బతుకు బండి

-పాలగిరి విశ్వప్రసాద్

బ్రతిమాలడం విడిచి పెట్టినాడు. క్షణమాలస్యం చేయకుండా జేబులోని ‘బటన్‌ నైఫ్‌’ ఒత్తినాడు. రౌడీ మాదిరి కనబడే ఆ యువకుని చేతిలో చాకు ప్రత్యక్షమయేసరికి…. ఆ వ్యక్తి వెనక్కు తగ్గడం – అంతమయిపోతోన్న ప్లాట్‌ఫారమ్‌ మీద నుండి సారధి కంపార్ట్‌మెంట్‌లోకి లంఘించడం ఒకే క్షణంలో జరిగిపోయింది.

దాదర్‌ ఎక్స్‌ప్రెస్‌ అప్పుడే కదుల్తా ఉంది.

ఉరుకులు, పరుగులతో ప్లాట్‌పారమ్‌ మీద కొచ్చిన సారధికి బతుకు చేజారిపోతాన్నెట్టనిపించింది. ఒక చేతిలో ట్రంకు పెట్టె, భుజం మింద మూడేళ్ళ పిల్లది. ట్రంకు పెట్టె మింద చెయ్యేసుకొని తన వెంటే పరుగెత్తుకొస్తోన్న ఐదేళ్ళ కొడుకు. వడివడిగా అడుగులు వేయాలంటే కష్టంగా ఉంది. ఎదురుగా దాటిపోతోన్న కంపార్ట్‌మెంట్‌ వైపు చిన్న పరుగు తీసినాడు.

అప్పుడే కంపార్ట్‌మెంట్‌ డోర్‌ వేయబోతోన్న వ్యక్తిని తోసుకొని చేతిలోని పెట్టెను, భుజం మింది పిల్లను తేడా లేనట్లు పెట్టెలోకి విసిరేసినాడు. ఈ హఠాత్పరిణామానికి తూలి వెనక్కి పడబోయిన అవతల వ్యక్తికి, జరిగేది తెలిసేసరికి అర నిమిషం పట్టింది. అప్పటికే ఒక ట్రంకు పెట్టె, మూడేళ్ళ చింపిరి పిల్ల, ఐదేళ్ళ మట్టి గొట్టుకుపోయిన పిల్లాడు తమ ఫస్ట్‌క్లాస్‌ కంపార్ట్‌మెంట్‌లోకొచ్చి పడినారు. వీటికి తోడు మాసిన గడ్డంతో, రంగు వెలిసిన షర్టుతో, ముడతలు పడ్డ జీన్‌ ప్యాంటుతో కంపార్ట్‌మెంట్‌లోకి జొరబడబోతోన్న యువకుడు. అవతలి పెద్దమనిషికి గజ్జి కుక్కో, ఊరపందో మీదకు తోసుకొస్తోన్నట్లనిపించింది. ఆ పెద్దమనిషి ఒక చేత్తో డోర్‌ వేయబోతూ, మరో చేత్తో ట్రంకు పెట్టెను బయటికి విసరాలని ప్రయత్నం చేస్తున్నాడు. లోపల పిల్లలు ఏడుపందుకున్నారు. లోపలున్న పెద్దమనిషి ఇంగ్లీష్‌లో, తమిళంలో కసురుకొంటున్నాడు. పట్టుకొన్న కడ్డీ నుండి సారధి చేతిపట్టును విడిపించే ప్రయత్నం చేస్తున్నాడు. పిల్లలు అలవి గాకుండా ఏడుస్తున్నా, ఆపెద్ద మనిషికి లోపల పిల్లలున్నరనే స్పృహ కూడా లేదు. ఎక్కబోతోన్న బికారి యువకుడిని ఎక్కనివ్వకుండా తలుపు వేయడమే ధేయ్యంగా ఉంది.

ప్లాట్‌ఫారమ్‌ ఇంకొక నాలుగు బారలు మాత్రమే ఉందని గమనించగానే సారధికి తెగింపొచ్చింది. బ్రతిమాలడం విడిచి పెట్టినాడు. క్షణమాలస్యం చేయకుండా జేబులోని ‘బటన్‌ నైఫ్‌’ ఒత్తినాడు. రౌడీ మాదిరి కనబడే ఆ యువకుని చేతిలో చాకు ప్రత్యక్షమయేసరికి…. ఆ వ్యక్తి వెనక్కు తగ్గడం – అంతమయిపోతోన్న ప్లాట్‌ఫారమ్‌ మీద నుండి సారధి కంపార్ట్‌మెంట్‌లోకి లంఘించడం ఒకే క్షణంలో జరిగిపోయింది. వెంటనే చాకు మడిచి జేబులో పెట్టుకుందామనుకున్నాడు. కానీ, ప్రమాదమింకా దాటిపోలేదనిపించిందేమో ! చాకు చేతిలో అట్లే పట్టుకుని, కసి నిండిన చూపుల్తో నిలబడినాడు.

అవతలి వ్యక్తి బెదిరిపోయి, గొడవెందుకనుకున్నట్లు వెనక్కు తిరిగినాడు. రైల్వే డిపార్ట్‌మెంటునూ, మనుషుల్లో పెరిగిపోతోన్న అరాచకత్వాన్నీ అరవంలో తిట్టుకుంటూ, గొణుక్కుంటూ పోయి తన సీట్లో కూర్చున్నాడు. అంతవరకూ నిటారుగా నిలబడి ఉన్న సారధి, గాలి తీసిన బుడగ మాదిరి డోర్‌ పక్కనే కూలబడిపోయినాడు.
ఏడుస్తోన్న పిల్లల్ను దగ్గరకు తీసుకొన్నాడు. పిల్లదాన్ని ఒళ్ళో పడుకోబెట్టుకొని, కొడుకును ట్రంకు పెట్టె మీద తలవాల్చి పడుకోబెట్టి, వాడి వీపు మీద చెయ్యేసుకొన్నాడు. తుఫాను తర్వాత గూటికి చేరిన తల్లి రెక్కల కిందా దాక్కున్న గువ్వపిల్లల మాదిరి, పిల్లలిద్దరూ ఏడుపు చాలించి ఒదిగి పోయినారు.
రైలు వేగం పుంజుకొంది.

బయట తుపాను వల్ల పట్టిన ముసురు మెల్లగా వర్షంగా మారుతోంది. అరవ వ్యక్తి, అతని కుటుంబ సభ్యులూ సారధి వంక ఉక్రోషంగా చూస్తోన్నారు. ఆ పెట్టెలో ఉన్న కొద్దిమంది కూడా చాలా ఖరీదైన మనుషులుగానే ఉన్నారు. అరవ వ్యక్తి, తన యెదురుగా ఉన్న ‘ సఫారీ వాలా ‘తో ఇంగ్లీష్‌లో ఏదో అంటున్నాడు – సారధి లాంటి బికారి మనుషుల గురించేనేమో !… ఇట్లాంటోళ్లు అవకాశమొస్తే ఎట్లా దోచుకుంటారో …. అవసరమైతే ఖూనీలు కూడ చేస్తారనీ… సభ్య సమాజంలో ఇట్లాంటోళ్లు ఎంత ప్రమాదకరమో – ఇటువంటి మాటలే ఏవో చెబుతోన్నట్లుంది. ఆ సఫారీ వాలా మిలట్రీ వాడి మాదిరి గుబురు మీసాలతో, బలిష్టంగా ఉన్నాడు. అనాసక్తంగా వింటున్నాడు. సారధికి స్పష్టంగా వినిపించక పోయినా, కొంత అర్థమవుతానే ఉంది.

పాత జీవితానికి గుర్తుగా నిలబడిన ‘బటన్‌ చాకు ‘ను వచ్చేటప్పుడు పారేయలనుకున్నాడు. మళ్ళా యెందుకో అనాలోచితంగానే జేబులో వేసుకొచ్చినాడు. ఇప్పుడదే ఉపయోగపడిందానుకున్నాడు. ఇప్పుడు కూడ దాన్ని బయటికి తీయాలనుకోలేదు. తప్పని సరయింది. తనను ఆ పరిస్థితికి తీసుకొచ్చినందుకు “ఈ అరవోళ్ళంతా ఇంతే ” అని గొణుక్కున్నాడు. ఇదే నాలుగేళ్ళక్రితమైతే ” ఈ డబ్బుతో బలిసిన నా కొడుకులంతా ఇంతే ” అనుకునేవాడు.

వాళ్ళ మింద నుండి చూపులు తిప్పి, సారధి తలుపు గుండా బయటికి చూస్తూ కూర్చున్నాడు. బయట సన్నని వాన కురుస్తోంది. తేమ తేమగా ఉన్న రాళ్ళు, గుట్టలు, చెట్లు, స్తంభాలు వెనక్కు పరుగెత్తుతున్నాయి. దూరంగా ఉన్న పలెటూళ్లు మాత్రం నిదానంగా వీపు చాటుకు పోతున్నాయి. పిల్లలిద్దరూ మెల్లగా నిద్రలోకి జారుకున్నారు. వాళ్లను చూస్తోంటే సారధికి మనసంతా బాధతో నిండిపోయింది. ఆప్యాయంగా ఇద్దర్నీ చెరో చేత్తో నిమిరినాడు. విచారంగా మళ్ళా బయటికి చూస్తా కూర్చున్నాడు.
గడిచిన జీవితమంతా అస్తవ్యస్తంగానే గడిచింది. అట్లా జరగడానికి తన ప్రమేయమెంతుందో … సమాజం ప్రమేయమెంతుందో, అతను బేరీజు వేసుకోవాలని చూస్తున్నాడు. ఇప్పుడు అతనున్న పరిస్థితిలో తప్పంతా తనదేనేమోననే సందిగ్థంలో ఉన్నాడు. చేజేతులా పొరబాట్లు చేశానేమోననే పశ్చాత్తాపంతో అతనికి మనసు మరింత బరువెక్కుతోంది. ఏడుస్తామనిపిస్తా ఉంది.
రైలు లయబద్ధంగా దూసుకుపోతోంది.

సారధి పుట్టింది బ్రాహ్మణ కులమే అయినా, ఛాందస సంప్రదాయాల ప్రభావం అతని మింద ఏమీ లేదు. చిన్నప్పుడే తల్లి తండ్రులు పోవడంతో – పెంచిన జేజమ్మ, అబ్బ తనను గారాబంగానే పెంచినారు. గారాబం కారణంగా సంప్రదాయాలను బలంగా అతనిలో నాటలేక పోయినారు. ఒకసారి సారధి ఏడెనిమిదేళ్ళ వయసున్నప్పుడు తన సావాసగాళ్ళను ఇంట్లోకి తీసుకురావడం – వాళ్ళకు కూడా తమ గ్లాసులతోనే మంచి నీళ్ళిస్తే, వాళ్ళు నోట కరుచుకొని తాగడం – సారధి జేజమ్మ అది చూసి, “అసలు మన గ్లాసుల్తో నీళ్లెందుకిచ్చినావ్‌ ? అట్లా ఇవ్వకూడ” దని సారధిని చీవాట్లు పెట్టడం జరిగింది. అంతే ! సారధి మూడ్రోజులు అన్న పానీయాలు ముట్టలేదు. సారధిలో ఆ సున్నితత్వం వయసుతో పాటు పెరుగుతానే వచ్చింది.

అప్పట్నుండి ముసలి ప్రాణులు, సారధి ఎవరిని పిల్చుకొచ్చినా ఇంట్లోకి రానిచ్చేవారు. తినేవేమైనా ఉంటే సారదితో సమానంగా తమ గిన్నెల్లోనే అతని స్నేహితులకు కూడా పెట్టేవారు. తమ పల్లె నుండి పొలం కౌలు డబ్బు తీసుకువచ్చే గొల్ల చెన్నయ్య మాత్రం తమ యింట్లోకి వచ్చేవాడు కాదు. బయట వసారాలో కూర్చునేవాడు. భోజనానికి విస్తరి తెచ్చుకునే వాడు. పల్లె నుండి తమ యింటికి వచ్చేటప్పుడే నీళ్ళు తాగడానికి చెంబుకూడా తనే తెచ్చుకునేవాడు. అతను తిని లేచినాక ఆ తావులో జేజమ్మ నీళ్ళు చల్లేది.

పెరిగే వయసులో యిది కొంత గమనించినా, తన స్నేహితులపట్ల ఏ తేడా కనపడక పోవడంతో సారధి మీద కట్టుబాట్లు, సంప్రదాయాల నీడ పడలేదు. తల్లిదండ్రుల్లేని పిల్లాడు బాధ పడకూడదని వాళ్ళు సారధిని దేనికీ నిర్బంధ పెట్టేవాళ్ళు కాదు. ఆరకంగా సారధికి ‘అగ్రవర్ణ అహం ‘ అంటలేదు. ఇంటర్మీడియట్‌లో శ్రీశ్రీ ని, చలంను చదివి ఆవేశంతో కవితలు అనుకుని ఏవో రాసుకునే వాడు. సాధారణంగా విద్యార్థులు చేసే పోకిరి చేష్టలు సారధి చేసేవాడు కాదు. అట్లాంటి వాళ్లెవరూ అతనికి స్నేహితులుగా తారసపడలేదు – లేక ఇతనే తనకు తెలియకుండానే… అట్లాంటి వాళ్ళకు దూరంగా జరిగినాడేమో !, తన అభిరుచులకు దగ్గరగా ఉన్న వాళ్లతోనే స్నేహం చేసినాడేమో ! వాళ్ళలో కృష్ణ చైతన్య ఒకడు. కృష్ణ చైతన్య తండ్రి పెద్ద ఆస్తిపరుడని చెప్పుకునేవారు కాలేజీలో. అతను సారధి రాసుకున్న కవితలు చూసి
ముచ్చటపడేవాడు. ఇంటర్‌ తర్వాత కృష్ణ చైతన్య దూరమయిపోయినాడు. అతను కర్ణాటకలో ఇంజినీరింగ్ చేరినాడని తెలుసుగానీ, తర్వాత్తర్వాత సంబంధాలు తెగిపోయినాయి.

రైలు వేగం తగ్గి నిలబడే ప్రయత్నంలో ఉంది. ఏదో స్టేషన్‌ వస్తోంది. సారధి తొంగి చూసినాడు. తెలుగు, ఇంగ్లీషు, హిందీలలో ఉన్న ‘ తాడిపత్రి ‘ అనే బోర్డు దాటి, ప్లాట్‌ఫారమ్‌ మీద నిలబడింది. బయట వర్షం కురుస్తానే ఉంది. ప్లాట్‌ఫారమ్‌ చిత్తడి చిత్తడిగా ఉంది. బయటున్న చిత్తడి వాతావరణాన్ని చూసి పెట్టెలోని వాళ్ళెవరూ దిగే ప్రయత్నం చేయడం లేదు.

అరవ వ్యక్తి కొరకొరా చూస్తోన్నాడు – “ఇంక దిగిపో” అన్నట్లున్నాయి అతని చూపులు. దిగి జనరల్‌ కంపార్ట్‌మెంట్‌కు పోదామనిపించింది సారధికి. కానీ, బయటున్న చిత్తడిలో … ఇద్దరు పిల్లల్ని వెంటేస్కొని, పెట్టె వెదుక్కుంటూ పోవడం … వీటన్నిటికీ మానసికంగా సిద్ధంగా లేడు. అదీగాక ఆ వ్యక్తి తనను కంపార్ట్‌మెంట్‌లోకి రాకుండ అడ్డుకున్న వైనం గుర్తొచ్చింది. ‘ పొరబాట్న తను ఎక్కలేకపోయుంటే?’ తను తన ఊర్లో అక్కడే – తన పిల్లలు దాటి పోయిన రైలులో… ఎంత దారుణం జరిగేది ?…. సారధికి ఒక రకమైన మొండితనం ఆవహించింది. తను అక్కడే ఉండడం ద్వారా ‘ అరవోని ‘కి మనశ్శాంతి లేకుండ చేయాలనుకున్నాడు.
అరవ మనిషి నుండి చూపులు తిప్పుకొని, పిల్లల్ని చూస్తూ కూర్చున్నాడు.

రైలు కదిలింది. అతని ఆలోచనలు ఎక్కడెక్కడో తిరుగుతున్నాయి. బయటి వాతావరణం మాదిరే తన మనసులో కూడా ముసురు పట్టింది. డిగ్రీ చదివిన కాలమే సారధి జీవితంలో పెద్ద మలుపు. మంచికో, చెడుకో ఇప్పుడు సారధికున్న వ్యక్తిత్వమూ – సంస్కారమూ ఆ కాలంలోనే బలపడినాయి. అప్పుడే ప్రతాపరెడ్డితో పరిచయమయింది. అతను రాడికల్‌ – తన క్లాస్‌మేటే. క్లాసులకు ఎప్పుడూ హాజరయేవాడు కాదు. అప్పటికే ప్రతాపరెడ్డికి ఉద్యమ నాయకులతో పరిచయముండేదని, ఆ తర్వాత్తర్వాత తెలిసింది. ప్రతాపరెడ్డితో రాడికల్స్‌ తప్ప మిగిలిన విద్యార్థులు అంత చనువుగా ఉండేవారు కాదు. అట్లాంటిది సారధికి మాత్రం అతనితో పరిచయం, అతి తొందరగా స్నేహమయింది.

ప్రతాపరెడ్డి అప్పట్లో సారధికి అర్థమయీ… కాని, విషయాలేవో చెప్పేవాడు. ‘ఇది దోపిడీ సమాజమనీ – ఉన్నవాడు లేని వాని మింద చూపే మంచితనం, జాలి ఎక్కడైనా ఉంటే అది వాడి దోపిడీకి రక్షణగా సృష్టించుకున్నదే గానీ, వాస్తవం కాదనీ – రెండు వర్గాల మధ్యన ఘర్షణ ఉందనేది మాత్రమే వాస్తవమనీ-అది పోవాలంటే ‘ఆర్థిక సమానత్వం’అంటే ‘ సమ సమాజం’ రావాలనీ… ఇట్లాంటివే – తమ పార్టీ సిద్దాంతాలన్నీ వల్లె వేస్తుండేవాడు. ప్రతాపరెడ్డి చెప్పేదేదో వినేవాడుగానీ వాటి మూలాలను అర్థం చేసుకునే ప్రయత్నం సారధి ఎప్పుడూ చేయలేదు. ప్రతాపరెడ్డి సాహచర్యం వల్ల వ్యక్తిగా అతని ప్రభావం మాత్రమే సారధి మింద ఉన్నింది. దానికి తోడు స్వభావసిద్ధమైన ఆవేశం, సున్నితత్వం ఉన్నింది. అంతేగానీ, పార్టీయో… సిద్ధాంతాలో సారధిని ప్రభావితుడ్ని చేయలేదు.

ప్రతాపరెడ్డి – ‘ మన దేశంలో మను ధర్మాల్ని, చాతుర్వర్ణ వ్యవస్థల్నీ రచించి దోపిడీ వ్యవస్థను విస్తార పరిచింది బ్రాహ్మణులేననీ, ఆతర్వాత పాలకులుగా వచ్చిన అగ్ర కులాల వాళ్ళు అందుకు ఇతోధికంగా తోడ్పడ్డార ‘నీ – చెప్పినప్పుడు సారధికి తమ అగ్ర కులాల మీద అంతులేని కోపం వచ్చేది. ఒకానొక ఆవేశ సమయంలో సారధి తన ఒంటి మీదున్న ‘ గాయిత్రి ‘ని తెంచి మురిక్కాల్వలో పారేసినాడు. మాంసం తిన్నాడు. అందువలన బ్రాహ్మణత్వం మంట కలిసిందని తృప్తిపడినాడు. ఇవన్నీ తెలిసి ఊరి దగ్గర ముసిలివాళ్ళిద్దరూ ఘొల్లుమన్నారు. సారధి అబ్బ మనశ్శాంతి కరువై మంచం పట్టినాడు. సారధి రెండవ సంవత్సరం పరీక్షలు రాసి వచ్చేసరికి చివరి ఘడియల్లో ఉన్నాడు.

ఇన్నాళ్ళూ తన చదువెట్లా సాగిందో, కుటుంబమెట్లా గడిచిందో సారధికి పట్టలేదు. తీరా ఇప్పుడు చూస్తే చేతులు కాలినయ్‌. తన అబ్బ చేసిన అప్పులకు పల్లెలో ఉన్న భూమి చాలలేదు. ఇల్లు కూడా అమ్మి, అప్పు కట్టి మిగిలింది బ్యాంక్‌లో వేసినాడు. ఇదంతా చూసి అశాంతితోనే ముసిలోడు కన్ను మూసినాడు. అంతే ! తను మళ్ళా ఫైనలియర్‌కు కాలేజీకి పోయే అపకాశం లేక పోయింది. ఒక కొట్టంలో అద్దెకుండాల్సి వచ్చింది.

రైలు పెద్ద కుదుపుతో నిలబడింది. గుంతకల్లు జంక్షన్‌. వర్షంపడుతూనే ఉన్నా, ప్లాట్‌ఫారమేమో రధ్దీగానే ఉంది. అరవ మనిషి కిటికీ నుండి అటూ ఇటూ చూస్తున్నాడు. టికెట్‌ కలెక్టర్‌ కోసమో ? పోలీసుల కోసమో ? – తన మింద కంప్ష్లెంట్‌ ఇచ్చి బయటికి గెంటాలని చూస్తోన్నట్లుంది. సారధి భయపడ్డాడు. పిల్లల వంక చూసినాడు. నిద్ర లేచి, తన వైపే చూస్తోన్న పిల్లను ఒళ్ళో నుండి ఎత్తి ట్రంకు పెట్టె మింద కూర్చో బెట్టినాడు.

కంప్ల్షెంట్‌ చేయడానికి ఎవరూ కనపడకపోయేసరికి అరవ మనిషికి అసహనం కలిగిందేమో ! విసురుగా లెట్రిన్‌ వైపు అడుగులేసినాడు. కాళ్ళు జాపుకొని కూర్చున్న పిల్లవాడి కాళ్ళకు తన బూటు కాళ్ళను తగిలిస్తూ, అరవంలో ఏదో అన్నాడు. ‘ పెట్టెలో ఎక్కింది కాక, తోవకడ్డంగా ఈ దరిద్రమేంది ? ‘ అంటున్నాడేమోననిపించింది సారధికి.

సారధి నోరెత్తక పోవడం, ఆవ్యక్తి అహాన్ని కొంత తృప్తి పరిచినట్లుంది. చిర్నవ్వు నవ్వుకుంటా లెట్రిన్‌లోకి నడిచినాడు. తిరిగి వచ్చేటప్పుడు కూడా పిల్లవానికి బూట్లు తగిలిస్తా పోయినాడు. సారధికి భగ్గుమనింది. ఒక్కపోటు పొడిస్తే…. !
ఆవేశాన్ని అణుచుకోవడనికి పిల్లలిద్దర్నీ దగ్గరకు తీసుకొని మునగ దీసుకున్నాడు.

రైలు కదిలింది.
సిద్ధాంతాలు అన్నం పెట్టవు. ఏదో ఒక ఉద్యోగం చేయాలి. బ్రాహ్మణులనే గౌరవమున్న ఆయిలు మిల్లు ఓనరెవరో సారధికి ఉద్యోగమిచ్చినాడు – అదీ అతని జేజమ్మ ద్వారా.

సారధికి పనిలో శ్రద్ధ ఉన్నా, యజమాని పట్ల వినయం లేదు. వినయానికీ, బానిసత్వానికీ తేడా తెలుసుకోని ఆవేశం ఉన్నింది. ఉన్నవాడిని తనకే శత్రువుగా చూసే దృష్టి ఉండేది. అందువల్ల అతన్ని పనిలో నుండి తీసేయడానికి ఆ ఓనర్‌ కెంతో కాలం పట్టలేదు.
అప్పుడు కూడ సారధి ‘తనను తీసేసిన కారణమేమిటో చెప్పా’లని నానా గొడవ చేసినాడు. అతను బయటికి గెంటించినాడు. ఆ ఉక్రోషంతో, సందులో ఒంటరిగా పోతున్న మిల్లు ఓనర్‌ తలపగలగొట్టినాడు. ఆసందర్భంలో సారధికి పోలీసుల ఆతిథ్యం ఘనంగానే లభించింది. ఆ చావు దెబ్బల నుండి కోలుకొని మామూలు మనిషి కావడానికి రెన్నెళ్ళు పట్టింది. ఆకాలంలోనే ‘బటన్‌ నైఫ్‌’ ఒకటి సంపాదించి పెట్టుకొని తిరగడం మొదలు పెట్టినాడు. అప్పట్లో, ‘ ఇంక తన బతుకు అలజడిగానే ఉంటుం ‘దనే ఆలోచనా లేమితో, ఆవేశంతో అట్లా ప్రవర్తించే వాడేమో !

చుక్కాని లేని అతని జీవితాన్ని ఒక ఒడ్డుకు చేర్చాలనే ఆశతో జేజమ్మ పెళ్ళి ప్రయత్నాలు చేసింది. సారధికి మాత్రం పెళ్ళి మీద ఆసక్తేం లేదు. సారధి కాలేజి జీవితం, ప్రస్తుత జీవితం తెలిసిన సద్భ్రాహ్మణులెవరూ పిల్లనివ్వడానికి ముందుకు రాలేదు. దోపిడీ వ్యవస్థను ఎదిరించే మనుషుల్లో తానూ ఒకడిననీ…. మామూలు మనుషుల కన్నా తను భిన్నమని… సారధి తనంత తాను అనుకునే వాడు. సమాజం దృష్టిలో మాత్రం సారధి వంటి వాడికి, రౌడీ షీటర్‌కు పెద్ద తేడా లేదు. అందుకే ముసలామె ఎంత పట్టుదలగా ప్రయత్నించినా, ఆఖరి నిమిషంలోనైనా వచ్చిన సంబంధం వెనక్కు మళ్లేది.

చివరకు, ‘పెళ్ళి కెదిగిన కూతురు చస్తే బాగుండున’నుకునే తల మాసిన బ్రాహ్మణుడెవరో పిల్లనిచ్చినాడు. ఇంక ఈ లోకంలో నాకేం బాధ్యతలు లేవన్నట్లు జేజమ్మ దాటిపోయింది. సారధి, అందమైన భార్య పొందులో కొన్నాళ్ళు సుఖాన్నే అనుభవించినాడు. కొడుకు పుట్టేంత లోపల, ఆ రెండేళ్ళలో భార్య మీద చేయి చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అందుకు కారణాలు వింటే, జనమంతా అతనికి కొంచెం పిచ్చి ఉందని అనుమానపడతారు.

తనకు తెలిసినది భార్యకు చెప్పి ఒప్పించే ఓర్పు అతనికి లేదు. ఆమె మారాలంటాడు. ఉన్నట్లుండి ఈ సమాజం మారిపోవాలనుకుంటాడు. అది అసాధ్యం అని ఎవరన్నా అంటే – తననే ఉదాహరణగా చూపి చూడమంటాడు. తను బ్రాహ్మణత్వాన్ని ఎంత సులభంగా మంట గలిపిందీ చూడమంటాడు. తను ఎంత వేగంగా మారిందీ చూడమంటాడు. అన్ని విషయాల్లోనూ, అందర్లోనూ ఆ మార్పు రావాలనుకుంటాడు. అట్లా రాకపోవడం చూసి సహించలేకపోయాడు. అతని అసహనానికి సమాజంలో వీసమెత్తు కదలిక కూడా రాలేదు గానీ, భార్య మాత్రం తరచూ దెబ్బలు తినేది…

భార్య జ్ఞాపకాలు మెదిలేసరికి సారధి కళ్ళల్లో నీళ్ళు కదలాడినాయి.
తండ్రి ఎందుకో ఏడుస్తున్నాడని, పిల్లలిద్దరూ బిక్కమొహం వేసి చూస్తున్నారు… వాళ్ళను చూసి సారధి కళ్ళు తుడుచుకున్నాడు.
సాగిపోవడమే ధ్యేయంగా రైలు దూసుకుపోతోంది.

తను బతుకు వేటలో తంటాలు పడ్తోన్నప్పుడే – తను డిగ్రీ చదివిన ఊరిలో జరిగిన మునిసిపల్‌ ఛైర్మన్‌ హత్యలో ప్రతాపరెడ్డి హస్తమున్నట్లు పత్రికల్లో చూసినాడు. తర్వాత అతను ‘ అండర్‌ గ్రౌండ్‌ ‘కు పోయి తంబళ్ళపల్లి ప్రాంతంలో ఉద్యమ నేతగా పన్జేస్తున్నాడని తెలిసింది. మరికొన్నాళ్లకే పోలీసుల ‘ బూటకపు ఎన్‌కౌంటర్‌ ‘లో చనిపోయాడని కూడా తెలిసి వచ్చింది.

ఈ వార్త తెలిసినపుడు సారధికి తాను ఈ ప్రంచంలో ఒంటరి వాడినయ్యాననిపించింది. రెండు మూడ్రోజులు మామూలు మనిషి కాలేకపోయినాడు. అతని లోపలి సున్నితత్వానికెక్కడో దెబ్బ తగిలింది. క్రమేణా నమ్మకాల పట్ల కొంత సడలినాడు. అందుకు కారణం కూడా సులభంగానే అర్థమవుతుంది. సారధిలో ఉన్నది సిద్ధాంతాల మీద నమ్మకం గాదు – ప్రతాపరెడ్డి ప్రభావమే ! ఇప్పుడతను లేడు. అదీగాక, ఇప్పుడు సారధికి జీవించడం ఒక పోరాటమయిపోతోంది. అలసిపోతున్నాడు. ఇన్నాళ్ళూ ఒక మనిషి తోడు ఉన్నాడనే మానసిక తృప్తీ, ధైర్యం ఒకటి ఉండేది. ప్రతాపరెడ్డి పోవడంతో అదీ పోయింది. అయినా తనకు అలవాటు లేని వినయ విధేయతలు చూపలేక, ఏ మిల్లులో కూడా దినకూలీగా కూడా శాశ్వతంగా నిలవలేకపోయినాడు.

ధనవంతులను తనకే శత్రువుగా చూసే దృష్టి మాత్రం మారుతా వచ్చింది. ‘మంచి తెలివితేటలుండాయ్‌. ఎందుకు వృధా చేసుకుంటావ్‌ ? బుద్ధిగా పని చేసుకుంటే వృద్ధిలోకొస్తావ్‌’ అని వాళ్లు పైకి చెప్పే మాటలను వినే స్థితికి వచ్చినాడు. తన పట్ల ఎంతో ఓర్పు, సహనం చూపిన ధనవంతుల్ని కూడా చూసినాడు. ‘తనకు పని వట్ల నిబద్ధత, తెలివితేటలున్నాయి. వాటిని విడిచి పెట్టుకోలేక ఆ ధనవంతులు తన పట్ల ఓర్పు చూపుతున్నారు ‘ అనేంత లోతుకు, గతంలోలాగా అతని ఆలోచనలిప్పుడు పోవడం లేదు.

అమాయకురాలైన భార్యను చూసినపుడు జాలి కలుగుతోంది. కొడుకు పుట్టిన తర్వాత… ప్రతాపరెడ్డి చావు తర్వాత… తనలో వస్తోన్న మార్పు వల్ల ఆమె అంటే జాలి ఎక్కువవుతోంది. ఆమెకు ఏనాడూ కడుపునిండా తిండి పెట్టలేకపోయినాడు. పైగా ఆమె కష్టాన్నే తిన్నాడు కూడా. ఇంటిని అమ్మగా మిగిలి వున్న సొమ్ము ఈ కాలంలోనే హారతి కర్పూరమయి పోయింది. రెండో కాన్పులో తన భార్య విపరీతమైన నొప్పులకు గురయింది. ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఆపరేషన్‌ చేయించడానికి స్థోమత లేదు. తనకు మంచి మాటలు చెప్పిన పాత యజమానులందర్నీ అర్థించినాడు. ఎవరూ ఉపయోగపడేంత సాయం చేయలేదు. ప్రభుత్వాసుపత్రిలో నిబంధనలన్నీ పూర్తయి, చేర్చుకుని – డాక్టరు నిక్కుతా నీల్గుతా వచ్చేసరికి ఆమె తన జీవన పోరాటం చాలించింది. లోపలున్న ఆడబిడ్డను మాత్రం బయటికి తీసి బ్రతికించగల్గినారు.

సహజంగా అయితే, సారధిలో ప్రతాపరెడ్డి నాటిన ప్రభావం పట్ల జరుగుతున్న సడలింపు – భార్య చావుతో మళ్ళా బలపడాల్సింది ! కానీ, పసి పిల్లల పట్ల అతను అంతకన్నా బలమైన మమతాను రాగాలను ఏర్పరుచుకున్నాడు. నమ్మినదాని కోసం సారధి తను వ్యక్తిగతంగా ఎన్ని కష్టాలనైనా అనుభవించడానికి సిద్ధపడతాడు. అది ‘ త్యాగం ‘ అనుకొని భరించే స్థితిలో ఉన్నాడు. అయితే దాని వలన తన అట్టడుగు పొరల్లో వున్న ప్రేమ హృదయం ఛిద్రం కాకూడదు – అంటే అతను ప్రేమించేవాళ్ళు వ్యధ చెందకూడదు. అట్లా జరిగేట్లయితే తన నమ్మకాల్ని మార్చుకునేంత బలహీనుడు.

రైలు మెల్లగా ఏదో స్టేషన్‌లో నిలబడింది. బయట వర్షం పడతానే ఉంది. అరేబియా, బంగాళాఖాతాల్లో ఒకేసారి తుఫాను లేచినట్లుంది.

అరవ మనిషి లేచి బయటికి పోవడానికి, డోర్‌ వైపు అడుగులేసినాడు. అది గమనించి సారధి ముందు జాగ్రత్తగానే పిల్లల్ను, పెట్టెను సర్దుకొని ద్వారానికి అడ్డు తొలగినాడు. అతని వినయం పట్ల ఆ మనిషి తృప్తి పడినాడేమో ! ఏదో అనబోయిన మనిషి, ఏమీ అనకుండా బయటికి పోయినాడు. అతను కంప్లైంట్‌ యిచ్చి వస్తాడేమోనని సారధి భయపడినాడు. మనసులో బెదురుగా ఉంది… అయినా గత్యంతరం లేదు – డోర్‌ దగ్గరే అయినా, పిల్లలు పండుకోవడానికి అనుకూలంగా, శుభ్రంగా ఉంది… సారధికి కదలాలనిపించలేదు. టీ. సీ.నో, పోలీసో వచ్చినప్పుడు చూడొచ్చనుకున్నాడు. డోర్‌ దగ్గరకి వచ్చిన తోపుడు బండి నుండి ఇడ్లీ ప్యాకెట్లు తీసుకొని పిల్లలకు చెరి ఒకటి ఇచ్చినాడు.

అరవ మనిషి ఏవో ప్యాకెట్లతో వచ్చినాడు. అప్పుడే మిలట్రీ సఫారీవాలా లెట్రిన్‌ వైపు వెళ్ళబోతున్నాడు. కూర్చున్న పిల్లల్ని లేపి, తనూ నిలబడి – అరవ మనిషికీ, మిలట్రీ సఫారీవాలాకు దారి యిచ్చినాడు.

రైలుకదిలింది. చీకటి పడింది. ఈదర గాలి కొడుతోంది. సారధి డోర్‌ వేసినాడు. ఇడ్లీ తిని పిల్లలు పడుకున్నారు. పెట్టె నుండి దుప్పటి తీసి పిల్లల మీద కప్పి, తను ఒదిగి కూర్చున్నాడు.

దూరంగా మినుకు మినుకుమంటున్న దీపాలు మెల్లగా రైలు వెనక్కు వెళ్ళిపోతున్నాయి. క్రమక్రమంగా వేగాన్ని పుంజుకొంటున్నాయి. సారధిలో ఆలోచనలు ముసురుకొంటున్నాయి.

పిల్లల మీదున్న గాఢానురక్తి అతన్ని పూర్తిగా మార్చింది. ఒకవైపు పిల్లల పోషణ వల్ల దినమంతా పనిచేసే అవకాశం దొరకలేదు. అందువల్ల కడుపు నిండేంత సంపాదన ఎప్పుడూ లేదు. దానికి తోడు పిల్లల కోసం ఆస్పత్రి వంటి అదనపు ఖర్చులు. ఇంతకు ముందు నిర్లక్ష్యంగా తిరిగిన వూర్లోనే – మిల్లర్లను ఎదిరించిన వూర్లోనే – ఇప్పుడు విధేయుడై తిరిగినాడు. ఇంతకాలం ‘ తప్పు ‘ చేశానన్న భావం అతనిలో అణువులా పుట్టి అనంతమైంది. దాంతో సారధి యజమానుల ముందు మరింత కుంచించుకు పోయే వాడు… వాళ్ళలో కూడా జాలి, కరుణ, మానవత్వం అనేవి ఉన్నాయనుకొన్నాడు. అన్నిటికీ పరిష్కారం ఆర్థిక సమానత్వమే అన్న ప్రతాపరెడ్డి మాటలు అతని మదిలో అట్టడుగుకు చేరుకున్నాయి. దోపిడీకి ఆర్థిక అసమానతలు కాకుండా – మనుషుల్లోని నైజం, అవకాశాలు మాత్రమే కారణమేమో అనే సందేహమొస్తోంది.
ఆర్థిక సమానత్వం వచ్చినా మనుషుల మధ్య ఈర్ష్యా, ద్వేషాలుంటే ఏం లాభం ? అనిపించేది. మనుషుల మధ్య మానవత్వం, కృతజ్ఞత వంటి బంధాలుండాలనుకునే కొత్త ఆలోచనలు మదిలో చోటు చేసుకున్నాయి.

ఆ మానవత్వాన్ని, కృతజ్ఞతా భావాలను ఏ వర్గపు మనుషుల్లోనైనా సాధించడానికి మంచితనమూ, సహనమే మార్గం – అనుకునే స్థితి వచ్చింది. ఇట్లాంటి మారుతున్న సమయంలోనే ఇంటర్‌లోని తన క్లాస్‌మేట్‌ ఒకడు అదాటు పడినాడు. అతనే గుర్తుపట్టి పలకరించినాడు. అతను కొంత గుర్తుచేసేవరకూ సారధికి అతనెవరో గుర్తు రాలేదు. జ్ఞాపకాలు అయిన తర్వాత సారధిని ఇప్పటి వివరాలడిగినాడు. చెప్పడం అయిష్టంగానే ఉన్నా, అవతలి వ్యక్తి అడిగినందుకు క్లుప్తంగా… ఆస్తి అప్పులకు పోవడం… భార్యపోవడం … ఇద్దరు పిల్లలు… జీవితంలో ఇంకా స్థిరపడలేకపోవడం… వీటి గురించి చెప్పినాడు.

అతనన్నాడు – “ఇట్లయిపోయినావేంరా ? అప్పట్లో నీ ఇంటలిజెన్స్ చూసి ఏ ఐ.ఏ.యస్‌. వో అవుతావనుకునేవాళ్ళం” అని బాధ పడినట్లే చెప్పి, తర్వాత తను బ్యాంకాఫీసర్‌ కావడం – తన ఆదాయ వివరాలు – ఇప్పుడు సమాజంలో తనకున్న పొజిషన్‌ – ఇవన్నీ కలగలుపుతూ ‘బతకడం’ గురించి చిన్న లెక్చరిచ్చినాడు. ఒకప్పుడు – కాలేజిలో ఇతనిలాంటివారంతా సారథి తెలివితేటలను అబ్బురంతో ఆరాధనతో చూసినవాళ్ళే.

ఇదే నాలుగేళ్ళ క్రితమైతే ఆ మిత్రుడు చెప్పిన ‘బతకడం’ గురించిన ఉపన్యాసాన్ని ఏకిపారేసేవాడు. “ఐ.ఏ.యస్‌.నో, ఐ.పి.యన్‌.నో అయి డబ్బుండే దోపిడీ వర్గాలకు కాయిలి కాయాల్నా ?” అని అడిగే వాడు. కానీ ఇప్పుడు ఆ మిత్రుడి ‘ఆప్త’ వాక్యాలను నిర్లిప్తంగానే ఆయినా ఓర్పుగా విన్నాడు. అసహనం చూపలేదు.
పోయేటప్పుడు ఆ మిత్రుడు – “ఇంటర్‌లో కృష్ణచైతన్య నీకు మంచి మిత్రుడు కదూ ! వాళ్ళ ‘కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ ‘ బాగా అభివృద్ధి అయి మంచి పార్మింగ్ లో ఉంది. ఒకసారి అతన్ని కలుసుకో… కనీసం ఉత్తరం రాయి !” అని కృష్ణ చైతన్య అడ్రసిచ్చి పోయినాడు.

అంతవరకూ సారధికి కృష్ణచైతన్య జ్ఞాపకం కూడా లేడు. డిగ్రీలో ప్రతాపరెడ్డి పరిచయం తర్వాత కృష్ణచైతన్య మీద సారధికి ఏర్పడిన అభిప్రాయం – ‘కృష్ణచైతన్యకు సంగీతం, సాహిత్యం వంటి కళల మింద ఆసక్తి ఉంది. ఆ కళాంశ ఉన్నవాళ్ళనూ, చదువులో తెలివి తేటలు చూపే వాళ్ళనూ అతను ఆరాధానగా గౌరవంగా చూసేవాడు. ఆ రెండూ ఉన్న తన పట్ల అతని అభిమానం అటువంటిదే. డబ్బున్నవాడు కాబట్టి తను అభిమానించే వాళ్ళ కోసం ‘మంచినీళ్ళ ప్రాయం’గా డబ్బు ఖర్చు చేసే మంచితనాన్ని చూపేవాడు. అతని మంచితనం అంతవరకే పరిమితం. సమాజం మిందకి మళ్ళేంత విస్తృతమైంది కాదు’- ఈ అభిప్రాయం ఏర్పడిన తర్వాత క్రమంగా సారధిలో కృష్ణ చైతన్య దాదాపు మరుగున పడిపోయినాడు.

ఇప్పుడు తనున్న పరిస్థితిలో హైద్రాబాద్‌ పోయి కృష్ణచైతన్యను స్వయంగా కలిసేంత స్థోమత లేదు. అయినా, ఇన్నేళ్ళలో … స్వంత జీవితం-స్వంత వ్యాపారంలోకి దిగిన ఆ కృష్ణ చైతన్య స్వభావం ఏ రకంగా రూపుకట్టిందో ! … అవుతుందో కాదో తెలియని పనికి ఎవర్నో ఒకర్ని దేబిరించి అప్పు చేయడం కూడ తలకు మించిన భారమే !
అయినా ఆశ చెడ్డది కాబట్టి సారధి తన పరిస్థితిని క్లుప్తంగా చెబుతూ, ఒక పర్సనల్‌ లెటర్‌ రాసి- ఆ కవర్‌లోనే కంపెనీకి ఒక అప్లికేషన్‌ పంపినాడు. ఆశ చంపుకొంటున్న రెండో నెలలో ‘చైతన్య కన్‌స్ట్రక్షన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ నుండి అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌తో పాటు కృష్ణచైతన్య ఉత్తరం వచ్చింది. అది ఉత్తరం కూడా కాదు – చిన్న నోట్‌. ‘ప్రస్తుతం – చైతన్య కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ – షోలాపూర్‌ వద్ద ఏదో ఫ్యాక్టరీ నిర్మాణపు పనిని తీసుకొని, పని ముమ్మరంగా ఉన్నందున తను షోలాపూర్‌ లోనే ఉన్నట్లూ.. సారధి రాసిన ఉత్తరం హైద్రాబాద్‌ హెడ్‌ ఆఫీస్‌కు రాయడం వల్ల, అక్కడి నుండి షోలాపూర్‌లో తనకు చేరేసరికి ఆలశ్యమయిందనీ… వెంటనే ఆర్డర్‌ టైపు చేయించి పంపిస్తున్నాననీ.. షోలాపూర్‌లోనే వచ్చి జాయినింగ్ రిపోర్ట్‌ ఇవ్వాలనీ.. ‘ చిన్న నోట్‌ రాసి ఉంది.

సారధికి మనసంతా కృష్ణచైతన్య పట్ల కృతజ్ఞతతో నిండిపోయింది. మానవత్వం, కృతజ్ఞతలకు పేదా, ధనిక బేధం లేదనుకున్నాడు. అవి మనిషి స్వభావాన్ని బట్టి ఉంటాయనుకొన్నాడు. ‘స్వభావం’ మనిషిలో రూపుదిద్దుకోవడానికి కారణాలేమిటనేంత లోతుకు సారధి ఆలోచించడం మానుకున్నాడిప్పుడు. ఇప్పుడు సారధి జీవితంలో సాగుతున్న పయనం ఆ దారి వైపే. సూపర్‌ వైజర్‌ ఉద్యోగం… జీతం మూడు వేల పై చిలుకు… సారధి మనసులో కృష్ణచైతన్యకు ఏ వందోసారో మళ్ళా కృతజ్ఞత చెప్పుకున్నాడు.

రైలు ఏదో స్టేషన్‌లో నిలబడింది – కీచుమంటూ. బయట కన్నడం వినబడుతోంది. రాయచూరేమో ! ఎవరైనా దిగడమో, ఎక్కడమో జరుగుతుందని ద్వారానికి అడ్డం తొలిగి లేచి కూర్చున్నాడు సారధి. కంపార్ట్‌మెంట్‌లో ఎవరూ కదల్లేదు. జోగుతున్నారు. బయటి నుండి ఈ పెట్టెలోకి ఎవ్వరూ ఎక్కలేదు. రైలు కదిలింది.

కిటికీల నుండి బయటపడిన లైట్ల వెలుతురు, ఎత్తుపల్లాల మింద పడి ఎగిరెగిరి పడ్తోంది. రైలు వేగం పుంజుకునే కొద్దీ మరింత వేగంగా ఎగిరి పడ్తోంది. పిల్లల మీదున్న దుప్పటి సర్ది, సారధి మళ్ళా ట్రంకు పెట్టె మీద ఒదిగిపోయినాడు. మెలుకువొచ్చేసరికి మరొక స్టేషన్‌.

సారధి మెలుకువ వచ్చినపుడు సర్దుకొని కూర్చోవడం – పెట్టెలోని వాళ్ళను, ముఖ్యంగా అరవ వ్యక్తిని ఒకసారి చూడడం – తిరిగి రైలు కదలగానే పండుకోవడం. అరవ వ్యకికి మెలుకువ వచ్చినపుడు కసిగా తన వైపే చూస్తోన్నట్లు సారధికి అనుమానం “తను చాకు చూపించకుండా ఉండాల్సింది” అని నొచ్చుకున్నాడు. “అయినా, వాళ్ళ కసి చూపుల్ని భరిస్తోనే ఉన్నా గదా ! వినయంగా వాళ్ళ రాకపోకలకు అడ్డం లేకుండా ఒదుక్కొంటున్నా గదా !” అనుకుని సమాధానపడ్డాడు.

ఇట్లాంటి ఆలోచనలు కొంతసేపు. మరికొంతసేపు గతం గురించి. మరోసారి పిల్లల భవిష్యత్తు గురించి – ‘ ఇప్పటికైనా తన బతుకు గాడిలో పడింది. ఇప్పటికి ఈ ఉద్యోగం సరిపోతుంది. పిల్లల్ని చదివించుకోవచ్చు. తన పూర్తి కాని డిగ్రీని పూర్తి చేయాల. కృష్ణచైతన్యకు విధేయుడిగా ఉండి, తన తెలివి తేటల్తో అదే కంపెనీలో ఉన్నత స్థాయికి చేరుకోవాల. పిల్లలకు ఏ లోటూ రాకుండా పెంచాల. ‘ ఆలోచనలు ఎక్కడో మొదలయి, మరెక్కడో తెగిపోతున్నాయి.

రైలు మజిలీ వచ్చినపుడు నిలబడుతోంది. మళ్ళా కదిలిపోతోంది. ఎంతమందిని ఎక్కడికి మోసుకుపోతోందో!… మనుషుల్లోని ఎన్నెన్ని ఘర్షణలను ఏ ఒడ్డు చేర్చడానికో!… అలుపు లేకుండా పరుగెత్తుతోంది. వాడి, గుల్బర్గా అన్నీ దాటిపోయినట్టున్నాయి. తన మజిలీ దగ్గరయ్యేకొద్దీ మనసులో ముసురు తగ్గి, మరేదో వెలుతురు తెరపి పొడచూపుతోంది. సారథి మగతగా నిద్రలోకి జారుకునే సమయంలో…

రైలు పెద్ద కుదుపుతో నిలబడింది. ఉలిక్కిపడి లేచినాడు. పెట్టెలో అందరూ లేచినారు. బయటికి చూస్తే ఏ స్టేషనూ లేదు. మసిబూసినట్లు చిక్కని చీకటి. దూరంగా ఏదో పల్లెటూర్లో మినుకు మినుకుమంటున్న గుడ్డి దీపాలు. ఈ చిట్టడవి ప్రాంతంలో ఎందుకాగినట్లు ? ఎవరైనా చెయిన్‌ గుంజినారేమో ! ఎందుకో చెప్పేవాళ్ళు లేరు. చీకట్లోకి, ఎవరూ పెట్టెలు దిగడం లేదు. రైలు మళ్ళా కదిలింది.

‘తాను ప్యాసింజర్నేననీ, చాలా దూరం నుండీ వాళ్లతో పాటే వస్తున్నాననీ, బందిపోటును కాద ‘ని చెప్పమని అరవ వ్యక్తిని వేడుకొంటున్నాడు. సారధి బందిపోట్లతో జమ కట్టబడి శిక్షింపబడుతుండడం, కొంచెం అన్యాయమని పించిందేమో అరవ మనిషికి – ఏదో చెప్పడానికన్నట్లు ముందుకడుగేసినాడు. అతని భార్య జబ్బ పట్టి ఆపి ఏదో సైగ చేసి గొణిగింది, ‘మనకెందుకు దోవన పోయే దరిద్రం’ అన్నట్లు.

లయబద్ధమైన శబ్దం, రైలు వేగంతో పాటు పెరుగుతోంది.
అందరూ తిరిగి మగతలోకి జారుకుంటున్న సమయంలో, కంపార్ట్‌మెంటు అవతలి డోర్‌ వైపు నుండి నలుగురు వ్యక్తులు ప్రత్యక్షమయినారు. చేతుల్లో రివాల్వర్‌, బాకులు ఉన్నాయి. అందరూ ఒకేరకం దుస్తులు వేసుకొన్నారు. కంపార్ట్‌మెంటులో కలకలంరేగింది. సారధి లేచి కూర్చొన్నాడు. పిల్లలు లేచి ఏడ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్లిద్దర్నీ అక్కున చేర్చుకొని సారధి జరిగేది చూస్తున్నాడు. వారిలో రివాల్వర్‌ పట్టుకొన్న వ్యక్తి అందర్నీ బెదిరిస్తున్నాడు. వాళ్లలో వాళ్లు మాట్లాడుకొనేది మరాఠీ భాషేమో ! ప్యాసింజర్లను హిందీలో హెచ్చరిస్తున్నాడు – ఎవర్నీ కదలొద్దని హెచ్చరిస్తోన్నట్లుంది.

ఇద్దరు మనుషులు జోలెలు పట్టుకుని అందరి దగ్గరికి పోయి నగలు, డబ్బు వేయమని బెదిరిస్తోన్నారు. “ఏ మోటీ ! తుమా›రే బదాన్‌ సే మాల్‌ ఉతారో !” – లావుగా ఉన్న వృద్ధ స్త్రీ తన ఒంటి మీదున్న నగల్ని ఒలిచిస్తోంది. ఆమె మొహంలో అంతు లేని భయం. మరో ఆగంతకుడు అరవ మనిషిని చూస్తూ, “ఏయ్‌ బఫూన్‌ ! అప్నా సూట్‌కేస్‌ దిఖావ్‌ !” అంటున్నాడు. ఎదురుగా ఉన్న బక్కపల్చని మనషిని, “అరే ! దుబ్లే పహిల్వాన్‌ ! తేరేకో అలగ్ కహీ నాహై క్యా ?” అని గుడ్లురుముతున్నాడు.
బాకులు చేతబట్టి ముగ్గురు మనుషులు ఈ పని చేస్తోంటే, రివాల్వర్‌ పట్టుకున్న వాడు పైన పర్యవేక్షిస్తున్నాడు.

ప్యాసింజర్లందరి మొహంలో విపరీతమైన భయం చోటు చేసుకుంది. పడుచు అమ్మాయి నగ తీసిస్తోంటే, ఆమె రొమ్ము మింద బాకుతో సుతారంగా గుచ్చుతూ, వెకిలి నవ్వు నవ్వుతున్నాడొకడు. అది చూసి మిలట్రీ సఫారీవాలా సహించలేక, ఏదో అనబోతూ పైకి లేవబోయినాడు. అతని మొహం పగిలింది.

సారధికి అయోమయంగా ఉంది. తన జోలికి ఎవరూ రావడం లేదు. అప్పుడప్పుడూ రివాల్వర్‌ పట్టుకొన్నవాడు మాత్రం తన వైపు చూస్తోన్నాడు. సారధికి ఆలోచనలు పరిపరి విధాలు పోతున్నాయి… ఇదే దాదర్‌ ఎక్స్‌ప్రెస్‌లో నలుగురు అమ్మాయిల్ని, వాళ్ళ మగవాళ్ళ యెదుటే అమానుషంగా బలాత్కరించిన సంఘటన… నడుస్తున్న రైలులో నలభై ఐదు మందిని పెట్రోలు పోసి సజీవ దహనం చేసిన కిరాతకత్వం… రైళ్ళలో , మానవత్వం మచ్చుకైనా కానరాని రాక్షస్సుల దుశ్చర్యలు – పేపర్లలో చదివినవి, విన్నవి… ఏవేవో కళ్ల ముందు కదుల్తున్నాయి.

రివాల్వర్‌ పట్టుకొన్న వ్యక్తి సారధికి వీపు యిచ్చిన మరుక్షణమే, జేబులోని ‘బటన్‌ నైఫ్‌’ తీసి మిందపడ్డాడు. రివాల్వర్‌ మిందనే లక్ష్యంగా మింద పడ్డ అతని దెబ్బకు, రివాల్వర్‌ ఆగంతుకుని చేయి జారి ఎగిరి పడింది. మిలట్రీ సఫారీవాలాకు తుపాకులతో అనుబంధమున్నట్లుంది. వెంటనే రివాల్వర్‌ చేతికి తీస్కొని, సారధి పట్టులో గింజుకుంటున్న ఆగంతుకుని తలకాయ కాన్చినాడు. మిగిలినవాళ్ళలో ఒకడు మిందకు దూకబోయినాడు. సఫారీవాలా చేతిలోని రివాల్వర్‌ అతని వైపు తిరిగి పేలడం – తిరిగి పట్టులో ఉన్న ఆగంతుకునికి గురి పెట్టబడటం – రెప్పపాటు కాలంలో జరిగిపోయినయ్‌.

బుల్లెట్‌ దెబ్బతో చెయ్యి చిట్లిపోయిన మనిషి కుప్పలా కింద కూలబడినాడు. మిగిలిన ఇద్దరూ జోలెల్ని జారవిడిచి కాలికి బుద్ధి చెప్పినారు. పరుగెత్తుతున్న రైలు ద్వారం నుండి రెండు పెట్టెల మధ్యకు దాటుకొన్నారు. వాళ్ళు ఎక్కడికి దాటుకున్నారో ! ఏమైపోయినారో ! చీకట్లో ఏమీ అంతుబట్టడం లేదు. వాళ్ళు మాయమవుతూనే అందరూ చిక్కిన ఆగంతుకులిద్దర్నీ చుట్టుముట్టినారు. అక్కడి సాహసంలో తాము కూడా భాగస్వాములవ్వాలనే ఉత్సాహం అందర్లో పెల్లుబికింది. సారధి పట్టులో ఉన్న ఆగంతుకుడు గుంపు పట్టులోకి వచ్చినాడు. సారధి ఆ గుంపు నుండి పక్కకు తప్పుకొని తన పిల్లల దగ్గరకు చేరినాడు. అందరూ ఆగంతుకులను తలా ఒక గుద్దు గుద్దినారు. నోటికొచ్చి నట్టు తిట్లూ, శాపనార్థాలూ కురిపిస్తున్నారు. వాళ్ళందర్నీ మిలట్రీ సఫారీవాలా కమాండ్‌ చేస్తున్నాడు. ‘ఆ హోల్డాల్‌ కుండే తాడు ఇటివ్వండి… మీ సూట్‌కేస్‌ ఛెయిన్‌ తీయండి….. అమ్మా మీ నాప్కిన్‌ ఇటివ్వండి….. ‘ అని ఆదేశాలిస్తున్నాడు. అతని ఆదేశాల ప్రకారం అందరూ కలిసి వాళ్ళిద్దర్నీ కట్టి పడేసినారు.

ఎవరో చెయిన్‌ గుంజుదామన్నారు. ప్రమాదం దాటిపోయింది గదా ! రైలు నిలబెట్టి చేసేదేముంది ? ఒకేసారి స్టేషన్‌లో ఒప్పచెబుదామన్నారెవరో ! అందరూ మిలట్రీ సఫారీవాలాను అభినందించారు. అతని ‘ గురి ‘ని అబ్బురపడుతూ ప్రశంసించినారు. మిలట్రీ మనిషిలా కనిపిస్తున్న అతను, నిజంగానే మిలటరీ కమాండర్‌ గా చేసినానని చెప్పగా, అందరికీ అతని మీద మరింత గౌరవం పెరిగింది. మిలట్రీ కమాండర్‌ చిర్నవ్వుతో అభినందనలను స్వీకరిస్తోన్నాడు. అక్కడ అతనొక బెటాలియన్‌ కమాండర్‌ –
తామంతా సైనికులమన్న వాతావరణం అలుముకొంది. కొన్ని నిమిషాల క్రితం ‘చావు భయంతో కొయ్య బొమ్మలమైపోయినా’ మన్న వాస్తవం మర్చి పోయినారు. జరిగిన దాని పట్ల- ‘అమ్మో ! ఏమై యుండేదో ? ఏమైపోయేవాళ్ళమో ‘ అని తెచ్చి పెట్టుకున్న భయాన్ని ప్రదర్శిస్తూ… జరుగుతున్న దానిపట్ల ఆశ్చర్యాన్నీ… ఘనకార్యాన్ని సాధించిన సంతోషాన్నీ కలగలుపుతూ ముచ్చటించు కొంటున్నారు. జరిగినదాన్ని తిప్పి తిప్పి కథలుగా చెప్పుకుంటున్నారు. అంతా కలగాపులగంగా ఉంది.
ఏదీ కాబట్టని రైలు చెక్కు చెదరని వేగంతో చీకట్లను చీల్చుకుంటూ దూసుకుపోతోంది.

సారధిని ఎవరూ పట్టించుకోలేదు. అతన్ని తమతో పాటు ఒక సైనికునిగా కూడా గుర్తించలేదు. సారధి చేసిన పనికి ఉనికినిచ్చి, ప్రచారం చేయడానికి సారధి స్థాయి మనుషులెవరూ లేరు. సారధి దాని కోసం ఆశించనూ లేదు. బెదిరిపోయిన తన యిద్దరు పిల్లల్ని సముదాయించుకొంటున్నాడు. మూడేళ్ళ పిల్లది ముద్దు ముద్దు మాటలతో ఏదో అడుగుతూ ఉంటే, ఓర్పుగా ఏదో చెబుతున్నాడు.

రైలు వేగం తగ్గి, స్టేషన్‌లో నిలబడింది. మిలట్రీ కమాండర్‌ కిందకు దిగిపోయినాడు. ఏ స్టేషన్‌ అయిందీ తెలియడం లేదు. తెల్లవార వస్తోంది. ఐదారు నిమిషాల్లో టకటకమని ఏడెనిమిది మంది పోలీసులూ, ఎస్సై వచ్చినారు. దిగిపోయిన మిలిట్రీ కమాండర్‌ పోలీసుల వెంట రాలేదు. వివరాలు చెప్పి వీళ్ళను పంపి పెద్ద మనిషి హోదాలో స్టేషన్‌లోనే కూర్చున్నాడేమో !

పెట్టెలో ఉన్నవాళ్ళంతా కలగాపులగంగా పోలీసుల్తో మాట్లాడు తున్నారు. ఇంగ్లీష్‌లో, హిందీలో, అరవంలో, కన్నడంలో ఎవరికొచ్చిన భాషలో వాళ్లు, తలా ఒక పోలీసుతో మాట్లాడుతున్నారు. తెలుగు వాడు సారధి ఒక్కడూ ఏమీ మాట్లాడలేదు. ఎస్‌.ఐ. ఏదో మాట్లాడి ఒకరిద్దరు మగవాళ్ళను తన వెంటరమ్మన్నాడు.అంతవరకూ – జరిగిన సాహసంలో తాము భాగస్వాములమని నింపుకొన్న ఉత్సాహం అణిగిపోయింది. పోలీసుల చేతుల్లో తమ తల పెట్టి, సమయం వృధా చేసుకోవడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. కానీ ఎస్సై చేయి చూపించి రమ్మన్న యిద్దరూ అయిష్టంగా కదిలారు.

పోలీసులు, అగంతుకులను రెక్కలు విరిచి లాఠీల్తో పొడుస్తా పెట్టె నుండి దింపినారు. చివరగా పెట్టె దిగుతున్న ఎస్‌.ఐ. సారధినీ, అతని అవతారాన్నీ చూసి ఎవర్నో అడుగుతున్నట్లు ‘యే కౌన్‌ ‘ అన్నాడు. ఎపరూ సమాధానం చెప్పే పరిస్థితిలో లేరు. ఎవరి మాటల్లో వాళ్ళున్నారు. సారధి బిత్తర చూపులు చూడడం మినహా ఏం మాట్లాడలేదు.
“తుమ్‌ కౌన్‌ ?” ఎస్సై రెట్టించాడు.
“సాబ్‌… సార్‌…” తడబడినాడు.

దిగిపోయిన పోలీసు, లోపలికొచ్చి లాఠీతో ఒక్కటిచ్చినాడు. తండ్రి మింద దెబ్బ పడేసరికి పిల్లలు ఏడుపందుకున్నారు. సారధి తడబడుతూ – ‘ ఉడ్యోగంలో చేరడానికి పోతు ‘న్నానని తనకు తెలిసిన హిందీ, ఇంగ్లీషులను కలగలిపినాడు.

“ఆప్‌ కా టికెట్‌ బతావ్‌ ?”

టికెట్టడిగేసరికి సారధి గుండెల్లో రైళ్ళు పరుగెత్తినయ్‌. నీళ్లు నమిలినాడు.
“అరే కుత్తే ! అవ్‌లాద్‌ ! బాత్‌ క్యోం చాప్తే హో ?” అంటూ పోలీసు, సారధి తొడలమీద లాఠీతో మోదినాడు. సారధి ప్యాంటు జేబులో ఏదో ‘ ఠఖ్‌ ‘ మని తగలడంతో, పోలీస్‌ అతని జేబులో చేయి పెట్టి తీసినాడు.

తనను తన పిల్లల్నుండి విడదీయకుండా కాపాడిన చాకు… తనకింతవరకూ రక్షణగా ఉన్న చాకు… “జేబ్‌ మే ఛురీ క్యోం రఖా, బద్మాష్‌ ?” ఎస్సై చూపులు క్రూరంగా ఉన్నాయి. సారధికి ఏడుపోస్తోంది. ఒక్కడు కూడా సారధికీ, పోలీసులకూ మధ్య జరుగుతున్న సంఘనటలో కల్పించుకోలేదు. ఎవరి హడావుడిలో వాళ్లు ఉన్నారు. వాళ్ళలో చాలా మంది దృష్టిలో సారధికి గుర్తింపు లేదు. సారధిని గుర్తించాల్సినంత అపసరమూ వాళ్ళకు రాలేదు. మొదటి నుండీ సారధి ఉనికితో పరిచయమున్న వాళ్ళు – అరవ మనిషీ, అతని కుటుంబ సభ్యులూ, మిలట్రీ కమాండర్‌ మాత్రమే. అందుకే ఒక అపరిచితుని కోసం సాక్ష్యాలు, సలహాలూ ఇచ్చి, చిక్కుల్లో ఇరుక్కోవడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు- ఆ ఫస్ట్‌ క్లాస్‌లో. పోలీసులతో జోక్యం… ప్రయాణంలో కాలయాపన జరగడం… ఇవన్నీ… ఎందుకొచ్చిన గొడవ అనుకొని, అసలీ తతంగంతో తమకేం సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారంతా.

సారధిలో ఒకవైపు కోవం, మరోవైపు ఏడుపు తన్నుకొస్తున్నాయి. అరవ మనిషి మాత్రం అంతా గమనిస్తున్నట్లే ఉంది. సారధి అతని వైపు ఆశగా చూసినాడు. అది నెరవేరలేదు. “రాస్కెల్‌ ! నాకు కత్తి చూపించి మా ఫస్ట్‌క్లాస్‌ కంపార్టుమెంటు ఎక్కుతావా? నేను నిన్నేమీ చేసుకోలేని అసమర్థుడ్ని చేసినావు కదూ, ఇంత దూరం ! నీకీ శాస్తి కావాల్సిందే!” అన్నట్లుచూసి మొహం తిప్పుకొన్నాడు. అతని అహం పూర్తిగా చల్లారుతోన్నట్లుంది.

సారధి భయంతో, ఏడుస్తోన్న పిల్లల్ని దగ్గరకు తీసుకొన్నాడు. ద్వారం బయట పోలీసుల చేతుల్లో ఉన్న అగంతుకుడు అకస్మాత్తుగా, “హమారా హీ ఆద్మీ హై సాబ్‌” అన్నాడు. వాడు సారధిని ‘మా మనిషే’ అనగానే, సారధి వీపు మీద లాఠీలు కదంతొక్కినాయి. మెడబట్టి సారధిని రైలు పెట్టె నుండి కిందికి తోసినారు. పిల్లల ఏడుపు కర్ణకఠోరంగా ఉంది. సారధి బ్రతిమాల్తోన్నాడు.. టికెట్‌ లేకపోవడం గురించీ….చాకు ఉండడం గురించీ… ఏవో కారణాలు, సంజాయిషీలు చెప్పుకుంటా తనకు తెలిసిన హిందీ, ఇంగ్లీష్‌లో వేడుకొంటున్నాడు.

‘తాను ప్యాసింజర్నేననీ, చాలా దూరం నుండీ వాళ్లతో పాటే వస్తున్నాననీ, బందిపోటును కాద ‘ని చెప్పమని అరవ వ్యక్తిని వేడుకొంటున్నాడు. సారధి బందిపోట్లతో జమ కట్టబడి శిక్షింపబడుతుండడం, కొంచెం అన్యాయమని పించిందేమో అరవ మనిషికి – ఏదో చెప్పడానికన్నట్లు ముందుకడుగేసినాడు. అతని భార్య జబ్బ పట్టి ఆపి ఏదో సైగ చేసి గొణిగింది, ‘మనకెందుకు దోవన పోయే దరిద్రం’ అన్నట్లు. అది పోలీసులు గమనించినా పట్టించుకోలేదు. ఒక మనిషిని ‘దోషి’ గా నిర్ధారించడానికైతే పోలీసులు అందరి మిందా జులుంచూపి చివరకు ఆ మనిషిని ‘ దోషి ‘ ఇతడే అనే నిర్ధారణ చేయించుకుంటారు. అదే – ‘ నిర్దోషి ‘ అనే సందేహం వచ్చినా నిర్ధారించుకోవడానికి తమ వైపు నుండి ఏ ప్రయత్నమూ చేయరు. పైగా తమకొక ‘ క్రిమినల్‌ ‘ తగ్గిపోతాడేమో నన్నట్లుంటారు.

అంతవరకూ అరవ మనిషిని ‘అరవోడు’ అని మాత్రమే అనుకుంటున్న సారధి మనసు ఇప్పుడు ‘డబ్బుండే నా కొడుకు ‘ అనుకునే మార్పుకు సిద్ధమౌతోంది. కేవలం – వాడి అహాన్ని దెబ్బ తీసేలా ప్రవర్తించాల్సొచ్చిన తన చిన్న నేరానికి, వాడు ఇంత అమానుషానికి బలి చేయడం సారధి సహించలేక పోతున్నాడు. కాని ఏమీ చేయలేని నిస్సహాయత అతనికి ఏడుపు తెప్పిస్తోంది. ఏడుపు మొహంతో అందర్నీ బ్రతిమాల్తూనే ఉన్నాడు. సారధి వేడుకోళ్ళు ఏవీ పన్జేయడం లేదు. అతను పిల్లల కోసం వెనక్కు గుంజుకుంటూ వుంటే, పోలీసులు ముందుకు తోసుకుంటూ, కొట్టుకుంటూ పోతున్నారు. పిల్లల్ని అక్కడే ఉండక, తనవెంట రమ్మని సారధి అరుస్తున్నాడు. పిల్లలిద్దరూ ఏడుస్తూనే ప్లాట్‌ ఫారమ్‌ మీదికి దిగినారు.

కొడుకు – ఏడుస్తూ తండ్రి వెంట పరుగెత్తాలని చూసినాడు. చంటి పిల్లను విడిచి పెట్టలేక తిరిగి వెనక్కొచ్చి పిల్ల దగ్గర ఏడుస్తా నిలబడినాడు. సారధి ఉక్రోషం పట్టలేక “ఒరేయ్‌ ! డబ్బుండే నాకొడకల్లారా ! మీకు మానవత్వం, కృతజ్ఞతా లేవు.. రావు” అని అరుచుకుంటూ పోలీసుల చేతుల్లో గుంజుకుంటున్నాడు. ఇద్దరు పిల్లలున్నారనే ఇంగితపు ఆలోచన చేసే సహనం ఎంత మాత్రం లేని పోలీసులు, ఆగంతుకులతో పాటు సారధిని కూడ ఈడ్చుకు పోతున్నారు. పసిపిల్లలిద్దరూ వెర్రి చూపులతో దిక్కులు చూస్తూ గొంతెండిపోయేటట్టు హృదయ విదారకంగా ఏడుస్తూనే ఉన్నారు.

ఆ చీకట్లో వాళ్ళను పట్టించుకొనే మానవత్వం, తీరికా ఆ ప్లాట్‌ ఫారమ్‌ మింద ఎవరికి లేవు.

~~~~~~~~~~~~~~~

తొలిముద్రణ: రచన, జన్మదిన ప్రత్యేక సంచిక , ఏపిల్ర్‌ – జూన్‌ 1998
(కథాపీఠం పురస్కారం పొందిన కథ)

———————————————–

పాలగిరి విశ్వప్రసాద్విశ్వప్రసాద్ ఒక ప్రముఖ కథారచయిత. ఆయన రాసిన కథల సంపుటి “చుక్కపొడిచింది“. “నాకు వ్యవసాయం ఇష్టం. రాజకీయం ఇష్టం. నాకు అమాసి వచ్చినప్పటి నుంచీ నా జీవితం ఆ రకంగానే మొదలు పెట్టినా. కానీ, కొనసాగలేకపోయినా. తన చుట్టూ ఉన్నవాళ్ళ (సమాజం) కోసం పాటుపడాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చిన పాత తరం వారి భావాలు నావి… అవి రాజకీయంలో ఎదగనీయలేదు. పైగా ఆర్థికంగా రోజురోజుకూ కృశింపజేసినాయి. కడపజిల్లా గ్రామాల్లో ‘రాజకీయ’మంటే ‘గ్రామాధిపత్యమే’నన్న నిర్వచనంగా మారిపోయింది. రాజకీయం ఎంచుకున్న నేను మా ఊర్లో గ్రామాధిపత్యం నిలబెట్టుకోవాలనుకునే వారికి అనివార్యంగా ప్రత్యర్థిగా మారినా. గ్రామకక్షల్లో ప్రత్యక్షపాత్రా తప్పలేదు.” అనే పాలగిరి విశ్వప్రసాద్, పార్టీలు వదిలించుకుని కడపకు వచ్చి పాత్రికేయ వృత్తిలో స్థిరపడ్డారు.

About పాలగిరి విశ్వప్రసాద్

కడప జిల్లాకు చెందిన ప్రముఖ కథారచయిత, పాలగిరి విశ్వప్రసాద్. ఆయన రాసిన కథల సంపుటి “చుక్కపొడిచింది“. “నాకు వ్యవసాయం ఇష్టం. రాజకీయం ఇష్టం. నాకు అమాసి వచ్చినప్పటి నుంచీ నా జీవితం ఆ రకంగానే మొదలు పెట్టినా. కానీ, కొనసాగలేకపోయినా. తన చుట్టూ ఉన్నవాళ్ళ (సమాజం) కోసం పాటుపడాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చిన పాత తరం వారి భావాలు నావి… అవి రాజకీయంలో ఎదగనీయలేదు. పైగా ఆర్థికంగా రోజురోజుకూ కృశింపజేసినాయి. కడపజిల్లా గ్రామాల్లో ‘రాజకీయ’మంటే ‘గ్రామాధిపత్యమే’నన్న నిర్వచనంగా మారిపోయింది. రాజకీయం ఎంచుకున్న నేను మా ఊర్లో గ్రామాధిపత్యం నిలబెట్టుకోవాలనుకునే వారికి అనివార్యంగా ప్రత్యర్థిగా మారినా. గ్రామకక్షల్లో ప్రత్యక్షపాత్రా తప్పలేదు.” అనే విశ్వప్రసాద్ పార్టీలు వదిలించుకుని కడపకు వచ్చి పాత్రికేయుడుగా పనిచేస్తున్నారు.
This entry was posted in కథ and tagged , , , . Bookmark the permalink.

One Response to బతుకు బండి

  1. చాలా బాగా రాశారండీ. నిడివి తగ్గించుకుని కథకి తిన్నగా సంబంధం లేని విషయాల్ని తొలగించి ఉంటే ఇంకా గొప్ప కథవుతుంది.

Comments are closed.