రవి (బ్లాగాడిస్తా)
“కావ్యేషు నాటకం రమ్యం” అన్నది ఆర్యోక్తి. రూపకం, నాటకం అన్నవి ప్రస్తుత కాలంలో పర్యాయపదాలుగా ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ, ప్రాచీన కాలంలో రస, వస్తు, నాయకాది భేదాలను బట్టి రూపక సాహిత్యాన్ని రూపక ఉపరూపకాలుగా విభజించారు. రూపకాలు మొత్తం పది. అవి – నాటకం, ప్రకరణం, భాణం, ప్రహసనం, డిమం, వ్యాయోగం, సమవకారం, వీధి, అంకం, ఈహామృగం.
పై ఆర్యోక్తి, కాళిదాస విరచిత అభిజ్ఞాన శాకుంతలాన్ని గూర్చిన పొగడ్త. అయితే, ప్రాచీన సంస్కృత, ప్రాకృత సారస్వతంలో భారతీయ, ప్రపంచ సారస్వతంలోనే వైవిధ్య విలసితమై అపూర్వంగా నిలిచి పోయే ప్రకరణం అనబడే రూపకాంతరం – మృచ్చకటికం (ఇకపై సౌలభ్యం కోసం ప్రకరణం, నాటకం రెంటినీ ఒకే అర్థంలో వాడుతున్నాను).
ఇదో వైవిధ్యమైన నాటకం. సంస్కృత రూపకాలకు గ్రీకు రూపకాలు ఆధారమని డా|| వెబర్, డా|| విండిష్, రాహుల్ సాంకృత్యాయన్ వంటి పండితులు వాదించినప్పటికీ, భరతుని నాట్యశాస్త్రం, పాణిని నటసూత్రాలు గ్రీకు రూపకాలకు పూర్వమే బాగా వ్యాప్తి చెందాయని మరికొంతమంది (వింటర్నిట్చ్ తదితరులు) పండితులు అనేక ఋజువులు ప్రతిపాదిస్తున్నారు. గ్రీకు, భారతీయ నాటకాల మధ్య ప్రస్ఫుటమైన వైరుధ్యాలు ఈ ఋజువులకు ఆలంబనగా నిలుస్తున్నాయి. మౌలికంగా గ్రీకు నాటకాలు విషాదాంతాలు, వాస్తవిక జీవన ప్రతిబింబాలూ అయితే, భారతీయ నాటకాలు ఉదాత్త జీవన బోధకాలు, సుఖాంతాలూనూ.
మృచ్ఛకటిక నాటకం భారతీయ నాటకమైనప్పటికీ, నాటకశాస్త్ర లక్షణాలను అక్కడక్కడా ఉల్లంఘిస్తూ వ్రాయబడిందని కవి, విమర్శకుల అభిప్రాయం. ఆ లక్షణమే ఈ నాటకానికి వైవిధ్యతను చేకూర్చింది. ఈ ఉల్లంఘనాంశాలలో మొదటిది – ఈ నాటకం పేరు. నాట్యశాస్త్రం ప్రకారం, ప్రకరణం పేరు నాయికా నాయకులకు సంబంధించినదై ఉండాలి. (ఉదా: మాలతీమాధవం) ఇది ఈ నాటకంలో ఉల్లంఘించబడింది. మృత్ + శకటికం, మృచ్ఛకటికం అయింది. శకటం అనకుండా శకటికం అన్నారు కాబట్టి, (మృత్) శకటానికి సంబంధించిన లేదా “చిఱు శకటం” అని వ్యుత్పత్తి చెప్పుకోవాలి. మృచ్ఛకటికం అంటే – చిన్న మట్టి బండి. పాత్రధారులకన్నా, నాటకానికి హృదయంగా భాసిల్లే నాటక సందర్భంలోని ఓ నిర్జీవమైన వస్తువు ద్వారా ఈ నాటకానికి జీవం పోయడం ఈ నాటకంలో కనిపిస్తున్నది. భాస మహాకవి “ప్రతిమ” నాటకం కూడా ఈ ధోరణికి ఓ ఉదాహరణ.
ఈ నాటకంలో ముఖ్యంగా రెండు కథలు ఉన్నాయి. ఒకటి ప్రధాన కథ, మరొకటి నేపథ్య కథ. చారుదత్తుడనే నిర్ధన బ్రాహ్మణుడు, వసంతసేన అనబడే గణికల మధ్య ప్రేమకు సంబంధించినది-ప్రధాన కథ అయితే, దుష్టుడైన అవంతీ రాజు పాలకుని తిరుగుబాటుదారులు పదవీచ్యుతుణ్ణి చేసి ఆర్యకుడనే గోపాలక యువకుణ్ణి రాజును చేయడం – నేపథ్యకథ. సుఖాంతమైన ప్రేమకథ ఒకటయితే, చెడుపై మంచి జయించటం అన్న నీతికి ప్రతీక మరొకటి. ఈ రెండవది అంతర్లీనమైన సందేశం. ఈ నాటకం ఐదు విషయాలలో సుఖాంతం అని నాటకం చివరన వచ్చే “లబ్ధా చారిత్ర శుద్ధిశ్చరణ నిపతితః ..” అన్న శ్లోకంలో వివరించబడింది. వాటిని సూచిస్తూ నాటకం మొదట్లో సూత్రధారుడు కొన్ని సూచనలు చేస్తాడని ఎమ్. ఆర్. కాలే గారి వివరణ.
కథ
పాలకుడనే రాజు ఉజ్జయినీ నగరం రాజధానిగా అవంతీ రాజ్యాన్నిపరిపాలిస్తుంటాడు. ఆ రాజొక దుష్టుడు. శకారుడు – రాజు గారి బావమరిది. శకారుడు మూర్ఖుడు, అవకాశవాది, కౄరుడు. నగరంలో చారుదత్తుడనే బ్రాహ్మణశ్రేష్టుడు నివసిస్తుంటాడు. ఇతడు దానధర్మాలు చేసి దరిద్రుడయిన వాడు, సుందరుడు, సచ్ఛీలుడు. ఇతడికి ధూతాంబ అనే భార్య, లోహసేనుడనే పుత్రుడూ ఉంటారు. వసంతసేన ఆ నగరంలోని గణిక ప్రముఖురాలు. ఈమె చారుదత్తుడిపైన మనసు పడుతుంది. వసంతసేనను రాజశ్యాలుడు – శకారుడు మోహించి వెంటబడతాడు. ఓ ఘట్టంలో అతణ్ణుండి తప్పించుకుందుకు వసంతసేన చారుదత్తుడి ఇంట్లో జొరబడుతుంది. తననో దుష్టుడు నగలకై వేధిస్తున్నాడని, ఆ నగలను దాచమని చారుదత్తుడి కిస్తుంది. చారుదత్తుడు ఆ నగల బాధ్యతను తన సహచరుడు మైత్రేయుడికి అప్పజెపుతాడు.
శర్విలకుడనే చోరుడు ఓ రోజు రాత్రి చారుదత్తుడి ఇంటికి కన్నం వేసి, ఆ నగలను అపహరిస్తాడు. ఈ శర్విలకుడికొక ప్రేయసి ఉంటుంది. ఆమె ఎవరో కాదు. వసంతసేన పరిచారిక అయిన మదనిక. ఆమెను దాస్యవిముక్తి చేయడం కోసమే శర్విలకుడు చౌర్యానికి పాల్పడ్డాడు. అపహరించిన నగలను తీసుకుని శర్విలకుడు వసంతసేన ఇంటికి వెళ్ళి, మదనికను కలిసి, జరిగింది చెబుతాడు. మదనిక భయపడి, ఆ నగలు తన యజమానురాలివేనని, ఆమే స్వయంగా వాటిని చారుదత్తుని వద్ద దాచిందనీ చెప్పి, చౌర్యారోపణ పాలుబడకుండా “చారుదత్తుడే తనను పంపినట్టుగా వసంతసేనతో చెప్పి, నగలను ఒప్పజెప్ప”మని శర్విలకుడికి ఉపాయం చెబుతుంది. చాటునుంచి వసంతసేన ఈ సంభాషణ వింటుంది. శర్విలకుడు మదనిక చెప్పమన్నట్టుగా తనను, చారుదత్తుడు నగలను అందజేయడం కోసం పంపాడని, నగలు తీసుకొమ్మని వసంతసేనకు అందజేస్తాడు. వసంతసేన అతని సద్బుద్ధికి మెచ్చి, మదనికను శర్విలకుడితో సాగనంపుతుంది. శర్విలకుడు మదనికను తీసుకుని ఇంటికి వెళ్ళే సమయంలో, తన స్నేహితుడు ఆర్యకుడు రాజు పాలకుడిచేత బందీ అయినట్టు తెలుసుకుంటాడు. మదనికను ఇంటికి పంపి, ఆర్యకుడిని కారాగారం నుండి విడిపించడం కోసం పథకం రచిస్తూ బయలుదేరతాడు.
సంవాహకుడనేవాడు చారుదత్తుడి వద్ద పరిచారకుడిగా ఉండి, చారుదత్తుడి ఐశ్వర్యం క్షీణించిన తరువాత పొట్టకూటికై తపిస్తూ, జూదవ్యసనపరుడయి పరిభ్రమిస్తుంటాడు. ఇతడు ఓ జూదంలో పది సువర్ణాలను ప్రత్యర్థికి బాకీపడి, అవి చెల్లించలేక, పారిపోతూంటాడు. పారిపోతున్న తనను జూదంలో నెగ్గిన ద్యూతకుడనే మరొక జూదరి పట్టుకుని చితకబాదుతాడు. దెబ్బలకు తాళలేక పారిపోతూ, సంవాహకుడు ఓ ఇంటిలో జొరబడతాడు. ఆ ఇల్లు వసంతసేనది. ఆమె వివరాలన్నీ తెలుసుకుని, ధనం ఇచ్చి సంవాహకుణ్ణి విడిపిస్తుంది. ఆ సంవాహకుడు విరక్తి చెంది, బౌద్ధ శ్రమణకుడవుతాడు.
వసంతసేన నగలు పోయిన తర్వాత, ఆ నగలు తనే దొంగిలించాడని ప్రజలు చెప్పుకునే అవకాశం ఉందని, తన దారిద్ర్యానికి తోడు అపవాదూ వచ్చి పడబోతున్నదనీ చారుదత్తుడు క్రుంగిపోతాడు. భర్త పరిస్థితి గమనించి ధూత, ఆ నగలకు పరిహారంగా వసంతసేనకు తన రత్నాల హారాన్ని ఇచ్చి బదులు తీర్చేసుకొమ్మని చెబుతుంది. ఆ రత్నాల హారాన్ని తన సహచరుడి చేతికి ఇచ్చి అతని ద్వారా వసంతసేనకు అప్పజెబుతాడు చారుదత్తుడు.
తన నగలు తనకు ఇదివరకే ముట్టాయని, జరిగిన విషయాలన్నిటినీ విశదీకరించే ఉద్దేశ్యంతో, వసంతసేన శర్విలకుడి ద్వారా తన వద్దకు చేరిన నగలను, చారుదత్తుడు పంపిన రత్నాల హారాన్నీ తీసుకుని చారుదత్తుడి ఇంటికి ఓ సాయంత్రం పూట వెళ్తుంది. ఆ రాత్రి ఆమె చారుదత్తుడి ఇంట విశ్రమిస్తుంది. మరుసటి రోజు ఉదయం చారుదత్తుడి ఇంటిలో బాలుడు రోహసేనుడు ఓ మట్టిబండితో ఆడుతూ, తనకు సువర్ణశకటం కావాలని మారాం చేస్తూ ఉంటాడు. వసంతసేన ఆ బాలుణ్ణి ఊరడించి, ఈ నగలతో నువ్వూ సువర్ణ శకటాన్ని కొనుక్కోవచ్చని, నగలను ఆ మట్టిబండిలో పెట్టి పిల్లవాడిని సముదాయిస్తుంది.
ఆ తర్వాత –
శకారుడి బండిని చారుదత్తుడు తనకోసం పంపిన బండిగా పొరబాటు పడి వసంతసేన పుష్పకరండకమనే ఉద్యానవనానికి బయలుదేరుతుంది. నిజంగా చారుదత్తుడు పంపిన బండిలో కారాగారం నుండి తప్పించుకున్న ఆర్యకుడు ఎక్కుతాడు. అక్కడ ఉద్యానవనంలో శకారుడు వసంతసేనను తన బండిలో చూసి ఆశ్చర్యానందాలకు లోనవుతాడు. ఆమె తన చేతికి చిక్కిందనుకుంటాడు. తనను వరించమని వసంతసేనను హింసిస్తాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో, ఆమె గొంతు నులుముతాడు. వసంతసేన స్పృహ కోల్పోయి పడిపోతుంది. ఆమె చనిపోయిందని తలచి శకారుడు – ఆమెను హత్య చేసినది చారుదత్తుడని న్యాయాధిపతుల వద్ద అభియోగం మోపుతాడు. చారుదత్తుడి వద్ద, వసంతసేన తాలూకు నగలు దొరకడంతో న్యాయనిర్ణేతలు అతనికి కొరత శిక్ష విధిస్తారు. కొరత శిక్షను అమలు జరిపడంలో భాగంగా, అతడిని పుష్పమాలాలంకృతుణ్ణి చేసి, వధ్యశాలకు తీసుకొని వెళుతుంటారు.
ఇక్కడ ఉద్యానవనంలో స్పృహ తప్పిన వసంతసేనను ఓ బౌద్ధ శ్రమణకుడు (ఇదివరకటి సంవాహకుడే) రక్షించి, ఉపచర్యలు చేసి బయటకు తీసుకువస్తాడు. చారుదత్తుడికి కొరత విధించబడే సమయానికి వసంతసేన అక్కడ చేరి, న్యాయాధికారులకు విషయం వివరించి అతడిని విడిపిస్తుంది. శకారుడికి జనం బుద్ధి చెపుతారు. ఈ లోగా ధూతాంబ అగ్నిప్రవేశం చేయబోతుంటే, చారుదత్తుడు వచ్చి, ఆపుతాడు. నేపథ్యంలో ఆర్యకుడు పాలకుడిని చంపి రాజవుతాడు. చారుదత్తుడిని, మరో నగరానికి రాజును చేస్తాడు ఆర్యకుడు. వసంతసేనను చారుదత్తుడు రెండవ భార్యగా ధూత అనుమతితో స్వీకరిస్తాడు.
When I was young I read the story of this play.
Now feel like reading all the books about this play.
Excellent .Can’t say more than this.
Yes. Excellent. Can’t say any thing more. ఒక బ్రాహ్మణుడిని(బ్రాహ్మణ సార్థవాహుడినైనా) దొంగగా, వేశ్యను నాయికగా చూపించిన నాటకం సంస్కృతంలో మరేదైనా ఉందా? తెలుగులో కన్యాశుల్కం కాకుండా మరేదైనా ఉందా (గిరీశాన్ని ఒక రకం దొంగ అనుకునేట్లయితే)?
అద్భుతంగా రాశారు. దీన్ని నేను కొన్నేళ్ళ క్రితం సంస్కృతం – ఆంగ్లం ద్విభాషా పుస్తకం సహాయంతో చదివాను గానీ పెద్దగా గుర్తు లేదు.
పి. లాల్ గారు ప్రచురించిన సంస్కృత నాటకాల ఆంగ్ల తర్జుమా పుస్తకంలో కూడా ఈ నాటకం ఉన్నది.
స్త్రీపాత్రలకి ప్రాకృత భాష విధించడం ఫండా ఏవిటో అర్ధం కాదు. నేను ఇంకొన్ని నాటకాల్లో కూడా చూశాను. సీతవంటి గొప్ప పాత్రలు కూడా ప్రాకృతం మాట్లాడినట్టు రాశారు.
బైదవే, శకారుడు ఏమి భాష మాట్లాడుతాడు? శకారుని సంభాషణ పుట్టించే హాస్యాన్ని గురించి ప్రస్తావించినట్టు లేదు మీరు.
కొత్తపాళీ గారూ, శకారుడి అసంబద్ధ సంభాషణల గురించి వ్యాసాం రెండవ పేజీలో ప్రస్తావించారే!
కొత్తపాళీ గారూ,
నెనర్లు.
“శకారో రాష్ట్రీయః స్మృతః” అని బేతవోలు వారు ఉటంకించారు. రాష్ట్రీయ ప్రాకృతం మాట్లాడతాడట. శకారుడు అన్నది పాత్ర నామం. మృచ్ఛ కటికంలో పాత్రధారుడి నామం సంస్థానకుడు. తన మాటలలో “స” బదులు “శ” కారం ఎక్కువగా దొర్లుతుంది కాబట్టి ఆ పాత్రకా పేరు.
ఈ రకమైన ఉచ్ఛారణ బీహారీలలో ఇప్పటికీ మనం గమనించవచ్చు.
ఇకపోతే ఈ పాత్రను ప్రత్యేకంగా రూపుదిద్ది (అసంబద్ధ సంభాషణలూ వగైరా), తద్వారా ఇతడి బావ రాజు గారిని elevate చేయడం ఒకరకమైన నాటకశిల్పం అని నా అభిప్రాయం.
మృచ్ఛకటికం – పరిచయమైనదే ఐనా, ఇప్పుడు మీ పరిచయం చాలా బావుంది. చదువుతూ నాటకం పైన మరింత ఆసక్తి పెంచుకోగలుగుతున్నాను.
స్త్రీ పాత్రలకు ప్ర్రాకృతం.
అలాగే ShakeSpear నాటకాలలో కూడా ఇటువంటి తేడాఅనే ఉండేదిట పాత్రల social statusని బట్టి.
కానీ నాకు ఆశ్చర్యకరమైన విషయం ఒకటి తెలిసింది, నేను అనుకున్న దానికి విరుద్ధంగా. ఆ తెలిసినది పిల్లల కోసం వ్రాసిన అతని జీవిత చరిత్రలో.
అదేమంటే , ఆ విధంగా, మాట్లాడే భాష సాహిత్యంలో వాడడానికి అవకాశం ఏర్పడింది అని. నాకైతే ఆ వివరణ బాగుంది అనిపించింది.
మనకి పూర్తిగా అర్థమైందనుకున్న దానికీ వేరే కోణం ఉందని తెలిస్తే ఆసక్తికరంగా ఉంటుంది కదా.
”మట్టి బండీ’పై మీ పరిచయం బావుంది. నాటకం చూసినట్లే ఉంది.
రవి గారూ,
చాలా బాగుంది..పరిచయం అంటూనే నాటకం మీద మంచి వ్యాసం రాశారు…నాకు తెలిసిన మొదటి సంస్కృత నాటకం ఇది…నాన్నగారు చిన్నప్పుడు కథలా చెప్పేవారు..తర్వాత దూరదర్శన్ లో సీరియల్ గా వచ్చింది…ఒక్క episode కూడా వదలకుండా చూసే వాణ్ణి…
వ్యాసం చాలా బాగుంది. రచయితకు శుభాకాంక్షలు. పొద్దుకి అభినందనలు.
చాలా బావుంది మీ వ్యాసం రవి గారు. ఈ నాటకంలో మరో ఆసక్తికర విషయం, దొంగ వేసిన కన్నంలోని కౌశలాన్ని చూసి అబ్బురపడ్డం. ఆ సంఘటన కళకి ఒక కొత్త అర్ధాన్నిస్తుంది.
మూలా మంచి పాయింటు చెప్పారు. ఒక తెలుగు సాహితీవేత్త (పేరిప్పుడు గుర్తు లేదు) గారింటో దొంగతనం జరిగిందని తెలిసి, జరుక్ శాస్త్రి ఆయనకి పరామర్శ ఉత్తరం రాశారుట – పోయిన వస్తువుల జాబితా ఏమన్నా తయారు చేశారా, లేక చారుదత్తుడిలా దొంగ వేసిన కన్నాన్ని చూసి అబ్బురపడుతూ ఉండి పోయారా అని.
మృచ్ఛకటికం ఆధారంగా తెలుగులో కూడా సినిమా వచ్చింది. విక్రమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బిఎస్ రంగా దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా పేరు వసంతసేన! 1967లోనే దీన్ని కలర్లో తీశారు. ఎఎన్ఆర్…బి.సరోజాదేవి హీరోహీరోయిన్లు… సినిమా పరాజయం పాలైందనుకోండి.