ఒక చిన్నబడ్జెట్ కథ

— సిద్ధార్థ గౌతం

ఇది నేను కల్పించిన ఒక నిజమైన కథ. ఈ కథ లోని పాత్రలు డబ్బున్న వాళ్ళా, మధ్య తరగతి వాళ్ళా, పేద వాళ్ళా అన్న విషయం నాకు కూడా తెలియదు.

పుట్టిన పదకొండవ రోజు వరకు నామకరణం చెయ్యరాదటగా – అందుకే ఇప్పుడే పుట్టిన ఈ కథలో ఎవ్వరికీ పేర్లు పెట్టలేదు. కథలోని అన్నదమ్ములిద్దరూ పన్నెండేళ్ళలోపు పిల్లలు. వినటానికి ఎబ్బెట్టుగా ఉన్నా, వాళ్ళిద్దరినీ పెద్దాడు, చిన్నాడు అని పిలుద్దాం.

అసలు దీపావళికి రెండు రోజుల క్రితం వరకు వీళ్ళెవ్వరూ నాకు పరిచయం కూడా లేరు. పిల్లలిద్దరూ వాళ్ళమ్మకు బాణాసంచా తీసుకురావాలన్న విషయం గుర్తుచేస్తున్నప్పుడు మొదటిసారి కలిసాను వీళ్ళను.

ఆ రోజు సాయంత్రం ఇంటికి కాస్త ఆలస్యంగా వచ్చాడు వాళ్ళ నాన్న. టపాకాయల గురించి అడగటానికి వాళ్ళమ్మ పక్కన్నే కూర్చున్నారు పిల్లలిద్దరూ.

“ఇంత ఆలస్యమయ్యింది. ఎక్కడికెళ్ళారు?” అడిగింది అమ్మ.

“వల్లకాటికి” అరిచాడు ఆయన.

పిల్లలిద్దరికీ ఆ అరుపు అర్థమయ్యి పక్క గదిలోకి వెళ్ళారు. అక్కడే ఉంటే బాగోదని నేను కూడా వెళ్ళాను. అక్కడ వాళ్ళ తాతయ్య TV9 చూస్తూ ఉన్నాడు. పక్క గదిలోంచి వినిపించీ వినిపించకుండా ఏవో మాటలు వినిపించాయి. ఆ తరువాత ఏమి జరిగిందో అందరికీ బాగా వినిపించింది –

అమ్మాయిలిద్దరూ ఒకే కాకరొత్తిని ఒలింపిక్ జ్యోతిని పట్టుకున్నట్టు పట్టుకుని రోడ్డు మధ్యలో ఉంచిన చిచ్చుబుడ్డి వైపు నడుస్తున్నారు. వారి వెనకాలే ఒక పెద్దాయన – వాళ్ళ నాన్ననుకుంటా – చేతిలో cease fire సిలిండర్ పట్టుకుని నుంచున్నాడు. అమ్మాయిలు వెలుగుతున్న కాకరొత్తిని మెల్లిగా చిచ్చుబుడ్డి దగ్గరకు తీసుకెళ్ళారు…

నాన్న అమ్మను చాచి చెంప మీద కొట్టాడు…

అది విన్న వాళ్ళ తాత సౌండు తగ్గించి, తల పట్టుకుని కూర్చున్నాడు.

పెద్దాడు బయటికి పరిగెట్టాడు. వాడి వెనకాలే చిన్నాడు కూడా పరిగెట్టాడు. ఇంటి పక్కనున్న శివాలయం లోకి వెళ్ళి, రావి చెట్టు కింద కూర్చున్నారు.

” ‘వల్లకాటికి ‘ అంటే ఏంట్రా?” అడిగాడు చిన్నాడు.

“అంటే ఈ దీపావళికి మనకు టపాకాయలు లేవు అని అర్థం” సూక్ష్మం వివరించాడు పెద్దాడు.

అసలు ఇంట్లో వాళ్ళ నాన్న అమ్మను ఎందుకు కొట్టాడో, దానికీ దీపావళి బాణసంచాకు సంబంధం ఏమిటో అర్థం కాలేదు చిన్నాడికి.

“అయినా..నాన్న అమ్మను కొడితే, అమ్మ తిరిగి నాన్నను నాలుగు పీకితే సమస్య తీరిపోతుంది కదా. దీపావళి మళ్ళీ నేను ఐదో క్లాసు చేరాక గాని రాదు..ఛ…” అని బాధపడుతూనే ఉన్నాడు చిన్నాడు.

కాస్సేపయ్యాక ఇద్దరూ రాళ్ళతో రావి చెట్టు మీద తమ పేర్లు రాసి ఇంటికి బయలుదేరారు.

ఆ రోజు రాత్రి వాళ్ళ నాన్న భోంచెయ్యలేదు (ఇంట్లో). అమ్మ పిల్లలిద్దరికీ, ముసలాయనకు భోజనం పెట్టి ఏడుస్తూ పడుకుంది.

మరుసటి రోజు తాతయ్య సౌండు లేకుండా TV9 చూస్తున్నాడు. పెద్దాడు తను పొగు చేసిన కోల్గేట్ టూత్ పేస్టు డబ్బాలతో ఇంట్లో ఈశాన్యం మూల వాస్తు ప్రకారం ఏడు స్థంబాల చార్మినార్ కడుతున్నాడు. ఆడుకోవటానికి బయటకెళ్ళిన చిన్నాడు ఇంటికొచ్చాడు. నేరుగా పెద్దాడు కడుతున్న చార్మినార్ దగ్గరకు వెళ్ళి, పక్కన్నే కూర్చున్నాడు.

“ఏరా అప్పుడే వచ్చేసావు?” అడిగాడు పెద్దాడు.

“సుబ్రహ్మణ్యం వాళ్ళింటికెళ్ళాను. వాడు టపాసులు ఎండబెడుతున్నాడు”

“మనము ఎందుకు ఎండబెట్టట్లేదు అని అడిగాడా వాడు?”

“వాడడక్కముందే నేనే చెప్పేసా – ‘ ఈ సారి మేము ఎండబెట్టద్లేదు ‘ అని..వాడీసారి కొన్న వంకాయ బాంబులు గుత్తొంకాయ బాంబుల్లా ఇంతింత ఉన్నాయి….ఒక్కటి..ఒక్కటంటే ఒక్కటి – వంకాయ బాంబు కొనివ్వమని నాన్నను అడుగుదామేంట్రా? నేనడుగుతా… ఏమంటావ్?..” అన్నాడు చిన్నాడు

“అప్పుడు నిన్ను ఎండబెడతాడు నాన్న – బాగా ఉతికాక. అయినా సుబ్రహ్మణ్యం వాళ్ళింటికెందుకెళ్ళావు? వాడు సోమవారం నుండి టపాసులు ఎండబెడుతూనే ఉన్నాడు. దీపవళి రోజు కూడా కాలవకుండా అలా ఎండబెడుతూ ఉంటాడు…ఆ వెళ్ళేదేదో శీను-సుధాకర్ వాళ్ళింటికెళ్ళుందాల్సింది..వాళ్ళింట్లో ఈ సారి పండగ జరుపుకోవట్లేదు..”

“వాళ్ళ నాన్న కూడా వల్లకాటికి వెళ్ళాడేంటి?”

“వెళ్ళింది వాళ్ళ నాన్న కాదు..నాన్నమ్మ..” (ఇందులో నా ప్రమేయమేమీ లేదు. నేను కథ రాయటం మొదలెట్టక ముందే మొన్నీమధ్యనే ఆవిడ పోయారు)

“అవునా…అయితే ‘ఎందుకు ఎండబెట్టట్లేద’ని శీనూసుధాకర్లను ఎవ్వరూ అడగరన్నమాట….” అని రెండు నిముషాలు మౌనం పాటించి..”మన నాన్నమ్మ బ్రతికుండి, ఇప్పుడు పోయుంటే ఎంత బాగుండేది రా..నాన్న అమ్మను కొట్టల్సిన అవసరం లేకుండా దీపావళి క్యాన్సిలయ్యేది” అని పక్కనున్న టూత్పేస్టు డబ్బా తీసి చర్మినార్ కు ఇంకో స్తంబం తగిలించాడు.

అబ్రకం ముక్కలు ఏరుకొద్దామని ఇంటి నుంచి బయటకొచ్చి వెంకన్న బావి వైపు నడవటం మొదలెట్టారు ఇద్దరూ. దారిలో ఎర్ర బోరింగు దగ్గర ఐదుగురు పిల్లలు నుంచుని – పట్టపగలు రోడ్డు మధ్యలో చిచ్చుబుడ్డి వెలిగించబోతున్న ఇద్దరు అమ్మాయిలను చూస్తున్నారు.

అన్నదమ్ములిద్దరూ ఈ వింతను చూద్దామని వెళ్ళి బోరింగు పక్కన నుంచున్నారు. ఈ చిచ్చుబుడ్డి కార్యక్రమం అయిపోగానే తమ దారిన వెళ్ళి అబ్రకం ముక్కలు ఏరుకుని, వాటితో గనులు తయారుచేసుకుని పేపర్లోకి ఎక్కుదామని వీళ్ళ ఆలోచన.

కాని అబ్రకం గనులను మించిన కుంభకోణం ఇక్కడ జరగబోతోందని తెలియదు వీళ్ళకు.

అమ్మాయిలిద్దరూ ఒకే కాకరొత్తిని ఒలింపిక్ జ్యోతిని పట్టుకున్నట్టు పట్టుకుని రోడ్డు మధ్యలో ఉంచిన చిచ్చుబుడ్డి వైపు నడుస్తున్నారు. వారి వెనకాలే ఒక పెద్దాయన – వాళ్ళ నాన్ననుకుంటా – చేతిలో cease fire సిలిండర్ పట్టుకుని నుంచున్నాడు. అమ్మాయిలు వెలుగుతున్న కాకరొత్తిని మెల్లిగా చిచ్చుబుడ్డి దగ్గరకు తీసుకెళ్ళారు. కాకరొత్తి చిచ్చుబుడ్డి కి అర సెంటీమీటర్ దూరం లో ఉందనగా బోరింగు బ్యాచి లో ఒకడు “ఢాం” అని 24 ఫాంటు సైజు లో గట్టిగా అరిచాడు. ఆ అరుపుకు అమ్మాయిలిద్దరూ కాకరొత్తి గాల్లోకి విసిరి, అది కింద పడేలోగా వాళ్ళింట్లోకి పారిపోయారు. సీస్ ఫైర్ పెద్దాయన రోడ్డు మీద బోర్లా పడుకుని, “లై డౌన్…లై డౌన్” అని ఇంగ్లీషులో శోకాలుపెట్టుకుంటున్నాడు.

ఈ దొంగవిస్ఫోటనానికి కారకుడైన బోరింగుబ్యాచి కుర్రాడు వెళ్ళి ఆ చిచ్చుబుడ్డి తీసుకుని లగెత్తాడు. అక్కడి జనానికి ఏమి జరిగిందో అర్థమయ్యేలోగా వాడు దేశ సరిహద్దు దాటేసాడు. అసలు ఇలా జరుగుతుందని నేనే ఊహించలేదు..ఇక పాపం కథలోని పిల్లలేమి ఊహిస్తారు? అబ్రకం విషయం మర్చిపోయి ఇంటికెళ్ళారు.

సాయంత్రం ఇద్దరూ కొత్త చొక్కాలేసుకున్నారు. వీళ్ళింట్లో దీపావళి సమయంలో ఇలాంటి గొడవేదయినా వస్తుందని ముందుగానే అనుమానమొచ్చి..దశరా టైంలోనే నరకచతుర్దశికీ దీపావళికి కూడా కలిపి చెరో మూడు స్కూల్ యూనిఫార్మ్ చొక్కాలు కుట్టించింది వీళ్లమ్మ..!

లక్ష్మీ వెంకటేశ్వర స్టోర్స్ వాళ్ళ కొట్టులో పూజకు పిలిచారు వీళ్ళను. వాళ్ళమ్మ పిల్లలిద్దరినీ వెంటబెట్టుకుని బయలుదేరింది. చిన్నాడు అమ్మ చెయ్యి పట్టుకుని నడుస్తున్నాడు. పెద్దాడు రెండు చేతులు వెనక్కు కట్టుకుని నడుస్తున్నాడు. కాని ఇద్దరి తలల్లోనూ ఆలోచనొక్కటే – ఉదయం చిచ్చుబుడ్డి చోర్ గురించి.

ఆ కొట్టు దగ్గరకు చేరగానే పిల్లలిద్దరినీ మెట్ల మీద కూర్చోబెట్టి లోపలికెళ్ళింది వాళ్ళమ్మ. మెట్ల పక్కన ఉన్న స్టూలు మీద టపాకాయలు ఉన్న పెద్ద డబ్బా ఉంది.

కొట్టు ఓనరు, ఆయన పిల్లలు ఆ డబ్బా లోంచి ఒక్కొక్కటీ తీసి కాలుస్తున్నారు. రోడ్డు మీద వెలుగుతున్న, పేలుతున్న వాటికన్నా డబ్బా లో ఉన్న టపాకాయలనే చూస్తున్నారు ఇద్దరూ. ఇంతలో కొట్టు ఓనర్ వచ్చి పెద్దాడి చెయ్యి పట్టుకుని..

“రా..భూచక్రం కాలుద్దువుగాని” అని తీసుకెళ్ళాడు.

“ఇది ఇంకోటుందా అండి..మా తమ్ముడు కూడా వచ్చాడు ” అన్నాడు పెద్దాడు

“అయ్యో లేదమ్మ..ఇక మిగిలినవన్నీ పేలే టపాసులే..చిన్నపిల్లలు.. మీరు కాలవలేరు అవి..పర్లేదు..నువ్వు ఈ భూచక్రం వెలిగించు ” అని వెలిగే ఒక కాకరొత్తి ఇచ్చాడు. పెద్దాడు అది తీసుకుని, భూచక్రం వెలిగించి, ఆ వెలుగుతున్న కాకరొత్తి పరిగెట్టుకుంటూ వెళ్ళి చిన్నాడి చేతికిచ్చాడు.

“త్వరగా…అలా వీధిలోకి వెళ్ళు..చెయ్యి ఊపుకుంటూ” అన్నాడు.

అప్పటికే ఆ కాకరొత్తి కాస్త కాలి ఉంది. సరిగ్గా ఇంకో 28 సెకెండ్లు కాలుతుంది (ఔను….టైం సెట్ చేసాను). చిన్నాడు దాన్ని చేతిలోకి తీసుకుని..గుడి దగ్గరి లౌడ్స్పీకర్ లో వచ్చే పాట కన్నా గట్టిగా అరుస్తూ ఆ 28 సెకండ్లలో వీధి ఇటు చివరి నుంచి అటూ చివరి దాక పరిగెట్టాడు. మొహం మీద చిరునవ్వు, నుదుటి మీద చమటతో పెవీలియన్ కు తిరిగొచ్చాడు. పక్కన్నే ఉన్న నీళ్ళ చెంబు లో కాలిన ఆ కాకరొత్తి వేసాడు..”చుర్ర్ర్” అని శబ్ధం చేసిందది..

‘ఈ సారి టపాసులు కాలవలేము ‘ అని అనుకున్న చిన్నాడు ఇప్పుడు నెత్తురు రుచిచూసిన పులిలా అయ్యాడు. బాణా సంచా డబ్బ నుంచి కళ్ళు తిప్పుకోలేకపోతున్నాడు. అన్నయ్య భుజం మీద గోకుతూనే ఉన్నాడు. ఆ గోకుడికి అర్థం తెలిసిన పెద్దాడు ఏమీ మాట్లాడకుండా కూర్చున్నాడు. ఓ పది నిముషాలు అలా గోకించుకున్న తరువాత కొత్త చొక్క చిరిగిపోతుందేమో అని

“సరే.. కాని ఈ విషయం ఇంట్లో చెప్పావనుకో….” అని చిన్నాడి తల మీద ఒక మొట్టికాయ వేసాడు..

“కొడతావేంట్రా…నేనెందుకు చెబుతాను?” అన్నాడు తల మీద రుద్దుకుంటూ..

“ఒక వేళ చెబితే ఇలాంటివి 50 మొట్టుతాను ” అన్నాడు..

“నేనెళ్ళి ఆ డబ్బా పక్కన్నే నుంచుంటాను. వాళ్ళు కాలవటానికి అటు వెళ్ళినప్పుడు తీస్తాను. నేను తీసేది వాళ్ళెవరయినా చూసారనుకొ..నువ్వు అమ్మ దగ్గరకు వెళ్ళిపో – సరేనా?” అన్నాడు పెద్దాడు.

“ఎవ్వరూ చూడకపోతే?”

డబ్బానే చూస్తూ కూర్చున్నారు ఇద్దరూ. కొట్టు ఓనర్ కొడుకొచ్చి డబ్బలోంచి వంకాయబాంబు తీసుకున్నాడు..”అది మాది” అని అరవబోయాడు చిన్నాడు. ఇద్దరూ ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుని కళ్ళతో నవ్వుకుని నోటితో ఊరికే ఉన్నారు.

“ఇక మనమే మన ఊరికి క్లాస్ లీడర్లము. ఆ వంకాయ బాంబుని ఇష్టమొచ్చినన్ని సార్లు కాల్చుకోవచ్చు..” అని గాలిలో టూత్పేస్టు డబ్బాలతో మేడలు కట్టాడు.

మెట్లమీద నుంచి రణరంగం లోకి దూకబొయ్యేలోపు వాళ్ళమ్మ బయటకొచ్చింది..

“పదండ్రా” అని చిన్నాడి చెయ్యి పట్టుకుని మెట్లు దిగింది..ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుని అలా మౌనంగా నడిచారు..

ఆ రోజు రాత్రి వాళ్ళ నాన్న ఇంట్లోనే భోంచేసాడు. వాళ్ళమ్మ కూడా ఏడవలేదనుకుంటా – వంట లో ఉప్పు ఎక్కువ కాలేదు.

తాతయ్య దర్జాగా సౌండు పెట్టుకుని చూసాడు TV9. ఇంట్లో పరిస్థితి మామూలుగా ఉంది – దీపావళికి టపాసులు మాత్రం లేవు.

మరుసటి రోజు దీపావళి. పొద్దున్నే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకున్నారు పిల్లలిద్దరు . TV లో పండగ ప్రత్యేక కార్యక్రమాలు వస్తున్నాయి – కార్యక్రమం మొదట్లో, చివర్లో “దీపావళి శుభాకాంక్షలు” అని చెప్పి మిగతా సమయమంతా “అబ్బో మా సినిమా గొప్ప హిట్టు..దయచేసి చూడండి” అని వేడుకుంటున్నారు..పండగ కాబట్టి టిఫిన్ లేదు. “పన్నెండింటికి భోజనం” అంది అమ్మ..

ఊరంతా బాణా సంచా హోరు. వీళ్ళిద్దరికి మాత్రం అవేవీ వినబడట్లేదు. వీళ్ళ చెవులు, మనసు లక్ష్మీ వెంకటేశ్వర స్టోర్స్ బయట ఉన్న డబ్బా మీద…ఆ డబ్బాలోని వంకాయబాంబుల మీద ఉన్నాయి.

పదిన్నరకు కొట్టుకి బయలుదేరారు ఇద్దరూ. అప్పటికే అక్కడ జనం డ్యూటీ ఎక్కేసారు. తిండి, తిప్పలు మాని ఒళ్ళు తెలియకుండా టపాసులు కాలుస్తున్నారు.

డబ్బా మునుపటి రోజు రాత్రి ఉన్న చోటే ఉంచారు. ఇద్దరూ వెళ్ళి మెట్లదగ్గరే కూర్చున్నారు. రాత్రి చల్లగా ఉండటం వల్ల తెలియలేదు కాని..ఇప్పుడు ఎండ కాస్తోంటే మెట్లకు జ్వరమొచ్చినట్టు విపరీతంగా కాలిపోతున్నాయి. వెళ్ళి నీడలో కూర్చుందామా అంటే డబ్బాలోంచి వంకాయబాంబు తీయటం కష్టం. “కాస్సేపు నిక్కరు మనది కాదు అనుకుందాం” అనుకుని..అలాగే కూర్చున్నారు. (వీళ్ళ కష్టం చూడలేక సూర్యుడికి రెండు, మూడు మేఘాలు అడ్డు పెడదామనుకున్నా..కానీ రూల్స్ ఒప్పుకోవు..)

డబ్బానే చూస్తూ కూర్చున్నారు ఇద్దరూ. కొట్టు ఓనర్ కొడుకొచ్చి డబ్బలోంచి వంకాయబాంబు తీసుకున్నాడు..”అది మాది” అని అరవబోయాడు చిన్నాడు. ఇద్దరూ ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుని కళ్ళతో నవ్వుకుని నోటితో ఊరికే ఉన్నారు.

టైము పన్నెండున్నరయ్యింది. డబ్బాలో ఒక్కో టపాకాయ తగ్గుతోంది. సూర్యుడు మిగతా భూగోళాన్నంతా వదిలేసి ఉన్న శక్తినంతా వీళ్ళు కూర్చున్న మెట్లమీదనే ప్రయోగిస్తున్నట్టున్నాడు. ఇక నిక్కర్లు తగలబడిపోతాయేమో అన్న పరిస్థితి వచ్చాక పైకి లేచాడు చిన్నాడు. కంటి నిండా నీళ్ళు..

“ఏరా ఆకలేస్తోందా?” అడిగాడు పెద్దాడు అలా కూర్చునే..

లేదన్నట్టు తలూపాడు చిన్నాడు..

“సరే..నువ్వింటికెళ్ళు..ఇంకాస్సేపట్లో ఎలాగోలా పట్టుకొచ్చేస్తా”

“నువ్వు కూడా రా..”

“నీకు వంకాయ బాంబు కావాలా వద్దా?”

“వద్దు..పోదాం రా” అని పెద్దాడి చొక్కా పట్టుకుని లాగాడు..

పెద్దాడు పైకి లేచి రెండు మొట్టికాయలేసి – “నువ్విప్పుడెళ్ళకపోతే ఇలాంటివి 50 పడతాయి. ఇంటికెళ్ళి భోంచెయ్యి..ఇంకో అరగంట లో వచ్చేస్తా..” అని చిన్నాడిని పంపేసాడు..

నాది ఏమీ చెయ్యలేని పరిస్థితి. పోనీ సాంటా క్లాస్ లాగ ఒక బ్యాగు నిండా వీళ్ళకు టపకాయలు తెచ్చిద్దామా అనుకుంటే…ఇది చిన్న బడ్జెట్ కథ. అలా చూస్తూ ఉన్నానంతే..

అరగంట అనుకున్నది గంటయ్యింది..పెద్దాడు మెట్ల మీద అలానే కూర్చునున్నాడు. మెట్లు కాలుతున్నాయి…అంతకన్నా ఎక్కువ కడుపు కాలుతోంది..

డబ్బాలో ఇక నాలుగైదు టపాకాయలు మిగిలున్నాయి. ఇంకాస్సేపైతే ఇవి కూడా మిగలవని…తెంపు చేసాడు. మెల్లిగా డబ్బా దగ్గరకు జరిగి, దాని అంచు మీద చెయ్యి వేసాడు. ఎవరయినా చూస్తున్నారేమోనని అటూ, ఇటూ చూస్తున్నాడు..కాని వీడికి డబ్బా అంచు మీద తన చెయ్యి తప్ప ఇంకేమీ కనబడట్లేదు..

గుప్పిట విప్పాడు –

వంకాయ బాంబే!!!!!!

గబుక్కున గుప్పిట మూసేసాడు. మెల్లిగా నడవటం మొదలెట్టాడు. సంఘటనా స్థలం నుండి దూరంగా వెళ్తున్న కొద్దీ భయం తగ్గుతూ ఆనందం పెరుగుతూ ఉంది..మరొక్కసారి గుప్పిట తీసి చూసాడు – మళ్ళీ వంకాయ బాంబే!!!

“ధైర్యే సాహసే..” అని డబ్బాలో చెయ్యిపెట్టబోయాడు..ఇలా సగం సగం మంత్రాలు చదివితే పాపమొస్తుందని…”ధైర్యే సాహసే లక్ష్మి” అని ఈసారి పూర్తిగా చదివి చెయ్యి డబ్బాలో పెట్టాడు. చేతికి ఏదో తగిలింది. దాన్ని గుప్పిట పట్టుకుని, మెల్లిగా పైకి తీసాడు. ఒళ్ళంతా చమటలు. ఎండవల్ల పట్టిన చమట కన్నా భయం వల్ల పట్టిన చమట ఎక్కువ గా కారుతోంది..చెయ్యి డబ్బా బయటకొచ్చాక గుప్పిట విప్పాడు –

వంకాయ బాంబే!!!!!!

గబుక్కున గుప్పిట మూసేసాడు. మెల్లిగా నడవటం మొదలెట్టాడు. సంఘటనా స్థలం నుండి దూరంగా వెళ్తున్న కొద్దీ భయం తగ్గుతూ ఆనందం పెరుగుతూ ఉంది..మరొక్కసారి గుప్పిట తీసి చూసాడు – మళ్ళీ వంకాయ బాంబే!!!

ఇక పరుగు మొదలెట్టాడు. మొదలెట్టిన పరుగు ఆపలేదు. వీధి చివర ఎడమ వైపు తిరిగాడు..వేగం పెరిగింది. ట్రాఫిక్కు కాన్స్టబుల్ చౌరస్తా దగ్గర కుడి వైపుకు తిరిగాడు. పూల మార్కెట్టు పక్కనున్న సందు వైపు పరిగెడుతున్నాడు..అక్కడొక పెద్ద రాయి..

కథ మొదలెట్టినప్పటినుండి పిల్లలిద్దరికీ ఏ సహాయమూ చేయలేకపోయానే అన్న బాధ తినేస్తున్న సమయంలో ఈ రాయి కనబడింది నాకు. పెద్దాడు ఈ రాయిని చూడడు అని ఖచ్చితంగా తెలుసు నాకు. అందుకే వాడు అక్కడికి చేరేలోపు నేనెళ్ళి ఆ రాయి తీసి దూరంగా విసిరేసాను. పరిగెట్టుకొస్తున్నవాడికి నేనెందుకు అడ్డు అని పక్కకు జరిగాను. అప్పుడు చూసాను….

ఆ రాయి కింద తారు రోడ్డు లో పెద్ద చీలిక..ఆ చీలిక లో నీళ్ళు.అందులో ఎవ్వరూ కాలువెయ్యకుండా రాయి పెట్టినట్టున్నారు. నాకెలా తెలుస్తుంది??

పెద్దాడు అక్కడకు రానే వచ్చాడు…అందులో కాలు వేసాడు. బొర్లా పడ్డాడు. చేతిలోని వంకాయ బాంబు గుప్పిట్లోంచి బయటకు దొర్లింది..అప్పుడు చూసాడు – దానికి వొత్తి లేదు……..

మెల్లిగా పైకి లేచి, ఆ వొత్తి లేని వంకాయ బాంబు చేతిలోకి తీసుకుని..పక్కన్నే ఉన్న సోడా బండి కి తగిలించిన బక్కెటులోని నీళ్ళతో కాలు కడుక్కున్నాడు. డబ్బాలోంచి తీసిన టపాకాయ తన చేతిని దాటి ఎంతోదూరం వెళ్ళలేదని తెలిసినా…వొత్తి కోసం తన జేబుల్లో వెతికాడు.

వీడు కిందపడటం చూసిన సోడాబండివాడు “దెబ్బ తగిలిందా..ఏది.. కాలు చూపించు” అన్నాడు..దానికి సమధానంగా “దీనికి వొత్తి కావాలి” అన్నాడు పెద్దాడు. “అరెరే..ఏడవకు” అని వాడి బుగ్గలమీద జారుతున్న కన్నీళ్ళు తుడిచాడు సోడాబండివాడు. అప్పటిదాకా తను ఏడుస్తున్నానని తెలియలేదు వాడికి. ఇంతసేపు తెలియని ఆకలి, అలసట ఒక్కసారిగా మీద పడ్డాయి. బండి వాడు ఒక నిమ్మకాయ రెండు ముక్కలుగా కోసి, సగం ఇచ్చాడు. చిన్నాడికిద్దామని ఆ ముక్క జేబులో వేసుకుని ఇంటి వైపు నడక మొదలెట్టాడు.

కాంపౌండు గేటు తెరిస్తే ఆ చప్పుడుకు చిన్నాడు పరిగెట్టుకుంటూ వస్తాడు..ఈ వొత్తి లేని టపకాయ వాడికెలా ఇవ్వాలో అర్థం కాక గేటు దగ్గర అలా నుంచున్నాడు..ఆ తరువాత ఏమి జరుగుతుందో చూడటానికి నాకు మనసొప్పలేదు. కళ్ళు మూసేసుకున్నాను.

~~*~~

సిద్ధార్థ గౌతంరెండురెళ్లుఆరు‘ బ్లాగును నిర్వహిస్తున్న ‘తోటరాముడు’గా సిద్ధార్థగౌతం తెలుగు బ్లాగుపాఠకులకు సుపరిచితులు. ప్రస్తుత నివాసం బెంగుళూరులో. ‘పొద్దు’ గత సంవత్సరం ఇదే నెలలో సిద్ధార్థగౌతంతో ముఖాముఖిని ప్రచురించిన విషయం మా పాఠకులకు గుర్తుండేవుంటుంది.

This entry was posted in కథ and tagged , , . Bookmark the permalink.

24 Responses to ఒక చిన్నబడ్జెట్ కథ

  1. Sundara Murthy says:

    Touching!

    కథ మొత్తం మీ స్టైల్లోనే నడిపి ఆఖరున మాత్రం గుండె పిండేసారు.

  2. ముందుగానే అనుకున్నాను Sir . ఆ రాయి తీసింది వాడికి help చేయడానికి కాదు. వాడిని పడగొట్టడానికి అని.నాకు మొట్ట మొదటి సారి తెలిసిన బ్లాగ్ రెండు రెళ్ళు ఆరు బ్లాగ్ .నవ్వించడం లో మీకు మీరె సాటి sir . “ఎవడి బ్లాగ్ చూస్తే నవ్వి నవ్వి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే తోటరాముడు”. ఏకవచనం లో సంభోదిస్తున్నందుకు I am sorry Sir.

  3. Brij Baala says:

    మీ పేరు తీసేసి, ఇది ముళ్ళపూడి రాసిన కథ అని చెప్తే ముళ్ళపూడి మీద ఎక్స్పర్ట్ అని మేమంతా భావించే మిత్రుడొకరు “నేనీ కథ ఇంతకు ముందెప్పుడూ చదవలేదు… కాబట్టి ఇది ముళ్ళపూడి కథ కావడం అసంభవం. కానీ కథనం శైలి తీరు చూస్తే, నాకు తెలియని ముళ్ళపూడి కథలున్నాయని ఒప్పుకోవలసి వస్తోంది” అన్నారు. ఇంత కంటే నేనేమీ చెప్పలేను.

  4. anasuya says:

    Bagundi. nijam ga vallaki tapakayalu koniddam anipinchindi.

  5. Meher says:

    బాగుంది. 74 ఫాంటు సైజులో అరుస్తున్నా! మీరు కథలు రాయాల్సిన చారిత్రక అవసరాన్ని గుర్తించి ఆ గురుతరమైన బాధ్యతని ఇప్పటికైనా భుజాన్నెత్తుకున్నందుకు సంతోషం, శుభాకంక్షలూ 😛

  6. చాలా బాగా రాశారు.. “చిల్డ్రన్ ఆఫ్ హెవెన్” అనే ఇరానీ సినిమా గుర్తొచ్చింది….
    మరిన్ని మంచి కథలు రాయండి.

  7. bhavani says:

    chala baga rastunnaru..nenu mee kadha laki A.C ayipoyanu :-). naa chinnapati days gurtu vachayandi mee kadha chaduvutunte. meeku last lo director K.Balachander garu gurtu vachinattunnaru…pele tapakayalu ivvaledu ga anduke annanu

  8. varma says:

    Excellent …………. katha chivari varaku rasavatharam ga sagindi.

  9. వీజె says:

    చిన్నప్పుడెప్పుడో దూరదర్శన్ లో మాల్గుడి డేస్ ధారవాహికం చూస్తున్నప్పుడు కలిగిన అనిర్వచనీయమైన అనుభూతి నాకు ఇప్పుడు మీ కథ చదివాక కలిగింది గౌతం . పొట్టచెక్కలయ్యేట్టు నవ్వించే అనుకున్నా , ఇలా గుండెలు పిండే కథలు చెప్పి కూడ కంటతడి పెట్టిస్తారన్నమాట … సోడాబండివాడి రూపములోనైన దినకర్ ని కథలోకి లాగుతారనుకున్న నా ఆశపై సోడా చల్లారండి మీరు ;)…

  10. REDDY says:

    baga wrasavu raa siddu..jr NTR ki pampudama.. AADI cinema lo chinnappati scenes la yedo cinema lo pettukuntadu…??

  11. ముళ్ళపూడి వెంకటరమణలా హాస్యమే కాదు,కరుణరసం చిప్పిల్లే కథలు రాయడంలో కూడా మీకు మంచినేర్పుందని చూపింది మీ చిన్నబడ్జెట్ కథ.
    కథలోకి రచయిత చొచ్చుకురావడం,పాత్రల మీద వ్యాఖ్యానాలు చేసేయడం, పాత్రలకు అవకాశం మేరకు తానూ సాయం చెయ్యడంలో ముళ్ళపూడి మార్కు కనిపిస్తుంది. పొట్ట చెక్కలయ్యేలా నవ్వించడం,వెంటనే హృదయం ద్రవించేలా కంటతడిపెట్టించేలాంటి వాక్యాలు రాయడం అప్పటి ముళ్ళపూడికీ ఇప్పుడు మీకే చెల్లింది. అందుకే ముళ్ళపూడి వీరాభిమానులు కూడా మీ కథల్ని ఆయన కథలుగా నమ్మడంలో ఆశ్చర్యంలేదు.
    భూచక్రం ఇస్తే తమ్ముడికోసం ఇంకోటుందా అని అడగడం,వాడికోసం వంకాయబాంబు సంపాదించడానికి ఎండని,ఆకలిని పట్టించుకోకపోవడం, సోడా బండివాడిచ్చిన నిమ్మబద్దని తమ్ముడికోసం జేబులో వేసుకోవడం అన్నగా పెద్దోడి పాత్రని అద్భుతంగా చిత్రించారు. అభినందనలు.

  12. నాకు ప్రతీ లైను నచ్చింది మరి..దేని గురించి ఏమి చెప్పాలో తెలీట్లేదు. అందుకే..
    ఇంకేమంటాం… కథ, కథనం అద్భుతం అంటాం 🙂

  13. My GOD! You should have put a warning at the head of the story .. man oh man .. 2mmac!!

  14. Raju says:

    Emo teliyadhugani navisthunay edipincharau .. endhu lo nenu chinnvadini.. adhi pandaga roju cinima tickets ki nenu ma annaya chesina pryathnam gurthuku vachindhi..

    I feel so so happy.. thank you very much..

    Regards,
    Raju

  15. వెంకటరమణ says:

    అద్భుతంగా రాశారు. శిల్పం, కధనం వంటి విషయాల గురించి చెప్పమంటే చెప్పలేను కానీ, కొత్తదనంతో ఉండే కధా శిల్పం, కధనాలను ఆస్వాదించటం తెలుసు. ఆ విధంగా చూస్తే నాకు చాలా ఉత్తమ కధగా తోచింది. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజల, పసివాళ్ళ మనస్తత్వాన్ని చాలా బాగా చిత్రించారు. కధా వస్తువు కాకుండా కధన శైలి బుచ్చిబాబు గారి కొన్ని కధల వలె అనిపించింది. అభినందనలు.

  16. uma maheeswari says:

    nenu cheppali anukunna vanni andaru cheppesaaru …..inka baagundi katha ani cheppadam tappa emi cheppalenu nenu

  17. Very touching! I really loved the writer’s meddling here and there.

  18. Sravya V says:

    చాలా బాగా రాశారు.

  19. Kiran says:

    Fantastic narrative! Wating for your next story.

  20. Girish says:

    మీరు ఇలాగ కూడా రాస్తారా..
    super narration..
    ఒక సారి నా చిన్నితనం, దీపావళి నా కళ్ళ ముందు గిర్రున తిరిగాయి..
    keep it up.

  21. Vasu says:

    కథ, కథనం కొత్తగా ఉంది ..

    మళ్ళీ చదివితే మొదటి సారి చదివినపుడు అల్చిప్పల్లే అనుకుని వదిలేసిన ఆణిముత్యాలు కొన్ని ఏరుకున్నాను .

  22. geethasrinivas says:

    Naynalu ralche Bhashpalatho Yrudayam chithadiga marindi.
    thadi madini thadimina meeku Chala thanks.

  23. devulapalli durga prasad says:

    adbutaha. Nenu Bangalore lo ne vuntaanu. Tama rekka duntaaro chepute oka saari darsanam chesukuntaanu

  24. Jayashree Naidu says:

    Liked the flow of narration and superb presentation.
    కొన్ని మానవీయతలు కొన్ని కథల్లో ముద్దమందారాల్లా అనిపిస్తాయి. అలాంటి కథ ఇది.

Comments are closed.