వికృతి ఉగాది పద్యకవితా సదస్సు – మూడవ భాగం

కొత్తపాళీ:: బాగుంది. ఒక దత్తపది వేసుకుందాం .. మాలిక, తూలిక, చాలిక, పోలిక – ఉత్పలమాల మొదటి పదాలుగా వాడుతూ.. ముందుగా చదువరి గారి పూరణ.

చదువరి:: ఒక్క క్షణం..
ఉ.

చదువరి గొంతులో ఈ పద్యం వినండి

“మాలికలెన్నొ యుండ గజమాలను నా గళసీమ వేసి, నే

తూలి కథాకళించ గని తుళ్ళుచు నవ్వితె పెళ్ళివేళ, చా

ల్చాలిక” యంచు నల్గు తన స్వామిని మారము సేయు బాలుడన్

పోలికగాంచి భార్య పతి పొంతకు చేరెను నూరడించగా

కొత్తపాళీ:: కథాకళించ .. భలే! నవ్వితె బదులు, నవ్విన అంటే ఇంకొంచెం గంభీరంగా ఉంటుంది.

రాకేశ్వరుఁడు:: ఇది కూడా ఆ తెలుగు – తూలికేనన్నమట! ఎంతైనా తెలుగుతూలిక తెలుగుతూలికే! భేష్

రవి:: కథాకళించ – బహు బాగు

కొత్తపాళీ:: am sure Malathi garu will be glad to hear that 🙂

రాఘవ:: తూలితే కథాకళించడం భలే భలే బాగుందండి.

గిరి:: దివ్యవాణి రాజేంద్రప్రసాదులను గుర్తుకు తెచ్చిందీ పద్యం

చదువరి:: గిరి- 🙂

శ్రీరామ్:: బాపూ గాంచనిచో…..

కామేశ్వరరావు:: 🙂

కొత్తపాళీ:: రాకేశ్వర, మీ పద్యం చెప్పండి. తరవాత.. సనత్ గారు, సిద్ధంగా ఉండండి మీ పూరణతో

రాకేశ్వరుఁడు::

ఉ.

మాలిక నాదు యిష్టసఖి మానిక కాపురమీ చిరాకు నీ

తూలిక ఆపుకోని పతితో, పడిసచ్చిన తాగుఁబోతుతో

చాలిక నీదు కాపురము, చక్కగ నిద్దరు లేచిపోదుమే

పోలిక లేదు ఆ నిదురపోతుకు నాకును నమ్మిరా చెలీ

కామేశ్వరరావు:: రాకేశ్వరా, మొత్తానికి మీరు చాలా డేంజరస్ ఫెలోలా ఉన్నారే 🙂

విశ్వామిత్ర:: ఈ హారకుడు ఉత్తరభారతీయుడా?

రాకేశ్వరుఁడు:: అవును, ఎలా చెప్పేశారు విశ్వామిత్రుల వారూ?

గిరి:: పెళ్ళికాని వాళ్ళకి దత్తపదులు జాగ్రత్తగా ఇవ్వాలి

రాఘవ:: మళ్లీ దాదాపు వ్యావహారికభాష! 🙂

రాకేశ్వరుఁడు:: వ్యావ’హారక’భాష!

కామేశ్వరరావు:: 🙂

కొత్తపాళీ:: ఇక్కడ చిన్న శాస్త్రచర్చ .. ఉవాచ అనేది ఆంగ్లంలో క్రియాపదానికి నామవాచక రూపమైన gerund లాంటి ప్రయోగమా అని

రాకేశ్వరుఁడు:: హారకః + ఉవాచ సంధి జరిగాక రెండుపదాలుగా వ్రాస్తారా ఒక పదంగానా?

రాఘవ:: ఒకే పదంగా వ్రాస్తారు. హారకఉవాచ అనీ.

కొత్తపాళీ:: సంధి అంటేనే రెండు విడి పదాలు ఒకటి అవ్వడం

కామేశ్వరరావు:: అప్పుడు “హారకఉవాచ” ఒకటే పదం అవుతుంది.

కొత్తపాళీ:: సనత్, మీ పద్యం. దీని తరవాత, కామేశ్వర్రావుగారు మీ శివుని వర్ణనతో సిద్ధంగా ఉండమని కోరుతున్నాను.

సనత్ కుమార్::
ఉ.

సనత్ సమర్పించిన ఈ పద్యం ఆయన గొంతులోనే..

ఉ.

పోలిక జెప్ప నా తరమె? పూవులు దత్తపదమ్ము లాయె ! “మం

చాలిక పూరణల్” గ సరసాల రసాలను జూపె ! వర్ణనల్

తూలిక లిచ్చె ! నాశువులు త్రోవ సుమమ్మయె ! జాల తోటకున్

మాలి కదా ఇతండు ! మధు మాసపు వేళల ! కొత్తపాళి రో !!

రాఘవ:: సరసకవే మీరు!

సనత్ కుమార్:: మంచమ్మీద ఆమాత్రం స-రసం గా ఉండకపోతే ఎట్టా??

కొత్తపాళీ:: ఐతే పలుగూ పారా సిద్ధం చేసుకో మంటారు? సరసంగానే ఉంది. వచ్చేది వసంతం కదా, తోట పని తప్పదు. వసంతం నేల వ్యవసాయానికీ, కావ్య సుక్షేత్ర వ్యవసాయానికీ కూడా అనువైన సమయమే.

విశ్వామిత్ర:: పద్యప్రియ వనమాలి

గిరి:: కొత్తపాళీని polish చేసేసారు

రాఘవ:: గిరిగారూ, నిజమే.

గిరి:: బావుంది

ఫణి:: కాకా పడుతున్నారు అద్యక్షులవారిని:) బాగుందండి.

విశ్వామిత్ర:: కవిపోషణతో పాటు – రచనకూడా కాస్త తరచుగ చేస్తే…

సనత్ కుమార్:: కొత్తపాళి గారు ముచ్హెంగా మూడోసారి సమర్ధవంతంగా ఈ అంతర్జాలవనంలో కవితా సుమాలను వికసింపజేస్తున్నందుకు ధన్యవాదాలతో…

కొత్తపాళీ:: మంచి రసవత్తరమైన పూరణ

శ్రీరామ్:: ఔను…స’రస’మైన పూరణ

సనత్ కుమార్:: దత్త పదాల్లో వేర్వేరు పువ్వుల్ని దండగా కడితేనే అందం కదా…

……………………………….

కొత్తపాళీ:: ఈ కవి సమ్మేళనాల్లో ఎప్పుడూ ఉండే దత్తపది, సమస్యలే గాక, అనువాదం అనే అంశం ఒకటి ప్రవేశ పెట్టాం గత ఏడాది. ఈసారి ఇచ్చిన అనువాదాంశాల్లో ఒకటి కాళిదాసు కుమారసంభవంలో ధ్యానంలో కూర్చున్న శివుని వర్ణన. కాళిదాసు శ్లోకాల్ని ఢీ అంటే ఢీ అనగల సొగసైన పద్యాల్ని, శివుని మంగళాకృతిని రూపుగడుతూ కామేశ్వర్రావుగారు రచించారు. కామేశ్వర్రావుగారు, కానివ్వండి.

కామేశ్వరరావు:: అవధరించండి
తే.గీ.

ఈ పద్యాన్ని కామేశ్వరరావు స్వరంలోనే వినండి

సర్ప సంధానితోన్నత జటభరమ్ము

శ్రవణమున వ్రేలు రుద్రాక్షసరయుగమ్ము

గళ రుగతి కజ్జలితమౌ మృగాజినమ్ము

తనరు నా యోగమూర్తి సదాశివమ్ము

చం.

ఈ పద్యం కామేశ్వరరావు స్వరంలోనే

అరవిడియున్న కంటితుదలందొక సన్నని కాంతిరేఖ ప్ర

స్ఫురితముగాగ పక్ష్మములు భ్రూకుటి నిశ్చల వృత్తినొందగా

స్థిరముగ కంటిపాపలతి తీక్ష్ణత జూడగ నాసికాగ్రమున్

పరమశివుండు నిస్తుల తపస్స్థితి నుండెను సిద్ధయోగియై

తే.గీ.

ఈ పద్యం కామేశ్వరరావు స్వరంలోనే

వర్ష సంరంభ విరహితాభ్రమ్ము వోలె

లహరులడగిన నిశ్చల హ్రదము వోలె

ఆంతర మరున్నిరోధియై హరుడు వెలిగె

వాతశూన్యస్థలీ స్థిర జ్యోతి వోలె

సనత్ కుమార్:: అద్భుతం…అద్భుతం… అద్భుతం… అత్యద్భుతం…

శ్రీరామ్:: ఏమి పట్ట్టు!

రాఘవ:: భలేగా తెనింగించారండీ. మీ విద్యకు నమస్కారం.

కొత్తపాళీ:: రాఘవ, విద్య ఒక్కటే సరిపోదు, కవి హృదయం కావాలి, కవితా ధార కావాలి

గిరి:: కళ్ళకు కట్టినట్టు – అంటే ఇదే

చంద్రమోహన్:: అద్భుతమండీ

విశ్వామిత్ర:: మొన్న అపర పెద్దన – ఇవేళ అపర శ్రీనాధుడు

ఫణి:: పరిపూర్ణత, రసానందము అనుభవమయ్యాయండీ మీ పద్యాలలో. అంత్యానుప్రాసం అద్భుతంగా ఉంది.

చంద్రమోహన్:: ఇలాంటి రచనే శ్రీనాధునిది చూసి, “మా డు,ము,వు,లు మాకిచ్చి మీ సంస్కృతం మీరు తీసుకోండి” అన్నాడట పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు.

రాకేశ్వరుఁడు:: చంద్రమోహనం గారు, అవును ఛేదించడానికి చాలా జటిలంగానుంది।

కామేశ్వరరావు:: చంద్రమోహన్ గారు, కాని శ్లోకాలలో పదాలు రాకుండా చాలా వరకూ జాగ్రత్త పడ్డానండీ 🙂

చంద్రమోహన్:: అవును. అందుకే ఈ రచన కావ్య గౌరవం పొందింది.

శ్రీరామ్:: వాతశూన్యస్థలీ… ఇది మూలం లోని భావమేనాండీ?

కామేశ్వరరావు:: శ్రీరాం గారు, అవును.

రవి:: వాతనిష్కంపమివ ప్రదీపం – కాళిదాసు చెప్పిన మాటకు వాతశూన్యస్థలీ స్థిరజ్యోతి వోలె -అద్భుతం!

కొత్తపాళీ:: అరవిడియున్న కంటితుదలందొక సన్నని కాంతిరేఖ – చక్కటి తెలుగు నుడికారం

శ్రీరామ్:: అంటే తర్కంకూడదన్నారనుకోండి….కానీ గాలి లేకుండా ఎలా వెలుగుతుందా అని

రాకేశ్వరుఁడు:: శ్రీరాము గారు, అప్పటికింకా ప్రాణవాయువు కనుగొనలేదేమో 🙂

కొత్తపాళీ:: శ్రీరామా .. యోగ విద్యలో స్వతస్సిద్ధంగా లోపల అగ్ని ఉంటుంది. దాన్ని శివుడు ప్రాణం (వాయువు, ఊపిరి) తో లయింప జేస్తే అందులోంచి ప్రణవనాదం ఉద్భవించిందని శాస్త్రం.

కామేశ్వరరావు:: శ్రీరాం గారు, ఇక్కడ “వాత” అంటే “wind”, “air” కాదు.

శ్రీరామ్:: కామేశ్వరరావు గారు….ఔనండి..

రాకేశ్వరుఁడు:: కొత్త పాళీ గారు, నేననుకోవడం – అది గాలి వీయని చోటనే అర్థం

కొత్తపాళీ:: యోగాగ్ని వాయువు లేకుండా స్వయంభువుగా ఉంది శరీరంలో

రాకేశ్వరుఁడు:: కానీ అస్సలు గాలేలేని చోటు కాదని। గాలిలేని చోటు అనే వూహ మనం పిజిక్సు చదువుకొని అబ్బుకున్నది।

కొత్తపాళీ:: రాకేశ్వర, కావచ్చును. కానీ ఇక్కడ సమాధిలో కూర్చున్న శివుడు యోగి కూడా కాబట్టి, వాయు, వాత అనే వాటికి యోగ సంబంధమైన అర్ధాలు కూడా స్ఫురిస్తున్నాయి

రాఘవ:: పంచభూతాలకు అతీతుడాయన. గాలి ఉందా లేదా అని చూడడం అనవసరం.

కొత్తపాళీ:: రాఘవ, మంచి పాయింటు

శ్రీరామ్:: అదే నేను అన్వయం చేసుకున్నా కానీ….ఏదో రంధ్రాన్వేషణ

రాకేశ్వరుఁడు:: అవును ఇది చాలా మంచి పాయింటు, కాళిదాసుని వూహ ఏమిటో మఱి।

రవి:: గాలి లేని చోటు – ఆక్సిజను లేని చోటు అని కాదేమో

కామేశ్వరరావు:: ఇక్కడ “మరున్నిరోధము” అంటే ప్రాణాయామము.

విశ్వామిత్ర:: “మరున్నిరోధము” అంటే ప్రాణాయామము. -హమ్మో -ఇదేదో మన్మధుడి సంబంధించింది అనుకున్నా

కొత్తపాళీ:: మరుత్ ని నిరోధించడం .. బాగుంది

శ్రీరామ్:: ఉపమాగారి ఉపమానాల్లో వంకలు వెతకడం.. అనవసరం!

కామేశ్వరరావు:: అద్భుతమైన ఉపమానాలు కాళిదాసుకే చెందాయి. ఆయనకి మరొక్కసారి శత సహస్ర వందనములు.

…………………………

కొత్తపాళీ:: మనం ఇలా ద్వైత స్ఫూర్తిలో ఉండగా .. అదే దారిలో ఇంకో సమస్య – ఒకటి ఒకటి కూడి ఒకటెయగును – రవిగారు దీన్ని చాలా గంభీరంగా పూరించారు .. రవీ మీ వాగర్ధాల పద్యం వినిపించండి

రవి:: ఆజ్ఞ
ఆ.వె

రవి గొంతులో ఈ పద్యం వినండి

వాక్కు అర్థమునది వాణియగు విధము

శూలి గౌరి కూర్మి శుభములొప్ప

భవహరములుఁ జేరి ప్రణవమౌ భంగిని

ఒకటి ఒకటిఁ గూడి ఒకటెయగును

ఫణి:: అద్భుతంగా ఉంది.

చంద్రమోహన్:: చాలా బాగుంది! కాళిదాసు స్ఫూర్తితోనా!

రవి:: అవునండి, కర్టెసీ కాళిదాసు!

కామేశ్వరరావు:: ఆహా! కాళిదాసుని తలచుకోగానే “వాగర్థావివ…” పద్యం వచ్చేసింది!

సనత్ కుమార్:: గంభీరమైన భావంతో సమస్యని చాల సులభంగా పూరించేశారే..

రాఘవ:: పార్వతీపరమేశ్వరుల ప్రణయం ప్రణవమౌతుందీ అంటున్నారా! అమ్మో, ఏమి ఊహ! భలే.

రాకేశ్వరుఁడు:: భవహరములు ఏమిటి? లేదా ఎవరు?

రవి:: భవానికి, హరానికి ముందు అంటే సృష్ట్యాదిని ప్రణవం అని భావన

రాకేశ్వరుఁడు:: గౌరికి + ఊరిమి ?

కామేశ్వరరావు:: రాకేశ్వరా, మీరీ మధ్య సంధుల్లో చిక్కుకున్నట్టున్నారు 🙂

కొత్తపాళీ:: కూరిమి = కూర్మి అంటే ప్రేమతో అని

కొత్తపాళీ:: చాలా బావుంది, రవి

గిరి:: మంచి పూరణ

చదువరి:: చాలా బాగుంది పద్యం

రవి:: ధన్యోస్మి

కొత్తపాళీ:: పుష్యం గారు, మీ పూరణ. తరువాత విశ్వామిత్ర గారిది ఒక దత్తపది

పుష్యం:: చిత్తం
ఆ.వె

లక్ష లంచమడగ, లక్ష రూప్యములివ్వ

మరొక లక్ష కోరె, ఏమిటనిన,

“బల్లక్రింద లెక్క బడిలోన నేర్పరోయ్,

ఒకటి ఒకటి కూడి ఒకటె అగును!!”

విశ్వామిత్ర:: ఆటవెలదితో అద్వైతం.. అద్భుతం

శ్రీరామ్:: విశ్వామిత్ర….ఇదీ మీ ఫాం 🙂

రాఘవ:: పు.శ్యాం. గారూ, భలే.

గిరి:: ఒకటి పది కూడినా ఒకటే అయ్యే లెక్క అది – బాగుంది

రాకేశ్వరుఁడు:: @గిరి : )

రాకేశ్వరుఁడు:: 🙂

రవి:: శ్యాం గారు, ఇందాక కట్నం మాటెత్తలేదు, ఇప్పుడేమో బల్ల కింద చేయంటున్నారు.

చంద్రమోహన్:: ఆహా! లంచానికి కొత్త ఫార్ములా

కొత్తపాళీ:: మంచి చమత్కారం శ్యాం

రాకేశ్వరుఁడు:: అది బల్లక్రింది అద్వైతం లెండి

గిరి:: బల్లక్రింది అద్వైతం 🙂 హ హా

పుష్యం:: ధన్యోస్మి

విశ్వామిత్ర:: లంచానికి తోడు మోసం .. కలి ప్రభావం అనుకుంటా

సనత్ కుమార్:: బల్లకింద ఉండేది అద్వైతం మాత్రమే.. ద్వైతమూ, విశిష్టాద్వైతమూ ఎక్కడా కనిపించవు.. 😉

కొత్తపాళీ:: మాసు, బాసు, కింగు, కేడీ – మన్మథుని గురించి – విశ్వామిత్రులు కానివ్వండి

విశ్వామిత్ర::

మ.

అరయన్నాతని బాణమాసుదతి ఆస్యాలంబహాసంబగున్

విరులేలా? విలుగాను భాసురపు మోవేయొప్పువేరేటికిన్

గురులందాగెనొ, డెందెమందొ, కలికింగూడీనిమేషంబునన్

శరమున్ గొట్టగ నన్ను, చిక్కెదనొ? ఈశా! వానికే డిల్లుచున్!

సనత్ కుమార్:: భలే..

కొత్తపాళీ:: దత్తపదిలో ఇచ్చిన పదాల్ని ముచ్చటగా విరవడంలో మీకు మీరే సాటి

రాఘవ:: మొత్తానికి మన్మథుడు ఎక్కడ నక్కాడో పట్టేశారన్నమాట.

కామేశ్వరరావు:: చాలా బాగుందండీ! మన్మథుని పేరెత్తకుండానే అతని కీలకాన్ని చెప్పేసారు!

రవి:: ఆ పేరుతో సినిమాలు ఎలా ఉన్నా , మీ పద్యం మాత్రం భళీ

రాకేశ్వరుఁడు:: ఆస్యాలంబు – అహా – awesome + బగున్!

గిరి:: నాకు ఎప్పుడో చంద్రమోహన్ గారు చెప్పిన లంగూడి ప్రహసనం గుర్తుకు వచ్చింది – రాకేశుని కింగూడి సంధి చూస్తే

విశ్వామిత్ర:: నెనరులండి

శ్రీరామ్:: వహ్వా!

కొత్తపాళీ:: నాకు ఒక్క సందేహం ఉంది .. లంబ హాసంబు ఏవిటీ అని. లబోదరుణ్ణి విన్నాము ..

చంద్రమోహన్:: అది ఆలంబ హాసమేమో అనుకున్నాను

శ్రీరామ్:: ఇక్కడ ఆస్య+అలంబ

గిరి:: విశ్వామిత్రా, మీ పద్యాలు రానురాను మంచి పదునెక్కుతున్నాయి

కామేశ్వరరావు:: సుదతి మోవి విల్లైతే, ఆమె నవ్వులు బాణాలనడం చాలా బాగా కుదిరింది!

రాకేశ్వరుఁడు:: ఆస్యాలంబహాసంబగున్ ? వివరించాల్సిన సమయం వచ్చింది

విశ్వామిత్ర:: అన్నట్టు ఈ ఈశుడు కామేశుడు , ఆయన కరుణిస్తేనే .. మన్మధుడు శాంతించాడు పద్యంలో

కామేశ్వరరావు:: 🙂

గిరి:: హ హా

విశ్వామిత్ర:: ముఖముపై దోగాడు చిరునవ్వే బాణము

రాకేశ్వరుఁడు:: చాలా పదునెక్కింది మీ ఈ బాణం!

కామేశ్వరరావు:: “సుదతి” అన్నది కూడా చాలా సార్థకమైన పదం!

విశ్వామిత్ర:: @రాకేశ్వరుఁడు, బ్రహ్మచారికి ఏమి తెలుసు, మహేంద్రవరంలో సంధులు తప్ప?

రవి:: 🙂

రాకేశ్వరుఁడు:: మీ అహానికికి మేనకే సమాధానం విశ్వామిత్రా!

రవి:: మహేంద్రవరం = గుణ సంధి

రాకేశ్వరుఁడు:: రాణ్మహేంద్రవరం అనునాసిక సంధి – సంధులకే కింగు 🙂

శ్రీరామ్:: సొట్టబుగ్గల సుదతా విశ్వామిత్రులవారూ? ఈ మధ్య చెలమల్లో ఈదుతున్నారు కదా… 🙂

విశ్వామిత్ర:: @Sriraam హహహా! మన్మధుడు – బ్రహ్మచారీ గురించి చర్చలో నండి

కొత్తపాళీ:: సరే .. ఇదే దత్తపదిని పూరించమని ఫణిప్రసన్న గారికి మనవి

ఫణి:: అందుకోండి

కం.

తరమా? సులభంబా, సుమ

శర! ఈశునికిం గురినిడి శరములు వేయన్?

ఒరుడింకేడీ నీవలె

సుర కార్యము సేయ గల్గు శూరుడు మదనా!

నరసింహారావు:: బాగుందండీ.

గిరి:: నిజమే

కామేశ్వరరావు:: చాలా బాగుందండి! మాసు, బాసు ఒకే పాదంలో వచ్చేసారు!

రాకేశ్వరుఁడు:: మాస్వాదులను చిత్తుగా చించారుగా 🙂

చంద్రమోహన్:: ఆహా! చక్కగా కందంలో ఇరికించేశారు

రాఘవ:: చాల బాగుందండీ.

సనత్ కుమార్:: 🙂

విశ్వామిత్ర:: చిలుక చక్కని రౌతా .. ఎందుకీ హుంకరింత అని మల్లాది వారి గానం -గుర్తుచేశారు

రవి:: చాలా సులభంగా పూరించారు.

గిరి:: అవును – సులభంగా పూరించేసారు

ఫణి:: ధన్యవాదాలు

కొత్తపాళీ:: విశ్వామిత్ర నేనూ సరిగ్గా అదే అనబోతున్నా .. కానీ అక్కడ గిరిజ చెలికత్తెల గొంతులో హేళన, ఇక్కడ కవి గానంలో మన్మథుని శౌర్యానికి మెచ్చుకోలు

About రానారె

యర్రపురెడ్డి రామనాధరెడ్డి.. రానారె! తెలుగు బ్లాగరుల్లో ఈ పేరు తెలియనివారు బహు తక్కువ మంది ఉంటారు. రాయలసీమ మాండలికంలో రానారె రాసే బ్లాగు వ్యాసాలు బ్లాగు పాఠకులను ఎంతో అలరిస్తూ ఉంటాయి. తన చిన్ననాటి విశేషాలను ప్రవహించే భాషలో అలవోకగా మన కళ్ళ ముందుంచుతాడు రానారె. లబ్ద ప్రతిష్టులైన రచయితల రచనలకు ఏమాత్రం తీసిపోవు, ఈ సాఫ్టువేరు నిపుణుడి జ్ఞాపకాలు.
This entry was posted in కవిత్వం and tagged , . Bookmark the permalink.

4 Responses to వికృతి ఉగాది పద్యకవితా సదస్సు – మూడవ భాగం

  1. విశ్వామిత్ర says:

    అరయన్నాతని బాణమాసుదతి ఆస్యాలంబహాసంబగున్

    విరులేలా? విలుగాను భాసురపు మోవేయొప్పువేరేటికిన్

    గురులందాగెనొ, డెందెమందొ, కలికింగూడీనిమేషంబునన్

    శరమున్ గొట్టగ నన్ను, చిక్కెదనో? ఈశా! వానికే డిల్లుచున్!

    రెండో పాదం లో భాసురం సహజ భాసురమే కానీ, లత్తుక మహిమ కాదని మనవి.
    నాలుగో పాదం లో నో ఒక పొల్లు ఎక్కువ పడింది, అది నొ గా జదువుకొన ప్రార్ధన, ఇలాంటి సందర్భాలలో గట్టిగా నో అనటం కూడ సముచితం కాదు 🙂

  2. ఈ ఉగాది కవిసమ్మేళనం చాలా రసవత్తరంగా ఉంది. కవిత్వం వ్రాయడం రాకపోయినా కొంచెం మాత్రమే అర్ధం అయినా నా బోటి వారికి ఎంతో ఉత్సాహంగానూ, నేర్చుకోడానికి ప్రోత్సాహకరంగానూ ఉంది. దీనికి రూప కల్పన చేసిన వారికీ, పాల్గొంటున్న కవిపుంగవులకీ నా ధన్యవాదాలు. అభినందనలు.
    రసవత్తరంగా సాగుతున్న కవిసమ్మేళనం మధ్యలో నా అప్రస్తుత ప్రసంగానికి క్షంతవ్యుణ్ణి.
    భవదీయుడు,
    వంగూరి చిట్టెన్ రాజు
    హ్యూస్టన్, టెక్సస్

  3. విశ్వామిత్రుల వారూ, మీరు చూపిన పొరపాటును సవరించాం. నెనరులు.

  4. కామేశ్వర్రావుగారు బాగా పద్యం చదువుతారని ఊహించినదే, ఇంతకు ముందు ఆయన బ్లాగులో విన్నాము కాబట్టి. కానీ చదువరి గారూ, మీ కవితా గాన మాధుర్యం ఊహించనిది. మాలికలెన్నో పద్యం చాలా ఛాలా బాగా పాడారు. అభినందనలు.

Comments are closed.