శ్రీ రమణీయ చానెల్ – మొదటి భాగం

ఆయన కథలు… శ్రావణ మాసపు నోముల్లో ఆది దంపతులు పోటీలు పడి పంచుకు తిన్న తాలింపు శనగలంత కమ్మగా ఉంటాయి.

కవితల్నీ వచనాల్నీ ఆత్మలోకంటా చదివేసి పారడీ చేస్తే అసలు రచయితలు పెన్నులు తడుముకునేలాగుంటాయి.

కొంటెగా చమత్కార చమక్ తారల్ని నిశ్శబ్దపు చీకట్ల మీద చల్లితే, నవ్వుల వెన్నెల్ని ఆరబోయించే చెకుముకి పత్రికా ఫీచర్లూ నడిపారాయన.

“బాల్యం చూసేవారికి బావుంటుంది. యవ్వనం అనుభవించే వారికి బావుంటుంది.” అని కన్ఫ్యూజన్ లేకుండా అనెయ్యగలరు.
“ఏ ప్రక్రియైనా ఒకే మూసలో వేసి తీసిన కజ్జికాయల్లా ఉండకూడదు. వేటికి అవి స్వేచ్చగా చేతితో వేసిన పకోడీల్లా ఉండాలంటాను.” అంటూ రుచిగా రచయితల వీపు చరచగలరు.

ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారన్నట్టు మన పేర్లు చెప్పకుండా మన ఫోటోల నెగెటివ్ లని, మన రక్తమాంసాల వెనకున్న అసలు రూపాల్ని మనకే చూపించే గడసరి.

గచ్చు మీద కుప్పగా పోస్తే గుప్పెట నిండుగా గుండెకు హత్తుకోవాలనిపించే నీలపు గోళీల్లాంటి అక్షరాల ఆటలో నేర్పరి.

ఇన్ని కథలు రాశారు, మీ కథ చెప్పరూ అని అడగడానికి ఫోన్ చేస్తే ఏ భేషజమూ లేకుండా “నేనండీ రమణ ని” అంటే ఆ సింప్లిసిటీకి ఒక్క క్షణం రాంగ్ నంబరేమో అనిపించింది. తలాతోకా లేకుండా, ఒకదానికోటి సంబంధం లేకుండా అడిగిన ప్రశ్నల్ని చూసి, వాటినో వరస క్రమంలో తన జీవితానికి అన్వయించుకుంటూ ఓపిగ్గా పొద్దు కోసం తన ఆలోచనల్నీ, అనుభవాల్నీ, అభిప్రాయల్నీ పంచుకున్న ’శ్రీ రమణ’ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలతో..

-పొద్దు

————-

నా గురించి నేను — శ్రీరమణ

1st photoమా వూరు వరహాపురం – అగ్రహారం. వేమూరు మండలం తెనాలికి చాలా సమీపంలో వుంది. తెనాలి – రేపల్లె బ్రాంచిలైనులో వేమూరు స్టేషన్ వుంది. వేమూరికి మైలున్నర దూరంలో వుంది మా వూరు. నాన్న పేరు సుబ్బారావు, అమ్మ అనసూయ. నాన్న మా వూరి స్కూల్ టీచర్, మేనేజర్ కూడా. ఆ రోజుల్లో ప్రైవేట్ స్కూల్స్ వుండేవి. ప్రభుత్వం గ్రాంట్ యిచ్చేది. ఎయిడెడ్ స్కూల్ అనేవారు. మా ఇంటిని ఆనుకునే ఎలిమెంటరీ బడి వుండేది. పదిమంది టీచర్స్ వుండేవారు. దాదాపు యాభై ఏళ్ళ క్రితం మాట యిది. అప్పటికి రోజూ సాయంత్రాలు చైత్రము వైశాఖము, ప్రభవ విభవలు తరగతులన్నిటినీ కలిపి చెప్పించే సంప్రదాయం వుంది. సుమతి, వేమన; పాటలూ పాడించేవారు.

నేను వెళ్ళినపుడల్లా ఒకటి రెండు ఫోటోలు తీసేవాడు. పెద్దవాణ్ణి అయాక తెల్సింది బౌనా అంటే ఆయనేనని. సినిమాలో చేరాలనుకున్న వారందరికీ ఆయనే ఫోటోలు తీసేవారు. అగ్రశ్రేణి తారలకు తీశారు. మద్రాసు మకాం మార్చారు.

అప్పట్లో ఫస్ట్‌ఫారమ్‌లో అంటే హైస్కూలులో అడుగుపెట్టాలంటే ప్రవేశ పరీక్ష వుండేది. మా వూళ్ళో అయిదో క్లాసు వరకే (ప్రాథమిక విద్య – ఎలిమెంటరీ) వుండేది. మా బడి పేరు శ్రీరామ హిందూ ప్రాథమిక పాఠశాల. న్యాయపతి రాఘవరావు (రేడియో అన్నయ్య, అక్కయ్య) ఆంధ్ర బాలానందం పక్షాన నడిపే “బాల” మాస పత్రిక మా బడికి తెప్పించేవారు. గృహలక్ష్మి, భారతి మా యింటికి వచ్చేవి.

నాన్నకి చాలా యిష్టాలుండేవి. మొక్కలన్నా చెట్లన్నా, పశువులన్నా ప్రాణం. పూనేలో పెస్టంజీ.పి.పోచా అని పెద్ద అగ్రి కల్చరల్ ఫారం వుండేది. విత్తనాలు, వ్యవసాయ పరికరాలు, ఆధునిక వ్యవసాయ సూచనలు, హైబ్రీడ్స్, క్రాస్‌బ్రీడ్స్ అన్నీ వారు తయారు చేసేవారు. అక్కణ్ణించి మా ప్రాంతానికి టమేటాని మొట్ట మొదట తీసుకొచ్చింది మా నాన్నే! దీన్నే “రామ ములగ” అంటారు. మా సువిశాలమైన పెరట్లో రంగురంగుల గులాబీలు, ఎర్ర మల్లెలు పూసేవి. పెద్ద తులసి మొక్క వుండేది. ఎంత పెద్దదంటే ఆ చెట్టు కొమ్మల్లో నేను కూచునే వాణ్ణి.

వ్యవసాయంలో కూడా బోలెడు కొత్త పద్ధతులు ప్రవేశపెట్టారు. మంచి ఎడ్ల జతలు వుండేవి. చిన్న ఆవుదూడలు చెంగనాలతో సావిడి దొడ్డిని సందడిగా వుంచేవి. తువ్వాయిలతో ఆడుకోవడం ఎంత ఆనందం? తెనాలిలో యేజళ్ళ శ్రీరాములని ప్రసిద్ధ పశు వైద్యులుండేవారు. ఆయనకు “అభినవ సహదేవ” అని బిరుదు వుండేది. “గోసేవ” అని ఒక పత్రిక నడిపేవారు. బహుశా తెలుగులో కేవలం పశుగణంపై వచ్చిన మొదటి పత్రిక అదేనేమో! నాన్న ఎప్పుడైనా నన్ను కూడా వాళ్ళింటికి తీసుకు వెళ్ళేవారు. తెనాలి రైలు గేట్ల మధ్య వాళ్ళ యిల్లుండేది. అక్కడ చిన్న చిన్న జింక పిల్లలు, కుందేళ్ళు, రామచిలకలు వుండేవి. వాటితో ఆడుకుంటుంటే పొద్దే తెలిసేది కాదు. తిరిగి రావాలంటే బలే బాధ అన్పించేది. ఇది నా బాల్య జ్ఞాపకాలలో మర్చిపోలేనిది.

ఒకసారి బుజ్జి జింకపిల్లని పెంచుకోవాలని తెచ్చుకున్నాం. కొన్నాళ్ళు బానే వుంది. తర్వాత ఏమైందో పాపం చచ్చిపోయింది. దాన్ని మా పొలం దిబ్బ మీద పూడ్చి పెట్టడం, మా పాలేరు దాని మీద కల్లు ఉప్పు పోయడం నాకు యిప్పటికీ గుర్తొస్తే కలుక్కుమంటుంది. జింకపిల్ల ఇంట్లో నాపరాతి గచ్చు మీద తన గిట్టలతో నడవలేక జారిపోయి పడిపోతూ వుండేది. పట్టుకుచ్చులాంటి లేత పచ్చిక తెచ్చి దాని చేత తినిపించేవాణ్ణి. అది పోయాక ఇల్లంతా బోసి పోయింది. చాలా రోజులు దిగులు ఆవరించింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా యిలాంటి పెంపుళ్ళు వద్దని ఇంట్లో అందరూ తీర్మానించారు.

నాన్న తెనాలిలో మరో యింటికి కూడా వెళ్తుండేవారు. కొల్లా కాశయ్య, తాయారమ్మల ఇల్లు. ఆయన ఆ రోజుల్లో తెనాలికి “ది హిందూ” రిపోర్టర్‌గా వుండేవారు. తాయారమ్మ అనాథాశ్రమం, స్కూలు నడిపేవారు. సుప్రసిద్ధ మిమిక్రీ విద్వాంసులు నేరెళ్ళ వేణుమాధవ్ వారి అల్లుడు. సువిశాల ప్రాంగణంలో కొల్లా వారిల్లు వుండేది. రెండుమూడు పొగడ మానులు, వాటి కింద రాతి అరుగులు వుండేవి. నాన్న ఆయనతో వ్యవహారం చేస్తుంటే, నేను బోలెడు పొగడపూలు ఏరి కుప్ప పోసేవాణ్ణి. వచ్చేటప్పుడు నాన్న ఉత్తరీయంలో మూట కట్టుకుని ఇంటికి తెచ్చేవాణ్ణి. వాటిని చూసి అమ్మ చాలా మురిసిపోయేది. బట్టల బీరువాలలో, మడతల్లో జల్లేది. ఆ పొగడ పరిమళం యిప్పటికీ మా బీరువాలలో మూల మూలల చిక్కుకునే వుంది.

మరో తెనాలి ఆకర్షణ ఒక ఫోటో స్టుడియో. అక్కడ చందమామ, పెద్ద కారు, తాజ్‌మహల్ పొరాటు చెక్కతో (ప్లైవుడ్) చేసి, రంగులేసి వుండేవి. ఫోటోల్లో అవి అచ్చం నిజంవిలాగే కనిపించేవి. ఆయన తీసే ఫోటోలే కాదు, ఆయన కూడా అందంగా వుండేవాడు. నేను వెళ్ళినపుడల్లా ఒకటి రెండు ఫోటోలు తీసేవాడు. పెద్దవాణ్ణి అయాక తెల్సింది బౌనా అంటే ఆయనేనని. సినిమాలో చేరాలనుకున్న వారందరికీ ఆయనే ఫోటోలు తీసేవారు. అగ్రశ్రేణి తారలకు తీశారు. మద్రాసు మకాం మార్చారు. విజయచిత్ర కవరు పేజీలు, కలర్ పేజీలు ఆయన ఫోటోలతోనే పాఠకుల్ని అలరించేవి.

నాన్న కాసేపు వెంకట్రామ అండ్ కో దగ్గర, కవిరాజా పబ్లిషర్స్ దగ్గర ఆగేవారు. అప్పట్లో చిన్న తరగతుల పాఠ్య పుస్తకాలు వాళ్ళే అచ్చువేసేవారు. తెనాలి స్టేషన్‌లో హిగిన్ బాదమ్స్‌లో చందమామ కొనిపెట్టేవారు నాన్న. స్టేషన్‌లో ఓ చివరగా ఆర్‌ఎమ్మెస్ (రైల్వే మెయిల్ సర్వీస్) వుండేది. గ్రామాల నుంచి, బస్తీల నుంచి పోస్టు బ్యాగ్‌లు అక్కడికి వచ్చేవి. వాటిని ప్రాంతాల వారీగా విడగొట్టి ఆయా దిక్కులకు వెళ్ళే రైళ్ళలో వేసేవాళ్ళు. కొన్ని గొప్ప రైళ్ళలో ఆర్‌ఎమ్మెస్ భోగీ వుండేది — గూళ్ళు గూళ్ళుగా రైలు ప్రయాణిస్తున్నా అందులో జాబుల సార్టింగ్ జరుగుతూ వుండేది. అన్నట్టు చెప్పనేలేదు నాన్న మా వూరి పోస్టు మాస్టర్ కూడా. ఇప్పటికి సరిగ్గా 75 సంవత్సరాలుగా పోస్టాఫీసు మా ఇంట్లోనే వుంది. ఇంకా యిప్పటికీ రెండో తరంలో. గ్రామీణ పోస్టాఫీసుల్ని ఇ.డి. అంటారు. అంటే ఎక్స్‌ట్రా డిపార్ట్‌మెంటల్ అని. ఇది వుద్యోగం కాదు, కేవలం సేవ. ఆ రోజుల్లో నెలకి నాలుగైదు రూపాయల భృతి యిచ్చేవారట. ఆయన దాదాపు యాభై ఏళ్ళు పనిచేశారు. వారసత్వంగా అది యిప్పటికీ మా కుటుంబాన్ని వదల్లేదు.

మా చిన్నతనంలో పోస్టాఫీసుల్లో క్వినైన్ మాత్రలు అమ్మేవారు. మలేరియాకి మందు. ఒకసారి పోస్ట్‌బ్యాగ్‌లో పెద్ద త్రాచుపాము వచ్చింది. అప్పుడు చాలా పెద్ద పెద్ద గోతపు సంచులు వుండేవి. చాలా రోజులు దీన్ని కథలా చెప్పుకునేవాళ్ళం. నాకు ఒకందుకు గర్వంగా వుండేది. మనియార్డర్ ఫారం పూర్తి చేయడం మా మేష్టారికి కూడా వచ్చేది కాదు. నేను నిమిషంలో పూర్తి చేసేవాణ్ణి. ముద్దర్లు వేయడం, తారీకు, నెల మార్చడం నాకు వెన్నతో పెట్టిన విద్య. మంచి స్టాంప్ కలెక్షన్ వుండేది. పెద్దయాక కూడా స్మారక తపాలా బిళ్ళలు, ఫస్ట్‌డే కవర్లు, కాన్సిలేషన్‌తో సేకరించేవాణ్ణి. వయసుతో కొన్ని వుత్సాహాలు సన్నగిల్లుతాయి. ఒక వుత్సాహవంతుడికి అప్పగించి చేతులు దులుపుకున్నాను.


పెద్దబడి

2nd photoఈ ఉపాఖ్యానాలకేం గాని, అడ్మిషన్ పరీక్ష నెగ్గి వేమూరు హైస్కూలు‌లో ఫస్ట్‌ఫారమ్‌లో చేరాను. అప్పుడు నాకు ఏడేళ్ళు. రోజూ వేమూరు వెళ్ళి రావాలి. కవిరాజా జిల్లా పరిషత్ హైస్కూల్. త్రిపురనేని రామస్వామి చౌదరిది తెనాలి. కవిరాజు పేరు అందుకే పెట్టారు. తెనాలి వుద్యమాల పురిటిగడ్డ. తెనాలి దగ్గర్లో కూచిపూడిలో పండిత గోపదేవ్ కులవ్యవస్థ మీద, సంప్రదాయాల మీద తిరగబడ్డారు. ఒక వుద్యమంగా నడిపి, అన్ని కులాల వారు ఉపనయనం చేసుకోవచ్చు, గాయత్రి మంత్రం పఠించవచ్చని కొందరు ఔత్సాహికులకు జంధ్యాలు వేశారు. మా వూళ్ళో కూడా పదిమంది దాకా జంధ్యాలవారైనారు. నిజంగానే వాళ్ళ ఇళ్ళ పేర్లు మరుగున పడి జంధ్యాల బసవయ్య, జంధ్యాల సుబ్బయ్యగా వాసికెక్కారు. కొందరికి కలిసి రాలేదని వాటిని తెంపిపోశారు. కొందరు భయపడి తీసేసారు. గుంటూరులో ఒక పీఠాధిపతి వారికి ప్రాయశ్చిత్తం చేసి, భయం పోగొట్టారని చెప్పుకునేవారు.

థర్డ్ ఫారమ్‌లో జనరల్ మాథ్స్ తీసుకోవాలో, కాంపోజిట్ మాథ్స్ తీసుకోవాలో నిర్ణయించుకోవాలి. జనరల్ వారంతా డాక్టర్లు అవుతారని, కాంపోజిట్లు ఇంజనీర్లవుతారని ఒక ఆశ. రోజూ పొద్దున్నే అన్నం తిని, చిన్న క్యారేజీ పుస్తకాల సంచి తీసుకుని వేమూరు వెళ్ళడం, సాయంత్రం యీసురోమంటూ తిరిగిరావడం. దారిలో రెండు ఆకర్షణలు. ఒకటి పంట కాలవ, రెండోది రైల్వే లైను. లైను పక్కన టెలిఫోన్ తీగెలుంటాయి. అవి జుమ్మని నిరంతరం రోదిస్తుంటాయి. ఆ తీగెని గురి చూసి రాయితో కొడితే చాలా పెద్ద శబ్దం వచ్చేది. ఔటర్ సిగ్నల్ దగ్గర కావల్సినంత కాలక్షేపం. మా వూరి నుంచి నలభై మందిమి వేమూరు స్కూలుకి వెళ్ళేవాళ్లం. మా బ్యాచ్ ఇరవై. రైలు పట్టాల మీద తీగె ముక్కలు, పిన్నీసులు పెట్టి చాకులు చెయ్యడం, అర్థణా బిళ్ళ పెడితే బేడ కావడం మాకు తెలుసు. మా రైలు వ్యవహారాలు మా కంటే ముందు మా ఇళ్ళకు చేరేవి. ఎవడికి వాడే పక్కవాడి పేరు చెప్పి తప్పుకునేవాళ్ళు.

పధ్నాలుగేళ్ళు వచ్చేసరికి ఎస్సెల్సీకి వచ్చాను. స్కూల్ ఫైనల్ అని కూడా పిలిచేవారు. అయితే పరీక్ష రాయడానికి పదిహేనేళ్ళు నిండాలి. నాన్న గుంటూరు వెళ్ళి డి.ఇ.ఒ దగ్గర స్పెషల్ పర్మిషన్ తెచ్చారు. ఫస్ట్ ఛాన్స్‌లో ఎస్సెల్సీ ప్యాస్ అవడంతో జీనియస్సుల లిస్టులో పడిపోయాను.

“సాధించినవి లేకపోలేదు”

3rd photoస్కూలు రోజుల్లో నేను సాధించిన సంగతులు బొత్తిగా లేకపోలేదు. రామకృష్ణ మిషన్ ఆశ్రమ్, నరేంద్రపూర్, 24 పరగణాల జిల్లా వారు స్వామి వివేకానందునిపై వ్యాస రచన పోటీ నిర్వహించారు. ఏ ఏ పుస్తకాలు చదివితే వారిచ్చిన అంశంపై వ్యాసం రాయవచ్చో వారే సూచించారు. ఇందులో తప్పక పోటీ చేయాలన్పించింది. చేశాను. జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి వచ్చింది. ఇలా వరసగా ఆరేళ్ళు ప్రథముడిగా నిలిచాను. ఇందులో మూడేళ్ళు హైస్కూల్ స్థాయిలో, మూడేళ్ళు కాలేజి దశలో. స్కూల్లో వుండగా పేపర్లో నా ఫోటోతో వార్త పడింది. రేడియో డిల్లీ వార్తల్లో చెప్పారు. జెండా వందనం దగ్గిర నన్ను నిలబెట్టి మా హెడ్మాస్టారు నన్ను పొగడడం, స్కూలుకి పేరు తెచ్చావోయ్ అనడం గొప్ప ఆనందాన్నిచ్చింది. పన్నెండేళ్ళ వయసులో విజయవాడ ఆకాశవాణి నుంచి నా ఇంటర్వూ వచ్చింది. కందుకూరి వీరభద్రరావు నన్ను ప్రశ్నలడిగారు. యువజనుల కార్యక్రమంలో ప్రసారం చేశారు. అప్పట్లో స్కూల్స్‌లో రేడియోలు, ప్రతి రూమ్‌లో స్పీకర్లు వుండేవి. నా కార్యక్రమాల్ని అందరికీ వినిపించారు. మా తరగతి పిల్లలంతా నా రేడియో అనుభవాల్ని అడగడం, నేను గొప్పగా చెప్పడం.. యిప్పటికీ తల్చుకుంటే ఆనందంగా వుంటుంది.

అగ్రహారం అరుగుల మీద చదరంగం నడుస్తూ వుండేది. నాటి ప్రసిద్ధ చదరంగపు ఆటగాళ్ళు దీక్షిత్, తిలక్ మావూరు వచ్చేవాళ్ళు. పెద్ద పోటీలలో ఆడేవారు రకరకాల వాళ్ళతో ఆడాలి. కొత్త ఎత్తులు తెలుస్తాయి. మస్తు, నిర్మస్తు అనేది ముందే నిర్ణయించుకుంటారు. రాజుకి అండగా వున్న బలాన్ని మస్తులో చంపరాదు. నిర్మస్తు అంటే నిర్మొహమాటం. చెక్, తెరచి రాజు, షా లాంటి మాటల్ని రాజుకి గడిలేనప్పుడు అంటారు. నేను ఎందుకో శ్రద్ధ పెట్టలేదు. చాలా ఆసక్తి వుండేది. నాన్న, నాయనమ్మ, మేనత్తలు బాగా ఆడేవారు. అందమైన చెస్ బోర్డ్‌లు, చదరంగపు బలాలు వాటిని కట్టిపెట్టే కళాత్మకమైన చందన భరిణెలు వుండేవి. గౌరవ మర్యాదలు, సంప్రదాయాలు కలిగిన మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగాను. దాంతో బోలెడు ఆశలు, తీరని కోరికలు నాతో పాటూ పెరుగుతూ వచ్చాయి.

కాలేజీ

4th photo

బాపట్ల మాతామహుల ఊరు. అప్పుడే బాపట్లలో కళాశాల స్థాపించారు. దాని స్థాపనలో మా తాతగారి ప్రమేయం వుంది. కనుక నేను బాపట్లలో పియుసి చదవడం నిర్ణయమైపోయింది. బాపట్ల కాలేజి ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌లో పి.యు.సిలో చేరాను. మా ప్రిన్సిపాల్ డా. శ్రీపాద గోపాల కృష్ణమూర్తి, పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి ఇంగ్లీష్ హెడ్, బొడ్డుపల్లి పురుషోత్తం తెలుగు శాఖాధిపతి. బి.ఎస్.సిలో ఎమ్.పి.సి గ్రూప్‌లో చేరాను. కళాశాల దాదాపు సొంతదిలా వుండేది. పైగా విద్యార్థి యూనియన్‌లో ప్రముఖపాత్ర. వీటన్నిటితో చదువు పూర్తిగా కొండెక్కలేదు గాని, యూనివర్శిటీ స్థాయిలో మొదటి రెండు మూడు స్థానాల్లో వుండాల్సినవాణ్ణి. వుండకుండా పోయాను. వుండి వుంటే ఎమ్మెస్సీ ఫస్టున ప్యాసై మా కాలేజీలోనే ఫిజిక్స్ డిపార్ట్‌మెంట్‌లో ఎదిగి, శాఖాధిపతినై… అదేం నై నై. మిడిల్ డ్రాప్‌గా మిగిలిపోయాను.

అప్పుడప్పుడే (1967-70) గోడల మీద రాతలు యువతరాన్ని ఆకర్షిస్తున్నాయి. నక్సల్‌బరీ, చారుమజుందార్, బులెట్టా-బ్యాలెట్టా లాంటి మాటలు యువకుల బాతాఖానీలో వినిపిస్తున్నాయి. బాపట్లలో వ్యవసాయ కళాశాల వుంది. మేము స్థానికులం కాబట్టి స్థానబలిమి వుండేది. బాపట్ల లాంటి చిన్న టౌన్‌లో తెలియని వ్యవహారం వుండేది కాదు. మా తాతగారికి ఆడపిల్లలే గాని మగ పిల్లలు లేరు. పి.యు.సిలో వుండగా నన్ను దత్తత చేసుకున్నారు. సరిగ్గా దత్తుడు ఎలా వుంటాడో అలాగే వుండేవాణ్ణి. ఇక్కడ నా పేర్ల గురించి చెప్పాలి. పుట్టిన చోట రాధాకృష్ణ. ఇంటిపేరు వంకమామిడి. దత్తపుత్రుణ్ణి అయాక రామారావు. ఇంటిపేరు కామరాజు. తాతగారితో సంక్రమించిన పొలాలు, ఇళ్ళు, దొడ్లు గొడ్లు యివన్నీ పర్చూరు దగ్గర ఉప్పటూరులో, ఇంకొల్లు సమీపంలోవున్న నూతలపాడులో వుండేవి.

మళ్ళీ ఒకసారి ఆ సర్టిఫికెట్‌పై ఆయన సంతకం చేయించుకోవాలనుకున్నాను. జరగలేదు. దేనికైనా ప్రాప్తం వుండాలి. ఆయన స్వీయచరిత్రకి కేంద్రసాహిత్యఅకాడెమీ అవార్డ్ వచ్చింది. అప్పుడు పత్రికా సంపాదకునిగా వారిని ఇంటర్వూ చేశాను. ఇది నా బతుక్కి ఒక గొప్ప అనుభవం.

వాగుకి యిద్దరిన ఉప్పటూరు, అద్దరిన కారంచేడు. మా మామయ్యలు అక్కడ ఆరేడు వూళ్ళకి కరణాలు. వర్జీనియా పొగాకు పండే పొలాలు. నాలుగు డబుల్ బ్యారన్లు వుండేవి. దీన్ని బట్టి ఎకరాల లెక్క తెలుస్తుంది. పర్చూరులో ఐ.ఎల్.టి.డి (ఇప్పుడు ఐ.టి.సి) ఎన్.టి.సి, అగ్రింకార్, సులేమాన్ ఖాన్, కొసనం, చాగంటి కోనయ్య మొదలైన పొగాకు కంపెనీలు వుండేవి. పర్చూరులో రీడ్రైయింగ్ ఫ్యాక్టరీలు కూడా వుండేవి. కంపెనీలు పొగాకు కొని, గ్రేడింగ్ చేసి, కాడలు తీసి, నీటిని తీసి అనవసరపు బరువు తగ్గించి బేళ్ళు కట్టి — కలకత్తా రేవు నుంచి విదేశాలకు రవాణా చేసేవారు.

చాగంటి వాళ్ళ కంపెనీ చాగంటి భాస్కరరావు కుటుంబానిది. భాస్కరరావు మా కంటె సీనియర్. చీరాల వి.ఆర్.ఎస్.వై.ఆర్.ఎన్ కళాశాలలో చదివాడు. మంచి కబడ్డీ ఆటగాడు. మితభాషి. ఆడంబరం తెలియదు. రాజకీయ పాఠశాలలు నడిపేవాడు. ఒకానొక సాయంకాలం అండర్‌గ్రౌండ్‌కి వెళ్ళాడు. “మీరు మాతో ఎక్కువ దూరం నడవలేరు. అయినా నడిచినంత కాలం నడుద్దాం” అనేవాడు గంభీరంగా. డా. ఎ.పి. విఠల్ పెళ్ళి సందర్భంగా భాస్కరరావు మా వూరు (వరహాపురం)వచ్చాడు. డా. విఠల్ ప్రజాశక్తితో వున్నాడు. పుచ్చలపల్లి జీవిత చరిత్ర రాశాడు. భాస్కరరావు లాంటి, చిత్తశుద్ధిగల దేశాభిమానిని నేను చూడలేదు — పూర్వపు తరాలలో వున్న వారి గురించి వినడం తప్ప. ఇప్పుడు భాస్కరరావు లేడు. ఎక్కువ రాయకూడదు. సాక్ష్యాలు దొరకనిచోట సొంత అనుభవాలను విస్తరించకూడదు. “స్వోత్కర్ష” అవుతుంది. రెండు పేర్లు, రెండు ఇంటిపేర్లు — ఈ తికమక నుంచి బయటపడాలని శ్రీరమణ పేరు పెట్టుకున్నాను.

చాలా చిన్నతనంలో హిందీ రాష్ట్రభాష పూర్తి చేశాను. బహుశా ఫస్ట్‌ఫారం (ఆరోతరగతి)లో వుండగా అనుకుంటాను. ఆంధ్ర సారస్వత పరిషత్తువారి పెద్ద పెద్ద పరీక్షలు కూడా ప్యాస్ అయ్యాను. మహాభారతంలో ఆది, సభాపర్వాలు, దివాకర్ల వెంకటావధాని గారి ఆంధ్రభాగవతోపన్యాసాలు, చిన్నయసూరి వ్యాకరణం యింగా బోలెడు ఉద్గ్రంథాలు సిలబస్‌లో వుండేవి. ఆ వయసులో ఆ ఉత్తీర్ణత ఒక రికార్డు. గడియారం రామకృష్ణశర్మ, నరోత్తమరెడ్డిగార్ల సంతకాలతో సర్టిఫికెట్ యిచ్చారు. మెట్రిక్ ప్యాసై, యీ పరీక్ష పూర్తి చేస్తే హైస్కూల్లో జూనియర్ తెలుగు పండిట్ ఉద్యోగానికి అర్హులు. నేను మూడు నాలుగేళ్ళ క్రితం గడియారం రామకృష్ణ శర్మగారిని పలుసార్లు కలిశాను. మళ్ళీ ఒకసారి ఆ సర్టిఫికెట్‌పై ఆయన సంతకం చేయించుకోవాలనుకున్నాను. జరగలేదు. దేనికైనా ప్రాప్తం వుండాలి. ఆయన స్వీయచరిత్రకి కేంద్రసాహిత్యఅకాడెమీ అవార్డ్ వచ్చింది. అప్పుడు పత్రికా సంపాదకునిగా వారిని ఇంటర్వూ చేశాను. ఇది నా బతుక్కి ఒక గొప్ప అనుభవం.

వరసగా ఆరు సంవత్సరాలు రామకృష్ణ మిషన్ వారి జాతీయ స్థాయి వ్యాస రచన పోటీలో ప్రథముడిగా రావడంతో, వారు వారి ప్రచురణలు మొత్తం బహుమతిగా యిచ్చారు. నాటి రాష్ట్రపతి వి.వి. గిరి గుర్తింపుగా వాత్సల్య సత్కారాన్ని అందించారు. నాటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ పట్టం థాను పిళ్ళై రాజభవన్ (హైదరాబాద్) అతిథిగా ఒక రోజు నన్ను భరించారు. 17, 18 ఏళ్ల వయస్సులో గవర్నర్ దంపతులతో రాజభవన్‌లో టిఫిన్లు భోజనాలు చేయడం చాలా గొప్ప అనిపించింది. అప్పుడు మొదటిసారి టై కట్టుకున్నాను. ఎలా డ్రెస్ వెసుకోవాలో ఏమిటో వివరంగా ఎయిడ్ డిక్యాం (ఎడిసి) ముందస్తుగా లేఖ రాశాడు. తీరా వెళ్ళాక ఆ పెద్ద దంపతులు చాలా సాదాసీదాగా బోలెడు కబుర్లు చెప్పారు. చెప్పించుకున్నారు. పెద్దయాక అనేక సందర్భాలలో రాజభవన్‌కి వెళ్ళాను. కాని ఆనాటి భయం, ఆత్మవిశ్వాసం, ఉత్కంఠ తరువాత లేనే లేవు. ఆ ఆనందమూ లేదు. ఇటీవల రాజభవన్‌పై విశ్వాసమూ సన్నగిల్లింది.

ఇప్పుడు వుందో లేదో గాని అప్పుడొక ప్రఖ్యాత పథకం వుండేది. కల్చరల్ ఎక్స్‌ఛేంజ్ (ఆదాన్ ప్రదాన్) స్కీమ్‌లో ఎంపిక చేసిన యువతీయువకుల్ని వివిధ దేశాలలో పర్యటించడానికి భారత ప్రభుత్వం పంపేది. భారత్ నుంచి ఎంపికైన పాతికమందిలో నేను కూడా వున్నాను. 22 దేశాలు దాదాపు నాలుగు నెలల పర్యటన. యూనివర్శిటీ దీనికి ప్రత్యేక అనుమతి కూడా యిచ్చింది. తాతగారు అనారోగ్యంతో వున్నారు. ఏ క్షణానైనా ఏమైనా జరగచ్చు. కన్నకొడుకైతే ఏమో గానీ, దత్తపుత్రుణ్ణి కాబట్టి యిలాంటి స్థితిలో వదిలి వెళ్ళడం గొప్ప నేరం. అలాగని నాకు అనిపించలేదు, పెద్దవారికి ప్రాజ్ఞులకి అనిపించింది. వెళ్ళలేదు. అట్లాగని పెద్ద బాధా లేదు. ఏడాది తర్వాత తాతగారు పోయారు. అమ్మమ్మ అప్పుడెప్పుడో పోయింది. మా వూరు వచ్చేశాను. కొన్ని సంఘటనల్ని ప్రత్యక్షంగా చూశాక ఉద్యమాల మీద నాకెందుకో నమ్మకం సన్నగిల్లింది. నినాదాలు ఎగజిమ్మినా మనిషి మామూలుగానే వుంటాడనిపించింది. భాస్కరులు కోటికి ఒకరైనా వుండరని అర్థమైంది.

(ఇంకా ఉంది)

About స్వాతికుమారి

స్వాతికుమారి పొద్దు సంపాదకవర్గ సభ్యురాలు.

This entry was posted in వ్యాసం and tagged , . Bookmark the permalink.

17 Responses to శ్రీ రమణీయ చానెల్ – మొదటి భాగం

  1. రవి says:

    శ్రీరమణ గారి రచనలు చదువుతుంటే, అచ్చమైన మిత్రుడు కబుర్లు చెబుతున్నట్టు ఉంటుంది. ఆయనతో ముఖాముఖి పొద్దులో రావడం మహదానందకరం. ఇది పొద్దు ప్రస్థానంలో మరో మైలురాయి. ఈ స్థాయికి మీ(మన) పత్రిక ఎదిగినందుకు పొద్దు సంపాదకవర్గానికి మనఃస్ఫూర్తిగా అభినందనలు.

  2. anwar says:

    మళ్ళీ ఒకసారి ఆ సర్టిఫికెట్‌పై ఆయన సంతకం చేయించుకోవాలనుకున్నాను. జరగలేదు. దేనికైనా ప్రాప్తం వుండాలి. ఆయన స్వీయచరిత్రకి కేంద్రసాహిత్యఅకాడెమీ అవార్డ్ వచ్చింది. అప్పుడు పత్రికా సంపాదకునిగా వారిని ఇంటర్వూ చేశాను. ఇది నా బతుక్కి ఒక గొప్ప అనుభవం.
    పై పేరా కింద రావాల్సింది ,పొరబాటున పైనే వచ్చింది సరి చూసుకోండి,
    మహా గొప్పగా వుంది, చదివిన వెంటనే రమణ గారుకి పొన్ చేసా ఆయన నాకు కాస్త ఎక్కువ తక్కువగా అంటే బాగా … ఒకలా ఫ్రెండ్షిప్ వుందన్న మాట, ఆయన ప్రయాణంలొ వున్నారు, తరువాత చేస్తామన్నారు, నిజానికి ఇదంత రమణ గారి మాటల్లొ వినాలి బలే సందడి ఆ చమత్కారాలు , హాయిగా మాట నడిపించడం. నవ్వించడం.
    అద్భుతమైన వ్యాసం మీకు నమస్కారం .

  3. ఆ రోజుల్లో టమాటాలని పుల్లొంకాయలు ( పుల్ల వంకాయలు ) అని అంటూండేవాళ్ళం.

  4. “శ్రీరమణీయ చానల్” అని చూడగానే చాలా సంతోషమేసింది. మొదటిభాగం అని చూశాక మరింత సంతోషమేసింది. శ్రీరమణగారి గురించి ఆయన మాటల్లో వినేందుకు అవకాశం కల్పించిన పొద్దుకు జయహో..!!

  5. Purnima says:

    WoW ! This is truly a new year gift for poddu readers.

    hearty congratulations and great going! 🙂

    (P.S: Can’t type in Telugu now, can’t stop myself from commenting)

  6. cbrao says:

    మొదటి భాగం ఆసక్తికరంగా ఉంది. రెండవ భాగం కోసం ఎదురు చూస్తాను.

  7. లలిత says:

    చాలా ఆనందంగా వుంది. శ్రీచానెల్, గుత్తొంకాయ్ కూర- మానవసంబంధాలు నాకు చాలా నచ్చిన శ్రీ రమణగారి రచనలు . పొద్దు కు అభినందనలు .

  8. Ravi Kumar says:

    Good to read about Bapatla – my birth place, Kuchipudi – where I studied and Tenali – where we lived. Thanks Sree Ramana Garu. Could recall many good memories. Waiting for more !!

  9. Brij Baala says:

    శ్రీ రమణ గారంటే కూలంకష ప్రఙ్ఞావంతులు. వారి మాటల్లోనే వారి జీవితం గురించి చదవడం ఒక సుకృతం తాలూకు ఫలితం. ఇంత చక్కని పని చేస్తున్నందుకు పొద్దు వారికి నమస్కారాలు.

  10. Sowmya V.B. says:

    ఈమధ్య కాలంలో పొద్దులో వస్తున్న రచనల్లో, నేను చదివిన వాటిలో… నన్ను ఆపకుండా చదివించినది ఇదొక్కటే!
    పొద్దు సంపాదక వర్గానికి అభినందనలు!
    తరువాయి భాగాల కోసం ఎదురుచూస్తూ ఉంటాను…

  11. బాగుందండీ. కల్హార పరిచయం, శ్రీరమణగారి విశేషాలూ బాగున్నాయి.

  12. శ్రీ రమణ గారి ‘మిథునం’ అత్యంత హృద్యమైన రచన. అందులోని భాష, సున్నిత హాస్యం, వాటి చాటున దాగిన విషాదం ఏనాటికీ మరచిపోలేం. ఈ నాటికి శ్రీ రమణ గారికి ‘పొద్దు’ ద్వారా కృతజ్ఞతలు తెలుపుకునే అవకాశం కలిగింది. పొద్దు వారికీ ఈ సందర్భంలో కృతజ్ఞతలు.

  13. శ్రీ రమణగారి కధలకి నేనో పెద్ద అభిమానిని.. నా గొప్పేమీలేదులెండి, ఆయన కధల గొప్పేకానీ. అభిమానిని అని చెప్పుకోవడమే నాకు గొప్ప. ఇలా రమణగారి గురించి ఆయన కలం ద్వారా తెలుసుకోగలగడం చాలా సంతోషంగా ఉంది.. మీకు నా కృతజ్ఞతలు.

  14. Tamirisa Janaki says:

    Sri Ramana Gari gurinchi chaduvutunte [Vaari matallone] chaala chaala baagundi.Midhunam,Maanavasambandhalu,SriRamana antaa kalipi okate maata.veru veru kaadu naa drustilo.Thanks to Poddu.net.
    january 21,2010.8:34pm
    Tamirisa Janaki

  15. viswam says:

    sriramanagari mithunam,kathavattuchala hasyamganu mariyuchaala akattukone vidhamga vuntundi

  16. Tamirisa Janaki says:

    Vayasuto konni utsahalu[saradalu] sannagillutayi ani SriRamana garu anna maata nijam.Naaku kuda chaala kaalam stamp collection sarada undedi.ippudu kuda undi kaani ekkada daachi pettano gurtu undatledu.Manavalaki iste vallu
    nanne jaagratta cheyyamani naake appagistunnaru.
    Tamirisa Janaki

  17. d madhusudana rao says:

    mastaari gariki namaskaramulu,
    mee vyasam ippude chadivanu, chala baga nachindi,
    mukhyamga jandhyala gari swadasturitho leka chala
    adhbutahm!

    mee abhimani,
    d.madhu

Comments are closed.