— కొడవటిగంటి రోహిణీప్రసాద్
మతాలూ, తాత్వికచింతనా మనుషులతోబాటుగా, ఇంకా చెప్పాలంటే మానవసమాజాలతోబాటుగా పరిణతి చెందినవే. అందుకే మతాల చరిత్ర తెలియాలంటే మానవసమాజాల చరిత్రను గురించి కూడా తెలుసుకోవాలి. మతధోరణులన్నీ మానవుల సామాజికప్రవర్తనలోని అంశాలే. మతాలు పరలోకాన్ని గురించినవని ఎందరు, ఎన్నిరకాలుగా అనుకున్నప్పటికీ, మతాల గురించిన స్పష్టమైన సాక్ష్యాలూ, ఫలితాలూ అన్నీ సమాజంలోనే కనబడతాయి. అందుకని మతాల ‘ఇహలోక’ చరిత్రను అధ్యయనం చెయ్యడమే పరిశీలకులకు ఆసక్తికరం అయింది.
ఈ పరిశీలనలు చాలాకాలంగా జరుగుతూ వస్తున్నవే. ముఖ్యంగా యూరప్ లో సాంస్కృతిక పునరుజ్జీవనం (రినేసాఁస్) మొదలయాక మేధావులు కొందరు రకరకాల విషయాల గురించి కొత్త పద్ధతుల్లో ఆలోచించడం, అప్పటిదాకా ఉన్న మతమౌఢ్యపు వైఖరిని విడనాడే ప్రయత్నాలూ చేశారు. పదిహేనో శతాబ్దంనాటికి పశ్చిమయూరప్ నావికులూ, దోపిడిదార్లూ ఓడలెక్కి సాహసవంతమైన దూర ప్రయాణాలు చెయ్యడం, కొత్తదేశాల ఆచూకీ తెలుసుకోవడం మొదలైనవన్నీ చేశారు. అందువల్ల సమాజమూ, సమాజనిర్మాణమూ, కట్టుబాట్లూ, మతమూ గురించిన అంతులేని కొత్త సమాచారం వచ్చి పోగుపడసాగింది. ప్రపంచం చాలా పెద్దదనీ, ఎన్నో విషయాల్లో ఎంతో వైవిధ్యం కలిగినటువంటిదనీ ఆలోచనాపరులు తెలుసుకున్నారు. ఒకవంక యూరప్ వలసప్రాంతాలను దోచుకుంటూ ఉంటే, మరొక వంక డార్విన్ వంటి పరిశీలకులు ప్రకృతివింతలనూ, ఇతరులు పురాతన సంస్కృతులనూ, సమాజాలనూ గురించిన కొత్త సమాచారాన్నీ విశ్లేషించసాగారు.
వారి అధ్యయనాలవల్ల కొత్త విషయాలు తెలిశాయి. ఇరాక్ లోని యూఫ్రటీస్, టైగ్రిస్ నదుల మధ్యనుండే మెసొపొటేమియాలోనూ, టర్కీలోనూ మొదలైన పశుపాలనా, వ్యవసాయమూ క్రీ.పూ. 5000 నాటికల్లా దక్షిణయూరప్ బాల్కన్ ప్రాంతానికీ, మరొక వెయ్యేళ్ళకు ఈజిప్ట్, మధ్యయూరప్ లకూ, మరొక వెయ్యేళ్ళకు బ్రిటన్ కూ వ్యాపించాయి. చైనాలోనూ, మనదేశంలోనూకూడా అటువంటివే పరిణామాలు జరిగాయి. వీరెవరికీ సంబంధం లేకుండా దక్షిణఅమెరికాలోకూడా కొత్తరాతియుగం మొద లయింది. ఇవన్నీ పరిశోధకుల దృక్పథాలను పూర్తిగా మార్చేసిన విషయాలు.. ఎటొచ్చీ, స్థిర నివాసాలకూ, వ్యవసాయం మొదలవడానికీ సంబంధం ఉందా అనేదాన్ని గురించిన విషయంలో అందుకు విరుద్ధమైన సాక్ష్యాలుకూడా ఇటీవల లభించాయి. వాటి గురించిన చర్చ మరోసందర్భంలో చెయ్యవచ్చు.
పరిశీలకులకు క్రమంగా కొత్తవిషయాలు తెలియసాగాయి. అతి ప్రాచీనకాలంలోనే మనుషులు మాట్లాడనేర్చారు. భాష, వ్యక్తులమధ్య సంపర్కం, ఆలుమగలూ, పిల్లలతో కూడిన కుటుంబవ్యవస్థా ఏర్పాటయాయి. సంచారజీవితం గడుపుతున్నప్పటికీ వారికి ప్రకృతిని గురించిన మంచి అవగాహనా, చావుపుటకల గురించిన తాత్వికచింతనా ఉండేవి. మొదట్లో లిపి లేకుండానే శబ్దరూపంలో ఉపయోగపడిన భాషలకు తరవాతి కాలంలో లిపి అవసరం ఏర్పడింది. పాటలూ, ఆటలూ, చిత్రలేఖనం, కాలగణనం మొదలైనవన్నీ వ్యవసాయసమాజాలు ఉద్భవించక మునుపే ఆరంభమయాయి. ఈ సమాజాల్లో వ్యక్తులమధ్య తలెత్తే పోటీలనూ, కొట్లాటలనూ కులపెద్దలే తీర్చేవారు. ఐక్యత లేని జాతి అప్పటి పరిస్థితుల్లో మనగలగడం కష్టంగా ఉండేది గనక ఈ వైఖరి వారి మనుగడకు తోడ్పడింది. ఇటువంటి ప్రవర్తన అసలైన మానవనైజానికి రూపాన్నివ్వసాగింది.
తొలి పరిశీలకులకు ఆధునికదృక్పథం ఏర్పడటానికి సమయం పట్టింది. ఎందుకంటే యూరప్‌లో పంతొమ్మిదో శతాబ్దంలో మొదలైన మానవశాస్త్రంలో మొదట్లో ప్రతి సంస్కృతినీ యూరప్‌తో పోల్చి విమర్శించడం, ఆ దృష్టితోనే అర్థంచేసుకోవడానికి ప్రయత్నించడం కనబడుతుంది. ఇది చాలా సంకుచితమైన పద్ధతి. మానవశాస్త్రం (ఆంత్రోపాలజీ), సామాజికమానవశాస్త్రం (సోషల్ ఆంత్రోపాలజీ) చరిత్రలో మానవజాతి సాధించిన పరిణతిని తెలియజేస్తాయి. నాటి పరిశీలకుల ఆలోచనలకు నేపథ్యం పారిశ్రామికవిప్లవం, ఫ్రెంచ్ విప్లవం మొదలైనవి. వాటి ఫలితంగా అంతకు పూర్వపు సామాజికసంబంధాలన్నీ అకస్మాత్తుగా నాశనం కాసాగాయి. ఇటువంటి అపూర్వమైన మేధోమథనం పరిశీలకుల వైఖరిని పూర్తిగా మార్చేసింది.
సరికొత్త ఆర్థిక, వాణిజ్యపరమైన మార్పుల నేపథ్యంలో మానవజాతిచరిత్ర యావత్తూ సింహావలోకనాలకూ, కొత్త విశ్లేషణలకూ లోనయింది. సిరిసంపదలకూ, హోదాలకూ, అధికారాలకూ అప్పటిదాకా ఉండిన అర్థాలన్నీ తారుమారు కావడం, సమాజంలో ఏది గొప్ప, ఎవరు గొప్ప, గౌరవ మర్యాదలంటే అర్థమేమిటి మొదలైన ప్రశ్నలూ పరిశీలకులకు సవాళ్ళు అయికూర్చున్నాయి. గతంలో జరిగిన పరిణామాల గురించి చింతకులు వితర్కించుకోసాగారు. సామాజికసంబంధాలు మార్పులేకుండా అనంతంగా కొనసాగలేవనీ, అదొక నిరంతర పరిణామక్రమంలోని భాగమేననీ అందరికీ అర్థం కాసాగింది. కొత్త పరిశ్రమలూ, వర్తకవాణిజ్యాలూ మేధావుల వైఖరులను విస్తృతం చెయ్యసాగాయి. జాతుల్లోని వైవిధ్యమూ, కాలానుగుణంగానూ, ప్రదేశాన్నిబట్టీ సంస్కృతుల్లో తలెత్తే మార్పులూ అన్నీ చింతకులకు అర్థం చేసుకోక తప్పని పరిస్థితి ఎదురయింది.
పారిశ్రామిక, సామాజికవిప్లవాల ప్రభావంతో అప్పటిదాకా ఉపయోగంలోలేని పదాలూ, భావాలూ, పరిభాషా భాషల్లోకి ప్రవేశించి, నేటికీ కొనసాగుతున్నాయి. పరిశ్రమలు, పారిశ్రామికవేత్తల ప్రస్తావన, ప్రజాస్వామ్యం, వర్గం, మధ్యతరగతి, మేధావి, హేతువాదం, మానవీయదృక్పథం, అణు సిద్ధాంతం, సామాన్యప్రజానీకం, వ్యాపారసరళి, శ్రామికవర్గం, సామూహికతత్వం, సమానత్వం, ఉదారవాదం, వెనకబాటుతనం, విజ్ఞానవేత్త, బ్యూరోక్రసీ, పెట్టుబడిదారీవ్యవస్థ, సంక్షోభం, ప్రయోజన వాదం మొదలైన పదాలన్నీ అప్పట్లో కొత్తగా సృష్టి అయినవే. ఈ మాటలన్నీ అప్పటి కొత్త సాంఘిక అవగాహనకు సూచికలు.
1750-1850 మధ్యకాలంలో యూరప్ జనాభా 14 కోట్లనుంచి 26.6 కోట్లకీ, ప్రపంచజనాభా 72.8 కోట్లనుంచి వందకోట్లకీ పెరగడంతో బ్రిటిష్ మేధావి మాల్థస్ (1766-1834) ప్రజల సంక్షేమం గురించిన తన ఆందోళనను వెలిబుచ్చాడు. రోగాలూ రొష్టులవల్ల ప్రజలు చనిపోయే అవకాశాలు సన్నగిలడంతో ప్రపంచజనాభా అంతులేకుండా పెరిగిపోతుందనీ, దానికి సరితూగే ఆహారోత్పత్తి జరగడం అసాధ్యమనీ అతను చెప్పాడు. ఇలా ప్రపంచస్థాయిలో ఆలోచించి అంచనాలు వెయ్యడం అప్పట్లో మొదలైన కొత్త ధోరణి. మరొకవంక అప్పట్లో కొత్తగా ఏర్పాటైన కార్మికవర్గపు పరిస్థితుల గురించి రచయితలూ, కార్ల్ మార్క్స్ తదితర పరిశీలకులూ తీవ్రమైన ఆందోళన వ్యక్తం చెయ్యసాగారు.
సామాజికమానవశాస్త్ర అధ్యయనం మొదలైన కాలంలోనే భూస్వామ్యయుగం అంతమై సిరిసంపదలకు కొత్తరూపాలు ఏర్పడసాగాయి. అవన్నీ కంపెనీ షేర్లూ, బాండ్లుగా, పరిశ్రమల, వ్యాపార సంస్థల, కార్ఖానాలుగా అవతారాలు ఎత్తాయి. ఇవన్నీ శాస్త్రవేత్తల పరిశీలనలను గాఢంగా ప్రభావితం చేసిన విషయాలు. పంతొమ్మిదో శతాబ్దం వైజ్ఞానికదృక్పథాన్నే మార్చెయ్యసాగింది. మతమంటే ఏమిటి? అది ఎన్నిరకాలుగా ఉండే అవకాశం ఉంది? సమాజంలో మతం పాత్ర ఎటువంటిది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలను నిష్పాక్షిక వైఖరితో, స్వపర భేదాలను పక్కన పెట్టి విశ్లేషించాలనే దృక్పథం నెమ్మదిగా రూపొందింది. అప్పుడు మొదలైన శాస్త్రీయపరిశోధనల ధోరణి కాలంతోపాటు మెరుగవుతూ మానవ జాతి ఇప్పటివరకూ సాధించిన సామాజికపరిణతిని అర్థం చేసుకోవడానికి తోడ్పడింది.
————————
కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు సంగీతమ్మీద ఆసక్తితో హిందూస్థానీ శాస్త్రీయ సంగీతాన్ని, కర్ణాటక సంగీతాన్ని మథించి దేశవిదేశాల్లో అనేక ప్రదర్శనలివ్వడమేగాక ఎన్నో ప్రదర్శనలకు సంగీత దర్శకత్వం వహించారు. తండ్రి (కొడవటిగంటి కుటుంబరావు) వద్దనుంచి వారసత్వంగా వచ్చిన రచనాసక్తితో సైన్సు గురించి, సంగీతం గురించి తెలుగులో సరళమైన రచనలెన్నో చేశారు. కొన్ని పత్రికల్లో శీర్షికలు కూడా నిర్వహించారు. ఇవన్నీ అలా ఉంచి వృత్తిరీత్యా ఆయన అణుధార్మిక శాస్త్రవేత్త! చాన్నాళ్ళ కిందటే తెలుగులో బ్లాగులు (http://rohiniprasadk.blogspot.com, http://rohiniprasadkscience.blogspot.com) రాయడం మొదలుపెట్టారు.
ఎంతో ఆవేశంగా మెదలైన వ్యాసం ఆశల్ని రేపింది. కానీ, నిరాశనే మిగిల్చింది.
మహేశ్కుమార్గారూ, క్షమించాలి. సామాన్యంగా నేను రాసే వ్యాసాలు ఒక శృంఖలలాగా నడుస్తాయి. దేనికదిగా చదివేకన్న సీరీస్ మొత్తం చదువుతూ ఉంటే ఒక అభిప్రాయం ఏర్పడుతుందేమో. ప్రస్తుతం నేను రాస్తున్నవి మతాలు సమాజాల్లో పుటుకొచ్చిన నేపథ్యాన్ని గురించినవి.
రోహిణీ ప్రసాదు గారు,
మీరు కాస్త తీరిక చేసుకుని కాస్త పెద్ద వ్యాసాలు వ్రాయాల సారు. ఈ వ్యాసం లాంటి వ్యాసాలు, వ్యాసాల్లాకాక, వ్యాసానికి ఉపోద్ఘాతానికి, ఉపోద్ఘాతంలా వున్నాయి. ఇంతగా సంక్షిప్త పరచిన వ్యాసాల్లో నేర్చుకోవాల్సినది, ఆలోచించదగ్గది పూర్తిగా నిండుకుంటుంది. కట్టె, కొట్టె, తెచ్చె అంటే ఎలా సారు. రామాయణవైతే చిన్నప్పుడునుంచి వింటున్నావు, కట్టె, కొట్టె, తెచ్చె అన్నా అర్థవవుతుంది. మీ అభిప్రాయాలు మాత్రం మరింతగా వివరించాల్సిన అవసరవుందని నా అభిప్రాయం.
రవికిరణ్ తిమ్మిరెడ్డి.
రవికిరణ్గారూ,
ఈ వ్యాసాల్లో నాకు చాలా ఆసక్తికరమైన విషయాలున్నాయి. మానవసమాజాలు ఎప్పుడు, ఎలా ఏర్పడ్డాయి? వారికి తాత్వికచింతన ఎప్పుడు, ఎందుకు అవసరమయింది? ఈ పరిణామం సమాజంలో శ్రమవిభజనకూ, ఆ తరవాత శ్రమించేవీ, శ్రమించనివీ వర్గాలుగా ఎలా విడిపోయింది? మనుషుల ఆలోచనలూ, జీవనశైలీ జన్యువులను ఎలా ప్రభావితం చేశాయి? మనుషులు వివిధ స్థలాల్లో వివిధ జాతులుగా, వేరువేరు రూపురేఖలు కలిగి ఎలా విడిపోయారు? వారి సముదాయాలు పరస్పరం ఎదురైనప్పుడు ఎందుకు వైషమ్యాలు తలెత్తి యుద్ధాలకు కారణమయాయి, వగైరా వగైరా. వీటన్నిటికీ సంబంధం ఉంటుంది.
వీటి చర్చ త్వరగా తేలే విషయం కాదుగదా. క్లుప్తంగా చెప్పేకన్నా పాఠకులను విసిగించకుండా ఒక్కొక్క వ్యాసంలోనూ కొన్నేసి విషయాలనే ప్రస్తావిస్తున్నాను. అందరు పాఠకులకూ మీకున్నంత ఆసక్తీ, ఓపికా ఉండవనుకుంటాను. నా వ్యాసాలన్నీ సబ్జక్టువారీగా సంకలనాలుగా రాబోతున్నాయి. సీరియస్ పాఠకులకు అవి కాస్త పనికొస్తాయని ఆశ. పైగా నేను ఏది రాసినా సామాన్యపాఠకుడుగా, సామాన్యపాఠకుల కోసమని రాస్తాను. గతంలో చెప్పినట్టుగా నేను చదివినది న్యూక్లియర్ ఫికిక్స్. ఆ లెక్కన ఈ వ్యాసాలన్నీ ‘అధికప్రసంగమే” 🙂
ప్రస్తుత వ్యాసంలో సమాజశాస్త్రం పట్ల ఆసక్తి ఎప్పుడు మొదలైందో, అందులో కృషి చేసినవారి నేపథ్యం ఎటువంటిదో వివరించే ప్రయత్నం చేశాను. ఉదాహరణకు సింధునాగరికత గురించి మొదట కనిపెట్టినది పంతొమ్మిదో శతాబ్దపు బ్రిటిష్ పరిశోధకులే. మనవాళ్ళు అక్కడే ఉంటున్నప్పటికీ చరిత్రను గురించి ఆసక్తి కనబరిచి, కాస్త శాస్త్రీయపద్ధతిలో పరిశీలనలు మొదలుపెట్టినవారు యూరొపియన్లే. అందుకు కారణం వారు సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని చవిచూడడం, వలస ప్రాంతాలను ఆక్రమించుకోవడం వగైరాలు. అప్పటి పరిశీలనల ఆధారంగానే ఈనాడు ప్రపంచవ్యాప్తంగా మేలురకం పరిశోధనలు జరుగుతున్నాయి కనక ఈ శృంఖలలో వీటిని ప్రస్తావించాను. ఈ వ్యాసంలో మరిన్ని విషయాలు చేర్చటం అనవసరమనిపించింది.
మీ వ్యాసాలు అరుణతారలో ఎప్పటినుంచొ ఫాలో అవుతున్నా. ఇక్కడ స్పేస్ సమస్యవలన కుదించారా?