– శ్రీరమణ
“ఇట్నించి పొద్దున ఫ్లైట్ లేదు. అట్నించి మర్నాడు సాయంత్రం గాని లేదు. సో, ప్రయాణంలో రెండ్రోజులు. . . అంటే యిక్కడ కనీసం పది రికార్డింగులు ఆగిపోతాయి. పైగా అక్కడ గాలిమార్పు, తిండిమార్పు, స్ట్రెయిను సరే సరి. మీరేమో యీ అంకెకే ‘అమ్మో’ అంటున్నారు. అంతకు తగ్గితే నాకు వర్కౌట్ కాదు,” రికార్డింగ్ థియేటర్ కారిడార్‌లో చంద్రశేఖరాన్ని వాళ్ళు వినయంగా వింటున్నారు. వాళ్లు ముగ్గురూ మ్యూజికల్ నైట్ నిర్వాహకులు. చంద్రశేఖర్ వర్ధమాన నేపథ్యగాయని లలిత భర్త.
ఆ ముగ్గురూ సైగలతోనే తీవ్రంగా చర్చించుకుంటున్నారు. థియేటర్ లోపల్నించి రకరకాల వాద్యాలు వేర్వేరు శ్రుతుల్లో లీలగా వినిపిస్తున్నాయి. చంద్రశేఖర్ సెల్‌ఫోన్ టకటకా నొక్కి, వినయంగా పొందికగా నాలుగు మాటలు మాట్లాడి ఫోను కట్టేసి జేబులో పడేశాడు. ఆ ఫోను అప్పుడే చెయ్యాల్సినంత ముఖ్యమైంది కాకపోయినా, యిలాంటి సందర్భాలలో మూడ్‌ని సరిచేసుకోవడానికి ఇదొక చిన్న చిట్కా.
ఆ ముగ్గురి పెదాలు కదుల్తున్నాయి గాని, ఒక గొంతే వినిపిస్తోంది. “. . .అంటే ఆర్కెస్ట్రా, వాళ్ళ ట్రావెలూ. . . యివన్నీ వున్నాయి కదండీ”
“పోనీ ఓ పని చెయ్యండి”
“… … …”
ఆ మాటతో ఆశగా మూడు మెడలూ చంద్రశేఖర్ వైపు ఒక్కసారి సాగాయి.
“ఆర్కెస్ట్రా లేకుండా లాగిస్తే పోలా. . .” అవసరం లేనంత స్థాయిలో పొడిపొడిగా నవ్వాడు లలిత భర్త.
ఉక్రోషాన్ని దిగమింగుతూ ఆర్గనైజర్లు వెనక్కు తగ్గారు.
చంద్రశేఖర్ చేతిలో వున్న మినరల్ వాటర్ సీసా మూత తీసి నోటి నిండా నీళ్ళు పోసుకుని మూత బిగించాడు. నీళ్ళని మూడు గుక్కలుగా మింగాడు. కొత్త సంగతిలోకి వెళ్ళడానికి విరామ చిహ్నాల్లా –
“మైకు, స్టేజి, ఆర్కెస్ట్రా అంటే ఎట్లాగండీ. అన్నీ కలిస్తేనే కదా ప్రోగ్రాము. అయినా, డబ్బు కాదండీ. . . ఇక్కడ నా ప్రొడ్యూసరు సఫరవకూడదు. నాకది ముఖ్యం.”
ఎవరో తలుపు తీశారు. ఒక్కసారి లోపల్నించి ఫాస్ట్ ఫార్వర్డ్‌లో వెళుతున్న మ్యూజిక్ ట్రాక్ “గిర్ర్… డ్రుమ్… గిజగిజ… క్రీచ్… కిచ కిచ”మని రకరకాల వింత ధ్వనులను వినిపించింది. ఇంతలో ఠక్కున నోరు నొక్కేసినట్టు తలుపు మూసేశారు. ఆ కీచురాళ్ళ శబ్దం టక్కున తెగిపోయింది.
పక్కనే వున్న కాబిన్‌లో కూచుని పాడబోయే పాటని తన డైరీలో రాసుకుంటోంది లలిత. అసిస్టెంట్ డైరెక్టరు లిరిక్ కాగితాలు పట్టుకుని మేడమ్‌కు సాయం చేస్తున్నాడు. పాడడం కాగితం చూసి పాడినా, నొటేషన్‌తో సహా పాట డైరీలో వుండాలి. ఎవరో ఎక్కడో ఏ కచేరీలోనో ఆ పాట పాడమని అడిగితే…! అందుకే సిద్ధంగా వుండాలి. లలిత ఆ పాటలో మాటలని మననం చేసుకుంటూ, మధ్య మధ్య ట్యూన్ ప్రకారం హమ్ చేస్తూ రాస్తోంది.
కాబిన్‌లోంచి, వేరే అద్దాల గదిలోకి నడిచింది లలిత. ఎదురుగా విశాలమైన హాలు కనిపిస్తోంది. అందులో అక్కడక్కడ సంగీత వాయిద్యాలు ముసుగుతన్ని నిద్రపోతున్నాయి. చెవులను దాటి చెంపల దాకా విస్తరించిన ఇయర్ ఫోన్‌ని తగిలించుకుంది లలిత. ఎదురుగా వున్న మైకుని సరిచేసి హడావిడిగా వెళ్లాడు హెల్పరు.
“ట్రాక్ ఒకసారి విందాం మేడమ్” రికార్డింగ్ కాబిన్‌లోంచి మ్యూజిక్ డైరెక్టర్ గొంతు చెవులకు సోకింది.
“యస్సార్”
“వన్ టూ త్రీ ఫోర్. . .” మ్యూజిక్ ట్రాక్‌తో సహా పాట ఇయర్ ఫోన్స్‌లో వినిపిస్తోంది. లలిత అప్రయత్నంగా కాలుతో తాళం వేస్తోంది. పెదాలు కదులుతున్నాయి. పాటని ఆమె వేళ్ళు తడుముతున్నాయి. అక్షరాలను బాగా మచ్చిక చేసుకుంటేగాని పాట హాయిగా నడవదు.
తనిప్పుడు డమ్మీ వాయిస్ చోటులో తన పాటని అమర్చాలి. ఆ పెన్సిల్ గీతని చెరిపేసి తన రంగుల గీతని ట్రాక్ మీదకు ఎక్కించాలి.
“వాయిస్ కట్ చేసి ఒకసారి విందామా” సౌండ్ రికార్డిస్టు మాట ఇయర్ ఫోన్‌లో వినిపించింది.
“సార్, విందాం సార్”
మ్యూజిక్ ట్రాక్ మాత్రమే వినిపిస్తోంది. లలిత మనసులో పాటని పాడుకుంటూ, సాహిత్యాన్ని ట్యూనుతో సరిపెట్టుకుంది.
“ఓకే సార్. రెడీ. ఒక టేక్ ట్రై చేద్దాం సార్” లలిత మాటకి రికార్డింగ్ థియేటర్ ఎలర్ట్ అయింది.
అప్పటిదాకా సరుకు సరంజామా నిండిన బుట్టతో బయట నిలబడిన అమ్మాయి గాజు గదిలోకి వెళ్ళింది. రికార్డింగ్ కాబిన్‌లోంచి సూచనలు అందుతున్నాయి లలితకి. “సరే సార్, యస్సార్” అంటోంది మాటమాటకి.
బుట్టమ్మాయి మినరల్ వాటరు సీసా, ఫ్లాస్క్‌లోంచి కప్పులో వొంపిన వేడి పానీయం అందించింది. వాటిని ఒక్కో గుటక తాగి లలిత ఇయర్ ఫోన్స్ ఒకసారి సర్దుకుంది.
లలిత తన చేతి గాజులు దూసి పక్కన పెట్టింది. ఒక్కసారి కళ్ళు మూసుకుని మనసులోనే దణ్ణం పెట్టుకుంది.
తలుపులు మూసిన చప్పుడు.
ఎర్రదీపం వెలుగు.
ముసురుకుంటున్న టెన్షన్‌ని తరిమేసి, వీలైనంత రిలాక్స్ అవడానికి ప్రయత్నిస్తోంది లలిత.
“రోలింగ్. . . వన్ టు త్రీ ఫోర్”
నడుస్తున్న ట్రాక్‌కి తన గొంతుతో పాటను పెనవేస్తోంది.
“ఓకే మేడమ్, ఓకే. . . ఒకసారి విందాం. . .”
“సర్, ఎక్స్‌క్యూజ్‌మి సార్. రెండో చరణం మొదటి లైనులో కొంచెం హెజిటేషన్ వచ్చింది సార్. . . వన్ మోర్ సార్, ప్లీజ్ సార్” లలిత ప్రాధేయపడుతుంటే, రికార్డింగ్ కాబిన్ అణువణువు ఆత్మీయతా భావంతో చెమ్మగిల్లింది. నిర్మాత కృతజ్ఞతతో ముడుచుకుపోయాడు. ఆ చిరుచీకట్లో.
హెల్పర్ హడావిడిగా సౌండ్ బాక్స్‌లోకి వెళ్ళి మైక్ అడ్జస్ట్ చేసి, బ్లో రాకుండా కట్టర్ కూడా ఫిక్స్ చేశాడు. అసలు అతనెప్పుడూ అక్వేరియమ్‌లో చేపలా హడావిడిగానే కనిపిస్తాడు.
యస్ రెడీ, రెడీ అంటుండగానే మళ్ళీ మ్యూజిక్ ట్రాక్ మొదలైంది. ఏడుపాయల జడ పొందికగా అల్లిక పూర్తి చేసుకుంది.
“ఓకే” అని ఉత్సాహంగా వినిపించింది కాబిన్ లోంచి.
“అద్భుతం” అన్నాడు నిర్మాత.
గాజులు తగిలించుకుంటూ, ఒక్క అడుగులో రికార్డింగ్ కాబిన్‌లోకి వచ్చింది లలిత. నల్లగా వస్తాదులా నిలబడివున్న స్పీకర్లలోంచి తనిప్పుడు పాడిన పాట ఆర్కెస్ట్రాతో సహా విన్నది లలిత. అందరి ముఖాల్లో సంతృప్తి చిరునవ్వులుగా వ్యక్తమైంది. పేరు పేరునా థాంక్స్ చెప్పి బయలుదేరింది లలిత. అప్పటికే స్వామి పోర్టికోలో ఆర్థిక లావాదేవీలు పూర్తి చేసేశాడు. స్వామి మున్నూట అరవై రోజులు అయ్యప్ప దీక్షలోనే కనిపిస్తాడు. చేతిలో సైతం నల్లరంగు బ్రీఫ్ కేసే వుంటుంది. అతని వయసునిగాని, మనోభావాలను గాని పైనున్న పరమేశ్వరుడు కూడా పసికట్టలేడు. లోపల్నించి “ఓకే” అన్న రెండక్షరాలు వినిపించగానే పాట తాలూకు వాళ్ళ ఎదురుగా వుంటాడు స్వామి. అతని సెల్‌ఫోన్లో స్టాప్‌వాచ్ కూడా వుంటుంది. నిడివిని బట్టి పాట ఖరీదుని తెలుపు నలుపులతో సహా తేలుస్తాడు. మినరల్ వాటర్‌తో కారు అద్దాలు తుడుస్తున్న డ్రైవరు, మేడమ్ రాకను గమనించి కారు డోర్ తీశాడు. బుట్టమ్మాయి, స్వామిలతో కారు కదిలింది. కారు మంచులో తడిసిన పోతుపావురంలా వుంది. ఈ గేటు లోంచి బయటపడి మరో ప్రాకారంలో అడుగుపెట్టింది పావురం.
వరండాలో లలితకి ఆర్కెస్ట్రాలో వయొలిన్ వాయించే వాళ్లిద్దరు ఎదురుపడ్డారు. దణ్ణం పెట్టి సౌఖ్యమా అని అడిగారు. లలిత తలూపి ముందుకుసాగింది. వాళ్లిద్దరూ మెట్ల మీద నిలబడి “మా జానకి సెట్టపట్టగ — మగారాజు వైతివి” కృతిని, కాంభోజి ఆరోహణ, అవరోహణ క్రమాన్ని చర్చిస్తున్నారు. చంద్రశేఖర్ వాళ్లిద్దర్నీ ఎగాదిగా ఓ చూపు చూసి, చరచరా తన దారిన తాను వెళ్లి పోయాడు.
గుహ తలుపులా రికార్డింగ్ కాబిన్ డోర్ భారంగా తెరుచుకుంది. భంమ్మని గుండెలదిరేలా కాంగో డ్రమ్స్ వినిపించాయి. లోపల మంద్రంగా వెలుగు పరుచుకుని వుంది. కాబిన్ విమానం కాక్‌పిట్‌లా వుంది. ట్రాక్ బోర్డు ముందు సౌండ్ రికార్డిస్టు, మ్యూజిక్ డైరెక్టరు కూచుని వున్నారు. వాల్యూమ్ నాబ్స్‌ని అటూయిటూ రెండు చేతులా జరిపేస్తున్నారు. అనుగుణంగా రంగుదీపాలు మెదులుతున్నాయి. లలిత లోపలకు వస్తూనే దణ్ణాలు పెడుతూ, అందుకుంటూ కొత్తపాటకు గొంతు సవరించుకుంది.
మళ్ళీ అదే వరస — లిరిక్ రాసుకోవడం, యస్సార్, వన్ టూ త్రీ ఫోర్, ఓకే సార్, ఓకే, గలగలలాడే గాజులు తీయడం, బుట్టమ్మాయి యిచ్చినవి తాగడం, మండ్రగబ్బల్లా చెవుల నుంచి చంపలదాకా పట్టేసే ఇయర్ ఫోన్స్‌ని సర్దుకోవడం. . .
పాట విని అందరూ బావుందన్నారు. వెళుతూ వెళుతూ మ్యూజిక్ డైరెక్టర్‌ని “సార్, స్కోర్‌లో ఫ్లూట్ బిట్ వేరేగా మిక్స్ చేశారే, అది ఏ రాగం సార్” అడిగిందిలలిత. సంగీత దర్శకుడి మొహం మసక దీపాల మధ్య తొలకరి మెరుపులా మెరిసింది. “. . .మాల్‌కోస్, జస్ట్ ఫ్లేవర్, ఛాయ, దట్సాల్” అన్నాడు. “సింప్లీ సుపర్బ్, అలాంటి ప్రయోగాలు మీరొక్కరే చేయగలరు సార్” అంటూ లలిత తల వంచి ఆయన పాదాలను చేతులతో అద్దుకుంది. పెద్దాయనకు మాట పెగలకపోవడం గమనించి “దీని ఫీడింగ్‌కి త్రీ ఫుల్‌డేస్ పట్టింది సార్‌కి. . .” అన్నాడు పక్కనే వున్న అసిస్టెంటు. ఈ తతంగాలన్నీ అయేలోగా బయట స్వామి పుచ్చుకోవడాలు పూర్తి చేశాడు. ఆ ఫ్లూట్ బిట్‌ని యథాతథంగా హమ్ చేస్తూ లలిత బయటకు నడిచింది. రికార్డింగ్ కాబిన్ చక్కిలిగిలికి లోనైంది.
బయటకు రాగానే బాబాయ్‌ని చూసేసరికి లలితకు ప్రాణం లేచి వచ్చింది. “ఎలా వున్నావే చిట్టి తల్లీ. . .” అంటూ తల నిమిరాడు. చిన్నప్పుడు ఎత్తుకు పెంచాడు. అమ్మ పోయాక తనే అమ్మ అయాడు. చిన్నాన్నకి సినిమాల పిచ్చి వల్ల చదువు పెద్దగా అంటలేదు. చివరకు నాన్న వాళ్లు తెలిసిన వాళ్ల ద్వారా సినిమా హల్లో ప్రొజెక్టర్ ఆపరేటర్‌గా పెట్టించారు. తెగ సంబరపడిపోయాడు, హాయిగా రోజూ సినిమాలు చూడచ్చని. రెండో వారానికల్లా మొహం మొత్తింది. “సరదాలు వృత్తిగా మారకూడదే చిట్టితల్లీ” అని ఇప్పుడు స్వానుభవాన్ని ఏకరువు పెడుతుంటాడు. లలితని చూడాలనిపించినప్పుడు రికార్డింగ్ థియేటర్ దగ్గర మాటు వేస్తుంటాడు బాబాయ్.
పావురం మందీ మార్బలంతో మరో చోట వాలడానికి రెక్కలు విదిల్చింది. అక్కడ కంఠ ధ్వని ముద్రణ పూర్తి చేసింది. ఆ పాట పల్లవికి శిరసు వంచి నమస్కరించింది. నిర్మాత అభిరుచిని వారి పరోక్షంలో అభినందించింది. ఆ థియేటర్‌లోనే మరో పాట పాడాల్సి వుంటే — “క్షమించండి, యింత గొప్ప పాట పాడాక యివాల్టికి యింక నోరు విప్పలేను. మీ రికార్డింగ్ రేపు పెట్టుకోండి. . . ప్లీజ్” ప్రాధేయపడింది లలిత. ఆ మాటలు శ్రుతిశుద్ధంగా అమిరాయి.
పావురం గూటికి చేరింది.
మర్నాడు ప్రముఖ నేపథ్య గాయని లలిత ఆ పాటకు యిచ్చిన కితాబు పత్రకలకు ఎక్కింది. మంచి బాక్స్ ఐటమ్!
“చిత్రమైన సినీ కైలాసంలో ప్రతివారూ నటరాజులే!” — తనలో తను నవ్వుకుంది లలిత.
“మా చంద్రశేఖరానికేం తక్కువ. లాయరీ చదివాడు. నోట్లో పలుకుంది. నాలుగక్షరాలు రాయించి బోర్డు కడితే, కనకవర్షం కురవకపోతుందా. ససేమిరా అని పెళ్ళాం కారు వెనకపడి తిరుగుతాడు. పిల్ల ఒక చాయ తక్కువైనా, తల్లి లేదన్నా, అబ్బాయి యిష్టపడ్డాడని సరే అన్నాం. ఇప్పుడు నలుగురూ ఆడదాని సంపాదన మీద బతుకుతున్నాడని అనుకుంటారా, లేదా? ఏవిటో ఎవడి పిచ్చి వాడికి ఆనందం. . .” అత్తగారు వంటావిడ దగ్గర వేష్టపడుతోంది. ధాటీగా వినిపిస్తున్న ఆమె మాటలకు మరోసారి నవ్వుకుంది లలిత — జాలిగా.
* * *
విశాలమైన హాల్లో గోడలన్నీ అద్దాల బీరువాలే. వాటి నిండా రకరకాల షీల్డులు, పతకాలు. గొప్పవాళ్ల సరసన లలిత ఫోటోలు. “మన స్కూల్లో చదువుకున్న నువ్వు యింత పేరు ప్రతిష్టలు తెచ్చుకోవడం మా అందరికీ ఆనందమమ్మా” అన్నారు హెడ్మాస్టారు వాటిని వివరంగా చూస్తూ. ఎంతో వాత్సల్యం తొణికిసలాడింది ఆయన మాటల్లో. మాస్టారు, కూడా ఆ వూరి పెద్దలు ముగ్గురు కలిసి వచ్చారు. ఆ మాట యీ మాట అయాక, కాఫీలు తాగుతూ వచ్చిన పని చెప్పారు. “నువ్వు చదివేటప్పుడు హైస్కూలుగా వుండేది. తర్వాత జూనియర్ జాలేజీ చేశారు. ఇప్పుడు డిగ్రీ కాలేజీ అయింది. కాని, అవే రేకుల షెడ్లు వాటిలోనే నడుపుతున్నాం. కనీసం పది గట్టి గదులన్నా అవసరం. అప్పటి స్కూలు నీకు గుర్తుంటే… తూర్పు వైపు…” అని ఆయన చెబుతుంటే అడ్డుపడి, “మాస్టారూ! అక్కడ పెద్ద నేరేడు చెట్టు వుండాలి, అది బావుందా” — కళ్లింతవి చేసి ఆత్రంగా అడిగింది లలిత.
“ఓ! నిక్షేపంలా వుంది. యింకా అంతైంది. దాని నీడలో ఒక తరగతి నడుస్తోంది యిప్పుడు” — అన్నారు మాస్టారు.
లలిత స్కూలు రోజులు గుర్తొచ్చాయి. టెన్త్ క్లాసు దాకా సొంత వూళ్లోనే చదివింది. తర్వాత అందరి చదువుల వంకన బస్తీకి, బతుకుతెరువుకి నగరానికి కొట్టుకు వచ్చింది కుటుంబం.
… ఇప్పుడేమిటంటే మేడమ్, మనం అయిదారు లక్షలు
… అంతకంత గ్రాంట్ వస్తుంది….
… ఏం లేదమ్మా ఒక్క కచేరీ నువ్వు యిచ్చావంటే, యీ సమస్య పాటలా పరిష్కారం అవుతుంది. అన్నట్టు పూర్వ విద్యార్థులందరినీ పిలుస్తున్నాం. అందరూ తలో చెయ్యి వేస్తామన్నారు. ఏదో ఒకసారి మీరంతా కలిసినట్టూ వుంటుంది. ఒక విద్యాసంస్థని నిలబెట్టినట్టు అవుతుంది.
– తలో ముక్కా మాట్లాడి వచ్చిన సంగతి వివరించారు.
“దానికి యింత చెప్పాలా మాస్టారూ! మన వూరు. మన స్కూలు. మీరు బెత్తం పుచ్చుకు అడగచ్చు, నే రాకపోతే బెంచీ ఎక్కించచ్చు….”
ఆయన చెమర్చిన కళ్లు కండువాతో వత్తుకున్నారు. “బెంచీ వద్దమా! స్టేజీ ఎక్కిస్తా, గొంతెత్తి నాలుగు పాటలు పాడు. విద్యా దానం అనుకున్నా సరే, గురుదక్షిణ అనుకున్నా సరే” అని హాయిగా నవ్వారు. “లలిత నా స్టూడెంటు” అనే కించిత్ గర్వం ఉంది ఆ నవ్వులో. చంద్రశేఖర్‌ని పరిచయం చేసింది. వినయంగా నమస్కరిస్తూ — “లలిత ఎప్పుడూ చెబుతూనే వుంటుందండీ మీ గురించీ, తన స్కూలు ముచ్చట్లూ” అన్నాడు. “మేము మళ్లీ కలుస్తామమ్మా” అంటూ అంతా లేచారు. మెట్లు దిగి వాళ్లు వెళ్తుంటే స రి గ మ ప ద ని అన్నాయి అవరోహణ క్రమంలో. వాళ్లు విస్తుపోయి చూసారు.
“మా వారి సరదా…” చిరునవ్వుతో అంది లలిత.
“ఏదైనా అభిరుచి వుండాలి. హార్మణీ మీద నడిచినట్టుంది” అన్నారు మాస్టారు. చంద్రశేఖర్ వాళ్లని కారులో తమ బస దగ్గర డ్రాప్ చేసే ఏర్పాటు చేశాడు.
లలిత మనసు కుబుసం వదిలిన కోడె త్రాచులా వుంది. తను యిలా పాటలు పాడతాననీ, పేరు వస్తుందనీ కలలో కూడా వూహించలేదు. సిటీకి వచ్చి డిగ్రీలో చేరాక, సుందరి టీచర్ తనతో మొదటిసారి పాట పాడించింది. “నీ గొంతులో జరీపోగు లాంటి జీర వుంది. అది నీ జాతకాన్ని మారుస్తుంది లలితా!” అనేది ఆవిడ. రేడియో, టీవి ఆడిషన్లకి ఆవిడే తీసుకెళ్లేది. మైకు దొరికిన చోటల్లా పాడించేది. స్టేజీ ఫియర్ పోవడం ఆవిడ పుణ్యమే. పోటీలో బహుమతి రాకపోతే, “నువ్వు అద్భుతంగా పాడావు. కావాలని వాళ్లవాళ్లకి యిచ్చుకున్నార్లే” అని వోదార్చేది. అందరినీ గమనించాలి గానీ ఎవర్నీ అనుకరించకూడదు; మన దారి మనదిగా వుండాలి; అప్పుడే గుర్తింపు వస్తుంది — యిలాంటి పైసంగతులు నూరి పోసేది సుందరి టీచర్. మనోధర్మంతో పాడడమే గాని, తనెక్కడా సంగీతం నేర్చుకోలేదు. తర్వాత రాగాలు, రాగ లక్షణాలు పైపైన నేర్పింది టీచర్. కాస్త పేరు రావడం మొదలుపెట్టాక భయం పట్టుకుంది. ఈమెకు సాపాసాలు కూడా రావని ఎద్దేవా చేస్తారని శ్రమించి సాధన చేసింది. సక్సెస్‌తో గ్రహణశక్తి పెరిగింది. నలుగురి ప్రశంసల్లోంచి ఆత్మవిశ్వాసం పొంగింది. శ్రోతల ఆమోదం కొండంత మనోధైర్యాన్నిచ్చింది. పేరు ప్రఖ్యాతి వచ్చాయని హెడ్మాస్టారే స్వయంగా చెప్పారు కదా. ఇప్పుడు తను చదువుకున్న బడికి సాయం చేసేంత అయింది! తన అదృష్టానికి మురిసిపోయింది లలిత.
* * *
ఊళ్లో, స్కూల్లో స్వాగత తోరణాలు కట్టారు. లలిత మనసు తేలిపోతోంది. తను వెళ్లేసరికి కాలేజీ కాంపౌండులో తను పాడిన పాటలే శ్రావ్యంగా వినిపిస్తున్నాయి. చిన్ననాటి మిత్రులు తనని సాదరంగా పలకరించి గుర్తు చేస్తున్నారు. ఎన్ని పొగడ్తలు, ఎన్ని దీవెనలు… మోయలేనన్ని! పిల్లలు, పెద్దలూ ఆటోగ్రాఫ్‌ల కోసం ఎగబడుతున్నారు. తను పుట్టి పెరిగిన నేల మీద యింతటి మర్యాద జరగడం “గొప్ప వరం” అనుకుంది లలిత.
కోయిల తంత్రులు మీటుతుంటే, వీణ మెట్ల మీద రామచిలక గమకాలు వొలకబోస్తోంది. కీబోర్డ్ రీడ్స్ మీద గువ్వల దండు కవాతు చేస్తోంది. గాలి పోసుకుంటున్న పిల్లన గ్రోవి మీద గోరింక అడ్డంగా అడుగులు వేస్తూ తీపి సంగతులు వినిపిస్తోంది. తబలా మీద అల్లోనేరేళ్లు వడగళ్లలా రాలుతుంటే, చిత్ర విచిత్ర గతులలో ఎగిరిపడుతున్న శబ్దాలకు తను దోసిలి పట్టింది. సీతాకోక చిలకలు రెక్కల చప్పట్ల మధ్య తేలిపోతున్న లలిత, సెల్‌ఫోన్ రింగ్‌టోన్ విని తుళ్లిపడింది. కమ్మటి కల చెదిరిపోయింది. “ప్చ్…”
“… అంతేనండీ, మనం నానా అగచాట్లు పడి ఒక పొజిషన్‌కి వస్తాం. ఇక అంతే, ఎక్కడెక్కడి వాళ్లకి మనం గుర్తొచ్చేస్తాం. చుట్టాలు, ఫ్రెండ్సు, గురువులు, వూరివాళ్లు, కానివాళ్లు… నిజంగా యీ బేవార్స్ గాళ్లతో చస్తున్నాను సార్. గుడి అంటాడొకడు. బడి అంటాడొకడు. చివరకు నా బతుకు ఫ్రీ సేవా కేంద్రం అయిందంటే నమ్మండి. అబ్బ! వీళ్లతో పెద్ద న్యూసెన్స్ అయిపోయిం…” — భర్త సెల్ భాషణని అంతవరకే వినిపించుకుంది లలిత. వాళ్ల స్కూలు ప్రోగ్రాం లేదని స్పష్టమైంది. ఇక దాని మీద చర్చ కూడా అనవసరం. కన్నీళ్లు, కంఠశోషలు తప్ప జరిగేదేమీ వుండదని లలితకు గత అనుభవాలు నేర్పాయి.
స్వగతాలు మాత్రం ఇలాంటప్పుడు నిర్భయంగా వాదించేస్తాయి. అసలు నేనెవరు? అతనెవరు? పెళ్లాడింది ఎవరు – ఎవర్ని? తాళి కట్టింది తన మెడకా? గొంతుకా? ఒక గొప్ప సాములారు “తప్పుకో” అంటే — “సామీ, తప్పుకోమంటోంది నా శరీరాన్నా, ఆత్మనా” అని అడిగాడు ఒక కటిక పామరుడు. సాములారి తిక్క కుదిరింది. తనేమీ ప్రేమించి పెళ్లాడలేదు. అతను అసలే వరించలేదు. కట్నాలు లాంఛనాలతో పెళ్లి జరిగింది. పెళ్లంటే ఏమిటి? గొంతు పిసికెయ్యడంతో సహా సర్వాధికారాలు మొగుడికి యివ్వడమా? స్తబ్ధుగా బుర్రలో పడున్న పాములు ఒక్కోసారి తోక తొక్కినట్టు లేచి, ప్రశ్నార్థకాలై నిలబడుతుంటాయి. వాటిని సముదాయించి మళ్లీ నిద్రపుచ్చుతుంది. లలితకు యిది అలవాటే! ఉక్రోషంతో గతం రివైండ్ అయింది –
పెళ్లి చూపుల్లో ఎవరో అడిగారు పాట పాడమని. తను నాన్న వంక చూసింది. “నీ యిష్టం” అన్నాయి నాన్న కళ్లు. ఇంతలో ప్రస్తావన కట్నాలు లాంఛనాల మీదకి మళ్లింది. పాట పక్కకి తప్పుకుంది. మొదటి రాత్రి ఆయన మాట మాత్రం అడిగితే పాడాలనుకుంది. ఏ పాట పాడాలో కూడా అనుకుంది. కాని ఆయనా వూసే ఎత్తలేదు. పాటలెన్ని పాడిందీ, పాటకి ఎంతిస్తారు, బ్లాకెంత వైటెంత… అన్నీ యిలాంటివే అడిగాడు. నిజానికి అప్పటికీ తను ఇంత యివ్వాలని డిమాండ్ చేసే స్థాయిలో లేదు. ఒకటీ అరా అవకాశాలు రావడం, వచ్చినట్టే వచ్చి జారిపోవడం, తను పాడాక కూడా తన గొంతు చెరిపేసి మరొకరితో పాడించడం లాంటి చిరు చేదు అనుభవాలే ఎక్కువ. అవకాశాల కోసం పెద్దగా తపించిందీ లేదు. అందలాలెక్కాలని ఆశ పడిందీ లేదు. అమ్మ లేదు. నాన్నకి యివేమీ తెలియవు.
తన పెళ్లి బంధుమిత్రుల సమక్షంలో సాదాసీదాగా జరిగింది. అప్పటికి సినిమారంగంలో తనకున్న పరిచయాలు చాలా కొద్ది. పెళ్లిసందడి అయీ కాకుండానే సుందరి టీచరు “అమ్మాయ్ లలితా! శుభమా అని పెళ్లి చేసుకుని, ఇండస్ట్రీలో మన వాళ్లకి నలుగురికీ చెప్పకపోతే ఎట్లా? పాపం, మగ పెళ్లి వాళ్లేదో కట్టడి చేశారనుకుంటారు, లేనిపోంది” అంటూ ఉచిత సలహా పడేసింది. “… అయితే, మన స్థాయిలో కాదు, వాళ్ల దీవెనలు తీసుకోవాలనుకున్నప్పుడు వాళ్లకి తగ్గట్టే వుండాలి” అన్నాడు చంద్రశేఖర్. స్టార్ హోటల్‌లో వందమందికి విందు ఏర్పాట్లు జరిగాయి. సుందరి టీచర్ లలితని వెంటే తీసుకు వెళ్లి, మ్యూజిక్ డైరెక్టర్లనీ, కొందరు నిర్మాతలనీ, రైటర్స్‌ని, ముఖ్యులనిపించిన మరికొందరినీ పిలిపించింది. “కొత్త పెళ్లి కూతురివి, నువ్వే వచ్చావా… తప్పకుండా వస్తాం” అన్నారు అందరూ. అన్నమాట నిలబెట్టుకున్నారు. “దీవెనల తోపాటు తలొక పాట యివ్వండి — మా పెళ్లి కూతురికి. లలిత నా మాటని, మీ పాటని నిలబెడుతుంది” అన్నది సుందరి అక్షింతలు వేస్తున్న అతిథులతో. ఆ సమయంలో ఎవరు మాత్రం కాదంటారు?
ఫంక్షన్ బాగా జరిగిందని చంద్రశేఖర్ సంతోషించాడు. లలితకి సుందరి టీచర్ అలా దేబిరించడం ఏదోలా అనిపించింది. “అడగందే అమ్మయినా పెట్టదు లలితా” — సమర్థించింది టీచర్. ఆవిడకో మంచి పట్టుచీర పెట్టి, కొత్త దంపతులు ఆమె కాళ్లకు మొక్కారు. సుందరి టీచర్‌ని గౌరవించాలన్న ఆలోచన పెళ్లికొడుకుదే! అలాంటి మొగుడు దొరికినందుకు లలిత తెగ మురిసిపోయింది. కాని, సుందరి టీచర్‌కి తనేమీ చేయలేకపోయింది. మొదట్లో కోరస్‌కి సిఫార్స్ చేసేది. “అలా మొహమాట పెడితే అది మన కెరీర్‌కే దెబ్బ. గోరంతలు కొండంతలు చేస్తారు. కొంచెం నిలబడ్డాక కాంక్రీట్‌గా ఏదైనా చేద్దాంలే, డోంట్ వర్రీ లల్లీ” అన్నాడు చంద్రశేఖర్. లలిత వూరటపడి వూరుకుంది.
“బయలుదేరా… ఆన్ ది వే… సారీ…. పది నిమిషాల్లో అక్కడ వుంటా…” చంద్రశేఖర్ సెల్‌ఫోన్ హెచ్చరికను అర్థం చేసుకుని రివైండింగ్ కట్టి పెట్టి బయలుదేరడానికి సిద్ధమైంది లలిత.
* * *
రోజుకి రెండు పాటలు పాడేటంత బిజీ అయింది లలిత. పెళ్లి కానుకలు చెల్లడానికి నెల రోజులు పట్టింది. దాదాపు యాభై పాటలు పైగా జనంలోకి వెళ్లాయి. వాటిలో అయిదు సూపర్‌హిట్ అయినాయి. దాంతో లలిత పాటకి రేటు ఖరారు అయింది. మళ్లీ పెళ్లి రోజు వచ్చేసరికి ఆమె పాడిన పాటలు వెయ్యి దాటాయి. తెలియకుండానే లలితకు ప్రొఫెషనలిజమ్ వంటబట్టింది. మరు సంవత్సరం ఒకరిద్దరు పరభాషా నాయికలకు డబ్బింగ్ చెప్పింది. గాత్రదానం చేసిందన్నాయి పత్రికలు. దానానికీ ధరలు ఫిక్స్ చేశాడు లాయర్ చంద్రశేఖర్.
చంద్రశేఖర్ విమానం ఎగురుతోంది కదా అని ఇంజను ఆపేసే రకం కాదు. గాలి అనుకూలంగా వున్నప్పుడే చుక్కానిని జాగ్రత్తగా పట్టాలంటాడు. బాతు నీళ్ల మీద రయ్యిన వెళ్లిపోవడమే మనం చూస్తాం గాని, నీళ్లడుగున కాళ్లతో ఎంత సాము చేస్తుందో మనకి కనిపించదు. ఇదీ అంతే. ఒకదాకా మనం మైకు ముందు నిలబడటానికి కష్టపడాలి. ఆ తర్వాత మరొకరు రాకుండా శ్రమపడాలి. ఈ ఫీల్డే అలాంటిది. రేప్పొద్దున కాస్త తేడా వస్తే, ఇదే కోయిలని ట్రాక్ పాడ్డానికి కూడా పనికిరాదనేస్తారు. ఇంత సూటిగా కాకపోయినా డొంకతిరుగుడుగానైనా యీ సూక్తులు పదేపదే లలిత చెవిలో వేస్తుంటాడు చంద్రశేఖర్.
* * *
“ఈసారి మా ప్రైవేట్ ఆల్బమ్ పాడినందుకు పైసా కూడా యివ్వను” — తెగేసి చెప్పాడు ఆడియో కంపెనీ యజమాని.
చంద్రశేఖర్ ఆ మాటకు షాక్ తిన్నట్టు చాలా సహజంగా నటించాడు. చిత్ర ప్రపంచంలో యిలాంటి షాక్ ట్రీట్‌మెంట్లన్నీ మామూలే.
వారం తర్వాత కొత్త కారు తాళాలు పువ్వుల్లో పెట్టి యిచ్చాడు ఆడియో కంపెనీ యజమాని. ఇదొక వ్యాపార సరసం! కారుకి ఫ్యాన్సీ కమ్ లక్కీ నెంబర్ తెచ్చే బాధ్యత కూడా తనే నెత్తిన వేసుకున్నాడు. “మీరు చొరవ చేయకపోతే యిప్పట్లో కారు తీసే వాణ్ణే కాదు. మీ చలవతో వస్తువు అమిరింది…” తర్వాత మాటలు గద్గదమై చెదిరిపోయాయి లాయర్ గారి గొంతులో.
డిప్రిసియేషన్ క్లెయిమ్ చెయ్యచ్చనీ, ఒక లగ్జరీ కారు కొనమనీ చాలా రోజులుగా ఆడిటర్ చెబుతూనే వున్నాడు. కలిసొచ్చే రోజు వస్తే అదే నడిచి వస్తుందని ఆగాడు. లలిత మొగుడు భార్యతో కంటే ఆడిటర్‌తోనే ఎక్కువసేపు గడుపుతాడు. మనసు విప్పి, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చెబుతాడు.
పేరు, ప్రఖ్యాతి పెరుగుతున్న కొద్దీ ఇంటి విస్తీర్ణం, వైభవం కూడా విస్తరిస్తోంది. ఖరీదైన బంగళాకి వుండాల్సిన హంగులన్నీ సమకూరాయి. నిరంతరం వచ్చే ఫోన్లు తీయడానికి, తోటకి నీళ్లు పోయించడానికి, నిత్యం వచ్చే వివిధ రిపేర్లకు హాజరవడానికి, మేనేజర్ హోదాలో ఒక పెద్దాయన చేరాడు. జాతికుక్క డాబర్‌మాన్ యోగ క్షేమాలు వాచ్‌మాన్ చూసుకుంటాడు. అతని మంచీచెడూ, వేళాపాళా గమనించడం మేనేజర్ వంతు. వరండాలో ఓ మూల రెండు పాత బీరువాల చాటున వాటికి మాచింగ్ బల్ల – కుర్చీ. ఇదీ ఆయన ఆఫీసు.
లాయర్‌గారు ఆయన చేత నాలుగు నిలవ జవాబులు వల్లెవేయించారు ఫోన్‌లో చెప్పడానికి. అమ్మగారు యింకా నిద్ర లేవలేదు. మేడమ్ పూజలో వున్నారు. సాంగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇప్పుడే రికార్డింగ్‌కు వెళ్లారు. ఇలా రాత్రి ఎనిమిదింటిదాకా చెబుతూ వుంటాడు. మేనేజర్ ఆ కుర్చీలో చేరాక ఒక్కసారి కూడా వేరే సమాధానం చెప్పిన పాపాన పోలేదు. కనెక్షన్ యిచ్చిన పుణ్యమూ కట్టుకోలేదు.
పెళ్లయిన ఆరేళ్లలో లలిత ఆరోహణలే తప్ప అవరోహణలు ఎరుగదు. కాని, తనకు తనే తోడు కాలేని ఒంటరి బతుకులో ఆకర్షణ ఇంకిపోయింది. మధ్యాహ్నపు ఎడారిలో తోడుగా చిన్న నీడ కావాలి. తన బతుకు పాటకి ఆధార షడ్జమం కోసం లలిత తెగ ఆరాటపడుతోంది. లలిత మనసెరిగి కూడా చంద్రశేఖర్ ఇంత తాత్సారం చేయడానికి బోలెడు కారణాలు. స్పెషలిస్టులని సంప్రదిస్తే తల్లి అయే క్రమంలో వాయిస్ మారే అవకాశం లేకపోలేదన్నారు. మరి, తన ప్రొడ్యూసర్ సఫరవకూడదు కదా. లలిత తల్లి అవడానికి ఎట్టకేలకు ఆమె భర్త త్రికరణ శుద్ధిగా అనుజ్ఞ యిచ్చాడు.
* * *
“సినిమా పాటకి సీమంతం” అన్నదొక పత్రిక — లలిత తల్లి కాబోతోందని ఫ్లాష్ చేస్తూ.
“అంటే మా చిట్టితల్లి తల్లి కాబోయే సంగతి కూడా మేము పేపర్లు చదివి తెలుసుకోవాలన్నమాట” బాబాయ్ పలకరింతతో పులకరించింది లలిత మనసు. లలితకి యిష్టమని చెట్టున పండిన నేరేడు పళ్లు అస్తార్పితంగా తెచ్చి, మూట కట్టి యిచ్చాడు. “తల్లీ, రోజుకి యాభైవేలు సంపాయించే శమంతకానివి నువ్వు. అయినా యీ చిన్నాన్న యిచ్చే పది రూపాయలతో గాజులు చేయించుకోవాలి” అంటూ మడతలు పెట్టిన నోటుని లలిత చేతిలో పెట్టి, ఆప్యాయంగా తల నిమిరాడు. లలితకు పుట్టింటి గడపలో వున్నట్టుంది. బాబాయి గుండెల మీద తల పెట్టి బావురుమంది. “వూరుకో తల్లీ… నీ పాటలు వింటానికి మీ అమ్మ రాబోతుంటే, నవ్వుతూ తుళ్లుతూ వుండాలి గాని యిదేంటిది…” అంటూ తడి కళ్లతో చిట్టితల్లి కన్నీళ్లు తుడిచాడు చిన్నాన్న.
ఇంటికి వెళ్తూనే పుట్టింటి నేరేళ్లు తినాలని వువ్విళ్లూరింది లలిత. కాని వాటిలో యాసిడ్ గుణాలు వున్నాయని గొంతు పట్టేయచ్చనీ డాక్టర్ అనుమతి ఇవ్వలేదట. అందుకని అవి లలిత కంటకూడా పడలేదు. భార్య శ్రేయస్సు చూసి, తన శ్రేయస్సు చూసుకుంటాడు ఆమె భర్త.
ప్రముఖ నేపథ్య గాయని తన గళాన్ని కోటి రూపాయలకు ఇన్సూర్ చేసిన వైనం టీవి చానెల్‌లో వచ్చింది. ఇది ఏడాది పాటు వర్తిస్తుందని భీమా కంపెనీ వాళ్లు చెప్పారు. లైఫ్ కూడా కవర్ అవుతుందా అని అడిగారెవరో. “పెద్ద తేడా ఏముందండీ, ఆమెకి వాయిసే కదా ప్రాణం” అనాడు చంద్రశేఖర్. లలితకి తన ప్రాణం గుట్టు మొదటిసారి తెలిసిపోయింది.
సింగి నీలాడితే సింగడు ఇంగువ మింగినట్టు, చంద్రశేఖర్ సెల్‌ఫోన్లో వేవిళ్లు పడుతున్నాడు.
“…లేదండీ, యివ్వాళ రికార్డింగ్ కాన్సిల్ చేసుకోండి. నీరసం, కళ్లు తిరగడం… నా వల్ల కాదండి…. క్వాలిటీ సఫరవకూడదు కదండీ”
“… కులాసాండీ… థాంక్సండీ… తినాలని లేదండీ”
“… అబ్బే చీటికి మాటికి స్కానింగ్ అంటే ప్రాబ్లం… చిన్న చిన్న ఎక్సర్‌సైజులు చేస్తున్నానండీ”
చంద్రశేఖర్ యిలా అందరినీ సమాధానపరుస్తూ వుండగా… వుండగా ఒక శుభోదయాన లలితకి అమ్మాయి పుట్టింది. పెర్కుషన్ సందళ్లలోంచి జాలువారిన క్లారినెట్ స్వరంలా వుంది పాపాయి. “అమ్మ.. మా అమ్మ” అనుకుంది లలిత. ఆమె వాయిస్ ఏమాత్రం జీర పోలేదు. వుండేటి జరీ జీర పోలేదు. ఆమె తరపున అతను హాయిగా వూపిరి పీల్చుకున్నాడు.
చంద్రశేఖర్ సెల్‌ఫోను యిప్పుడు బిజీ అయిపోయి త్వర త్వరగా డిశ్చార్జ్ అవుతోంది.
“…ఔనండీ, కాని నా సమస్య కూడా కాస్త వినండి. నేను గొంతెత్తి నెల రోజులైంది. డాక్టరు నిజానికి యింకో పది రోజులు రెస్ట్ తీసుకోమంది. పాపాయికి బ్రెస్ట్ ఫీడింగు అయినా వచ్చి పాడుతున్నానంటే… నో నో… డబ్బు ప్రశ్న కాదండీ. రిలీజ్ పిక్చర్స్ వున్నాయి… కేవలం నా డెలివరీ గురించి వాయిదా వేసుకున్నారు. నా ప్రొడ్యూసర్ సఫరవకూడదు.”
చంద్రశేఖర్ పేరుకుపోయిన ట్రాక్‌లతో సతమతమవుతున్నాడు. “… సార్, పాట పోతే పాట వస్తుందండీ. మాటపోతే రాదండీ, ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. అవసరమైతే రోజుకి పదహారు గంటలు పని చేస్తా. నా ప్రొడ్యూసర్ సఫరవకూడదు.” భర్త ట్యూను, ఫోను టోను అర్థమైంది లలితకి.
మనసుని పాపాయి పొత్తిళ్లలో పరచి లలిత రికార్డింగ్స్‌కి తిరుగుతోంది. పాటకోసారి వచ్చి బుజ్జి అమ్మని గుండెలకు హత్తుకు వెళుతోంది.
* * *
ఆ పూట రెండు ట్రాక్‌లు చాలా త్వరగా పూర్తయినాయి. లలిత మూడో పాటకి మరో థియేటర్‌కి ముందుగానే వెళ్లింది. కోరస్ సింగర్స్ యిద్దరు విశ్రాంతిగా కూర్చుని మాట్లాడుకుంటున్నారు.
“పిల్లి చేత పనస పిక్కలు తీయించడం ఆ లాయర్‌కి బాగా తెలుసు. సుందరి, అదే మేడమ్ టీచరమ్మ చెప్పింది. లలిత పెళ్లి కాగానే అందర్నీ విందుకి పిలిచి, పాటలు అడుక్కోవడం ఆయనగారి ఆలోచనేట. అయితే కథంతా సుందరమ్మతో నడిపించాడు.”
“ఈయమ్మకు టీచరమ్మ మాటంటే వేదం కదా…”
“ఏవైతేనేం, అక్కడనించేగా యీవిడ గారి దశ తిరిగింది…”
మైకు ఆన్ చేసి వుండడంతో వాళ్ల మాటలు స్టీరియోలో లలిత గూబలదిరేలా వినిపించాయి. భళ్లున అద్దం పగిలిన చప్పుడు. వులిక్కిపడింది ఒక్కసారి. ఆరేళ్ల నాటి దృశ్యాలు స్పష్టంగా కళ్ల ముందు కదిలాయి. “తనకే చెప్పచ్చు కదా. తనకు మాత్రం తన కెరియర్ మీద ధ్యాస వుండదా? నాటకాలతో నడిచే కాపరాలు చూసే వాళ్లకి వినోదంగా వుండచ్చుగాని చేసే వాళ్లకి వికారంగా వుంటాయి” అనుకుంది. అసలు నేనెవరు, తనెవరు… మెదడులో లేవబోయిన ప్రశ్నార్థకాలను మందలించి అణిచేసింది లలిత. మనసు వికలమైంది.
స్థిమిత పడి, పాటకు రెడీ అయింది. షరా మామూలే! ఒకసారి పాడింది. మ్యూజిక్ డైరెక్టర్‌కి ఏ మాత్రం నచ్చినట్టు లేదు. సౌండ్ బాక్స్‌లోకి స్వయంగా ఆయనే వచ్చి, పాట సిచువేషన్ వివరించాడు. “ఇది బ్యాగ్రౌండ్‌లో వినిపించే పాట… హీరోయిన్‌కి చిన్న పాప… హస్బెండ్ లేడు. పాప సచ్చిపోతది. నిండా పాథోస్… వాయిస్ డల్ చేసుకో.. కొంచెం ఫోక్ టచ్ వుండాలమ్మా…”
“సరే సార్…. ఓకే సార్” చెవులకు చంపస్వరాలు తగిలించుకుంది.
“టేక్ – టు, రెడీ… వన్ టూ త్రీ ఫోర్…”
పల్లవి కాగానే ట్రాక్ ఆగింది.
“ఎక్కిళ్ళు బీట్‌లో రావాలమ్మా. రిథమ్ చూసుకో. బిగినింగ్‌లో హాఫ్ నోట్ చాలు..”
“ఓకే సార్”
“ఏడుపు కొంచెం బ్రైట్ చేసుకో, తర్వాత ఎక్కిళ్లు వేరేగా రిథమ్‌లో రికార్డ్ చేసి మిక్స్ చేద్దాం… యస్ రెడీ రెడీ”
నాలుగు టేకులు తిన్నాక అతికష్టం మీద ఓకే అనిపించుకుంది లలిత.
రికార్డింగ్ కాబిన్‌లో అకూస్టిక్స్ గోడల్ని కరుచుకున్న మొసళ్లలా వున్నాయి. వాటి ముట్టెల మీద గుడ్లగూబల్లా రేడియమ్ కళ్లు వెలుగుతున్నాయి. ఎర్రదీపాల మధ్య సౌండ్ లెవెల్స్‌ని సూచిస్తున్న మానిటర్ ఇసిజిలా పడుతూ లేస్తూ భయపెడుతోంది. భయంతో లలిత గొంతు తడుముకుంది. ఇందాక మెడకి గట్టిగా చుట్టుకున్న పాము యిప్పుడు లేదు. అది పాటై, సౌండ్ నెగెటివ్‌ని పట్టుకుంది. లలిత తేలిగ్గా శ్వాస పీల్చుకుంది.
యమకింకరుల్లా నిలబడ్డ స్పీకర్లలోంచి ఏడుపు పాట మాంచి టెంపోలో వినిపిస్తోంది. అద్దాలలోంచి తిరుగుతున్న స్పూల్స్ కనిపిస్తున్నాయి. స్పూల్స్‌లోంచి కరెన్సీ వరసగా బయటకు వచ్చి, బొత్తిగా నల్ల బ్రీఫ్‌కేసులోకి వెళ్తున్నాయి. అంతా మాయగా వుంది లలితకి. రోజూ చూసేదే. కాని తనేదో మాంత్రికుడి గుహలోకి చిక్కుపడ్డట్టు యివ్వాళ గుండె గుబగుబలాడుతోంది. క్షణమొక యుగంగా గడుస్తోంది. “పాపాయి… పాలివ్వాలి…” గుండె చప్పుడు. కాబినెట్ అనుమతిస్తే గాని భయంకరమైన ఆ గుహ తలుపు తెరుచుకోదు. “పాపాయి… పాలివ్వాలి…” అకూస్టిక్స్ లేని అమ్మ గుండె ప్రతిధ్వనిస్తోంది. తొట్రుపాటుని కప్పిపుచ్చి మర్యాద మాటలు పూర్తి చేసి, బయటపడింది లలిత.
ఎదురుగా చంద్రశేఖర్! చుట్టూ నలుగురు గొప్పవాళ్లు, కొందరు ఆడవాళ్లు, పిల్లలు. లలిత గుండెలు ఝుల్లుమన్నాయి. ఇన్‌కమ్‌టాక్స్ అధికారిని, ఓ కార్పొరేట్ ఛైర్మన్‌నీ, వారి సతీమణులను, పిల్లలను పరిచయం చేశాడు చంద్రశేఖర్. ఆమెలో నవ్వు వొట్టిపోయింది. అతికష్టం మీద చిరునవ్వు పుట్టించి, దణ్ణాలు పెట్టింది లలిత.
వాళ్లు అడ్డదిడ్డంగా అధికారిని పొగిడేస్తున్నారు. భజన పాటలతో ఆయన చుట్టూ కోలాటం ఆడుతున్నారు. నోరు నో ఫార్మాలిటీస్ అంటున్నా ఆయన నొసలు ఆనందిస్తున్నాయి. “టాక్స్ సకాలంలో సక్రమంగా కట్టమని జన సామాన్యానికి సందేశమిస్తూ, వారే స్వయంగా ఒక స్లోగన్ రచించారు. దాన్ని మ్యూజికల్‌గా ప్రెజంట్ చేయాలన్నది వారి అభిలాష. మ్యూజిక్ ట్రాక్ రెడీగా వుంది. వాయిస్ కలిపేస్తే…” యిదీ విషయం.
లలితకు పాప ఏడుపు తప్ప మరేమీ వినిపించడం లేదు. ఆ ముఖప్రీతి మాటలు, హావభావాలు, అతివినయాలు చాలా వెగటుగా తోచాయి.
చంద్రశేఖర్ సెల్ నొక్కి — “నేనే సార్, సారు వచ్చార్సార్…. మరి స్ట్రెయిన్ అయినా తప్పదండీ, పాపం టైం స్లాట్ తీసుకుని డబ్బు కూడా ఛానెల్స్ అన్నిటికీ కట్టేశార్ట… వాయిస్ యిచ్చేస్తే మిగతాది వాళ్లే ఫినిష్ చేసుకుంటారు. నోనో… యిది నా సొంత పని….” ఆడిటర్‌తో మాట్లాడి ఫోన్ కట్టేశాడు.
లలిత కళ్లతో “ఛీ” కొట్టి గుహలోకి నడిచింది. బయటి ప్రపంచంతో సంబంధాలు లేని జలాంతర్గామిలో ఒంటరిగా ఆమె నిలబడి వుంది. అద్దాల్లోంచి చుట్టూ కనిపిస్తున్న సొరచేపలు… తేళ్లు, జెర్రెలు గొంతుని మళ్లీ బిగించాయి. ఆ తల్లి గుండెలు రాళ్లయినాయి. విధిలేక చంటి పాప ఆకలిని మర్చిపోడానికి అమ్మ ప్రయత్నిస్తోంది. ఆవు తన బిడ్డకి పాలిచ్చి వస్తానంటే, సరే, వెళ్లి రమ్మని పంపిన పులి ఎంత దయాళువో కదా అనుకుంది. ఆ పులి పంజాకి మనసులోనే దణ్ణం పెట్టింది లలిత.
“రెడీ… ట్రాక్ రోలింగ్.”
లలిత గొంతు మీద కత్తి తళతళలాడుతోంది.
మైకు వికృతంగా పసిబిడ్డ పుర్రెలా కనిపిస్తోంది. పాడాల్సిన అక్షరాలు పురుగుల్లా లుకలుకలాడుతున్నాయి. వచ్చిన వాళ్లందరూ కోక్‌లు తాగుతూ, ఐస్‌క్రీమ్‌లు చప్పరిస్తూ, లలిత పడుతున్న నరకయాతననను ఎంజాయ్ చేస్తున్నారు. ఆమె మనసు, వొళ్లు చలవలు కమ్ముతున్నాయి.
అధికారి తన సంగీత జ్ఞానాన్ని తెలుగు ఇంగ్లీషు భాషల్లో కలగలిపి వేరే ట్రాక్‌లో వాయించేస్తున్నాడు. మ్యూజిక్ ట్రాక్‌లో వాయిస్తున్నాడు. మ్యూజిక్ ట్రాక్‌లో సితార్ శ్రుతి పెంచమని సాధికారికంగా సూచించాడు. “అలాగేనండి…, కాని అది సితార్ కాదండీ… వయొలిన్ సార్” అన్నాడు కంపోజరు, “దెన్ యాడ్ అండ్ మిక్స్ సితార్” అన్నది దెబ్బతిన్న పులి.
వాయిస్ ట్రాక్ పూర్తయింది. లలిత వారి కుటుంబ సభ్యులకు ఫోటోగ్రాఫ్‌లు, ఆటోగ్రాఫ్‌లు యిచ్చింది. సార్‌గారి పెద్ద పాప ముద్దుమాటలతో అన్నమయ్యని పాడితే, తాపీగా విని మెచ్చుకుంది. లలిత చింత నిప్పుల మీద నిలబడి వుంది. ఆమె గుండె భాస్వరం మింగినట్టుంది. మూడు సంజెలూ ముడిపడ్డాయి.
లలిత ఎట్టకేలకు బయటపడింది. కారు గేటు దాటింది. ఇందాక పాడిన ఎక్కిళ్ల పాట కారు స్టీరియోలో మొదలయింది. “ఆపు” అన్నది చిరాగ్గా లలిత. డ్రైవర్ వులిక్కి పడ్డాడు. పాట ఆగింది. నీరసంగా వెనక్కు వాలి, కళ్లు మూసుకుంది లలిత. ఉపగ్రహాన్ని కక్ష్యలో పెట్టి పత్తా లేకుండా రాలిపోయే రాకెట్‌లా సుందరి టీచర్ కళ్లముందు కదిలింది. రాను రాను తను పాడే యంత్రమైంది. కరెన్సీ పూసే చెట్టయింది. బంగారు గుడ్లు పెట్టే బాతు అయింది. “నాలుగక్షరాలు రాయించి, బోర్డు కొడితే యీపాటి రాకపోదురా అంటే వినడు…” అత్తగారి ఎత్తిపొడుపులు, “దానం అనుకో దక్షిణ అనుకో…” హెడ్మాస్టారి చిన్న కోరిక. అసలు తనెవరు? అతనెవరు? తాళి కట్టింది తనకా, తన గొంతుకా? ప్రశ్నార్థకాలు మెదడులో పడగలు విప్పి బుసలు కొడుతున్నాయి. వాటిని జోకొట్టే సహనం కోల్పోయి అలాగే వదిలేసింది. దేవుడు తలుచుకుంటే మనిషిని వరంతో కూడా హింసించగలడని లలితకు యెరుకైంది.
కారు ఇంటి పోర్టికోలో ఆగింది. కారు డోర్ దురుసుగా పడింది. లలిత లోపలికి వెళుతుంటే, ఓ నవరాగపు ఆరోహణ క్రమాన్ని హడావిడిగా పలికాయి మెట్లు. హాల్లో, విశాలమైన తెర ముందు ఇంట్లో యావన్మందీ కూర్చుని టీవీక్షిస్తున్నారు. తనదే ఇంటర్వ్యూ వస్తోంది. “… పెళ్లిలో స రి గ మ ప ద ని బాస చేసి ఏడగులు కలిసి వేశాం. దానికే నేటికీ కట్టుబడి, సంగీత సరస్వతికి నిత్యార్చన చేస్తున్నాం…” హాల్లోంచి మేడపైకి నడిచింది. “శ్రీవారిచ్చిన స్వేచ్ఛ, సహకారం, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం యివే నాకు రక్ష. నా కృషి ప్రతిభ కంటె… నిజం చెప్పాలంటే…”
పైన గది తలుపు విసురుగా తీసింది. పాపాయి గుక్కలు పెట్టి ఏడుస్తోంది. టీవీలో తను కూస్తున్న దొంగ కూతలు భరించలేక, గది తలుపు మూసేసింది.
లలిత అపరాధిలా లోపలికి నడిచింది.
చిందరవందరగా గది నిండా బొమ్మలు. వాటి మధ్య పసితనం చేసిన మడుగుల తడిలో గుక్క తిప్పుకోకుండా ఏడుస్తున్న పాపాయి. దూరంగా విసిరేసిన పాల సీసా. అమాంతం పాపాయిని ఎత్తుకుంది. తడిని పైట కొంగుతో వత్తింది. పాపాయి అమ్మలో అమ్మగా వొదిగిపోయింది. అవిసిపోయిన తల్లి గుండెలు కుదుట పడ్డాయి. మోదుగ మొగ్గల్లాంటి చిట్టి చేతులు అమ్మ బుగ్గలు తడుముతున్నాయి. గుప్పెళ్లతో బుల్లి చేతులు జుట్టు రేపుతుంటే ఆ తల్లికి ఓపలేనంత హాయి!
“హాయి…. హాయి… ఉళుళుళూ… ఉళుళుళూ… హాయి”
పాపాయి నవ్వులతో భూమి ఆకాశం ప్రతిధ్వనిస్తున్నాయి.
“హాయమ్మ హాయి… ఆపదలు గాయి…”
మైకులు, ట్రాకులు, ఇయర్‌ఫోన్లు లేవు. కట్టుడు మెట్లు లేవు. మేకు బందీలు, పెండెకట్లు, ఇరుకు సందులు లేవు. ఆరోహణల నిచ్చెనలు లేవు. అవరోహణల పాములు లేవు. సువిశాలమైన రాజవీధిలో శ్రుతిలయలకు అతీతంగా అమ్మపాడే జోల పాట వూరేగుతోంది. పాట స్వచ్ఛంగా వుంది. పాలపొదుగు ధారలా కమ్మగా, అమ్మలా వుంది. జాగృతమైన పాట ఆనంద స్థితిలో ఓలలాడి అమృతమై చినికింది.
జలజలా రాలునే తేనె వడగళ్లు
కన్నులా అవి కావు పాల కావిళ్లు
ళుళుళూ హాయీ…
మబ్బుల మీదుగా జాబిల్లిలో కుందేలు దిగివచ్చింది. అది చెంగనాలు వేస్తుంటే పాపాయి కేరింతలు కొడుతోంది.
పిండారబోసినట్టు వెన్నెల. ఆ వెన్నెలని దోసిళ్లతో చిమ్ముకుంటూ, తల్లి పిల్ల ఆడుకుంటున్నారు. చందమామ పాపాయి ఎగరేసిన గాలిపటంలా వుంది. “నీ పాట వినడానికి మీ అమ్మ వస్తుందే చిట్టి తల్లీ” చిన్నాన్న దీవెన మెరుపై మెరిసింది. పాలపుంతలో నక్షత్రాలు అక్షరాలై దిగివస్తున్నాయి. ఆమె పాడే పాట త్రివిక్రమించి సర్వత్రా ఆవరించింది. అగరు పొగై రోదసి దాకా కమ్ముకుంది.
కన్నమ్మ నవ్వుల్లు పాల వరదల్లు
పాపాయి చెక్కిళ్లు తేనె బుడగల్లు
శివాలెత్తినట్టు, నురగలై వరదలై, పాట పరవళ్ళు తొక్కుతోంది. సుళ్లు తిరుగుతోంది. ఆ జోల పాటలో ఏళ్ల తరబడి అణచేసిన ఆవేశం వుంది. ఆక్రోశం వుంది. కట్ట తెగిన వురవడి వుంది.
భూమి సన్నటి పేగుకి కట్టుబడి లోలకంలా వూగుతోంది. అంతు దొరకని కదురు నుంచి కాలం ఆసు పోసుకుంటూంది. తల్లి బిడ్డ యిద్దరే ఆ వుయ్యాలలో వూగుతున్నారు.
వెయ్యి కన్నుల జూడ తీరదాపేక్ష
లక్ష చేతుల తడమ తీరదా ముద్దు
ళుళుళూ… ళుళుళూ…
అమ్మ నాలిక నోరంతా చిలికేస్తూ, చిత్రంగా పలికిస్తుంటే పాపాయి నవ్వుకి హద్దే లేదు. నవ్వి నవ్వి, నిలువెల్లా నవ్వై, సోలిపోయింది. పాపాయి ఆదమరచి నిదరపోయింది. బుల్లి పాదాలు తాకి ముద్దెట్టుకుంది. అమ్మ కుతి తీరింది. అనాదిగా రగులుతున్న అలజడి సద్దుమణిగి, ఆమె మనసు మంచుముద్ద అయింది.
* * *
అప్పటికే చంద్రశేఖర్ గది చుట్టూ తిరుగుతూ అతలాకుతలం అవుతున్నాడు. తలుపులు బాదుతున్నాడు. లలితని కోపంగా, లాలనగా నవరసాలలో పిలుస్తున్నాడు. లలిత పూనకం వచ్చినట్టు అలా పాడడం అతనెప్పుడూ వినలేదు. పెనుగాలికి వూగుతున్న రావి చెట్టు హోరులా గోడల్ని చీల్చుకుని పాట వినిపిస్తోంది. అసలంత హైపిచ్‌లో పాడడానికి అతను వొప్పుకోడు. పైగా రేపు ఆరు రికార్డింగ్స్ వున్నాయి. ఎంతసేపు అరిచినా లోపల్నించి మాటా పలుకూ లేదు.
“లలితా, తలుపు తియ్… ఏదో గొప్ప పాటకత్తెనని రెచ్చిపోకు. నాకు తిక్కరేగిందంటే నీ లైఫ్ లో నోరెత్తకుండా చేయగల్ను. ముందే చెబుతున్నా తెగేదాకా లాగొద్దు….” చంద్రశేఖర్ రోషంగా వార్నింగ్ యిచ్చాడు. ఆ మాటల్లో మగతనం వుంది.
నిశ్శబ్దం…. సడీ చప్పుడూ లేదు.
లాయర్‌కి భూమి ఆగిపోయినట్టుంది. కాలం కరడు గట్టి కదలడం లేదు. కసిగా వేళ్లు నలుపుతూ, పిడికిలి బిగిస్తూ విప్పుతూ — అసలు పాయింటు అర్థంకాక అయోమయంలో పడ్డాడు.
చమటలు కక్కుతూ అతను రొప్పుతున్నాడు. జుట్టు చెదిరిపోయి వుంది. అతని చుట్టూ కాంతి! కళ్లు చెదిరిపోయే కాంతి. వున్నట్టుండి చిన్న మాంసపు ముద్ద ముఖానికి తగిలి, కిందకి జారింది. చంద్రశేఖర్ వులిక్కి పడ్డాడు. అది నెత్తురోడుతూ పాలరాతి గచ్చు మీద పడింది. భయంభయంగా దాని వంక చూశాడు. అప్పుడే తెగిపడ్డ నాలిక! నెత్తుటి మడుగులో అది కొలిమిలో బొగ్గులా కణకణలాడుతోంది. ఆందోళన, భయం అతన్ని ఆవరించాయి. “లల్లీ…. లల్లీ….” నిస్సహాయంగా చంద్రశేఖర్ అరుస్తున్నాడు. ఎంత అరచినా మాట పైకి రావడం లేదు. కిందపడింది తన నాలికేనేమోనని సందేహం వచ్చింది. కాదు… తన నాలిక తడారిపోయి ఎండుటాకులా తన నోట్లోనే వుంది. ఎంత పని చేసింది…. అన్యాయం! ఏదో మాట వరసకి అంటే, యింత సాధింపా… టూమచ్ — అంటూ భారంగా నిట్టూర్చాడు.
దూరంగా అంబులెన్స్ కూతలు వినిపిస్తున్నాయి. బంగ్లా పునాదులు కదులుతున్నాయి. “పసిపిల్ల ఏడిస్తే దానికింత రాద్ధాంతం చెయ్యాలా? టీవీలో ఆవిడ మాటలే వింటున్నాం. ఆవిడగారినే చూస్తున్నాం. మనకివన్నీ వద్దురా, నాలుగక్షరాలు రాయించి బోర్డు కట్టుకో అంటే విన్నాడా” తల్లి మాటలు లోపల్నించి.
చేతులతో తల పట్టుకుని, చూడలేక చూడలేక నెత్తుటి మడుగులో నాలికను చూస్తున్నాడు.
టీవీ తెరపై “మూగవోయిన సినిమా పాట” శీర్షికన లలిత తాలూకు క్లిప్పింగ్స్ చూపిస్తున్నారు. మధ్య మధ్య సినీ ప్రముఖులు ఆమె కంఠ మాధుర్యాన్ని పొగుడుతూ, నాలిక తెగిపోవడం తెలుగుజాతికి తీరని లోటు అంటున్నారు. మహిళా సంఘాలు కుటుంబ హింసగా, పురుషాధిక్య చర్యగా అభివర్ణించి, తీవ్రంగా గర్హించాయి.
నిస్త్రాణగా చంద్రశేఖర్ గోడకి జేరబడ్డాడు. ఇప్పుడు గచ్చు మీది నాలిక నీలంగా, నిర్జీవంగా కనిపిస్తోంది.
గది తలుపు క్లిక్ మంది. అతను తుళ్లిపడి లేచి, మోకాళ్ల మీద కూచున్నాడు. తలుపు తెరుచుకుంది. మూర్తీభవించిన కాంతిలా వుంది లలిత. ఆమె ముఖంలో ఏ భావాలు, ప్రభావాలు లేవు. అతను మాట్లాడాలని ప్రయత్నిస్తున్నాడు. మెదడు సంకేతాలు పంపినా, పలకాల్సిన భాగాలు వాటిని అందుకోలేకపోతున్నాయి. తల దించుకున్నాడు. వెలుగులో గచ్చు మీద తన సెల్‌ఫోన్ మిలమిలలాడింది. కళ్లు విప్పార్చి చూశాడు. తన కళ్లని తనే నమ్మలేకపోయాడు లాయర్ చంద్రశేఖర్. మరి నాలికలా కనిపించిందేమిటి? ఎంత భ్రమ! నెత్తుటి చార కూడా లేదు. అంతా పీడకల! ఒక్కసారి ప్రాణం లేచి వచ్చింది. వెన్ను నిమురుకున్నాడు.
లలిత గది గుమ్మం దాటి బయట అడుగుపెట్టింది. సెల్‌ఫోన్‌లోంచి రింగ్‌టోన్ వినిపిస్తుంది. నున్నటి గచ్చు మీద ఫోన్ వైబ్రేట్ అవుతూ పాకుతోంది. చంద్రశేఖర్ చటుక్కున మోకాళ్ల మీద వాలి ఫోన్ అందుకున్నాడు.
చేతి గాజులు గలగలమంటుంటే తలెత్తి చూశాడు చంద్రశేఖర్. ఠీవిగా చెయ్యి చాపింది లలిత. ఫోన్ యిమ్మని అయిదు వేళ్లు అయిదు నాలికలై శాసిస్తున్నట్టు తోచింది. ఆమె ముందు మోకరిల్లి వున్న లాయర్ చంద్రశేఖర్ అసంకల్పితంగా ఫోన్ ఆమె చేతిలో వుంచాడు. ఆమెని అణువణువూ అనుభవించిన చేతులు, అదుపు చేసిన చేతులు పూర్తిగా పట్టు కోల్పోయాయి. పేరుకి సెల్‌ఫోనే కాని, వేలాది ఆజ్ఞలు జారీ చేసిన తన భర్త నాలిక అది. ఇప్పుడది పూర్తిగా లలిత అధీనంలో వుంది. ఇక ఎప్పటికీ వుంటుంది.
భూమి లోలకంలా వూగుతోంది. కాలం కదులుతోంది.
చేవ తేలిన లలిత మెదడులో యింక ప్రశ్నార్థకాలకు చోటు లేదు.
– సమాప్తం –
ప్రథమ ముద్రణ: “నవ్య” వార పత్రిక 3-8-2005
(ఒక సినీ నేపథ్య గాయని జీవితాన్ని క్లోజప్‌లో చూపించిన తెలుగు కథ)
బాగుంది!
చాలా బాగుంది…
శ్రీ రమణ గారు మాటల గారడీ వాడు. ఆకాశమంత గొప్పోడు. ఆయనకు నేనో వీరాభిమానిని.
అయితే పొట్టి పొట్టి కథలు చదివి, చదివి అదే రుచికి అలవాటు పడ్డ మనకు ‘అందాలు చిందే పదబంధాల విందూ అంత త్వరగా ఆకట్టుకోదు. అది ‘జీరో సైజ్’ అనే కొత్త వింతలో పడి కొట్టుకు పోతున్న కుర్ర కారుకి తెలుసు. తెలియంది ఆరోగ్యకరమైన దారి వదిలి సారం లేని విషయాల వెంట ఉన్నాము అనే సంగతే.
ఈ కథ ఎలా ఉందంటే ఒక ఎనిమిదేళ్ళ బాలను పుట్టినరోజుకి వాళ్ళమ్మ పట్టు బట్టలు కట్టి, కాళ్ళకు మెరిసే వెండి పట్టీలు పెట్టి చేతులకు అరవంకీలు, బంగారు గాజులు తొడిగి, వేళ్ళకు రత్నాల ఉంగరాలు పెట్టి, అందమైన మొఖానికి పౌడరు అద్ది కాటుక పెట్టి, తిలకం దిద్ది, పూలజడ అల్లి, మెడలో కెంపుల హారం వేసి కాస్త వెనక్కి జరిగి చూసుకుని ‘నా తల్లే, నీకు నా దృష్టే తగిలేలా ఉందీ అంటూ మెటికలు విరిచి, కాస్త కాటుక తీసి దిగదుడిచి, దిష్టి చుక్క పెట్టినట్లు ఉంది.
కథ నిండా రమ్యమైన వర్ణనలు ఎన్నో ఉన్నాయి. అన్నీ రమణ మార్కు వే. మరొకరు రాయలేరు.
ఒక పక్క కథ చెబ్తూనే మరొక పక్క తత్వం తెలుపుతారు.
మచ్చుకి కొన్ని కింద ఇచ్చాను. ఏమిటి దిష్టి చుక్క ఎక్కడ ఉందా అంటున్నారా? అన్ని రసాల్లోను నేను కూడా ఉన్నా అంటున్న భీభత్స రస ఘట్టంలోని ‘నాలుకే’ ఈ కథకు దిష్టి చుక్క.
నేను ఆకాశంలోని రంగులు చూసి ఆనందించేవాడినే కాని ఆకాశం భుజం తాట్టి శభాష్ అనే దుస్సాహసం చేయలేను.
కాని విందు ‘బాగుందీ, ‘చాలా బాగుందీ. (నా కంటే ముందు స్పందించిన మిత్రులను ఉటంకిస్తున్నా)
“కారు మంచులో తడిసిన పోతుపావురంలా వుంది.”
“నిర్మాత కృతజ్ఞతతో ముడుచుకుపోయాడు. ఆ చిరుచీకట్లో.”
“ఆ మాటలు శ్రుతిశుద్ధంగా అమిరాయి.”
“నా ప్రొడ్యూసరు సఫరవకూడదు. నాకది ముఖ్యం.”
“చిత్రమైన సినీ కైలాసంలో ప్రతివారూ నటరాజులే!”
“స్తబ్ధుగా బుర్రలో పడున్న పాములు ఒక్కోసారి తోక తొక్కినట్టు లేచి, ప్రశ్నార్థకాలై నిలబడుతుంటాయి.”
“పిల్లి చేత పనస పిక్కలు తీయించడం ఆ లాయర్‌కి బాగా తెలుసు.”
I don”t know if the above saying is comonly used in telugu. But if it is not then I think this is a wonderful adoption to the phrase used “cat’s paw”.
శ్రీనివాసరవు గొర్లి