– తుమ్మల వరూధిని
ఒత్తిడి, స్ట్రెస్, ఈ రోజులలో పిన్నల నుండి పెద్దల దాకా అందరిని పట్టి పీడిస్తున్న సమస్య. ఒత్తిడికి ముఖ్యకారణం ఆందోళన. ఈ ఆందోళనకి ముఖ్య కారణం మనం చేయాలనుకునే దానికి, చేసేదానికి మధ్య పొంతన లేకపోవటం. ఏదైనా పని చేసే ముందు ప్రతి ఒక్కరూ ఎంతో కొంత ఆందోళనకు గురికావడం సహజం. ఈ ఆందోళన పనిని శ్రద్ధగా చేసేందుకు ఓ ఇంధనంలాగా సహాయపడుతుంది. కానీ అదే ఆందోళన శృతి మించితే ఒత్తిడిగా మారుతుంది. నెలల వయస్సు నుండి మనిషికి జీవితంలో ప్రతి దశలో ఒత్తిళ్ళు తప్పవు. ఓ నాలుగు మాసాల పిల్లవాడికి కూడా తనకి ఉండే ఆందోళనలు, ఒత్తిళ్ళు తనకి ఉంటాయి. ఒక్కొక్కసారి ఈ ఆందోళన, ఒత్తిడి కొంతమంది పిల్లలలో తీవ్రమైన మానసిక సమస్యలకి దారి తీయవచ్చు. ఒత్తిడి అనేది బయటనుండే రానక్కర్లేదు – ముఖ్యంగా చిన్న పిల్లలలో బయటి ఒత్తిళ్ల కన్నా అంతర్గత ఒత్తిళ్లే ఎక్కువ. ఓ పాలు తాగే పాపడికి తల్లి కాసేపు కనపడకపోతే ఆందోళన. ఓ మూడు సంవత్సరాల పిల్లవాడికి తల్లిని వదిలి పాఠశాలలో ఓ గంట కూర్చుని రావటం ఓ భయానక అనుభవం. ఈ వయస్సు పిల్లలలో చాలా మందికి బడికి వెళ్లటం అతి పెద్ద సమస్య. ఈ భయాలకి తోడు తన భావాలని, అభిప్రాయాలని సరిగ్గా వ్యక్తీకరించలేని నిస్సహాయత; ఈ నిస్సహాయతే ఆందోళనకి, ఆ పై ఒత్తిడికి దారితీస్తుంది.
ఇంకొంచం పెద్దయ్యాక విద్యాపరమైన ఒత్తిళ్ళు, సామాజిక పరమైన ఒత్తిళ్ళు మొదలవుతాయి. మనకి సాధారణంగా కనపడే విషయాలు కూడా పిల్లలకి సమస్యాత్మకంగా కనిపిస్తుంటాయి. వీటికి తోడు తల్లిదండ్రులకి పిల్లల చదువుపై ఉండే అతి శ్రద్ధ, అన్నిటిలో తమ పిల్లవాడు ఆందరికన్నా ముందు ఉండాలనే ఆకాంక్ష, దానికి తగ్గట్టుగా ఇప్పటి పోటీ ప్రపంచం, ఆ పోటీ ప్రపంచంలో వారి వయస్సుకి, సామర్థ్యానికి మించిన లక్ష్యాలు, ఆ లక్ష్యాలని చేరటంలో అడ్డంకులు, వైఫల్యాలు అన్నీ కలిసి అందమైన బాల్యాన్ని కఠినం చేస్తున్నాయి. ఇప్పటి పోటీ ప్రపంచంలో పిల్లలకి తమకిష్టమైన ఆటలు ఆడుకోవటానికి కాని, తమకిష్టమైన ఇతర సృజనాత్మక విషయాల మీద దృష్టి పెట్టటానికి కాని సమయం చాలక (లేక) తమలో తాము వ్యాకులపడుతూ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ ఒత్తిళ్లకు తోడు ఏడు నుండి పది సంవత్సరాల మధ్య వయస్సు పిల్లలు ప్రపంచంలోని బాధలన్నీ తమ బాధలుగానే భావిస్తారు. ఈ వయస్సులో తల్లిదండ్రుల ప్రభావం పిల్లలపై చాలా ఎక్కువగా ఉంటుంది. కుటుంబ పరిస్థితులు, తల్లిదండ్రులు పడే ఆందోళనలు వీరిపై చాలా ప్రభావం చూపుతాయి. ఇంట్లో అమ్మా నాన్న పోట్లాడుకున్నా, అమ్మకి నాన్నకి ఆఫీసులో ఏ చిన్న సమస్య వచ్చినా, కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఎదురైనా, కుటుంబసభ్యులకి ఎవరికైనా ఆపద సంభవించినా అవి అన్నీ తమ సమస్యలే అని భావిస్తుంటారు. బయటి ప్రపంచంలో సంభవించే ప్రతి సమస్యని తమకి అన్వయించుకుంటుంటారు. ఉదాహరణకి టి.వి.లో ఎక్కడో యుద్ధమో, ఉగ్రవాద దృశ్యాలో చూసి అవి తమకి అన్వయించుకుని ఆందోళన పడుతుంటారు. భూకంపం, తుఫాను లాంటి ప్రకృతి వైపరీత్యాల గురించిన వార్తలు విన్నా ఆ దృశ్యాలు చూసినా విపరీతంగా భయపడిపోతుంటారు. తమ భద్రత గురించి, తమ కుటుంబసభ్యుల మరియు ఆత్మీయుల భద్రత గురించీ ఆందోళన చెందుతుంటారు. వీటికి తోడు కుటుంబంలో అనుకోకుండా సంభవించే కొన్ని సంఘటనలు వీరి మీద చాలా ప్రభావం చూపుతుంటాయి, ముఖ్యంగా తల్లిదండ్రులలో ఒకరు మరణించటం లేదా తల్లిదండ్రులు విడిపోవటం లాంటివి పిల్లలమీద జీవితాంతం ప్రభావం చూపుతాయి. ప్రతిదానికి ఇతరులతో పోల్చుకోవటం, తమని తాము తక్కువగా అంచనా వేసుకోవటం లాంటివి కూడా ఈ వయస్సులో మామూలే. ఇది చాలదన్నట్లు పెద్దవారు కూడా అస్తమానం తమ పిల్లలని మరింత చురుగ్గా ఉండే పిల్లలతో పోల్చి మాట్లాడుతూ ఉంటే ఇక చెప్పనక్ఖర్లేదు.
పిల్లలలో ఒత్తిడిని గుర్తించటం: పిల్లలలో ఒత్తిడిని గుర్తించటం చాలా క్లిష్టమైన పని. మానసిక ఒత్తిడికి గురయిన పిల్లలలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. మరీ చిన్నపిల్లలలో ఈ ఒత్తిడి నోట్లో వేలు పెట్టుకోవటం (థంబ్ సకింగ్), జుట్టు మెలిపెట్టుకోవటం (హెయిర్ ట్విర్లింగ్), ముక్కు గిల్లుకోవటం (నోస్ పికింగ్), లాంటి ప్రవర్తనా సమస్యల ద్వారా బయటపడుతుంటుంది. కొంచం పెద్ద పిల్లలలో అబద్ధాలు చెప్పటం, తోటి పిల్లలని కొట్టటం, హింసించటం, పెద్దవాళ్ళని ఎదిరించటం, రోజువారీ పనులు మరచిపోవడం, నిదుర లేమి, నిద్రలో మూత్ర విసర్జన, వాంతులు, విరేచనాలు, తలనొప్పి, జ్వరం, కడుపు నొప్పి, నిస్సత్తువ లాంటి వాటికి గురవుతారు. అలాగే, చదివినదేదీ గుర్తుండకపోవడం, ఒకవిధమైన నిరాశ, నిరాసక్తి, ఏమీ చేయాలనిపించక పోవటం, చేసే పని మీద శ్రద్ధ లేకపోవటం, ఏదో కోల్పోయిన భావన, తోటివారితో కలవలేకపోవడం, ఆత్మనూన్యతా భావం లాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. కొంతమంది పిల్లలలో ఈ ఒత్తిడి మూలాన పీడ కలలు, అతి భయం, చిన్న చిన్న విషయాలకి కూడా అతిగా స్పందించటం, అకస్మాత్తుగా చదువులో వెనకబడటం, తమని తాము హింసించుకోవటం లాంటివి కూడా సంభవిస్తుంటాయి. పిల్లల మానసిక ఒత్తిడి స్థాయిని బట్టి, వారు పెరిగే వాతావరణాన్ని బట్టి, తల్లితండ్రులతో వారికున్న సంబంధబాంధవ్యాలను బట్టి ఈ లక్షణాలు ఉంటాయి.
పిల్లలు ఒత్తిడిని అధిగమించాలంటే: కుటుంబ వాతావరణం, పెద్దల ప్రవర్తన, వారందించే ప్రోత్సాహం, సహాయ సహకారాలు పిల్లలు ఒత్తిడి అధిగమించేందుకు సహకరిస్తాయి. పిల్లలలో ఎలాంటి అసహజ ప్రవర్తన కనిపించినా తల్లిదండ్రులు అప్రమత్తం అవ్వాలి, ఇలాంటి ప్రవర్తనలు పిల్లలలో సహజమే కదా అని వదిలేయకూడదు. ముందుగా పిల్లలకి మంచి పౌష్టికాహారం, తగినంత విశ్రాంతి కల్పించాలి. తల్లిదండ్రులు పిల్లలతో సన్నిహితంగా మెలగాలి. ఎప్పుడూ పిల్లలకి అందుబాటులో ఉండాలి. పిల్లలు స్వేచ్చగా తమ మనసులోని మాట చెప్పే విధంగా ప్రోత్సహించాలి, వారి మాటలు మనసుపెట్టి శ్రద్ధగా వినాలి. పిల్లలు తమకి ఎంత ముఖ్యమో వారికి తెలియచెప్పాలి. వారికున్న సమస్యకి కారణాలు, దానికున్న పరిష్కార మార్గాల గురించి వారితో చర్చించాలి. వారి స్నేహితులతోటి, ఉపాధ్యాయులతోటి ఎప్పటికప్పుడు సంప్రదిస్తుండాలి. వారికి ఇష్టం లేని వ్యాపకాలను, వారి వయస్సుకి మించిన లక్ష్యాలను వారి మీద రుద్దటం మానివేయాలి. వారి అభిరుచులను సామర్థ్యాలను దృష్టిలో పెట్టుకుని వారికి లక్ష్యాలను నిర్దేశించాలి. పిల్లలు టి.వి.లో ఎలాంటి కార్యక్రమాలు చూస్తున్నారో తల్లిదండ్రులు ఒక కంట కనిపెడుతుండాలి. తల్లిదండ్రులు కుటుంబసమస్యల గురించి పిల్లల ముందు చర్చించటం, వాదులాడుకోవటం లాంటివి వీలైనంతవరకు జరగకుండా చూసుకోవాలి. జీవితంలో ఎదురయ్యే కొన్ని సహజమైన సమస్యలు, ఒత్తిళ్ళ గురించి వారికి ముందే ఒక అవగాహన కలిగించాలి. కోపం, భయం, బాధ, ఒంటరితనం, ఆందోళన, ఇలాంటివన్నీ జీవితంలో చాలా సాధారణం అన్న విషయం వారికి తెలిసేటట్లు చేయాలి. ఉదాహరణకి – పరీక్షలు, పోటీలు, సాధారణ ఆరోగ్య సమస్యలు, డాక్టరు దగ్గరికి వెళ్ళటం మొదలైన వాటి గురించి వారితో ముందుగానే చర్చించి వారికి ఒక అవగాహన కలిగించాలి. అలా అని వారి లోపాలను పదే పదే ఎత్తి చూపకూడదు. అవగాహన కల్పించటానికి, ఎత్తిచూపించటానికి మధ్య ఉన్న తేడాని తల్లిదండ్రులు తెలుసుకోవాలి. కొంతమంది పిల్లలు తమ సమస్యల గురించి తల్లిదండ్రులతో గాని వేరే ఇతర కుటుంబసభ్యులతో గాని చర్చించటానికి ఇష్టపడరు; అలాంటప్పుడు తల్లిదండ్రులు తమ సమస్యలగురించి పిల్లలతో చర్చించి వాటిని తాము ఎలా ఎదుర్కుంటున్నారో తెలియచేస్తే పిల్లలలో కొంత మార్పు రావటానికి ఆస్కారం ఉంటుంది. మంచి పుస్తకాలు కూడా పిల్లలకి మంచి నేస్తాలు. కొంతమంది పిల్లలు పుస్తకాలు చదవటం ద్వారా వాటిలోని పాత్రలకి తమని తాము అన్వయించుకుని తమ సమస్యలకి వాటిద్వారా పరిష్కారం పొందుతుంటారు. ఈ ఒత్తిడి మరీ శృతిమించినా, తీవ్రమైన ప్రవర్తనా లోపాలు కనిపించినా మానసిక నిపుణులను సంప్రదించాలి.
మంచి వ్యాసం.
మీరు యమ్మెస్సీ చేశారా, నాకు తెలీనే తెలీదు.
మరిన్ని వ్యాసాలు వ్రాయగలరు.
చాలా అవగాహనతో రాసారు. అభినందనలు.
చాలా బాగా రాశారు.