రాజశేఖర విజయం

-త్రివిక్రమ్

ప్రజలకు తీరవలసిన కనీస అవసరాలు – కూడు, గూడు, గుడ్డ. కూడు, గుడ్డ సమకూరాలంటే సరైన జీవనోపాధి ఉండాలి. ఇది సవ్యమైన ఆలోచనా తీరు. సంవత్సరానికి 100 పనిదినాలు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని సమర్థవంతంగా అమలుచెయ్యడంతో బాటు నిరుద్యోగ యువకులకు యువశక్తి పథకం, మహిళలకు పావలా వడ్డీ ఋణాలు, వృద్ధులకు అభయహస్తం పెన్షన్లు, ఋణభారం కింద నలిగిపోతున్న రైతులకు ఋణాల మాఫీ, ఉచిత విద్యుత్తు, వీటితోబాటు ఊరూరా పేదలకు సొంతింటి కలను నెరవేర్చే ఇందిరమ్మ గృహాలు – ఇన్ని రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడు కాబట్టే రాజశేఖరుడికి మొదటి నుంచీ గెలుపు మీద అంత ధీమా. ప్రజల అవసరాలను సరిగా గుర్తించి ఆ అవసరాలను తీర్చే విధంగా తన ప్రభుత్వ ప్రాథమ్యాలను నిర్దేశించుకున్న ప్రజానాయకుడు కాబట్టే తన విజయం మీద ఆయనకు అంత భరోసా.

కూడూ గూడూ గుడ్డే ఎవరికీ పరమావధి కాకూడదు. అవి తీరాక ప్రతి ఊరికీ సమకూరవలసిన మౌలిక సౌకర్యాలు – తాగు నీరు, సాగు నీరు, రోడ్లు, విద్యుత్తు, విద్య, వైద్య సౌకర్యాలు. ప్రతి ఒక్కరికీ ఇవి అందుబాటులోకి రావాలి.

సురక్షితమైన మంచినీరు అందుబాటులో లేక నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు ప్రబలడమేగాక ఒక్కొసారి జలకాలుష్యం ప్రాణాంతకంగా పరిణమించడం కూడా చూస్తున్నాం. ఎండాకాలంలో నగరాలు, పల్లెలు అనే తేడా లేకుండా నీటి ఎద్దడి సర్వసాధారణం కావడం, రాయలసీమలోని రాయచోటి లాంటి పట్టణాల్లో ఏటా కోట్ల రూపాయల మంచినీటి వ్యాపారం సాగడం నాగరిక ప్రభుత్వాలకు సిగ్గుచేటైన విషయం. వై.ఎస్. ప్రభుత్వం ఇప్పుడైనా ఈ అంశం మీద దృష్టి పెట్టి మంచినీటి సమస్యను పరిష్కరిస్తుందని ఆశిద్దాం.

సాగునీటి సమస్యకు సంబంధించి వై.ఎస్.ఆర్. చేపట్టిన జలయజ్ఞం చారిత్రాత్మకం. అది అనుకున్నట్లు నాలుగేళ్లలో పూర్తౌతుందని తామూ ఆశించలేదనీ, అసలు ఆ బృహత్తరమైన కార్యక్రమాన్ని చెయ్యబూనడమే గొప్ప విషయమనీ, ఆ కల సాకారం కావడం కోసం తాము ఇంకొంత కాలం ఎదురుచూడగలమనీ ప్రజలు తమ ఓటు ద్వారా చెప్పినట్లైంది. నీటి పారుదల, వ్యవసాయరంగం, విద్య, వైద్య సౌకర్యాలు తమ ప్రభుత్వ ప్రాథమ్యాలుగా, కొత్త పథకాలు ప్రకటించకుండా ప్రస్తుతం చేపట్టిన ప్రాజెక్టులను కొనసాగించడం, వాటిలో లోపాలను సరిదిద్దడం తమ కర్తవ్యంగా చెప్తున్నారు. మాటలు చెప్పడంతో సరిపుచ్చక చేతల్లో చూపించాలి. ముందుగా నాలుగేళ్లలో పూర్తిచేస్తామని బీరాలు పలికిన జలయజ్ఞం కనీసం ఈ ఐదేళ్లలోనైనా పూర్తిచెయ్యాలి. సాగునీటితో బాటు ఏ గ్రామంలోనూ, పట్టణంలోనూ మంచినీటి కొరతనేది లేకుండా చూడాలి. ఇళ్లకు, పొలాలకు, పరిశ్రమలకు విద్యుత్తు సక్రమంగా అందేలా చూడాలి. అస్తవ్యస్తంగా మారిన విద్యుత్ పంపిణీ వ్యవస్థలోని లోపాలను సవరించకపోతే రానున్న ఐదేళ్లలో విద్యుత్ పంపిణీ వ్యవస్థ మొత్తం కుప్పకూలుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మన దేశంలో రోడ్ల వంటి మౌలిక సౌకర్యాల మీద దృష్టి పెట్టిన ఘనత వాజపేయి నేతృత్వంలోని ఎన్.డి.ఏ. ప్రభుత్వానిదే. ఐతే గ్రామ గ్రామానా రోడ్లు వేయించడం ద్వారా మారుమూల గ్రామాలను సైతం కనెక్ట్ చేసింది మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇక్కడ ప్రధాన మంత్రి గ్రాం సడక్ యోజన లాంటి కేంద్ర ప్రభుత్వ పథకాలు బాగా ఉపయోగపడ్డాయి. ఇక రాష్ట్రంలో రైల్వే సౌకర్యాలను విస్తృతపరచాలని గత ఐదేళ్ల కాలంలో ఎంత ప్రయత్నించినా కేంద్రంలో కోరి రైల్వే మంత్రిత్వ శాఖను అందుకున్న మంత్రి ఆలకించకపోవడం వల్ల అనుకున్న ప్రగతి సాధించలేకపోయాడు రాజశేఖర రెడ్డి. కొత్త ప్రభుత్వంలో రైల్వే మంత్రి మన రాష్ట్ర అవసరాలను పట్టించుకునేలా ఆయన చూడాలి. అలాగే రాష్ట్రంలో చిన్న విమానాశ్రయాలను ఏర్పాటు చెయ్యబూనుకున్న తొలి ప్రభుత్వం వై.ఎస్.దే. ఈ ప్రాజెక్టులనూ సత్వరం పూర్తిచెయ్యవలసిన బాధ్యత వై.ఎస్. మీద ఉంది.

విద్య అంటే ప్రాథమిక విద్యకే పరిమితం కాకుండా ప్రతి జిల్లాలోనూ కనీసం ఒక విశ్వవిద్యాలయం నెలకొల్పడం ద్వారా ఉన్నత విద్యావకాశాలను అందరికీ అందుబాటులోకి తేవాలన్న యు.జి.సి. సిఫార్సులను అమలుచేసిన ఏకైక రాష్ట్రం వై.ఎస్. పాలిత ఆంధ్ర ప్రదేశ్.

ఆరోగ్యశ్రీ పథకం ద్వారా నిరుపేదలకు సైతం కార్పొరేట్ వైద్యసేవలు పొందే అవకాశం కల్పించిన ఘనతా ఆయనదే. ఐతే ఆ కార్పొరేట్ స్థాయి వైద్యసేవలేవో జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వాసుపత్రుల్లోనే కల్పించవచ్చు. కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు కల్పించాలంటే ముందు ప్రభుత్వాసుపత్రుల్లో జవాబుదారీతనం పెరగాలి. జిల్లా ప్రధాన ఆస్పత్రుల్లో సకల వైద్య సౌకర్యాలు కల్పించడంతోబాటు గ్రామస్థాయిలో నెలకొల్పిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (PHCs) సక్రమంగా పనిచేసేలా చూడాలి.

ఇన్ని విధాల ప్రజావసరాలను తీర్చడంతోబాటు (తెలంగాణా విషయంలో ఆయన వేసిన ఎత్తుజిత్తులెన్నైనప్పటికీ) రాష్ట్రాన్ని ముక్కలవనీయకుండా సమైక్యంగా ఉంచే సంకల్పం, సామర్థ్యం గల ఏకైక నాయకుడు ఆయనే అని తేలిపోయింది.

ఐతే దాని అర్థం ఆయన పాలన లోపరహితమని కాదు. అవినీతి, ఆశ్రిత పక్షపాతం, ఇష్టారాజ్యంగా వ్యవహరించడం గడచిన ఐదేళ్ల కాలంలో ఆయన ప్రభుత్వపు ట్రేడ్ మార్కులు గా; అ, ఆ, ఇ లుగా మారాయి. ఎన్నికల్లో ప్రభుత్వానికి అనుకూలంగా పడిన ఓట్ల కంటే వ్యతిరేకంగా పడిన ఓట్లే ఎక్కువ కావడానికి అ, ఆ, ఇ లే కారణం. ఐనా వై.ఎస్ ప్రభుత్వం అధికారం నిలబెట్టుకోగలిగిందంటే అందుకు కారణం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు వివిధ ప్రతిపక్ష పార్టీల మధ్య అసమంగా చీలిపోవడమే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడిన ఓట్లు కాంగ్రెస్ తన అధికారం నిలబెట్టుకోవడానికి సరిపోయేంత ఎక్కువగానూ, త్రిశంకు సభ ఏర్పడే అవకాశం లేనంత తక్కువగానూ మహాకూటమి, కొత్తగా పోటీ చేసిన ప్రరాపా, లోక్ సత్తా ల మధ్య చీలిపోవడం గమనార్హం.

కాంగ్రెసేతర పార్టీలు కూడా గత ఐదేళ్ల ప్రభుత్వవ్యవస్థలోని లోపాలను సరిచేస్తామనిగానీ, అ ఆ ఇ లను తగ్గించేస్తామనిగానీ భరోసా ఇవ్వలేదు. ‘ఇన్నాళ్లూ కాంగ్రెసోళ్లు తిన్నారుగదా ఇక మేమూ తింటాం మీకూ నాలుగు మెతుకులు రాలుస్తాం మాకూ అవకాశమివ్వండి’ అని అర్థంవచ్చే మాటలతో ప్రజలను ఓట్లడగడానికి వచ్చాయి.

ఈ ఎన్నికల్లో నగదుబదిలీ పథకానికి పెద్దఎత్తున జనం ఆకర్షితులవకపోవడానికి కారణం ప్రస్తుత ప్రభుత్వపు పనితీరు గొప్పగా ఉందనికాదు, గుడ్డిలో మెల్ల అని మాత్రమే. ఆర్థికశాస్త్రం చదివిన చంద్రబాబుకు ప్రజల అవసరాలు తెలియవనుకోలేం. కానీ ఒక ప్రభుత్వాధినేతగా అయన ఆ దిశగా తన ప్రాథమ్యాలు నిర్దేశించుకోలేదు. తాను ప్రకటించిన నగదు బదిలీ పథకం దుష్పరిణామాల గురించీ ఆయనకు తెలియదనుకోలేం. అది ప్రజలను సోమరులుగా మారుస్తుంది. రాష్ట్ర ఉత్పాదకత మీద తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. ద్రవ్యోల్బణం కట్టలు తెంచుకుంటుంది. ప్రజలు విలాసాలకు, వ్యసనాలకు బానిసలౌతారు. ప్రజలకు ఊరికే డబ్బివ్వడం మంచి ఆలోచనే ఐతే ప్రభుత్వాలు తమకు కావలసినన్ని నోట్ల కట్టలు ముద్రించుకుని పంచుకోవచ్చునే? ఎందుకు ముద్రించుకోకూడదో ఆయనకు తెలుసు. అదృష్టవశాత్తూ, ఆయన మీద నమ్మకం కోల్పోయిన ప్రజలు కూడా ‘నువ్విస్తానన్నా మేమొద్దంటామ’నేశారు. ప్రతిపక్షనేతగా విఫలుడైన చంద్రబాబు ఎన్నికల సందర్భంగా ఇదొక్కటే కాకుండా అలవిగాని వాగ్దానాలు చాలా చేశాడు. కానీ, రాజశేఖరరెడ్డి మాత్రం కొత్త వాగ్దానాలు చెయ్యకుండా తన ఐదేళ్ళ పాలన పైన తనకున్న నమ్మకంతో ఒంటరిపోరుకు సిద్ధమవడం చూస్తే ఒక ప్రజానాయకుడిగా ఆయన ఆత్మవిశ్వాసం అచ్చెరువు గొలుపుతుంది. ఆ కారణంగా రాబోయే ఐదేళ్ళలో రాష్ట్రానికి సబ్సిడీల భారం మరింత పెరిగే ప్రమాదం కూడా తప్పింది.

మరోవైపు ఒక సినీహీరోగా తమ పార్టీ అధినాయకుడికున్న ప్రజాదరణ ఒక్కటే ఓట్లు కురిపించి ఆయనను అధికారపీఠమ్మీద కూర్చోబెడుతుందని నమ్మిన ప్రరాపా నాయకుల ఆశలు అడియాసలయ్యాయి. ఆ పార్టీ ఓటమి వారి స్వయంకృతం. ఇక లోక్ సత్తా పార్టీ గెలిచిన సీటు ఒకటే అయినా చాలా చోట్ల గణనీయమైన ఓట్లు సాధించి ప్రధానపార్టీల అభ్యర్థుల గెలుపు ఓటములను ప్రభావితం చెయ్యగలగడం ఆశావహ పరిణామం. జయప్రకాశ్ నారాయణ్ చేరిక వల్ల శాసనసభలో నిర్మాణాత్మకమైన చర్చలు జరుగుతాయనే నమ్మకం కలుగుతోంది.

ఈసారి కూడా గతంలో లాగే అసెంబ్లీ ఎన్నికలతోబాటే పార్లమెంటుకూ ఎన్నికలు జరిగినా అసలు ఈ ఎన్నికల్లో దేశానికి సంబంధించిన ఏ సమస్యా రాష్ట్రంలో అసలు ప్రస్తావనకే రాకపోవడం ఆశ్చర్యం. ఎన్నికల ప్రచారం పూర్తిగా రాష్ట్ర సమస్యల మీదే జరిగింది. సోనియా, రాహుల్ ల నాయకత్వం, మన్మోహన సామర్థ్యం, అణు ఒప్పందం, చంద్రయానం, లాంటివేవీ వినబడలేదు. ముఖ్యమంత్రి ఆత్మవిశ్వాసానికి అదో మచ్చుగా చెప్పుకోవచ్చు. తన రాజకీయ చాతుర్యంతో పార్టీలో తనకెదురు లేకుండా చేసుకున్న నాయకుడు రాజశేఖరరెడ్డి. ఆయన నేతృత్వంలో నేడు ఏర్పడనున్న కొత్త ప్రభుత్వ ఏలుబడిలో రాష్ట్రంలో వచ్చే ఐదేళ్ళూ అదే సుస్థిరత ఉంటుందని ఆశించవచ్చు.

This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

6 Responses to రాజశేఖర విజయం

  1. ప్రతి పక్షాలు ఎన్నడూ ప్రజల సమస్యలు పట్టించుకోలేదు. తెలంగాణాలో చాలా గ్రామాలలో తాగు నీటి బావులు కూడా సరిగ్గా లేవు. ఆ విషయం టి.ఆర్.ఎస్. అడ్రెస్ చేసినా వాళ్ళకి వోట్లు పడేవి. కాంగ్రెస్ మీద అవినీతి ఆరోపణలు చెయ్యడానికే ఎక్కువ శ్రద్ధ చూపడం వల్ల టి.ఆర్.ఎస్.కి అసలుకే మోసం వచ్చింది. ఇక తెలుగు దేశం విషయానికి వస్తే, చంద్రబాబు నాయుడు గతంలో ఏవైతే సాధ్యం కావు అన్నాడో, ఇప్పుడు అవే సాధ్యం అంటున్నాడు. ఉచిత విద్యుత్ ఇస్తే కరంట్ తీగల మీద బట్టలు ఆరేసుకోవలసిన పరిస్థితి వస్తుందన్నాడు. ఇప్పుడేమో రోజంతా ఉచిత విద్యుత్ అందిస్తాం అంటున్నాడు. ఇతని మాటలు ఏ గెడ్డం పెంచిన వైరాగి అయినా నమ్ముతాడా? గతంలో మద్య నిషేధం సాధ్యం కాదన్నాడు, ఇప్పుడు బెల్ట్ షాపులు మూసి వెయ్యిస్తాం అంటున్నాడు. సబ్సిడీలు ఇవ్వడం సాధ్యం కాదన్నాడు, ఫ్రీ మనీ ట్రాన్స్ఫర్ మాత్రం సాధ్యమేనని అంటున్నాడు. ఇతని మాటలలోనే ఒకదానికొకటి పొంతన లేనివి ఉన్నప్పుడు ఇతన్ని ఎంత మంది నమ్మి వోటు వేస్తారు?

  2. srisailam says:

    RAJASHEEKHARA VIJAYAAM AANDHRA,TELANGANA RAAYALASSEMA KOOSTA ANNIPRANTHALAA PRAJALU THAMA SAMPURNA MADDATU WAARANEY EE VIJAYAAM RAJASHEEKHARUDU PORAJALAA RUNAANI THIRUCHUKOONTADINT AASUHSISTU

  3. bvr babu says:

    ఏ వెబ్ సైట్లో మనం రాజకీయాలను దూరంగా పెట్టుకెంటే మంచిదేమో.

  4. brahma krishna reddy says:

    i appreciate your clear cut analysis. avunu nijame guddi kante mella melu nenu oka palletoorilo puttina vadine.e prabutvamaina moulika sadupaila paina drusti sarinchali. Kanisa avasaralaina surakshitamaina niru, connectivity by roads, Energy supply are very important.YSR istananna 9 hrs electricity ivvagaligite mana raitu ku tirugu ledu.If you compare the last 5yrs and chandrababu 5yrs there is a huge diffrece in the villages. Especially due to commodities boom and saraina samayam lo varshala valla mana raitu nalugu dabbulu chuda galugu tunnadu ….. you heard real estate boom in urban cities …. oka vela jala yagnam correct ga puti ayte u will agri real estate boom in future…. ippatike konni prantalalo agri lands have gone up by two folds in the last two years …… jai ho ysr keep up your good work …. niku addu vastunna kalupu mokkalani yeri parestu munduku sagipo….

  5. Raja Sekhar Mangamuri says:

    3v..naaku title nachindi…:-)

  6. VEERENDRA says:

    ayya rajashekar reddy garu oka kulaniki pedda pita vesaru a vishyam enduku prasthavinchaledu
    rastram lo matha kalahalu repina oka nicha saamskruthi rejashekar reddy di kada……..
    e rastranni prapancha patam lo telugodi satta ni chatindi chandra babu kada
    sampurna poliyo nivarana kosam teachers ni prathi inti inti ki pampi prathi 5 samvathasarala lopu pilla ki poliyo chukkalu andela choosindi chandrababu kada………..
    madhyana bhojana padakam,dwakara padakam,janmabhoomi,paniki ahara padakam,
    niru-miru,inkudu guntala padakam dwara maleria nivarana chesindi chandra bab padakam kada……….
    ayya anduru chandra babu vyavasayam maneyandi ani annadu ani media kodai ayi koosindi, nizam ga ala ani vunte aaa video clips media daggara vunnaya…………
    prathi prabuthva karayalamlo anduru perefect time ki office ki vachala chesi na ganatha chandra babu di kada………
    108 service ni pravesa pettindi chandrababu kada……..

Comments are closed.