వికృతి ఉగాది పద్యకవితా సదస్సు – రెండవ భాగం

కొత్తపాళీ: ఈ సారి కొత్తగా ఫణి ప్రసన్న, సనత్ శ్రీపతి సభలో పాల్గొంటున్నారు. వారిద్దరికీ ఆహ్వానం, అభినందనలు. పెద్దవారు నరసింహారావు గారు కూడా దయచేశారు. స్వాగతం

ఫణి: ధన్యవాదాలు

సనత్ కుమార్: నమస్సభాయై

రాకేశ్వరుఁడు: అకారేకారోకారసంధులు అంటూ తెలుఁగు సంధుల పేర్లకు సంస్కృత సంధి చేసావేమయ్యా రాఘవా ??

రాఘవ: రాకేశ్వరా, అక్కడ సంస్కృతం చెల్లుతుంది మఱి.

గిరి: తెలుగుకీ, సంస్కృతానికీ ఉన్న అవినాభావ సంబంధాన్ని సూచించడానికేమో

(క్రిందిది ఆశువుగా చెప్పిన పద్యం -సం.)
విశ్వామిత్ర:

తాంబూలప్రియుడ, వ్యాకర

ణంబది అందనను ద్రాక్ష నాకు తమసహా

యంబున వ్రాతును, మరియున్

రాఘవ:

కంబుగ్రీవునిఁ గొలువుడు కైతలు వచ్చున్

విశ్వామిత్ర:

అంబుజ నయనలనుగనగ అమ్మో భయమౌ

విశ్వామిత్ర: @రాఘవ 🙂

గిరి: ఆశుపద్య ధారలు ప్రవహిస్తున్నాయి

ఫణి: 🙂

సనత్ కుమార్: అంతర్జాలంలో అంబుజ నయనలు ఎక్కడ కనిపిస్తున్నారో

కొత్తపాళీ: సనత్ .. ఆయన విశ్వామిత్రుడు కదా, దివ్యదృష్టితో చూసి ఉంటారు

కొత్తపాళీ: ముందుగా .. గరికయొ గడ్డియో మెసవి గైకొనవచ్చు గవిత్వ సంపదల్. రాఘవ కవిని ఈ సమస్య పూరించమని కోరుతున్నాను

రాఘవ:

ఉరమున కౌస్తుభప్రభలు యుక్తములై వెలుఁగొందఁ దెల్పఁగాఁ

బరమరహస్యముల్ విధిశివాచ్యుతరూపుఁడు కృష్ణమూర్తియై

మురళినిఁ జేతఁ బట్టి సురమోహనగానముఁ జేయ నాలమై

గరికయొ గడ్డియో మెసవి కైకొనవచ్చుఁ గవిత్వసంపదల్

విశ్వామిత్ర: ఆహా

కొత్తపాళీ: అవును, చెవులకి మురళీ సుధారవళి సోకుతుంటే, కడుపుకి ఏమి తింటే నేమి?

రాకేశ్వరుఁడు: కొత్తపాళీ గారు దయచేసి కడుపు తిండి అనే మాటలు ఎత్త వద్దు। శనివార్రప్పస్తులుంటున్నాం

కామేశ్వరరావు: చాలా బాగుంది పూరణ!

చదువరి: చక్కటి పద్యం

విశ్వామిత్ర: పోతన గారి మాగాయ గుర్తుకొచ్చింది

రాఘవ: కృష్ణార్పణం

శ్రీరామ్: మురళీమోహనమైన పద్యం!

రాఘవ: పోతనగారి మాగాయ?

కామేశ్వరరావు: నాదొక చిన్న సందేహం. గరికకీ గడ్డికీ ఏమిటి తేడా?

రాఘవ: కామేశ్వరరావుగారూ, గరిక కొందఱు పచ్చడి చేసుకుంటారండీ. గడ్డి ఎందుకూ ఉపయోగపడదు.

సనత్ కుమార్: నాలమై అంటే ఏమిటి రాఘవా ??

రవి: విధిశివాచ్యుతరూపుడు – వివరించాలండి

నరసింహారావు: శివాచ్యుత రూపుడు అన్నచోట శివ అనే పదానికి అర్థం ఎలా గ్రహించాలి

రాఘవ: విధి బ్రహ్మగారు, శివ పరమేశ్వరులవారు, అచ్యుత విష్ణువులవారు. ముగ్గురి రూపమూ అని.

కొత్తపాళీ: ఫణి ప్రసన్న గారు కూడా ఈ సమస్యని పూరించారు .. ఫణీ కానివ్వండి

ఫణి:

ఎరుగను మున్ను ఎన్నడును ఏర్పడ వ్రాయగ వృత్త పద్యముల్

కరతల మయ్యె భాగవత గానము సేసిన నేడు వ్రాయుటల్

హరిచరితంబు యా మధుర అద్భుత కావ్య మహా వనమ్ములో

గరికయొ గడ్డియో మెసవి గైకొనవచ్చు కవిత్వ సంపదల్

కొత్తపాళీ: ఆహా, మీరూ పోతన బాటనే పట్టారు, బాగుంది

రాకేశ్వరుఁడు: చాలా బాగుంది।

కామేశ్వరరావు: పోతన పేరెత్తగానే భాగవత గానం వచ్చేసిందే! బాగుంది!

కొత్తపాళీ: అసలు ఆ సమస్యలోని మహిమే అదేమో?

ఫణి: కృష్ణుడు, కృష్ణ కథ అంతా ఒకటే కదండీ.

రాఘవ: కావ్యమహావనం… భలే.

చదువరి: ‘గరిక’పాటి వారు !

రాఘవ: గడ్డిపాటివారు లేరంటారా ఏమిటి?

విశ్వామిత్ర: గరిక పచ్చడి ఎలా చేసుకుంటరో తెలియాలంటె గరికపాటి వారిని అడగాల్సిందే

రాకేశ్వరుఁడు: అన్నట్టు నాదింకో సందేహం – గరిక గరికి ఒకటేనా

రాఘవ: గఱిక అన్నదే సాదురూపం అనుకుంటాను.

సనత్ కుమార్: ఇంతకీ గరికకీ గడ్డికీ తేడా ఉందా???

విశ్వామిత్ర: @సనత్ ఉంది, గడ్డితినే వాళ్లకి గరికతినే వాళ్లంత గౌరవం లేదు

కొత్తపాళీ: గరిక అనేది, అనేక రకాల గడ్డి మొక్కల్లో ఒకటి

రాకేశ్వరుఁడు: నాకు గరికిపాటివారు స్వయంగా ఇచ్చిన visiting card లో గరికి అనివుంది పేరు।

కామేశ్వరరావు: “గరికి” లేదు. “గరిక” పదమే వారింటిపేరులో “గరికి”గా మారిందని గరికిపాటివారు చెప్పారు.

కొత్తపాళీ: గడ్డి అనేది జాతి నామం – name of a genus

గిరి: గడ్డిలో ఎన్ని రకాలో మేస్తే కానీ తెలియకపోవచ్చు

రాకేశ్వరుఁడు: కామేశ్వరులు – గరికకి గరికి షష్ఠీ విభక్తి అయివుంటుంది

కామేశ్వరరావు: 🙂

రాఘవ: రాకేశ్వర… ఏం చదువుతున్నారు మహాశయా ఈ మధ్యన?

సనత్ కుమార్: తినేదొకటే అయినప్పుడు చెప్పుకునేది మంచి పేరున్నదాన్నే చెప్పుకుంటే పోలా??

కామేశ్వరరావు: ఇంతకీ కృష్ణభక్తినీ, భాగవత గానాన్నీ వదిలేసి గడ్డి మీద పడ్డామందరమూ! 🙂

రవి: కామేశ్వర్రావు గారు, అలా “గడ్డి” పెట్టండి.

పుష్యం: నేల మీదకంటే గడ్డి మీద పడడం మంచిది కదా.. దెబ్బ తగలదు 🙂

రాఘవ: కామేశ్వరరావుగారూ, నిజమేనండీ. త్రాళ్లు పోసి గట్టిగా లాగాలి.

…………………………………………..

కొత్తపాళీ: ఇష్టాగోష్టి పూర్తయితే, తరవాతి సమస్యకి వెళ్దాము.. లావొక్కింతయు లేదు … ఈ పదాలతో మొదలయ్యే గజేంద్ర మోక్షం తెలుగునాట బహు ప్రసిద్ధం. సమస్య ఏమిటంటే, ఈ పదాలతో మొదలు పెట్టి, పోతన కవిత్వ ఛాయ పడకుండా రాయాలి

ఫణి: నేనెంత కష్టపడినా పోతన శైలి రాదు కనక ధైర్యంగా రాశాను.

విశ్వామిత్ర: “లావొక్కింతయు లేదు” …ఇప్పటి నాయికా మణులందరిదీ ఇదే జపం

రాఘవ: విశ్వామిత్రులవారూ, జీరో సైజు గుఱించా మీరు చెబుతున్నది! అన్నా, మేనక బాధపడుతుంది సుమండీ!

రాకేశ్వరుఁడు: రాఘవ – జీరోసైజ్ గుఱించి మాట్లాడుతున్నారు మీరు। కాంతిపుంజాల గుఱించా?

రాఘవ: మెఱుపుతీగల గుఱించి

నరసింహారావు: ” లా ‘ వొక్కింతయు లేదు అనే పద్యమొకటి ఎప్పుడో చదివాను.

గిరి: బాపు గారు తనగురించి చెప్పుకునేటప్పుడు వాడారు – లా చదివినా ‘లా’ వొక్కింతయు లేదని

విశ్వామిత్ర: నాల్గో పాదంలో ఈశ్వరా బదులు మానినీ వాడిన O అనుకరణ పద్యాన్ని నేను చూసాను

రాఘవ: Oహో!

కొత్తపాళీ: ఫలానా ఛందస్సని నియమం పెట్టలేదు, దాంతో తెలివైన మన కవులందరూ, ఆహా చక్కగా కందంలో ఇమిడిపోతుందని, కందాలు చులాగ్గా లాగించేశారు. ఈ సమస్యకి దాదాపు అందరూ స్పందించారు. అందరి పద్యాలూ ఇక్కడ చెప్పడానికి సమయం చాలదు. అంచేత దయచేసి నేను పిలిచిన వారు మాత్రం తమ పద్యాలు వినిపించమని ప్రార్ధన

కొత్తపాళీ: పుష్య కవీ .. ముందుగా మీ పూరణ

పుష్యం: ‘లా’ ఒక్కింతయు లేదన్నారుగా మీ రూలు ఎందుకు పాటించాలి? 🙂

పుష్యం: ఒక తల్లి తనకు నచ్చిన అమ్మాయిని చూడమని కొడుకునుద్దేశించి:

పుష్యం:

లావొక్కింతయు లేదుర,

జీవితమున నీకుమంచి చేదోడగురా.

పావని చక్కని పిల్లర,

నీవామెను చూడకున్న నేనొప్పనురా!!”

నరసింహారావు: బాగుందండి.

కామేశ్వరరావు: బాగుంది! చేదోడైతే చాలు, వాదోడైతేనే కష్టం 🙂

చదువరి: 🙂

విశ్వామిత్ర: ఇప్పుడు అదేమీ చూడటం లేదు ..ఒక్క జే(బు)తోడే

రాఘవ: మొత్తానికి జీవితంలో హాయిగా ఉండాలంటే పావని లాంటి చక్కటి పిల్ల కావాలీ అని తల్లి చెప్పిందంటారు!

పుష్యం: పణి గారు చెప్పినట్టు పోతన ఛాయలు వెదికినా కనబడవు 🙂

రాకేశ్వరుఁడు: పుష్యం – ఈ మామ్ ఎవరో చాలా కూల్ మామ్ లా వుందే 🙂

రవి: శ్యాం గారు, కట్నమెంతిస్తారటండీ?

సనత్ కుమార్: ఆ అమ్మాయి మరి పాయింటు బ్లాంకులో గన్నెట్టి మరీ ఫోను చేయించి ఉంటుంది…

రాకేశ్వరుఁడు: 🙂

పుష్యం: లావు లేకపోటే కట్నం తగ్గించొచ్చండి, ఈ రోజుల్లో 🙂

ఫణి: జీతములో చేదోడవకుండా ఉంటే చాలు.

కొత్తపాళీ: సనత్ గారూ, మీ పూరణ

సనత్ కుమార్:

సనత్ శ్రీపతి చెప్పిన ఈ పద్యం ఆయన స్వరంలోనే

‘లా’ వొక్కింతయు లేదుట !

గావగ పోలీసు, కోర్టు, కనమాఫ్ఘనిలో !

చేవని చూపి లగెత్తెద

మావల బలుసాకు తినెద మాయువు నొందన్ !!

రాఘవ: ఆఫ్ఘనిలో భలే బాగుందండీ ఈ ప్రయోగం

సనత్ కుమార్: ఆప్ఘనిస్తాన్లో మనవాళ్ళ కష్టాలు…

విశ్వామిత్ర: మొదటి పాదం చూసి ఇంటి సంగతి అనుకున్నా.., కాదు రచ్చ గురించి అన్నమాట

ఫణి: పోతనగారికి ఆంగ్లం రాదు కదండీ

కొత్తపాళీ: అంతేకాక, బతికుంటే బలుసాకు తినొచ్చు అనే చక్కటి తెలుగు నుడికారం కూడా

రాకేశ్వరుఁడు: గని అనాలా ఘని అనాలా?

రాఘవ: గని

గిరి: పలు సాకులు చెప్పి అఫ్గాన్లో బలగాన్ని పెంచుతున్న అమెరికన్లు మాత్రం కాదు

కామేశ్వరరావు: “లగెత్తడం” కూడా 🙂

రాఘవ: 🙂

పుష్యం: ఇందాక గడ్డి తినమన్నారు, ఇప్పుడు బలుసాకు.. ఎవరిక్కి ఇంట్లో సరిగా తిండి దొరుకుతున్నట్టు లేదు 🙂

రాకేశ్వరుఁడు: ఇవాళంతా గడ్డి ఆకూ పెడుతున్నారన్నమాట

సనత్ కుమార్: మరే బతికుంటే బలుసాకు కదా.. లగెత్తుదాం… అని

విశ్వామిత్ర: శాకాహారం – సాత్వికం ఆరోగ్యప్రదం

కామేశ్వరరావు: ఇందాకే ఎవరో శనివారం అన్నారు కదా, అందుకే గడ్డీ ఆకులే ఇవాళ ఆహారం 🙂

కొత్తపాళీ: పుష్యం .. కాదులే .. అందరికీ లావులు పెరిగి, డయెటింగు

రాకేశ్వరుఁడు: కొందరికి ఆ బలుసాకు భాగ్యం కూడా వుండదండి। పులావొక్కింతా లేదు అనుకుంటూ…

విశ్వామిత్ర: అదేదో డిలైట్ అని ఈ మధ్య కొనుక్కొని కూడా తింటున్నారు జనులు

కొత్తపాళీ: ఇదే సమస్యకి గిరిధర్ పూర్తిగా వేరే యెత్తు యెత్తారు .. గిరిధర్, మీ పూరణ

గిరి: ఇదిగో

గిరిధర్ సమర్పించిన ఈ పద్యాన్ని ఆయన స్వరంలోనే వినండి

“లావొక్కింతయులేదు, డస్సితిని, వెళ్ళాలింటికే, తిండికే…”

“ఏవోఁయ్ కాస్త తినేందుకేమి పెడతావ్?” “ఏ రొట్టెలో పెట్టి చె

ట్నీవేస్తే సరిపోను మీ కనుకొనే, నే నట్లు పిట్లా పడే

స్తే, వీళ్ళందరు వేడి చల్లబడకే జిర్రంచు జుర్రేయ, పి

ట్లావొక్కింతయు లేదు రొట్టెలును గుల్లై పోయె స్వామీ” “ఉసూర్”

(పిట్లా అంటే సెనగపిండితో చేసే పచ్చడి-సం)

గిరి: భార్యాభర్తల మాటలు

రాకేశ్వరుఁడు: ఉసూర్ – రోజువారీ ఉసూరా లేదా

కామేశ్వరరావు: వ్యావహారిక పద్య ధురంధరా, గిరిధరా! భళి భళీ!

రాకేశ్వరుఁడు: స్వానుభవము కాకపోతే చాలుఁ

రాఘవ: ఇంత వ్యావహారికభాషలోనా! :O

గిరి: నల వారీ ఉసూర్

విశ్వామిత్ర: “ఉసూర్” అనిపించటం వారికి అలవాటే, రుచిగా చేసైనా, చేయకైనా

రాకేశ్వరుఁడు: అంటే రోజూ ఉసూరు మనిపించరుగా సతీమణి అని అంతే…

రాఘవ: గిరిగారూ, అబ్బురపఱచడం అంటే ఇదేనేమో!

రాఘవ: భలే

కొత్తపాళీ: రాఘవ .. హ హ హా. ఆయన ఏ హిందీలోనో, ఇంకా సింగపూరు భాషలోనో రాయలేదు సంతోషించండీ

రాఘవ: కొత్తపాళీవారూ, మఱే! నిజమేనండోయ్… అంత గడుసువాడే ఈ గిరిధరుడు.

మురళి: లావొక్కింతయులేదుతో మొదలవ్వలేమో గిరిధర్ గారూ!

విశ్వామిత్ర: ఆద్యంతమ్ములేకమై ఆట్లు ఆరగిస్తూంటే మురళి గారు… అడ్డు తగలకండి

ఫణి: పద్యంలాగా కూడా అస్సలు లేకుండా రాశారు. పోతన వరకూ పోకుండా. భాగుంది.

గిరి: ధన్యవాదాలు, ఫణీ నిజమే 🙂

రాకేశ్వరుఁడు: కొన్ని రోజులు పోతే మలాయి చైనీసు పద్యాలు వ్రాస్తారేమో

(గిరధర కవి ప్రస్తుత నివాసం సింగపూరు -సం)

కామేశ్వరరావు: అదీ ఏ కందంలోనో అయితే సులువే, ఇలా శార్దూలంలో వ్రాయడమింకా అద్భుతం!

సనత్ కుమార్: ఇప్పటికే రాస్తున్నారేమో.. మనకర్ధం కాదు కదా అని ఇక్కడ చెప్పకపోతూ ఉండవచ్చు కదా

విశ్వామిత్ర: తమిళ పద్యాలు నే జూశాను – గిరిగారివి

గిరి: వివేవారుంటే ఎవరైనా చెప్పవచ్చు 🙂

……………..

చదువరి: కామేశ్వరరావు గారూ.. లావు + ఒకింత = లావొకింత ఏ సంధి అవుతుందండి?

రాకేశ్వరుఁడు: హహ। కన్నడిగులు ఈ అకారోకరేకార సంధులకు చక్కగా క్లుప్తంగా లోపసంధి అని పేరు పెట్టారు. అచ్చునకచ్చు పరమైన మొదటిది లోపిస్తుంది – సింపుల్. ఉదా – ఌ + ౠ = ౠ

కామేశ్వరరావు: “చలం” సంధి అవుతుంది 🙂 అవునండి. “ఒ”కారానికి “వొ”కారాన్ని ఎక్కువగా ప్రయోగంలోకి తెచ్చింది చలమే!

రాకేశ్వరుఁడు: ఈ పాయింటు కూడా గుర్తు పెట్టుకోండి – అయితే కామేశ్వర రావు గారు – వ కి రాక్షసికొండి పెట్టిరిలో కొ కి యతి చెల్లుతుందన్నమాట

సనత్ కుమార్: అయినా విడ్డూరం కాకపోతే లావు ఒకింత ఎక్కడైనా ఉంటుందా? ఉంటే లావు, లేకపోతే సన్నం అంతే కానీ … 😉

పుష్యం: @సనత్: ‘ఒకింత’ లావు చూడాలంటే నడుము దగ్గర తడుముకోండి.. 🙂

సనత్ కుమార్: నాదా… మీరు మరీను…

గిరి: సనత్ 🙂 ఒకింత కూడ లేకపోవడం ఉంటుంది – జీరోసైజని ఇందాక రాఘవ చెప్పినది అదే

రాకేశ్వరుఁడు: గిరి – జీరోసైజంటే వ్యాకరణభేదమా – ధన్యుడను – అర్థమవ్వక చచ్చాను

కామేశ్వరరావు: రాకేశ్వరుఁడు:🙂

రాకేశ్వరుఁడు: కామేశంగారు, 🙂 అంటే సరిపోదు। అమీ తుమీ తేల్చండి – నేను ప్రయోగింపబోతున్నాను।

విశ్వామిత్ర: @రాకేశ్వరుండు అమీ తుమీ తేల్చాలంటే కోల్కతా వెళ్లాలి

కామేశ్వరరావు: రాక్షసికి “కొండి” పెట్టకూడదు 🙂

రాకేశ్వరుఁడు: పెట్టకూడదా .. నేనొప్పుకోను – చలం సంధి అని మీరే చెప్పారు !!!

పుష్యం: ఇష్టా గోష్టి అన్నారుకదా, మనం ఇష్టంవచ్చినట్టు గోష్ఠి లోకి దిగుతున్నట్టున్నాము 🙂

రాకేశ్వరుఁడు: అర్థమయ్యింది – రాక్షసి కొండి పెట్టవచ్చు కాని రాక్షసికి కొండి పెట్టకూడదన్నమట

కామేశ్వరరావు: మీరు చలాన్ని తిరగేస్తానంటే ఎలా? 🙂

కామేశ్వరరావు: అతను “ఒ” ని “వ” చేస్తే మీరు “వ” ని “ఒ” చేస్తారా!

రాకేశ్వరుఁడు: అది చలమ సంధి అయితే ఇది అచలమసంధి 🙂

గిరి: రాకేశా, దాన్ని లంచ సంధ అనవచ్చు

విశ్వామిత్ర: కాస్త “లంచ” మి స్తే చలం ని కూడా తిరగేయవచ్చు

గిరి: లంచ సంధి అనవచ్చు – చలం ని తిరగేసి

రాకేశ్వరుఁడు: తమిళ లంచా తెలుగు లంచా? –

రాఘవ: ఇంగ్లీషు లంచి

సనత్ కుమార్: తిరగేస్తానంటే ఎలా ఏముంది? లంచమే గా .. 😉 ఇంగ్లీషు లంచు …

కొత్తపాళీ: ఇంకా నయం, పరుషాన్ని సరళం చేశారు కాదు,

గిరి: తమిళంలో పరుషాలకీ, సరళాలకీ తేడా లేదు

గిరి: అలా చూస్తే సంధి పేరులో తేడాలొస్తాయి

విశ్వామిత్ర: సనత్ గారూ యత్ భావం తత్ భవతి – లావు అంటే ఇష్టమైన వాళ్లు అయ్యొ లావు లేదే అనుకుంటారు .. సన్నం అంతే ఇష్టమైన వాళ్లు సన్నమె అనుకుంటారు

రాఘవ: ఔనూ, జీరోసైజుకూ వ్యాకరణానికీ ముడి పెట్టారేమండీ

రాకేశ్వరుఁడు: చక్కనమ్మ సిక్కినా అందమేనట

రాకేశ్వరుఁడు: లావొక్కింతయూ లేదా రాఘవా ?

ఫణి: ఇక్కడ ఇష్టాగోష్టీ మా లావుగా జరుగుతోందండీ.

కొత్తపాళీ:: ఫణి గారూ, మీ లావొక్కింత పద్యం కూడా చెప్పండి

ఫణి:: తప్పకుండా నండీ.

లావొక్కింతయు లేదు వేళ్ళ కొనలన్ లాస్యంబుగా పట్టగా

సావొచ్చే పనియౌను దట్టపు పొగల్ సర్దాగ సృష్టింపగా

రావే కమ్మని కైపులెంత కసిగా లాగించి నే పీల్చినా?

పోవో! ఈ సిగరెట్టు ఎందు సరిపోబోదోయి నా చుట్టతో

కొత్తపాళీ:: ha ha ha.

చదువరి:: హ హా.. భలే!

రవి:: హ్హహ్హహ్హా..

సనత్ కుమార్:: భలే..

శ్రీరామ్:: హ హ హ హా

రవి:: బ్రాండు మార్చి చూడండి

మురళి:: ఫణీ ఈ చుట్టలతో చుట్టరికం ఎప్పట్నుంచీ?:)

ఫణి:: (పొగ తాగి ఎరుగను. అది వేరే సంగతి లెండి)

కొత్తపాళీ:: లంక ఇంటి పేరిటి వాడు గిరిధర్ కే తట్ట లేదు

కామేశ్వరరావు:: “పోవో” చాలా బాగుంది!

పుష్యం:: భలే!!

గిరి:: 🙂

విశ్వామిత్ర:: భలే!!

ఫణి:: నెనర్లు

కొత్తపాళీ:: పొగ చుట్టలెన్ని యైనను సిగరెట్టుకి సాటి రావు అన్నాడు శ్రీశ్రీ – మీరు దాన్ని పూర్వపక్షం చేశారు

కామేశ్వరరావు:: కొత్తపాళీగారు బాగా చెప్పారు!

చంద్రమోహన్:: సావొచ్చే … చావొచ్చే అంటే బాగుంటుందేమో

రాకేశ్వరుఁడు:: ఏదేమైతేనేం – పొగతాగక దున్న పోతవ్వకపోతే చాలు

ఫణి:: పోతన గారికి దూరంగా..

రాకేశ్వరుఁడు:: మా పొగాకు ధర బాగుంటే చాలుఁ

…………………………………

కొత్తపాళీ: మరొక్క సమస్య .. కుసుమములెల్ల జిత్తమున కోరికలై మురిపాలు గ్రోలగా

కొత్తపాళీ: దీనికి శ్రీరాముడొక్కడే పూరణ పంపాడు, కానియ్యి శ్రీరామా

శ్రీరామ్: చిత్తం

వెసబడినట్టి జీవికను వేసవిరేయిని చల్లగాలిలా

విసుగును దీర్చు కావ్యసభ వీనులవిందున నాదు భావనా

కుసుమములెల్ల జిత్తమున కోరికలై మురిపాలు గ్రోలగా

ముసుగునుదీసి మత్కలము ముందుకుసాగెను నేటి రాతిరిన్!

చదువరి: ఓహో ఆ విధంగా మళ్ళీ మన లోకంలోకి వచ్చారన్నమాట!

కొత్తపాళీ: శ్రీరాముడు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ప్రవాసమున్నాడు, అందుకని ఇది వేసవి రేయి అయింది

రాకేశ్వరుఁడు: శ్రీరాంగారు బ్రిసుబేను బాగుందా?

విశ్వామిత్ర: మళ్లీ శ్రీకారం జుట్టారు .. సంతోషం

కామేశ్వరరావు: ఆహా వేసవి రేయిలో చల్లగాలిలాగే హాయిగా ఉంది మీ పద్యం!

రవి: ఇక్కడ ఇండియాలో కూడా వేసవి లానే ఉంది లెండి.

శ్రీరామ్: నెనర్లు

రాఘవ: చక్కగా హాయిగా కుసుమ గంధంలాగ బాగుందండీ.

పుష్యం: శ్రీరాముని దయచేతను – శ్రీరాముడు ముసుగుతీసి శీఘ్రమె వ్రాసెన్

ఫణి: పద్య ధారా ప్రవాహం బాగుంది.

రాఘవ: పు.శ్యాం.గారూ, భలే

గిరి: శ్రీరామా, బావుంది పూరణ

కామేశ్వరరావు: జోరైన మంచి పద్యము

శ్రీరామ్: నెనర్లు
—————————————
పై సమస్యలకు ఇతర పూరణలు కూడా వచ్చాయి. సమయాభావం చేత సభలో ఆ పద్యాలు చదవలేకపోయినప్పటికీ సభాధ్యక్షుడు ఆ పద్యాలను కూడా ప్రచురించేందుకు నిశ్చయించారు. ఆ పూరణలివి:

లావొక్కింతయు లేదు

రవి:
కం.

లావొక్కింతయు లేదిక
ఆవిష్కృతమౌ ఉరమును అంసద్వయమున్
గ్రీవము కంబువు భంగిన్
జీవము సత్వము నొసగెడి జిమ్ముఁ సేయగన్

లంకా రవీంద్ర:
కం.

లావొక్కింతయు లేదు, ప
లావులు పదిప్లేట్లపైనె లాగించినదే!
బావురు మనబోకు పతీ,
ఆవిడ యాకలి కనుగొని ఆలస్యముగా

ఫణి ప్రసన్న కుమార్:
శా.

లావొక్కింతయు లేదు వేళ్ళ కొనలన్ లాస్యంబుగా పట్టగా
సావొచ్చే పనియౌను దట్టపు పొగల్ సర్దాగ సృష్టింపగా
రావే కమ్మని కైపులెంత కసిగా లాగించి నే పీల్చినా?
పోవో! ఈ సిగరెట్టు ఎందు సరిపోబోదోయి నా చుట్టతో

చదువరి:
కం.

లావొక్కింతయు లేదని
యా విరిబాలను వివాహ మాడిన యంతన్
ఆవిరి కుడుము వలె కలికి
లావెక్కిన నేమి మిగులు లావణ్యమునన్

నల్లాన్ చక్రవర్తుల కిరణ్ (నచకి):
శా.

“లా” వొక్కింతయు లేదు, దుంప తెగ, ఈ రాష్ట్రాల కాష్టాలలో
చావొచ్చింది గదా, వినాశమున బేజారైన ఆంధ్రావనిన్
రావచ్చన్న పరిశ్రమల్ మనకు రాం, రామంటు పోతుండగా
భావావేశములెక్కువైనవటగా, భ్రాతృత్వమేమైనదో!?

రాకేశ్వరుడు:
శిఖరిణి.

‘ప’లావొక్కింతా లేదు పెరుగును పాలూ పులుసు లే-
వు లేవే జొన్నల్ లేవు శెనగలు వుప్మా అసలు లే-
దు లేవే పచ్చళ్ళున్ పులుసులును తోడెం చలిది కూ-
టి ‘లేశ్యం’ లేదయ్యో కలదు యొకటే యాకలి హరా

కృష్ణ కొండూరు (ఆత్రేయ బ్లాగరి):
కం.

‘లా ‘ ఒక్కింతయు లేదురు
చావొచ్చి పడినది చూడు చావడి గదిలో
బ్రోవగ కరిగావు హరికి
కావగ తనసతి గతి ఇక కాలము మారెన్ !

(కోర్టుల్లో లా అనేది లేదు, కాసిని కాసులతో పని జరుపుకోవచ్చు అన్న మాట )

రాఘవ:
శా.

లా వొక్కింతయు లేదు శాస్త్రములఁ కల్పాద్యంగముల్ నేర్వగా
శ్రీవేదాన్తమయస్వరూప ధిషణాచేతో೭న్య చిత్సత్ప్రభో
నీవే జ్ఞానము నిచ్చి కావవలెఁ గానీ వేఱుదిక్కున్నదా
నీవే నేనను భావమున్ నిలుపవే నిష్కర్షగాఁ బుద్ధిలోన్

సందీప్:
శా.

“లా”వొక్కింతయు లేదు, నాయకులు వేలం వేసె రాజ్యాన్ని హా!
“మావాడొక్కడు బాగుగున్న, మిగతా వారెట్లు పోతేను యేఁ?”
ఈవాదంబును నమ్మినట్టి బుధులున్, దేశాన్ని ముం”చెత్తగా”
సేవాదృక్పథమేది పౌరులకు? దూషించేటి ప్రాఙాళికిన్!

గరికయొ గడ్డియో మెసవి గైకొనవచ్చు గవిత్వ సంపదల్
నచకి:
చం.

సిరులవి యెన్నియో గలిగి, చెప్పగ గొప్ప చరిత్ర యుండియున్
వరుసగ శత్రువర్గములు వచ్చిట నచ్చినవన్ని దోచగా
విరసుల పాదఘట్టనల బీడయె సాహితి, నేటికిచ్చటన్
గరికయొ గడ్డియో మెసవి గైకొనవచ్చు గవిత్వ సంపదల్

About రానారె

యర్రపురెడ్డి రామనాధరెడ్డి.. రానారె! తెలుగు బ్లాగరుల్లో ఈ పేరు తెలియనివారు బహు తక్కువ మంది ఉంటారు. రాయలసీమ మాండలికంలో రానారె రాసే బ్లాగు వ్యాసాలు బ్లాగు పాఠకులను ఎంతో అలరిస్తూ ఉంటాయి. తన చిన్ననాటి విశేషాలను ప్రవహించే భాషలో అలవోకగా మన కళ్ళ ముందుంచుతాడు రానారె. లబ్ద ప్రతిష్టులైన రచయితల రచనలకు ఏమాత్రం తీసిపోవు, ఈ సాఫ్టువేరు నిపుణుడి జ్ఞాపకాలు.
This entry was posted in కవిత్వం and tagged , . Bookmark the permalink.

2 Responses to వికృతి ఉగాది పద్యకవితా సదస్సు – రెండవ భాగం

  1. vasu says:

    అద్భుతంగా ఉంది. వచ్చే ఏడాది కి ఎలాగైనా నేను పాల్గొనాలనిపిస్తోంది (కనీసం ప్రేక్షకుడి గా నైనా). మా చింతా రామకృష్ణ మాష్టారు కూడా ప్రత్యక్షంగా ఉంటే ఇంకా బావుండేది.ఇష్టా గోష్టి లో కూడా ఇంకా బోలెడు ఆశు పద్యాలు దొర్లేవి.

    అద్భుతంగా నిర్వహించారు. పొద్దు, కొత్తపాళీ గారికి ప్రత్యెక అభినందనలు. ఇంత అందంగా పద్యాలు అల్లిన కవి పుంగవులకి పేరు పేరునా కృతఙ్ఞతలు.

  2. శిఖరిణిలో రెండు తప్పులు-
    ‘ప’లావొక్కింతా లేదు పెరుగును పాలూ పులుసు లే-
    వు లేవే జొన్నల్ లేవు శెనగలు వుప్మా అసలు లే-
    దు లేవే పచ్చళ్ళున్ పులుసులును తోడెం చలిది కూ-
    టి ‘లేశ్యం’ లేదయ్యో కలదు యొకటే యాకలి హరా

Comments are closed.