కో హం

-హెచ్చార్కె

ఏడుపు వస్తోంది
ఎట్నుంచి ఎటో వెళ్తూ
ఒక పాడువడిన పాకలో
తల దాచుకున్నాను
ఇక్కడెవరో నివసించిన,
పిల్లల్ని కని పెంచిన,
చనిపోయిన గుర్తులు
నేను దేన్ని వెదుక్కుంటున్నాను?
ఎక్కడ పోగొట్టుకున్న ఆశను?
ఎట్నుంచి వచ్చానో ఎటు వెళ్తున్నానో
తెలియనివ్వకుండా
కళ్లను కబళించేంత కాటుక వంటి చీకటి

దూరంగా బండ్లు వెళ్తున్న చప్పుడు
బండి చక్రాల రాపిడిలో
ఇక తిరిగి రాదల్చుకోలేదనే లోహ ధ్వని
విషాదంగా మోగుతున్న ఎద్దుల మెడ గంటలు
ఇష్టం లేని ప్రయాణం, అమావాస్య రాత్రి
కాసేపు ఇక్కడ మజిలీ చేయరాదా?
అంతగా నొచ్చుకుని వెళ్లడమెందుకు, ఆగిపోరాదా?
అయినా, నాకెందుకు ఏడుపు?
రేపటి సంగతి రేపే అనుకుని నిద్రపోరాదా?

అడ్డదిడ్డంగా పరుచుకున్న గడ్డి పక్కలో
ఎంత వెదుక్కున్నా దొరక్కుండా
గుచ్చుకుంటున్న గుండు సూది
జవాబు కోసం ఒక్కొక్క గడ్డిపోచను తీసి
చూసి పారేయడానికే ఈ రాత్రి చాలేట్టు లేదు
అంధకారంతో కలిసి వెలుగు ఉంటుంది గాని,
కళ్లు కనపడ్డానికి అవసరమైనంత కాంతిని
పిండుకోడానికి ఈ చీకటి చాలేట్టు లేదు

This entry was posted in కవిత్వం. Bookmark the permalink.

26 Responses to కో హం

  1. rajesh says:

    baagundi mee kavita. chaala aardhramga. ko hum ante?

  2. చివరి చరణం చాలా బలంగా ఉంది.

  3. హెచ్చార్కె says:

    రాజేష్ గారూ, ‘కో హం’ అంటే ‘నే నెవర్ని’ అని.

  4. హెచ్చార్కె గారు చాలా బాగుందండి. అభినందనలు.
    ఆ సమయం వస్తే, ఎవరైనా .. ఫెళ్ళని పగిలిన పగళ్ళలోనూ.. జీవితాన్ని పిండి ఆ గుండుసూది దొరకక పిప్పిగా మిగిలి పోవలిసిందే.. ఆ ముక్కల్లో కలిసిపోవలిసిందే.. why me? మంత్రం వల్లెవేయాల్సిందే !

  5. హెచ్చార్కె గారు

    చాలా నచ్చిందండి. చదివినవాళ్ళకు బయటకు రావడానికి కాస్త సమయం పట్టక తప్పదు.

  6. గరికపాటి పవన్ కుమార్ says:

    కధన శైలిలో ఉన్న ఈ కవిత కధగా ఇంకా రాణించేదేమో(ఎందుకంటే కధలో ఒక వాతావరణాన్ని కల్పించడనికి రచయిత ఇటువంటి వాక్యాలనే పేరుస్తాడు ఉదా: మొదటి నాలుగు పంక్తులూ కలిసి చదివితే “ఏడుపు వస్తోంది, ఎట్నుంచి ఎటో వెళ్తూ ఒక పాడువడిన పాకలో తల దాచుకున్నాను”. ) ఆలూరి బైరాగి “దివ్య భవనం” లో ఈ కోవకు చెందిన తాత్విక పరమైన కధలు ఉన్నాయి అలాంటి కధగా బాగుండేది.

    కో హం అన్న పేరు సరిగా అర్థం కాలేదు, నేనెవర్ని? అని సుబ్బరంగా తెలుగులో పెట్టొచ్చు కదా? ఇలా అడుగుతుంటే “The kings new clothes” లో చిన్న పిల్లాడ్ని నేనవుతానా?

  7. హెచ్చార్కె says:

    రాజేష్, కొత్తపాళీ, ఆత్రేయ, తులసిమోహన్! పద్యంలోని నొప్పితో కరచాలనం చేసినందుకు మీకు కృతజ్ఙతలు.

  8. నాక్కూడా ఆఖరి చరణమే నచ్చింది హెచ్చార్కె గారు.

  9. హెచ్చార్కె says:

    పవన్, కృతజ్ఙతలు. ఔను, శీర్షిక తెలుగులోనే పెడితే పోయేది. నేను విన్న కాళిదాసు కథను పాఠకులు విని ఉంటారని, అది గుర్తొచ్చి ఆనందిస్తారని, కో హం అంటే ఒకరైనా త్వమేవాహం అంటారని ఆశ పడ్డాను. అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నట్టు లేదు. మీరు చిన్న పిల్లాడు అయితే మంచిదే కదా! అదంత సులభం కాదు గాని, ప్రయత్నించడంలో తప్పు లేదు. నేను అలాగే ప్రయత్నిస్తున్నా, ఎన్ని సార్లు విఫలమయినా. రాజుగారి కొత్త బట్టల ప్రస్తావన ఇక్కడెందుకు? గుంపులు, పరస్పర పొగడ్తలు, పీఠాలు మొదలైన దేవతా వస్త్రాలకు దూరంగా ఉంటున్న నా ఒంటి మీద కేవలం నా బట్టలే ఉన్నాయి, చిరిగినవో, మాసినవో, ఏవో. కవనంలో కథాకథన శైలి, సంభాషణ శైలి, వర్ణనాత్మక శైలి… ఏది బాగుంటుందనుకుంటే అది ఉండొచ్చనుకుంటాను. దీనికి కచ్చితమైన నియమాలు లేవనుకుంటాను. కాకపోతే, ఈ కవితలో కథ ఏమీ లేదు. ఇన్సిడెంటు మాత్రమే ఉంది, అదీ, ప్రతీకగా. ఇంతా చేసి, కవితలో మనస్సును తాకేది ఏమైనా ఉందా లేదా అన్నదే ముఖ్యం అనుకుంటాను.
    సుబ్రహ్మణ్యం గారూ, ధాంక్స్.

  10. bollojubaba says:

    belated త్వమేవాహం

    ఆ మాటన్నది సరస్వతీదేవా, జలాలుద్దీన్ రూమీ నా లేక ఆరుద్రా 🙂

  11. హెచ్చార్కె says:

    బాబా, థాంక్స్. రూమీ గురించి విన్నాను గాని చదవ లేదు. మీ వ్యాఖ్య చదివాక, వికీపీడియాలోనికి వెళ్లి కాస్త పరిచయం చేసుకున్నా. 🙂

  12. budugoy says:

    >>రాజేష్ గారూ, ‘కో హం’ అంటే ‘నే నెవర్ని’ అని.

    కోహం అన్న పదాన్ని అలా విడదీసి ఎందుకు రాస్తున్నారు? శీర్షికలోనూ.. మీ సమాధానాల్లోనూ..?

  13. హెచ్చార్కె says:

    ఆ మాటకొస్తే, ‘నే నెవర్ని’ అనే పదాన్ని కూడా విడదీయకూడదు. విడదీస్తే ఎక్కువ స్పష్టంగా ఉంటుందని అలా చేశాను.

  14. budugoy says:

    హెచ్చార్కే గారు, మీ వివరణ “హాస్యా స్పదంగా” ఉంది. సంధి చేయబడ్డ పదాన్ని విడదీసి రాస్తే ఎక్కువ స్పష్టంగా ఎలా ఉంటుంది?
    స్పష్టత కోసం విడదీస్తే (కః + అహం – ఎవరు + నేను) అని విడదీయాలి. పరభాషతో గందరగోళాలెందుకనేనేమో పవన్ గారు తెలుగు టైటిల్ను సూచించారు.
    ఇప్పటికైనా సంపాదకులు కవిత టైటిల్ను సరిచేయాలని భావిస్తాను.

  15. హెచ్చార్కె says:

    బుడుగోయ్ గారూ, పవన్ గారు ఎందుకు తెలుగు టైటిల్‍ సూచించారో ఆయనే చెప్పారు. ఔన్నిజమే అంటూ నా వివరణ ఇచ్చాను. మీ వ్యాఖ్యకు నా వివరణ హాస్యాస్పదంగా ఎందుకు కనిపించింది? నాకలా అనిపించలేదు.
    సంధి కలిసిన పదబంధాల్ని, సంధి విడదీయకుండానే, విడి విడిగా రాయడం నేను చాల చోట్ల గమనించాను. స్పష్టత కోసం కుడా అలా చేశారని అనుకున్నాను. అందుకే, నా పద్యం టైటిల్‍ను అలా రాశాను.
    నేను సంస్కృత వ్యాకరణం దిట్టంగా చదువుకోలేదు. చదువుకున్న మేరకు సూత్రాలు గుర్తు లేవు. మీరు బాగా తెలిసిన వారి వలె ఉన్నారు. అందుకని అడుగుతున్నాను.
    డాక్టర్ జి.వి. సుబ్రహ్మణ్యం గారు సంపాదకత్వం వహించగా టి. టి. డి. వారు ప్రచురించిన శ్రీమదాంధ్ర మహా భారతం ఆది పర్వం, ప్రథమాశ్వాసం, మొట్ట మొదటి మంగళ శ్లోకంలో మొదటి చరణాల్ని, పుస్తకంలో అచ్చైన విధంగా ఈ కింద రాస్తున్నాను.

    శ్రీవాణీగిరిజా శ్చిరాయ దధతో వక్షోముఖాఙ్గేషు యే
    లోకానాం స్థితి మావహ న్త్యవిహితాం స్త్రీపుంసయోగోద్భవాం

    ఇందులో సంధి కలిసిన పదాల్ని, విసర్గ వచ్చిన చోట్ల, ఇతర చోట్ల కూడ‍ విడదీసి రాశారు. (గిరిజాః +చిరాయ, దధతః +వక్షోమూఖాఙ్గేషు, స్థితమ్ +ఆవహన్తి +అవిహతామ్….). అలా ఎందుకు రాశారో వివరించండి. ఇది కేవలం తెలుసుకోడానికి, ఇప్పటికి చేసింది మరీ తప్పైతే మరోసారి చేయకుండా ఉంటానికి, చేస్తున్న విజ్ఙప్తి.

  16. హెచ్చార్కెగారు,

    సంధులు కలిసినప్పుడు స్పష్టత కోసం పదాలను విడిగా వ్రాయడం సాధారణమే. కాని అది రెండవ పదంలోని అక్షరంతో మొదలవుతుంది. ఉదాహరణకి మీరిచ్చిన పద్యంలో “శ్రీవాణీగిరిజా శ్చిరాయ” అని వ్రాసినప్పుడు “చిరాయ” అన్నది పదం కాబట్టి ఆగమంగా వచ్చిన “శి”తో బాటుగా “శ్చిరాయ” విడిగా వ్రాస్తారు. అంతే కాని “శ్రీవాణీగిరిజాశ్చి రాయ” అని వ్రాయరు. మిగతా పదాలు కూడా అలాగే, గమనించండి. “నేనెవర్ని” అన్నప్పుడు “ఎవర్ని” రెండో పదం కాబట్టి అది పూర్తిగా విడిగా ఉండేటట్టు “నే నెవర్ని” అని వ్రాస్తారు, అంతే కాని “నేనె వర్ని” అని వ్రాయరు కదా. ఇలా పదం విడిగా స్పష్టంగా తెలిసేటప్పుడు అలా వ్రాయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అదే “హాస్యాస్పదం” (“హాస్య + ఆస్పదం”) పదంలో “ఆస్పదం”లోని “ఆ”కారం “స్య”తో కలిసిపోయింది. ఇలాంటప్పుడు దాన్ని “హాస్యా స్పదం” అని వ్రాస్తే బోధపడదు, అంచేత అలా వ్రాయరు. అలానే “కోహం” (కః + అహం) లోని “అహం”, “కః”తో కలిసిపోయింది. అంచేత “కో హం” అని విడిగా వ్రాస్తే బోధపడదు.
    మీరు ఉదహరించిన పద్యంలోనే గమనించండి, “యోగోద్భవాం” కలిపే వ్రాసారు, “యోగో ద్భవాం” అని వ్రాయ లేదు, అక్కడ సంధి జరిగినా.

  17. budugoy says:

    హెచ్చార్కె గారు,

    అసలు కోహం అన్న పదంలో అస్పష్టత ఏమిటో నిర్ణయిస్తే మీరు విరిచి రాయడం వల్ల ఎలా అది తొలగిపోయిందో తెలుసుకోవచ్చు.
    సరే కోహం ని వదిలేసి మీరు ఉదహరించిన పద్యపాదంలోనే విరిచి రాయడం వల్ల మీరంటున్న స్పష్టత ఏం వచ్చిందో చెప్పండి?

    ఇక మీరు లేవనెత్తిన చర్చకు వస్తే, మా ఇంట్లో ఉన్న మూడు విష్ణుసహస్రనామాల పుస్తకాల్లో క్రింది పాదాన్ని
    శుభ్రైరభ్రైరదభ్రైరుపరివిరచితైర్ముక్తపీయూషవర్హైః
    మూడు రకాలుగా విరిచారు. అలాగే పోతన భాగవతం వర్షన్సులో కూడా బోలెడు ఉదాహరణలున్నాయి.
    నాకైతే ఈ విరుపులకి ఏ శాస్త్రీయ ప్రాతిపదిక ఉన్నట్టు కనిపించలేదు. చదువరి సౌలభ్యం కోసమేనని భావిస్తాను. అలా అనుకోడానికి మరో కారణం నేను చూసిన సంస్కృత తాళపత్రగ్రంథాలన్నిటిలోనూ దేవనాగరి లిపిలో ఏకరీతిన ఏ విరుపులు లేకుండా రాసి ఉండడం కూడా కావొచ్చు.
    అలాగే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో సంధి విరుపుని బట్టి అర్థం మారొచ్చు. కానీ ఇలాంటివి రాయడమెలా ఉన్నా టీకా, తాత్పర్యాల్లో శుభ్రంగా వివరించడమే ఆనవాయితీ.
    మరేవైనా కారణాలున్నాయేమో కనుక్కుంటాను.
    ఏదేమైనా పై చర్చకు నా ప్రశ్నకు సంబంధం లేదు. మీరు ఉదహరించాలంటే ఏకపద ప్రయోగం (శీర్షికలోనో, వచనంలోనో ఇలా రాసింది చూపించండి.)

    ‘సె లవ్’

  18. bollojubaba says:

    hrk gaaru

    బుడుగోయ్ గారి వ్యాఖ్యలు అల్లానే ఉంటాయి లెండి. విమర్శించటం, అహంకారంతో వెక్కిరించటం మధ్య తేడా ఆయనకు తెలియదు. ఈ మధ్యోచోట ఒక ప్రముఖ కవిగారి సంకలనం గురించి అవాకులు చెవాకులు పేలారు. పోనీ ఏమైనా వివరణలిచ్చారా అంటే అదీ లేదు. ఏదో పాసింగ్ కామెంట్స్ లాగా… ఆయనను తక్కువ చేసి మాట్లాడితే, ఈయన్నేదో అందరూ అంతకన్నా పెద్దవాడని అనేసుకొంటారన్న దురాశ తప్ప మరేమీ కనిపించలేదు.

    తెలివైన వ్యక్తే కానీ అభివ్యక్తే ఒకోసారి పచ్చిమిరపకాయ సగానికి కోసి ముక్కులో దూర్చినట్టుంటుంది.

    మీ సమాధానం బాగుంది.

    ఇక రూమీ గురించి ఈ లింకులో నేవాడిన సందర్భం ఉంది వీలైతే చూడండి
    http://raji-fukuoka.blogspot.com/2009/01/blog-post_1873.html

  19. Mamatha says:

    HRK,

    “Poem” chaalaa baagundi.. I could relate to it soo very intimately.

    Love,
    Mamatha

  20. హెచ్చార్కె says:

    బుడుగోయ్ గారు, అలాగే, కనుక్కున్నప్పుడు చెప్పండి.
    కామేశ్వర రావు గారూ, ఇక్కడ సమస్య బోధ పడడానికే సంబంధించినదనే మీ అవగాహనతో ఏకీభవిస్తున్నాను. నేను(అహం), ఎవరు(కః) అనే పదాలను సాధారణంగా విడదీయకూడదని తెలుసు. ‘కోహం’ అంటే రాని స్పష్టత ‘కో హం’ అంటే వస్తుందని కాదు. ‘ఎవరు?’ కు, ‘నేను’ కు ప్రత్యేకంగా నొక్కు ఇవ్వాలనుకున్నాను. ‘స్పష్టత కోసం’ అనడంలో నా ఉద్దేశం అదే.
    బాబా! చాల థాంక్స్. లింకు ఉపయోగించుకుంటాను.
    కవిత మీద చర్చ… పదా ర్థాన్ని( 🙂 )వదిలేసి, పదం మీద పడడం కాస్త బాగోకపోయినా, పలు కారణాల వల్ల, నాకు ఆసక్తికరమైంది. అందరికీ కృతజ్ఙతలు, వందనాలు.

  21. గరికపాటి పవన్ కుమార్ says:

    ఎంత విమర్శించినా సున్నితంగా ఉన్నంత వరకు పట్టించుకోని తెలుగు కవితా ప్రపంచంలో కొరడా ఝలిపిస్తూ అహంకారంతో వెక్కిరించే విమర్శకులే (కొరడా ఝలిపించడం ,అహంకారంతో వెక్కిరించడం ,మనసు గాయపడినా కుండ బద్దలు కొట్టడం ,మధ్య తరగతి మొహమాటాలకు విమర్శను బలి పెట్ట కపోవడం ,ఇవన్నీ ఉత్తమ విమర్శకుని లక్షణాలే ) కరువైన తరుణంలో బుడుగోయ్
    ఈ పని చేస్తున్నారంటే దానికి బాబా కితాబిస్తున్నారంటే అటువంటి విమర్శని ఎవరైనా చదవాల్సిందే .
    ఈ మధ్య కాలంలో కంప్యూటర్ లో టైపు చేయగల ప్రతి ఒక్కరూ ప్రముఖ కవులే. ఈ ప్రముఖ కవులందరికీ విమర్శ గాలి తగలాల్సిందే. ఇంతకీ మీరన్న ‘ప్రముఖ’ కవి ఎవరు ?? బుడుగోయ్ గారి విమర్శకు లంకెను ఇవ్వగలరా ??

    తోటి కవుల హెచ్చరికలకు పెద్దలు హెచ్చార్కె గారి మాటల్లోనే వినయం తాండవిస్తుంటే బొల్లోజు బాబా మాటల్లో ఔచిత్యం లేదు.

    గరికపాటి పవన్ కుమార్

  22. చింతలపాటి ఫల్గుణ కుమార్ says:

    హెచ్చార్కే గారి Gap theory (సందు సిద్ధాంతం) ఈ కింది లింకు లోని చిన్నయ సూరి 55 సంధి పరిచ్చేద సిద్ధాంతాల వెనక “యా భైరావది” గా తగిలిస్తే అందరికీ తెలియవస్తుంది.

    “సె లవ్” (Thanks to Budugoy)

    http://andhrabharati.com/bhAshha/bAlavyAkaraNamu/saMdhi.html

  23. budugoy says:

    బాబా గారు, మీ నిందారోపణలకు/సమాధానానికిది వేదిక కాదు. నా బ్లాగును చూడండి.
    http://budugoy.blogspot.com/2010/04/blog-post.html

  24. msnaidu says:

    నమస్తే హెచ్చార్కె గారు. మీ కవిత అంత బాగో లేదు. మెచ్చు కోవలసిన అవసరం, సందర్భం ఇది కాదు కానీ, ఈ కోహం కోపాలు రాద్ధాంతాలు రాసుడులు ఏమిటో. బాబా బుడుగు, బుడుగు బాబా గార్ల ఆపసోపాలు మరీ ఇలానా.

  25. హెచ్చార్కె గారన్నట్లు పదార్ధం మీద వదిలేసి పదంపై చర్చ జరిగి తమ తమ పాండిత్యాన్ని ప్రకటించుకునే వేదికయ్యింది. మరల ఇది బుడుగోయ్, బాబా గార్ల మధ్య యుద్ధంగా మారింది.
    కవితలోని చివరి చరణాలు బాగా హత్తుకున్నాయి.

Comments are closed.