పాత్రలు, కథనం
ఈ రూపకం ద్వారా కవి చెప్పదల్చుకున్నది ఏమిటన్న ప్రశ్నకు కవి సమాధానం..
తయోరిదం సత్సురతోత్సవాశ్రయం నయప్రచారం వ్యవహారదుష్టతామ్ |
ఖలస్వభావం భవితవ్యతాం తథా చకార సర్వం కిల శూద్రకో నృపః ||
వసంతసేనా చారుదత్తుల ఉదాత్త సమాగమాన్ని ఆశ్రయించిన నైతికప్రవర్తనను, లోక వ్యవహారాలలో దుష్టతను (corruption in society), నీచుల స్వభావాన్ని, కర్మవశాన్నీ శూద్రకుడు రచించెను. (నేను రచించితిని అనక శూద్రకుడు రచించెను అన్నది కొన్ని అనుమానాలకు తావిస్తోందని పండితుల ఊహ. ఆ విషయం పరిశోధకులకు వదిలేద్దాం)
ఈ రూపకం యొక్క కథాసంవిధానం గురించి పండితులు ఎన్నో రకాల ఆసక్తికరమైన వివరాలు చెప్పారు. ఎన్ని రకాలుగా చెప్పబడినా, తిరిగి ఇంకొక విధంగా, మరో కోణంలో ఆవిష్కృతమయే విలక్షణ కథాసంవిధానం ఈ రూపకం సొంతం. రూపకపు అంగిరసం – విప్రలంభశృంగారం. అంతర్లీనంగా (under current) హాస్యం, అక్కడక్కడా అద్భుత రసం, చివరి అంకంలో కరుణ రసం, శకారుడు వసంతసేనను హింసించే సన్నివేశంలో బీభత్సం వ్యక్తమవుతున్నవి. ప్రధాన పాత్రధారిణి గణిక అయినప్పటికీ నాయికా నాయకుల మధ్య ప్రేమ సున్నితంగా, హృదయంగమంగా పోషించబడింది.
ఇందులో ప్రధాన ప్రతినాయకుడు – పాలకుడు. ఈతడు నా నాటకంలో పాత్ర రూపేణా ఎక్కడా కనిపించడు. అతని గురించిన ప్రస్తావన అంతా ఇతరుల మాటల్లోనే జరుగుతుంది. ప్రధాన పాత్రలను మఱుగుపరిచి, వారి ప్రస్తావనతోనే కథను నడిపించడం ఓ చుఱుకైన, అద్భుతమైన సంవిధానం. (మాయాబజార్ చలన చిత్రంలో ప్రధాన పాత్రలయిన పాండవుల పాత్రలు మఱుగుపర్చబడడం అనేకమందికి తెలిసిన విషయమే). ఇక రూపకంలో పాత్రలు కావ్యరచనాకాలం నాటి సాధారణ సామాజిక జీవితానికి అతి దగ్గరగా ఉన్నవి, సహజమైనవి, నేల విడిచి సాము చేయనివీనూ. రాజులు, మంత్రులు, యువరాణులు, మంత్రాలోచనలు, కుట్రలు, ఎత్తుగడలు వంటివి ఈ రూపకంలో కనిపించవు. పాత్రలు, సంఘటనలు తమ తమ స్వభావాన్ని విడిచి విరుద్ధంగా ప్రవర్తించవు.
పాత్రల చిత్రణలో సంక్లిష్టత (complexity) ఉన్నది. ఆ సంక్లిష్టత – మానవ జీవితంలోని నాటకీయత (melodrama)ను ప్రతిబింబిస్తుంది. పాత్రలు ఒక్క సంఘటన కోసమో, సన్నివేశం కోసమో రూపొందించినట్టుగా అగుపించవు. జూదరి పాత్ర, శ్రమణకుడుగా మారుతుంది. దొంగ పాత్ర, ఉదాత్తంగా మారుతుంది. గౌరవహీనగా పరిగణింపబడే వేశ్య, తన సుగుణాలతో గౌరవనీయురాలవుతుంది. శకారుడనబడే ఓ మూర్ఖ పాత్ర – అవకాశవాది, దుర్మార్గంగా మారుతుంది. అయితే, ఈ సంక్లిష్టత అసహజంగా మారకుండా సహజంగా చిత్రించటం – కవి నేర్పరితనానికి నిదర్శనం.
రెండవ అంకంలో ముగ్గురు జూదరుల మధ్య వీధిలో జరిగే దెబ్బలాట, ఓ జూదరి ఇంకో జూదరిని పది సువర్ణ కార్షాపణాల కోసం చితకబాదటం, దెబ్బలు తప్పించుకోవడానికి సంవాహకుడు (జూదరి) ఓ శూన్య దేవాలయంలో జొరబడి ప్రతిమలాగా నిలబడటం, మిగిలిన జూదరులు ఆ దేవాలయానికి వచ్చి ఆ ప్రతిమ వంక అనుమానంగా చూడటం, అక్కడే తిష్ట వేసుక్కూర్చుని జూదం ఆరంభించటం, ప్రతిమలా నటిస్తున్న జూదరికి చేతులాడక మధ్యలో జొరబడటం – ఈ సంఘటనలు, అత్యంత నాటకీయంగానూ, సహజంగానూ, హాస్యస్ఫోరకంగానూ మలచబడి కవి నాటక చిత్రణా ప్రతిభకు అద్దం పడతాయి. ఆరవ అంకంలో మరో పోట్లాట. ఈ సారి వంతు రక్షకభటులది. వాళ్ళలో వాళ్ళు వాదులాడుకుని, ఒకడు మరొకడిని కాలితో తంతాడు. ఆ తన్నులు తిన్నవాడు చివర్లో కీలక సమయంలో సాక్ష్యానికి అక్కరకొచ్చి, నాయకుడు చారుదత్తుడి పీకల మీదకు తెస్తాడు.
చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం జరుగుతుందన్న విషయం ఛాయామాత్రంగా చెప్పడం ఈ రూపకంలో అక్కడక్కడా కనిపిస్తుంది. మదనికను దాస్య విముక్తను చేసే సందర్భంలో, మదనిక కృతజ్ఞతాభావంతో చలించిపోయి, వసంతసేన పాదాలపై పడుతుంది. అప్పుడు వసంతసేన ఆమెతో, “నువ్వొక విప్రుడికి భార్యవయావు. గౌరవనీయ స్థానంలో ఉన్నావు. నేనే నీకు నమస్కరించాలి” అని చెబుతుంది. అక్కడ అంతర్లీనంగా వసంతసేనకు వేశ్యా జీవితంపై విముఖత, తనకు చారుదత్తుడిపై ఉన్న ప్రేమ ఎప్పుడు ఫలిస్తుందోనన్న నిస్పృహ చూచాయగా కనిపిస్తాయి. రూపకం చివర్లో ఆమె ఆశ సాకారమవుతుంది. అలాగే వసంతసేన సంవాహకుడికి జూదరుల నుంచి విముక్తి కలిగిస్తుంది. ఆ సంఘటనతో తన జూదజీవితంపై విరక్తి పెంచుకున్న సంవాహకుడు బౌద్ధ శ్రమణకుడవుతాడు. నాటకం నవమాంకంలో అతడే వసంతసేనను కాపాడతాడు. అలాగే చోరుడయిన శర్విలకుడు, నిజాయితీగా వసంతసేనకు జరిగింది చెబుతాడు. తన నిజాయితీకి ఫలితంగా అతడికి, తన ప్రియురాలు మదనిక దక్కుతుంది.
ఇక ప్రతినాయకుడు శకారుడి గురించి – ప్రతినాయక పాత్ర కేవలం దుష్టత్వంతో కూడుకుని ఉండడం వలన రూపకం ఔచిత్యతకు భంగం కాకపోయినా, నాటకీయతకు కాస్త ఎసరవుతుంది. దుష్టతకు తోడుగా మరిన్ని అవలక్షణాలు ఉంటే, నాటకీయత రక్తికడుతుంది. ఈ రూపకంలో శకారుడికి మూర్ఖత్వం, వెఱ్ఱిబాగులతనం, దురభిమానం, నడమంత్రపుసిరితో వచ్చిన అహంకారం, పంతం నెగ్గించుకోవాలనే మనస్తత్వం, సమయం వస్తే ఏ ఘాతుకానికైనా తలపడే తెంపరితనం, ఇలా అనేక ఖలస్వభావాలు ఉంటాయి. ఓ ఉంపుడుగత్తె కుమారుడయిన (కాణేలీ మాతః – కాణేలీ మాతా యస్య సః – ఉంపుడుగత్తెను తల్లిగా కలిగినవాడు- అని సంబోధించబడతాడు) ఇతడు, భారతంలో పాత్రలను రామాయణానికి, చారిత్రక పురుషులకు, ఇంకా విధవిధాలుగా అపభ్రంశపు ఉపమానాలు చేస్తుంటాడు. ఉదాహరణకు –
- రావణుడికి కుంతిలాగా నువ్వు నా పాలబడ్డావు.
- రాముడికి భయపడ్డ ద్రౌపదిలా భయపడకు.
- విశ్వావసువు సోదరి సుభద్రను హనుమంతుడు అపహరించిన రీతిలో నేను నిన్ను అపహరిస్తాను.
- అడవికుక్క లాంటి నేను పరిగెడుతుంటే, ఆడునక్కలా నువ్వు పారిపోతున్నావు.
ఇలా.. (ఈ శకారుడు రాజశ్యాలుడని ఒకచోట, ఉంపుడుగత్తె కుమారుడని అనేకచోట్ల ఉన్నది. అంటే, ఈతడు రాజుగారి భోగపత్ని లేదా ఉంపుడుగత్తెకు సోదరుడు. అలాగే ఇతడూ, ఇతడి సోదరీ, ఇద్దరూ మరో ఉంపుడుగత్తెకు సంతానం అనుకోవాలి).
సాధారణంగా దృశ్యప్రక్రియలలో క్లుప్తతకు విలువ చాలా ఎక్కువ. ఓ సన్నివేశం నుంచి మరో సన్నివేశానికి కథనం మారేప్పుడు, ఈ విషయం చాలా ప్రాధాన్యత వహిస్తుంది. ఓ చిన్న ఉదాహరణ, రామాయణంలో – హనుమంతుడు సీతను వెదకి, లంకను కాల్చి, తిరిగి వచ్చే సమయంలో సముద్రవర్ణనో, ఇంకొక వర్ణనో, ఇంకొక దృశ్యప్రాధాన్యతో ఎక్కువయితే అక్కడ ఔచిత్య భంగమవుతుంది. రామాయణం దృశ్యప్రక్రియగా ప్రదర్శించేటపుడు అది మరింత స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. సంధిలో క్లుప్తత ఓ అవసరం. ఈ నాటకంలో ఇటువంటి దృశ్యాలలో ఔచిత్యం ముచ్చటగా పోషించబడింది. బళ్ళ తారుమారు ప్రకరణంలో ఇది కనిపిస్తుంది. ఇంకా చారుదత్తుడు, వసంతసేన కలుసుకునే సన్నివేశంలో కూడా ఇది కనిపిస్తుంది. అలానే అవసర దృశ్యాలలో రసావిష్కరణకు దోహదం చేసే సన్నివేశాలలో దృశ్య ప్రాధాన్యతను, విషయ ప్రాధాన్యతను సద్యః స్ఫూర్తిగా విస్తరించి చూపడమూ ఉంది. దీనికి ఉదాహరణ – శర్విలకుడనే చోరుడు చారుదత్తుడి ఇంటికి కన్నం వేసే దృశ్యం పరిశీలిస్తే,
– మొదట ఎటువంటి చోట కన్నం వేయాలి అని ఆలోచించి, ఇంటి యజమాని నిత్యం సంధ్యవార్చి నీటిని పారబోసినచోట, ఎలుకలు తవ్వినచోటును ఎన్నుకుంటాడు.
– చోరుల దేవుడు స్కందుడిని ప్రార్థిస్తాడు.
– ఇటుకలను నేర్పుగా తొలగిస్తాడు.
– పద్మ, భాస్కర, చంద్రరేఖ, వాపీ, విస్తీర్ణ, స్వస్తిక, కుంభ రూపాలలో ఏ రూపంలో కన్నం వేయాలో ఆలోచించి, చివరిపద్ధతిని ఎంచుకుంటాడు. యోగరోచనమనే అంజనం పులుముకుంటాడు.
– ఎంత కైవారంతో కన్నం వేయాలనే లెక్కకు, కొలత్రాడు సమయానికి దొరక్కపోతే జంధ్యాన్ని అందుకు ఉపయోగిస్తాడు.
– లోపలి వాళ్ళు నిద్రపోతున్నారా లేదా అని పరిశీలించటానికి ఓ దిష్టిబొమ్మను కన్నం ద్వారా ప్రవేశపెట్టి చూస్తాడు.
– వీటన్నిటి చివర కన్నం ద్వారా ఇంటిలో చొరబడతాడు.
మరొక ఉదాహరణ – మైత్రేయుడనే చారుదత్త సఖుడు వసంతసేన భవనానికి వెళతాడు. ఆ భవనంలో ఎనిమిది పెద్దపెద్ద గదులు. ఒక్కో గది ఒక్కోలా అలంకరించబడి ఉంటుంది. ఒక్కొక్క గదికి ఒక్కొక్క ప్రత్యేకత. ఆ గదులను విదూషకుడు చూస్తూ, ఆహాహా! అని ఆశ్చర్యపడతాడు. గదులలో దృశ్యాలను వర్ణిస్తూ వెళతాడు.
నాటకంలో పాత్రల నటనకే కాక, ఆంగికానికి ప్రాధాన్యత కద్దు. ఈ నాటకపు ఆంగికంలో దృశ్యాలు – వీధి, ఉద్యానవనం, వసంతసేన ఇల్లు, చారుదత్తుడి ఇల్లు మొదలయినవి. ఒకటి ప్రకృతి రచనాశోభితమయితే మరొకటి సంపన్న గృహం. ఒకటి వీధి అయితే మరొకటి దరిద్రానికి నిలయమైన ఇల్లు. వేటికవి వైరుధ్యాలు, వైవిధ్యాలూనూ.
ఇక నాయికానాయకుల గురించి. ఈ రూపక నాయకుడు చారుదత్తుడు. ఈతడు ద్విజసార్థవాహుడు, దానధర్మాలు చేసి సంపదలు పోగొట్టుకుని దరిద్రుడయినవాడు, పరమ సాత్వికుడు, దయాపరుడు. నాట్యశాస్త్రం ప్రకారం కావ్యనాయకుల గుణాలననుసరించి వారిని ధీరోదాత్తుడు, ధీరలలితుడు, ధీరశాంతుడు, ధీరోద్ధతుడు అని నాలుగు రకాలుగా విభజించారు. చారుదత్తుడు ధీరశాంతుడు. ఇతడి సాత్వికత కొన్ని సన్నివేశాలలో ప్రస్ఫుటమవుతుంది. శర్విలకుడు తన ఇంటికి కన్నం వేసి, నగలు దొంగిలించన మరుసటి రోజు చారుదత్తుడు ఆ కన్నం చూసి, దొంగ పనితనం గురించి ఆశ్చర్యపడతాడు. ఆ దొంగకు తన ఇంట ఏమి దొరుకుతుందని చింతిస్తాడు. నగలు పోయాయని తెలిసిన తర్వాత, దొంగ పనితనానికి తగిన మూల్యం లభించిందని ఆనందపడతాడు. వసంతసేన తమకు అసలు నగలే ఇవ్వలేదని, అందుకు సాక్ష్యం ఎవరూ లేరని బొంకమని తన మిత్రుడు చెప్పిన సలహాను తిరస్కరించి, ఆమెకు నగలబదులుగా అంతకంటే విలువయిన రత్నాల హారం పంపుతాడు.
ఇక వసంతసేన – వసంతశోభను పోలిన సౌందర్యవతి. పుట్టుక రీత్యా గణిక అయినా, బౌద్ధికంగా సచ్చీలవతి. మదనికను ఏ మూల్యం చెల్లించకుండా దాస్యవిముక్తి గావిస్తుంది. ఈమె చారుదత్తుని ఆరాధిస్తుంటుంది. సంవాహకుడనే జూదరి, పూర్వాశ్రమంలో చారుదత్తుడి సేవకుడని తెలిసి, అతనికి సహాయం చేస్తుంది. చారుదత్తుడు తన నగలకు మూల్యంగా రత్నాల హారం పంపినప్పుడు అతడి సాత్విక గుణానికి తన్మయురాలయి, ఆరాధనను ప్రేమగా మార్చుకుంటుంది. వీరిద్దరికి ఒకరిపట్ల ఒకరికి ఉన్న ప్రేమ వసంతసేన చారుదత్తుడి ఇంటికి వచ్చినప్పుడు వికసిస్తుంది. అయితే అంతర్లీనంగా తన వేశ్యాకులం పట్ల ఒకింత వైమనస్కురాలై ఉంటుంది.
ఈ నాయికానాయికల శృంగారం భౌతికమయినది కాదు. అనురాగబద్ధమయినది. ఆరాధనా పూరితమయినది. ఇది ఈ నాటకంలో అంతర్లీనంగా కనిపించే సౌకుమార్యానికి, సౌందర్యానికి ఆలంబన.
When I was young I read the story of this play.
Now feel like reading all the books about this play.
Excellent .Can’t say more than this.
Yes. Excellent. Can’t say any thing more. ఒక బ్రాహ్మణుడిని(బ్రాహ్మణ సార్థవాహుడినైనా) దొంగగా, వేశ్యను నాయికగా చూపించిన నాటకం సంస్కృతంలో మరేదైనా ఉందా? తెలుగులో కన్యాశుల్కం కాకుండా మరేదైనా ఉందా (గిరీశాన్ని ఒక రకం దొంగ అనుకునేట్లయితే)?
అద్భుతంగా రాశారు. దీన్ని నేను కొన్నేళ్ళ క్రితం సంస్కృతం – ఆంగ్లం ద్విభాషా పుస్తకం సహాయంతో చదివాను గానీ పెద్దగా గుర్తు లేదు.
పి. లాల్ గారు ప్రచురించిన సంస్కృత నాటకాల ఆంగ్ల తర్జుమా పుస్తకంలో కూడా ఈ నాటకం ఉన్నది.
స్త్రీపాత్రలకి ప్రాకృత భాష విధించడం ఫండా ఏవిటో అర్ధం కాదు. నేను ఇంకొన్ని నాటకాల్లో కూడా చూశాను. సీతవంటి గొప్ప పాత్రలు కూడా ప్రాకృతం మాట్లాడినట్టు రాశారు.
బైదవే, శకారుడు ఏమి భాష మాట్లాడుతాడు? శకారుని సంభాషణ పుట్టించే హాస్యాన్ని గురించి ప్రస్తావించినట్టు లేదు మీరు.
కొత్తపాళీ గారూ, శకారుడి అసంబద్ధ సంభాషణల గురించి వ్యాసాం రెండవ పేజీలో ప్రస్తావించారే!
కొత్తపాళీ గారూ,
నెనర్లు.
“శకారో రాష్ట్రీయః స్మృతః” అని బేతవోలు వారు ఉటంకించారు. రాష్ట్రీయ ప్రాకృతం మాట్లాడతాడట. శకారుడు అన్నది పాత్ర నామం. మృచ్ఛ కటికంలో పాత్రధారుడి నామం సంస్థానకుడు. తన మాటలలో “స” బదులు “శ” కారం ఎక్కువగా దొర్లుతుంది కాబట్టి ఆ పాత్రకా పేరు.
ఈ రకమైన ఉచ్ఛారణ బీహారీలలో ఇప్పటికీ మనం గమనించవచ్చు.
ఇకపోతే ఈ పాత్రను ప్రత్యేకంగా రూపుదిద్ది (అసంబద్ధ సంభాషణలూ వగైరా), తద్వారా ఇతడి బావ రాజు గారిని elevate చేయడం ఒకరకమైన నాటకశిల్పం అని నా అభిప్రాయం.
మృచ్ఛకటికం – పరిచయమైనదే ఐనా, ఇప్పుడు మీ పరిచయం చాలా బావుంది. చదువుతూ నాటకం పైన మరింత ఆసక్తి పెంచుకోగలుగుతున్నాను.
స్త్రీ పాత్రలకు ప్ర్రాకృతం.
అలాగే ShakeSpear నాటకాలలో కూడా ఇటువంటి తేడాఅనే ఉండేదిట పాత్రల social statusని బట్టి.
కానీ నాకు ఆశ్చర్యకరమైన విషయం ఒకటి తెలిసింది, నేను అనుకున్న దానికి విరుద్ధంగా. ఆ తెలిసినది పిల్లల కోసం వ్రాసిన అతని జీవిత చరిత్రలో.
అదేమంటే , ఆ విధంగా, మాట్లాడే భాష సాహిత్యంలో వాడడానికి అవకాశం ఏర్పడింది అని. నాకైతే ఆ వివరణ బాగుంది అనిపించింది.
మనకి పూర్తిగా అర్థమైందనుకున్న దానికీ వేరే కోణం ఉందని తెలిస్తే ఆసక్తికరంగా ఉంటుంది కదా.
”మట్టి బండీ’పై మీ పరిచయం బావుంది. నాటకం చూసినట్లే ఉంది.
రవి గారూ,
చాలా బాగుంది..పరిచయం అంటూనే నాటకం మీద మంచి వ్యాసం రాశారు…నాకు తెలిసిన మొదటి సంస్కృత నాటకం ఇది…నాన్నగారు చిన్నప్పుడు కథలా చెప్పేవారు..తర్వాత దూరదర్శన్ లో సీరియల్ గా వచ్చింది…ఒక్క episode కూడా వదలకుండా చూసే వాణ్ణి…
వ్యాసం చాలా బాగుంది. రచయితకు శుభాకాంక్షలు. పొద్దుకి అభినందనలు.
చాలా బావుంది మీ వ్యాసం రవి గారు. ఈ నాటకంలో మరో ఆసక్తికర విషయం, దొంగ వేసిన కన్నంలోని కౌశలాన్ని చూసి అబ్బురపడ్డం. ఆ సంఘటన కళకి ఒక కొత్త అర్ధాన్నిస్తుంది.
మూలా మంచి పాయింటు చెప్పారు. ఒక తెలుగు సాహితీవేత్త (పేరిప్పుడు గుర్తు లేదు) గారింటో దొంగతనం జరిగిందని తెలిసి, జరుక్ శాస్త్రి ఆయనకి పరామర్శ ఉత్తరం రాశారుట – పోయిన వస్తువుల జాబితా ఏమన్నా తయారు చేశారా, లేక చారుదత్తుడిలా దొంగ వేసిన కన్నాన్ని చూసి అబ్బురపడుతూ ఉండి పోయారా అని.
మృచ్ఛకటికం ఆధారంగా తెలుగులో కూడా సినిమా వచ్చింది. విక్రమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బిఎస్ రంగా దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా పేరు వసంతసేన! 1967లోనే దీన్ని కలర్‌లో తీశారు. ఎఎన్‌ఆర్…బి.సరోజాదేవి హీరోహీరోయిన్లు… సినిమా పరాజయం పాలైందనుకోండి.