మృచ్ఛకటికం – రూపక పరిచయం

సమాజ పరిశీలన

సంస్కృత భాష సౌందర్యం గద్గద నదీప్రవాహ ఝర్జరిత గాంభీర్య ప్రాధాన్యమయితే, ప్రాకృత భాష సొగసు మలయమారుత స్పర్శిత కిసలయోద్భూతమైన సౌకుమార్యం.

ఈ నాటకం క్రీ.శ. 1, 2 వ శతాబ్దం కాలం నాటిదని అనేకులంటున్నారు. సంస్కృత నాటకాలు గ్రీకు నాటకాల వలె సమాజ పరిశీలనకోసం వ్రాయబడలేదు. అయితే, ఈ నాటకం అందుకు మినహాయింపుగా చెప్పుకోవచ్చు. ఈ రూపకం ఆధారంగా అప్పటి సమాజ పరిశీలన చేసి పండితులు గ్రంథాలు వెలయించారు. నాటక చలనంలోనే అనేక విషయాలు తెలుస్తాయి.

1. సమాజంలో పేదరికం ఉన్నప్పటికీ అవసరాలు మాత్రం దాదాపు అందరికీ సమకూరుతున్నవి. (చారు దత్తుడికి ఓ ఇల్లు, బండి ఉన్నవి. ఓ చిన్న తోట కూడా. అతడి మిత్రుడు మైత్రేయుడు కూడా అతడితో ఉంటున్నాడు.అలాగే రదనిక అన్న పరిచారకురాలు కూడా చారుదత్తుడి ఇంట ఉన్నది)

2. సమాజంలో వర్ణాశ్రమ ధర్మాలున్నవి. అయితే ఎవరి వృత్తి వారే నిర్వర్తించాలన్న నిబంధన కనీసం అగ్ర వర్ణాల వరకైనా లేనట్టు కనిపిస్తున్నది. నాయకుడైన చారుదత్తుడు, శర్విలకుడి తండ్రి రేభిలుడు, వృత్తి రీత్యా సార్థవాహులు (దేశాలు తిరిగి వ్యాపారం చేసేవారు).

3.అలాగే దాస్యత్వం, వెట్టి కూడా కనిపిస్తున్నవి. తగిన మూల్యానికి మనుషులు అమ్మబడడమూ, తగిన మూల్యానికి విడువబడడమూ ఉన్నది. (వసంతసేన పరిచారిక మదనిక అలాంటి పాత్రే)

4. సంధ్యావందనమూ, ఇతర కర్మానుష్టానము బ్రాహ్మణ వర్గం తప్పనిసరిగా పాటించేవారన్నట్టు కనిపిస్తున్నది.

5. సమాజంలో వేశ్యలు ఉన్నారు. వీరు భాగ్యవంతులు. వసంతసేన ఇల్లు 8 ప్రకోష్టాలతో కూడి ఉన్నది. ఆమె ఇంట్లో పశు సంపద, అలంకారాలు, రుచ్యమైన తిండిపదార్థాలు, మాంసాలు తయారయే వంటశాల, చందన, జవ్వాది వంటి సుగంధపరిమళాలు నూరడానికి ఒక గది, ఇటువంటివి ఉన్నాయి. వీరు గృహస్థుల ఇళ్ళ అంతఃపురానికి (నడిమి ఇల్లు) రావడం నిషిద్ధమని ఒకానొక సన్నివేశంలో తెలుస్తుంది.

6. బహుభార్యాత్వం ఉన్నప్పటికీ, బహువ్యాప్తంగా లేదు.

7. శర్విలకుడు దొంగతనానికి పాల్పడుతూ, “ఈ దొంగతనం, పరుల వద్ద ఉద్యోగం (దాస్యత్వం) చేయడం కన్నా మెరుగే. నింద మోయవలసి వచ్చినా అది స్వాయత్తమే. పరుల వద్ద చేసే దాస్యత్వంలో స్వాయత్తమన్నది ఉండదు.” అనుకుంటాడు. ఈ ఆలోచన ఆసక్తికరమైనది. శర్విలకుడు ప్రతిభావంతుడైన చోరకళాకోవిదుడు. అంటే – ప్రతిభావంతులు ఒకరి వద్ద పనిచేయడానికి ఇచ్చగించడం లేదన్నది కనిపిస్తున్నది. ఇది శర్విలకుడి వ్యక్తిగతం అనిపించినా, కవి ఈ మాటల కోసం దీర్ఘమైన అంతర్మథనాన్ని వివరించి చెప్పాడు కనుక ఇది అప్పటి సమాజంలో ధోరణి అనుకోవలసి వస్తున్నది.

8. కాస్త ధనవంతులకు సొంత బళ్ళు ఉన్నవి. బళ్ళ మార్పిడి అన్న అంకంలో అనేక బళ్ళు రహదారిలో గుమిగూడడం (Traffic jam) వల్ల ఇబ్బంది కలిగిందని ఉంది.

9. సమాజంలో హిందూ మతంతో పాటుగా బౌద్ధం కూడా ఉంటున్నది. నాటకం చివర, సంవాహకుడు రాజ్యంలోని బౌద్ధారామాలకు అధిపతి చేయబడతాడు.

10. నాటకం చివర చారుదత్తుడి భార్య చితిలో ప్రవేశించ తలపడుతుంది. సమాజంలో “సతి” అన్న ఆచారం ఉన్నట్టు కనిపిస్తుంది. (అయితే ఈ “సతి” అన్న పదానికి సంబంధించిన శ్లోకం ఒకటి ప్రక్షిప్తం అని బేతవోలు రామబ్రహ్మం గారు వివరించారు)

11. రాజు పేరుతో రాజాశ్రయులు సాగించే అక్రమాలు సాగించడం ఉన్నది. శకారుడు న్యాయనిర్ణేతలను, మీ ఉద్యోగాల నుండి తొలగించగలనని బెదిరిస్తాడు.

12. హత్య చేసిన వారికి కొరత శిక్ష విధించడం కనిపిస్తున్నది. కొరత విధించే ముందు, దోషికి చందనపు పూత పూసి, పువ్వులతో అలంకరించి, వీధి వీధి ఊరేగించడం ఆచారంగా కనిపిస్తుంది. ఆ ఊరేగింపు మధ్యలో, అప్పుడప్పుడు (5 సార్లు) కూడలిలో దోషి చేసిన కర్మలను చాటించి, ఇటువంటి కృత్యం చేసిన వారి గతి ఇంతేనని చాటి చెప్పడం ఉంది.

13. జూదం ఆడడమూ, అందుకోసం జూద గృహాలు (amusement parks) ఉండటమూ కనిపిస్తున్నది. ద్యూతం (జూదం) అంటే పాచికలాట. ఈ ఆట ఎలా ఆడాలి అన్న విషయం ద్వితీయాంకంలో వివరించబడింది.

14. రెండవ ప్రకరణంలో శూన్య దేవాలయం అని సంవాహకుడు తలదాచుకునే ఒక చోటు గురించి చెప్పారు. అంటే శిథిలమయిన ఆలయమా? లేక విగ్రహం లుప్తమయిన ఆలయమా? విగ్రహం లుప్తమయిన ఆలయమయితే అది తాంత్రికుల దేవాలయమయే అవకాశం ఉండవచ్చు. తాంత్రికుల దేవాలయాలలో, వారి తాత్విక సిద్ధాంతాల దృష్ట్యా మూల విరాట్టు ఉండరని పరిశోధకులు చెబుతారు.

15. భాష. ఈ రూపక కావ్యంలో ప్రాకృతం (శూరసేని, మాగధి వంటి అన్ని భేదాలు) సంస్కృతంతో బాటుగా ఉపయోగించబడింది. బ్రాహ్మణులు, ఉన్నత వర్గాల వారు సాధారణంగా సంస్కృత భాష ఉపయోగించారు. (శర్విలకుడు దొంగ అయినప్పటికీ అతడి అంతర్మథనం, మాట అంతా సంస్కృతంలో సాగుతుంది). అయితే కొన్ని పాత్రలు (ఉదాహరణకు చారుదత్తుడి మిత్రుడు) బ్రాహ్మణ పాత్రలయినప్పటికీ సాధారణంగా సంస్కృతం వాడడం కనిపించలేదు. అయితే అందరికీ సంస్కృత ప్రాకృతాలు తెలిసి ఉన్నాయి. స్త్రీలకు ప్రాకృతం నిర్దుష్టం అని బేతవోలు రామబ్రహ్మం గారి వివరణ ఒక చోట.

16. కొన్ని పాత్రలు వారి వృత్తినామంతో పిలువబడ్డాయి. ఉదా: సంవాహకుడు. సంవాహకుడు అంటే ఒళ్ళు పట్టే సేవకుడు. ఈ పాత్ర అసలు పేరు సంవర్ధకుడు అని ఉన్నప్పటికీ, నాటకం చివరి వరకూ సంవాహకుడనే పిలువబడతాడు.

ఇంకా ఈ రూపకంలో అప్పటి కాలపు అలంకరణలు, గృహస్థుల ఆచారాలు, నాణేల వివరాలు, సూత్ర ప్రాయంగా భోజనపు అలవాట్లు మొదలైనవి పరిశీలించి తెలుసుకోవచ్చు.

వర్ణనలు

కావ్యాలతో పోలిస్తే రూపకాలలో వర్ణనావిస్తృతికి అవకాశం తక్కువ. పద్యకావ్యాలలో లాగా సావకాశంగా, తీరుబడిగా వర్ణనలు చేయడానికి వీలుపడదు. వర్ణనలు మితిమించితే, కథచలనానికి అడ్డంకి అవుతవి. అలా అని రూపకం వర్ణనావిశీర్ణం అయితే రసభంగం అవుతుంది. కథాసంవిధానానికి దోహదపడుతూనే, ఔచిత్యభంగం కలుగకుండా వర్ణనలు ఉండడం ఈ రూపక విశిష్టత. ఈ రూపకంలో అక్కడక్కడా సందర్భోచితంగా కనిపించే చమక్కు వర్ణనలతో బాటుగా, నాలుగవ, ఐదవ అంకాలలో కనిపించే వర్ణనలు రోమాంచిత కారకాలు. ఈ రూపక కావ్యం ప్రాకృత, సంస్కృతాల అద్భుత కలయిక అని ముందే చెప్పుకున్నాం. సంస్కృత భాష సౌందర్యం గద్గద నదీప్రవాహ ఝర్జరిత గాంభీర్య ప్రాధాన్యమయితే, ప్రాకృత భాష సొగసు మలయమారుత స్పర్శిత కిసలయోద్భూతమైన సౌకుమార్యం. రూపకపు నాలుగవ అంకంలో ప్రాకృత సౌందర్యం (గణిక భవనంలో ఒక్కోగదినీ వివరించే సన్నివేశం తాలూకు ప్రాకృత గద్యం) ముప్పేటలై పరుచుకుంటే, ఐదవ అంకంలో వర్షావృతమైన ప్రకృతి వర్ణన (సంస్కృత శ్లోకాలు) ఒడలు పులకింపజేస్తుంది.

ఆ ఐదవ అంకం ఒక సారి పరికిద్దాం.

వసంతసేన, ఓ విటుడి తోడుగా చారుదత్తుడి ఇంటికి బయలుదేరుతుంది. వెళుతున్నది ప్రియుడి ఇంటికి. తోడు వస్తున్నది విటుడు. వారిద్దరి మధ్య మాటలేముంటవి? బయట కుండపోతగా కురుస్తున్న వర్షం. ఆ ప్రకృతి శోభే వారి మధ్య మాటల రూపం సంతరించుకుంది.

మొదట విటుడి వంతు-

వసంతసేనే! పశ్య!పశ్య!
గర్జంతి శైలశిఖరేషు విలంబిబింబా మేఘా వియుక్తవనితా హృదయానుకారాః |

యేషాం రవేణ సహసోప్తతితైః మయూరైః ఖం వీజ్యతే మణిమయైరివ తాళశృంగైః ||

వసంతసేనా! చూడు!చూడు! శైలశిఖరాల మీద గర్జిస్తున్న ఆ మేఘాలు విరహిణుల హృదయాల లాగా ఎలా భారంగా ఉన్నాయో! వాటి చప్పుడుకు ఒక్క ఉదుటున పైకెగిరిన నెమళ్ళ పింఛాలతో ఆకాశం మణిమయమైన వింజామరలచేత వీయబడుతున్నట్టుగా లేదూ!

బదులుగా వసంతసేన,

మూఢే ! నిరంతర పయోధరవా మయైవ కాంతః సహాభిరమతే యది కిం తవాత్ర!

మాం గర్జితైరితి ముహుర్వినివారయంతీ మార్గం రుణద్ధి కుపితేవ నిశా పత్నీ ||

‘ఓసి మూర్ఖురాలా! వసంతసేనా! దట్టమైన మబ్బులున్న (ఇఱుకు పయోధరాలు) ఉన్న నేను నా కాంతుడితో రమిస్తూంటే, మధ్యలో నీకేంటి?’ అని ఉరుములతో మాటిమాటికీ నివారిస్తూ (నాపై ఉరుముతూ) ఈ నిశ, సవతి లా మారి, నా దారిని అడ్డగిస్తూంది కదా! (సవతి ఎందుకంటే, తనను తన ప్రియుడి వద్దకు చేఱుకోనీకుండా అడ్డుపడుతున్నది కాబట్టి) అని వాపోతుంది. పయః అన్న సంస్కృతపదానికి నీరు, పాలు అని రెండు అర్థాలు. నిరంతర పయోధరములు అన్నది శ్లేష. దట్టమైన మబ్బులు అని ఒక అర్థం, (నిర్ + అంతర) ఇఱుకు పయోధరాలని మరొక అర్థం.

ఇలా ఈ సన్నివేశంలో ఒక్కొక్కటిగా అద్భుత శ్లోకాలు జాలువారుతాయి. వేటికవే సాటి. వసంతసేన వర్ణనలలో ప్రియసమాగమ ఉద్వేగం, అడ్డుపడుతున్న ప్రకృతిపై పిసరంత రోషం వినిపిస్తే, విటుడి వర్ణనలలో ప్రకృతి సహజ సౌందర్యం కదం తొక్కుతుంది.

This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.

12 Responses to మృచ్ఛకటికం – రూపక పరిచయం

  1. Krishna says:

    When I was young I read the story of this play.
    Now feel like reading all the books about this play.
    Excellent .Can’t say more than this.

  2. హెచ్చార్కె says:

    Yes. Excellent. Can’t say any thing more. ఒక బ్రాహ్మణుడిని(బ్రాహ్మణ సార్థవాహుడినైనా) దొంగగా, వేశ్యను నాయికగా చూపించిన నాటకం సంస్కృతంలో మరేదైనా ఉందా? తెలుగులో కన్యాశుల్కం కాకుండా మరేదైనా ఉందా (గిరీశాన్ని ఒక రకం దొంగ అనుకునేట్లయితే)?

  3. అద్భుతంగా రాశారు. దీన్ని నేను కొన్నేళ్ళ క్రితం సంస్కృతం – ఆంగ్లం ద్విభాషా పుస్తకం సహాయంతో చదివాను గానీ పెద్దగా గుర్తు లేదు.
    పి. లాల్ గారు ప్రచురించిన సంస్కృత నాటకాల ఆంగ్ల తర్జుమా పుస్తకంలో కూడా ఈ నాటకం ఉన్నది.
    స్త్రీపాత్రలకి ప్రాకృత భాష విధించడం ఫండా ఏవిటో అర్ధం కాదు. నేను ఇంకొన్ని నాటకాల్లో కూడా చూశాను. సీతవంటి గొప్ప పాత్రలు కూడా ప్రాకృతం మాట్లాడినట్టు రాశారు.
    బైదవే, శకారుడు ఏమి భాష మాట్లాడుతాడు? శకారుని సంభాషణ పుట్టించే హాస్యాన్ని గురించి ప్రస్తావించినట్టు లేదు మీరు.

  4. కొత్తపాళీ గారూ, శకారుడి అసంబద్ధ సంభాషణల గురించి వ్యాసాం రెండవ పేజీలో ప్రస్తావించారే!

  5. రవి says:

    కొత్తపాళీ గారూ,

    నెనర్లు.

    “శకారో రాష్ట్రీయః స్మృతః” అని బేతవోలు వారు ఉటంకించారు. రాష్ట్రీయ ప్రాకృతం మాట్లాడతాడట. శకారుడు అన్నది పాత్ర నామం. మృచ్ఛ కటికంలో పాత్రధారుడి నామం సంస్థానకుడు. తన మాటలలో “స” బదులు “శ” కారం ఎక్కువగా దొర్లుతుంది కాబట్టి ఆ పాత్రకా పేరు.

    ఈ రకమైన ఉచ్ఛారణ బీహారీలలో ఇప్పటికీ మనం గమనించవచ్చు.

    ఇకపోతే ఈ పాత్రను ప్రత్యేకంగా రూపుదిద్ది (అసంబద్ధ సంభాషణలూ వగైరా), తద్వారా ఇతడి బావ రాజు గారిని elevate చేయడం ఒకరకమైన నాటకశిల్పం అని నా అభిప్రాయం.

  6. telugu4Kids says:

    మృచ్ఛకటికం – పరిచయమైనదే ఐనా, ఇప్పుడు మీ పరిచయం చాలా బావుంది. చదువుతూ నాటకం పైన మరింత ఆసక్తి పెంచుకోగలుగుతున్నాను.
    స్త్రీ పాత్రలకు ప్ర్రాకృతం.
    అలాగే ShakeSpear నాటకాలలో కూడా ఇటువంటి తేడాఅనే ఉండేదిట పాత్రల social statusని బట్టి.
    కానీ నాకు ఆశ్చర్యకరమైన విషయం ఒకటి తెలిసింది, నేను అనుకున్న దానికి విరుద్ధంగా. ఆ తెలిసినది పిల్లల కోసం వ్రాసిన అతని జీవిత చరిత్రలో.
    అదేమంటే , ఆ విధంగా, మాట్లాడే భాష సాహిత్యంలో వాడడానికి అవకాశం ఏర్పడింది అని. నాకైతే ఆ వివరణ బాగుంది అనిపించింది.
    మనకి పూర్తిగా అర్థమైందనుకున్న దానికీ వేరే కోణం ఉందని తెలిస్తే ఆసక్తికరంగా ఉంటుంది కదా.

  7. ”మట్టి బండీ’పై మీ పరిచయం బావుంది. నాటకం చూసినట్లే ఉంది.

  8. koutilya says:

    రవి గారూ,
    చాలా బాగుంది..పరిచయం అంటూనే నాటకం మీద మంచి వ్యాసం రాశారు…నాకు తెలిసిన మొదటి సంస్కృత నాటకం ఇది…నాన్నగారు చిన్నప్పుడు కథలా చెప్పేవారు..తర్వాత దూరదర్శన్ లో సీరియల్ గా వచ్చింది…ఒక్క episode కూడా వదలకుండా చూసే వాణ్ణి…

  9. శ్రీనివాసరావు గొర్లి says:

    వ్యాసం చాలా బాగుంది. రచయితకు శుభాకాంక్షలు. పొద్దుకి అభినందనలు.

  10. చాలా బావుంది మీ వ్యాసం రవి గారు. ఈ నాటకంలో మరో ఆసక్తికర విషయం, దొంగ వేసిన కన్నంలోని కౌశలాన్ని చూసి అబ్బురపడ్డం. ఆ సంఘటన కళకి ఒక కొత్త అర్ధాన్నిస్తుంది.

  11. మూలా మంచి పాయింటు చెప్పారు. ఒక తెలుగు సాహితీవేత్త (పేరిప్పుడు గుర్తు లేదు) గారింటో దొంగతనం జరిగిందని తెలిసి, జరుక్ శాస్త్రి ఆయనకి పరామర్శ ఉత్తరం రాశారుట – పోయిన వస్తువుల జాబితా ఏమన్నా తయారు చేశారా, లేక చారుదత్తుడిలా దొంగ వేసిన కన్నాన్ని చూసి అబ్బురపడుతూ ఉండి పోయారా అని.

  12. మృచ్ఛకటికం ఆధారంగా తెలుగులో కూడా సినిమా వచ్చింది. విక్రమ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై బిఎస్‌ రంగా దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా పేరు వసంతసేన! 1967లోనే దీన్ని కలర్‌లో తీశారు. ఎఎన్‌ఆర్‌…బి.సరోజాదేవి హీరోహీరోయిన్లు… సినిమా పరాజయం పాలైందనుకోండి.

Comments are closed.