-అక్కిరాజుభట్టిప్రోలు
“రమాదేవి ఎందుకు రమ్మంది?”
మరోసారి అలోచనలోకి జారిపోబోయాడు రాజారావు. ఇప్పటికి ఎన్నిసార్లు ఈ ప్రశ్నకి సమాధానం వెతుక్కున్నాడో తనకే తెలీదు. సికిందరాబాదు ఇంకో పావుగంట దూరంలోకి వచ్చేసింది. కంపార్ట్ మెంట్ లో అందరూ మిడిల్ బెర్తులు మడిచేసి, సూట్ కేసులు బయటకు పెట్టి, పిల్లల కాళ్ళకి చెప్పులు లెక్క చూసుకుంటున్నారు. ఈ గొడవలో తన ఆలోచనలు ఇక సాగవని తెలిసి, ఆ ప్రయత్నం మానేశాడు. తన చెప్పులు కూడా వెతికి పట్టుకుని, పక్కనే ఉన్న పాత బ్రీఫ్ కేస్ ని చంటి పిల్లని దగ్గరికి తీసుకున్నట్టుగా దగ్గరికి తీసుకుని బయటకు చూడసాగాడు.
ఎప్పుడో ఏదో గవర్నమెంట్ ఉద్యోగానికి పరీక్ష రాయడానికి వచ్చాడు హైదరాబాదు. మళ్ళీ ఇప్పుడు ఇలా… అయినా…
“రమాదేవి ఎందుకు రమ్మంది ?”
మళ్ళీ ఆలోచనలోకి జారకుండా జాగ్రత్తపడి పక్కనున్న ప్రయాణీకుడితో మాట కలిపాడు. “హైదరాబాద్ లో ఓ మాదిరి హోటల్ రూం ఎంతవుతుంది?”
“సెక్రటేరియట్లో పనయితే లక్డీకా పుల్లో ట్రయ్ జెయ్యండి. హైదరాబాద్ లో ఉండే వాళ్ళకి హైదరాబాద్ హోటల్ రేట్లు ఎట్ల తెలుస్తయ్ సార్. లక్డీకా పుల్లో అన్నిరకాల హోటళ్ళుంటయ్. స్టార్ హోటల్ నుండి చిన్న హోటల్ దాకా”
తనకి అవసరమైన విషయం దొరక్కపోవడంతో ఇక రెట్టించే ఉద్దేశం లేక మిన్నకుండి పోయాడు రాజారావు. రెండు రోజులు హోటల్లో ఏనాడూ గడపలేదు. ఎంతవుతుందో తెలీదు. తెచ్చిన డబ్బులు సరిపోతాయో లేదో అంతకన్నా తెలీదు. ఇంతకు మించితే ఇంట్లో ఏమని చెప్పాలి? రోట్లో తలపెట్టి రోకటి పోటుకు భయపట్టమా? సమాధాన పర్చుకున్నాడు.
రైలు ఆగగానే వెంటనే దిగేశాడు. పెళ్ళాం, పిల్లలూ సామానూ లేకపోతే ఎంత త్వరగా దిగగలిగానా అని ఆశ్చర్యపోయాడు. పిల్లలతో, సామాన్లతో, ఎదురెక్కుతున్న కూలీలలతో అష్టావధానం చేస్తున్న సంసారుల మధ్యనించి కాలేజీ కుర్రాడిలా దిగిపోవటం తనకే తమాషాగా అనిపించింది. తానెప్పట్నించి సంసారి కాకుండా పోయాడా అన్న ఆలోచన అతనికి రాలేదు.
రమాదేవి వస్తున్న రైలు మరో గంట తర్వాత వస్తుంది కరక్ట్ టైంకి వస్తే. తనని ఒకటో నంబరు ప్లాట్ ఫారం మీద మెయిన్ ఎంట్రన్స్ దగ్గర కూర్చుని ఉండమంది. అలవాటు లేని స్టేషన్. మిగతా అందరూ హడావిడిగా నడుస్తుంటే, రాజారావు మాత్రం బెరుకు బెరుగ్గా చూసుకుంటూ ప్లాట్ ఫాం ఒకటి మీదకి చేరాడు. మెయిన్ ఎంట్రన్స్ ఏదో కనిపెట్టి అక్కడే కూర్చున్నాడు. నిజానికి బయటికి వెళ్ళి అర్జంటుగా సిగరెట్ తాగాలని ఉంది. ప్లాట్ ఫాం మీద కాలిస్తే పోలీసులతో గొడవ. దిగకముందే రైల్లో బాత్ రూంలో తాగకపోవటం తప్పు. ప్లాట్ ఫాం నుండి బయటకి వెళ్ళేటప్పుడు టికెట్ తీసేసుకుంటే మళ్ళీ లోపలికి రావటం కష్టం. అన్ని లెక్కలూ వేసుకుని సిగరెట్ తాగడాన్ని ప్రస్తుతానికి విరమించడమే శ్రేయస్కర మనుకున్నాడు.
రమాదేవిని తాను గుర్తు పట్టగలడా ఇప్పుడు? పదిహేనేళ్ళ క్రితం చుడీదారుల్లో చూసిన క్లాస్ మేట్ ని, ముప్పయి అయిదేళ్ళ చీరలోకి అనువదించి మనసులో బొమ్మ వేసుకోవటానికి ప్రయత్నించాడు.
తనకున్న తెలివితేటలకి ఇంజనీరింగ్ లాంటి సీట్లేమీ రావనీ, వచ్చినా చదివించే స్థోమత ఇంట్లో లేదనీ తెలిసి ఆ ప్రయత్నాలేమీ చేయకుండా బుద్ధిగా, విజయవాడలో BSc చదివాడు రాజారావు. ఓ మాదిరి కాలేజీ. కో ఎడ్యుకేషన్. నలభయ్ మందున్న క్లాసులో పది మంది అమ్మాయిలు. అందులో ఒకర్తి రమాదేవి. ఎలా మొదలయిందో తెలీదు. తనేమీ గొప్ప అందగాడూ కాదు, ఆస్తిపరుడూ కాదు, తెలివయిన వాడూ కాదు. అత్తెసరు మార్కులతో పాస్ అవుతూ చెప్పుకోతగ్గ ఏ గొప్ప విషయమూ లేని సర్వసాధారణ మయిన రాజారావుకు రమాదేవి ‘గర్ల్ ప్రెండ్’ అయి కూర్చుంది.
ఎలా మొదలయిందో తెలీదు. రాజారావు దృష్టిలో రమాదేవి చాలా తెలివయింది. అందరి దృష్టిలోనూ ఆమె అందగత్తె కిందేలెక్క. వాళ్ళ నాన్నకి ఎక్కడో నెల్లూరు జిల్లాలో చాలా భూములూ గట్రా ఉన్నాయని కూడా క్లాసందరికీ తెలుసు. అసలు ఆమె నెల్లూరు వదిలి విజయవాడ ఎందుకు వచ్చి, ఆ కాలేజీలోనే ఎందుకు BSc చదవాల్సి వచ్చిందో కూడా రాజారావుకు గుర్తులేదు.
“మీరు లవర్సా” అని అడిగేవారు ఫ్రెండ్స్ రాజారావును. “పెళ్ళి చేసుకుంటారా”, “ఏరా ఎంత దూరం వచ్చావ్… చెయ్యెయ్య నిచ్చిందా?” ఇంకా ఇలా ఎన్నెన్నో…. “తనకి నేనంటే ఇష్టం. నేనే ఏమీ ఆలోచించుకోలా” అని చెప్పేవాడు.
తన సినిమా ఖర్చులకీ, సిగరెట్ ఖర్చులకీ రమాదేవి వుంటం మూలాన డిగ్రీ చదివినంత కాలం రాజారావుకు ఇబ్బంది కలగలా!
ఓసారి ఇద్దరూ కలిసి కూర్చున్నప్పుడు మరో క్లాస్ మేట్ నేరుగా అడిగింది. “ఇంతకీ మీరిద్దరూ ఎప్పుడు పెళ్ళిచేసేసు కుంటారు, ఫైనల్ యియర్ అవంగానేనా?” అని. రాజారావుకు గొంతులో వెలక్కాయ పడింది. రమాదేవి వెకిలిగా, పెద్దగా నవ్వటం మొదలు పెట్టింది. “రాజా.. ఏదో అడుగుతోంది చూడు” అని రెట్టించింది పైగా. తానేమీ మాట్లాడక పోయేసరికి రమాదేవే మాట్లాడింది, నవ్వాపి కాస్త కరుగ్గా… “నీకెందుకే, మేమేం చేస్తే.. నీకు రాజాని చేసుకోవాల్నుంటే అడుగు… నేను పక్కకి వెళ్తా” అని.
నిజానికి రాజారావుకు అడగాలనే ఉండేది. “పెళ్ళిచేసుకుందామా” అని. ఒకవేళ తాను ఒప్పుకున్నా ఆమెని చేసుకునే శక్తి తనకుందా అని మిన్నకుండే వాడు. తనకున్న తెలివితేటలకీ చదువుకీ ఎలా బతుకుతాడో తెలీని తాను రమాదేవి లాంటి అమ్మాయిని భరించగలనా అని సందేహించి ఏనాడూ పెళ్ళి గురించి రమాదేవిని అడిగే సాహసం చేయలేదు రాజారావు.
రమాదేవి ఏనాడూ రాజారావును ప్రేమిస్తున్నానని గానీ పెళ్ళి చేసుకుందామని గానీ అడగలా. అసలామెకి అలాంటి ఆలోచన ఉందో లేదో కూడా తెలీదు రాజారావుకి… ఇప్పటికి కూడా. రమాదేవి ఎప్పటికీ, ఎవ్వరికీ అర్థంకాదు అనుకున్నాడు.
పెళ్ళికాకముందు, అందమయిన అమ్మాయి పక్కనే నడుస్తుంటే ఊరుకునేంత బుద్ధిమంతుడేమీ కాదు రాజారావు. ఓరోజు సినిమాహాల్లో చాలా మామూలుగా చేతిమీద చేయి వేశాడు. రమాదేవి ఏమీ అనలేదు. ఓ వారంలోపు ఎవరూ లేకుండా చూసి కౌగిలించుకునేదాకా వచ్చేశాడు. రమాదేవి ఏమీ అనలా. సినిమాహాల్లో చీకట్లో ఇంకా చాలా దూరం వెళ్ళినా ఏమీ అనలా రమాదేవి. ఎప్పుడు సినిమా కెళ్దామన్నా సరే అనేది. అక్కడికి దాకా వచ్చాక కూడా ఏమీ అనక పోవడంతో “దీనికి ఇంతకుముందే అలవాటుందేమో. జాణ” అని అనుమాన పడేవాడు కూడా ఒక్కోసారి.
ఎక్కడికన్నా రమ్మంటే రాత్రికి కూడా వచ్చేస్తుంది రమాదేవి అని చెప్పేవాడు ఫెండ్స్ కి రాజారావు. “అయితే సీరియస్ కాదా? ఫక్ అండ్ ఫర్గెట్టేనా? లక్కీ నాకొడకా” కుళ్ళుపడేవాళ్ళు స్నేహితులు. కొంత గర్వంగా ఉండేది రాజారావుకి ఇట్లాంటి మాటలు వింటం.
ఆమెని అనుభవించేద్దామని ఎంత తహతహ ఉన్నా సాహసించలేక పోయాడు ఏనాడూ. తానేమి చేసినా కాదనదు. శరీరం స్పందిస్తున్నట్టున్నా ఈమె మనసుకి మాత్రం చీమ కుట్టినట్టుకూడా లేనట్టుందే అని తికమక పడేవాడు. అయినా గీత దాటితే ఏం జరుగుతుందోనని భయం. ఏ భయమూ లేనట్టు రమాదేవి ఉండటం చూస్తే ఒక్కోసారి కోపమొచ్చేది. తను వద్దని వారించవచ్చు కదా అని తనకే అర్థం కాని విసుగేసేది. ఆమె ఉద్దేశ్యమేమిటో తెలిసేది కాదు.
తను డిగ్రీ తీసుకుని వెళ్ళేటప్పుడు కూడా “రాజా ఇంకా ఏమన్నా చెప్పేదేమన్నా ఉందా” అని అడిగింది ఆఖరి సారి కలిసినప్పుడు. తర్వాత “పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు” అని రాసింది. ఆ తర్వాత శుభలేఖ వచ్చింది. ఆ తర్వాత ఇంకేమీరాలా. గుర్తుచేసుకున్నాడు.
రమాదేవి వెళ్ళిపోయాక చాలా అవస్థే పడ్డాడు రాజారావు, సిగరెట్లకీ సినిమాలకీ డబ్బులు లేక. అలవాటు పడ్డ ఆడస్పర్శ కూడా కరువవటంతో సినిమాల్లో హీరోయిన్లని చూసినప్పుడల్లా తట్టుకోలేని ఉద్రేకానికి లోనయ్యేవాడు. “ఎవత్తినో రేప్ చేసి పడ దొబ్బేస్తే కాని దూల తీరేట్టులేదు” అనుకునే వాడు. “ముప్పయి రూపాయిలు తేరా ఫామిలీటైపు సెటప్ చేస్తా” ననే వాడు స్నేహితుడు. “దగ్గరకొచ్చి పయట మీద చెయ్యేసినా ఏమీ అనని పిటపిట లాడే పిల్లనే ఏమీ చెయ్యలేని కొజ్జా లంబ్డీ కొడుకువి నీకు లంజలెందుకులే” అని తనే తేల్చేసేవాడు.
ఏదో ప్రయివేట్ స్కూలులో లెక్కలు చెప్పేందుకు చేరాడు. 20 మందితో ప్రారంభమయిన ఆ చిన్న స్కూలు బాగానే పెరిగి ఇప్పటికీ తనకి సరిపడీ సరిపడని జీతాన్నిస్తోంది. మరే గవర్నమెంటు ఉద్యోగమూ తనకు ఎలాగూ దొరకలేదు.
రమాదేవి వెళ్ళిపోయిన రెండేళ్ళకి 40 వేల కట్నంతీసుకుని ఇంట్లోవాళ్ళు పెళ్ళిచేశారు. ఆ కట్నం డబ్బులు పెళ్ళాం పేరుమీద బాంకులో వేసి ఇప్పటికీ అత్తా మామలే లెక్క చూడటం ఒళ్ళు మండే వ్యవహారం రాజారావుకి. పెళ్ళాం రావటంతో పోయిన ఆడతోడు దొరికింది. ధైర్యంగా సంసారం చేసి రెండేళ్ళలో ఇద్దరు పిల్లల్ని కన్నాడు. అల్లుడిమీద నమ్మకం ఉండబట్టో, లేకపోబట్టో తెలీదుగానీ, అత్తా మామలే కూతుర్ని తీసుకెళ్ళి మరింక పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించి పంపించారు, రెండో పురుడు పోసుకోగానే.
రమాదేవికి కూడా ఇద్దరు పిల్లలను కుంటా. ఎప్పుడో ఓ క్లాస్ మేట్ చెప్పిన గుర్తు. నెల్లూరులోనే ఉంటోందని ఎప్పుడో వినటమే. గత పదేళ్ళుగా ఆమె సంగతే వినలేదు రాజారావు. సడన్ గా ఎలా తెల్సుకుందో తెలీదు. తన సెల్ కి ఫోన్ చేసింది. ఎవరో స్కూల్లో పనిచేసే క్లర్క్ వాళ్ళ ఊరి వాడనీ తన ద్వారా నంబర్ సంపాయించాననీ చెప్పింది.
రాజారావుకి ఏమి మాట్లాడ్డానికీ కనపళ్ళా. అడిగిన వాటికి సమాధానం చెప్పాడు. ఎక్కడ ఉంటున్నాడు, పిల్లలేంచేస్తున్నారు అలాంటివన్నీ అడిగింది. “సినిమాలు చూస్తున్నావా, మీ ఆవిడకి చూపిస్తున్నావా?” అని అడిగి సమాధానం కోసం చూడకుండా పగలబడి నవ్వింది. ఎందుకో తెలీకపోయినా కోపం వచ్చింది రాజారావుకి. “చీ! మొగుడూ పెళ్ళాల గురించి మాట్లాడే మాటలేనా ఇవ్వి” అనుకున్నాడు కానీ బయటికి అనలేక పోయాడు.
తన దగ్గర్నించి పెద్ద ఆసక్తి కనపడక పోవటం మూలాన అనుకుంటాను, రమాదేవి మరో ఒకటి రెండు సార్లు ఫోన్ చేశాక మళ్ళీ మానేసింది.
ఓ రోజు అకస్మాత్తుగా మళ్ళీ ఫోన్ చేసి అడిగింది. “హైదరాబాద్ వస్తావా” అని.
“ఎందుకు”
“నిన్ను చూడాలని ఉంది. సినిమాకి కూడా వెళ్దాం” వినపడీ వినపడకుండా నవ్వు.
“ఒక్కదానివే వస్తున్నావా? నేనూ ఒక్కణ్ణే రావాలా”
“అవును. రాగలవా? ఓ రెండు రోజులు గడిపి వచ్చేద్దాం”
“అమ్మో మా ఆవిడకి తెలిస్తే?”
“అవన్నీ నువ్వు చూసుకో. నేను మా ఆయన్ని వదిలి రావట్లా?”
“నువ్వు వేరు, ఎంతకయినా తెగించిన దానివి”
“……….” నిశ్శబ్దం అటునుంచి
“చూస్తా. ఆలోచించుకుని చెప్తా”
“రేపు ఫోన్ చేస్తావా”
“ఎల్లుండి. నువ్వే చెయ్యి. నా సెల్ లో రిసీవింగ్ మాత్రమే ఉంది”
అప్పట్నించీ ఆలోచిస్తున్నాడు.
“రమాదేవి ఎందుకు రమ్మంది?”
“మొగుడు చాతకాని వాడా? అంతటి జాణకి ఒక్క మగాడు సరిపోవట్లేదేమో? నా మీద మోజు అలాగే ఉందేమో, అప్పుడు తీరలేదని ఇప్పుడు వస్తోందేమో? ఇంత తీట ఉన్న ఆడది నాకెట్లా తగులుకుందో” ఎన్నెన్నో ఆలోచనలు.. దేనికీ సమాధానం దొరకలా.
అత్తారింటికీ, గుళ్ళకీ, సినిమాలకీ తప్పా ఎక్కడికీ తిరగని రాజారావు, రెండు రోజులు హైదరాబాదు వెళ్ళి రావడానికి తగిన కారణం వెతకడానికి చాలా అవస్థ పడ్డాడు.
మొత్తానికి ఏదో ఒకటి చేసి రైలెక్కాడు. ఇప్పటికీ తెలీదు..
“రమాదేవి ఎందుకు రమ్మంది”
“ఎందుకన్నా రమ్మననీ. ఇద్దరికీ పెళ్ళిళ్ళయి పోయాయి. ఎవరికీ దొరకనంత వరకూ ఏం చేసినా గొడవ లేదు. పదిహేనేళ్ళ క్రితం ఉన్న భయాలేవీ ఇప్పుడు లేవు. రమాదేవి బయట పడి తన మెడకు చుట్టుకోలేదు. తనూ తప్పు చేస్తోందిగా? దొరికిందే సందు, ఫుల్లుగా ఎంజాయ్ చెయ్యడమే” రాజారావు ఉన్న డబ్బులు తీసుకుని రైలెక్కి వచ్చేశాడు. నెల్లూరు నించి వచ్చే రైలు విజయవాడ మీదుగానే రావాలని తెలిసినా, చెరో రైల్లోనే రావాలని ప్లాన్ చేసింది రమాదేవి.
అత్తారింటిని వేధించి రెండేళ్ళక్రితం సాధించుకున్న వాచీలో టైం చూసుకున్నాడు. మరో పావుగంటలో వచ్చేస్తుంది రమాదేవి రైలు. ఇక్కడ హైదరాబాదులో తనని గుర్తు పట్టేవాళ్ళు లేరు కదా అని ఓ సారి చుట్టూ చూశాడు, హైదరాబాదులో ఉన్న వాళ్ళంతా ఆ సికిందరాబాద్ ప్లాట్ ఫాం ఒకటి మీదే ఉన్నట్టు!
తనొచ్చే ట్రెయిన్ తెలుసు. కంపార్ట్ మెంట్ నంబరు చెప్పుండచ్చు కదా అనుకుంటుండగానే ఆమె వస్తున్న రైలు అనౌన్స్ అయ్యింది. కూర్చున్న చోటే కొద్దిగా తిరిగి ఓవర్ బ్రిడ్జ్ మీదుగా వస్తున్న వాళ్ళు కనపడేట్టుగా కూర్చున్నాడు. అలా ఎంతసేపు గడిచిందో తెలీదు. అందర్నీ చూస్తున్నా ఎలా మిస్ అయ్యాడో తెలీదు… దగ్గర కొచ్చిందాకా గమనించలా, నీలం రంగు కాటన్ చీరలో, వెనక కూలీ నెత్తన సూట్ కేస్ తో, చేతిలో హేండ్ బాగ్ తో వస్తున్నది రమాదేవి.
రమాదేవి మాత్రం ఎంత దూరం నించి గుర్తించిందో తెలీదు గానీ, “రాజా! నువ్వేగా?” అంటూ దగ్గర కొచ్చేసింది.
“నేనే” అంటూ మరో మాట రాక, రమాదేవిని పైన్నించి కింద దాకా చూడ్డం మొదలు పెట్టాడు. అప్పటికంటే కొంచెం లావయింది. కళ్ళేమిటో లోతుగా ఉన్నాయి. బహుశా రాత్రి నిద్ర లేక పోవటాన. ఇప్పటికీ అందగత్తె కిందే లెక్క.
రమాదేవి చనువుగా చేతిని చేతిలోకి తీసుకుని “పద, తీరిగ్గా బయటకి వెళ్ళి మాట్లాడు కుందాం” అంటూ వెంటే రమ్మని కూలీకి సైగ చేసి ప్లాట్ ఫాం బయటకి నడిచింది.
బయటకి నడిచి కూలీకి డబ్బులిచ్చి పంపించేసింది. ఈ లోపు జేబులోంచి సిగరెట్ తీసి వెలిగుంచాడు రాజారావు.
“నీకేమన్నా ఊరు తెలుసా? ఆటోవాణ్ణే అడిగి వెళ్దామా?” అయోమయంగా చూస్తూ అడిగాడు.
“నువ్వలా సిగరెట్ తాగతా వుండు. మిగతావి నే చెప్తాగా” అంటూ సెల్ ఫోన్ తీసి ఎవరికో ఫోన్ చేసింది. అరనిమిషం మాట్లాడిందో లేదో ఫోన్ కట్ చేసి 2413 నంబరు కారు వస్తుంది చూడు అంది. మరో నిమిషం గడిచిందో లేదో, తెల్ల అంబాసిడర్ కారు మెట్ల దగ్గరికి వచ్చి ఆగింది.
“ఈమెకి ఎప్పుడూ డబ్బుకి కొదవలేదు. ఊళ్ళో దిగక ముందే టాక్సీ ఏర్పాటు చేసుకుని మరీ వచ్చింది. చూడపోతే అన్ని ఏర్పాట్లూ చేసుకునే వచ్చినట్టుంది. ఈ లెక్కన హోటల్ ఖర్చు కూడా నాకు తప్పేట్టుంది.” మనసులోనే హమ్మయ్య అనుకున్నాడు.
“ఇప్పుడు చెప్పు. ఎలాఉన్నావు” కారు కాస్త దూరం వెళ్ళాక మొదలు పెట్టింది రమాదేవి.
“నాకేముంటాయి రమా. ఏదో చిన్న బళ్ళో లెక్కలు చెప్పుకుంటున్నాను. నువ్వే చెప్పాలి. ఆ బెజవాడ తప్పా నాకేం తెలీదు” కాస్త నిజాయితీగానే చెప్పాడు.
కాసేపు మామూలు పిల్లలూ, సంసారం కష్టాలూ సుఖాలూ అన్నీ దొర్లి పోయినయ్. మాట్లాడుతూనే హైదరాబాద్ నగరాన్ని వింతగా చూస్తున్నాడు.
“నెల్లూరు నించి వచ్చిన నేను బానే ఉన్నాను. బెజవాడ లాంటి నగరాన్ని వచ్చి అంత పల్లెటూరి వాడిలా చూస్తావేం?” అంది రమాదేవి, సిటీ చూస్తూ ముభావంగా సమాధానాలు చెప్తున్న రాజారావుతో.
“నువ్వు దేశాన్నంతా తిరిగేసినట్టున్నావు. నాకు ఆ బెజవాడే ప్రపంచం. పెద తిరపతికి సంవత్సరానికి ఒకసారి వెళ్ళివస్తా. అంతకు మించి పెద్ద తాహతు లేదు నాకు” కిటికీ లోంచి సిగరెట్ పొగ బయటికి వదులుతూ చెప్పాడు.
“అవునులే, హైదరాబాదు వస్తునే ఉంటాం మేము” అంది రమాదేవి.
“ఎవరితో” అని అడగబోయి ఆగి పోయాడు. “ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం?” అని అడిగాడు. చూడపోతే కారు ఊరు దాటి బయటకి పోతున్నట్టు అనిపించింది. మిలటరీ వాళ్ళ ఏరియాలో ఉంది కారు.
“ఇంకో అయిదు నిమిషాలు. ఊరిబయట రిసార్ట్ కి” వివరించింది
“రిసార్ట్ అంటే?”
“ఊరి బయట పెద్ద తోటలో… హోటల్ రూముల్లా అన్నీ ఉంటాయి. రెండురోజులు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా” చేతి మీద చేయి వేసి చెప్పింది.
పూర్తిగా తయారయే వచ్చింది అనుకున్నాడు. మరో పావుగంటలో రిసార్ట్ చేరారు. ఆఫీసులో వెళ్ళి అన్నీ తనే మాట్లాడి వచ్చింది. వేసుకున్న బట్ట్లలు చూస్తే పెద్ద ఖరీదయిన బట్టలేమీ వేసుకోలా రమాదేవి. అయినా ఆమెలో ఏదో తనకు లేని దర్పం ఉందనిపించింది. అలా అనిపించిందే తడవు అందరూ తననే చూస్తున్నారని కూడా అనిపించింది. అనిపించడమేమిటి, తననే చూస్తున్నారు. మగాడు బెరుకు బెరుగ్గా దిక్కులు చూడడమేమిటి, ఆడది చురకత్తిలా అన్నీ చేసుకు పోవడమేమిటి?
కాటేజిలా చెట్ల మధ్యలో ఉన్న రూము తాళం చెవులు తీసుకుని వచ్చాడు బాయ్. మీ లగేజ్ అని చేతిలో ఉన్న చిన్న బ్రీఫ్ కేస్ వంక విచిత్రంగా చూసి మారు మాట్లాడకుండా తన చేతిలోకి తీసుకున్నాడు. రూము తలుపు తీసి, రూములో ఉన్న A.C ఆన్ చేసి అక్కడే నిలబడ్డాడు. బాత్ రూమ్ లోకి వెళ్ళబోయిన రమాదేవి ఆగి హేండ్ బేగ్ లోంచి పది రూపాయల నోటు బాయ్ చేతిలో పెట్టి పంపించింది. అలా నిలబట్టానికి అర్థం టిప్ కోసమని తెలియ లేదు రాజారావుకు.
ఇద్దరూ స్నానాలు చేసేటప్పటికి రూముకే బ్రేక్ ఫాస్ట్ వచ్చింది. అసలు అలాంటి ప్రపంచమే చూసెరగని రాజారావుకు అంతా అయోమయంగా ఉంది. సుబ్బరంగా తినేసి మళ్ళీ మరో సిగరెట్ కాల్చాడు.
తయారయి రిసార్ట్ అంతా తిరిగారు. మధ్యలో రెస్టారెంటుకి వెళ్ళి భోజనం చేశారు. చూడాల్సిన వన్నీ అయిపోయాక, ఓ మూలగా ఉన్న చెట్ల పక్కన కూర్చున్నారు. అప్పటికే మాట్లాడ డానికి ఉన్న మామూలు రోజువారీ సంగతులు అయిపోయాయి. రిసార్ట్ ప్రత్యేకతల గురించిన ఉత్సాహం తీరిపోయింది.
ఆనుకుని కూర్చున్న రమాదేవి నడుమ్మీద చెయ్యవెయ్యాలన్న కోరికని అతి కష్టం మీద ఆపుకున్నాడు. అప్పటికే తన చేతిలో చేతిని వేసి ఆనుకుని పొద్దుట్నించీ నడుస్తున్న రమాదేవి మీద చెయ్యి వేసినా ఏమీ అనదు అని నమ్మకమున్నా సాహసించ లేకపోయాడు. అలా ఎంతసేపున్నారో తెలీదు. మళ్ళీ ఊసుపోని కబుర్లు. మాట్లాడుతూనే వున్నాడు గానీ రాజారావుకు ఇంకా తేలట్లేదు…
“రమాదేవి ఎందుకు రమ్మంది?” “ఎందుకు వచ్చింది?”
ఎంత ఆలోచించినా మరో ఆలోచన రావట్లేదు. తనతో పడుకోవడానికి కాక అంత ఖర్చు పెట్టడానికి ఎందుకు సిద్ధ పడుతుంది? ఓ నిర్ణయానికి వచ్చిన వాడిలా మెల్లిగా కదిల్చి ఆమె నడుమ్మీద చెయ్యి వేశాడు. ఊహించినట్టుగానే రమాదేవి ఏమీ అనలేదు. మాట్లాడుతూనే ఉంది. మాట్లాడుతూనే ఏమీ తెలియనట్టు మెల్లిగా మరింత దగ్గరగా జరిగింది. ఆ ఒక్క కదలికతో మళ్ళీ కాలేజీ రోజులు తిరిగి వచ్చేశాయి.
ఇంక సందేహంలేదు ఆమె అందుకోసమే వచ్చింది. అని నిర్థారించేసుకున్నాడు రాజారావు. ఇక ఈ రెండ్రోజులూ చాన్స్ వదలకూడదని నిర్ణయించుకున్నాడు.
**************************
“రాజారావు గారూ, మీకు నెల్లూరు రమాదేవి గారు తెలుసటగా. క్రితం నెల నా దగ్గర మీ నంబరు తీసుకున్నారు” కాలేజీ క్లర్కు
“అవునండీ, మా క్లాసు మేటు” చాలా మామూలుగా చెప్పడానికి ప్రయత్నిస్తూ సమాధానం చెప్పాడు రాజారావు.
“మీకు చెప్పే ఉంటారు… ఆయనకి ఇంకా సీరియస్ అయిందిట” క్లర్క్
“ఎవరికీ?” రాజారావు
“ఇంకెవరికి, రమాదేవి గారి భర్తకి. కేన్సర్. సంవత్సరం నించీ మంచంమీదే ఉన్నారు. ఇక రేపో మాపో అనుకుంటున్నారు. మీకు ఫోన్ చేశానంటే చెప్పే ఉంటారనుకున్నాను” అని పూర్తి చేశాడు క్లర్కు.
“ఆ మరే” అని చెప్పి అక్కణ్ణించి తప్పుకున్నాడు రాజారావు. షాక్ తగిలినట్టుగా ఉంది. ఒక్కమాట కూడా చెప్పలేదే, తనతో రెండురోజులు గడిపినా?
అటూ ఇటూ చూసి మెల్లగా వీలు చూసుకుని ఫోన్ చేశాడు రమాదేవికి.
“హల్లో మీ ఆయనకి బాగాలేదటగా… నాకు చెప్పలేదేం?”
“నువ్వు మాత్రం ఏం చెయ్యగలవు రాజా”
“కనీసం నీ కోరిక అయినా తీర్చి ఉండేవాణ్ణి. నువ్వెందుకు రమ్మన్నావో తెలీక భయపడి నీకు దూరంగా ఉండి పోయాను”
“…….” అటు వయిపు నిశ్శబ్దం
ఎంత దగ్గర చేరినా ఎందుకో గీత దాట లేకపోయిన తన ఆ రెండురోజుల అసక్తతనీ గుర్తు చేసుకుంటూ అన్నాడు…
“ఈ సారి చెప్పు. ఎప్పుడంటే అప్పుడు. ఎన్ని రోజులంటే అన్నిరోజులు, పగలూ రాత్రీ నీతో గడిపేస్తా….” ఇంకా ఏదో చెప్పబోయాడు.
“పెట్టరా ఫోను. మళ్ళీ చేస్తే చంపేస్తాను. చిత్ర కార్తెపు కుక్కా” అని అరిచి ఫోన్ పెట్టేసింది రమాదేవి.
ఎన్నిరోజులయినా అర్థంకాలా రాజారావుకి
“రమాదేవి ఎందుకు రమ్మంది?”
సంబంధిత లింకులు
1. “రమాదేవి ఎందుకు రమ్మంది” – కథ వెనక కథ
2. రమాదేవి మళ్ళీ రమ్మంది
—————————
రాసి కంటే వాసిలో మిన్నయైన రచయిత, అక్కిరాజు భట్టిప్రోలు. హైదరాబాదులో సాఫ్టువేరు ఇంజనీరుగా పనిచేస్తున్న వీరు మూడు బీర్ల తర్వాత అనే బ్లాగును నిర్వహిస్తున్నారు.
మగవాడిని వెధవను చేసి చూపించడానికి బాగా ప్రయత్నం చేసారు. రమాదేవి ఎందుకు రమ్మందో నాక్కు అర్థమైంది. 🙂 ఓ రెండు రోజులు ఎన్జాయ్ చేద్దామని రమాదేవి రాజారావును హైదరాబాదుకు తీసుకెళ్లింది. (రాజారావు ఎన్జాయ్ చెయ్యలేదు, అది వేరే విషయం.)
ఈ రమాదేవికి రాజారావుతో ఎన్జాయి చేద్దామని లేకపోతే అతణ్ణి హైదరాబాద్కు ఎందుకు రమ్మంది? ఆ తరువాత చిత్తకార్తె కుక్క అనితిట్టడం ఏమిటి? రాజారావును రిసార్టుకు తీసుకెళ్ళిన రోజున అవిడనేమనాలి?
పాపం రాజారావును చవటను చేసే ఎజెండాతో రాసినట్లుగా ఉంది. ఎటొచ్చీ, రమాదేవిని ఉన్నత వ్యక్తిత్వమున్న వనితగా చూపించకపోవడంతో అది నెరవేరినట్లు అనిపించలేదు. మొత్తమ్మీద “చిత్తకార్తె కుక్కా” అనేది మాత్రం ఈ కథలోకెల్లా అత్యంత అతకని, అననుకూలమైన డైలాగు.
కథ చదివాను… చిత్తకార్తె కుక్క అంటే ఏమిటో నాకర్థం కాలేదు కానీ – కథ వెరైటీగా ఉంది…ముఖ్యంగా ముగింపు…
ఈ కథ చివర్లో 2 వాక్యాలు.
-ఎన్నిరోజులయినా అర్థంకాలా రాజారావుకి
-“రమాదేవి ఎందుకు రమ్మంది?”
మొదటి వాక్యంలో ఆగడంతో, రమాదేవి ఎందుకు రమ్మంది అన్న విషయం తెలిసింది. కాకపోతే, “రమాదేవి ఎందుకు రమ్మంది?” అని ముగించడం కాస్త సినికల్ గా అనిపించింది.
క్షమించండి ఇది పొద్దు సైట్ లూ ప్రచురించ తగిన కధ లాగ అనిపించలేదు. దయ చేసి సైట్ ప్రమాణాలు దిగజార్చ్కండి
ఇలా రాసానని మీరు ఏమి అనుకోకండి . మీ బ్లాగ్ ని అందరికి నచ్చిన బ్లాగ్ అనే ఒక గొప పేరు వున్నది.కానీ మీరు ఇలాంటి కథలతో మీ బ్లాగ్ పేరుని చెడగొట్టుకోకండి. ఇలంటి కథలకు స్వస్తి చేప్పి మంచి బ్లాగ్ గా మెలగండి.
ఇది నా విన్నపం……………………….
రెండు కథల వర్షన్లను పైపైన చదివాను, అనగా ఒక లైన్ చదివి ఐదు లైన్ల్ జంప్ అవ్వటం అన్నమాట 🙂 రెంటికీ పెద్ద తేడా లేదు.