-సిముర్గ్
అక్కిరాజు భట్టిప్రోలు మంచి కథకుడుగా తెలుగు సాహితీలోకానికి సుపరిచితులు. ఏడాదికో కథకి మించి రాయకపోవడానికి తన బద్ధకమే కారణమని అంటారుగాని, కథలు రాయడం అంత తేలికకాదని గుర్తెరిగినవారు. అంటుకొమ్మ, నందిని, గేటెడ్ కమ్యూనిటీ కథలతో, మనకున్న కొద్దిమంది సమకాలీన ‘మంచి కథకుల’ లిస్టులో చేరిపోయిన అక్కిరాజు లేటెస్టు కథ “రమాదేవి ఎందుకు రమ్మంది” ఆంధ్రజ్యోతిలో 2007, నవంబరు 4 న అచ్చైంది. ఈ కథను ఆయన బ్లాగులో కూడా చదవొచ్చు.
(జాలపత్రికలో ప్రచురితమైన రచనలను యధాతథంగా తిరిగి ప్రచురించుకొన్నా – ప్రింటు పత్రికలు ఆ సంగతిని చాపకింద నీరులానే ఉంచుతాయి. ’జాలంలో వచ్చినవాటిని ప్రచురించినా మేం వాటికి ‘క్రెడిట్’ ఇవ్వం’ అన్నారు కూడా ఓసారి. కానీ, ఆ నామోషీలు మాకులేవు. మొదట ప్రచురించిన పత్రికకే ‘ఎడిటోరియల్ క్రెడిట్’ దక్కుతుందనేదే పత్రికా సంప్రదాయం. ఆ లింకు ఇది: http://www.andhrajyothy.com/sunday/sundayshow.asp?qry=2007/4-11/story. జ్యోతిలో వచ్చిన ఈ కథ లింకు అదృష్టవశాత్తూ ఇంకా జాలంలో ఉంది.)
“అక్కిరాజు కథ నడపటంలో చాలా మెచ్యూరిటీ చూపించాడు, కాని కథావస్తువే ఛీపుగా ఉంద”న్న వారు కొంతమందైతే, “ఆఁ – ఉత్త బూతుకథే” అని తేల్చిపారేసిన వారున్నారు. “ఇట్లాంటి కథల అవసరం మనకెంతో ఉంది”అని ఆకాశానికెత్తినవారు కూడా లేకపోలేదు.
ఈ కథ వెనుక మరో కథ ఉంది.
రమారమి మూడేళ్ల క్రితం, కొంతమంది మిత్రులకి అక్కిరాజు “చదివి ఎలా ఉందో చెప్పండం”టూ ఓ కథ పంపారు, అదే ‘రమాదేవి ఎందుకు రమ్మంది‘ కథకి మొదటి ప్రతి. ఆనాటి మొదటి ప్రతికి, ఆర్నెల్ల తర్వాత అచ్చైన కథకీ శిల్పంలోనూ కథనంలోనూ కొన్ని మౌలికమైన తేడాలున్నాయి. అచ్చైన కథ చదివి, “బంగారంలాటి కథని తగలెట్టావు” అంటూ మొదటిప్రతిని చదివిన మిత్రులు కొందరు అక్కిరాజుకి తలంటారు. ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథలో, రచయిత రమాదేవి తరఫునుంచీ కూడా ఈ కథని చెప్పారు. మొదటిప్రతిలో ఆ రమాదేవి ప్రసక్తి పెద్దగా ఉండదు. ఆవిడో ‘షాడో’ కారెక్టరు అందులో. ఆవిడ రాజారావుని పిలవడానికి కానీ, రాజారావులాంటి మెతక సన్నాసిని దగ్గరకి తీయటానికిగానీ వెనక ఉన్న కారణాలేవీ (అసలంటూ ఉంటే!) రచయిత మొదటిప్రతిలో చూపించే ప్రయత్నం చెయ్యలేదు. ఎందుకంటే, అసలు రమాదేవి అన్న పాత్ర ఈ కథకి పూర్తిగా అనవసరం. ఈ కథంతా మధ్యతరగతి మొగాడికి ప్రతీకైన రాజారావు ఫాంటసీ. రమాదేవి తన కూతురి పెళ్ళికి రమ్మని పిలిచినా ఈ కథకి వచ్చిన నష్టం ఏమీ ఉండదు. ఈ అనవసరమైన గొడవతో పాఠకుడిని పట్టి కుదపాల్సిన ట్రాజెడీ కాస్తా ‘ఓ సరసమైనకథ’గా నీరుకారిపోయిందనేది నాలాటి వాళ్ల బాధ.
జ్యోతిలో ప్రచురించిన కథేగనుక నా చేతుల్లో పడుంటే, కథ శీర్షికని కొటేషన్లలో పెట్టి, కథలోంచి రమాదేవి వైపునుంచీ చెప్పినదంతా కత్తిరించి ఉండేవాడిని. ఆ అవసరంలేకుండా, అక్కిరాజు తన “రమాదేవి ఎందుకు రమ్మంది” కథకి మొదటిప్రతిని మాకిచ్చారు. ఇప్పుడు పొద్దులో పునఃప్రచురించిన “రమాదేవి ఎందుకు రమ్మంది?” (Author’s Cut)’ ఆ మొదటి ప్రతే.
“గోడమీద తుపాకీ ఉందని చెప్తే, కథ అయ్యేలోగా ఆ తుపాకీ పేలాలి” అంటాడు ప్రఖ్యాత కథారచయిత చెకోవ్. కథలో ఉండాల్సిన క్లుప్తత గురించో లేక అనవసరమైన వర్ణనల గురించో ఆయన ఆ మాట అనుండొచ్చుగాక. అచ్చులో వచ్చిన ఈ కథలో అనవసరమైన కథనం వల్ల పేలాల్సిన తుపాకీ కాస్తా పేలలేదేమో అనేది నా సందేహం.
అదీగాక, పొలిటికల్ కరెక్ట్‍నెస్ అనో, మరేదో చెత్తా చెదారమనో -ధైర్యంగా చెప్పదలచుకొన్నది చెప్పలేనివారు, తమ పెన్నులకి క్యాపులు బిగించుకోవడమో, బూట్లు మేకుకి వేలాడదీసుకోవడమో మంచిది.
చెకోవ్‌ని వదిలి మరికాస్త ముందుకెళ్లాల్సిన సమయమూ వచ్చిందేమో. మొన్నీమధ్య టి.వి.లో ప్రసారం చేసిన ఓ తెలుగు సినిమా పతాక సన్నివేశంలో కథానాయిక ఆత్మహత్యాప్రయత్నం చేస్తుంది. చివరి నిమిషంలో ఆమెని ఆస్పత్రిలో జాయిన్ చేస్తారు. యధావిధిగా ఆపరేషన్ థియేటర్ తలుపు పైన ఎర్రలైటు వెలుగుతూ ఉంటుంది. బయట ఆవిడ తల్లిని ఊరడిస్తూ ఉంటాడు హీరోయిన్‍కి కాబోయే మావగారు – “ఏం కాదు, నీ మంచితనం, దాని అమాయకత్వం దాన్ని కాపాడతాయి, భగవంతుడు ఉన్నాడు” లాంటి రొడ్డకొట్టుడు డైలాగులతో. “లోపలున్నది హీరోయిన్, ఆమె చచ్చిపోతే మన సినిమా హిట్టవదు, అందుకని మరీ అంతలా ఏడవకు అంటే బావుటుంది కదా” అంది ఆ సినిమా చూస్తున్న ఓ స్నేహితురాలు. ఇదెందుకు ఉటంకించాల్సి వచ్చిందంటే – పాఠకులు ఇప్పటికే చాలా కథలు చదివారు, అందులో కాకరకాయలో, కీకరకాయలో కోసుకుని కూరొండుకు తిన్నారు – ఈ కథల గురించీ, సమాజం గురించీ వాళ్ళకి అంతో ఇంతో, ఆ మాటకొస్తే మనకంటే బాగానే తెలుసు. చాలా కథల్లో తుపాకీ ఎప్పుడు పేలుతుందో, ఎవరిమీద పేలుతుందో, పేలాక ఏమవుతుందో వారికి వారే ఎంచగ్గా ఊహించుకోగలరు. అందుకని, ఆ తుపాకీ ఇంతకు ముందోసారి పేలితే, మళ్ళీ పేల్చాల్సిన అవసరం లేదు. అందుకే, ’మంచి రచయిత కావాలంటే ముందుగా మంచి పాఠకుడు కావాలి’ అంటారు కారామాస్టారు.
పాఠకుల తెలివితేటలపై, వారి అనుభవంపై, వారి సాహిత్య, ప్రపంచ జ్ఞానంపై నమ్మకంలేని రచయితలు కాని, వారి రచనలుకాని నాలుగు కాలాల పాటు బతికి బట్టకట్టలేవు. “ఇక్కడ మీరో ఐదు నిమిషాలు ఏడవండి, ఇక్కడో పది నిమిషాలు నవ్వండి. ఇక్కడ నొచ్చుకోకపోతే మీరు ఇంకా ఎదగాల్సిన అవసరం చాలా ఉంది” అని పాత్రల పేరుతో పాఠాలు చెప్పే ఉపన్యాసకుల సంఖ్య ఇప్పుడు ఎక్కువగానే ఉంది. ఎవరైనా అమాయకంగా – “అబ్బే, అక్కడ నాకు ఏడుపురాలేదండీ – ఏడవాల్సిన అవసరం కూడా కనిపించలేదు” అంటే పాఠకుల అవగాహనా రాహిత్యాన్ని ఎద్దేవా చెయ్యడమూ సరికొత్త సంప్రదాయంలానే ఉంది.
“I have all the ingredients, I have the necessary tools. I even have the recipe and I know how to bake my own bread. All I need from you – my dear author – is the Yeast so that I can make the dough” అని అరవాలనుంటుంది ఓ పాఠకుడిగా. Concealment is the art అన్న చాసోకి ఈ సంగతి బాగా తెలుసు.
ఈ పైకారణాలవల్ల, నాకు మొదట చదివిన “రమాదేవి ఎందుకు రమ్మంది?” నచ్చింది. రచయిత కూడా తను వెనక్కి తిరిగి చూసుకొంటే — తను మొదటరాసిన కథే తను చెప్పదలచుకొన్న అసలైన కథ అనుకోవడం ఈ కథని ఇప్పుడు తిరిగి తోడ్డానికి మొదటి కారణం. “ఓ కథరాసి దాన్ని బయటకి పంపేసాక, సత్తా ఉంటే దాని బతుకేదో అది బతుకుతుంది, కరువైతే దాని ఖర్మ – అంతేకాని, స్కాలర్-షిప్పెక్కి దానివెంట రచయిత వెళ్లకూడదు” అంటాడు అక్కిరాజు. అందుకే, తన కథలపై ఆయనెప్పుడూ మాట్లాడలేదు. కానీ, ఈ కథ ఎందుకు రాసాడో ఆయన కథవెనుక కథ అని పొద్దుకోసం రాసిన ఓ ప్రత్యేక వ్యాసంలో చెప్పాడు. ఆ వ్యాసం ప్రచురిస్తూ, అవకాశం వచ్చింది కాబట్టి – ఈ కథకి రచయిత నిజాయితీగా రాసుకొన్న మొదటి ప్రతిని కూడా తెరకెక్కిద్దాం అనేది రెండో కారణం.
కథాశిల్పం గురించి జాలంలో అడపాదడపా చర్చలు జరుగుతున్నాయి. బహుశా దీనికి కారణం ఇక్కడ అధికశాతం వర్ధమానులు, చాలామంది దిన దిన ప్రవర్ధమానులు, కొద్దిమంది తలపండిన ప్రసిద్ధులూ అయిన రచయితలే కావడం అయ్యిండవచ్చు. ఒక మంచి రచయిత చేతుల్లోంచి వచ్చిన ఒకే కథకి ఉన్న రెండు రూపాలు దొరకటం కథాశిల్పం, కథనం వంటి వాటిపై ఆసక్తి ఉన్న వారికి ఉపయోగపడవచ్చనే గంపెడాశ ఈ కథకున్న మరో రూపాన్ని బయటకి తేవడానికున్న మూడోకారణం. దాంతోపాటు, రచయిత ఈ కథ ఎందుకు రాసాడో కూడా చెప్పటం వల్ల – ఈ కథకున్న రెండు ప్రతుల్లోనూ, ఏది రచయిత సాధించాలనుకొన్నదానికి దగ్గరగా వచ్చిందో తులనాత్మకంగా ఎవరికి వారే బేరీజు వేసుకొనే అవకాశం ఉంది కదా?
ఇహపోతే.. నాబోటివాడి IMHOలకి విలువెంత? మెచ్చినవారికి మరుమల్లె పువ్వంత, గుచ్చితే గులాబీ ముల్లంత. కాళీపట్నం రామారావుగారు కథలు ఎలా రాయాలో వివరిస్తూ కొన్ని చక్కని వ్యాసాలు రాసారు, ఇప్పుడు చక్కటి, చిక్కటి కథలు రాయడం నేర్చుకోగోరేవారికి అవి అమూల్యమైనవి. వీటిని కూడా వీలువెంబడి పొద్దులో ప్రచురిస్తాం.
****
ఈ అంశానికి సంబంధించిన లింకులు:
- “రమాదేవి ఎందుకు రమ్మంది?” (Author’s Cut)
- రమాదేవి ఎందుకు రమ్మంది? – కథ వెనుక కథ
- ఆంధ్రజ్యోతిలో ప్రచురింపబడ్డ కథ
- అదే కథ అక్కిరాజు గారి బ్లాగులో
- గోడమీద తుపాకీపై రచ్చబండలో చర్చ
- వికీపీడియాలో చెకోవ్ తుపాకీ
- రచయిత, సంపాదకుడు -వీరిద్దరి సంబంధంపై నిడదవోలు మాలతి గారి బ్లాగులో జరిగిన చర్చ
- కథావిమర్శపై నిడదవోలు మాలతి, కల్పనా రెంటాల పుస్తకం.నెట్‍లో జరిపిన చర్చ మొదటి భాగం
- కథావిమర్శపై నిడదవోలు మాలతి, కల్పనా రెంటాల పుస్తకం.నెట్‍లో జరిపిన చర్చ రెండవ భాగం
రెండు వెర్షన్సూ చదివాక , మొదటి ప్రతితో పోలిస్తే అచ్చైన కథలో శిల్పం , కళాత్మకత దారుణంగా కొల్లగొట్టబడ్డాయనిపించింది. ఏమైనా మొదటి ప్రతి ఇలా వెలుగు చూడ్డం “పొద్దు” పేరుని సార్ధకం చేసినట్టైంది. సిముర్గ్ గారికీ , పొద్దుకీ అభినందనలు.
అక్కిరాజు గారు మరిన్ని మంచి కథలు రాయాలని ఆశిస్తూ..
— సుబ్రహ్మణ్యం.
మొదటి వెర్షను కథ గురించి సిముర్గ్ గారు హామీ ఇచ్చారు కాబట్టి సరిపోయింది, లేకపోతే అక్కిరాజుగారి బ్లాగులో మెహెర్ గారు పెట్టిన వ్యాఖ్య చూసి కథని తిరగరాసారని కచ్చితంగా అనుకునేవాణ్ణి. 🙂 హాసికాలు పక్కనబెడితే, మొదటి వెర్షనే నాక్కూడా బాగుందనిపించింది. అసలు దాన్నలా ఉంచకుండా ఎందుకు మార్పు చేసారో? రమాదేవి గురించి పాఠకులు ఏదో “పవిత్రంగా” ఊహించేసుకుంటారేమోనన్న అనుమానం వచ్చి అలా చేసారేమో!
కథ కన్నా కూడా కథ వెనుక కథ పవర్ఫుల్ గా ఉంది. అందులో కనిపించిన రచయిత కసి, ఫోర్సు కథలో నాకు కనబడ లేదు. అది నన్ను ఆలోచింపచేసినంతగా కథ చెయ్యలేదు.
I agree.
By the way, you need to write more 🙂
ఈ కథని దాదాపు రెండున్నరేళ్ళ క్రితం చదివిన పాఠకుల్లో నేనూ ఒకరిని. రచయితకి ప్రేరణ యేమిటాని కాస్త ఆలోచించి తోచక వదిలేసాను. ఇన్ని వివరాలు ఇచ్చినందుకు థాంక్స్. ఇంకా సందేహాలు మిగిలే వున్నాయి. మంచి పాఠకులు కోవలో లేనిదాన్ని కనుక 🙂 అవి సహజం తప్పా అక్కిరాజు గారు, మీరు ఇచ్చిన సమాచారం చాలక కాదు.
కథాశిల్పం, కథనం వంటి వాటిపై ఆసక్తి ఉన్న వారితో పాటు అసలు ఓ, న, మా, లు తెలియని [నాకు/నా వంటి] వారికి కాళీపట్నం రామారావుగారు కథలు ఎలా రాయాలో వివరిస్తూ రాసిన వ్యాసాలు వీలుని బట్టి ఇవ్వగలరు.
Hmm..Interesting. నేనింకా కథ రెండు వర్షన్లూ చదవలేదు. ఇక్కడితో మొదలుపెడుతున్నా 🙂
I second kottapali garu 🙂
కథలింకా చదవాలి.. మీరు కథలకిచ్చిన ఉపోద్ఘాతం చాలా బాగుంది. కథ చదవాలన్న కాంక్షని రేకెత్తించింది.