-అక్కిరాజు భట్టిప్రోలు
ఇప్పటి వరకు ఏ కథకీ నేను ముందుమాటలు, వెనక మాటలు రాయలా. ఏవో పెద్ద నవలలకి రాస్తారు గానీ, కథలకి ముందూ వెనకా మాటలేమిటి? అయినా కథ వెనక కథ అని రాసే సంప్రదాయం కొంత ఉంది. గొప్ప రచయితల బుర్రలో ’ఏ కుమ్మరి పురుగు తొలిస్తే ఆ కథ బయటికి వచ్చిందా’ అని సామాన్య పాఠకులకీ, వర్థమాన రచయితలకీ సహజంగానే ఉత్సుకత ఉంటుంది. అనుకున్నదొకటీ, అయినది ఒకటీ అయి, చెప్పిన కథ పూర్తిగా పాఠకులకి చేరలేదు అని అనిపించినప్పుడు కూడా రచయితలు తప్పనిసరై “కథ వెనక కథ” అనే పేరుతో సంజాయిషీ ఇచ్చుకునే సందర్భం కూడా ఉండచ్చు. ఇప్పుడు రమాదేవి కథకి ఎందుకు రాస్తున్నాను అనేది మీకు మీరే నిర్ణయించుకోండి.
నేను రాసిన కథలపై చర్చలు జరిగినప్పుడు ’బాగుంది’ అన్నవాళ్లకి “థాంక్యూ” అని చెప్పా. చెత్తగా ఉంది అన్నవాళ్ళకి కూడా “థాంక్యూ” అనే చెప్పా. ఏనాడూ నేరుగా చర్చలో దూరలా. కథ ఒకసారి బయటకి వచ్చాక, దాన్ని అదే డిఫెండ్ చేసుకోవాలి. రచయిత దాని వెనక కర్ర పుచ్చుకుని కాపలా కాయటం కన్నా దౌర్భాగ్యం మరోటి ఉండదు.
కథ వెనక కథ రాయటం అనేది అలా డిఫెండ్ చేసే కార్యక్రమంలా కాకుండా, నేపథ్యం, ప్రేరేపించిన సంగతులు, రాయటంలో పడ్డ కష్టం (ఒక్కోసారి క్షోభ కూడా) క్రోడీకరించుకోవటం కొంచెం సరదాగానే ఉంటుంది. నా బ్లాగు మొదలు పెట్టాక, ప్రతి కథకీ అలా రాద్దామనే అనుకున్నా. కర్ణుడు కవచకుండలాలతో పుట్టినట్టు, నేను సహజ బద్ధకంతో పుట్టాను. ఆ బద్ధకమే ఈ ప్రపంచాన్ని నానించి కాపాడుతోంది అని గిట్టని వాళ్ళంటారు. వేరెవరి కోసమో కాదు, నాకోసమే నేను రాసుకుందామని. మరో పదేళ్ళ తరవాత, మళ్ళీ నా ఆలోచనలని నేనే ఎలా చూస్తాను అనే ఓ కోరిక.
రమాదేవి కథతోనే దీన్ని మొదలు పెట్టడం సబబుగా ఉంటుందని పించింది. ఎందుకంటే, నేను రాసిన కథల్లో చాలా ఎక్కువ మిశ్రమ స్పందన వచ్చిన కథగా కూడా దీన్ని చెప్పుకోవచ్చు.
“మేథావులూ మూస పాత్రలూ” అని ఓ వ్యాసం రాసి ఉన్నాను. అందులో ఐటి ఉద్యోగులందర్నీ తాగుబోతులూ, తిరుగుబోతులుగా చూపే మీడియాని, మేధావి (?) రచయితల వర్గాన్ని తీవ్రంగా నిరసించాను. వాళ్ళ జీతాలు కాస్త ఎక్కువగా ఉండచ్చు గానీ, అందులో ఉన్నదంతా మద్యతరగతినించి వచ్చి, ఇంకా ఆ విలువలతోనే సతమత మయ్యే సగటు జీవులు అని నా వాదాన్ని వినిపించా. ఈ కింది పేరా చూడండి.
“ఐటి ఉద్యోగుల్లో అక్కడక్కడా కనపడే వికృతాలకి కారణం ఐటీ కంపెనీలనుకోవటం అమాయకత్వం. దానికి కారణం, మధ్యతరగతి నించి బయటపడ్డ, మరే విలువలూ పాటించక్కరలేని ఓ స్వేచ్చ. ఓ పని చేయచ్చు. ఓ పదిమంది మధ్యతరగతి యువకులు ఓ మాదిరి పట్టణంలో (ఖమ్మం, కర్నూలు లాటి) వెతికి మనిషికో కోటి రూపాయలు ఇచ్చివద్దాం. వాళ్ళలో ఎంతమంది పబ్బుల్లోకి వెళ్తారు, వాళ్ళ శీలాలు (?) చెడగొట్టుకుంటారూ, ఎంతమంది జీవనవిధానం మారినా విలువలు (??) మారకుండా ఉంటారూ అని చూడచ్చు. ఇప్పుడు ఐటీలో ఉండే ఓ పదిమంది ఎలావున్నారో అలాగే ఈ పదిమందీ తయారవుతారని నా నమ్మకం.”
మధ్యతరగతి ఓ పెద్ద సంక్షోభంలో ఉంది. EAMCET నించి మొదలు పెట్టి IT, BPO, USA, F1, H1, H4, B1, L1 లాంటి కొత్త కొత్త పదాలు, అందాకా స్తబ్దుగా ఉన్న మధ్యతరగతిని వెర్రెక్కించాయి. దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉన్నాయి సమాజం మీద. అదంతా వేరే కథ.
దీని సైడ్ ఎఫెక్ట్ ఏమిటంటే, అందాకా చాపకింద నీరులా ఉన్న మధ్యతరగతి హిపోక్రసీ బట్టలు విప్పుకుని బయట పడింది. శీలం అనేదానికి పైపై అలవాట్లతో, బలహీనతలతో ముడిపెట్టి తమని తామే మోసంచేసుకున్న మధ్యతరగతి మాయ పటాపంచలయిపోయింది. వీడు దుర్మార్గుడు “విలన్” అని సినిమాలో చెప్పడానికి పది సెకన్ల సమయం చాలు. ఓ చేతిలో సిగరెట్, ఓ చేతిలో మందుగ్లాసు ఉంటే చాలు. వాడు దొరికిన అమ్మాయిని దొరికినట్టు రేప్ చేస్తాడు, మనుషుల్ని నరికేస్తాడు, అమ్మ, అక్క, అన్న, భార్య అనే సంబంధాలు తెలీనివాడు, స్మగ్లింగ్ చేసేవాడూ, డ్రగ్స్ అమ్మేవాడూ అయిపోతాడు. ఇదంతా ఒక్క సిగరెట్టూ, ఒక్క సగం నింపి ఉన్న మందుగ్లాసు చెప్పేస్తుంది. ప్రతి సిగరెట్ తాగేవాడూ, మందు తాగేవాడూ కనక హంతకులయి ఉంటే, ఈ పాటికి ఈ భూమిమీద మనిషనే వాడే మాయమయి ఉండేవాడు.
ఇలాటి విలువలనే ఆడవాళ్ళ పరంగా చెప్పినవి మరింత కౄరంగా ఉంటాయి. రేప్ చెయ్యబడ్డ అమ్మాయి, రేప్ చేసినవాణ్ణే పెళ్ళి చేసుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ సూపర్ హిట్ సినిమాలు. అసలు రేప్ ఏం ఖర్మా, “తాత్కాలికంగా విచక్షణ నశించి ఎవరితోనో సంబంధం పెట్టుకుంటే మాత్రం ఆ మనిషి ఇక ఎల్లకాలం మలినమయి పోతుందా” అని నాబోటివాడు అడిగితే ఎందరివో మనోభావాలు దెబ్బతినేస్తాయి.
చంటి సినిమాలో క్లైమాక్స్ గుర్తుందా? పొరపాటున ఆ పిచ్చాడు వెంకటేష్ తల్లి (విధవరాలు)కి తాళి కట్టేస్తాడేమోనని తెగ టెన్షన్ పెట్టే సీన్. మనలో మనమాట, ఒక వేళ మన హీరో గారు రావటం లేటయి కట్టేశాడే అనుకోండి. ఇక ఆవిడ అపవిత్రమయిపోయి ఆ పిచ్చి భర్తగారిని భరించాల్సిందేనా? కళాతపస్వి విశ్వనాథ్ గారేమీ తక్కువ తిన్లేదు. స్వాతిముత్యం కమలహాసన్ అలా తాళికట్టేస్తే, ఇలా రాధికగారు అలా సర్దుకు పోతారు. ఏమిటీ పెంట అని నాబోటిగాడు అడగాలన్నా భయమే.
విషయమేంటంటే, ఇవన్నీ కూడా పైపైన వేసే దొంగ వేషాలు. దొంగ విలువలు. నయనతార, త్రిష, చార్మీ బొడ్డూ చంకలూ చూపిస్తుంటే, చొంగ కార్చుకుంటూ ఈ మధ్యతరగతి ప్రతిరోజూ చేసే మానసిక వ్యభిచారం కనపడదు. ఓ పందెం కడతాను. టి.వి పెట్టి ఎక్కడన్నా మొదలు పెట్టండి. వరసగా మార్చుకుంటూ పొండి. అమ్మాయి బొడ్డు కనపడకుండా మీరు అయిదు చానల్స్ మార్చలేరు. ఇరవైనాలుగు గంటల్లో ఎప్పుడయినా సరే.
ఇంకా చెప్తాను. ఇదే పందెం అమెరికాలో కడితే ఓడిపోతాను. కానీ మనం ఏదో సంస్కారవంతులం, పాశ్చాత్యులు మాత్రం పూర్తిగా కుళ్ళిపోయిన వాళ్ళు అని చెప్పేస్తాం అమాయకంగా. అమెరికా టి.వి చానల్స్ మనకంటే సంస్కారవంతమయినవని నేను నిర్మొహమాటంగా చెప్తాను.
“నా పదమూడవ ఏటనించీ హస్త ప్రయోగం చేసుకుంటున్నాను. ఇప్పుడు పెళ్ళి చెయ్యాలనుకుంటున్నారు. నేను సంసారానికి పనికివస్తానా?” “హస్త ప్రయోగం వల్ల నష్టంలేదు. శుభ్రంగా పెళ్ళి చేసుకోండి” ఈ ప్రశ్న, ఆ సమాధానం ఓ మిలియన్ సార్లు చదవని తెలుగువాడు ఉండడు. సమరం గారంటే నాకు ఎనలేని గౌరవం. చాలా అవసరమయిన సమాచారాన్ని మొదటిసారి తెలుగు ప్రజలకి అందుబాటులోకి తెచ్చారు. కానీ ఆ శీర్షికలని మధ్యతరగతి సాఫ్ట్పోర్న్ చదవడానికి ఓ వంకలా తయారు చేసుకుంది. ఆ సంగతి అందరికీ తెలుసు.
“సర్వకాలాల్లో, (అన్ని వేళల్లో) అన్ని ఊళ్ళల్లో సెక్స్ పుస్తకాలు, బ్లూ ఫిల్ములూ దొరుకుతున్నాయి” అనేది ఎవరికీ తెలియదా? అయినా అది “చట్టరీత్యా నేరం”. మన వాళ్ళంతా నీతిమంతులు. చట్టం దానిపని అది చేసుకుంటూ పోతూనే ఉంది. మనందరి “నీతి” అలా ప్రజ్వలంగా ఉండనే ఉంది.
ఎప్పుడూ అనిపించలా, ఎందుకు మనం ఇన్ని విరుద్ధాల్లో బతుకున్నాం, కనీస నిజాయితీ కూడా లేకుండా అని?
మనుషులకి సహజంగా ఉండే కోరికలని బలహీనతలుగా, తప్పులుగా తయారుచేసుకున్న మధ్యతరగతి లోంచి ఒక్కసారి బయటపడితే ఉండే వికృతాలే మనకి మన సమాజంలో కనపడుతున్నాయి అని నా భావన. మన నగరాల్లో మరింత ఎక్కువగా.
జరుగుతున్న యాసిడ్ దాడుల్ని చూడండి. నాకు బాధేస్తుంది. యాసిడ్ ఎవరిమీద పడిందో వారి పట్ల జాలి పట్టానికి మనకి కావల్సినంత సంస్కారం, దయ, మానవత్వం, మిగిలే ఉన్నాయి. కానీ ఆ యాసిడ్ పోసిన వాళ్ళని ఎన్కౌంటర్ చేసి చంపేసేటంత కౄరత్వం మనకి ఎక్కణ్ణించి వచ్చింది?
ఆ యాసిడ్ పోసిన వాళ్ళ వయసులు ఎంత? వాళ్ళు ఏ సమాజంలో పెరిగారు? వాళ్ళు అంత దుర్మార్గులుగా తయారవగల వాతావరణం ఎక్కడ ఎలా ఏర్పాటయింది. ఏదో ఒక్క సంఘటనే జరిగి ఉంటే ఆ ఒక్కడిలోనే ఏదో లోపం ఉందనుకోవచ్చు. వరస పెట్టి ఇలా సంఘటనలు జరుగుతుంటే, ఈ సమాజం ఏమీ బాధ్యత వహించదా? వాళ్ళు పెరిగినట్టే, అదే ప్రాంతంలో, అదే రకంగా నేను కూడా పెరిగి ఉంటే, అప్పుడు కూడా ఇలా రచయితలా ఈ వ్యాసం రాస్తూ ఉండేవాణ్ణా, లేక నేను కూడా ఎవరి మీదో యాసిడ్ పోసి ఎన్కౌంటరయి పోయి ఉండేవాణ్ణా?
ఈ సాఫ్ట్పోర్న్ సినిమాలూ, పుస్తకాలూ పిల్లల్లో హార్మోన్లని వెర్రెత్తి పరిగెట్టిస్తూ ఒక వైపు. అందుకు తగ్గట్టుగా సమాజం పబ్లిగ్గా అంగీకరించలేని తగలడిపోయిన దొంగవిలువల అడ్డుకట్టలు ఒక వైపు. ఏం చేయాలి యువత? సెక్స్ అనేది ఓ పెద్ద లయబిలిటీ అయిపోయింది. పార్కుల్లో, బీచిల్లో, చెట్ల చాటునా, నెట్ కఫేల్లో, కానిస్టేబుళ్ళ మామూళ్ళ మధ్య, మధ్యతరగతి యువత నలిగిపోతోంటే సూటిగా ఆ సమస్యని చూసే ధైర్యంలేదు. MMS లూ, దొంగ వీడియోలూ ఎన్ని జీవితాల్ని నాశనం చేసినా విడివిడి సంఘటనలు గానే చూస్తాం. అంత కంటే ఈ టీనేజర్లకి ఓ కండోమ్ ఇచ్చి బెడ్ రూం చూపించ గలిగితే మనం ఈ సమాజానికి చాలా మేలు చేసిన వారవుతాం.
ఆ ఐటీ పబ్ కల్చర్ దగ్గర్నించి, ఆ యాసిడ్ దాడులదాకా అన్నిటి వెనకా ఉన్నది మానసికంగా కుళ్ళిపోయిన ఈ మధ్యతరగతి అని చెప్పడానికే ఆ కథ “రమాదేవి ఎందుకు రమ్మంది” రాసింది.
ఐటి, హైదరాబాద్ సిటీ లాంటి వాటినించి దూరంగా, ఓ మధ్య తరగతి మనిషిలో దాగిఉన్న, దాగి ఉండే అగ్నిగుండాన్ని ఆవిష్కరించడమే ఆ కథ ఉద్దేశం. రాజారావు ఫాంటసీలు సగటు మధ్యతరగతి మొగాడి మదిలో మెదిలేవా కావా అనేది నిజాయితీగా ఎవరికి వారు నిర్ణయించుకోవచ్చు. అది నిజమయితే, నిజమని పాఠకుడు అంగీకరిస్తే, ఆ కథకి అర్థం ఉంది. కాదనుకుంటే, అది రచయిత వికృత మనస్తత్వానికి ఋజువు. కథని పక్కన పెట్టి మర్చే పోవచ్చు.
హాస్టల్స్ లో చాలాకాలం ఉన్న నాలాంటి వాళ్ళకి తెలుసు. మెన్స్ హాస్టల్స్ లో వాడే భాష. సొంత క్లాస్ మేట్స్ అయిన అమ్మాయిల గురించి మాట్లాడే మాటలు. ఆ పచ్చిబూతులు వినీ వినీ (మాట్లాడి కూడా) వున్న నా బోటివాడికి వెనక్కి తిరిగి చూస్తే ఏమిటి వీటికి మూలం అని అని పించదా?
నాకు మన పత్రికల మీద, సాహిత్య సెన్సార్షిప్ మీద కూడా చాలా కోపం. ఇంగ్లీషు కథల్లో రోడ్డు మీద మాట్లాడే భాష యథాతథంగా రాయచ్చు. మన సో కాల్డ్ సంస్కారవంతులు, “మంచి కుటుంబాలనించి వచ్చిన వాళ్ళూ” హాస్టళ్ళలో మాట్లాడే భాషని రాయలేని పరిస్థితి. ఇక్కడ కూడా అదే హిపోక్రసీ. అందరికీ తెలుసు అక్కడేం మాట్లాడతామో. అయినా సరే దాన్ని అంగీకరించలేని పరిస్థితి. అది యథాతథంగా రాసి ఎండ కట్టాలని నాకు మా చెడ్డ కోరిక. ఇక ఇంగ్లీషులో రాయడమే మార్గం.
వీటన్నిటినీ క్రోడీకరించి, కసిగా, కోపంగా రాసిన కథ రమాదేవి ఎందుకు రమ్మంది. ఆ రాజారావు అర్భకుడు కాబట్టి అలా మిగిలిపోయాడు. మరో రాజారావు యాసిడ్ పోస్తాడు. మరో రాజారావు ధాబాల్లో పడుకుని కుటుంబానికి ఎయిడ్స్ అందిస్తాడు. భారతదేశంలో అక్రమ సంబంధాలు అతి ఎక్కువగా ఉన్న రాష్ట్రం మనది అని మనందరికీ తెలుసు. యాసిడ్ పోసినా, పోయక పోయినా మన చుట్టూ ఎంత మంది రాజారావులు ఉన్నారో మీ నిర్ణయానికే వదిలేస్తాను. జాగ్రత్తగా గమనించండి. బయటనించి చూస్తే రాజారావు “సంస్కార వంతుడూ”, “దైవభీతి కలవాడూ”, “చక్కగా సంసారం చేసుకుంటున్న వాడూ”.
యాసిడ్ దాడులు జరుగుతున్నప్పుడు నాకు వచ్చిన కోపానికి తుది రూపం ఈ కథ. ఈ కథలో ఒక్క యాసిడ్ దాడీ ఉండక పోవచ్చు. కానీ, వాటికి కారణాలు మనచుట్టుతానే ఉండి, మనం కూడా బాద్యులుగానే మిగులుతాం అనేది సూచించటానికి చేసిన ఓ వ్యర్థ ప్రయత్నం ఈ కథ.
అందుకే, నా వరకూ నేను రాసుకొన్న పూర్తి విషాధభరిత కథ ఇది.
సంబంధిత లింకులు
1. రమాదేవి ఎందుకు రమ్మంది (Author’s cut)
2. రమాదేవి మళ్ళీ రమ్మంది
—————————
రాసి కంటే వాసిలో మిన్నయైన రచయిత, అక్కిరాజు భట్టిప్రోలు. హైదరాబాదులో సాఫ్టువేరు ఇంజనీరుగా పనిచేస్తున్నారు. వీరు మూడు బీర్ల తర్వాత అనే బ్లాగును నిర్వహిస్తున్నారు.
నాకు తెలియని విషయాల జోలికి నేను సాధారణంగా పోను. ఇవాళ ఏం తోచక ’పొద్దు’ చూస్తుంటే మీ కథా, దానికి సంబంధించిన వ్యాసాలూ కనపడ్డాయి. కథ పేరు ఎక్కడో విన్నట్టే అనిపించింది. చదివితే, ఇదివరకు – ఆంధ్రజ్యోతి ఆదివారం ఎడిషన్లో అనుకుంటాను – చదివిన కథే. అప్పుడూ నా బండ మనస్సును తాకలేదు. మళ్ళీ చదివినా ఇప్పుడూ తాకలేదు. Author’s cut అయినా సరే!! కథలు – not my cup of tea.
కానీ, మీ ’కథ వెనక కథ’, కొంచం మనసును తట్టింది. ఎందుకంటే నేనూ పచ్చి మధ్యతరగతి వాణ్ణే. మీ ఆవేదనకి నేను స్పందించగలను.
మధ్యతరగతి సమాజం ఒక పంజరం. అందులోనే పుట్టి పెరిగిన చిలక ఒక్కసారి పంజరం తలుపు తెరిస్తే ఏం చేస్తుంది? ఎగిరిపోయి ప్రపంచాన్నంతా పులిమేసుకుని గెంతులేస్తుందా? (ఐటీవాళ్ళు పబ్బులకి వెళ్ళినట్టు?) పులుముకుంటే నష్టమేమిటి?
లేకపోతే ప్రపంచాన్ని చూసి భయం, భయంగా తప్పించుకుని మళ్ళీ తన పంజరంలోకే వెళ్ళిపోదామని ప్రయత్నం చేస్తూ ఉంటుందా? లోపలికి వెళ్లలేక, బయట బతకలేక సతమతమౌతుందా? రెక్కలున్నాయని తెలిసినా ఎగరలేని అసమర్థతతో బాధపడుతుందా? (నాలాంటివాళ్ళలాగా?) మరి దానికి పరిష్కారం ఏమిటి?
అలాగే పంజరంలోంచి బయటకి రాలేని చిలకల సంగతి ఏమిటి? పంజరంలోనే తమదైన (ఊహా) ప్రపంచాన్నీ, విలువల్నీ సృష్టించుకుని అలాగే బతికి, అలాగే చచ్చిపోతాయా? ఇన్ని వందల, వేల ఏళ్ళుగా అలాగే జరుగుతోందిగా? ఇప్పుడు మనమేమైనా చేయగలమా?
పోనీ పంజరాల్ని ఎవరైనా ఏమైనా చేయగలరా? కూలదోసి విప్లవాలు తెప్పించగలరా? అన్ని చిలకలూ ఒకేలాగ, ఒకేచోట బతకాలని శాసించగలరా?
నాకైతే అన్నీ ప్రశ్నలే ఉంటాయి. ఏ ప్రశ్నకీ సమాధానం ఉండదు. కాలగతిలో జరిగే మార్పుల్ని శాసించలేము, ప్రతిస్పందించగలమే తప్ప – అనిపిస్తుంది!!
కథలమీద నాకున్న పెద్ద కంప్లయింటు – కథల్లో స్పందనలే తప్ప సమాధానాలుండవు. నా ఏడుపే నాకు చాలనట్టు మరొకడి ఏడుపు కూడా అనుభవించాలి అందులో. కథలకన్నా సిద్ధాంతాలు బెటరు – వాటిల్లో ఉటోపియాలు దొరుకుతాయి.
చివరాఖరికి నేను తెలుసుకున్నది ఒకటే – ఎవడి సమాధానం వాడికే దొరకాలి. ఏ చిలకకి తగిన గూడు ఆ చిలకే అన్వేషించుకోవాలి. మిగతా చిలకల గురించి కథలు రాసుకోడం చర్చించుకోడం కొన్ని చిలకలకి ఇష్టమైన వ్యాపకం. అందులో వాటికి శాంతి దొరికితే మంచిదే – పరిష్కారాలేమీ చెప్పలేకపోయినా!!
“Submission to passion is Human Bondage
But the excercise of reason is Human Liberty.”
-Somerset Maugham
ఒక రోజు ఇటువంటి ఇంకో విషయం పై నా స్నేహితురాలితో మాట్లాడి, అయోమయంలోనే సంభాషణ ముగించిన కొద్ది సేపట్లోనే పై వాక్యాలు కనిపించాయి. అవి మా చర్చకు సరైన సమాధానంతో ముగింపును ఇచ్చాయి అప్పట్లో.
ఇప్పుడు ఈ కథ వెనుక కథ చదివిన తర్వాత నాకూ ఆవేశం వచ్చింది. రచయితకు ఆవేశం కలిగించిన దానికి ఇంకో విపరీత కోణంలో. యాసిడ్ దాడిలో బలైన అమ్మాయిల / అబ్బాయిల, వివరాలు మనకి తెలుసా? అందులో అమ్మాయిలు రమా దేవి వంటి వారా? ముఖ్యంగా వార్తలలో వచ్చిన వారు?
అన్నిటీకీ మించి, హిపోక్రసీకి మందు రచయిత సూచించినదేనా? మగ వాడై పుట్టినందుకు అంతకు మించి మోక్ష మార్గం లేదా?
మగ వారు అందరూ రాజారావులు కాదు, ఆడ వారు అందరూ రమా దేవిలూ కారు, వారి వాతావరణాలతో సహా. రాజారావు, రమా దేవి, ఒక కథలో పాత్రలు, కొన్ని రకాల వ్యక్తులకు ప్రతీకలు. సమస్యను చూపించడానికి రచయిత ఎన్నుకున్న ఉపకరణాలు, ఆ పాత్రలూ, దానికి అవసరంగా సృష్టించుకున్న సంఘటనలూను.
ఈ సమస్య గురించి ఎవరి పరిధిలో వారు ఆలోచించాల్సిందే, ఆరోగ్యకరమైన ఆలోచనలు చేయవలసిందే. ఒక మ్యాజిక్ పిల్ వంటి సమాధానం మాత్రం లేదు అన్నది నిర్వివాదం. ఉంటే అది మత్తు పదార్థాలకూ, మాదక ద్రవ్యాలకూ, దొంగతనం, లంచగొండితనం వంటి ఎన్నో దురలవాట్లకు, వ్యసనాలకు కూడా ఉండే ఉంటుంది. అలాగే అతిగా చేసే ఏ పనికైనా (మంచి పనులతో సహా).
The related links are not working. Can you fix them so that the story also can be read?
Thanks,
Rama