అరెస్ట్ వారెంట్

– శ్రీనివాసరావు. గొర్లి

మా మేనేజర్ మొఖం అంత దిగులుగా వుండటం నేను గత నాలుగేళ్ళ కాలంలో ఎప్పుడూ చూడలేదు.

ఆయనే కాదు, అంతకు ముందు నా సర్వీసు లో నలుగురు మేనేజర్లను చూశాను గాని ఎవరినీ మొఖాలు ఇంత దిగులుగా ఉండే ఇటువంటి పరిస్థితులలో చూడలేదు. అసలు అది దిగులు కాదు. అంత కంటే బాధాకరమైన ఫీలింగ్. ఒక్కసారిగా ఇంటి పై ఆదాయపన్ను శాఖ అధికారులు రెయిడింగ్ చేస్తే, రెండు చేతులా సంపాదించే అధికారి మొఖం లో కనిపించే లాంటి ఫీలింగ్ అది. వరదలొచ్చి వున్నదంతా వూడ్చిపెట్టుకుపోతే ఎందుకీ వెధవ బ్రతుకు అనిపించే ఫీలింగ్ అది.

నేనేమీ జోస్యుడను కాను. కాని మా మావగారు బాగా పేరున్న దైవజ్ఞుడు. ఆయనతో సంప్రదించడానికి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు. ఆయన మాట అంటే అందరికీ చాలా గురి. మా మేనేజర్లు అందరూ కూడా మా మావగారి వల్ల అంతో ఇంతో సహాయం పొందినవారే.

ఎంతో దర్జా వెలగబెట్టడానికి అవకాశమున్న ప్రభుత్వ శాఖలో మేనేజర్ అంటే సామాన్యమైన విషయమా మరి. ఊరిలోని పలుకుబడి గల ప్రముఖులకు మా మేనేజర్‍తో ఎన్నో పనులు ఉంటాయి. పురప్రముఖులందరూ మా మేనేజర్‍కి పరిచయం.

అలాంటి గొప్ప పదవిలో వున్న మనిషికి అంత భయంకరమైన కష్టం ఏమొచ్చిందా అని ఆశ్చర్యపోయాను. బహుశా ఇంట్లో ఎవరికైనా ఏదైనా చెప్పుకోలేనంత కష్టం వచ్చిందేమో అందుకే వారి జాతకం పరిశీలించమని ఇవ్వడానికి పిలిపించారేమో అనుకున్నాను.

నేనేమీ జోస్యుడను కాను. కాని మా మావగారు బాగా పేరున్న దైవజ్ఞుడు. ఆయనతో సంప్రదించడానికి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు. ఆయన మాట అంటే అందరికీ చాలా గురి. మా మేనేజర్లు అందరూ కూడా మా మావగారి వల్ల అంతో ఇంతో సహాయం పొందినవారే.

ఇప్పుడు కూడా మా మావగారి తో ఏదో పనిబడి నన్ను పిలిపించారనుకున్నాను. చెప్పానుగా, మా మేనేజర్ మొఖం చాలా దిగులుగా వుంది. నన్ను చూసి నవ్వడానికి ప్రయత్నించాడు, కాని ఏమీ ఫలించలేదు.

“ఏమయింది సార్” అన్నాను, నేను కల్పించుకుని మాట్లాడకపోతే ఆయనంతట ఆయన మాట్లాడే లాగ లేడు.

టేబుల్‍పై ఉన్న కాగితం ఒకటి నా చేతిలో పెట్టాడు. ఏమిటా అని చూస్తే కోర్టు కాగితంలా వుంది. నాన్ బెయిలబుల్ వారంట్ అది. అందులో రాసి ఉన్న పేరుగల వ్యక్తిని అరెష్టు చేసి మరీ ఫలానా తారీఖుకి కోర్టులో హాజరు పరచమని పోలీసులకు పంపిన కాగితం అది.

పేరు చూస్తే కళ్ళు పచ్చబడ్డాయి నాకు. మా మేనేజర్ లాంటి వారెందరికో బాసైన చీఫ్‍మేనేజర్ పశుపతి గారి పేరు అది.

అప్పుడు అర్ధమయింది నాకు, మా మేనేజర్ ఎందుకు అలా వున్నాడో. ఆయన గాబట్టి ఇంకా తట్టుకుని మామూలుగా వున్నాడు. అదే నేనైతే మూర్ఛపోయి కోమాలోకి వెళ్ళిపోయే వాడిని.

“ఇప్పుడు ఏమి చేయాలి సార్’, అడిగాను.

కొంచెం సెపు గాల్లోకి పిచ్చి చూపులు చూసి జుత్తు పీక్కున్నాడు, పాపం. నాకు జాలివేసింది.

“పెద్దాయనకి తెలుసా సార్” అన్నాను. భూతం పేరు విన్నట్లు జడుసుకుని ఉలిక్కిపడ్డాడు. “ఆయనకు తెలుస్తే ఇంకేమన్నా ఉందా” అని హూంకరించబోయాడు. కాని పిల్లికూత లాంటి శబ్దం మాత్రం వచ్చింది.

“ఎవరో ఏదో విషయంలో ఫిర్యాదు చేసారు. మన వాళ్ళు సరిగా సమాధానం ఇవ్వలేదు. వాళ్ళు కోర్టుకి వేసారు. మన పేరు మాత్రమే కాక హెడ్డఫీసు లోని ఛీఫ్‍మేనేజర్ పేరు రాసి చచ్చారు. అది మన లాయరు తేలికగా తీసుకున్నాడు. అవతలి పార్టీ గట్టి పట్టు పట్టారు. మన ఖర్మ కొద్దీ మేజిస్ట్రేట్ కూడ కొత్తగా వచ్చారు. రెండు మూడు సార్లు వాయిదాలకి ఛీఫ్‍మేనేజర్‍ను గాని నన్ను గాని రమ్మన్నారట. ఇదివరకు మేజిస్ట్రేట్ లాగా కాస్త చూసీచూడనట్లు వదిలేస్తాడనుకున్నాను. కాని ఈయన ఇలా నా నెత్తిన బాంబు వేసాడు. ఏమి చేయాలో పాలుబోక నిన్ను పిలిపించాను” అన్నాడు మా మేనేజర్.

ఏమి చేయాలా అని తీవ్రంగా ఆలోచించాను. పాత మేజిస్ట్రేట్ అయితే నాకు బాగా పరిచయం. ఆయనే వుంటే సమస్య ఇంత దూరం వచ్చేది కూడా కాదు. ఎందుకంటే మా మేనేజర్‍కి కూడా ఆ మేజ్జిస్ట్రేట్‍ గారు బాగా తెలుసు. కొత్త మేజిస్ట్రేట్‍ రావడం మాకు చాలా సమస్య అయిపోయింది. ఇప్పుడెలా బయట పడటం. ఎంత సేపు ఆలోచించినా ఏమి చేయాలో తెలియటంలేదు.

ఏమి చేయాలా అని తీవ్రంగా ఆలోచించాను. పాత మేజిస్ట్రేట్ అయితే నాకు బాగా పరిచయం. ఆయనే వుంటే సమస్య ఇంత దూరం వచ్చేది కూడా కాదు. ఎందుకంటే మా మేనేజర్‍కి కూడా ఆ మేజ్జిస్ట్రేట్‍ గారు బాగా తెలుసు. కొత్త మేజిస్ట్రేట్‍ రావడం మాకు చాలా సమస్య అయిపోయింది. ఇప్పుడెలా బయట పడటం. ఎంత సేపు ఆలోచించినా ఏమి చేయాలో తెలియటంలేదు.

“ఏమి చేద్దాం” బేలగా అడిగాడు మా మేనేజర్. ఆయన దైన్యాన్ని చూసి చలించిపోయాను. “మా మావయ్యగారిని సలహా అడుగుదాం సార్” అన్నాను.

” నా జాతక చక్రం ఇవ్వమంటావా” అన్నాడు ఉత్సాహంగా.

“సర్లెండి సార్, ఆయన్ని జాతకం చూసి గ్రహదోషాలకు పరిహారాలు చెప్పమని అడిగే సమయమా ఇది? రెండు రోజులలో విషయం తేలిపోయేలాగ వుంది” అన్నాను విసుగ్గా.

“మరేమి చేద్దాం” అన్నాడు నీరసంగా.

“ఆయనకు ఈ మెజిస్ట్రేట్ గారు తెలుసేమొ కనుక్కుంటాను ” అన్నాను. ఆ క్లిష్ట సమయంలో అంతకు మించి ఆలోచన రాలేదు.

ఆయనకు నా చేతనైనంత ప్రయత్నం చేస్తానని భరోసా ఇచ్చి , ధైర్యం చెప్పి ఆయన గది లోనుంచి బయట పడ్డాను.

మేజిస్ట్రేట్ మారినా అక్కడ పని చేసే సిబ్బంది మారరు కదా. వాళ్ళ ద్వారా ప్రయత్నం చేస్తే ఏమైనా ప్రయోజనం వుంటుందనిపించింది, కాస్త బయటకు వచ్చి శాంతంగా ఆలోచిస్తే. వెంటనే బయలుదేరి కోర్ట్‍కి వెళ్ళాను.

కోర్ట్ ప్రసాద్ అంటే మా ఊర్లో పరిచయం అవసరం లేదు. నేను కోర్టుకి వెళ్ళేసరికి ప్రసాద్ కోర్టు బయట కాంటీన్‍లో టీ తాగుతూ కనిపించాడు. తిరుపతి వెంకన్నను చూసినంత ఆనందపడ్డాను. నన్ను చూసి మరో టీ ఆర్డర్ ఇచ్చాడు. పక్కన కూర్చోబెట్టుకుని ” ఏమిటి ఇలా వచ్చావు” అని అడిగాడు.

నా సమస్యను మూడు ముక్కలలో టూకీగా చెప్పాను.

“భలే ఇబ్బందిలో పడ్డావురా. ఈయన మహాకర్కోటకుడని పేరు గడించాడు. అధికారులను అస్సలు లెక్కచేయడు. న్యాయదేవత ఆయన స్వంత తల్లి అన్నట్లు ఫీలయిపోతుంటాడు. ఇప్పటికి ఇద్దరి పని పట్టాడు. మీ మేనేజర్ పని పడతాడేమొ అని అనుకుంటూనే ఉన్నాను. కాని ఆయన్ని వదిలి ఆయన బాసుకి ఎసరు పెట్టేసాడు”, గంభీరంగా ఫోజు పెట్టి చెప్పాడు.

ప్రసాదు మాటలు ఓపిగ్గా వింటున్నాను. ఎక్కువ మాట్లాడటం వాడి బలహీనత. కాని అద్భుతమైన తెలివితేటలున్నాయి వెధవకి. ఎట్లాంటి సమస్యనైనా ఏదోలా పరిష్కరిస్తాడు.

“నాకు తెలిసి మా కొత్త మేజిస్ట్రేట్ ఎవరి మాట వినడు. కాకపోతే మనమంటే కొంచెం ఫరవాలేదనుకో. కాని ఎలా చెప్పాలి అని ఆలోచిస్తున్నా” అన్నాడు నుదురు అరచేత్తో రుద్దుకుంటూ.

“బాబ్బాబు నీకు పుణ్యముంటుంది ఎలాగైనా ఈ గండం నువ్వే తప్పించాలి” అన్నాను వాడి గడ్డం పట్టుకుంటూ.

నేను బ్రతిమలాడటం పట్టించుకోకుండా “ఇంకో చిక్కు కూడా వుంది. అసలే పరువంటే ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాడు, మరి తను ఓపెన్ కోర్టులో ఇచ్చిన ఆదేశాలను తనే రద్దుచేస్తాడంటావా? అనుమానమే” కళ్ళు పైకి తిప్పి చెట్టు పైకి చూస్తూ స్వగతంలా అన్నాడు.

కాసేపు ఒడ్డుకి కాసేపు సుడిలోకి లాగుతున్న పడవ వాడిలా కనిపించాడు.

“నీ వల్ల కాకపోతే ఇంకెవరి వల్లవుతుంది”, ఎవరి వల్లా కాదు అనే భావం ప్రస్ఫుటంగా వినిపించేలా అన్నాను. ఏమి చేస్తాను మరి. పీక మీద కత్తి ఉంటే ఎవరైనా అలాగే చేస్తారు కదా.

“సరే ఆయనను ఛాంబర్‍లో కలిసే ఏర్పాటు చేస్తాను, నీ సమస్య నువ్వే ఆయనకు వివరించి మార్గాంతరం అడుగు” ఏదో పెద్ద సాయం చెస్తున్న వాడిలా చూసాడు నా వైపు.

’పులితో మాట్లాడి నిన్ను అది ఉండే బోనులోకి పంపిస్తాను, జాగ్రత్తగా మాట్లాడి నిన్ను గాని నీ బాసుని గాని తినకుండా వదిలేయమని చెప్పి ప్రార్ధించుకో’ అన్నట్లు ఉంది ప్రసాద్ మాట వింటుంటే. అదే అన్నాను వాడితో.

“చూడు ప్రసాదు, మంచి సలహా ఇవ్వు. అంతేకాని ఇలా మొదటికే మోసం తెచ్చే సలహాలిస్తే ఎలా”, బాధగా అన్నాను.

“నీకు తెలియదురా, ఈయనకి అహం ఎక్కువ. లంచాలకో, బహుమతులకో లొంగే రకం కాదు. నువ్వు తప్ప వేరే దిక్కు లేదు అన్న తరహాలో వెళ్తేనే ప్రయోజనం ఉంటుంది. మొన్నొకసారి ఇలాగే జరిగింది. అందుకే నీకు ఆ సలహా ఇచ్చా. పోనీ నీకు అంత భయంగా ఉంటే నేను కూడా వస్తాను నీతో. లేదంటే మీ మేనేజర్‍గారినే తీసుకుని వెళదాం.

కొంచెం సేపు నాలో నేనే తర్కించుకున్నాను. ప్రసాద్ చెప్పింది మొదట్లో అనిపించినంత భయంకరంగా కనిపించలేదు. పైగా గాంధీ గారి పద్ధతిలా మర్యాదకరంగా ఉంది. మా మేనేజర్‍ని తీసుకుని రావాలా వద్దా అనే విషయం కూడా ఆలోచించాను. ఈ విషయంలో ఆయన చాలా భయపడుతున్నాడు. మేజిస్ట్రేట్ దగ్గరకు వచ్చి ఏమైనా మాట్లాడగలడా లేక ఒకదానికొకటి మాట్లాడి పని చెడగొడతాడా అని అనుమానం వచ్చింది. కాని తొక్కేది మర్యాద మార్గం కాబట్టి మా మేనేజర్‍ని తీసుకుని వెళ్ళటమే సమంజసమని అనిపించింది.

ప్రసాదుకి సరేనని చెప్పాను. మళ్ళీ ఆఫీసుకి వెళ్ళి మేనేజర్ గారికి విషయమంతా వివరంగా చెప్పాను. ఆయన కూడా నా లాగే మేజిస్ట్రేట్‍ని కలవడానికి మొదట్లో భయపడినా తర్వాత నా మాట విని రావడానికి సిద్ధపడ్డాడు. ప్రసాద్‍కి ఫోన్ చేసి మా మేనేజర్ గారిని ఒప్పించానని చెప్పి, కోర్టుకి మేజిస్ట్రేట్‍గారిని కలవడానికి ఎప్పుడు రమ్మంటాడో అడిగాను. ఉదయం వేళలో అయితే ఏమీ చికాకులు లేకుండా ఉంటారనీ , అందువలన మరునాటి ఉదయం రమ్మని చెప్పాడు ప్రసాద్.

మరునాడు ఉదయం మేనేజర్ గారితో కలిసి పది గంటలకు ముందే కోర్టుకి వెళ్ళిపోయాను. ప్రసాదు కూడా మా కోసం చూస్తూ మేజిస్ట్రేట్ గారి ఛాంబర్ దగ్గరే ఉన్నాడు. మేము వెళ్ళేసరికి మేజిస్ట్రేట్ గారు ఇంకా రాలేదు.

ప్రసాదు నన్ను, మా మేనేజర్ గారిని పక్కకు పిలిచి ” నిన్న సాయంత్రమే మేజిస్ట్రేట్ గారికి మీరు ఛాంబర్ లో కలవాలనుకుంటున్నారని చెప్పాను. ’సరే’ నన్నారు. మీ గురించి మంచి మాటలు చెప్పాను. ఈ ఊరిలోని ముఖ్యమైన ప్రభుత్వాధికారులని కూడా చెప్పాను. కొంచెం మెత్తబడ్డట్టే కనిపించారు. కాస్త జాగ్రత్తగా మాట్లాడితే మీ పని సానుకూలం కావచ్చు” అన్నాడు.

చెవుల్లో అమృతం పోసినట్లయింది మాకు. మేజిస్ట్రేట్ గారి రాక కోసం ఎదురుచూడసాగాం.

అంతలోనే మేజిస్ట్రేట్ గారి కారు వచ్చింది. బంట్రోతు వెళ్ళి కారు తలుపు తెరిచి పట్టుకున్నాడు. ఆయన కారు దిగి వడి వడిగా నడుచుకుంటూ మా ముందు నుంచి వెళ్ళారు. మేము వినయంగా నమస్కరించినా పలకరించకుండా తల ఊపుతూ వెళ్ళిపోయారు.

మేజిస్ట్రేట్ గారికి షుమారుగా నలభైయేళ్ళు వుండవచ్చు. పాత మేజిస్ట్రేట్ కంటే వయసులో చిన్నగానే వున్నాడు. మనిషి పొట్టిగా కాస్త నల్లగా ఉన్నాడు. కాని మేమేమన్నా పెళ్ళివాళ్ళమా ఆయన అందచందాలు బేరీజు వేయడానికి. కొంచెం అహంభావి లాగానే ఉన్నాడు. పని సానుకూలమవుతుందా లేదా అనే సందేహం మా మేనేజర్ గారి కళ్ళల్లో బాహాటంగా కనిపించింది నాకు. ఏమీ భయం లేదు మన పని తప్పకుండా ఫలిస్తుందని కళ్ళతోనే భరోసా ఇచ్చేశాను. లోపలినుంచి పిలుపు ఎప్పుడు వస్తుందా అని కాచుకుని కూర్చున్నాం.

ప్రసాద్ బంట్రోతుకి సైగ చేసాడు. అతను లోపలికి వెళ్ళి వచ్చి మేజిస్ట్రేట్ గారు మమ్మల్ని లోపలికి రమ్మన్నారని చెప్పాడు.

’దేవుడా కాపాడు’ అనుకుంటూ మా మేనేజర్ గారి తో పాటు లోపలికి అడుగుపెట్టాను. ప్రసాదు మా వెంట తను రాకపోతేనే మంచిది అని ముందే చెప్పాడు. గది చిన్నగానే వుంది కాని లైట్లు ఎక్కువ వుండటం చేతననుకుంటా బాగా ప్రకాశవంతంగా వుంది. మేజిస్ట్రేట్ గారు మమ్మల్ని చూడగానే ఆదరంగా పలకరించి కూర్చోమన్నారు.

’అరే ఎంత మర్యాదస్తుడు! ఈయననా అహంభావి అని అపార్థం చేసుకున్నాను’ అని కాస్త పశ్చాత్తాపపడ్డాను.

మా మేనేజర్ కూడా కాస్త ధైర్యం తెచ్చుకుని తనను పరిచయం చేసుకున్నాడు. మరుసటి రోజు కేసు వాయిదాకి రాబోతుందని, దానికి మా ఛీఫ్‍మేనేజర్ రానవసరం లేకుండా మినహాయింపు ఇవ్వమని ఎంతో వినయంగా అర్థించాడు.

“ఏం, ఆయన ఎందుకు రాకూడదు?” కఠినంగా ప్రశ్నించారు మేజిస్త్రేట్ గారు.

ఆయన ధోరణిలో ఒక్కసారిగా వచ్చిన మార్పుకి నివ్వెరపోయాను. మా మేనేజర్ గారు కూడా డిటో. ఏమి సమాధానం చెప్పాలో తెలియక ” ఆయన చాలా బిజీ గా వుంటారండీ కావాలంటే ఆయన బదులు నేనొస్తానండీ” అన్నాడు మా మేనేజర్.

“ఆయనకు శిక్ష పడితే మీరే అనుభవిస్తారా?” కటువుగా అంటూ, “మీరు భాధ్యత గల ప్రభుత్వాధికారి అయివుండి కూడా ఇలా మాట్లాడటం ఏమీ బాగో లేదు. అయినా పోలీసులకు వారంట్ పంపించాము, వాళ్ళే ఆయనను కోర్టులో హాజరు పరుస్తారు. దానిగురించి మీరేమీ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకోనవసరం లేదు” వ్యంగ్యంగా అన్నాడు.

ఆరడుగుల ఎత్తు, చక్కటి శరీర సౌష్టవం ఉన్న మా మేనేజర్ ఆ పొట్టి మేజిస్ట్రేట్ ముందు వణికిపోతూ ఉంటే నాకు కోపం పాదాలనుంచి తలలోకి సర్రున పాకిపోయింది.

“సార్, పోలీసులతో అరెస్టు చేయించడానికీ, శిక్షలు విధించడానికీ, మా మేనేజర్ గారు గాని ఛీఫ్‍మేనేజర్‍గారు గాని ఏ నేరము చేయలేదు”, అన్నాను రోషంగా.

“ఇతనెవరు?” కోపంగా అడిగాడు మేజిస్ట్రేట్.

“సారీ సార్, ఇతను నా అసిస్టెంట్, పార్థసారథి. మేము వెళ్ళివస్తాం” అని హడావుడిగా తను లేచి నా భుజం పట్టుకుని నన్ను బయటకు లాక్కొచ్చాడు మా మేనేజర్.

ఆయన అలా సమయస్ఫూర్తిగా బయటకు తీసుకురాకపోతే నన్ను జైల్లో పెట్టించేవాడు, ఆ మేజిస్ట్రేట్.

నిజంగానే పులి బోను లోనుంచి బయట పడినట్టే వుంది. ప్రసాదు బయట మా కోసం కాచుకుని ఉన్నాడు. మా మొఖాలు చూడగానే లోపల ఏమి జరిగిందో ఊహించుకున్నాడు. “బాధ పడకండి సార్. మీ ఛీఫ్‍గారిని సిక్ సర్టిఫికేట్ పెట్టమనండి. కొంచెం టైమ్ దొరికితే వేరే దారి చూసుకోవచ్చు” అన్నాడు అనునయంగా.

ఛీఫ్‍మేనేజర్ కి ఈ విషయం చెప్పనేలేదని వాడికేం తెలుసు. పాపం, వాడి ప్రయత్నం వాడు చేసాడు. మా ఖర్మ కొద్దీ ఫలించలేదు.

మౌనంగానే తలఊపి అక్కడ నుంచి బయలుదేరాము.

కారు కొంచెం దూరం వెళ్ళాక “సారథీ, నువ్వు మీ మావగారితో మాట్లాడతానన్నావు కదా, మధ్యలో కోర్టు ప్రసాద్ దగ్గరికి వెళ్ళాలని ఎందుకు అనిపించింది” అని అడిగాడు మా మేనేజర్.

ఊరందరికీ ఆయనంటే గౌరవం ఉన్నంత మాత్రాన అల్లుడునైన నాకు కూడా ఉండాలంటే ఎలా? కోర్టు విషయాలు ఆయనకేమి తెలుస్తాయి? అదీగాక ఇంత ముఖ్యమైన ప్రభుత్వ శాఖలో వున్న మాకే ఈ మేజిస్ట్రేట్ పరిచయం కాలేదు. మా మావగారికి మాత్రం ఎలా అవుతాడు? ఇవన్నీ ఈయనకెలా చెప్పడం అని ఏమీ పలకకుండా కూర్చున్నాను.

కారుని తిన్నగా మా మావగారి ఇంటికి పోనీయమని డ్రైవర్‍కి చెప్పాడు, మా మేనేజర్.

’సరేలే ఈయన నమ్మకాన్ని నేనెందుకు కాదనాలి’ అనుకుని మెదలకుండా కూర్చున్నాను.

కారు దిగాక మా మేనేజర్‍ని లోపలికి ఆహ్వానించి హాలులో కూర్చోబెట్టి మావగారిని పిలుచుకుని వచ్చాను. పరస్పర నమస్కారాలు అయినాక, మా మేనేజర్ తన సమస్యను మా మావగారికి వివరించాడు.

మా మావగారు, విఠల్‍ప్రసాద్ గారు, ఎనభైయేళ్ళ మనిషి. అయినా వృద్ధుడని చెప్పలేము. ఇప్పటికీ తన పనులు ఎవరి సహాయం లేకుండా చేసుకుంటారు. ఉదయాన్నే లేచి తన పనులన్నీ చేసుకుని కాఫీ తాగి దైవధ్యానంలో ఒక గంట గడిపి ఫలహారం తీసుకుంటారు. ఆ తర్వాత పేపర్ చదివి తన ఆఫీసు రూము లో కూర్చుంటారు. ఇక జనాలు వచ్చి కలవడం ఫోనులు రావడం, వీటితో బిజీ గా ఉంటారు. ఎవరైనా బాగా తెలిసిన ముఖ్యులు వస్తే హాలు లో కూర్చోబెట్టి మాట్లాడుతారు.

మా మేనేజర్ చెప్పిందంతా విని, ఒకసారి సీలింగ్ వైపు చూసి “నాకు ఇదివరకటి మేజిస్ట్రేట్ తెలుసు. కొత్త మేజిస్ట్రేట్ తెలియదు” అన్నారు గొంతులో ఎటువంటి భావం లేకుండా.

ఆయనకు ’తెలుసు’ అంటే అవతలి వాళ్ళు బాగా తెలుసునని, ఈయనంటే చాలా గౌరవం గలవాళ్ళని అర్థం. అదే తెలియదంటే వాళ్ళతో పని జరగదని స్పష్టం. అంతకు మించి విశేషణాలు వాడటం ఆయనకు అలవాటు లేదు.

’చూసారా, అందుకే నేను మా మావగారి దగ్గరకు రానిది’ అన్నట్లు మా మేనేజర్ వైపు చూసాను.

అంతలోనే, మళ్ళీ మాట్లాడుతూ మా మావగారు అన్నారు, “కాని నాకు హైకోర్టు జడ్జి గారు ఒకరు తెలుసు. ఆయనతో మాట్లాడుతాను.”

ఆయన లేచి తన ఆఫీసులోకి వెళ్ళి ఫోన్‍లో మాట్లాడి వచ్చారు. “ఆయనతో మాట్లాడాను. సాయంత్రం మాట్లాడుతానన్నారు” అని మా మేనేజర్ తో చెప్పారు.

” చాలా థాంక్సండీ, మీకు శ్రమ ఇచ్చాము. ఇప్పుడు మాకు రిలీఫ్ గా ఉంది” అన్నాడు మా మేనేజర్.

కొంచెం సేపు వేరే విషయాలు మాట్లాడి శలవు తీసుకుని బయల్దేరారు మేనేజర్ గారు. “మీకు సాయంత్రం ఫోన్ చేసి ఆ జడ్జి గారు ఏమి చెప్పారో చెబుతాను”, అన్నారు మావయ్యగారు.

మా మేనేజర్‍కి చాలా వరకు ధైర్యం వచ్చింది. కాని, అనవసరంగా ఆ మేజిస్ట్రేట్‍ని కదిలించామేమొ అని కాస్తంత బాధ వ్యక్తం చేసాడు. మేజిస్ట్రేట్ దగ్గర వ్యవహారం చెడగొట్టింది నేనే అయినా, ఇప్పుడు సహాయపడేది మా మావగారు కాబట్టి నాపై బాహాటంగా అసంతృప్తిని ప్రదర్శించటంలేదు, అంతే.

’సరేలే, ఏదో విధంగా గండం గట్టెక్కితే అంతే చాలు’ అనుకున్నాను.

సాయంత్రం ఏ విషయమో చెబుతారని ఆఫీసులోనే కూర్చున్నాము. రాత్రి ఎనిమిది దాటాక మా మావగారి నుంచి ఫోన్ వచ్చింది. ఆయన నాతో మాటలాడి లైన్ కట్ చేసారు. మా మేనేజర్ ఉత్కంఠ భరించలేకపోతున్నాడు.

“ఏమన్నారు? అలా ఉన్నావే? చెప్పవయ్యా బాబూ టెన్షన్ పెట్టి చంపక?” అన్నాడు.

“సార్, ఆయన జడ్జి గారితో మాటలాడేరట. జడ్జి గారు ఏదో సలహా ఇచ్చారట. ఆ ప్రకారం చేయమంటున్నారు. అందులో ప్రమాదం వుంటుందేమొ అంటే, ఏమీ కాదు అంటున్నారు. నాకు మాత్రం భయంగా ఉంది సార్” అన్నాను. మా మావగారు కించిత్ కూడ తొణకకుండ సలహా ఇచ్చారు గాని, వింటేనే నా కాళ్ళు వణుకుతున్నాయి. ఇక ఆచరణ లో పెట్టాలంటే నా వల్ల అవుతుందా.

“ఇంతకీ ఆయన ఏమన్నారు? ” టెన్షన్ తట్టుకోలేక విసుగ్గా అడిగాడు, మా మేనేజర్.

“ఆ! ఏముంది, రేపు కోర్టు లో నేనే పశుపతి గారిని అని చెప్పమంటున్నారు” అన్నాను అంతకంటే విసుగ్గా.

దెబ్బకి మా మేనేజర్ నోరు తెరిచి నా వైపు చూసాడు.

“అప్పటికీ నన్ను మేజిస్ట్రేట్ చూసాడని కూడా చెప్పాను. ఆయన ఫరవాలేదు అంటున్నారు. అటు తిరిగి ఇటు తిరిగి నన్ను ఇరికిస్తాడేమొ ఆ మేజిస్ట్రేట్” అన్నాను భయంగా.

“మరేమి చేద్దాము?” నీరసంగా అన్నాడు మా మేనేజర్. పెనం మీద నుంచి పొయ్యి లో పడినట్లుంది ఆయన పరిస్థితి.

“ఆయన చెప్పినట్లే చేద్దాం లెండి, జడ్జి గారి సలహా అంటున్నారు కదా. అదీ చూద్దాం” అన్నాను. రెండు రోజుల నుంచి ఈ విషయమై తిరిగి తిరిగి ఒక రకమైన తిక్క పట్టినట్టుంది నాకు. ఇప్పుడు తలుచుకుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది నేనేనా అలా తెగించింది అని.

మరుసటి రోజు కోర్టులో మా కేసు పిలిచే వరకు కోర్టు గది బయట వేచి వున్నాము. మా ఆఫీసులో ఎవరికీ ఈ విషయం చెప్పలేదు. అందుకే కోర్టు దగ్గర నేను, మా మేనేజర్, ప్రసాదు తప్ప మమ్మల్ని ఎరిగున్న వారెవెరూ లేరు.

కోర్టు మధ్యాహ్న భోజన సమయ విరామానికి పది నిముషాలు వుందనగా మా కేసు పిలిపించారు. ప్రసాదు మమ్మల్ని లోపలికి వెళ్ళమని తను బయటే ఉండిపోయాడు.

ఏమి జరగబోతుందో అని చాలా ఉత్కంఠగా ఉంది మా మేనేజర్‍కి, నాకు. ప్రసాదు కి మా మావగారు ఇచ్చిన సలహా నేను చెప్పలేదు కనుక అతను వేరే రకమైన ఉత్కంఠ అనుభవిస్తున్నాడు. మేనేజర్ గారికి పరిచయమున్న ఇనెస్పెక్టర్ ఇద్దరు కానిస్టేబుళ్ళను కూడా మా వెంట పంపాడు. ఏమీ మాట్లాడకూడదు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి మరీ. అంతగా మేజిస్ట్రేట్ రెట్టిస్తే తను పంపినట్లు చెప్పమన్నాడు ఆ ఇనెస్పెక్టర్.

ఈ పరిస్థితి లో మేజిస్ట్రేట్ ముందు నుంచున్నాం మేమిద్దరం. కోర్టు గుమస్తా కేసు పేపర్లు మేజిస్ట్రేట్ ముందు పెట్టి తన సీట్లో కూర్చున్నాడు.

మేజిస్ట్రేట్ ఆ పేపర్లను జాగ్రత్తగా చదివి తల పైకి ఎత్తి చూడకుండానే, “ఛీఫ్‍మేనేజర్ పశుపతి గారు వచ్చారా?” అని అడిగాడు.

నా గుండె జారి కడుపులోకి వచ్చినట్లయింది. ముక్కు మొఖం ఎర్రబడి చెవుల్లోకి ఆవిర్లు చిమ్మాయి. దేవుడనేవాడుంటే ఠక్కున నన్ను అక్కడ నుంచి మాయం చేయాలనిపించింది. ఎలాగోలా నోరు తెరిచి ’వచ్చానండి’ అన్నాను. నా గొంతు లోనుంచి వెలువడిన శబ్దాలు అర్థవంతంగా లేకపోయినా వింతగా ధ్వనించడం వలన అనుకుంటా మేజిస్ట్రేట్ దృష్టిని ఆకర్షించాయి. తలెత్తి నా వైపు చూసాడు. రెండు చేతులు జోడించి నమస్కారం చేసాను, దేవుడ్ని తలుచుకుంటూ.

ఒక అరక్షణం నా వైపు చూసుంటాడనుకుంటా. కాని నన్ను పట్టి పట్టి చూసాడనిపించింది. ఇక నా పని అయిపోయింది అనుకున్నాను.

“క్రితం వాయిదాలకు మిమ్మల్ని పిలిపించినపుడు రాలేదని, ఈ వాయిదాకి వారంట్ పంపాల్సి వచ్చింది. మీ అధికారులను కేసు పై శ్రద్ధ పెట్టమనండి. ఇక మీరు రానక్కరలేదు, కేసు వచ్చేనెల కు వాయిదా వేస్తున్నాను” అన్నారు.

నా చెవులను నేను నమ్మలేకపోయాను. మరొకసారి నన్ను మా మేనేజర్ సమయస్ఫూర్తిగా భుజం పట్టుకుని బయటకు తీసుకుని వచ్చాడు.

“హమ్మయ్య, గండం గడిచింది. చాలా థాంక్స్ సారథీ. మీ మావగారు నన్ను రక్షించారు” అన్నాడు మా మేనేజర్.

లోపలి సంభాషణ విన్న ప్రసాదు కూడా చాలా ఆశ్చర్యపడ్డాడు.

మేనేజర్ గారు నన్ను వెంటపెట్టుకుని మా మావగారి ఇంటికి బయలుదేరారు. సమస్య నుంచి బయటపడేసినందుకు కృతజ్ఞతలు చెప్పడం ఒక కారణం అయితే, మేజిస్ట్రేట్ దగ్గర ఈ వింత పాచిక ఎలా పారింది తెలుసుకోవాలనే కుతూహలం అసలైన ముఖ్య కారణం.

ఇంటికి చేరి మా మావగారిని కలవగానే, మేనేజర్ గారు రెండు చేతులు జోడించి ” మీకు ఋణపడిపోయానండి. నన్ను పెద్ద సంకట పరిస్థితి నుంచి రక్షించారు” అన్నాడు.

మా మావగారు చిన్నగా నవ్వి ఇలా అన్నారు.

“మీరేమీ అనుకోనంటే నాదో చిన్ని సలహా. మీ పై వాళ్ళను సమస్య నుంచి దూరంగా ఉంచాలని మీరు అనుకోవడం అర్థం చేసుకోగలను. కాని అది ఒకోసారి వాళ్ళకే నచ్చదు. వాస్తవాన్ని వారికి చెప్తే మిమ్మల్ని నిందించరు సరి కద మీరు పనిలో ఎదుర్కునే సాధకబాధకాలు తెలుసుకుంటారు. మిమ్మల్ని మెచ్చుకుంటారు కూడ” అన్నారు మా మావగారు.

మానవ ఆలోచనా సరళిని అంత బాగా విశ్లేషించేసరికి ఆయన పై చాలా గౌరవం కలిగింది నాకు.

మేనేజర్ గారు మావయ్యగారి మాటలు అర్థం చేసుకున్నారు.

“మీ సలహా తప్పకుండా పాటిస్తాను. నాదొక సందేహాం. అడగమంటారా?” అన్నాడు మా మేనేజర్.

“మీరేమి అడగాలనుకుంటున్నారో నాకు తెలుసు. నేను మీకు చెప్పిన జడ్జి గారికి ఈ మేజిస్ట్రేట్ కొడుకు. అయితే తను ఇచ్చిన ఆదేశాలను తానే రద్దు చేయడానికి సాంకేతిక కారాణాలో పరువో అడ్డువచ్చి ఇలా మధ్యే మార్గం ఆయనే తండ్రికి సూచించారు” అన్నారు మావయ్యగారు కులాసాగా నవ్వుతూ.

ఆయన సుదీర్ఘ జీవితంలో ఎన్ని తమాషాలు చూసుంటారో కదా అనిపించింది. అంతలోనే అనుకున్నా, నాకు ఈ ఒక మాట ముందే చెప్తే ఇంత టెన్షన్ పడేవాడిని కాదు కదా అని.

కాని అప్పుడు కోర్టులో అందరికీ మేజిస్ట్రేట్ గారి ముందు సన్నివేశం అసహజంగా కనబడేదేమొ అనిపించింది.

* * *

About గొర్లి శ్రీనివాసరావు

నా రచనా వ్యాసంగం ఇటీవల మొదలైంది. నా మొదటి రచన ’సేతురహస్యం’. ఇది వివాదాస్పదమైన రామసేతువు గురించి నిజానిజాలు వెల్లడి చేయడానికి శాస్త్రీయ దృక్పథంతో ఒక వైజ్ఞానిక బృందం చేసిన ప్రయత్నాలకు నవలారూఫం.

ఈ మధ్య ప్రచురించబడిన నా రచనలు బ్లైండ్ డేటింగ్ (ఈనాడు ఆదివారం – 3-1-10), మాతృన్యాయం (ఆంధ్రభూమి – 12-11-09) ఆగిన రైలు (ఆంధ్రభూమి – 14-01-10). విభిన్న కథాంశాలను తీసుకుని రచన చేయడం నాకు ఇష్టం. వృత్తి రీత్యా నేను భారతీయ రైల్వేలో ఐ ఆర్ పి ఎస్ అధికారిగా ఉన్నాను, ప్రవృత్తి రీత్యా సాహిత్యాభిమానిని; చదువుకోవడమన్నా, చదువు చెప్పడమన్నా ఇష్టం.

కలం పేర్లు : శ్రీ గంగ, గంగ శ్రీనివాస్.

భార్య పేరు గంగ. నాకిద్దరు పిల్లలు, అనిరుధ్ (బిటెక్ రెండవ సం), ఉపమన్యు (ఇంటర్-మొదటి సం).

This entry was posted in కథ. Bookmark the permalink.

13 Responses to అరెస్ట్ వారెంట్

  1. కథ చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగింది. ఎటువంటి సమస్యకైనా పరిష్కారం అనేది ఉంటుందని, అనవసరమైన ఆందోళనలు పడకూడదని ఈ కథ సూచిస్తోంది. రచయిత విఠల్‍ప్రసాద్ పాత్ర ద్వారా మానవ ఆలోచనా సరళిని బాగా విశ్లేషించారు. రచయితకు నా అభినందనలు.

  2. కథనం చాలా బాగుంది. చివరి వరకు ఆసక్తికరంగా, ఆపకుండా చదివించింది.

  3. శ్రీ గొర్లి శ్రీనివాస్ గారి అరెస్ట్ వారెంట్ కథ, కథనం చాలా బాగున్నాయి. చివరలో ట్విస్ట్ చదివి ముక్కున వేలేసుకున్నాను. జడ్జి తలుచుకుంటే ఎంత సులభంగా సమస్యని దాటవేయవచ్చో తెలిసింది. ఈ కథలో రచయత కొన్ని కొత్త వాడుకల్ని ఉపయోగించారు. పడవని కాస్సేపు సుడిలోకి, కస్సేపు వొడ్డుకు లాగుతున్న వాడిలా అన్న ప్రయోగం బాగుంది. పులితో మాట్లాడి బోనులోకి పంపిస్తాను. నువ్వే మాటాడుకో అన్నట్టుందనీ కూడ వ్రాసారు. ఇలాంటివి కథకి అందాన్ని చేకూర్చుతాయి.

  4. apuroopa says:

    కధనం బాగుంది
    కాని

    ప్రభుత్వ అధికారి ఏమిటి? ( చీఫ్ గురించి మాట్లాడుతూ ఆయనను కె విస్వనాధ్ సినిమాలో లా పెద్దాయన అని సంబోధించటం ఏమిటి?)
    అతనినికి విషయం తెలిస్తే మండి పడ్స్తాడని మేనేజరు, అతని అసిస్తెంటు విషయాన్ని అతని దాకా తీసుకు వెళ్ళక పోవటం, చివరకు కోర్టులో అసిస్తెంటు తనే చీఫ్ అని చెప్పటం ఏమిటో నాకు అర్ధం కాలేదు.

  5. pothuri vijaya lakshmi says:

    katha kathanam chaala baagunni. we expect more such stories from this writer.
    pvlakshmi

  6. My dear Srinivas,

    Story is very much entertaining. Enjoyed in reading. Hope to receive many more from your pen.

    MKM

  7. The story ARREST WARRANT is quiet interesting and the sudden twist or KOSAMERUPU shows the intelligence of the writer.I wish many interesting and quality stories and NOVELS from
    G.SRINIVASA RAO GARU.

  8. Sasidhar says:

    Wow chala rojulu tharavatha oka kotha katha chadivinatlu vundhi.Chaduvuthunnatha sepu next yemiti, yemiti ane anxity….danetho patu comedy touch, it’s awesome. Meru itlante kathalu yeno rayale ane korukuntuna. ALL THE BEST 🙂

  9. కధ కధనం రెండూ బాగున్నాయి. పదవిలో వున్న వాళ్ళు తలుచుకుంటే, ఎంతటి కష్టం నుండి అయినా గట్టెంకించగలరు. ఈ కథలో రచయత వాడిన పద ప్రయోగం బాగుంది. అవి కథ వెంట కళ్ళు పరిగెత్తేలా చేసి, కధ కి అందాన్ని చేకూర్చాయి. కధ ముగుంపు చాలా బాగుంది. మరిన్ని కధలు రచయిత కలం నుండి ఆశిస్తూ, రచయితకు అభినందనలు.

  10. N.BARMAVATHU says:

    ARREST WARRANT story is simply superb.specially the climax.i compliment GORLI for his commendable work.

  11. Hari Sankar says:

    chaalaa rojula taruvaatha manchi katha chadivaamu.
    Chaalaa chaalaa baagundi.

  12. B.BHASKAR RAO ఇలా అన్నారు: మీ వ్యాఖ్య పరిశీలనలో ఉంది.

    SRIVASA RAO GARU.
    MEE KATHA NAKU CHALA NACHINDI.SAMASYA UNTE PARISKARM UNTUNDI ANI CHEPPI SAMASYA NI CHOOSI BHAYPADEVARIKI EE KHATHA DWARA PARISHKARAM CHOOPI DHYRYANNI ITHINANDUKU MEEKU NA DHANYAWADHALU.MEERU ILANE SAMAJIKA SAMASYALAKU NENUNANU ANI ANDARIKI CHUPICHAYU.SAMASYANI EITHARULATO PANCHUKUNTE MANCHIDI,DACHUKUNTE BHADHE MIGULUTUNDI.
    MEE ABHIMANI,
    G.BHASKAR RAO
    DOMALGUDA.

  13. nagireddy says:

    Kudos TO MR.GORLI SRINIVAS. YOU made it obvious that every problem has a solution. ONLY requisite being “thinking out of the box” and one shall tide over any critical issue with ease. I think that the core of the story is how to address a “systemic” issue and not writing off “the offence”?.
    Is there going to be a sequel to his story ….. ?
    its just our eagerness to see how GORLI GARU will weave another miracle.
    many more mind churning episodes to be penned by you in the days to come. GOD BLESS.
    K NAGI REDDY

Comments are closed.