ఆవృతం

-మధురవాణి

బాల్కనీ రెయిలింగ్ మీద రెండు చేతులూ ఆన్చి, నిలబడి చూస్తూ ఉంటే చక్కగా తీర్చిదిద్దిన వెనకింటివాళ్ల తోట కనిపిస్తూంది. సాయంకాలపు నీరెండలో ఆ తోటలో విరిసిన పూవులన్నీ మెరుస్తూ గాలి తెమ్మెరలు వచ్చినప్పుడల్లా తలలు ఊపుతున్నాయి. సాయంత్రంపూట కాస్త తొందరగా ఆఫీసు నుంచి వచ్చిన రోజు, బాల్కనీలో కూర్చుని కాఫీ తాగుతూ ఆ తోట చూడటం నాకు చాలా హాయిగా అనిపిస్తుంది. ఉదయం నుంచీ పడ్డ కష్టమంతా ఎగిరిపోయి, మనసు హాయిగా సేదతీరుతున్నట్టుగా ఉంటుంది.

అమ్మ బాధలన్నింటికీ మూలం ఏమిటి అని తీవ్రంగా ఆలోచించాను. కనీసం రోజుకొకసారైనా ‘నువ్వు ఇక్కడ లేవు’ అంటుంది కదా, నేను తన దగ్గరికి వెళ్ళిపోతే ఈ సమస్యలన్నీ పరిష్కారమౌతాయేమోనని అనిపించింది. ఆ తర్వాత కొద్ది రోజులకే తట్టాబుట్టా సర్దేసుకుని అమెరికా నుంచి తిరిగి వచ్చేసాను. అమ్మానాన్నలతో పాటు ఒక చిన్న ఇంటిలోకి మారాను. ఇంక అంతా సంతోషమే అనుకున్నాను.

ఈ రోజు ఆ వెనకింట్లో కాస్త హడావిడిగా ఉంది. దానిక్కారణం రెండ్రోజుల క్రితమే ఆ ఇంట్లోకి దిగిన కొత్త కుటుంబం. ఆ కుటుంబ యజమాని ఓ ముప్పయ్యేళ్ళ యువకుడు. ఇంకా అతని భార్య, వాళ్ళ మూడేళ్ళ బుడతడు, ఆ యువకుడి తల్లి ఉన్నారని సీత చెప్పింది మొన్నే. కాఫీ పూర్తిచేసి ఏదో వీక్లీ చూస్తూ బాల్కనీలో కూర్చున్న నాకు, వెనకింటి తోటలోనుంచి ఆ యువకుడి తల్లికి, అతడికీ మధ్య జరిగే సంభాషణ వినిపించింది. ‘ఏరా అబ్బాయ్.. అసలు ఈ కొత్త ఇల్లు ఏమీ బాగులేదురా నాయనా, చుట్టుపక్కలవాళ్ళు కూడా అదో మాదిరిగా అనిపిస్తున్నారు’ అంటూ మొదలెట్టింది. ఆ అబ్బాయేమో ‘అలా కాదులే అమ్మా, ఈ చుట్టుపక్కల అందరూ మర్యాదస్తులే, నువ్వేమీ కంగారు పడకు’ అని సర్దిచెప్పే ప్రయత్నం చేసాడు. ‘అసలు ఇంత పెద్ద పెరడు ఉన్న ఇల్లెందుకురా అంటే వినలేదు నువ్వు. అయినా ఎంతకాలం ఇలా అద్దె కొంపలో తిప్పుతావురా ఈ ముసలిదాన్ని. నీ తోటోడు మన సూరమ్మత్త కొడుకు రవిబాబు మొన్ననే ఒక అపార్టుమెంటు కొన్నాడంట తెలుసా… నువ్వేమో రెండేళ్ళు అమెరికాలో ఉండొచ్చినా ఇప్పటిదాకా ఏమీ కొనలేదు.’ ఇలా సాగిపోతోంది ఆవిడ వాక్ప్రవాహం. వాళ్ళ సంభాషణ నా చెవిన పడగానే, నాలో గతం తాలూకు జ్ఞాపకాల తుట్టె కదిలినట్టయింది. మనసు గతంలోకి పరుగులు తీసింది.

అమ్మ… చిన్నప్పటి నుంచీ ‘అమ్మా, అమ్మా’ అని ఎప్పుడూ అమ్మ వెనకాలే తిరిగేవాణ్ణి. పెద్దమ్మలూ, పిన్నులూ అందరూ అమ్మని ‘ఏంటే జయా.. నీ కొడుకు ఎప్పుడూ నీ కొంగట్టుకు తిరుగుతాడు. ఎంత ప్రేమే నువ్వంటే’ అనేవారు. అమ్మ ఎప్పుడైనా ఒక రెండ్రోజులు ఏ బంధువుల పెళ్ళికో వెళ్తే అసలు ఆ రెండు రోజులు ఎంతకీ గడిచేవే కాదు. నాన్న నాతోనే ఉన్నాగానీ, అమ్మ ఇంకెప్పుడొస్తుందా అని తెగ ఎదురుచూసేవాడిని. అమ్మ రాగానే నాన్న ‘నువ్వు లేని ఈ రెండు రోజులు నీ కొడుకు మొహం చూడలేకపోయననుకో’ అని చెప్పేవారు. అమ్మేమో ‘ఏరా’ అని అడిగితే ‘నేను బాగానే ఉన్నానమ్మా’ అని చెప్పేవాడిని. ఎప్పుడైనా అమ్మకి కాస్త ఒంట్లో నలతగా ఉంటే ఇల్లు చిమ్మడం, గిన్నెలు కడగడం, అన్నం వండటం లాంటి పనులన్నీ నేనే చేసిపెట్టేవాడిని. ఏ విషయంలో అయినా అమ్మకి ఏ ఇబ్బందీ కలగకుండా చూసుకోవాలనిపించేది ఎప్పుడూ. నాకు ఊహ తెలిసినప్పటినుంచీ కూడా ఇంటి ఆర్థిక పరిస్థితి తెలుసుకుని మసలుకునేవాణ్ణి. చిన్నప్పటి నుంచీ కూడా ఫలానా వస్తువు కావాలని ఎప్పుడూ మారాం చేసినట్టు గుర్తు లేదు నాకు. డిగ్రీ అయ్యేంతవరకు అమ్మ తీసుకొచ్చిన బట్టలు ఏవైనా సంతోషంగా వేసుకునేవాణ్ణే తప్ప నేనుగా కొనుక్కోడానికి వెళ్ళిన గుర్తే లేదు. ఇంట్లోవాళ్ల స్తోమతని అర్థం చేసుకుని చిన్నప్పటి నుంచీ గవర్నమెంటు స్కూల్లోనూ, కాలేజీలోనూ చదువుకుని యూనివర్శిటీలో సీటు సంపాదించి నామమాత్రపు ఫీజులతో, స్కాలర్షిప్పులతో ఎలాగో పోస్టు గ్రాడ్యుయేషన్ దాకా లాగించేసాను. యూనివర్శిటీలో హాస్టల్లో ఉండి చదువుకునే రోజుల్లో నాలుగైదు నెలలకోసారి ఇంటికెళ్ళి వచ్చేవాడిని. అప్పట్లో అమ్మని వదిలేసి మొదటిసారి రావడం వల్ల నాకూ, తనకీ కూడా కాస్త బెంగగానే ఉండేది. కాకపోతే నా ఆర్థిక పరిస్థితి రీత్యా వారం పది రోజులకోసారి మాత్రమే ఇంటికి ఫోన్ చేసి మాట్లాడే అవకాశం ఉండేది. కానీ ఆ మాట్లాడే పది నిమిషాలైనా ఎంతో ఆప్యాయంగా సాగిపోయేది మా మధ్య సంభాషణ. యూనివర్శిటీ చదువయ్యాక చాలా కష్టం మీద అమెరికాలో ఉద్యోగం దొరికింది, అది కూడా డబ్బు ఖర్చు పెట్టే అవసరమేమీ లేకుండా! నా భవిష్యత్తు దృష్ట్యా, కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని అమెరికా బయలుదేరాను.

అమెరికా వెళ్ళేప్పుడు కూడా అమ్మకి దూరంగా వెళ్తున్నందుకు చాలా బాధగా అనిపించినా వాళ్లకు మెరుగైన జీవితాన్ని ఇవ్వడం కోసం కొన్నాళ్ళు దూరంగా వెళ్ళక తప్పదనిపించింది. ‘నువ్వేం బెంగ పడకమ్మా, నేను తరచూ ఫోన్ చేస్తుంటాను’ అని చెప్పి బయలుదేరాను. వెళ్ళిన రోజు మొదలు, ప్రతీరోజు ఫోన్ చేసి, కనీసం పదిహేను నిముషాలు మాట్లాడేవాడిని. మొదట్లో ఒక రెండు మూడు నెలలు బానే గడిచాయి. ఆ తరవాత ఎప్పుడు ఫోన్ చేసినా అమ్మ బాధగా, విసుగ్గానే మాట్లాడేది. ‘నీకేం హాయిగానే ఉన్నావు అక్కడ. నేను, నాన్న ఒంటరి వాళ్ళయిపోయాము. మమ్మల్ని వదిలేసి నువ్వు ఎగిరిపోయావు’ అనేది. అమ్మానాన్నలు ఉండే ఊరిలోనే అక్క, బావ ఉంటారు వాళ్ళ ఇద్దరు చిన్నపిల్లలతో. ఇంకా చాలామంది బంధువులు కూడా ఉన్నారు. పైగా దాదాపు ఇరవయ్యేళ్ళ నుంచీ ఉన్న ఊరు కావడం చేత చుట్టు పక్కలంతా కూడా అందరూ తెలిసినవాళ్ళే ఉంటారు. అయినాగానీ ఉన్న ఒక్క కొడుకు దూరంగా ఉండేసరికి అలా బాధపడుతోంది పాపం అని ఎంతో సముదాయించేవాడిని. అమ్మకి కాస్త కూడా పని ఒత్తిడి ఉండకూడదని ప్రతీదానికీ పని మనుషులు, ఇంట్లో అన్ని సౌకర్యాలు అమర్చిపెట్టాను. తరవాత కొన్ని రోజులకి బంధువుల గురించి ఎప్పుడూ చెప్పి బాధ పడేది. వాళ్ళెవరో వచ్చి పలకరించలేదనీ, ఆ మాట అన్నారనీ, అదనీ, ఇదనీ చెప్పేది. ప్రతీదానికీ ఓపికగా సర్దిచెప్పి తన బాధను తగ్గించే ప్రయత్నం చేసేవాడిని. ఒకోసారి ‘నాన్నగారు అలా ఉంటున్నారు, ఇలా ఉంటున్నారు’ అని బాధపడేది. మరోసారి అక్క మీద, బావ మీద ఏవేవో చెప్పి బాధపడేది. ‘ఎందుకమ్మా అలాగా అనవసరంగా అన్నిటికీ ఎక్కువ ఆలోచిస్తావు. నీకు ఇంతమంది ఉన్నాము కదా, ఎందుకు అనవసరంగా ఆందోళన పడతావు’ అని ఎన్నెన్నో మాటలు చెప్పేవాడిని. రోజుకి గంట పైగా మాట్లాడిన రోజులెన్నో. ఎంత బిజీ పనుల్లో ఉన్నాకూడా క్రమం తప్పకుండా అమ్మకు మాత్రం ఫోన్ చేసేవాడిని. ‘పోనీలే, ఏది ఏమైనా నేను అర్థమయ్యేట్టు వివరించి చెప్తే అమ్మ దేనికీ బెంగ పెట్టుకోకుండా ఉంటుంది’ అనుకుని ఎప్పుడూ ఓపికగా ఏవేవో మాటలు చెప్తూ ఉండేవాణ్ణి.

రానురానూ ఎంత సర్దిచెప్పినప్పటికీ, రోజు రోజుకీ అమ్మ నుంచి ఫిర్యాదులు ఎక్కువవవుతూ వచ్చాయి. దాంతోపాటే, నా ఓపిక కూడా పెంచుకుంటూ వచ్చాను. అమెరికా వెళ్ళిన బంధువుల అబ్బాయెవరో ఆర్నెల్లు తిరక్కుండానే ఎన్నో లక్షలు పంపిస్తే వాళ్ళు సొంత ఇల్లు కొనుక్కున్నారనీ, ఇంకో అబ్బాయెవరో వాళ్ళ అమ్మానాన్నల ముప్పయ్యో పెళ్లిరోజు ఘనంగా పండుగలాగా చేశాడనీ ఇలా ఏవేవో చెప్పేది. మొదట్లో నేను ఊరికే నాకు కబుర్లు చెప్తూంది అనుకున్నాను గానీ ఇలాంటివన్నీ నేను తన కోసం చేయట్లేదని అంటోందని అర్థం చేసుకోలేకపోయాను. తర్వాత్తర్వాత తనేది మాట్లాడినా తనది కోరుకుంటుందేమోనని సాధ్యమైనంతవరకు నెరవేర్చడానికే ప్రయత్నించేవాడిని. కాస్తో కూస్తో బంగారమనీ, ఇంట్లో వస్తువులనీ ఎప్పుడు ఏది అడిగినా నేను ‘నీకేది నచ్చితే అది చేయి’ అని చెప్పేవాడిని. నాకు సాధ్యమైనంత వరకు అన్నీ సమకూర్చడానికే ప్రయత్నించేవాడిని. వాళ్లకి కాస్త సౌకర్యవంతంగా ఉంటుందని కొంచెం పెద్దయింటికి మారమని చెప్పాను. ‘సొంత ఇల్లయితే మారతాము, లేకపోతే లేదు’ అంది అమ్మ. ‘అమ్మా, అందరితో మనకి పోల్చుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎక్కడ మొదలయ్యాము, ఇన్నేళ్ళు ఎలా బతికాము అనేది ఎప్పుడూ మర్చిపోకూడదు. ఒకప్పటికంటే మన పరిస్థితి ఎంతో మెరుగయ్యింది కదా. ఇల్లైనా ఏదయినా మెల్లగా సమకూర్చుకునే ప్రయత్నం చేద్దాము. ఇప్పటికి ఇలా కానివ్వండి’ అని చెప్పాను. ‘అలా కాదు, మనం ఏదో ఒకటి కొని తీరాల్సిందే, అయినా ఇదంతా నీ కోసమేగానీ నాకోసం కాదు’ అని బాగా గొడవ చేసింది. చివరికి పరిస్థితి ఎలా అయిందంటే ఒక ఆర్నెల్ల పాటు రోజూ ఫోనులో ఇవే మాటలు. చివరికి నా వల్ల కాదని ‘ఇల్లయితే కొనలేము గానీ ఒక లోను తీసుకుని ఏదయినా స్థలం కొందాములే’ అని ఎలాగో ఒకలాగా తిప్పలు పడి ఒక చిన్న స్థలం కొన్నాము. ఇక అంతటితో అయిపోయిందిలే, అమ్మ బెంగ తీరిపోయింది ఇకనుంచి అందరం సంతోషంగా ఉండవచ్చు అనుకున్నాను. కానీ, అది నా అత్యాశే అయింది. ఇల్లు అనే అంశం మారింది అంతే గానీ అమ్మకున్న చింతలు తీరలేదు.

‘అసలు అమ్మకి ఉన్న సమస్యేమిటి? తనకి ఏ చీకూ చింతా లేకుండా ఉండాలని ప్రతీ క్షణం నేనెంత ఆరాటపడుతూ ఉంటానో, తనని ప్రశాంతంగా సంతోషంగా ఉంచాలని ఎంతగా తపిస్తానో కదా! అయినా, నేను తనని సంతృప్తిగా ఉంచలేకపోతున్నానా లేక తనే ఉండలేకపోతోందా?’ అని నేను ఆలోచించని రోజు లేదు. అసలు అమ్మ బాధలన్నింటికీ మూలం ఏమిటి అని తీవ్రంగా ఆలోచించాను. కనీసం రోజుకొకసారైనా ‘నువ్వు ఇక్కడ లేవు’ అంటుంది కదా, నేను తన దగ్గరికి వెళ్ళిపోతే ఈ సమస్యలన్నీ పరిష్కారమౌతాయేమోనని అనిపించింది. ఆ తర్వాత కొద్ది రోజులకే తట్టాబుట్టా సర్దేసుకుని అమెరికా నుంచి తిరిగి వచ్చేసాను. అమ్మానాన్నలతో పాటు ఒక చిన్న ఇంటిలోకి మారాను. ఇంక అంతా సంతోషమే అనుకున్నాను. కానీ, అమ్మకి మాత్రం అప్పుడు కూడా సంతోషం లేదు. మళ్ళీ బాధల చిట్టా మొదలు. నేను ఇదివరకులా మాట్లాడటం లేదనీ, బంధువులెవరో సరిగ్గా మాట్లాడలేదనీ, అక్క మారిపోయిందనీ… ఎప్పుడూ ఇలాంటివే కష్టాలు కాని కష్టాలు, బాధలు కాని బాధలు అమ్మకి. రోజురోజుకీ అమ్మకి అసంతృప్తి పెరిగిపోతూ ఉంటే, తనకి సర్దిచెప్పడానికి ప్రయత్నించి నా ఓపిక తరిగిపోతూ వచ్చింది. ఏ వ్యాపకమూ లేకపోతే విసుగ్గా ఉంటుందని ఏదో ఒకటి చేయమంటే అందులో కూడా పెడర్థాలు మొదలయ్యాయి. వీటన్నిటితో ఇల్లు ఒక చిన్న సైజు నరకంలాగా తయారయింది. క్రమంగా కొంతకాలానికి అమ్మ ఏది మాట్లాడినా విని ఊరుకోవడమే తప్ప నేనేమీ బదులు మాట్లాడని స్థితికి వచ్చాను. ఒకప్పుడు అమ్మ చుట్టూనే తిరిగే నా ఆలోచనల్లో ఎంతో మార్పు వచ్చింది. మునుపటిలా ‘ఎందుకిలా జరుగుతోంది, నేను అమ్మను సంతోషంగా ఉంచలేనా’ అని నాలో నేనే ప్రశ్నలు వేసుకోవడం, నాలో నేనే మధనపడిపోవడం తగ్గిపోయింది. అలా అని తన మీద కోపమేమీ పెట్టుకోలేదు. కానీ, అమ్మ ఎందుకిలా ఆలోచిస్తుంది అని తీవ్ర మానసిక క్షోభకి గురి కాకుండా తనని కేవలం ఒక వింత మనస్తత్వం ఉన్న వ్యక్తిగా మాత్రమే చూస్తూ వచ్చాను. తన మనస్తత్వం ఇంతే అని సర్ది చెప్పుకుని తనని మార్చాలనే వ్యర్థ ప్రయత్నం మానుకున్నాను.

అమ్మ నన్ను శాశ్వతంగా వదిలి వెళ్ళిపోయిన ఇన్నేళ్ళ తరవాత ఈవేళ మళ్ళీ తన జ్ఞాపకాల వెల్లువ నన్ను ముంచెత్తింది. ఒకసారి గతంలోకి తరచి చూసి నేను తనని సంతోషంగా ఉంచగలిగానా అని నన్ను నేను ప్రశ్నించుకుంటే అవునో కాదో చెప్పలేని పరిస్థితి నాది. నా ఆలోచనలకు తగినట్టుగా తను సంతోషంగా లేకపోయినా, తనకి నచ్చినట్టుగా ఎప్పుడూ ఏదో ఒకటి సరిగ్గా లేదని బాధపడుతూ, అసంతృప్తిగా జీవితం గడపడంలోనే తనకి సంతోషం ఉందేమోననిపిస్తోంది. ఏదేమైనా ఈ క్షణం అమ్మ ఈ లోకంలో లేకపోయినా, బాధ, సంతోషం కలగలిపిన ఒక చిత్రమైన భావాన్ని నా జీవితంలో వదిలి వెళ్లిందనేది తలచుకుంటే ఇదొక విచిత్రబంధం అనిపిస్తుంది. ఇలా నా ఆలోచనా స్రవంతి సాగిపోతుండగా, సీత వచ్చి భోజనానికి రమ్మని పిలవడంతో గతంలోనుంచి ప్రస్తుతంలోకి వచ్చాను. భోజనాల దగ్గర సీత అంటోంది ‘ఏవండీ.. వెనకింట్లోకి కొత్తగా వచ్చారే, ఆ కుటుంబం మీకు బాగా నచ్చారనుకుంటాను కదూ!’ అదేం..అలా అడిగావు అన్నట్లు చూసాను నేను సీత వైపు. ‘ఏమీ లేదు.. మీరు వాళ్ళని చూడగానే రెండు గంటల సేపు యోగనిద్రలోకి వెళ్లిపోయినట్టున్నారు కదా అందుకే అలా అన్నాను’ అని ముసిముసిగా నవ్వింది. ‘ఎంతైనా సహధర్మచారిణి కదా! నాలో ఇప్పటిదాకా చెలరేగిన ఆలోచనలను ఇట్టే పసిగట్టేసింది కాబోల’నుకుని నేనూ తనతో నవ్వు కలిపాను.

—————————-

మధురవాణి తెలుగు భాషలో ఉన్నదేదయినా చదవడానికి అమితంగా ఇష్టపడతారు. గతేడాది నుండి మధురవాణి.. తెలుగువాణి అనే బ్లాగు రాస్తున్నారు. వీలుని బట్టి తెలుగు కథలు, నవలలు, బ్లాగులు చదవుతూంటారు. వృత్తిరీత్యా ప్రస్తుతం జర్మనీలో జీవశాస్త్ర సంబంధిత పరిశోధనలో డాక్టరేటు కోసం పని చేస్తున్నారు.

About మధురవాణి

"తెలుగు భాషలో ఉన్నదేదయినా చదవడానికి అమితంగా ఇష్టపడే నేను గతేడాది నుండి http://madhuravaani.blogspot.com అనే బ్లాగు రాస్తున్నాను. వీలుని బట్టి తెలుగు కథలు, నవలలు, బ్లాగులు చదవడం నాకు ఇష్టమైన పని. వృత్తిరీత్యా ప్రస్తుతం జర్మనీలో జీవశాస్త్ర సంబంధిత పరిశోధనలో డాక్టరేటు కోసం పని చేస్తున్నాను."
This entry was posted in కథ. Bookmark the permalink.

15 Responses to ఆవృతం

  1. మాలతి says:

    “మీరు వాళ్ళని చూడగానే రెండు గంటల సేపు యోగనిద్రలోకి వెళ్లిపోయినట్టున్నారు” – 🙂
    అమ్మగురించినతలపులలో తీయదనం బాగా చూపించారు. “అమ్మబాధలన్నిటికీ మూలం ఏమిటో తీవ్రంగా ఆలోచించినా”, తేల్చుకున్నట్టు కనిపించలేదు చివరకి. తొలిప్రయత్నంగా అభినందించదగ్గది. బాగుంది.

  2. హను says:

    ఎంత చక్కగా రాసారండి….రాసింది అమ్మ గురించి ఐనా మనషుల మధ్య వ్యత్యాసాన్ని చక్కగా చూపించారు.
    నిజం చెప్పాలి అంటే ఇప్పుడున్న బిజీ ప్రపంచం లో ఎవరి పని తో వారికే సరిపోతుంది.ఇంక అలాంటప్పుడు మనచుట్టూ ఉండే అందర్నీ మెప్పించగలడం ఎవ్వరికి సాధ్యం కాదు.ఇక్కడ ఎవ్వరిని తప్పుపట్టలేము.ఎవరి ఆలోచనలు వారివి.ఒక చక్కని కథ ని అందిచారు.కృతజ్ఞతలు.

    –హను

  3. కధాంశం, ఎత్తుగడ బాగుంది. పోను పోను నరేషన్‌లోకి వెళ్ళిపోయి చివరికొచ్చేసరికి పల్చబడిపోయింది. ఈ విషయం గురించి ఇంకొంచెం లోతుగా వెళ్ళి “అమ్మ” మనసులో వున్నదేమిటో తెలుసుకుంటే బాగుండేదేమో..!!

  4. శారద says:

    మీరు చాలా సున్నితమైన అంశాన్ని లేవనెత్తారు. మన కిందటి తరం (ముఖ్యంగా ఆడవాళ్ళలో) ఈ రకమైన కన్స్యూమరిజం, dissatisfaction, competetiveness చాలా విచిత్రమైన పరిణామం.
    దీని వెనక ఎన్నో సాంఘిక ఆర్ధిక శక్తులున్నాయనిపిస్తుంది.
    మన అమ్మల తరం కంటే అమ్మమ్మల తరంలో ఆడవాళ్ళు తమకే సుఖాలూ అందుబాటులో వుండవన్న నిర్లిప్తతా (కొండొకచో తృప్తీ) తో బ్రతికేసారు. మన అమ్మల తరం (కిందటి తరం) కొంచెం ధైర్యం చేసి పిల్లలని పెద్ద చదువులు చదివించటం, ఆ చదువులకి యాదృఛ్ఛికంగా విదేశాల్లో మంచి అవకాశాలు రావటం జరిగింది. ఏ సుఖాలూ, సౌకర్యాలూ కలలో కూడా ఊహించలేమనుకున్నారో అవన్నీ ఇప్పుడు అందుబాటులోకొచ్చాయి. కోరికలకి కళ్ళాలు సడలి పోవూ?
    దీనికి తోడూ మీడియా (ముఖ్యంగా టీవీ) మేచింగు నగలు వేసుకోని ఆడదవాళ్ళూ, పెద్ద పెద్ద భవంతుల్లో బ్రతకని వాళ్ళు బ్రతకకపోవటమే నయం అని తేల్చేసింది. వెరసి ఎంత డబ్బూ మనకున్న అన్ని కోరికలనీ తీర్చలేని పరిస్థితి తీసుకొచ్చింది. ఏ సమస్యైనా (మద్రాసులో మంచి నీటి సమస్యతో సహా) తీర్చడానికి డబ్బుంటే చాలన్న భావజాలం బలపడిపోయింది.
    ఆ మధ్య మా బంధువుల్లో ఒకావిడ “రెండు పెళ్ళిళ్ళకీ ఒకే చీర ఎలా కట్టుకుంటాను” అని వాపోయింది. చెప్పలేనంత ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే మాది ఒకటో రెండో పట్టు చీరలతో బ్రతుకంతా గడుపుకునే దిగువ మధ్యతరగతి స్థాయి (ఒకప్పుడు).
    దీని వల్ల నేను గమనించిన ఇంకొక దౌర్భాగ్యం ఏమిటంటే, ఇప్పుడు చీర చీరకీ నగలు కొనుక్కోవటమే జీవన్మరణ సమస్యగా భావిస్తున్న ఈ ఆడవాళ్ళు ఇరవై యేళ్ళ కింద (వాళ్ళు ముప్పైల్లో వుండగా) చాలా సమస్యలగురించి చాలా తెలివిగా, మరీ మాట్లాడితే చాలా forwardగా ఆలోచించారు. ఇప్పుడు కన్స్యూమరిజంలో, చీరలూ నగల జాలంలో, ఇళ్ళూ రియల్ ఎస్టేట్ ల మోహం లో కొట్టుకుపోతున్నారు.
    డబ్బు మానవ సంబంధాలనే కాదు, వ్యక్తిత్వాలని కూడా మార్చగలదు.
    ఈ విషయాన్నే నేను ఇక్కడ చెప్పాలనుకున్నాను.
    http://sbmurali2007.wordpress.com/2008/03/06/test-6/
    శారద

  5. పరిస్థితులను బట్టీ, పరిసరాల ప్రభావాన్ని బట్టి, ఇరుగుపొరుగు ఆర్భాటాలను బట్టీ, జీవితంలోని అసంతృప్తినిబట్టీ “అమ్మ” అయినా సరే “మారాల్సిందే”. అదే నిజం. కథాంశం బాగుంది. కానీ కథే…తేలినట్టుంది.

  6. నీహారిక says:

    మొదటి ప్రయత్నం కదా!బాగుంది.last paragraph లో ఏదో మిస్సయింది.అమ్మ బాధ ఏమిటో తెలుస్తే బాగుండేది.లేకపోతే కొందరు ఆడవాళ్ళు వృద్దాప్యంలో అలాగే ప్రవర్తిస్తారని చెప్పి ఉంటే బాగుండేది.

  7. malapkumar says:

    కథ బాగుంది. అమ్మలను అలోచన లో పడేసారు.

  8. psmlakshmi says:

    అమ్మ కూడా మనిషేకదా. ఆ వయసు వచ్చేసరికి జీవితంలో అనేక ఆటుపోట్లెదురుకుంటూ శారీరక ఓపిక కూడా నశించి వుంటుంది. దానితో అనేక బలహీనతలు. వాటి గురించి కూడా ఆలోచిస్తే ఇంకా కొన్ని పరిష్కరాలు దొరుకుతాయని ఈ మధ్య నాకు పరిచయమైన వ్యక్తులద్వారా నేర్చుకున్నది. ఏదైనా ఒక్క విషయం చెప్పగలను. అన్నీ తామై జీవించినవాళ్ళకి కావాల్సింది మనసుని స్పర్శించే ప్రేమేకాదు బహుశా అప్పుడప్పుడూ వాళ్ళ సేవలను గుర్తుచేస్తూ కొన్ని ప్రశంసలుకూడానేమో. అన్ని రసాలూ కలిసినదే జీవితం.
    psmlakshmi

  9. sudhakar says:

    ammalu pillalaku anukulamugane untaaru ekkuvamandi.madhuravani garu mee katha lo laga undevaallu chaala arudu.bhaaryalu chaala akkuva mandi mee kathalo la untunnaarani nenu ankuntunnaanu.aithe manushulandarumu, mana kosam manam bathukuthunnatluga naaku anipinchatam ledu.thrupthi ledu.meeku unnadi naa vadda kuuda untene naaku santhosham lekapothe badha.

  10. వెంకటరమణ says:

    కధ బాగుంది. కానీ ‘అమ్మ ‘ ఎందుకు బాధపడుతుందో చెప్పలేదు. కధ ‘కొడుకు ‘ వైపు నుంది చెప్పటం వలన అమ్మ మారుతూ వస్తుందేమో అనిపిస్తుంది. ఆమె అసంతృప్తి కి కారణం కొడుకు దూరమయ్యాడని, తను మునుపటిలా మాట్లాడకపోవటమే అయ్యుంటుంది. కొడుకు మొదట్లో చిన్న పిల్లవాడిలా అమ్మ చుట్టూ తిరిగినా, రాను రాను మారుతున్న కాలంతోపాటే అతను మాట్లాడే విధానం, స్పందించే విధానం మారి ఉంటాయి. కొడుకు ఎంత పెద్ద వాడైనా తన దగ్గర చిన్న పిల్లవాడిలానే ఉండాలని ‘అమ్మ ‘ కోరుకుంటుందేమో.

  11. కధ చాల బాగా వాస్తవానికి చాలా దగ్గరగా ఉన్నది. కధ రాయాలని రాసినట్లు కాక మీ స్వగతం లా ఉన్నది. మా అమ్మ నాన్న తో అత్తా మామ తో నా కున్నా అనుభవం తో నాకు తోచినది ఏమిటంటే పెద్ద వాళ్లకు బాద్యత చాలా ఇష్టం. మీ కష్టం అమ్మతో చెప్పి ఉంటె అమ్మ చాల సంతోష పడేది. చిన్నప్పుడు మీరు ఎలా చిన్న పెద్ద ఓదార్పులు అమ్మ నుంచి పొందారో అలా ఇవ్వటంలో అమ్మకు తృప్తి. మీరు ఆమె అమ్మ రోల్ ప్లే చేసి ఆమెకు అన్ని సమకూర్చటం లో ఆమె అస్తిత్వం ప్రశ్న అయింది. అదే ఆమె ప్రాబ్లం.
    దీనికి తొడు గ్లోబలైజేషన్ ప్రభావం కొంత. వారి దగ్గర ఉండలేక వారికి అవసరమున్న లేకున్నా డబ్బు, కానుకలు ఇచ్చి మనం తృప్తి పడటం కొంత. పిల్లలకైనా పెద్దలకైనా అడిగారని కాక వారికి ఏది అవసరమో అది ఇవ్వటం అవసరం.

  12. సమయం తీసుకుని నా కథను ఓపిగ్గా చదివి, స్పందించిన మీ అందరికీ నా ధన్యవాదాలు.
    మీరందరి అభిప్రాయాలు తెలియజేయడం వల్ల ఈ కథలోని మరిన్ని కోణాలను అవగాహన చేసుకునే అవకాశం కలిగింది. మనందరికీ ఒక్కో విధంగా తోచింది కథలోని పాత్రలను చూసి. అలాగే నిజజీవితంలో కూడా, ఒక్కొక్కరిదీ ఒక్కో ఆలోచనా తీరు, ఒక్కో దృక్పథం.. ఒకే సందర్భంలో ఒక్కొక్కరు ఒక్కోలా ప్రవర్తిస్తుంటారు. బహుశా ఇదేనేమో భావవైరుధ్యం అంటే.!
    సుధాకర్ గారన్నట్టు, ఇలాంటి స్వభావం సాధారణంగా భార్యల్లోనే ఉంటుందని చాలా మంది భావిస్తారు. కానీ, ఇటువంటి స్వభావం ఉంటే ఈ పరిస్థితి ఏ బంధంలోనయినా రావచ్చు మరియు ఇలాంటివి వాస్తవంగా కూడా జరుగుతూనే ఉంటాయి అని చెప్పడమే నా ఉద్దేశ్యం. ఇదే విషయాన్ని మరో కోణంలో శారద గారి కథ వివరిస్తుంది.
    ఈ కథలో మరో విషయం ఏంటంటే.. ఎవరిది తప్పు, ఒప్పు అని ఎంచడం కాకుండా..కేవలం అలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్న ఒక వ్యక్తి మనోఫలకంపై కదలాడే భావాలని చిత్రించే ప్రయత్నమే ఈ కథ.
    ఏది ఏమైనా మీ అందరి అమూల్యమైన అభిప్రాయాలు ఇక్కడ పంచుకున్నందుకు మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
    — మధురవాణి

  13. good first effort.
    కథాంశం పైనే గాక కథ రూపం మీద కూడా దృష్టి పెట్టండి. ఫ్లేష్ బేక్ లోకి వెళ్ళినాక కూడా, అది “నెను” చెప్పిన కథనం లా కాకుండా, అమ్మకీ నేనుకీ మధ్య జరిగే సంభాషణగా చూపించి ఉంటే ఇంకా బాగా వచ్చి ఉండేది.

  14. కొత్తపాళీ గారూ,
    ఇక నుంచి మీరు చెప్పింది తప్పక దృష్టిలో ఉంచుకుంటాను. ఓపిగ్గా కథను చదివి, చక్కటి సూచనలు అందించినందుకు ధన్యవాదాలు.

  15. srinu.kudupudi says:

    కథ బాగుందండి !పిల్లలని కని…వారి ఆలన పాలన చూసి , పెద్దచేసి ,అందులోనే ఆనందాన్ని వెతుక్కునే అమ్మతనానికి ఆ వయసులో ఏర్పడే శూన్యతెనెమో ఆ “అసంతృప్తి “.
    కథానాయకుడికి పిల్లలు ఉండి,ఆమె దగ్గరే ఉండి ఉంటే ఆ అమ్మ అసంతృప్తి కొంచెమైన తగ్గేదేమో !?
    కానీ ఈ రోజుల్లో అలాంటి వాతావరణం ఎక్కడ ఉంది?
    ఉద్యోగ రీత్యా తలో దిక్కుకి పోవడం తప్పదు కదా !!
    ఈ కాలం అమ్మలకి ఈ అసంతృప్తి తప్పదేమో !!

Comments are closed.