూ ఆస్వాదించడం అన్న అర్థమూ స్ఫురిస్తూంది.)
మరికొన్ని ప్రయోగాలు భాషాశాస్త్రాధ్యయన పరులకు బహుళాసక్తికరాలు.
బరండ అంబుఓం (వరండలంబుకం)– ఈ ప్రయోగానికి వివిధ అర్థాలున్నాయిష. చేదబాన (ఏతాము బిందె) గడ్డిమోపు అని రెండు అర్థాలను రామబ్రహ్మం గారు ఉటంకించారు. తాడు చివర కట్టబడ్డ ఎర అని ఒక నిఘంటువు.
హీమాణఏ : హమ్మయ్య (అన్న అర్థంలో)
ణిఅపోట్టం: నిజోదరం (ఉదరం – పోట్టం!)
గాలిం: తిట్లను
ఖటఖటకాయేతే : కటకటమనుచున్నవి
హీహీహీభోః: ఆహాహాహా! (మహాద్భుతం అన్న అర్థంలో)
అవిద అవిద భోః: అయ్యయ్యో!
మరిసేదు, మరిసేదు: క్షమింపబడుగాక (మర్చిపోబడుగాక?)
చూణ్ణమిట్టి: చూర్ణ ముష్టి
కొన్ని విమర్శలు
ఈ రూపకంలో సంధి సంధ్యంగాలతో కూడిన Unity of action లేదని, ఒకే అంకంలో దృశ్యాలు మారడం వల్ల ప్రదర్శనకు అనువుగా లేదని కొంతమంది విమర్శించారు. అంటే – మొదటి అంకానికి అనుగుణంగా దాన్ని అనుసరిస్తూ తదుపరి అంకం సాగే నడత. అలాగే విధి ఎటు వంచితే అటు మొగ్గే నాయకుడిలో ఏ లక్షణాలను చూసి నాయిక ప్రేమించింది? అని ఒక ఆరోపణ.
మొదటి విమర్శకు సమాధానంగా – ఈ నాటకపు ప్రధాన ఇతివృత్తం ఆర్యకుడు పాలకుణ్ణి పదవీచ్యుతుణ్ణి చేయడమని, ప్రేమకథ నాటక చలనానికి దోహదపడే విషయమనీ కొంతమంది వివరించారు. ఒకే అంకంలో దృశ్యాలు మారడం అన్న విషయానికి – ఈ నాటకం అత్యంత సహజమైన సన్నివేశాలతో కూడుకున్నదనిన్నీ, కథన వేగం ముందు ఆ అసహజత్వం కనిపించదనిన్నీ కొంతమంది పండితుల వివరణ. నిజానికి ఈ నాటకం పాశ్చాత్య దేశాలలో రంగస్థలం మీద విరివిగా ప్రదర్శింపబడింది కూడానూ. ఇక ఈ నాటకంలో నాయకుడు ధీరశాంతుడు. పరోపకారమే పరమావధి అతడికి. అందుకోసం కొరతకు కూడా జంకడు. ఆ లక్షణమే నాయిక ప్రేమకు పాత్రమయింది.
శూద్రకుడు
అసలు శూద్రకుడంటే ఎవరు అన్న విషయంపై చాలా మంది పండితులు చాలా రకాల ప్రతిపాదనలు చేశారు. ప్రారంభంలో ఓ శ్లోకం కొన్ని సందేహాలకు తావిస్తుంది. శూద్రకుడు మదగజగమనుడు, చకోరనయనుడు, పూర్ణేందుముఖుడు, సుందరాకారుడు, క్షత్రియుడు, శక్తిసంపన్నుడు. ఋగ్వేద, సామవేద పండితుడు, గణిత శాస్త్రజ్ఞుడు, కామశాస్త్రంలో నిపుణుడు, మరియు గజశిక్షకుడు అని నాటకారంభంలో తన గురించి చెప్పుకున్నాడు. ఈతడు అశ్వమేధ యాగం చేసి, పుత్రునికి సింహాసనం అప్పజెప్పి, శతవర్షాలకు ఓ పది రోజులు ఎక్కువగా జీవించి, తనై తాను అగ్నికి ఆహుతయ్యాడు! అగ్నికి ఆహుతి అయిన తర్వాత కావ్యం వ్రాయడం కుదరదు కాబట్టి, శూద్రకుడు ఎవరు అన్నది ప్రశ్న. దీనికి ఆయన నిరతాగ్ని హోత్రుడని కొందరి వివరణ. శూద్రక మహారాజు గురించిన ప్రస్తావన బృహత్కథ, కాదంబరి, హర్షచరిత్ర, దశకుమారచరిత్ర మొదలయిన ఇతర రచనలలో ఉన్నదని శోధకులు పేర్కొంటున్నారు. ఈ కావ్యంలోని ఒక శ్లోకం దండి దశకుమారచరితమ్ లో యథాతథంగా ఉన్న కారణంగా, దండియే శూద్రకుడని నిరూపించడానికి కొందరు చరిత్రకారులు ప్రయత్నించారు.
ముగింపు
ఈ రూపకం, ఇంగ్లీషు, జర్మను, స్వీడిష్, ఫ్రెంచ్, డచ్, డానిష్, ఇటాలియను, రష్యను వంటి అనేక భాషలలోకి అనువదించబడింది. పారిస్ ఓపేరాలలో, జర్మనీలో విజయవంతంగా ప్రదర్శింపబడి, ప్రశంసలు అందుకుంది. తెలుగులో ఈ రూపకానికి అనేక అనువాదాలు వచ్చాయి. వీటిలో ప్రముఖమైనవి రెండు. తిరుపతి వెంకటీయం అనబడే తిరుపతి వెంకటకవుల రచన మొదటిది. ఇందులో సంస్కృత శ్లోకాలు తేటతెనుగు పద్యాలుగా అనువదించబడ్డాయి. ప్రాకృత, సంస్కృత గద్య, తెనుగు గద్యగా మారింది. అలా మొత్తం రచన తెలుగులోనే ఉన్నది. రెండవ రచన, నేలటూరి రామదాసయ్యంగారు వారి రచన. ఇందులో రూపకంలోని పాత్ర చిత్రణా, మున్నుడి, కవికాలాదులు వంటి విషయాలు కూలంకషంగా వివరించబడ్డవి. ఇది సటీక, సవ్యాఖ్యానం. ఈ రెండు పుస్తకాలు డిజిటల్ లైబ్రరీలో, అంతర్జాలంలో దొరుకుతున్నవి.
ఈ మధ్య బేతవోలు రామబ్రహ్మం గారి మరొక అనువాదాన్ని అప్పాజోస్యుల-విష్ణుభొట్ల ఫౌండేషను వారు ప్రచురించారు.. వెల ౩౦౦ రూపాయలు. బేతవోలు రామబ్రహ్మం గారి అనువాదం ఓ తేనెగూడు, ద్రాక్షాసవం, రసభరితామ్రం, అద్భుతం, అనన్య సామాన్యం. ఇందులో ప్రాకృత గద్య, దాని సంస్కృత రూపము, రెంటికీ వ్యావహారిక భాషలో తెనుగు అనువాదము, టీకా తాత్పర్య సహితంగా వివరింపబడింది. ఇంకా శ్లోకాల ఛందోవిశేషాలు, అలంకారాదులు, ఇతర అనేకానేక విశేషాలు మనోజ్ఞంగా ఉన్నవి. ఇక అవసరమైన చోట్ల అప్పటి ఆచారాలు, వివరణలు అత్యంతాసక్తికరాలు. క్రీ.శ. మూడవ శతాబ్దపు భారతదేశ సమాజపు విశేషాలు తెలుసుకొనగోరే విజ్ఞానాభిలాషులు, నాటక కళానురక్తులు, ప్రాకృత, సంస్కృత అధ్యయనాభిలాషులు, రసజ్ఞులు, వీరందరికి అనుపమానమైన కరదీపిక ఈ పుస్తకం.
మృఛ్ఛకటిక పరిశీలనం పేరుతో పరిశీలన గ్రంథం కూడా ఒకటి ఉన్నది. ఇది మోతీలాల్ బనార్సిదాస్ వారి ముద్రణ. హిందీ భాషలో ఉన్నది. ఈ రూపకం ఆధారంగా బెంగాలీ భాషలో ఓ సినిమా, హిందీ భాషలో ఉత్సవ్ అన్న పేరుతో ఓ సినిమా నిర్మింపబడ్డాయి. ఉత్సవ్ సినిమా ఈ నాటకంలో పాత్రల ఆధారంగా అల్లుకున్న కథ (ఈ సినిమాకు రచన గిరీష్ కర్నాడ్) తప్ప, అందులో నాటకపు ఉదాత్తత, మూలభావం లుప్తమయాయన్న విమర్శ ఉన్నది.
కృతజ్ఞత
- శూద్రక మహాకవి మృచ్ఛకటికమ్ – తెలుగు వ్యాఖ్యానం బేతవోలు రామబ్రహ్మం.
- మృచ్ఛకటిక (శూద్రక మహాకవికృతికిఁ దెలుగు) శ్రీ తిరుపతి వెంకటీయమ్ – తిరుపతి వేంకటకవులు.
- మృచ్ఛకటికమ్ సటీక, వ్యాఖ్యానం – నేలటూరి రామదాసయ్యంగారు.
- సంస్కృత సాహిత్య చరిత్ర – డా.ముదిగంటి గోపాలరెడ్డి, డా. ముదిగంటి సుజాతా రెడ్డి. (పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం).
- Great Sanskrit Plays – Amar chitra katha.
- http://www.navatarangam.com/ ఉత్సవ్ సినిమాపై సమీక్ష
—————————–
కడప జిల్లా ప్రొద్దుటూరులో జన్మించిన రవి, ప్రస్తుతం ఉద్యోగరీత్యా బెంగళూరులో నివాసముంటున్నారు. 2007 సెప్టెంబరు నుండి బ్లాగాడిస్తూ ఉన్నారు. గతంలో ఇతర వెబ్‌సైట్లలో సమీక్షలు పేరడీలూ రాసేవారు. తెలుగు మీద మమకారంతో పాటు, వీరికి సంస్కృత భాషతో పరిచయమూ ఉంది.
అభిరుచులు, ఆసక్తులు అనేకం ఉన్నా, సాధికారత, సమగ్రత, ఏ విషయంపైనా లేదనే రవి, ప్రతీ విషయాన్ని తరచి ప్రశ్నించే తెలుగు ‘వాడి ‘ పౌరుషానికేం తక్కువ లేదంటున్నారు.
When I was young I read the story of this play.
Now feel like reading all the books about this play.
Excellent .Can’t say more than this.
Yes. Excellent. Can’t say any thing more. ఒక బ్రాహ్మణుడిని(బ్రాహ్మణ సార్థవాహుడినైనా) దొంగగా, వేశ్యను నాయికగా చూపించిన నాటకం సంస్కృతంలో మరేదైనా ఉందా? తెలుగులో కన్యాశుల్కం కాకుండా మరేదైనా ఉందా (గిరీశాన్ని ఒక రకం దొంగ అనుకునేట్లయితే)?
అద్భుతంగా రాశారు. దీన్ని నేను కొన్నేళ్ళ క్రితం సంస్కృతం – ఆంగ్లం ద్విభాషా పుస్తకం సహాయంతో చదివాను గానీ పెద్దగా గుర్తు లేదు.
పి. లాల్ గారు ప్రచురించిన సంస్కృత నాటకాల ఆంగ్ల తర్జుమా పుస్తకంలో కూడా ఈ నాటకం ఉన్నది.
స్త్రీపాత్రలకి ప్రాకృత భాష విధించడం ఫండా ఏవిటో అర్ధం కాదు. నేను ఇంకొన్ని నాటకాల్లో కూడా చూశాను. సీతవంటి గొప్ప పాత్రలు కూడా ప్రాకృతం మాట్లాడినట్టు రాశారు.
బైదవే, శకారుడు ఏమి భాష మాట్లాడుతాడు? శకారుని సంభాషణ పుట్టించే హాస్యాన్ని గురించి ప్రస్తావించినట్టు లేదు మీరు.
కొత్తపాళీ గారూ, శకారుడి అసంబద్ధ సంభాషణల గురించి వ్యాసాం రెండవ పేజీలో ప్రస్తావించారే!
కొత్తపాళీ గారూ,
నెనర్లు.
“శకారో రాష్ట్రీయః స్మృతః” అని బేతవోలు వారు ఉటంకించారు. రాష్ట్రీయ ప్రాకృతం మాట్లాడతాడట. శకారుడు అన్నది పాత్ర నామం. మృచ్ఛ కటికంలో పాత్రధారుడి నామం సంస్థానకుడు. తన మాటలలో “స” బదులు “శ” కారం ఎక్కువగా దొర్లుతుంది కాబట్టి ఆ పాత్రకా పేరు.
ఈ రకమైన ఉచ్ఛారణ బీహారీలలో ఇప్పటికీ మనం గమనించవచ్చు.
ఇకపోతే ఈ పాత్రను ప్రత్యేకంగా రూపుదిద్ది (అసంబద్ధ సంభాషణలూ వగైరా), తద్వారా ఇతడి బావ రాజు గారిని elevate చేయడం ఒకరకమైన నాటకశిల్పం అని నా అభిప్రాయం.
మృచ్ఛకటికం – పరిచయమైనదే ఐనా, ఇప్పుడు మీ పరిచయం చాలా బావుంది. చదువుతూ నాటకం పైన మరింత ఆసక్తి పెంచుకోగలుగుతున్నాను.
స్త్రీ పాత్రలకు ప్ర్రాకృతం.
అలాగే ShakeSpear నాటకాలలో కూడా ఇటువంటి తేడాఅనే ఉండేదిట పాత్రల social statusని బట్టి.
కానీ నాకు ఆశ్చర్యకరమైన విషయం ఒకటి తెలిసింది, నేను అనుకున్న దానికి విరుద్ధంగా. ఆ తెలిసినది పిల్లల కోసం వ్రాసిన అతని జీవిత చరిత్రలో.
అదేమంటే , ఆ విధంగా, మాట్లాడే భాష సాహిత్యంలో వాడడానికి అవకాశం ఏర్పడింది అని. నాకైతే ఆ వివరణ బాగుంది అనిపించింది.
మనకి పూర్తిగా అర్థమైందనుకున్న దానికీ వేరే కోణం ఉందని తెలిస్తే ఆసక్తికరంగా ఉంటుంది కదా.
”మట్టి బండీ’పై మీ పరిచయం బావుంది. నాటకం చూసినట్లే ఉంది.
రవి గారూ,
చాలా బాగుంది..పరిచయం అంటూనే నాటకం మీద మంచి వ్యాసం రాశారు…నాకు తెలిసిన మొదటి సంస్కృత నాటకం ఇది…నాన్నగారు చిన్నప్పుడు కథలా చెప్పేవారు..తర్వాత దూరదర్శన్ లో సీరియల్ గా వచ్చింది…ఒక్క episode కూడా వదలకుండా చూసే వాణ్ణి…
వ్యాసం చాలా బాగుంది. రచయితకు శుభాకాంక్షలు. పొద్దుకి అభినందనలు.
చాలా బావుంది మీ వ్యాసం రవి గారు. ఈ నాటకంలో మరో ఆసక్తికర విషయం, దొంగ వేసిన కన్నంలోని కౌశలాన్ని చూసి అబ్బురపడ్డం. ఆ సంఘటన కళకి ఒక కొత్త అర్ధాన్నిస్తుంది.
మూలా మంచి పాయింటు చెప్పారు. ఒక తెలుగు సాహితీవేత్త (పేరిప్పుడు గుర్తు లేదు) గారింటో దొంగతనం జరిగిందని తెలిసి, జరుక్ శాస్త్రి ఆయనకి పరామర్శ ఉత్తరం రాశారుట – పోయిన వస్తువుల జాబితా ఏమన్నా తయారు చేశారా, లేక చారుదత్తుడిలా దొంగ వేసిన కన్నాన్ని చూసి అబ్బురపడుతూ ఉండి పోయారా అని.
మృచ్ఛకటికం ఆధారంగా తెలుగులో కూడా సినిమా వచ్చింది. విక్రమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బిఎస్ రంగా దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా పేరు వసంతసేన! 1967లోనే దీన్ని కలర్‌లో తీశారు. ఎఎన్‌ఆర్…బి.సరోజాదేవి హీరోహీరోయిన్లు… సినిమా పరాజయం పాలైందనుకోండి.