శిఖామణి – చిలక్కొయ్య

– బొల్లోజు బాబా

మువ్వలచేతికర్ర” తో తెలుగు సాహిత్యలోకంలోకి ఒక మెరుపులా ప్రవేశించారు శిఖామణి. “చిలక్కొయ్య” ఆయన రెండవ కవితాసంపుటి. 1993 లో వెలువరించిన ఈ సంపుటిలో మొత్తం 33 కవితలున్నాయి. దేనికదే వస్తువైవిధ్యంతో, విలక్షణమైన అభివ్యక్తితో కనిపిస్తాయి. అనుభూతికి భాషనివ్వటం అంత తేలికేమీ కాదు. ఎందుకంటే కొన్ని అనుభూతులను వ్యక్తీకరించటానికి భాష సరిపోదు. ఈ రెంటినీ సమన్వయపరచి, ఒక అనుభూతిని అంతే శక్తిమంతంగా చదువరిలో ప్రవేశపెట్టటంలో శిఖామణి నేర్పరి.

ఈ సంపుటిలో మొదటి కవిత పేరు చిలక్కొయ్య. గోడకు ఉండే చిలక్కొయ్యపై వ్రాసిన వస్తుకవితైనప్పటికీ, ఒక సంపూర్ణజీవితాన్ని అంతర్లీనంగా చెపుతూంటుంది. చిలక్కొయ్యపై పిచ్చుకలు వాలటం, కవి తల్లిగారు ఉత్త పసుపు పుస్తెలతాడు వేలాడదీయటం, దానికి తగిలించిన సీమవెండి కేరేజీలో చప్పరింపు చప్పరింపుకు రంగులు మారే బిళ్లలు దాయటం, మూడో పురుషార్థ సాధనలో ఉన్న దంపతులను ఆ చిలక్కొయ్య నిర్వికారంగా చూడటం, ఈ ఒంటరి ప్రయాణంలో ఈదలేక నిష్క్రమిస్తూ అదే చిలక్కొయ్యకు ఆత్మను తగిలించటం -ఇవీ ఈ కవితలో కనిపించే వివిధ దృశ్యచిత్రాలు. అతి సామాన్యంగా కనిపించే వాక్యాలతో కవిత మొదలై ముగింపుకు వచ్చేసరికి అవే పదాలు మరో గొప్ప అర్థాన్నిచ్చే విధంగా మారతాయి. కవిత ప్రారంభంలో కనిపించిన కొయ్య చిలుక నెమ్మది నెమ్మదిగా కనుమరుగవుతూ, ఓ జీవితం కనిపించటం మొదలవుతుంది. అదీ శిఖామణి శైలి.

వీధిలో నగ్నంగా తిరిగే పిచ్చివాని గురించి వ్రాసిన “దిశమొల” అనే కవితలో అతనలా నగ్నంగా తిరగటం యొక్క స్పందనల్ని ఎన్ని పదచిత్రాలలో వర్ణిస్తాడో చూడండి.

చిలక్కొయ్య

– పల్లెల్లో పూతకొచ్చిన పత్తితోట తనమొదళ్లను తనే నరుక్కొంటుందట
– మగ్గంలో అటూ ఇటూ తిరుగుతున్న కండె నిలువునా రెండుగా చీలుతుందట
– పట్టుపురుగు పట్టుగూడులో ఆత్మబలిదానం చేసుకొంటుందట
– దేవదేవుని శేషవస్త్రపు కొంగుకు నిప్పంటుకొంటుందట
– సాలెపురుగు దీపపు కొస శూలాగ్రం మీద శిరచ్ఛేదనం చేసుకొంటుందట
– ఎవరికి వారు రహస్యంగా తమతమ మర్మావయవాలను మనసుల్లోనే తడిమిచూసుకొంటారట
– కన్నీళ్లను ఒత్తవలసిన చేతిరుమాలు జేబులోనే చెమరుస్తుందట

ఒక్కో పదచిత్రమూ ఆ దృశ్యాన్ని సన్నగా వర్షించటం మొదలెట్టి నెమ్మదినెమ్మదిగా కరుణార్ద్ర కుంభవృష్టిలో తడిచేట్లు చేస్తుంది. అందమైన గూడును అల్లుకొనే సాలెపురుగును కూడా వాడుకోవటంద్వారా ఈ కవి దృష్టి ఎంత నిశితమో అర్థమవుతుంది. సునిశిత దృష్టి, కరుణ, మానవత్వాలు అంతర్లీనంగా ప్రవహించే ఈ కవిత, శిఖామణి కవిత్వ తత్వానికి ఒక మినియేచర్ రూపమనవచ్చు.

ఒక పదచిత్రంలోనే రెండుమూడు చిత్రాల్ని ఇమడ్చటం చాలా కష్టం. శిఖామణి తన కవిత్వంలో ఇలాంటివి అలవోకగా సాధిస్తాడు. పల్లెటూరివ్యక్తి చేసే పట్నవాసాన్ని వస్తువుగా తీసుకొని వ్రాసిన “ఆంతరంగికుని ఉత్తరం” లో ఒకచోట

“అక్కడ చలిపెట్టే అధికారులుండవచ్చు
వినయపు ఉన్ని శాలువా మర్చిపోలేదు కదా”

అంటాడు. ఇక్కడ చలికి ఉన్నిశాలువా, అధికారులకు వినయం అనే రెండు భిన్న విషయాల్ని ఒకే చిత్రంద్వారా సాధించాడు. చలిపెట్టే అధికారులు అనటం కూడా ఒక వ్యంగ్యం. దీనివల్ల గాఢత, క్లుప్తత వచ్చి చెప్పాలనుకొన్న విషయం వెన్నుకు చలిచలిగ తగిలేట్టు చేస్తుంది.

“మేఘనా” అనే మరో కవితలో

“వెన్నెల మబ్బుల మెట్లమీదుగా నేలకు దిగే సమయాన
పూలగొంతుల్లో పరిమళపు పాట కూనిరాగాలు తీసేవేళ ”

వంటి వాక్యాలలో కూడా ఇలాంటి ప్రతిభే కనిపిస్తుంది. పేవ్ మెంట్ పై బతికే వృద్ధవనిత గురించి వ్రాసిన “వెన్నెల దుప్పటి” అనే కవిత శ్రీశ్రీ బిక్షువర్షీయసీ కవితను జ్ఞప్తికి తెస్తుంది. లోతైన పదచిత్రాలతో ఈ కవిత చదువరి హృదయాన్ని బరువెక్కిస్తుంది.

“ఆర్ధ్రత నీరెండిన నగరం నదిలో
ఆమె ఓ శిధిల నౌక …..
అర్ధరాత్రి దాటాకా
ఏ శీతలపవనమో ఆమెను ఒణికిస్తే
ముడుచుకుపడుకొన్న ఆమె దేహంమీద
చంద్రుడు వెన్నెల దుప్పటి కప్పి
చెట్టుకొమ్మకు లాంతరు దీపమై వేలాడుతాడు.”

వంటి వర్ణనలతో, శ్రీశ్రీ కవితలో కనిపించని లక్షణమేదో ఈ కవితలో ఉన్నట్టనిపిస్తుంది.

కర్ణాటకలో దేవాలయ ప్రవేశం చేసిన ఓ దళితునిచే మలం తినిపించారన్న వార్తకు శిఖామణి ఎంతో తీవ్రంగా స్పందించి వ్రాసిన “వాడే అశుద్ధమానవుడు ” అన్న కవితనిండా ఆవేశం భుగభుగలాడుతూ, చదువరి రక్తాన్ని మరిగించేలా చేస్తుంది.

“వాణ్ని కన్న నేరానికి
నిన్ను తూలనాడుతున్నాను క్షమించుతల్లీ.
….
ఒరే లంజా కొడకా
నీ పేరు మనిషా?”

అని మొత్తం మానవత్వాన్నే ప్రశ్నిస్తాడు. ఈ కవిత వ్రాసిన సమయానికి (1989) తెలుగు సాహిత్యంలో దళితకవిత్వం ఇంకా ఉద్యమస్థాయిలో మొదలవలేదు. ఈ కవితలో కులస్పృహకంటే మానవత్వమే కనిపిస్తుంది. ఒక సాటిమానవునికి జరిగిన అమానుషావమానాన్ని, ఈ కవిత అంతే ఫెరోషియస్‌గా ఎత్తి చూపుతుంది.

శిఖామణి కొన్ని కవితలలో తన గ్రామీణనేపథ్యం, బాల్యం తాలూకు జ్ఞాపకాలు కనిపిస్తూ ‘ఈయన తన బాల్యపు ముగ్ధత్వాన్ని ఎంత అందంగా దాచుకొన్నాడూ!’ అనిపిస్తాయి. ఉదా: తుమ్మచెట్టునీడలు, బొరియల్లో పీతలు, పాతబడ్డ టైరుని దొర్లించుకొంటూ సాగడాలు, మట్టిని పిసికి చేసే బళ్లూ, కొత్తనీటికి ఎదురెక్కి కిలకలు వేసే చేపపిల్లలు, కొలను గర్భంలో తామరతూడు తెగిన శబ్ధాలు, జామెట్రీ బాక్సులో దొంగిలించిన రబ్బరుముక్కలు మొదలైనవి. నాగరికజీవన స్పర్శతో ఈ అనుభవాలు క్షీణించిపోతున్నాయన్న ఆవేదన “ఆంతరంగికుని ఉత్తరం” అనే కవితలో కనిపిస్తుంది.

ఇంకా ఈ కవితా సంపుటిలో
బాల్యాన్ని ఈతాకుల చీపురు చేసి రైలు పెట్టి ఊడ్చే కుర్రాళ్లు (పాటల బండి),
బాల్యాన్ని మూరమూరచొప్పున కోసి అమ్ముకొనే పూలబ్బాయిలు (పూలబ్బాయి),
చీకటి ఆకాశపు ఆసుపత్రిలో చందమామలా వెలిగే నైట్ డ్యూటీ నర్సులు (ప్రమిదక్రింది చీకటి),
చీకటి కొండచిలువ నగరం చెట్టుకు చుట్టుకోవటం (వెన్నెల దుప్పటి),
నిద్రతో ప్రమేయం లేకుండానే ఒక మండే స్వప్నం కొరడాలతో హింసించటం (కలలనెమలి)
వంటి పదునైన అభివ్యక్తులెన్నో ఉన్నాయి.

పూలకుర్రాడు, కలలనెమలి, దేహి, పాటలబండి, మేఘనా, వెన్నెల దుప్పటి, ఆంతరంగికుని ఉత్తరం వంటి కవితలలో ఈ కవి ఎంతైతే భావుకతా, సున్నితత్వం చూపిస్తారో.. నిషేధాజ్ఞ, జలసర్పం, వాడే అశుద్ధమానవుడు, మాట డైనమైట్ అవుతుంది, కక్కుళ్లు, యుద్ధమూ అనివార్యమే వంటి కవితల్లో అంతకు మించిన వాస్తవికత, ఉద్వేగాన్ని ప్రతిబింబిస్తారు. అంటే రియాలిటీ తో తలపడవలసివచ్చినపుడు ఊహల్లోకి జారిపోయే తత్వం కాదీ కవిది. వాస్తవాన్ని ధైర్యంగా ఎదుర్కొని సాటిమనిషికి నమ్మకాన్నందించగలదు. ఈ లక్షణమే శిఖామణి కవిత్వాన్ని తెలుగు సాహితీరంగంలో ఉత్తమశ్రేణి కవిత్వంగా నిలిపి ఉంచుతుంది -ఎప్పటికీ!

వాస్తవాన్ని తన అనుభవంతో మిక్స్ చేసి సృష్టించే కవిత్వం పఠితను సరసరా తనలోకి లాక్కొంటుంది. రాసింది నాగురించే, ఇది నా ఆలోచనే అనుకొనేంత గాఢంగా. ఎందుకంటే..

Poetry is when an emotion has found its thought and the thought has found words. -Robert Frost

శిఖామణి

శిఖామణి

కాపీల కొరకు
విశాలాంధ్ర బుక్ హౌస్ (అన్ని బ్రాంచీలలో)

కవి చిరునామా:
శిఖామణి (శ్రీ. కె. సంజీవరావు )
ప్రొఫెసర్, తులనాత్మక అధ్యయన శాఖ
పొట్టిశ్రీరాములు తెలుగు యూనివెర్సిటీ
నాంపల్లి, హైదరాబాదు

(ఈ వ్యాసంలోని ఫోటోలను శిఖామణి గారి బ్లాగు నుండి తీసుకున్నాం)

శిఖామణి గురించి క్లుప్తంగా..
అసలు పేరు కర్రి సంజీవరావు. ఫుట్టింది 1957 అక్టొబర్ 30న తూర్పుగోదావరి జిల్లా యానాంలో. చదివింది తెలుగులో ఎం.ఎ, పి.హెచ్.డి. కందర్ప వెంకట నరసమ్మ, ప్రొ. అత్తలూరి నరసింహారావు, డా.సి.నారాయణరెడ్డి గార్లను తన కవితాజీవితయాత్రలో దారి దీపాలుగా పేర్కొంటారు. ఆయన రచనలు హిందీ, ఇంగ్లీషు, ప్రెంచి భాషల్లోకి అనువదించబడ్డాయి.
ఆయన బ్లాగు: http://sikhamani.blogspot.com/

——————-

బొల్లోజు బాబా

బొల్లోజు బాబా పుట్టింది యానాం. ప్రస్తుతం కాకినాడలో ప్రభుత్వ కాలేజీలో జూవాలజీ లెక్చరరుగా పనిచేస్తున్నారు. పుస్తక పఠనం, అప్పుడప్పుడూ ఆలోచనలను అక్షరాలలో పెట్టాలని ప్రయత్నించటం ఆయన అభిరుచులు.

ఆయన రచనలు:
1. 1954 లో ఫ్రెంచి వారి పాలననుండి యానాం ఏవిధంగా విముక్తి చెందిందో వివరించే “యానాం విమోచనోద్యమం” అనే పుస్తకం.
2. టాగోర్ రచించిన స్ట్రే బర్డ్స్ కు తెలుగు అనువాదం (ఈ లింకులో లభిస్తుంది)
ప్రస్తుతం కవితల సంపుటిని పుస్తకరూపంలో తీసుకు రావటానికి ప్రయత్నిస్తున్నారు.


బ్లాగు: http://sahitheeyanam.blogspot.com/

This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.

2 Responses to శిఖామణి – చిలక్కొయ్య

  1. ఉష says:

    బాబా గారు, ముందుగా కృతజ్ఞతలు. “Poetry is when an emotion has found its thought and the thought has found words. -Robert Frost” very true చక్కని సమీక్ష, కవి మనసుకి షడ్రుచుల భోజనం. “దిశమొల” ఒక్కటి చాలు మీరన్న వాస్తవాన్ని ధైర్యంగా ఎదుర్కొని సాటిమనిషికి నమ్మకాన్నందించగల కవి తత్త్వాన్ని తెలపటానికి. మానవత్వం, గాఢత, క్లుప్తత కరుణ, నాగరికజీవన స్పర్శతో ఈ అనుభవాలు క్షీణించిపోతున్నాయన్న ఆవేదన రంగరించారని మచ్చుక్కి మీరిచ్చిన ప్రతి పంక్తి అనూహ్యమైన భావావేశానికి లోనుచేస్తున్నాయి. శిఖామణి గారు, మీరు ఇద్దరు ఘనాపాటి కవులు. మిమ్మల్ని కవితల్లో స్పర్శించే మేము కవితాభిమానధనులం. నెనర్లు.

  2. malathi says:

    మీ విశ్లేషణ చాలా బాగుందండీ. ఒకొకప్పుడు, మూలం చదవకపోయినా, సమీక్షలో తెలుస్తుంది మూలరచయిత స్ఫూర్తి. ఆ అనుభవాన్ని మీరు అందించారు. అభినందనలు.

Comments are closed.