కొత్తపాళీ:: ఈసారి ఇచ్చిన సమస్యల్లో కవులందర్నీ బాగా ఉత్తేజితుల్ని చేసి, చాలా చర్చకి కారణమైనది ఈ సమస్య –
రాణ్మహేంద్రవరమ్ము చేరెను రత్నగర్భుని చెంతకున్
విశ్వామిత్ర:: ముందు చేరింది కవులో వస్తువులో తెలియదు గానీయండి కవులకూ కవితా వస్తువులకు కూడా నిలయంట
కొత్తపాళీ:: గిరిధర కవీ మీరు వేళ్ళు కదిలించి చాలా సేపయినట్టుంది, మీ పూరణ చెప్పండి
గిరి:: ఇదిగో
మ.కో
“షణ్ముఖా ప్రియశిష్య రమ్మిటు, జాగుచేయక చెప్పవోయ్,
రాణ్మహేంద్రవరమ్మదేమిటి, రత్నగర్భమదేమిటీ?”
“రాణ్మహేంద్రవరమ్ము పట్నము, రత్నగర్భము సాగరమ్”
“రాణ్మహేంద్రవరమ్ము నీటినలంకరింప నదేమగున్?”
“రాణ్మహేంద్రవరమ్ము చేరును రత్నగర్భునిచెంతకున్”
“షణ్ముఖా ప్రియశిష్య సత్తమ, సంతసించితి నిక్కమోయ్”
“షణ్ముఖ ద్గురువర్య నేటికి చాలు ప్రశ్నలు, లేనిచో
“రాణ్మహేంద్రిని నేను చేరెద రత్నగర్భుని పొట్టలోన్”
విశ్వామిత్ర:: గిరిగారూ, మాలికాప్రియులు ..
చదువరి:: ఔను, ఎంచేతో గిరిగారు నాలుగు పాదాల్తో సరిపెట్టలేరు.
రవి:: 🙂
విశ్వామిత్ర:: సరిపెట్టలేకపోవటం కాదండీ దాతృత్వం
కొత్తపాళీ:: విశ్వామిత్ర, అవును, నిజమే, ఎంతైనా గిరిధరుడు వనమాలి కూడా కదా, మాలలే మాలలు
రాకేశ్వరుఁడు:: 😀 అయ్యో సుబ్బయ్యో ఎంత పంజేసావయ్యో
కొత్తపాళీ:: గిరీ, ఎప్పటికైనా మీరు, సంభాషణలన్నీ పద్యాల్లో ఉండేట్టు ఒక సినిమా తియ్యాలి
రాఘవ:: కొత్తపాళీగారూ, భలే మాట చెప్పారు.
కామేశ్వరరావు:: అవునండీ! పద్యాలలో సంభాషించడం గిరిగారికి వెన్నతో పెట్టిన విద్యలా ఉంది!
కొత్తపాళీ:: రాఘవ కవీంద్రా, మీ పూరణ
రాఘవ:: అవధరించండి
మ.కో
మృణ్మయంబగు పృథ్విపైన సమీరణాహతమైన ప్రా
వృణ్ముహుర్వృషదంబుదంబు విరించియై కనఁ గౌతమిన్
వ్రాణ్మదేభసమానయానము ఱాల మీఁదుగఁ జేయుచున్
రాణ్మహేన్ద్రవరమ్ముఁ జేరెను రత్నగర్భుని చెంతకున్
రాకేశ్వరుఁడు:: వ్రాణ్మదేభసమానయానము ఱాల మీఁదుగఁ – భావకవితల్లో కూడా తెప్పించలేరండీ ఇంత భావాందం।
గిరి:: ఇదీ, పూరణంటే. చిక్కుని, దుష్కరప్రాసని భలే విడదీసారు
రాఘవ:: గోదారమ్మ రాజమండ్రి చేరి తర్వాత సాగరాన్ని చేరుతుంది కదా అని…
కొత్తపాళీ:: వ్రాణ్మదేభసమానయానము .. అనగా నేమి. పటము గీచి భాగములు గుర్తింపుము – ఐదు మార్కుల ప్రశ్న
రాకేశ్వరుఁడు:: సమీరణాహతమైన – సముద్రం నుండి వచ్చినదనా?
చదువరి:: రాఘవ గారూ, అర్థం చెప్పాలండీ..
కామేశ్వరరావు:: రాఘావార్యా, మీ పద్యానికి తిరుగు లేదండీ! నిజం చెప్పొద్దూ, మీ పూరణ చూసి స్పర్థతోనే నేనూ పూరణని ప్రయత్నించాను 🙂
రాఘవ:: సమీరణుడు అంటే వాయువు. ఆహత – కొట్టబడి
రాకేశ్వరుఁడు:: దంబుదంబు ఏమియందంబు।
రవి:: గోదారికి వరదొచ్చినట్టుందండీ
రాఘవ:: 🙂
ఫణి:: చక్కగా ఉందండి.
రాఘవ:: అసలు పద్యాలంటే రామరాజభూషణుడే వ్రాయాలండీ. ఏమి అలంకారాలూ, ఏమి సొగసూ. అబ్బో. ఆయనలా వ్రాయటం ఆయనకే చెల్లింది.
కొత్తపాళీ:: రాజ భూషణుడు కదా! తెలుగు పంచ కావ్యాల్లో వసు చరిత్ర ప్రౌఢకావ్యం అంటారు
రాఘవ:: అర్థం:: మట్టితో నిండియున్న భూమిమీద గాలిచేత కొట్టబడిన వానమబ్బు వర్షించి గోదావరిని పుట్టించింది. ఆ గోదావరి సొగసుగా ఱాళ్లమీదుగా ప్రవహించి ప్రవహించి రాజమండ్రి చేరి తర్వాత సాగరంలో కలిసింది.
చదువరి:: 🙂 బహు బాగు!
రాకేశ్వరుఁడు:: మదేభము = మత్తేభము ?
రాఘవ:: ఔను. రెండూ ఒకటే.
రాకేశ్వరుఁడు:: అటజని గాంచె పద్యం గుర్తుకు వచ్చింది।
శ్రీరామ్:: ప్రావ్రుణ్ముహుర్ అంటే?
రాఘవ:: ప్రావృట్ అంటే వర్షర్తువు. ముహుః మళ్లీ. వర్షర్తువులో మళ్లీ మళ్లీ కురిసే (వృషత్) మేఘము (అంబుదంబు).
శ్రీరామ్:: రాఘవా,,.నెనర్లు
కొత్తపాళీ:: కామేశ్వర్రావు గారు, మీ పూరణ కూడా
కామేశ్వరరావు:: అలాగే
మ.కో
ఈ పద్యం కామేశ్వరరావు స్వరంలో.. |
ద్విణ్మనోऽశని రామభద్రుడు దీక్ష వారధి గట్టి, వి
భ్రాణ్మహాబల విక్రమమ్ముల రావణున్ బరిమార్చి, తా
ఘృణ్మతిన్ కపి వీరులన్ బ్రతికింపగా గొని దేవతా
రాణ్మహేంద్ర వరమ్ము, చేరెను రత్నగర్భుని చెంతకున్
రాఘవ:: కామేశ్వరరావుగారూ, అసలు దేవతారాట్ అని కూడ విడగొట్టవచ్చు అన్న ఆలోచన నాకు రాలేదండీ మీ పూరణ చూచేవఱకూ.
చంద్రమోహన్:: రాకేశ్వర ఊరు హుష్ కాకీ చేసేశారు
సనత్ కుమార్:: భలే..
చదువరి:: దేవతారాట్ విరుపు ఉంది చూసారూ.. బ్రహ్మాండం !
రాకేశ్వరుఁడు:: కామేశం గారు ణ్మ ప్రాసను జటిలత్వము లేకుండానే భలే ఛేదించారే
ఫణి:: రాముడు సముద్రాన్ని చేరాడు. బాగుంది.
కొత్తపాళీ:: దీనిలో ఇంకో సౌందర్యం, పద్యం నడక చెడకుండా ఉండి ఇంకా సౌందర్యం ఇనుమడించింది
కామేశ్వరరావు:: నాకు విరుపుల మీదే దృష్టి ఉంటుందెప్పుడూ 🙂
చదువరి:: 🙂
కొత్తపాళీ:: ఏమోలెండి, పెద్దన గారు కదా, పరుపుల మీద ఉందేమో దృష్టి అనుకున్నాము ఇప్పటిదాకా 🙂 ఆయన హంసతూలికా తల్పం అడిగాడు కదా కవిత రావాలంటే.
(గతంలో జరిగిన భువనవిజయం కవిసమ్మేళనంలో కామేశ్వరరావు గారు అల్లసాని పెద్దన పాత్ర పోషించారు – సం.)
రాఘవ:: విరుపులు విరుల్లా అందంగా ఉండేలా చూచుకోవడం కూడ మీకు భలే తెలుసునండీ.
రాకేశ్వరుఁడు:: నాకు అసలు విరుద్దామనే ఆలోచనే రాదు।
రాకేశ్వరుఁడు:: దీన్ని మాత్రంమీరు నడ్డివిరగగొట్టారు
కామేశ్వరరావు:: అటు పిమ్మట రామాయణం చక్కగా రక్షించింది. 🙂
చంద్రమోహన్:: మత్తకోకిల నడక కూడా కొత్తగాఉంది ఈ పద్యంలో!
రాఘవ:: చంద్రమోహన్ గారూ, దీర్ఘసమాసాలవల్ల కొంచెం ఠీవి పెరిగి నడక మారిందండీ.
సనత్ కుమార్:: రాఘవా, కామేశ్వరరావు గారూ.. మీ ఈద్దరికీ చెరో లక్ష వరహాలు
రాకేశ్వరుఁడు:: చెబుతా చెబుతా నా పూరణ।
తర.
నునుపురాతికి, కొండ పిండిగ నుజ్జు జేసిరి మానవుల్
వనములన్నియు కామదైత్యికి వండి పెట్టిరి అంధులై
ఇనుముకై గనులెన్నియో యిలహృద్యమందున ద్రవ్విరీ
అనిల సంద్రములంతయుం గడు హాలహాలముఁ నింపిరీ
మ.కో
షణ్మహారిపుమాయలోఁ బడి జ్యా వినాశముఁ జేసిరీ
షణ్మహాక్షమఖండవాసులు స్వచ్ఛవాయువు లంతటా
విణ్మయమ్మును నింపఁగా, యిలఁ వేడి సంద్రము పొంగగాఁ
రాణ్మహేంద్రవరమ్ము జేరెను రత్నగర్భుని జెంతకున్
రాకేశ్వరుఁడు:: ఇది futuristic పూరణ 🙂
కొత్తపాళీ:: హమ్మ్ .. మొత్తానికి విలయం తప్పదంటావు
రాఘవ:: గ్లోబలు వార్మింగు మళ్లీ వచ్చిందే?
కామేశ్వరరావు:: Global warming!
చంద్రమోహన్:: అనిల సంద్రములు? హాలహాలము?
ఫణి:: లావా.
రాకేశ్వరుఁడు:: విద్యార్థి కల్పతరువులో హాలహాలము ఇచ్చారు।
రాకేశ్వరుఁడు:: అనిలసంద్రముల్ – ద్వంద్వసమాసం
రాఘవ:: రాకేశ్వరులవారూ, హాలహలము విన్నాను కానీ హాలహాలము వినలేదండీ.
శ్రీరామ్:: సమాసం దుష్టం…
రాకేశ్వరుఁడు:: కామేశ్వరరావుగారు, కామరాక్షసికొండి పెట్టిరి – అచల సంధి !
రాఘవ:: మిశ్రమనుకోవాలి. తప్పదు.
శ్రీరామ్:: 🙂
రాకేశ్వరుఁడు:: శ్రీరామ – యా అవునుకదా
కామేశ్వరరావు:: 🙂
చంద్రమోహన్:: అనిల సంద్రములంతటన్ అంటే స్పష్టత వస్తుందేమో
శ్రీరామ్:: మరే
చంద్రమోహన్:: అంతయున్ అంటే అవే కర్తలైపోతున్నాయి
గిరి:: రాజమండ్రి 2012 అన్నమాట
కొత్తపాళీ:: ఈ సారి పూరణల్లో పర్యావరణ ప్రస్తావన బలంగానే ఉంది
రాఘవ:: భలే. ఏమైనా, చక్కటి సమస్య ఇచ్చినందుకు రాకేశ్వరునికి పెద్ద నమస్కారం. అలాగే ఈ సమస్యకి నా పూరణ గోదావరీమాతకు అంకితం.
నరసింహారావు:: బాగుందండీ మీ పూరణ
చదువరి:: చక్కటి భావన !
…………………..
కొత్తపాళీ:: ముందుకి పోదాం… ఈ కవితా గోష్టిలో, కేవలం సమస్యలు సాధించడం, చమత్కారమే కాక, కవిత్వం ధార కట్టాలనేది కూడా మా ఆశయం. ఈ ఆశయానికి రూపకల్పన చేస్తూ మూడు నించీ ఐదు పద్యాల్లో కొన్ని అంశాలని వర్ణించమని కోరాము. ముందుగా కామేశ్వర్రావుగారిని ద్రౌపది వర్ణన వినిపించమని కోరుతున్నాను.
కామేశ్వరరావు:: చిత్తం
తే.గీ
ఈ పద్యం కామేశ్వరరావు స్వరంలో.. |
ధర్మసూనుని మహనీయ ధర్మదీక్ష
వాయునందను పటుతర పౌరుషమ్ము
జిష్ణు సుతుని యచంచల కృష్ణభక్తి
నకులసహదేవు సౌందర్య నయ గుణములు
పంచనదములుగా సంగమించు నామె
సహజ “లావణ్య” విలసిత సాగరమ్ము!
శా.
ఈ పద్యం కామేశ్వరరావు స్వరంలో.. |
ఆ రోషాయుత నేత్ర విస్ఫురదుదగ్రార్చిస్స్పులింగమ్ము లే
పారీభావ ప్రచండకోప బడబాజ్వాలోల్లసత్ కీలలో!
ఆ రాజన్యసతీ శ్లథోచ్చలిత కేశాగ్రమ్ములేయే ప్రతీ
కారేచ్ఛా క్షుభితాంతరంగ పటురంగత్తుంగ భంగమ్ములో!
ఉ.
ఈ పద్యం కామేశ్వరరావు స్వరంలో.. |
ఆమె యెడందలోతు తెలియన్ దరమే అల బ్రహ్మకైన! ఏ
దో మిరుమిట్లు గొల్పు మెఱుపున్నది ఆమె స్వభావమందు, ఏ
దీ మిగిలింది యీమెకు తుదిన్? మృతపుత్రుల గర్భశోకమే!
ఈమె చరిత్ర భారతము, ఎన్నగ నద్దియు నర్ణవమ్మెగా!
రాఘవ:: ద్రౌపది వచ్చేసరికి మీరు కూడ మాలికలు అల్లారే! శార్దూలం అద్భుతమండీ. మొత్తానికి చిఱు ధ్వనికావ్యంగా ఉంది.
గిరి:: మీ పద్యం చదివాక ఇంద్రుణ్ణి జిష్ణు అని కూడా అంటారని తెలిసింది
రవి:: నాకిప్పుడే తెలిసింది
చంద్రమోహన్:: శార్దూలం అద్భుతం.
కామేశ్వరరావు:: రాఘవా, నెనరులు.
శ్రీరామ్:: మొదటిపద్యంలో అద్భుతమైన భావం!!!
చంద్రమోహన్:: భారతంలోని “దుర్వారోద్యమ బాహు విక్రమ…” పద్యాన్ని మించినట్లుంది
గిరి:: విస్ఫురదుదగ్రార్చిస్స్పులింగమ్ము
సనత్ కుమార్:: క్షుభితాంతరంగ పటురంగత్తుంగ భంగమ్ములో….భలే.
కామేశ్వరరావు:: ద్రౌపదిని వర్ణించాలనగానే, ఆ శార్దూలం అలా పరవళ్ళు తొక్కింది
రవి:: కొంచెం విశ్వనాథ వారి ఛాయ కనిపించింది (ఏదో మిరుమిట్లు గొల్పు మెఱుపున్నది..)
కామేశ్వరరావు:: రవిగారు, సరిగ్గా పోల్చుకున్నారు!
చంద్రమోహన్:: ద్రౌపదిని సాగరంతో పోల్చడం బాగుంది
కామేశ్వరరావు:: శ్రీరాం గారు నెనరులు. మొదటి పద్యంలో ఆ సముద్రంతో పోలికనే చివరిదాకా తీసుకురావడానికి ప్రయత్నించాను.
రాఘవ:: 🙂
కొత్తపాళీ:: రవి 🙂
ఫణి:: భర్తల గుణాలు ఆమెలో ప్రకాశిస్తున్నాయి. అధ్భుతంగా ఉందండి.
చదువరి:: అద్భుతం!
పుష్యం:: శార్ధూలం చాలా బాగుందండీ..చాలా సార్లు ప్రత్నించాను కానీ. సంస్కృతం లేకుండా శార్ధూలం చాలా కష్టమనిపించింది.
గిరి:: కామేశ్వరరావు గారు, నకుల సహదేవులు – అందము, తెలివి యేనా?
కొత్తపాళీ:: రాఘవ కూడా మంచి వర్ణన చేశారు. రాఘవా, మీ వర్ణన కానివ్వండి
రాఘవ:: అవధరించండి
శా.
శ్రీమద్భారతసంహితార్ణవపు లక్ష్మీరూప ధర్మేతర
క్షేమభ్రాంతి దురాత్మకాననమహాకీలాభ భాస్వత్కురు
స్త్రీమందారముఁ బౌరుషప్రకట శాంతీచ్ఛాజ్వలచ్చిత్త రా
మామూర్తిన్ దలతున్ బవిత్రతకుఁ ధర్మాసక్తికిన్ శక్తికిన్
సీ.
ద్రుపదుఁడు ప్రజకై క్రతువుఁజేయ కూతురై పుట్టె తా నగ్ని నద్భుతపు మూర్తి
పాండవర్షభులకుఁ బట్టమహిషియౌటఁ గననయ్యె గాఢశృంగారమూర్తి
ధార్తరాష్ట్రజ్యేష్ఠదర్పంబునుం జూచి హాయిగా నవ్వెడి హాస్యమూర్తి
పదిమందిలోఁ బరాభవమంది కృష్ణుని నార్తిఁ బిలచు కరుణార్ద్రమూర్తి
తే.గీ
వికటుఁ గీచకుఁ గాంచుచో భీతమూర్తి
భీమకరగతాసువులను వీరమూర్తి
అర్జునసతియై బీభత్సయైనమూర్తి
తల్లి నిండుగా శాన్తవాత్సల్యమూర్తి
ఉ.
కృష్ణవసుంధరాజనిమహర్షికి ద్రౌపది క్షేత్రపౌత్రియై
కృష్ణగఁ బుట్టి కుంతియను కృష్ణకు ముద్దులకోడలై మఱో
కృష్ణుఁడు పాండుపుత్రుఁడు కిరీటిమనస్సరసీరుహాలియై
కృష్ణుని భక్తురాలయి సుకృష్ణకచేక్షణ వెల్గె భారతిన్
సనత్ కుమార్:: భలే.
గిరి:: గొప్పగా ఉంది
కొత్తపాళీ:: సుకృష్ణకచేక్షణ ??
ఫణి:: అంతా కృష్ణ మయం. 🙂
శ్రీరామ్:: భేష్!
నరసింహారావు:: బావుందండి. ఆహా !
కామేశ్వరరావు:: అద్భుతం రాఘవా!
కొత్తపాళీ:: కచ అంటే జుత్తు కదా
రాఘవ:: చక్కటి నల్లటి వెండ్రుకలూ కండ్లూ
చంద్రమోహన్:: శభాష్
రవి:: నవరసాల పద్యం భలే ఉంది
గిరి:: ధర్మేతరక్షేమ భ్రాంతి – వివరించండి
కొత్తపాళీ:: ఓ, కృష్ణ విశేషణం రెంటికీ వొప్పిందా, సరే.
కొత్తపాళీ:: వర్ణనలో ఇచ్చిన రెండో అంశం ఒక దృశ్యం
సనత్:: అద్భుతం రాఘవా!
చదువరి:: భలే! బాగుంది.
రాఘవ:: ధార్తరాష్ట్రులకు అధర్మం క్షేమంగా ఉన్నట్టు భ్రాంతి కలిగించి చివఱికి ధర్మమే గెలిపించిన శక్తి
రాకేశ్వరుఁడు:: కామేశం గారిదీ, రాఘవదీ రెండూ అద్భుతంగా వున్నాయి, ఈ మధ్య గరికిపాటివారి మహాభారతంలో ద్రౌపది మాన సంరక్షణాఘట్టమే జరిగింది। ఈ వర్ణనాంశము చాలా ఉచితము।
గిరి:: లోతుగా ఆలోచిస్తేగానీ బోధపడినిది
రాఘవ:: కామేశ్వరరావుగారూ, అన్నీ వచ్చాయే. అద్భుత, శృంగార, హాస్య, కరుణా, భీతి, వీర, బీభత్స, శాన్త, వాత్సల్య
కొత్తపాళీ:: రౌద్రం .. కరుణ అనేది రసం కాదు
కామేశ్వరరావు:: కొత్తపాళీగారు, “కరుణ” రసం కాదు కాని “కరుణా” రసమే అనుకుంటాను.
రాఘవ:: 😀
చంద్రమోహన్:: కొత్తపాళిగారు, కరుణ రసమే! “ఏకో రసః, కరుణ ఏవ” అన్నాడు భవభూతి
కొత్తపాళీ:: కామేశ్వర, భలే
రాఘవ:: పైగా, వాల్మీకి రామాయణంలో ప్రధానరసం కరుణారసమే అని అంటారు కూడాను.
సనత్:: భలే..
కొత్తపాళీ:: చంద్ర, నిజమే, ఆ నానుడి నేనూ విన్నాను
రాకేశ్వరుఁడు:: సరసంగానుంది
గిరి:: నవరసరంగానుంది
రాఘవ:: స్వరససిద్ధి కలిగించాడు మా రాముడు 🙂
రాకేశ్వరుఁడు:: రాముఁడు రాఘవుఁడు రఘుకూల్ఉడితఁడు 🙂
ఆ రోషాయుత నేత్ర విస్ఫురదుదగ్రార్చిస్స్పులింగమ్ము లే
పారీభావ ప్రచండకోప బడబాజ్వాలోల్లసత్ కీలలో!
ఆ రాజన్యసతీ శ్లథోచ్చలిత కేశాగ్రమ్ములేయే ప్రతీ
కారేచ్ఛా క్షుభితాంతరంగ పటురంగత్తుంగ భంగమ్ములో!
ఈ పద్యం అధ్బుతంగా ఉంది. అక్కడక్కడా అర్థం కాకపోయినా ఏదో తెలియని ఒక రాసానుభూతి కలిగింది చదవగానే. కామేశ్వర రావు గారు ఆదర గొట్టారు. ఇంకో భాగం ఉన్నట్టుండి. ఎప్పుడు ప్రచురిస్తారు???
ఇవన్నీ చదువుతుంటే నాకు ఈ కవుల్లో అవధానులు కూడా ఉన్నారేమో అనిపిస్తోంది.
కొత్తపాళీ గారు, పొద్దు వారికి, మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు.
గోదారమ్మ, రాజమండ్రి – ఈ రెండు మాటలు చాలండి. చదివిన నా మనసూ గోదావరే. అంచేత,
“రాణ్మహేంద్రవరమ్ము చేరెను రత్నగర్భుని చెంతకున్” సమస్య, పూరణల వైపుకే ఒగ్గినా, రెండూ రెండే. మరి కొన్నిసార్లు చదివితే కానీ పూర్తిగా తాత్పర్యాలు బోధపడవు సుమండి.
రాఘవ, గోదావరీమాతకు అంకితం అన్న మీ మాట బహు బాగు.
అందరికీ పేరు పేరునా చెప్పకపోయినా అభినందనలు.
పద్య కవితా సదస్సు హృద్యంగా సాగుతోంది. కవివర్యులకు అభినందనలు.
వాసుగారు, ధన్యవాదాలు.
పాఠకుల సులువు కోసం నా “రాణ్మహేంద్రవరమ్ము…” పూరణకి వివరణ:
ద్విణ్మనోశని – ద్విట్ + మనః + అశని – శత్రువుల మనసులలో పిడుగులాంటి వాడు
ఘృణ్మతిన్ – కరుణ కలిగిన బుద్ధితో
దేవతారాణ్మహెంద్ర వరమ్ము – దేవతల రాజైన మహేంద్రుని వరము
యుద్ధంలో మరణించిన వానర వీరులందరూ బ్రతికేటట్టుగా రాముడు ఇంద్రుని దగ్గరనుంచి వరాన్ని పొందుతాడు. ఇక్కడ అది ప్రస్తావించబడింది. ఆ తర్వాత తిరిగి అయోధ్యకి ప్రయాణమై సముద్రం దగ్గరకి చేరుతారు.
ద్రౌపది పద్యాల వివరణ కొంచెం పెద్దదవుతుంది. నా బ్లాగులో ఎప్పుడో పెడతాను.
ద్రౌపదీ వర్ణనలో – రాఘవ గారి శార్దూలము, కామేశ్వర్రావు గారి శార్దూలము రెండూ చదువుకుంటుంటే, “దుర్వారోద్యమ బాహువిక్రమ..” పద్యం గుర్తొచ్చింది.
ఈ ద్రౌపది సందర్భంలో శార్దూలవృత్తం ఉపయోగించడంలో ఏదైనా ప్రత్యేక కారణం ఉందాండి?