నీకోసం

-నిడదవోలు మాలతి

ఉధృతంగా మంచు కురుస్తుంటే కిటికీలోంచి చూస్తూ కూర్చుంది ధరణి. ఆదివారం కనక సరిపోయింది. లేకపోతే నానా తిప్పలూ అవును, ఆఫీసు చేరడానికి. నిన్న దినకర్తో వచ్చిన తగువు ఇంకా పచ్చిగానే వుంది. అతనికి మాత్రం పట్టినట్టు లేదు. రాత్రి మంచంమీద వాలినవాడు వాలినట్టే పడి నిద్ర పోతున్నాడు. తొమ్మిదయినా లేచే జాడల్లేవు.

“ఏంకథ? నువ్వు నాకు ఉద్యోగాలు చూసేదాకా వచ్చింది వ్యవహారం. నేను అంత చేతకానివాణ్ణి అనా?” అన్నాడు దినూ ఉరిమి చూస్తూ.

ధరణి చిన్నబుచ్చుకుంది. “నువ్వు చూసుకోలేవన్నానా? ఏదో చూస్తుంటే కనిపించింది. చెప్పేను.”

“నేను చూడలేదని ఎందుకనుకున్నావు?”

వుండీ వుడిగీ, కువకువలాడుతూ ఆకాశంలో కొంగలు బారులు బారులుగా దక్షిణానికి తరలిపోతున్నాయి “శిశిరం ప్రవేశించనున్నదహో” అని చాటుతూ. తను వాటిని ప్రతియేడూ చూస్తూనే వున్నా ఎప్పటికప్పుడు కొత్తే. ప్రతిసారీ ముచ్చటే ఆ బారుల తీరు. చక్కగా సైనికులు కవాతు చేస్తున్నట్టు వరసలు ఎలా కడతాయో! ధరణి కళ్లు ఆకాశం మీంచి భూమ్మీదకి తిరిగేయి. ఇంటిముందు చెట్లకింద ఉడతలు హడావుడిగా పుట్టల్లోకి కాయలు చేరేస్తున్నాయి. అవి ఒక్క శిశిరానికి చాలినంత మాత్రమే పోగు చేసుకుంటాయిట. వాటికున్నపాటి జ్ఞానం మనిషికి లేదేం? మనిషిని rational animal అనడం అన్యాయం అనిపిస్తోంది చూస్తుంటే. అయినా ఆమాట అన్నది మాత్రం ఎవరు కనక? మనిషే కదా! మనకి మనమే కితాబులిచ్చుకోవాలి మరి! మనం ఇలా అనుకుంటున్నాం అని తెలిస్తే ఆ కొంగలూ, ఉడతలూ నవ్వుకోవా?

ధరణికి తాను అమెరికాకి వచ్చిన తొలిరోజులు గుర్తొచ్చేయి. “నీకేం కావాలేం కావాలి? నీకు ఏమిటి ఇష్టం? ఏమి నీ కోరిక?” అంటూ పదే పదే అడుగుతూ, తన ఇష్టాయిష్టాలు కనుక్కుంటూ దినకర్ సకలం అమరుస్తూంటే పొంగిపోయింది. కొత్త బల్లలూ, కుర్చీలూ, మంచాలూ కొన్నాడు. కిటికీలకి కొత్త కర్టెనులు అమర్చేడు. ఊళ్లో అందరికీ “మై మిసెస్” అంటూ గొప్పలు పోతూ చూపించేడు. “అబ్భ, ఇతడికి నేనంటే ఎంత ప్రేమా” అనుకోకుండా వుండలేకపోయింది మనసులోనే.

అతను రోజుకి పదిసార్లు చెప్తాడు ఆమె ఎంతో అందంగా వుందనీ, చీరెల్లో రంగారు మెరుపులకి కళ్లు బైర్లు కమ్ముతున్నాయనీ. “ఐ లవ్ యూ” అంటూ ఏకధాటిగా తిరుమంత్రం జపిస్తూనే వుంటాడు. ఓరోజు “నువ్వు చెప్పవేం? డు యూ లవ్ మీ?” అని కూడా అడిగాడు.

“ఏమో నాకు అలా మాటాడడం రాదు. మనం అలా మాటాడం కదా” అంది ధరణి తేలిగ్గా నవ్వేస్తూ.

గృహలక్ష్మి అమెరికనింట అడుగు పెడుతూనే, అతనికి పెద్ద ప్రోజెక్టు తగిలింది. అతను ఎగిరి గెంతేసి, “ఐ లవ్యూ సోఓఓఓ మచ్” అన్నాడు ఆ “సో”ని బారెడు సాగతీస్తూ. “ఇదంతా నీ అదృష్టమే. నువ్వు ముందెప్పుడో బంగారుపూలు పూజ చేసుకుని పుట్టేవు. అంచేతే నాలాటి మేధావి నీకు లభించేడు.” అని కూడా అన్నాడు బోరవిరుచుకుని, ఎదనిండా గాలి పీల్చుకుని.

ధరణి అతనిమాటలకి నవ్వింది మనస్ఫూర్తిగానే.

ఆ ఘనతర ప్రోజెక్టు నాలుగునెలల్లో అంతమయిపోయింది. మరో మంచి ప్రోజెక్టుకోసం వెతకడం మొదలుపెట్టేడు. ఇక్కడ “మంచి” అన్నపదం మనం గుర్తుపెట్టుకోవాలి. తన మేధాసంపత్తిని సవ్యంగా ఉపయోగించుకోగల ప్రోజెక్టు అయితేనే చేపట్టడానికి నిశ్చయించుకున్నాడు. దానికోసం ఎదురుచూస్తున్నాడు.

ధరణికి మొదట్లో ఏమీ అనిపించలేదు కానీ రోజులు గడుస్తున్నకొద్దీ తన ఆలోచనలు మరో దిక్కున సాగేయి. చిన్నబెరుకు మొలకెత్తి, నెమ్మదిమీద ననలు తొడిగి, రెమ్మలు తేరి, మహావృక్షమయి ఎదుట నిలిచి వుంది ఇప్పుడు. మొదట్లో రెండో, మూడో ప్రోజెక్టులు ఏవో కారణాలు చెప్పి దాటేసినప్పుడు అది అంతగా బాధించలేదు. “అవున్లే, ఎవరికి మాత్రం వుండదు తమ సామర్థ్యాన్ని సవాలు చేయగల ఉద్యోగం కావాలని? అలా ఆశించడంలో తప్పేం లేదు” అనుకుంది. క్రమంగా రోజులూ, వారాలూ, నెలలూ గడుస్తున్నకొద్దీ … అతను “పని చెయ్యనికాలం” ఎక్కువయేకొద్దీ రాగల అవకాశాలు మరీ తగ్గిపోతాయన్న వాస్తవం కళ్లముందు కదులుతూ గుండెల్ని పిండేస్తోంది. అంత మేధావి దినూకి ఆమాత్రం తెలీదా అన్న సంశయం కూడా కొరుక్కుతినేస్తోంది లోలోపల.

అలాటిరోజుల్లోనే, మైక్రోసాఫ్టు కంపెనీవాళ్లు పిలిచారు ఇంటర్వ్యూకి రమ్మని.

దినూ వెళ్లలేదు.

“అదేం?” అడిగింది ధరణి కళ్లు చికిలించి. మరొకరయితే ఎగిరి గెంతేద్దురు ఇంటర్వ్యూకే.

“ఆ మేనేజరు నాతో పదోక్లాసు చదివేడు. నా ఐక్యూలో సగం లేదు వాడికి. వాడికింద నేను పని చెయ్యడం ఏమిటి? అబ్సర్డ్,” అన్నాడు.

ఇంటర్వ్యూకే వెళ్లలేదు. వుద్యోగం వచ్చేసినట్టు మాటాడతాడేం అనిపించింది కానీ అడగలేదామాట. నాలుగువారాలు పోయేక, మరో కంపెనీవారు పిలిచారు. దానికీ వెళ్లలేదు. ఏం అంటే, తన క్లాస్మేటు అన్నగారు సి.యి.వో.ట అక్కడ. మరోసారి, ఆస్టిన్లో ఇంటర్వూకి వెళ్లేడు కానీ ఊరు బాగులేదన్నాడు.

అతని ధోరణి రాను రాను అయోమయం అయిపోతోంది. అసలు అతనికి ఉద్యోగం చేసే వుద్దేశం వుందా అన్న అనుమానం కూడా కలుగుతోంది. ఉద్యోగం పురుషలక్షణం అని నానుడి. నిజానికి ఈరోజుల్లో పురుషులే కాదు స్త్రీలు కూడా నాలుగ్గోడలమధ్యా వూరికే గోళ్లు గిల్లుకుంటూ కూర్చోడం లేదు. ఒంటిమీద చొక్కాలాగ తలకాయల్ని గోడని కొక్కేలకి తగిలించేసి, బేఖతర్గా కూర్చోడంలేదు. అసలు అలా ఎవరు గానీ కూర్చోగలరని ధరణి ఊహించను కూడా లేదెప్పుడూ. తనకి సాధ్యం కావడంలేదు.

చూస్తూండగానే ఏడాది దాటింది. తనకి ఏదో ఒకటి చెయ్యాలనిపిస్తోంది. అత్యవసరంగా. ఉద్యోగం అనండి, కాలక్షేపం అనండి ఏదో ఒకటి చెయ్యాలి. పైగా దినకర్కి కూడా మరో ప్రోజెక్టు కనుచూపుమేరలో లేకపోవడంతో, ఇద్దరూ మొహమొహాలు చూసుకుంటూ ఇంట్లో కూర్చోడం కాస్త చిరాగ్గానే వుంటోంది కూడాను. “ఇదెంత కాలం సాగుతుందో తెలీదు. ఇలా మరో నెల రోజులయిందంటే నాకు పిచ్చెక్కిపోవడం ఖాయం. ఏదో చూసుకోవాలి” అనుకుంది. ఆతరవాత, రెండో ప్రశ్న, దినకర్ ఒప్పుకుంటాడా? అన్నది.

ధరణి అనుకున్నట్టే, అతను మొదట, “ఎందుకంత తొందర? నాకు మంచి ప్రోజెక్టు వస్తుంది. చూస్తూండు. ఇప్పుడేం తిండికి జరక్కుండా పోలేదు కదా.” అన్నాడు.

“తిండికి జరగడంలేదని కాదు. నాకిలా ఊరికే కూర్చుంటే పిచ్చెత్తిపోయేలా వుంది. ఏమాత్రమో బుర్రుంది కదా దానికేదో పని ఒప్పచెప్పాలి. అందుకూ” అంది క్షమాపణలు చెప్పుకుంటున్నట్టు.

వాదనలు రెండు రౌండులయేక, సరే నీఇష్టం అన్నాడు అతను.

యమ్మెస్సీ చేసింది కనక పి.హెచ్.డీ చేద్దాం అనుకుంది మొదట. కానీ ముందు యమ్మెస్సీ కోర్సులు కొన్ని మళ్లీ చెయ్యాలన్నారు. దాంతో, అది వదిలేసి, ఉద్యోగాలు చూసుకోడం మొదలుపెట్టింది. తనవిద్యని సద్వియోగం చేసుకునే వుద్యోగాలు షికాగోలోనూ, మినియాపోలిస్లోనూ వచ్చేయి కానీ ఆవిడవెంట అతను వెళ్లడానికి సిద్ధంగా లేడు. తనకి న్యూయార్కులోనే కాకపోతే న్యూజెర్సీలో మరో వుద్యోగం వచ్చితీరుతుందని హామీ ఇచ్చేడు. అంచేత భర్తొకచోటా, భార్యొకచోటా వుండి, వారాంతాల్లో మాత్రం కలుసుకుంటూ చేసుకునే కాపురానికి ఇద్దరూ సిద్ధంగా లేరు. అలా మరో ఆర్నెల్లు గడిచేయి. వున్న వూళ్లోనే ఒక బాంకులో కస్టమర్ రెప్ అవకాశం వచ్చింది. గొప్ప సంతృప్తినిచ్చే వుద్యోగం అని కాదు. తన చదువుకి తగిన పని కాదు. ఆసక్తి అసలే లేదు. కానీ .. నాలుగ్గోడలమధ్య కులాసాజైలు జీవితం గడపలేక చేరిపోయింది, ఆ అమ్మాయి చురుకుదనమూ, తెలివితేటలూ గమనించి, మూడునెలలు తిరక్కుండా, బాంకువాళ్లు ఫుల్ టైం సూపర్వైజరుగా చేసేరు. ఆదాయం బాగుంది.

దినూ అభిప్రాయం మాత్రం ధరణి sold herself short అనే. తాను చచ్చినా అలా చెయ్యలేడు. అలా సరిపెట్టుకోడం అతని తత్త్వంలో లేదు. ధరణి బాంకులో చేరుతున్నానని చెప్పినప్పుడు చిరాకు పడ్డాడు. “నేనయితే చేరను అలాటి కొరగాని పనిలో” అన్నాడు. అతని దృష్టిలో అది పరమహీనం.

ధరణికి మనసంతా గందరగోళంగా వుంది. చిరాగ్గా వుంది. అస్తమానం ఐలవ్యూ అంటూ జపించే ఈమనిషికి తనబాధ ఎందుకు అర్థం కాదు? అసలు ప్రయత్నం కూడా చెయ్యకపోతే ఏం అనుకోడం? ఉన్నఉద్యోగాలే ఊడిపోతున్న ఈరోజుల్లో చేతులు ముడుచుకు ఇంట్లో కూర్చున్న ఈమనిషిని వెతుక్కుంటూ వచ్చి, ఉద్యోగాలిచ్చే కంపెనీలుంటాయా?

ఓరోజు ధరణి పేపరు చూస్తుంటే, ఓ ప్రకటన కనిపించింది. “ఇదుగో. ఇది చూసావా?” అంది పేపరు అతనికి అందిస్తూ, మామూలుగానే.

“ఏంకథ? నువ్వు నాకు ఉద్యోగాలు చూసేదాకా వచ్చింది వ్యవహారం. నేను అంత చేతకానివాణ్ణి అనా?” అన్నాడు దినూ ఉరిమి చూస్తూ.

ధరణి చిన్నబుచ్చుకుంది. “నువ్వు చూసుకోలేవన్నానా? ఏదో చూస్తుంటే కనిపించింది. చెప్పేను.”

“నేను చూడలేదని ఎందుకనుకున్నావు?”

“ఇప్పుడే కదా పేపరొచ్చింది. నేను ముందు తీసుకున్నాను కదా”

“అసలు నీమనసులో వున్నమాట చెప్పరాదూ? పనీ పాటూ లేకుండా కూర్చోడం నాకు సరదా అని నీ అభిప్రాయం. అవునా?”

“ఎందుకలా పెడర్థాలు తీస్తావు? నేనేం అన్నానిప్పుడు?”

“మరేమిటో చెప్పు నీబాధ? నేను ఎదురుగా కనిపిస్తుంటే నీకు కష్టంగా వుందా? చూస్తూ వుండు. నీకిప్పుడు ఇలా వుంది కానీ తరవాత నేను హైరాంక్ జాబ్ తీసుకుని, బిజీ బిజీ అయిపోయినప్పుడు, నేను ఇంట్లో కనిపించడమే లేదంటూ బాధ పడిపోతావు. అసలు ఎందరాడాళ్లు ‘మావారు ఇంట్లో వుండనే వుండరు’ అంటూ ఆరాటడిపోతున్నారో తెలుసా నీకు?”

“సరేలే. నాదే పొరపాటు. నేనింక మాటాడను.”

ధరణి లేచి పక్కగదిలోకి వెళ్లిపోయింది. మాటకి మాట తెగులు. తనే ఊరుకుంటే సరి అని ఎంత సర్ది చెప్పుకున్నా గానీ ఎదలో ముల్లయి కెలుకుతూనే వుంది. సంసారం అన్నతరవాత మంచీ, చెడ్డా వుంటాయి. “అరమరికలు లేకుండా” అంటే మనసిచ్చి మాటాడుకోడమే కదా. మరి ప్రతిమాటకీ పెడర్థాలు తీస్తూంటే ఎలా వేగడం? నన్ను అడుగుతాడు కదా నీకేం కావాలి? అని. మరి నాకు మాత్రం అలా వుండదా? అతనికేం కావాలన్న తపనా, అవి తీరడానికి తనకి చేతనయిన సాయం చెయ్యాలన్న కోరికా? అందులో తప్పేమిటి?

ఆలోచనలయితే సవ్యంగానే వున్నాయి కానీ అవి అతనికి ఎలా బట్వాడా చెయ్యాలో తెలీడం లేదు ఆ అమ్మాయికి. అమెరికాలో talk, talk, అంటారు కానీ చెప్పేవారికి చెప్పాలని వుంటే చాలదు. ఎదటివారికి విందాం అన్న దృష్టి కూడా వుంటేనే ఆ “టాకు” సాగేది. అది దినూ తత్త్వంలో లేదు.

దినూ ఓ గంట తరవాత శాంతించేడు. “పాపం, ఒఠ్ఠి అమాయకురాలు, అమ్మాయికి లోకజ్ఞానం అస్సలు లేదు,” అనుకుంటూ గదిలోకి వచ్చి “సారీ” చెప్పాడు. “నీకే నా సామర్థ్యంలో నమ్మకం లేకపోతే ఎలా చెప్పు?” అన్నాడు తన బాధనంతా గొంతులో పలికిస్తూ.

“నాకు నమ్మకం లేదన్నానా?” అంది ధరణి నెమ్మదిగా.

“అసలు నాపేరే దినకర్. అంటే ఏమిటనుకున్నావు? లోకాన్ని తన దివ్యప్రభలతో చైతన్యవంతం చేసేవాడు. నా తెలివితేటలూ, సామర్థ్యమూ గుర్తించినవాళ్లు, వాటి విలువ తెలుసుకున్నవాళ్లు – వాళ్లే నన్ను వెతుక్కుంటూ వస్తారు, చూస్తూ వుండు. అప్పుడు నువ్వే విచారిస్తావు, అనవసరంగా అబ్బాయిగారిని ఎంత బాధ పెట్టేనూ నా అజ్ఞానం మూలంగా అని.” అన్నాడు నవ్వుతూ.

ధరణికి అందులో హాస్యం కనిపించలేదు. పైకి హాస్యానికి అంటున్నట్టున్నా, అతడు ఆ మాటలు మనసా నమ్మి చెబుతున్నట్టే వినిపించాయి ఆ అమ్మాయికి.

మళ్లీ దినూయే అన్నాడు, “లేదులే. నువ్వు సదుద్దేశ్యంతోనే చెప్పావని నాక్కూడా తెలుసు. నేనలా విసుక్కోడం పొరపాటే. మళ్లీ ఎప్పుడూ అననులే” అన్నాడు మృదువుగా. ఆ సాయంత్రం “వంట చెయ్యకు. బయట తిందాం” అన్నాడు ఓదార్పుగా. “లే, బట్టలు మార్చుకు రా. హిల్టన్లో రిజర్వేషను చేయిస్తాను”. ఆపూట భార్యకి హైక్లాసు హోటల్లో ఖరీదయిన భోజనం పెట్టించాలని మహ సరదా పడింది అతడి మనసు.

ధరణి లోపలికెళ్లి తనకి ఎంతో ఇష్టమయిన డ్రెస్ వేసుకుంది – పాలనురుగలాటి తెల్లటి బ్లౌజుమీద నీలినీడల్లా లేతనీలిరంగు పూలు, దానికి తగిన లేతనీలిరంగు పాంటు. తనకి ఆ రంగులు ప్రశాంతంగా ఉంటాయి. మనసు ఉల్లాసంగా వుంటుంది.

అందంగా అలంకరించుకుని వచ్చిన భార్యని రెండు క్షణాలు తేరి చూసి, దినూ “నైస్” అన్నాడు. ఆ అనడం నైసుగా లేదు. ఏదో మొక్కుబడికి అన్నట్టు వుంది.

“ఏం బాగులేదా?” అంది ధరణి అతనివేపు చూడకుండా.

“కెంపురంగు డ్రెస్లో నువ్వెంతో అందంగా వుంటావు. అది వేసుకోరాదూ?”

ధరణికి కెంపురంగు ఇష్టంలేదు. … “మొన్న ప్రకాష్ వాళ్లింటికి వెళ్లినప్పుడు వేసుకున్నాను కదా. అసలీమధ్య ఎక్కడికి వెళ్లినా అదే వేసుకుంటున్నాను అని ఇవాళ ఇది వేసుకున్నాను. సరేలే, మార్చుకొస్తాను. ఏదయితేనేమిటి?” అంది ధరణి లోపలికి వెళ్తూ.

అంతరాంతరాల ఎక్కడో అదే మాట – “ఏదయితేనేమిటి? మార్చుకోనక్కర్లేదులే” అని అతనంటే బాగుండును అనిపించింది. … అంత సరదా వుంటే మరో డ్రెస్సు తనకిష్టమయిన రంగుడ్రెస్సు కొనివ్వొచ్చు కదా! ఆమాటే ఒకసారి అతనితో అంది కూడాను.

“ఏం, నా ఎంపిక బాగులేదా?” అన్నాడతను. అందం విషయంలో తనకి తెలిసినంతగా మరెవరికీ తెలియదని అతని అభిప్రాయం. ఆ కెంపురంగు డ్రెస్ నెలరోజుల క్రితం, ఇలాటి తగువే వచ్చినప్పుడు “సర్ప్రైజు” బహుమతిగా కొన్నాడు. ఈ నెల రోజుల్లోనూ చాలాసార్లే వేసుకుంది అది. ఇదే సంభాషణ చాలాసార్లే అయింది ఇద్దరిమధ్యా.

ధరణి లోపలికి వెళ్లి బట్టలు మార్చుకుని, దానికి నప్పిన జోళ్లేసుకుని, చేతిసంచీ పుచ్చుకు బయల్దేరింది.

“చూడు ఈ డ్రెస్లో ఎంత అందంగా వున్నావో. రెస్టారెంటులో జనాలు భోజనాలు మానేస్తారు నిన్ను చూస్తూ.”

“సరేలే. మాటలు నేర్చావు.”

మర్నాడు కూడా బోల్డుసార్లు ‘సారీ’లు చెబుతూనే వున్నాడు. ఆ సాయంత్రం “ఇవాళ వంట నేను చేస్తాను. వంకాయ వేపుడు నీకు ఇష్టం కదా, చేస్తాను.”

“నీకూ ఇష్టమే కదా. నేనే చేస్తాలే, మెంతికారం పెట్టి” అంది ధరణి లేస్తూ.

“రెండు రకాలుగానూ చేసుకుందాం,” అన్నాడు దినూ హుషారుగా.

వంకాయ వేపుడూ, మెంతికారం పెట్టీ – కూర రెండురకాలుగానూ చెయ్యొచ్చు. రెండు డ్రెస్సులు ఒక్కసారే వేసుకోగలిగితే ఎంత బాగుండు అనుకుంది ధరణి మనసులో.

ఆమె వంట పూర్తి చేసి, అధికంగా, అతనికి ఇష్టం అని కేరట్ హల్వా కూడా చేసి, బల్లమీద వంటకాలూ, కంచాలూ పెట్టి “రా, భోంచేద్దాం” అని పిలిచింది.

“కూర ఎంతో బాగా కుదిరింది.” అని మెచ్చుకున్నాడు. “నీకు కోపం వచ్చినప్పుడు మరీ బాగుంటాయి సుమా నీ వంటలు” అంటూ మేలమాడేడు.

అతనిమాటలకి ఆమె పొంగిపోయింది. ఆమె వంటలకి అతను ఆనందించాడు. వాన వెలిసింది.

***

ధరణి గుండెలు కూడదీసుకుని ఓరోజు అంది, “నీకు ఎవరికిందా పని చెయ్యడం ఇష్టంలేదు. నీ అర్హతలకి తగిన ఉద్యోగం చూపించే కంపెనీలు లేవు. వాళ్లెవరో నీ తెలివితేటలు గుర్తించడం లేదని విచారించడం ఎందుకు? నువ్వే ఓ కంపెనీ పెట్టి, ముల్లోకాలకీ నీ సామర్థ్యం వెల్లడి చేసేయొచ్చు కదా. అప్పుడయితే నువ్వు ఎవరికీ జవాబు చెప్పుకోనక్కర్లేదు సరికదా మరో నలుగురికి నువ్వే పని చూపించినవాడివి అవుతావు,” అంది.

దినూ ఠక్కున తలెత్తేడు కోడెతాచులా. తను చేతకానివాడని ఎత్తిపొడుస్తోందా? ఇంతలు కళ్లు చేసుకుని ఆమెవైపు చూశాడు. తన భార్య తనని హేళన చేస్తున్నట్టు అనిపిస్తోంది. అతనికి ఒళ్లు భగ్గున మండింది.

“షటప్” అని అరిచాడు.

ధరణి వణికిపోయింది లేమావి చివురులా. గుండెలు దడగడ కొట్టుకున్నాయి. అతనిలో అంత ఔద్ధత్యం ఏనాడూ చూడలేదు. అతనికి ఇంత కోపం వుందని ఎప్పుడూ అనుకోలేదు. ఆమాటకొస్తే అసలు తన జీవితంలోనే ఎరగదు అలాటి కోపం. అమ్మా, నాన్నా తనని ఏనాడూ పల్లెత్తు మాట అనలేదు పుట్టి, బుద్ధెరిగి. కసురుకోడందాకా ఎందుకు, గట్టిగా మాట కూడా అన్నవాళ్లు లేరు. నాన్నకి తనంటే ప్రాణం. ఆయనని తను ఎంతో విసిగించినప్పుడు కూడా “ఇంత పట్టుదల అయితే ఎలా అమ్మా?” అంటూ ఎంతో నెమ్మదిగా చెప్పేవారు. సాటిపిల్లలు “మానాన్న చీరేస్తాడు, మాఅమ్మ కొడుతుంది,” అని చెప్పినప్పుడు తనకి ఆశ్చర్యంగా వుండేది. స్కూల్లో టీచర్లందరికీ తనంటే ఎంతో ఇష్టం తను చాలా తెలివైనదీ, బుద్ధిమంతురాలూనని.

ధరణి అతనివేపు కళ్లప్పగించి చూడసాగింది. కాళ్లలో రక్తం గుండెలకి ఎగదన్నింది.

దినూ భార్యకి దగ్గరగా వచ్చి, మొహంలో మొహం పెట్టి, “నాకు నీసలహాలు అక్కర్లేదు, అర్థమయిందా? మళ్లీ ఎప్పుడూ నాతో అలా చెప్పకు, నెవర్, నెవర్,” అన్నాడు కరుగ్గా.

అతను అలా మీదమీదకి వచ్చేసి మాటలంటుంటే భూమండలం గిరగిరా తిరిగింది కళ్లముందు. గబుక్కున లేచి పక్కగదిలోకి వెళ్లిపోయింది.

దినూ చేతిలో కాఫీకప్పు విసురుగా బల్లమీద పడేసి పెద్ద పెద్ద అంగలేసుకుంటూ వీధిలోకి వెళ్లిపోయాడు. కాఫీ ఒలికి కాగితాలు తడిసిపోయేయి. కాఫీ కార్పెట్మీద పడి మరకలయేయి.

దినూ ఎక్కడెక్కడో తిరిగి, అర్థరాత్రి దాటింతరవాత ఇల్లు చేరేడు. అప్పటికి కాస్త మనసు స్థిమితపడింది. గంటన్నరసేపు “సారీ, పొరపాటయిపోయింది, సారీ, ఠెరిబ్లీ సారీ” అంటూ వదలకుండా విచారం వెలిబుచ్చాడు మళ్లీ. అసలు తనకంత కోపం వుందని ఇంతవరకూ తనకే తెలీలేదన్నాడు. “మళ్లీ జన్మలో ఎప్పుడూ ఇలా జరగదు, జరగనివ్వను” అన్నాడు.

ధరణి “సరే” అంది ముభావంగా.

***

ఆఫీసులో పరధ్యానంగా వున్న ధరణిని చూసి, “ఏం, అలా వున్నావు?” అనడిగింది స్టెల్లా.

స్టెల్లా ఈమధ్యనే కొత్తగా చేరింది ఆఫీసులో. తనకి తెలీని విషయాలు ధరణిని అడిగి తెలుసుకుంటోంది. ఆవిడకి ఈ తెలుగుఅమ్మాయి అంటే మంచి గురి ఏర్పడిపోయింది అచిరకాలంలోనే. భారతీయ సంస్కృతి మహోన్నతమయినదని ఆవిడ వింది. అప్పుడప్పుడు మన సాంప్రదాయాలగురించి అడుగుతూ వుంటుంది తనని.

“ఏం, అలా వున్నావు?”

ధరణికి ఆమాట చల్లగా, సూటిగా మనసుకి తగిలింది. స్టెల్లా ఎంతో ఆత్మీయురాల్లా కనిపించింది. అమ్మా, నాన్నా, అన్నా, చెల్లీ, ఒకే కంచంలో తిని ఒకే మంచంలో పడుకున్న నేస్తులూ – అందరూ వున్నారు కానీ వాళ్లున్నది భూగోళానికి ఆవలితీరంలో. ఇక్కడ … ఇప్పుడు …, ఈక్షణంలో “అలావున్నావేం? ఏమయింది?” అని అడిగేవాళ్లు లేరు. అలా అడగగల ఒకే ఒక మనిషికి ఆ ధ్యాస లేదు.

ధరణి మనసు కిటకిటలాడింది. తలొంచుకుని “ఏం లేదు. బాగానే వున్నాను” అంది నెమ్మదిగా.

“లంచి టయిమవుతోంది. Early lunch తీసుకుందాం, వస్తావా?” అని అడిగింది స్టెల్లా.

ధరణి నెమ్మదిగా తలూపి, లంచిబాక్సు తీసుకుని లేచింది. ఇద్దరూ కాఫీరూంలో ఓమూల కూర్చున్నారు. ఇంకా లంచిటైం కాలేదు కనక ఎవరూ లేరు ఆ చుట్టుపట్ల.

ధరణి ముందురోజు సాయంత్రం జరిగిన తగువు నాలుగుముక్కల్లో చెప్పి, “నాకేం చెయ్యాలో తోచడంలేదు. మంచి పరువంలో వున్న కుర్రాడు, ఎన్నదగ్గ చదువూ, అర్హతలూ వున్న మనిషి, నిశ్చింతగా నెలలతరబడి ఇంట్లో ఎలా కూర్చోగలుగుతున్నాడో, అతనితత్త్వం ఏమిటో నాకు అర్థం కావడం లేదు.” అంది ధరణి తనలో తను మాటాడుకుంటున్నట్టు.

“మీదేశంలో అలా పెద్దచదువులు చదువుకున్నవాళ్లు ఏం చెయ్యకుండా ఇంట్లో కూర్చోడం చేతకానితనం అనుకోరా? తప్పుగా భావించరా? అందులోనూ మగాళ్లు?”

“అదేం లేదు. రెండుతరాల పూర్వం మీకూ అంతే కదా. మాక్కూడా మగాళ్లు breadwinners, ఆడవాళ్లు homemakers అనే సాంప్రదాయం. ఇప్పుడిప్పుడే మారుతోంది. మా అమ్మమ్మ అయితే ‘ఉద్యోగం పురుషలక్షణం అనీ, ఆడదానిసంపాదన కూచుని తింటావుట్రా’ అనీ దులిపేసి వుండేది వెనకటిరోజులయితే. మాఅమ్మ కాలం వచ్చేసరికి కొంత మారింది. మాఅమ్మ ఉద్యోగం చేస్తున్నా, ఇంటిబాధ్యతలన్నీ ఆవిడవే. ఇప్పుడు మగవాళ్లు కూడా ఇంటిపనుల్లో ఓ చెయ్యేస్తున్నారు. అయితే మీలాగ ఇంకా వేరు వేరు ఎకౌంట్లు లేవు. కనీసం ఇప్పటికి లేదు, నీడబ్బూ, నాడబ్బూ అని.” అంది ధరణి. ఇలా మాటాడుతుంటే తనకే కొన్ని విషయాలు స్పష్టమవుతున్నాయి అనుకుంది ఆశ్చర్యపోతూ!

“ఇక్కడ మగాళ్లు ఇంట్లో వున్నా ఏదో ఓ పని చూసుకుంటారు కానీ వూరికే కూర్చోరు, ఏది కానీ తమకి తాము సమకూర్చుకోవాలి కానీ వాటంతట అవే సమకూడుతాయనో, ఎవరో చేసి పెడతారనో ఎదురుచూస్తూ కూర్చోరు. ఈమధ్య stay at home dads సంఖ్య పెరుగుతోంది. అదీ పిల్లలుంటేనూ, భార్యలకే మంచి వుద్యోగాలు అయితేనూ అలా చేస్తున్నారు. అప్పుడు కూడా వూరికే కూర్చోరు. తమ తెలివితేటలు ఉపయోగించుకోగల పని ఏదోఒకటి చూసుకుంటారు సాధారణంగా,” అంది స్టెల్లా రెండుతరాల పూర్వంమాట తప్పించేసి.

ధరణి కొంచెంసేపు ఊరుకుని, నెమ్మదిగా ఎటో చూస్తూ, “నేను క్షమాపణలు చెప్పుకున్నాను,” అంది.

“అతను ఏమన్నాడు?”

ధరణి అడ్డంగా తలూపింది ఏమీ లేదు అన్నట్టు. “మళ్లీ తరుచూ చెప్తాడు నేనంటే చాలా లవ్వుందని.”

“మాటంటే ఏం లాభం? క్రియలో కూడా కనిపించాలి కదా. మీద వాన పడితే కింద నేల తడి కాదా?” అని ఓ క్షణం ఆగి “నేనయితే కౌన్సిలింగుకి వెళ్దాం రమ్మంటాను” అంది స్టెల్లా.

“అది కుదిరేది కాదు. తనకంటే మేధావి లేడు అనుకునేవాడికి మరొకరిని సలహా అడగడానికి కూడా నామోషీయే కదా. అహం అడ్డొస్తుంది.”

“క్రమంగా అతనికే తెలుస్తుందిలే” అంది స్టెల్లా ఓదార్పుగా.

ధరణి తలూపింది. ఇద్దరూ లేచారు.

ఆ సాయంత్రం పని అయింతరవాత ఇంటికి బయల్దేరింది. కానీ వెళ్లాలంటే వుత్సాహంగా లేదు. దారిలో వున్నపెద్ద లేక్ పక్కనించి కారు పోతుంటే కాస్సేపు ఆగుదాం అనిపించింది. నెమ్మదిగా కారు రోడ్డువారకి తీసి, దిగి, నీళ్లకి కొంచెం ఎడంగా కూర్చుంది. దూరాన నీళ్లలో తెరచాపలెత్తి పడవల్లో షికార్లు కొడుతున్నారు కొందరు. అట్టే లోతు లేనిచోట పిల్లలు ఈతలాడుతుంటే, తల్లులూ, తండ్రులూ నిలబడి, వాళ్లమీద ఓ కన్నేసి, కబుర్లు చెప్పుకుంటున్నారు.

ధరణి ఎడతెగని ఆలోచనలతో సతమతమవుతోంది. నిన్నరాత్రి దినూ పడుకోబోతూ, “ఇదంతా ఎవరికోసం? నీకోసం కాదూ?” అన్నాడు. నాకోసమేనా? జీవితంలో నేను కోరుకుంటున్నది ఏమిటి? నిఝం నిఝంగా?

అమెరికాకి రాకుండా, దేశంలోనే వుండివుంటే, ఏమయేది? ఈసరికి ఏకాలేజీలోనో రీడరయివుండును. ఈ బొచ్చెలు కడుక్కోడం, బట్టలుతుక్కోడం లేకుండును. అవే తనకి కావలసినవి అని అనుకుందా ఎప్పుడయినా? రీడరయితే, అధికంగా ఏం వొచ్చును? సంఘంలో పేరూ, డబ్బుతో వచ్చే సౌఖ్యాలూ వచ్చును, … తరవాత? ఏమో. ఇక్కడ మాత్రం తను పొడిచేస్తున్నది ఏమిటి? బాంకులో చేరింది. తను చదివిన బయాలజీకి ఏసంబంధం లేకపోయినా, మాస్టర్సు డిగ్రీ చూసి, తనకి ఆస్థాయి మెదడు వుందని ఇచ్చేరు.

ధరణి బాంకులో చేరినకొత్తలో లంచిరూంలో నలుగురు చేరేరు. ధరణి కూడా అక్కడే వుంది. మాటలసందర్భంలో “మీవారు ఏంచేస్తున్నారు?” అని ఎవరో అడిగేరు.

“ఏంలేదు” అంది తేలిగ్గా.

“హా?”

ఆ మనిషిమొహం చూసి, వెంటనే అర్జెంటుగా వివరించవలసిన అవుసరం వున్నట్టు గుర్తించి, “అంటే ప్రస్తుతం ఏంలేదు అంటున్నాను. అతను ఇంజినీరు. చాలా మంచి ప్రోజెక్టులలో పనిచేశాడు. మరో మంచి ప్రోజెక్టుకోసం చూస్తున్నాడు ఇప్పుడు.” అంది గబగబా. మనహాస్యాలు వీళ్లకి అర్థం కావు అని ధరణికి అర్థమయింది అప్పుడే.

“ఓ అలాగా” అంది ఆవిడ.

“Who’s wearing the pants?” అంది మరొకావిడ. ధరణికి అది అర్థం కావడానికి రెండు క్షణాలు పట్టింది. కోపం వచ్చి, అక్కడినుండి వెళ్లిపోయింది. ఆతరవాత “లైటెన్ చెయ్యడానికి, వూరికే అలా అన్నాన”ని అంది ఆవిడ కానీ ధరణికి మాత్రం ఆమాట మర్చిపోడం సాధ్యం కాలేదు.

తరవాత వాళ్లలో వాళ్లు మాటాడుకుంటున్నా, తనని ఉద్దేశించి మాటాడుతుట్టే అనిపిస్తోంది.

“టామ్ ఇలాగే ఉద్యోగం సద్యోగం లేకుండా ఇంట్లో కూర్చుంటే తగిలేశాను. అలాటి మగాడు వుంటే ఎంత, లేకపోతే ఎంత.”

“మావారు ఇలాగే పిచ్చికారణాలు చెప్తూ ఇంట్లో కూర్చుంటే, ఇంటిపని పూర్తిగా ఒప్పజెప్పేశాను. ఇప్పుడు నేనే నిజభర్తని. నన్ను కార్లో ఆఫీసుకి తీసుకురావడం, మళ్లీ ఇంటికి తీసుకెళ్లడంతో సహా.”

“పెళ్లి చేసుకున్నది ఆయన్ని నేను సాకడానికా? అంతకంటె ఓ కుక్కపిల్లని పెంచుకోడం నయం.”

“ఏదో లోపం వుండి వుండాలి, లేకపోతే ఇంతకాలం ఉద్యోగం దొరక్కపోవడమేమిటి? Personality సమస్యేమో.”

“సోషల్ స్కిల్స్ తక్కువో, ఫెయిలవుతానన్న భయమో.”

“నిజంగా అంత తెలివితేటలుంటే ఈపాటికి ఏదో ఓ వుద్యోగం రాకపోనా?”

“ఈదేశంలో ఎవరూ మనని వెతుక్కుంటూ వచ్చి టాప్ రాంక్ ఉద్యోగం వెండికంచంలో తెచ్చి అందించరు, ముందు తన అర్హతలకి తగినఉద్యోగం చేస్తూ నిరూపించుకోవాలి సామర్థ్యం. ఒకస్థాయి ఉద్యోగానికి తగినవాడని ముందు నిరూపిస్తే తరవాత అంతకంటే మంచి అవకాశాలు వస్తే రావచ్చు.”

“ఏమో, ఇండియాలో చెల్లుతుందేమో అనీ అమెరికాలో అయితే దాన్ని అసమర్థత అనే అంటారు.”

ఈమాటలు వినడం ధరణికి కష్టంగా వుంది.

రాను రాను చిరాకు ఎక్కువవుతోంది. నిజమే మరి, బాగా చదువుకున్నవాడూ, మంచి తెలివితేటలున్నవాడూ తెల్లారి లేస్తూనే హడావుడిగా ఆఫీసుకి టైమయిపోతూందని పరిగెట్టాలి, పదిమందిలో దర్జాగా “ఇవాళ మా ఆఫీసులో ఏం జరిగిందో తెలుసా” అంటూ కథలు చెప్పాలి గానీ, తీరిగ్గా ఎనిమిది గంటలకి లేచి … …. ఏ భార్యకి మాత్రం ఆ దినచర్య ఆనందదాయకం? తనఎదటా, వెనకా కూడా ఆఫీసులో అందరూ ఏమనుకుంటున్నారో తనకి తెలుస్తునే వుంది.

అతనికి మాత్రం తెలీదా అమెరికాలో ఎలాటి అర్థాలు తీస్తారో?

***

అదే సమయంలో ఇంటిదగ్గర ఆఫీసురూంగా అమర్చిన రెండో పడగ్గదిలో కంప్యూటరుముందు కూర్చుని ఆలోచనల్లో పడిపోయాడు దినూ. అతనికి ధరణి ఇంకా ఇంటికి రాలేదన్నమాట తోచలేదు. ఆవిడ తనని ఎందుకు అర్థం చేసుకోలేకపోతోందో అంతుబట్టక గింజుకుంటున్నాడతను.

తనకి మాత్రం తెలీదూ అత్తింటివారు ‘పెళ్లాన్ని పోషించుకోలేని అసమర్థుడనీ, ఆడదానిసంపాదన తింటున్నాడని అంటున్నార’ని. నిజానికి తాను ‘ఉద్యోగం చెయ్యను’ అనలేదు. తనకి తగిన ఉద్యోగంకోసం చూస్తున్నాడంతే. అలా చూడ్డం తప్పా? తనరంగంలో తాను రాణిస్తే ఆవిడకి మాత్రం గొప్ప కాదూ? తను నిదానిస్తే, కాస్త ఓపిక పడితే, తన జ్ఞానసంపదకి తగిన అవకాశం వస్తే, మంచి ఆదాయం వుంటుంది. ఎవరికోసం? ఆవిడకీ, పుట్టబోయే పిల్లలకే కదా! ఏదో ఒకటి అని మామూలు ఉద్యోగంలో చేరిపోతే, తన మేధాసంపత్తి అంతా నిరుపయోగం అయిపోదూ? ఏ పనికిమాలినపనికో తలపడితే, తన ఆధిక్యత ఎలా ఋజువవుతుంది? ఉద్యోగం వుంటే చాలనుకుని కొరగానిపనికి సిద్ధపడితే తరవాత పుట్టగతులుంటాయా? అందులోనూ ఈదేశంలో ఇలాటి విషయాల్లో పట్టింపులు మరీ ఎక్కువ. ఎక్కళ్లేని అర్థాలూ తీస్తారు మనం చేసే ప్రతి పనికీను.

“నువ్వు నిజంగా అంత మేధావివి అయితే ఈ పనికెందుకు ఒప్పుకున్నావూ?” అంటారు.

“నీకు తగనిపని ఇంతకాలం ఎలా చేస్తున్నావు?” అంటారు.

“నీకు నిజంగా సామర్థ్యం వుంటే, ఆకంపెనీలోనే ఈపాటికి నీకు డైరెక్టరుపదవి రాకపోనా?” అంటారు.

ఇవన్నీ ధరణికి తెలీవు. అసలు తెలుసుకోడానికేనా ప్రయత్నించదు. తన సామర్థ్యానికీ, మేధాసంపత్తికీ తగిన, తన అసమాన ఐక్యూని ఋజువు చేసుకోగల అవకాశం వస్తే తాను వెంటనే అందిపుచ్చేసుకోడా? తనభర్తకి నోబెల్ బహుమానం అందుకోగల మేధ గలదని తన స్నేహితులతో సగర్వంగా చెప్పుకుతిరిగేరోజు త్వరలోనే వస్తుంది. అప్పుడు తను ఆవిడతో చెప్పడా, ‘భామామణీ, చూసేవా, ఇదంతా నీకోసం’ అనీ. తనముందు ఒప్పుకోకపోవచ్చు కానీ ఆవిడకి మాత్రం మనసులో లేదూ? ‘ఫలానా బహుమతులు గెల్చుకున్న మేధావి, కీర్తిప్రతిష్ఠలు గడించుకున్న మహాపురుషుడు నానాథుడు,” అంటూ తన స్నేహితులతోనూ, పుట్టింటివారితోనూ గర్వంగా చెప్పుకోవాలని?

ఇదే ఇండియాలో అయితే ఏమో కానీ అమెరికాలో ఎవరిష్టం వారిదే కదా. నాకు ఉద్యోగంలేదని నన్ను ఎవరూ చిన్నచూపు చూడరు అనుకుంటూ తన్ని తాను సమర్థించుకున్నాడు అతను.

***

ఏడు దాటింది ధరణి ఇంటికి వచ్చేసరికి, “కాఫీ తాగేవా?” అనడిగింది చెప్పులు గుమ్మందగ్గర వదిలి, వంటింటివేపు నడుస్తూ.

దినూ లివింగ్రూంలో కూర్చుని ఏదో చదువుతున్నాడు. “లేదు”.

ధరణి లోపలికి వెళ్లి కాఫీ పెట్టి, రెండుకప్పుల్లో తెచ్చింది, తనకో కప్పూ, అతనికో కప్పూ. “నేను రావడం ఆలస్యం అవుతుందని ఫోను చేసేను కదా. నువ్వు తాగేయవలసింది.”

“నువ్వొచ్చేక ఇద్దరం కలిసే తాగొచ్చని.” కప్పు అందుకుంటూ అన్నాడు, కళ్లు పుస్తకంమీంచి మరల్చకుండా.

ధరణి కాఫీ కప్పు పుచ్చుకు అతనికి ఎదురుగా కూర్చుంది. స్టెల్లా మాటలు మనసులో మెదలుతున్నాయి. అందులో వాస్తవం అర్థమవుతోంది. తను ఏదో చెయ్యాలి. మాటలు కాదు క్రియలో కనిపించాలి. మీద వాన పడితే కింద తడి కనిపించాలి. “ఇదంతా నీకోసమే!” అంటాడు అతను. అలా అంటే చాలదు. క్రియలో కనిపించాలి.

“ఉద్యోగాలేమయినా చూశావా?”

దినూ ఆశ్యర్యంగా తలెత్తి చూశాడు. “చెప్పేనుకదా అదే వస్తుందని. ఇప్పుడేమయింది?”

ముందులాగే కొంచెంసేపు వాదనలయేయి. “ఎవరికోసం నేను గొప్పఉద్యోగంకోసం చూస్తున్నాను? నీకోసమే కదా. నీభర్త అంత గొప్ప ఉద్యోగస్థుడని నువ్వు గర్వపడాలని. నీకోసం కాదూ ఇదంతా.”

ముందులాగ ఈసారి వూరుకోలేదు ధరణి. “నాకోసంలా లేదు. నాకలా అనిపించడంలేదు. నువ్వు ఇలా పనీ పాటూ లేకుండా కూచోడం, నీకోసమే, నూటికి నూరు పాళ్లూ నీకోసమే, అర్థంలేని ‘ఈగో’తో ఇలా ప్రవర్తిస్తున్నావు. ఎవరో వచ్చి నీకు వెండిపళ్లెంలో ఉద్యోగం తెచ్చి చందనతాంబూలాలతో సమర్పిస్తారన్నది stupid excuse. చేతనయినవాళ్లెవరూ ఎవరో వచ్చి నాకు ఉద్యోగం ఇస్తారని ఎదురు చూస్తూ కూర్చోరు. అమెరికనులెవరూ అలా చెయ్యరు. నిజంగా నాకోసమే అయితే క్రియలో చేసి చూపించు. లేచి ఉద్యోగం చూసుకోగలను అని నిరూపించు,” అని, ఒక్కక్షణం ఆగి, మళ్లీ అంది, “ఈనెలాఖరున నేను స్టెల్లాతో carabbean cruise వెళ్తున్నాను.”

“ఆవిడతో ఎందుకూ? మనిద్దరం వెళ్దాం. Second honeymoon,” అన్నాడు దినూ మాట మార్చడానికి సందు దొరికినందుకు ఆనందపడిపోతూ.

“లేదు. నేను స్టెల్లాతో వెళ్తాను. నేను తిరిగొచ్చేవేళకి నువ్వు వుద్యోగం చూసుకోవాలి.” అంది ధృఢంగా.

“లేకపోతే?”

“Guess” ధరణి హుందాగా లేచి వంటింటివేపు నడిచింది.

దినకర్ అప్రతిభుడయి కూర్చుండిపోయేడు. ధరణి అలా మాటాడగలదని అతను కలలోకూడా అనుకోలేదు. హుమ్. అమెరికా నీళ్లా? అన్న సందేహం తలెత్తింది అతనిమనసులో!

(22 ఏప్రిల్ 2009)

***

————————-

నిడదవోలు మాలతి

గత ముఫ్పైమూడేళ్లగా అమెరికాలో నివసిస్తున్న నిడదవోలు మాలతి తెలుగు కథలను ఆంగ్లపాఠకులకి పరిచయం చేయడానికి తూలిక.నెట్ 2001లో ప్రారంభించారు. ఈమధ్య Telugu Women Writers, 1950-1975, A Unique Phenomenon in the History of Telugu Fiction, అనే పరిశీలనాత్మక గ్రంథాన్ని ప్రచురించారు. వారి ఇతర సంకలనాలు A Spectrum of My People, From My Front Porch (సాహిత్య ఎకాడమీ ప్రచురణ). తెలుగు తూలిక అనే బ్లాగు రాస్తూంటారు.

This entry was posted in కథ. Bookmark the permalink.

11 Responses to నీకోసం

  1. “నిజానికి ఈరోజుల్లో పురుషులే కాదు స్త్రీలు కూడా నాలుగ్గోడలమధ్యా వూరికే గోళ్లు గిల్లుకుంటూ కూర్చోడం లేదు.”
    కథలోని పాత్ర అభిప్రాయమే అయినా యిది రచయిత్రి అభిప్రాయం కూడానేమో అని అనుమానమొచ్చింది. మనసు చివుక్కుమంది.
    అమెరికాలో జీవనవిధానం గురించి నాకు పూర్తిగా తెలీదు కాని, ఇక్కడ భారతదేశంలో ఉద్యోగాలు చెయ్యకుండా ఇంటిని చూసుకొనే ఆడవాళ్ళకి మాత్రం “గోళ్ళు గిల్లుకుంటూ” కూర్చొనేంత తీరిక ఉండదు. కానీ దురదృష్టవశాత్తూ ఎప్పుడు ఎలా వచ్చిందో కాని భారతదేశంలో స్త్రీల గురించికూడా యీ ఆలోచనాధోరణి సమాజంలో విషంలా పాకింది. వాళ్ళు చేసే పనికి గౌరవం లేకుండా పోయింది. ఈ పరిస్థితి మారాలి.

    కథ ముగింపు బావుంది.

  2. vinay chakravarthi says:

    naaku emee artham kaaledu……….

  3. నాకు అమెరికన్ డయాస్పొరా స్పృహలేదో లేక మీ కథలోనే కొన్ని మతలబులున్నాయో తెలీదుగానీ, సాధారణంగా మీ కథల్లో కనిపించే సింప్లిసిటీ,లోతు ఇందులో అస్సలు లేదనిపించింది.

  4. రవికిరణ్ says:

    ఇక్కడ మాలతి గారు లేవనెత్తిన సమస్య దానికి వారు చూపిన పరిష్కారం కూడా వింతగానే వున్నాయి. మాలతి గారిలా నేను ఏ ముప్పై ఏళ్ళ నుంచో ఈ దేశంలో లేను. కానీ నేను కూదా గత పదహారేళ్ళుగా ఇక్కడే వున్నాను. నా అనుభవంలో అమెరికన్లెవరూ ఇంట్లో వున్న నానలగురించి (స్టే హొమ్ డేడ్ ) అంత హీనంగా మాట్లాడుకోవటం నా అనుభవంలో లేదు. ఈ కథ చదివిన తర్వాత నాకర్థవైన విషయవేవిటంటే భారద్దేశం నుంచి తీసుకొచ్చిన ఆ సంకుచితత్వం ఏళ్ళు గడిచినా సజీవంగా వుంటుందనే.

    ధరణి, దినకర్లకి కనీసం తీరిగ్గా కూర్చుని మనసువిప్పి మాట్లాడుకునే చనువే వున్నట్టు లేదు, మళ్ళా వాళ్ళు కొత్త దంపతులు, ఒకరితో ఒకరు మనసు, తనువు రెండూ అనంతంగా పంచుకోవాల్సిన అవసరం, మానసికంగా, శారీరకంగా వున్న వాళ్ళు. తన మనసుని తొలిచేసే అంత గొప్ప కష్టాన్ని ధరణి, మొగుడితో ఎప్పుడూ మనసువిప్పి చెప్పినట్టే లేదు (ఇక ఈ రకంగా వాళ్ళ శృంగారం ఎంత మాత్రవుంటుందో ఆలోచించండి, బహుశా that may be the real underlying problem).

    పోనీ వాళ్ళకేవైనా అంత ఆర్ధికవైన కష్టాలున్నాయా అంటే వాటి గురించి రచయిత్రి ఏవీ మాట్లాడలేదు. తనకిష్టవైన, తనకు కావాల్సిన రీతిలో మొగుడుండలేదనే ఆక్రోశం తప్ప. మొగుడితో తనకి నచ్చనివి ఎందుకు నచ్చలేదో చెప్పటం గానీ, వాటి మంచిచెడుల్ని గురించిన పరిశీలన గానీ, ఆ బలహీనతయొక్క ప్రాక్టికాలిటీ మీద డిబేట్ కానీ ఎక్కడా కనిపించదు. మొగుడితో మాట్లాడడానికే భయపడే ధరణి, మొగుడికి ఆఖరి వార్నింగ్ ఇవ్వటానికి మాత్రం ఏవీ వెనుకాడటం కనపడలేదు.

    ఈ సమస్యలు, భయాలు, కష్టాలు రచయిత్రి తన మనసులో కృత్రిమంగా సృష్టించుకున్న సంఘటనలుగా తప్ప, నిజ జీవితంలో ఈ కథలో ధరణి, దినకర్లు వాస్తవంగా వుండరేవో అని నా అనుమానం. ఒకవేళ ఎవరన్నా, ఎక్కడన్నా వున్నా వాళ్ళ సమస్యలు కథలయ్యే (కథకి ఒక విసృత ప్రయోజనం వుండాలి కదా) అవసరం లేదేవోనని నా అభిప్రాయం.

  5. మహేష్ కుమార్, మీరు కథలో లోతు అని దేనిని అంటారో చెప్పగలరా? ఎందుకంటే లోతు లేదు అన్నమాట తరుచూ వింటున్నాను కానీ మీవ్యాఖ్య చూసింతరవాత మాత్రం నాకు అనుమానం వచ్చింది ప్రత్యేకించి లోతు ఎలా సాధిస్తాం అన్నవిషయంలో.
    ధన్యవాదాలు.

  6. కామేశ్వరరావుగారూ, నేను ఆడవారి గృహపనిని తేలిక చేయలేదండీ. ఏదో సామెతగా చెప్పేనంతే.
    వినయ చక్రవర్తి, ప్చ్.
    రవికిరణ్, కథ అదే వుద్దేశ్యం అదేనండీ – ఇలాటివి కూడా వాస్తవాలే అని తెలియనివారికి తెలియజేయడమే.

  7. ధరణి లాంటి వివాహితతో చక్కని స్నేహం ఉంది.

  8. krish says:

    కథ చదవడం మొదలు పెట్టినపుడు ఆసక్తిగా సాగింది. అయితే కథ పొడువు పెరగడం వలన, మరియు కొన్ని అవాస్తవ సంభాషణల వలన భోరుకొట్టినట్లనిపించింది. ఊదా: ఈ రోజుల్ల్లో ఉద్యోగాలు తెలిసిన వాళ్ళ ద్వారా రావడమే చాలా సులభం. కావున వాడు మేనేజరు లేదా వీడు డైరెక్టర్ అని ఎవరు అవకాశాలు వదులుకోరు.

  9. శ్రీ says:

    బాగుంది కథ.

  10. shrikanth says:

    Very Nice Story Malati garu. Kachitanga ituvanti kadhalu atu itu itu ga sangham lo nadustunnai. Andaru ituvanti samasya gurunchi alochinchali. Expecting some more good stories like this from you.

  11. నెటిజన్, శ్రీ, శ్రీకాంత్, ధన్యవాదాలు మీకు నాకథ నచ్చినందుకు.
    క్రిష్, మీరు చెప్పినకోణం కావాలంటే నామరోకథ, హాలికులైననేమి, చూడండి, నా తెలుగుతూలికలో. ఇది మరో కోణం.

Comments are closed.