-‘నానీ’
తెలీడానికి చూడడమెందుకు? చూస్తే ఏం తెలుస్తుంది? ఎన్ని జన్మల నుంచి, కలలలోంచి వెదుకుతున్నావు నాకోసం నువ్వు…
-ఊర్వశి
*** *** *** ***
ఆమె ఏమంత పరిచయం లేదు నాకు. నిజానికి నేనావిడ్ని చూడనేలేదు. ఏదో గుంపు ఫొటోలో చటుక్కున మెరవడం చూసి, స్త్రీ మీద నాకుండే సహజమైన, కుతూహలం అనిపించే ఆసక్తిని మించిన ఆపేక్షతో ఒక అసందర్భ టెలిఫోన్ సంభాషణకి సన్నివేశాన్ని కుదుర్చుకున్నాను.
ఏదో రాజకీయ పార్టీలో మరేదో పదవి ఆమెకుండటం ఒక సాకు! ఒక దినపత్రికలో ఛద్మవేషం లాంటి ఓ ఉద్యోగం నాకుండటం ఒక అవకాశం! …అంతే. సమయానుకూల సాన్నిహిత్యాలతో తప్పనిసరై అక్కరకొస్తున్న నవ్వుల్ని తెంపి, ఒక కాగితప్పూల బొకేతో సిద్ధమయ్యాను.
నా ప్రశ్నలకి చివుళ్లుండవు. ఎండు చితుకులు చిటుక్కుమంటున్నాయి టెలిఫోన్ తీగల్లోంచి. ప్రతిగా వినిపించే బదుళ్లకు ఈకలుండవు. ఉన్నా కనిపించవు. ఉన్నట్టు నాకనిపించదు. ఊరికినే ఉండలేని నోరు ‘ఊ’ కొడ్తుందంతే.
అవును, నా ప్రశ్నలకి ప్రాణం లేదు… అందుకే ఆమె బదుళ్లకీ అర్ధంలేదు. కాని యింత అబద్ధంలోను నన్ను వివశుడ్ని చేసిన నిజమొకటుంది…
….. ఆమె నవ్వు!
గుది గుచ్చిన గులాబి దండలోంచి స్వీయ సౌందర్యభారంతో పూరేకులు రాలినట్లు ఆమె నవ్వు. ఓ storm petrel అలల మీద అంగలేస్తూ రెక్కలల్లార్చినట్టు ఆ నవ్వు.
కచ్చితంగా అది అక్కరకొచ్చిన అరువు నవ్వు కాదు. కార్చిచ్చులా మొదలేదో అంతుచిక్కని నవ్వు. తేనెటీగలు మూసిన తుట్టెలో ఆదమరచి తొణికే తియ్యందనాల నవ్వు.
ఈ రాజకీయ కీకారణ్యంలో ఓ బ్రహ్మజెముడు ముల్లు కాదు. నాగరికతల కుండీలో రంగుమారిన cactus సౌందర్యం కూడా కాదు ఆమె. ఎవరీమె?
ఈ మోకాల్లోతు బురదల్లో విరిసిన కెందామరా?
ఎడతెగని సందేహాన్ని వదలేసి నాతో, ఆగిపోయిందా నవ్వు, ఇంటర్వ్యూన్నూ-
*** *** *** ***
హెడ్ ఆఫీసులో నా తలదన్నిన సౌందర్య కాముకుడెవ్వరో ఇంటర్వ్యూని మించి ఆమె ఫోటోని పరిచాడు. స్వయం ప్రకాశిక దీప్తితో వెలుగుతున్న ఆమె చిర్నవ్వుని ఇప్పుడిప్పుడే మసకబారుతున్న mid-career కళ్లతో చూసాను తేరిపార. ఆమెని పలకరించడానికి అంతకు మించి అవకాశమేముంది? నా ఆలోచన కొసను తాకకముందే మోగింది ఫోన్ కృతజ్ఞతగా…
ఇక అదొక ప్రారంభం-
అప్పుడప్పుడూ ముసిరే కార్మబ్బులా పలకరిస్తుందామె. తొలిదశలోని రంగుల్లేని ఆసక్తి, పరిచయాలు తట్టే విప్పపూల వ్యామోహం, కొత్త చనువులు రేపే చెకుముకి ఆర్భాటాలు……
… అన్ని క్రమేణా మాయమయిపోయాయి, ఆమె మాటల్లో తడుస్తుంటే. ఆ తర్వాత అతి కొద్ది కాలంలోనే సంభ్రమంలాంటి విస్మయాన్ని పోలిన బెరకు వంటి భావన, ఆమెకి శ్రోతనైనప్పుడు.
ఏ ఎండుటాకు కిందో గుట్టుగా ఉన్నప్పుడు, ఆకు తొలగి చంద్రకిరణం సోకితే గత్తరపడే గండుచీమ స్థితి నాది. ఇంతా చేసి ఆమె మాట్లాడేది తీరని దాహాల కవిత్వాలు కాదు, hanging gardens లా చకితుల్ని చేసే తాత్విక ప్రభోదాలు కావు.
శతకోటి నీటి బుడగలు తుంపర్ల్లై పక్కు మన్నట్లు తోచే ఆమె మాటలన్నీ నైరూప్యాలు. పునఃసృష్టికి, కనీసం పునఃశ్చరణకీ కూడా సాధ్యంకాని ఒట్టి అనుభవాలు. మట్టి మూకుడులో కాగిన పాలమీగడ, కాదు.. పాల మీగడల వాసనలు.
ఇందాక చెప్పిన బెరకులాంటి బిడియం వంటి భక్తి అనిపించే నా ధ్యానంలో నన్ను వుక్కిరి బిక్కిరి చేస్తూంది ఒకటే సందేహం-
….. ఈ మహోధృత గంగోత్రి, ‘తెనాలి’ అనే చిరు కమండలంలో ఎలా ఒదిగింది?
ఉప్పటి సముద్ర ఘోషని వేనవేల మునివేళ్లతో అలవోకగా వెనక్కి నెట్టిన అమెజాన్ – ఆమె!
ఆమెతో నా అజ్ఞాత స్నేహాలు, intuitive జ్ఞానాల ప్రేరణతో నైవేద్యంలా పంపిన నా కవిత్వాలు, ఆమె ప్రశంసల ప్రతి స్పందనకి నా అనామోదాలు …. ఇవేవీ యీ నా కథకి సందర్భాలు కావు. ఈ మధ్య నా అతి సాధారణ వ్యాఖ్య ఒక నెపంగా, ఆమె విప్పిన విప్పపూల అనుభవమే ఈ కథకి ప్రాణం… ప్రణవం.
*** *** *** ***
“నేను కాఫీ, టీ తాగను”
…
ఏదో టెలీఫోన్ మాటల మధ్య చెప్పానామెకి. అదేదో మహా బుద్దిమంతనం అనుకొనే నా primitive మూర్ఖత్వాన్ని ఆదిలోనే తుంచేసిన నా హర్షూని గుర్తుతెచ్చుకుంటూ, ఏ భావానికీ తావులేని నిర్లిప్త స్వరంతో అన్నాను… “జస్ట్ అలవాటు కాలేదంతే. అందుకే తాగను”.
ఆమె నవ్వింది…
అప్రయత్నంగా చేయి చాచాను, ఆ వాన పాయల నవ్వుతో జడలల్లాలని.
కొన్ని అలవాట్లు లేకపోవడమే నేను asocial కావడానికి కారణమయిందని నేనామెకు చెప్పలేదు. కానీ, ఒక అలవాటు కావడానికీ, కాకపోవడానికీ మన innate rigidity కారణమవడంలోఉన్న రసహీనతను చెప్పకనే చెప్పిందామె.
ఆమె చెబుతోంది……. కొన్నేళ్ల నాటి ఆల్కెమీ వంటి ఓ అనుభవం… కలవరింతలా-
*** *** *** ***
“…ఇన్నేళ్ల క్రితం…” అని మొదలెడడానికి చిత్రమైన అయిష్టం కలుగుతోంది. వేళ్ల సందున జారిపోతున్నాయో… గుప్పెట్లో నిలిచిపోతున్నాయో అర్థం కానట్టు చక్కిలిగింతలు రేపే పొడి పొడి రేణువుల ఇసుక వంటి గతం. అది కొన్ని సంవత్సరాల నాటి మాటగా చెప్పాలంటే అయిష్టంగా వుంది.
…
…ఏమిటి? నా గొంతు మారుతోందా… మీ కవిత్వ పరిభాషలో- గద్గదంగా…
అవును. చక్కిలిగింతలు రేపిన ఇసుక రేణువులే జ్ఞాపకాల సుడికి రేగి కంట్లో పడ్డాయి. అదంతా ఏమోగానీ, “ఇన్ని సంవత్సరాల క్రితం…” అని చెప్పి నా వయస్సును మీకు పట్టివ్వకుండా దాయడంలో ఏదో గమ్మత్తైన మురిపెం కూడా వుంది.
మెట్రిక్యులేషన్ పాసై కాలేజీలో చేరిన కొత్త మోజుల రోజులు!
‘ఆంధ్రా ప్యారిస్’ అని ఎందుకంటారో మా తెనాలిని నాకు తెలియదు కానీ, ప్యారీస్ reference తో మా తెనాలిని గుర్తించడం మాత్రం నాకిష్టం లేదు. మా తెనాలి మీకు తెలుసనుకుంటారు గానీ, మీకు తెలిసింది తెనాలి అనే పేరుతో మిగిలిన అవశేషం మాత్రమే. ఇప్పుడు సెల్ ఫోన్లు, సైబర్ కెఫేలు ఆకాశాల్ని అమాంతంగా తెంపి అరచేతిలో పెడ్తుండొచ్చు. కానీ, అప్పటి తెనాలి, ఆజానుబాహుడైన మా నాన్నలా ఉండేది. చుట్టూ పల్లెలన్నీ బారెడు చేతుల భరోసా కింద నిశ్చంతగా ఒదిగి వుండేవి. నలుగురికి నిష్కామంగా సాయపడ్తున్నందుకు తృప్తిగా మెరిసే మా నాన్న కళ్లే చూసాను. అలానే, ఏటికేడాది పారే తెనాలి కాల్వల మిలమిలలే చూశాను. ఇంకో పోలిక ఏమిటంటే, సంప్రదాయమైన వేషం, ఆధునికమైన పోకడ. నాకు తెలిసి, మా తెనాలి అమ్మాయిలు బహుశా ఆంధ్రదేశంలోనే ఒక జనరేషన్ ముందుంటారనుకుంటాను. ఒక తరం ముందే సైకిళ్లు తొక్కాం, ఓణీల మీద ఒంపులారబోయకుండా, పంజాబీ డ్రస్సుల పేరుతో మగాళ్ళ visual feastలని కొంతవరకూ రద్దు చేసేశాం.
కానీ, మాకు నాలుగు ఇళ్ళ అవతల ఉండే పరిమళక్క మాత్రం ఒక జనరేషన్ వెనుక ఉండేది. నేను ఇంటర్మీడియట్ చేరినప్పుడు అక్క డిగ్రీఫస్టియర్. అక్కకు తోబుట్టులు ఎవరూ లేరు. అయినా అల్లారు ముద్దుగా పెరగలేదు. క్రమశిక్షణల కత్తుల బోనులో ఎప్పుడూ బిక్కు బిక్కు మనేది. ఆకర్ణాంతలోచనాలని వర్ణించినట్టు అక్కకి చారడేసి కళ్ళు, సిగ్గుతో, సంకోచంతో, క్రమశిక్షణల కర్కశత్వం విధించిన భయంతో కళ్ళు నేలకే అంకితమయ్యేవి. రెప్పల కప్పు కింద తెలిసిన వాళ్ళ ముందైనా ఎప్పుడోగాని మెరవని చిరునవ్వు, చప్పున కందిపోయే చెంపలు, అదే కెంజాయ రంగులో తళుక్కుమనే ముక్కుపుడక, అర్ధంకాని నల్లని ప్రశ్నలు పాయలుగా అల్లుకుపోయినట్టుండే బారెడు జడ. ..పరిమళక్క దాచేసినా దాగని అందాలు.
విరగదీసిన పసుపు కొమ్ము రంగు ఛాయలో ఉండే అక్కకి, నాకు ఒంటి రంగులో తప్ప మరెక్కడా పొంతన లేదు. నా లేత గోధుమ బాబ్డ్ హెయిర్ వర్ణాలు, నా మార్నింగ్ షో సినిమాలు, నా సైకిల్ చక్కర్లు…… వెరసి కాలేజికి ఎగనామాలు…. అన్నీ అక్కకి మహా చోద్యాలు. స్లీవ్ లెస్ టీషర్టు వేసుకున్న నా భుజాల్ని తడుముతుంటే, ఆకాశం అంచులకి ఎగిరే రెక్కల్ని దువ్వినట్టుగా ఉండేదట అక్కకి. అక్క ఏ కొంచెం ప్రపంచమైనా చూసిందంటే అది నావల్లే. తనని అడపాదడపా నాతో తీసుకెళ్తుంటే కాదనే ధైర్యం వాళ్ల చండశాసనుడికి ఉండేది కాదు. డబ్బు, అధికారాల మీద నాకు ఇప్పటికీ వ్యామోహం లేకపోయినా, అది అందించే advantages ని ఆమోదిస్తాను, పరిమళక్క నాన్నగారి లాంటి వారిని వంచడానికి.
అక్కకి ఎంతో కొంత స్వేచ్ఛా ప్రదాయినిని నేనని మురుస్తున్న కొత్తల్లో, తన ప్రేమ వ్యవహారం తెలిసి షాకయ్యాను. తనకి ప్రేమించడం తెలియదని కాదు; తనను ప్రేమిస్తున్నామని, తన తోడులేని జీవితం -తమలపాకు లేని తాంబూలమని.. ఇంకా ఎన్నెన్నో తలతిరిగే ఉపమానాలతో పుంఖానుపుంఖంగా శుక, పిక, మేఘ సందేశాలందించే డజన్లకొద్ది కుర్రాళ్ల మధ్య, తనంతట తాను ఒక్కడిని ఎంచుకో గలిగినందుకే ఆశ్చర్యపోయాను. నాతో కలసి వస్తున్నా, నేలకు అతుక్కుపోయే ఆ కళ్లు, ఏడాది పాటు ఆమె నీడై వెంటాడి, డజన్లకొద్ది ఉత్తరాలై చుట్టుముట్టిన అతని ప్రేమని చదవకుండానే అర్థం చేసుకున్న జాణతనానికి డంగై పోయాను.
పంజరం ఊచలమీద తళుక్కుమంటున్న వెన్నెల తరగల్ని చూసి మురిసిపోతున్న అక్కతో ఇచ్చకాలు పోతూ అడిగాను- చందమామను అసలెప్పుడైనా చూశావా కలువ బాలా, తేరిపార- అని. అవును, కాదుల మధ్యలో తలూపింది. అతను డిగ్రీ ఫైనలియర్. అక్కకి రెండేళ్ళు సీనియర్. పెద్ద అందగాడేం కాదు గానీ, కళ్ళు మాత్రం చాలా అల్లరివి. సిగ్గు…. బిడియం… వంటి స్త్రీత్వపు సహజాభరణాల విషయంలో కడు పేదదానినైన నేను కూడా, అతని కళ్లలోకి చూసి మాట్లాడలేకపోయేదాన్ని. ఏది ఏమైనా, పుణ్యమో, పాపమో, నా రాయబారాలు, ఆరిందా మధ్యవర్తిత్వాలు వాళ్లు మాటలు కలుపుకునేలా చేశాయి.
వేనవేల దివ్వెల ఉల్కాపాతమంటే, అనంతమైన చీకటి – అనావృతమైన ఆకాశాల ప్రణయ ఫలితమని నాకా వయసులో తెలియదు. కోటి పచ్చభాస్వరాల నక్షత్ర వెలుగులు నేలను తాకినట్టే, ఈ నేల మీద స్వచ్ఛంగా వెలిగే ప్రేమదివ్వెల దీప్తి కూడా ఆకాశాన్ని చేరుతుందని మాత్రం నమ్మేదాన్ని. ఈ దీపాల్ని వెలిగించడంలో నా పాత్ర ఉండటం నాకు గర్వమనిపించేది. ఆకాశంలో కొంగల బారుని చూసి, గుప్పిళ్ళు బిగించి గుండ్రంగా తిప్పి, గోరు మీద తెల్లమచ్చ ఉంటే అది కొంగరెట్ట వేసిందని, మహా అదృష్టమని మురిసిపోయే చిన్ననాటి నమ్మకాలకు తర్కంతో పనిలేదు.
గుప్పిళ్లు మూసిన చేతుల్ని ఒకదాని చుట్టూ ఒకటి ‘రిమ్ జిమ్’గా తిప్పడంలో ఓ ఉత్సాహముంది. …కొంత ఉత్సుకత ఉంది. గోరు మీద కొంగరెట్టల్ని ఆశించే ఆనందక్షణాలతో ఇట్టే సంవత్సరం దొర్లిపోయింది. కానీ, గుప్పిట తెరిస్తే అక్క గోరు మీద తెల్ల మచ్చలేదు. అక్క ప్రేమ వ్యవహారం తెలిసి, అరచి యాగీ చేయడం కన్నా, మరింత నేర్పైన క్రమశిక్షణ ప్రకటించాలనుకొన్నాడు వాళ్ల నాన్న. ఫలితంగా పరిమళక్క చదువాగిపోయింది అర్థాంతరంగా; పెళ్లయిపోయింది గోప్యంగా….
పెళ్లయ్యాక ఆషాఢమాసంలో ఒక్కసారి మాత్రం మా ఇంటికి వచ్చింది. ముఖాన పులుముకున్న పెళ్లి కళల ప్లాస్టిక్ నవ్వుల్ని చెరుపుకొని, తనివితీరా ఏడ్చింది నన్ను కావలించుకొని.
నాలుగు నూతుల లోతుల్లోంచి ఎగసి కన్నీళ్లై జారి, వెక్కిళ్లై నాగది గోడల్ని ప్రకంపించిన అక్క దుఃఖం- ఆమె నిష్ఫల ప్రేమకి ప్రతీకగా అనిపించలేదు; స్ఫటిక స్వచ్ఛమైన అనుభవానుభూతులకు పలికిన శాశ్వతమైన వీడ్కోలుగా తోచింది. ఓదార్చే పరిణితి వచ్చినా, ఆ పని చేయబుద్ధికాలేదు. నిజానికి మా మధ్య మాటలే లేవు. కళ్లు తుడుచుకొని, ఏ భావమూ కనిపించని తెల్లతామర ముఖంతో వెళ్లిపోయింది. తొందరలోనే వాళ్ల నాన్న transfer చేయించుకొని ఎక్కడికో వెళ్లి పోయాడు. కనుక, మరెప్పుడూ పరిమళక్క నాకు కనిపించలేదు.
అక్కని చదువుమానిపించినప్పుడే, అతను కూడా అదృశ్యమైపోయాడు. వాళ్లది తెనాలి – గుంటూరు మధ్య ఏదో పల్లెటూరట. తెనాలి నించి రైలులో వెళితే తగులుతుందట… మరో ఏడాది గడిచి నేను డిగ్రీ ఫస్టియర్లో చేరిన కొత్తల్లో, దాదాపు పరిమళక్క ఊసు మరచి పోతున్నపుడు, అతను మళ్లీ కనిపించాడు. నన్ను చూడగానే కనుబొమ్మలెగెరేసే కొంటెతనంలేదిప్పుడు. ఆ కళ్లలో అల్లరి కూడా ఆవిరయిపోయింది.
‘బాగున్నావా’ అని పలకరిస్తే, చెప్పలేనంత రోషం వచ్చింది. ఊతకర్రల సాయం లేకుండా నిటారుగా నిలబడగలిగే ధీరత్వం మగాళ్లలో చాలా తక్కువని ఇప్పటికీ నా నిశ్చితాభిప్రాయం. ఇక ప్రేమికుల విషయమైతే చెప్పనక్కర్లేదు. ప్రేమ గాలాలతో తచ్చాడే వాళ్లు, ఉబుసుపోక ప్రేమించేవాళ్లు, అలవికాని self-pityని ప్రేమగా భ్రమపడి దేబిరించేవాళ్ల గురించి కాదు. ప్రేమొక ధ్యానమని, ప్రేమే ధ్యాస అని బీరాలు పోయే ఆత్మవంచకుల గురించే నేనంటుంది. అతనికి బదులివ్వలేనంత ఆవేశం కమ్మి, తప్పుకొని వచ్చేశాక అనిపించింది, అతన్ని ద్వేషించేంతగా పరిమళక్కని ప్రేమించానా అని. నిజానికి, మాట్లాడలేనితనం నాకు స్వాభావికం కాదు. ‘ఏమైపోయావూ’, ‘ఎందుకు పారిపోయావు’….. వంటి కనీస ప్రశ్నలతో నిలదీయకపోవడం అసలు నా నైజమే కాదు. కానీ, అతను ఎదురై పలకరిస్తే, తప్పుకు వచ్చేశాను, నా స్వభావానికి విరుద్ధంగా-
ఆ తర్వాత దాదాపు ఏడాది పాటు కనిపిస్తూనే ఉన్నాడు. తను నన్నే అనుసరిస్తున్నాడని అర్ధం కానట్టు నటించే హిపోక్రటిక్ జాణతనం, అప్పుడు, ఇప్పుడు కూడా లేవు. కానీ, ఆ ఆలోచనే మరింత రోతగా ఉండేది కాబట్టి, తను నా వెనుక పడుతున్నాడని తలుచుకోవడానికి కూడా నేను ఇష్టపడలేదు. కానీ, తన నుంచి అందిన ఉత్తరాన్ని చదువకూడదన్న నా బెట్టు మాత్రం పట్టులేక జారిపోయింది. ‘ప్రేమ’ అనే పదం వాడాలంటే జంకుతున్నానని, పరిమళకి తనకి మధ్య రాయబారాలు నడిపినప్పుడే నా మీద ఇష్టం కలిగి తన మనస్సు ద్వైదీభావంతో సతమతమయ్యేదని, ఆ ఊగిసలాట నుంచి తప్పుకోవడానికి నెలలతరబడి ఏకాకిలా తిరిగానంటూ… సాగిందా ఉత్తరం. ‘నీ ఉత్తరాన్ని కాల్చి పారేశాన’నైతే చెప్పానే గాని, గొంతులో చూపిన కరుకుదనం గుండెల్లో లేదు, వెన్నెల వలలో చిక్కిన కోనేటి కలవరం తప్ప-
అతని చుట్టూ అల్లుకున్న నా జ్ఞాపకాలకి నిర్థిష్టమైన రూపంలేదు. కానీ, అస్పష్టంగా మెదిలే కలల తుంపుల్లా కదలాడతాయవి. నాలోలోపల ఎప్పుడైనా అలజడి కలిగిందీ అంటే, కచ్చితంగా అది అతని అల్లరి కళ్ల పలకరింపుకే. తరచూ పరిమళక్కతో అతని గురించి వెక్కిరిస్తూ మాట్లాడేదాన్ని. ఆటపట్టించే నా మాటల్ని సరదాగా కొట్టిపారేస్తున్న సంతోషంతో, సిగ్గుతో ఎరుపెక్కే ఆమె బుగ్గల్ని చూడటం బాగుండేది నాకు. బహుశా, అంతకుమించి, అతని ఊసు పదేపదే ప్రస్తావించడంతో ఒక అజ్ఞాతమైన ఆరాటం కూడా ఉండేదేమోనని అనిపిస్తుంది నా జ్ఞాపకాలని నెమరేస్తుంటే-
అతను పరిమళక్క నేస్తం మాత్రమే కాదు. ఎన్నో పరిచిత రహస్యాలు వయసుపొదల మాటున దారికాసిన విషయాన్ని నా యవ్వనారంభంలో నాకు చెప్పకనే చెప్పిన తొలిపురుషుడతను.
షటిల్ బ్యాట్మింటన్ ఆటలో ఏమారిన నా స్కర్ట్ చాటు ఒంపుల్ని దాచే ప్రయత్నంలో అతని గొంతులో మందలింపుల సాధికారం…….
తన డొక్కు లాంబ్రెట్టా నడిపే ప్రయత్నంలో నా మోచేతులు దోక్కుపోతే, అతని ముఖంలో బేలతనం….
….ఇవేవి నేను గుర్తించనివి కాదు. కానీ, నేను వాటిని అప్రధానం చేసి, మరుపు మాళిగల్లోకి తోసేశాను. తను రాసిన ఈ ఉత్తరంతో పైకి ఉబుకుతున్న ఆ జ్ఞాపకాల పెనుగులాటని నిర్థాక్షిణ్యంగా అణిచేశాను, పరిమళక్కతో నాకున్న ఆత్మబంధం వల్ల. మరెప్పుడూ అతని నుంచి ఏ ఉత్తరంలేదు. ఉంటే బాగుణ్ణని ఆశించానేమో చెప్పలేను.
డిగ్రీ అయిపోయి, నేను యూనివర్శిటీలో చేరడానికి వెళ్లేంతవరకూ, నన్ను చూడటం అతనికొక దినచర్య. కనీసం ఒక్కసారి కూడా పలకరింపుగానైనా నేను నవ్వలేదు. తెనాలి విడిచి యూనివర్శిటీ చదువులకి వెళ్ళబోతున్న రోజుల్లో ఒకసారి అడిగాడు… ‘కనీసం కలసి కాఫీ తాగుదామ’ని. నాలుగుసార్లు అడిగాక, ‘సరే’నన్నాను.
వ్యక్తావ్యక్తమైన బాధని రంగుతెలీని ఆవిర్లుగా కక్కుతున్న కాఫీ..
కెఫేలో ఓమూల ఏకాంతంగా తనతో కూర్చొని పింగాణి కప్పులో ముదురుగోధుమ ద్రవాన్ని స్పూనుతో సుడితిప్పుతూ ఉండిపోయాను, మౌనంగా. వణుకుతున్న గొంతుతో అతనేం మాట్లాడాడో నేనిప్పుడు చెప్పలేను. అతను చటుక్కున నా చేతుల్ని పట్టుకొని తన ప్రేమ సత్యమని చెప్పినప్పుడు నా ఆపాదమస్తకం ఎందుకు కంపించిందో చెప్పలేను. నా ఎంగిలి కాఫీని అమాంతం తాగేసి ఎందుకు అదృశ్యమైయ్యాడో కూడా సరిగా చెప్పలేను. కానీ, అదంతా ఓ వీడ్కోలు అని తెలుసు. నేనతన్ని చూడటం అదే చివరిసారి కాబోతుందని కూడా తెలుసు.
తర్వాత చాలా మంది ఇప్పటికీ అడుగుతుంటారు, అంత ఇష్టమైన కాఫీ ఎందుకు మానేశావని. నేనేం మానేయలేదు. ఒక సిప్ మాత్రమే చేశాను. అతని జ్ఞాపకాల మల్లే కప్పు ఇంకా వేడిగానే ఉంది.
ఒక కప్పు ఉన్నప్పుడు వేరే కప్పు ఎందుకు?
*** *** *** ***
ఒక కథ అంతగా నచ్చి, మరొకటి ఇంతగా ఎందుకు నచ్చకుండా పోయిందోనని విపరీతంగా వితర్కించి బుర్రపాడు చేసుకునేందుకు నేనేమీ విమర్శకుణ్ణి కాదు కాబట్టి, దారంటా పోతోన్న ఓ అలగా పాఠకుణ్ణి మాత్రమే కాబట్టి, కథకి బొత్తిగా తలాతోకా లేకుండా పోయిందంటూ బేఫికర్‌గా నా అభిప్రాయాన్నిక్కడ వదిలేసి టాటా చీరియో చెప్పేస్తాను.
Some fleeting observations though, before I go:
1) కథ మొదట్లో నేరేటరు మాట్లాడుతున్న మూడు భాగాలూ అవసరమా అనిపించింది? అసలు కథ ప్రారంభమయింది బాబ్డ్-హైరు-బ్రౌను-గౌను-బాలమ్మ పాత్ర మాట్లాడటం మొదలుపెట్టినప్పుడే కదా. అలాంటప్పుడు కథని అక్కణ్ణించీ ఆమె గొంతుతోనే నేరేట్ చేయటమో, లేదంటే థర్డ్ పెర్సన్‌లో ఆమె తరపున కథకుడే కథ చెప్పడమో చేస్తే మరింత ప్రభావవంతంగా వుండేది కదా అనిపించింది.
2) పోనీ నేరేటర్ మాట్లాడిన మొదటి మూడు భాగాలూ ఆమె వ్యక్తిత్వాన్ని మన ముందుంచటానికి ఓ ఉపోద్ఘాతంగా ఉపయోగపడుతున్నాయా అనుకుంటే (కానీ నాకు అక్కడ “ఆమె” కన్నా నేరేటర్ లిబిడో గురించే ఎక్కువ తెలిసింది; కథకి సంబంధం లేనిది), మరి చివర అతను మళ్ళా ప్రత్యక్షమై కథకో ముక్తాయింపైనా ఇవ్వాలి కదా. కథనిలా అర్థాంతరంగా ఆమెకి అప్పగించేసి అంతర్థానమైపోతే ఎలా? అదో లోటనిపించింది.
3) మీరు కవితాత్మకమైన మీ నేరేటర్ గొంతునే “ఆమె” పాత్రకు కూడా అరువిచ్చారని ఎలానూ తేటతెల్లమైపోతోంది. అలాంటప్పుడు, “…..ఏమిటి? నా గొంతు మారుతోందా… మీ కవిత్వ పరిభాషలో- గద్గదంగా” లాంటి సంజాయిషీలు ఎందుకనిపించింది.
—— మొత్తంగా చూస్తే ఆమె చెప్పిన కథ బాగుంది. మెటఫొర్లూ, సిమిలీల భారాన్ని మోయలేక అది చెమటలు కక్కుతూ పడుతోన్న ప్రయాస బాహటంగా కనిపిస్తూనే ఉన్నా, వస్తువులో ఏదో అంతర్నిహిత మార్దవం వల్లనో ఏమో . . . చివర్లో కాస్త కెలికి వదిలింది. ఇక్కడ శైలి గురించి కాస్త:
~ గుది గుచ్చిన గులాబి దండలోంచి స్వీయ సౌందర్యభారంతో పూరేకులు రాలినట్లు ఆమె నవ్వు. ఓ storm petrel అలల మీద అంగలేస్తూ రెక్కలల్లార్చినట్టు ఆ నవ్వు.
~ ఏ ఎండుటాకు కిందో గుట్టుగా ఉన్నప్పుడు, ఆకు తొలగి చంద్రకిరణం సోకితే గత్తరపడే గండుచీమ స్థితి నాది.
ఇలా అందమైన వాక్యాలకేం కొదవ లేదు. అయితే, ఇవి మొత్తంలో ఒద్దికగా ఓ భాగమై ఇమడాల్సిందిపోయి కణుతుల్లా వేరు పడి వేలాడుతున్నాయి. ఒకవేళ రూపకాలూ, ఉపమల కూర్పే కథ అని మీరనుకుంటే, వాటితో పాఠకుల్ని అబ్బురిచేందుకు అసలు కథ కేవలం ఓ నెపం మాత్రమేనన్నది మీ నమ్మకం అయితే, ఉదాహరణకు, ఇలాంటి రొడ్డకొట్టుడు మెటఫొర్స్‌తో ఆ పని ఎలాగూ జరగదు: “వేళ్ల సందున జారిపోతున్నాయో… గుప్పెట్లో నిలిచిపోతున్నాయో అర్థం కానట్టు చక్కిలిగింతలు రేపే పొడి పొడి రేణువుల ఇసుక వంటి గతం.” Aarg! Done to death!! Ain’t it? ఒక మెటఫోరైతే నాలోని వెనక బెంచీ సైన్సు విద్యార్థిని కూడా క్షణమాత్రం కేక పెట్టించింది: “కోటి పచ్చభాస్వరాల నక్షత్ర వెలుగులు నేలను తాకినట్టే…” నక్షత్రాల వెలుగులకు కారణం ఫాస్పరస్ కాదు. దాదాపు మన పాలపుంతలో నక్షత్రాలన్నీ హైడ్రోజన్, హీలియంల కారణంగా వెలుగులు చిమ్ముతాయి (అంటే మండుతాయి). అయినా ఆ మరుసటి వాక్యంలో “నమ్మకాలకు తర్కంతో పనిలేదు” అనిపించేసారు కాబట్టి ఉసూరుమంటూ ఒప్పేసుకున్నాననుకోండి. 🙂
నే చెప్పేదేమంటే: వాక్యాలు విడిగా అద్భుతమైనవే కావచ్చు, కథలో ఇమడాలి కదా, కథకో నడకుండాలి కదా. “గుప్పిళ్లు మూసిన చేతుల్ని ఒకదాని చుట్టూ ఒకటి ‘రిమ్ జిమ్’గా తిప్పడంలో ఓ ఉత్సాహముంది. …కొంత ఉత్సుకత ఉంది. గోరు మీద కొంగరెట్టల్ని ఆశించే ఆనందక్షణాలతో ఇట్టే సంవత్సరం దొర్లిపోయింది. కానీ, గుప్పిట తెరిస్తే అక్క గోరు మీద తెల్ల మచ్చలేదు.” కథలో ఆ సందర్భంలో ఈ పేరా చాలా మంచి మెటఫోరే అనిపించింది. కానీ అక్కడ కథకు “అంత” మంచి మెటఫోర్ అవసరం లేదేమో అని కూడా అనిపించింది.
నచ్చకపోవటానికి అసలు కారణాలు కావేమో ఇవ్వన్నీ? ఎందుకూ నచ్చలేదూ అని వెతుకుతుంటే కదిలిన పనికిమాలిన డొంకేమో ఇదంతా. కాబట్టి, వేయేల, క్లుప్తంగా: నిరాశ.
వావ్! ఇలా మాట్లాడటం ఎంత సులభమో కదా 🙂
By the way, is there a series waiting in the wings, ready to comeforth one by one, and to be collected under some titillating title like “Memoirs of QBTVOVSV”? à la “Memoirs of CASANOVA”? I hope not 🙂
— Meher
After a long time, it is really thrilling to read a love story of this sort. But, there is some confusion and unnecessary description. Any way, i liked it.
mee katha baagundi kaani aame/atadu..? cheppinantavaraku. katha meeru cheppinanta mera chappagaa undi. over description. aame cheppina katha .. adbhutam.
కథ చెప్పిన తీరు బాగుంది. అభినందనలు.
కథ బాగుంది. చివరి వాక్యం వల్ల కథనం పండింది. లేకపోతే ఈ ‘ఉత్తమ పురుషు’డు ‘తన’ గోలతో మొదలెట్టి, చాల సేపు అక్కడే తచ్చాడి, పరిమళ అనే మరో పాత్ర ‘ఉత్తమ పురుష’లోనికి దిగి పాఠకుల్ని ఏం చేసినట్లు అని అసంతృప్తి మిగిలేది. కథ చివర ‘ఒక కప్పు ఉన్నప్పుడు వేరే కప్పు ఎందుకు?’ అనే ముగింపు వాక్యంతో… కాలం రీత్యా బాగా దూరం వున్న ‘రెండు’ కథల మధ్య మంచి సమన్వయం సాధించారు. మరో రకం ఓ హెన్రీ కథ.
నాని ఎవరో నాకు తెలుసనుకుంటున్నా. ఆ చనువుతో ఒక మాట. వాక్యాల్ని దూరాన్వయాలతో సాగలాగి, మరీ అంత డొంక తిరుగుడుగా రాయడం ఎందుకు? ఉపమలు, రూపకాలు వుండొద్దని కాదు. పాఠకుడికి క్లేశం కలిగించకూడదని కూడా కాదు. రచయిత ఉద్దేశపూర్వకంగా ఏమైనా చెయ్యొచ్చు. ఉద్దేశపూర్వకంగా చేసే పని వెనుక రచయిత ఆశించే ప్రయోజనమేదో వుంటుంది. అలా కాకుండా; ఒక అలవాటుగా, తనకే తెలియని ఒక లోపంగా ఆ పని చేస్తున్నట్లయితే, అది చెప్పడం స్నేహితుల, పాఠకుకుల ధర్మం అనిపించి ఇది రాశాను.
hrk gaaru baagaa cheppaaru. naani raasina gata moodu kadhalalO over description ekkuvagaa undi. aa lopam savarimchukuni inkaa manchi kadhalu raastaarani naa nammakam. other than male-female relations i am expecting moral social issues (whether they fail or not) from NANI.
through out poetic style is used
if it is told from woman’s side
tale will become beautiful.
Some poetry dominates the story
be careful it causes problem to the flow. good story finally
Poetry is nices
మెహెర్ గారి అభిప్రాయంతో ఏకీభవించాలనిపిస్తోంది. తిన్నగా ఆమె గొంతులో ఆమె కథ చెప్పేసుంటే కథ ఇంకా బలంగా ఉండేది. కానీ మొదట్లో నేరేటర్ మాటలు చిక్కగా ఉన్నై – సొంతంగా ఒక పద్యంగా నిలబడగలిగినంత చిక్కగా.
చాన్నాళ్ళకి మంచి వచనం చదివిన అనుభూతినిచ్చారు .. దండాలు.
Request to Poddu Editors:
Are there any previous items by this author in this site?
If so, I’d be grateful if you could post the links here.
katha baagundi kaani akkanu vedhinchinanduku kopaginchukonna manishini ekkado edo vankan abhimaaninchadam oka cup undagaa maro cup enduku anadam mahilallo oogisalaata manstatvaanni vyakta parustundi
మీ ‘రెప్పలు వాచిన అద్దం’ చదివి ‘నేను కాస్తో కూస్తో రాయగలను ‘ అన్న భ్రమని మొత్తంగా తుడిచేసుకున్నాను.. ఇది చదివాక మాత్రం అసంతృప్తిగా అనిపించిందండి!
కధ సామాన్యంగా ఉంది. కానీ మెహర్ గారి అనాలిసిస్ మాత్రం అద్భుతంగా ఉంది. వావ్ విశ్లేషణ లో ఇది ఉత్తమ స్థాయి. ఇడ్లి కన్నా పచ్చడి బాగుండడం అంటే ఇదే కదా.
Meher gaari anaalysys great. katha chadavatam modalu pettaaka, nenu kuda nalugu line lu chadivi osari migilina linelu glance chesi scroll down chesi tenaali nunde chadivaanu. over descriptions, ante kathaku ledaa cheppaalanukunnadaaniki sambandam lekunda, actually asalu cheppaalanukunnadento!, but ame cheppina katha baane undi.