నిడదవోలు మాలతి ప్రముఖ రచయిత్రి మాత్రమే కాక, ప్రసిద్ధ బ్లాగరి కూడా. ఆమె తన బ్లాగానుభవాలను ఇక్కడ వివరిస్తున్నారు. అలాగే రచయితలు, సంపాదకుల హక్కులపై తన అభిప్రాయాలను కూడా తెలియజేసారు. పొద్దు సంపాదకవర్గ సభ్యురాలైన స్వాతికుమారి నిర్వహిచిన ఈ ఇంటర్వ్యూ ఈ భాగంతో ముగుస్తున్నది.
తెలుగుబ్లాగుల్లో నన్ను ఆకట్టుకున్న అంశాలు
తెలుగుబ్లాగులు నన్ను ఆకర్షించడానికి మరొక కారణం తెలుగు నుడికారం. నాకు చిన్నప్పట్నుంచీ తెలుగంటే అభిమానమే. అమెరికా వచ్చేక తెలుగు మాట్లాడే అవకాశం బాగా తగ్గిపోయింది. ఇక్కడికి వచ్చేక జీవనసరళి మూలంగానూ వాతావరణం మూలంగానూ తెలుగువాళ్లం కూడా తెలుగులో మాట్లాడం. తెలుగులో మొదలు పెట్టినా, ఇంగ్లీషు వాక్యాలకి వాక్యాలే దొర్లిపోతాయి మాటల్లో. “వెదరెలా వుంది” అంటాం కానీ “వాతావరణం ఎలా వుంది” అనం కదా. తెలుగులో మనకి వర్ణనాత్మకంగా చెప్పుకోడం అలవాటు. “ఎండలు మండిపోతున్నాయి”. “చలి ఎముకలు కొరికేస్తోంది” అంటాం కానీ “ఈరోజు యాభై డిగ్రీలుంది” అనం, ఆలిండియా రేడియోవారు తప్పిస్తే. అదే సాంస్కృతికపరమైన తేడా.
ఇంతకీ నేను చెప్పొచ్చేదేమిటంటే. ఇక్కడ మాడసన్లో తెలుగు మాటాడేవారు లేకపోవడం నాలో చాలా వేదన కలిగించింది. తెలుగువాళ్లు వున్నారు కానీ, తెలుగులో మాట్లాడేవాళ్లు లేరు. నిజానికి ఇక్కడ నావాళ్లెవరూ లేరన్న విషయంకంటే కూడా ఎక్కువగా బాధించింది తెలుగుమాట వినిపించకపోవడమే. కొంతకాలం అయేక, ఎందుకో నాకథలే తీసి చూసినప్పుడు నాకు అర్థమయింది, నేను తెలుగు ఎంతగా మర్చిపోయానో. ఆమధ్య చాతకపక్షులు రాస్తున్నప్పుడు “పెళ్లి ఎరేంజిమెంట్లు” అని రాసేను. “ఎరేంజిమెంట్లు”కి తెలుగు “ఏర్పాట్లు” అన్నమాట గుర్తు తెచ్చుకోడానికి నాకు మూడు వారాలు పట్టింది. వాడుతుంటేనే భాష జ్ఞాపకం వుంటుంది.
ఇక్కడ మాకు లైబ్రరీలో తెలుగుపుస్తకాలు చాలా వున్నాయి. కానీ చదవబోతే కాగితంమీద దృష్టి నిలిచేది కాదు, వ్యక్తిగతకారణాలవల్ల. తూలిక మొదలు పెట్టడానికి అది కూడా ఒక కారణం. అనువాదాలు చేస్తున్నప్పుడు తప్పనిసరిగా ప్రతివాక్యంమీద దృష్టి పెట్టాలి. అంతేకాక, అనువాదానికి ఒక ధ్యేయం వుంది కనక వుత్సాహం కూడా వుంటుంది.
ఇంగ్లీషు అనువాదాలు చేస్తున్నాను కానీ, నాతెలుగుని నిలుపుకోవాలంటే నేను తెలుగులోనే రాయాలి అన్న తపన కూడా బాధిస్తూ వచ్చింది. అంచేత నా పాతకథలు తీసి నా ఇంగ్లీషుతూలికలోనే ప్రచురిస్తూ వచ్చేను.
అప్పుడు కొందరు నా తెలుగుకథలు బాగున్నాయంటూ ఉత్తరాలు రాసేరు. కొందరు పాఠకులు కేవలం తెలుగు కథలకోసమే నాసైటు చూస్తున్నారని కూడా అర్థమయింది, దాంతో తెలుగుతూలిక వేరుగా పెట్టాలన్నకోరిక కలిగింది. కొత్తగా పరిచయమయిన సౌమ్య తన బ్లాగు చూడమని చెప్పిన తరవాత చూశాను తెలుగు బ్లాగులు. అప్పటివరకూ నాకు తెలుగు బ్లాగులున్నాయనే తెలీదు.
తెలుగుబ్లాగులు చూసేక దాహార్తునికి నీటిచెలమ ఎదురైనట్టు అనిపించింది నా ప్రాణానికి. అంతవరకూ ఈనాటి యువతకి తెలుగురాదన్న ఘోష మాత్రమే వినిపించింది నాకు. నిజానికి నేను కూడా అలాగే అనుకున్నాను. కానీ తెలుగుబ్లాగుల్లో మంచి తెలుగునుడికారం చూశాను. తెలుగు సాహిత్యంతో మంచి పరిచయం వున్న రచయితలని చూశాను. తెలుగుని నిలుపుకోవాలన్న తాపత్రయం చూశాను, ఈనాటి యువతీయువకుల్లో. నామనసు ఆనందంతో పొంగిపోయింది.
ఎటొచ్చీ బ్లాగరులందరూ అలా రాయడం లేదు. కొందరు ఈరోజుల్లో ఇలాగే మాట్లాడుకుంటున్నాం అంటూ సగానికి సగం ఇంగ్లీషే వాడుతున్నారు. నేను తెలుగు బ్లాగులు చూసేది నాకు ఇక్కడ మావూళ్లో వినిపించని తెలుగుకోసం. “సండే రండి. మండే పొండి” అంటే రెండవ అక్షరం యతి కుదిరిందేమో కానీ “ఆదివారం రండి, ఓపూట వుండి, కబుర్లు చెప్పుకుని సోంవారం వెళ్లిపోదురు గానీ” అన్న మాటల్లో వున్న తీపి లేదు. అంచేత సాధారణంగా నేను మంచి తెలుగులో రాసిన టపాలు మాత్రమే చూస్తాను.
బ్లాగులూ, బ్లాగరులనుండి నేను కోరేది ఏమిటి..
నిత్యజీవితంలో ఇంగ్లీషులో మాట్లాడితే మాట్లాడుకోండి. కానీ తెలుగుటపాలో తెలుగులో రాయడానికి ప్రయత్నించండి. పైన చెప్పినట్టు ఒకొకసారి మాటలు వెంటనే స్ఫురించవు. కాస్త కాలం వెచ్చించి అయినా తెలుగులో చెప్పడానికి ప్రయత్నించండి.
ఇక్కడే మరొక సంగతి కూడా ప్రస్తావిస్తాను. ఈమధ్య బ్లాగులలో దుర్భాషలగురించి ఉధృతంగానే చర్చ జరిగింది కనక. నా అభిప్రాయం – అసభ్యకరమయిన భాషణలన్నీ స్త్రీలని అవమానించేవే. తల్లితోనూ, పిల్లలతోనూ ప్రత్యక్షంగానో పరోక్షంగానో సంబంధం కలుపుతూ ఆడిన మాటలు ఎవరిని కానీ, సత్కార్యాలవేపు మళ్లించవనే నా అభిప్రాయం. మరింత రెచ్చగొట్టి మరిన్ని దుర్భాషలకే దారి తీస్తాయి.
బ్లాగులంటే సొంత డైరీలు అనే ప్రతీతి అయినా తెలుగు బ్లాగులు ఆస్థాయి దాటి విశిష్టమయిన సాహిత్యవిలువలని సంతరించుకుంటున్నాయి. ఇప్పటికే ఎన్నో బ్లాగులు చక్కని కథలూ, కవితలూ, వ్యాసాలూ – ఏ సాహిత్యపత్రికకీ తీసిపోని స్థాయిలో అందిస్తున్నాయి. సంగీతం, రాజకీయాలు, సినిమాలు మీద వ్యాసాలు, చర్చలూ వస్తున్నాయి. తెలుగుభాషని పటిష్టం చేసి, మళ్లీ నిజమయిన వాడుకభాషగా చెయ్యడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. బ్లాగరులు ఈవిషయాలు దృష్టిలో పెట్టుకుని తమబ్లాగులని ప్రయోజనకరంగా నడపడం అలవర్చుకుంటే బాగుంటుంది. స్వంత ఇంట్లో మాట్లాడుకుంటున్నప్పుడు కూడా పక్కన ఎవరున్నారో చూసుకుని పదాలు వాడతాం. అలాగే బ్లాగుల్లోనూ. బ్లాగరులు తలుచుకుంటే సంయమనం అలవర్చుకుని ఈ తెలుగులోకాన్ని సుభిక్షం చెయ్యగలరు. నన్నడిగితే, ఈ “బ్లాగు” అన్న పదం కూడా వదిలేసి మరొక పదం ఈసృజనాత్మక లోకానికి తగినట్టు తయారు చేస్తే బాగుంటుందేమో కూడా.
సంపాదకులూ, వ్యాఖ్యాతలు – అప్పుడూ -ఇప్పుడూ
జాలంలో సంపాదకులు, పాఠకులు సాహిత్యంగురించి అవగాహన వున్నవారు – అని మీరంటున్నారు. కొందరివిషయంలో అది నిజమే అనుకుంటాను. కానీ అవగాహనపేరుతో కొందరు “అతి” చేస్తున్నారేమో అనిపిస్తోంది ఒకొకప్పుడు.
సంపాదకులవిషయం తీసుకుంటే పూర్వపురోజులకీ ఇప్పటికీ బాగనే కనిపిస్తోంది. అప్పట్లో చెప్పేను కదా ప్రోత్సాహం ప్రధానంగా వుండేది. ఇప్పుడు ప్రశ్నించడం ప్రధానమయిపోయింది. కథలో రచయిత “ఏం చెప్తున్నాడు” అన్న ప్రశ్న కంటే ముందు “ఏం చెప్పలేదు” అన్నదృష్టితో కథ చదువుతున్నట్టు కనిపిస్తోంది, కొన్ని వ్యాఖ్యానాలు చూస్తే. వెనకటిరోజుల్లో నీతి -పరస్పరగౌరవం. ఈనాటి నీతి -పృచ్ఛ. దీనికి కొంతవరకూ కారణం పాశ్యాత్య సాంప్రదాయం. ‘ప్రశ్నించడం తప్పు’ అని కాదు నా ఉద్దేశ్యం. కానీ సూక్ష్మంగా పరిశీలిస్తే నాకు కనిపించిన అంశాలు – మీరు ఉదాహరణలతో సహా, ప్రత్యేకించి నాఅనుభవాలు చెప్పమంటున్నారు కనక చెప్పడానికి ప్రయత్నిస్తాను.
ముందు సంపాదకుల విషయం చూద్దాం. పూర్వంలాగే ఇప్పుడు కూడా చాలామటుకు ప్రింటు పత్రికలు అంగీకరించడమో, తిరస్కరించడమో చేస్తున్నారు కానీ ఎందుకు తిరస్కరిస్తున్నారో కారణాలు చెప్పడంలేదు. అందుకు ముఖ్యకారణం అనాదిగా వస్తున్న సాంప్రదాయం కావచ్చు. వ్యవధి లేకపోవడం కావచ్చు. ప్రముఖ పత్రికలకి వందలకొద్దీ కథలూ, కవితలూ వస్తుంటే వాటన్నిటికీ జవాబులు రాస్తూ కూర్చోడం కష్టం అని కావచ్చు.
అందుకు భిన్నంగా, అంతర్జాల పత్రికలు కొత్త నిబంధనలు ప్రవేశ పెడుతున్నారు. అయితే ఆ నిబంధనలవెనక కారణాలు ఏమిటి, వాటివల్ల వారు అధికంగా సాధించింది ఏమిటి అంటే నాకు కొంచెం అయోమయంగానే వుంది.
అసలు అంతర్జాలపత్రికలు తెలుగులో పట్టుమని పది కూడా లేవు. ఇందులో బాగా ప్రాముఖ్యత సంతరించుకున్నవి మూడో నాలుగో. వీటికి వచ్చే రచనలు ఎన్ని వుంటాయో నాకు తెలీదు కానీ సుమారుగా ఇరవయ్యో ముప్ఫయ్యో అనుకుందాం.
ముందు హక్కులూ నిబంధనలూ చూద్దాం.
తొలిసారిగా నేను గమనించిన కొత్త నిబంధన సౌమ్య పుస్తకం.నెట్‌కి నన్ను రాయమని అడిగినప్పుడు. నిబంధనలలో “ప్రచురించిన రచనలమీద హక్కులు పూర్తిగా పుస్తకం.నెట్కే చెందుతాయి” అన్న వాక్యం చూసినప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది. ఆతరవాత సౌమ్యతో ఉత్తరప్రత్యుత్తరాలు జరిపేవరకూ నాకు తెలీదు, పొద్దువారి నిబంధన కూడా అదేనని. నాకృషి మూలంగా ఉద్బవించిన రచన నేను వేరే చోట ప్రచురించడానికి వారి అనుమతి కోరాలనడం న్యాయంగా నాకు తోచలేదు. ప్రతిఫలం ఇచ్చినప్పుడు “మావే హక్కులన్నీ” అనడానికి కొంత బలం వుంది. కానీ తెలుగు పత్రికలూ, ప్రచురణకర్తలూ కూడా ఆ ప్రతిఫలం ఒకసారి ప్రచురించుకోడానికే అనీ, “సర్వస్వామ్య సంకలితములు” అనీ అన్నా, రచయితలు సంపూర్ణంగా హక్కులు వదులుకోడం ఎప్పుడూ జరగలేదు.
ఇంతకీ నా అభ్యంతరం మూలంగానో మరోకారణంచేతో కానీ పుస్తకం.నెట్ తమ నిబంధనని తొలగించినట్టు సౌమ్య నాకు తెలియజేసింది. అప్పుడే పొద్దు సైటులో హక్కులమీద వారు ప్రచురించిన కాయితం మరోసారి చూసుకున్నాను. హక్కులు రచయితలవే అని వారు అంగీకరించారు.
నేను నిన్ననే పూర్తి చేసిన వ్యాసం ICFAI university journal of English studies విషయంలో కూడా హక్కుల ప్రస్తావన వచ్చింది. వారు కూడా హక్కులన్నీ యూనివర్సిటీవారివే అనడం, నేను ఒప్పుకోకపోవడం, దాంతో వారు తమ పాలసీ మార్చుకోడం జరిగింది. ఇది ఎలా మొదలయిందో నాకు తెలీదు కానీ రచయితలందరూ గమనించవలసిన అంశం.
* ఇది కనీసం రెండు రకాలుగా జరగొచ్చు:
1. ఒక జాలపత్రికలో/ వెబ్సైటులో వచ్చిన వ్యాసాన్ని ఇంకో వెబ్సైటులో పరిచయం చెయ్యడం. ఉదా: పొద్దులో వచ్చిన ఒక వ్యాసాన్ని నవతరంగంలో 2008 జనవరిలో పరిచయం చేశారు.
2. ఏదైనా ఒక అంశం గురించి వ్యాసం రాస్తున్నప్పుడు ‘ఇదే అంశాన్ని గురించి ఫలానా వ్యాసంలో ఫలానా రచయిత ఇలా అన్నారు.’ అని రెండు మూడు వాక్యాలు ఉటంకించి (పేరాలకు పేరాలే ఎత్తి రాయకుండా) పూర్తి వ్యాసానికి లింకు ఇవ్వొచ్చు. (స్థలాభావం అన్నది వెబ్సైట్లకు, జాలపత్రికలకు వర్తించదు.)
** లింకు ప్రింటుపత్రికలో ఇస్తే ఎంతమందికి వీలవుతుంది అంతర్జాలంలో చూసుకోడానికి.” అని మాలతి గారు ఇంటర్వ్యూలో అన్నారు. ఆమె పొరపాటు పడ్డారు. జాలపత్రికలలో పునఃప్రచురణ చేసేటపుడు మాత్రమే పూర్తి వ్యాసాన్ని ప్రచురించకుండా ఉటంకింపులు చేస్తూ, పొద్దు వ్యాసానికి లింకు ఇవ్వాలి అని చెప్పాము. ప్రింటు పత్రికల విషయంలో కాదు. మరిన్ని వివరాలకు పొద్దు కాపీహక్కుల విధానం చూడవచ్చు.
*** సమీప భవిష్యత్తులో కంప్యూటరులో పత్రికలు, సాహిత్యం చదివేవారి సంఖ్య ఇతోధికంగా పెరగనుంది. -సం.
సందర్భం వచ్చింది కనక పొద్దులోనూ (ఈమాట.కాంలో కూడా వుంది) వున్న మరోనిబంధన గురించి కూడా ప్రస్తావిస్తాను. “ఇతర సైటులో కానీ పత్రికలో కానీ ప్రచురిస్తే పూర్తి పాఠం ప్రచురించకుండా, కొంత భాగం ప్రచురించి, మాపత్రికకి లింకు ఇవ్వాలి” అన్నది. వాస్తవిక దృష్టితో చూస్తే, ఇది ఎలా ఆచరణీయమో నాకు అర్థం కావడంలేదు. ఎంచేతంటే మరో పత్రిక నాకథో వ్యాసమో ప్రచురించాలనుకుంటే పూర్తి పాఠం అడుగుతారు కానీ, నాలుగు వాక్యాలు వేసి మీకు లింకు ఇవ్వడానికి ఎందుకు ఒప్పుకుంటారు? దానివల్ల ఆ సైటువారికి కానీ పత్రికవారికి గానీ ఏం లాభం? మరొకవ్యాసంలో ఎలాగా పూర్తిపాఠం ఇవ్వరు ఎవరూ స్థలాభావం చేత.* ఉదహరించినప్పుడు అయితే లింకు చాలు, నాలుగు వాక్యాలు కూడా అక్కర్లేదు. పైగా లింకు ప్రింటుపత్రికలో ఇస్తే ఎంతమందికి వీలవుతుంది అంతర్జాలంలో చూసుకోడానికి.** ఇండియాలో సాఫ్టువేరు ఇంజినీర్లు కానివారు ఎంతమంది కంప్యూటరులో సాహిత్యం చదువుతున్నారు?*** (చుక్క గుర్తులు గల అంశాలకు పొద్దు సంపాదకుని వివరణలను పక్కనున్న పెట్టెలో చూడవచ్చు)
సంపాదకులు ఆలోచించవలసిన రెండోవిషయం – ఈనిబంధనలు నిజంగా అమలులో పెట్టడం ఎంతవరకూ సాధ్యం? అసలు కాపీరైటు నిబంధనలు మనదేశంలో ఎంతమంది పాటిస్తున్నారు? కొంతకాలం క్రితం ప్రముఖ యూనివర్సిటీ ప్రొఫెసరుగారి సంపాదకత్వంలో ప్రచురించిన సంకలనం “స్త్రీవాదకథలు”. అందులో నన్ను అడక్కుండా నాకథ వేసుకున్నారు. హైదరాబాదులోనే వున్న రచయిత్రులకి కూడా అలాటిగౌరవమే జరిగిందని తరవాత తెలిసింది నాకు. అలాగే యద్దనపూడి సులోచనారాణి నవలలు – ఒకటీ, రెండూ కాదు, పదిహేడు నవలలు మరొక ప్రముఖ రచయిత తనపేరు మీదుగా తమిళంలోకి అనువదించి ప్రచురించుకున్నారని విన్నాను. సులోచనారాణి వూరుకున్నారుట మరి.
ఇంతకీ నేను అడిగేది ఈ నిబంధనలు (అన్ని నిబంధనలూ కాదు) ఎందుకు అన్నది మొదటిప్రశ్న. ఎలా అమలు జరుపుతారు అన్నది రెండో ప్రశ్న.
నాకు మరో కొత్త అనుభవం పీర్ రెవ్యూ. నాఅనుభవాలూ, అభిప్రాయాలూ చాలావరకూ నా బ్లాగులో రాసాను “కలం బలం అంటే నవ్విపోయే రోజు వచ్చెనా?” అన్న టపాలో. నిజానికి అది రాస్తున్నప్పుడు హాస్యానికే రాసేను కానీ పాఠకులు దాన్ని సీరియస్‌గానే తీసుకుని స్పందించేరు.
నాకు తెలిసినంతవరకూ ఈమాట.కాం వారు ఒక్కరే పీర్ రెవ్యూ చేస్తున్నది. నేను దాదాపుగా నాలుగేళ్లనుండీ ఈమాట.కామ్ వారికీ, కౌముది.నెట్. వారికీ కథలు పంపిస్తున్నాను. ఈమాట.కాం సంపాదకవర్గంలో ఒకరైన వేలూరి వేంకటేశ్వరరావుగారితో నాకు చాలాకాలంగా పరిచయం వుంది. అంచేత వారు నన్ను కథ అడగడం, నేను పంపడం, ఆయన “అందింది, రెవ్యూయర్కి పంపేను” అని సూచనప్రాయంగా నాకు తెలియజేయడం జరుగుతూ వచ్చింది. అలాగే కౌముది సంపాదకులు కిరణ్ప్రభగారితో నాకు పరిచయం లేకపోయినా కానీ, వారు అడిగినప్పుడు కూడా నేను కథలు పంపుతూ వచ్చేను. వారూ, వీరూ కూడా ఒకటో రెండో చిన్న మార్పులు సూచిస్తే, అవి సమంజసమే అనుకున్నప్పుడు మార్చాను లేకపోతే నేను ఏకోణం మనసులో పెట్టుకుని రాసేనో వివరించేను. అంతే.
ఈమధ్య అంటే నాలుగు నెలలక్రితం ఈమాట.కాంకి నాకథ “పెంపకం” పంపినప్పుడు ఈ పీర్ రెవ్యూ పేరుతో ఒకపేజీడు సూచనలు వచ్చాయి నాకు. ఒకవిధంగా చెప్పాలంటే మొత్తం కథ అంతా తిరగరాయమని సలహా ఇచ్చారు. నా ఒక్కకథమీద ఇంత విస్తృతమయిన రెవ్యూ రావడం నాకు ఇదే మొదటిసారి. “రచయిత కథలో చెప్పింది ఏమిటి, అని కాక ఈకథని సాన పెట్టడం ఎలా, నేను ఏం సూచనలు చేయ్యాలి” అని ఆలోచిస్తూ కథ చదివినట్టు అనిపించింది నాకు అది చూస్తే.
దరిమిలా వేలూరి వేంకటేశ్వరరావుగారు తమ సంపాదకీయంలో (ఈమాట.కాం. జనవరి 2009) విపులంగా ఈ పీర్ రెవ్యూ పాలసీ చర్చించారు.
సంపాదకులు ప్రధానంగా గమనించవలసినది ఏరచయితకి అయినా తనదయిన ఆలోచనా, శైలీ వుంటాయన్నది. విమర్శనాత్మం, పరిశీలనాత్మకం అయిన వ్యాసాలకి భిన్నంగా సృజనాత్మకంగా చేసే కథలూ, కవితల్లో రచయిత తనకే ప్రత్యేకమయిన ఆలోచనలను తనదైన శైలిలో చెప్తాడు. అలా చెప్పగల స్వేచ్ఛ వున్నప్పుడే అతడి ప్రతిభావ్యుత్పత్తులు ద్యోతకం అవుతాయి. అంతే గానీ, సంపాదకుల, వ్యాఖ్యాతలమనసులో వున్నకథ కాదు కదా రచయిత రాస్తున్నది. అలా రాయలేరు. అలా రాయడమే జరిగితే, మూసకథలే వస్తాయి కానీ రచయిత ప్రత్యేకతని ఎత్తిచూపేకథలు రావు. ఈవిషయమే నా “కలం బలం” టపాలో వివరంగా చర్చించేను.
పరుచూరి శ్రీనివాస్ నా టపామీద వ్యాఖ్యలో తప్పంతా రచయితలదే అన్నారు. అలాటివారు కూడా వుండొచ్చు. నేను కాదనలేను. సంపాదకులకి సుమారుగా ఏరచయిత ప్రవృత్తి ఎలాటిది అన్నది తెలియొచ్చు. తదనుగుణంగా కూడా వారు ఆయా రచయితలతో సంప్రదింపులు జరపొచ్చునేమో. స్థూలంగా చూస్తే అటూ ఇటూ కూడా ఎవరికి వారు తమంతవారం తాము అని అనుకోవడంవల్లే వస్తున్నాయి ఈ విబేధాలు అనుకుంటాను.
ఈసందర్భంలోనే మరోమాట కూడా చెప్తాను. పైన చెప్పినవిధంగా సూచనలు అందుకున్న ఒక వర్థమాన రచయిత తాను కథలు రాయలేనేమోనని నిరుత్సాహపడినట్టు రాసారు నాకు. సంపాదకులు ఈవిషయం కూడా గమనించాలి.
వ్యాఖ్యానాలవిషయానికొస్తే, రచయితలు పొగడ్తలని ఆహ్వానించినట్టు సద్విమర్శలని అంటే లోపాలు ఎత్తిచూపేవి ఆదరించడంలేదని కొందరివాదన. సద్విమర్శ అంటే కథలోగానీ, వ్యాసంలోగానీ గుణాలూ, దోషాలూ కూడా సమతుల్యంగా ఎత్తిచూపడం. అది తప్పులేదు. నామటుకు నేను నా కథలు సౌమ్యకో వైదేహికో పంపి అభిప్రాయాలు అడిగిన సందర్భాలున్నాయి. మళ్లీ ఇక్కడ కూడా సంపాదకుల సూచనలలాగే వాళ్ల వాళ్లసూచనలు కూడా సమంజసం అనుకుంటే గ్రహిస్తాను. లేకపోతే లేదు.
అలాగే ఈమధ్యనే ACFAI Journal of English Studiesకోసం ప్రొఫెసర్, ప్రభాకరరావుగారు అనువాదకృషిలో నా అనుభవాలను సవిస్తరంగా వ్యాసం (7500 మాటలు) రాయమంటే ఈ మధ్య పూర్తిచేసి వారికి పంపేను. నేను పెట్టిన పేరు Translating From Telugu into English: My experiences in transcultural translation. దానికి ఆయన Dynamics of Transcultural Transference: Translating from Telugu to English అని మార్చమని సూచించారు. నా abstractలో కూడా చెప్పుకోదగ్గ మార్పులు చేసి నాకు సమ్మతమేనా అని అడిగేరు. ఇక్కడ మీకు తేడా తెలిసిందనుకుంటాను. వారిది ఎకడమిక్ జర్నల్. వారి శీర్షిక తదనుగుణంగా వుంది. అంచేత సంతోషంగా ఒప్పుకున్నాను.
సమీక్ష, విమర్శ, పరిశీలన, వ్యాఖ్య.. ఈపదాలన్నిటికీ సూక్ష్మంగా పరిశీలిస్తే తేడాలు వుండొచ్చు. సమీక్ష అంటే సమ్యక్ ఈక్షతి అంటే చక్కగా పరిశీలించినది అని కొడవళ్ల హనుమంతరావుగారు ఈమాట.కాంలో వేలూరి నా పుస్తకంమీద చేసిన సమీక్ష మీద వ్యాఖ్యానించారు. (జనవరి 2009). కానీ స్థూలంగా వాడుకలో స్థిరపడిన అర్థాలు నాకు తెలిసినంతవరకూ – సమీక్ష అంటే కథలో ఏముందో సూక్ష్మంగా చెప్పడంతో సరిపోతుంది. సమీక్ష ధ్యేయం పాఠకులలో ఆ కథో పుస్తకమో చదవాలన్నఆసక్తి కలిగించడమే. విమర్శ తులనాత్మకంగా – అందులో గుణదోషాలు – ఎత్తి చూపుతుంది. కదాచితుగా విమర్శకుడు మరొక మెట్టు పైకి వెళ్లి, ఆ దోషాలు తొలగించే మార్గాలు కూడా సూచించవచ్చు.
పత్రిక లేక సైటు సంపాదకులు ఒక కథని పరిశీలించినప్పుడు మాత్రం వారి పోలసీ పరిధిలో ఆకథ ఇముడుతుందా, తమ పాఠకులు ఈకథని ఆదరిస్తారా, అన్నవే ప్రధానంగా చూసుకుంటారు. అంతటితో ఆగిపోవాలని రూలేం లేదు కానీ అంతకుమించిన భారం ఎత్తుకుంటే, దానివల్ల నిజంగా ఎవరికి లాభం అన్నది పరీక్షగా చూసుకోవాలి అనుకుంటాను. అలాగే రచయితలు కూడా ఆ సూచనలు ఎంతవరకూ తమకి వర్తిస్తాయి, తాను రాయాలనుకున్న కథకి అవి అనుగుణంగా వున్నాయా అని చూసుకుంటారు. ఆ సూచనలు తనకి నప్పవు అని నిర్ణయించుకునే అధికారం రచయితకి ఎప్పుడూ వుంటుంది. అలాగే ఈమార్పులు చెయ్యకపోతే మేం వేసుకోం అనే అధికారం సంపాదకులకీ వుంటుంది.
నా “పెంపకం” కథకి వచ్చిన రెవ్యూప్రకారం నేను తిరగరాస్తే, అది మొత్తం మరొక కథగా తయారయివుండేది అని నాకనిపించింది. ఒకే విషయాన్ని చిన్న చిన్న మార్పులతో మరో కథగా రాయొచ్చు అన్న నా వాదనకి నిదర్శనం నేను రాసిన రెండు కథలు “శివుడాజ్ఞ” శీర్షికతో.
నాకథ “పెంపకం” సంపాదకులు సూచించినమేరకు, నాకు తోచినంతవరకూ చివర్లో మాత్రం కొంత మార్చి తిరిగి సమర్పించుకున్నాను. వారు అది అంగీకరించి ప్రచురించారు. చెప్పొచ్చేదేమిటంటే ప్రతికథకీ ఇంత సీను అవసరమా అన్నది.
వ్యాఖ్యలు: సాధారణంగా పాఠకులు తమకి కథలో నచ్చిన లేదా నచ్చని అంశాలు సూక్ష్మంగా రెండు మూడు వాక్యాల్లో చెప్తారు. ఆ వ్యాఖ్య వస్తువూ, శైలీ, పాత్ర చిత్రణా, లేదా ఒకపాత్ర, ఒక వాక్యం – దేనిమీదయినా కావచ్చు. కానీ కథ సరిగ్గా చదవకుండానూ, పూర్తిగా చదవకుండానూ చేసే వ్యాఖ్యలు వస్తున్నాయి. అవి చూసినప్పుడు మాత్రం ఆ వ్యాఖ్యాతలు కేవలం తమ తెలివితేటలు ప్రదర్శించుకోడానికే వ్యాఖ్యానాలు చేస్తున్నట్టు కనిపిస్తాయి. తప్పు ఎత్తి చూపినప్పుడు కూడా సాహిత్యమర్యాదలు పాటించి, స్వాతిశయంతో కూడిన హేళనలూ అవహేళనలూ లేకుండా చేసిన వ్యాఖ్యలని రచయితలు ఎప్పుడూ గౌరవిస్తూనే వున్నారు. అవే నిజంగా రచయితకి ఉపయోగపడేవి కూడాను. అయితే, వెకిలిగానో స్వాతిశయంతోనో కూడుకున్న వ్యాఖ్యలూ వస్తున్నాయి. వీటికి నేను ఉదాహరణలు ఇవ్వక్కర్లేదు.
సృజనాత్మక సాహిత్యాన్ని సమీక్షించినా, విమర్శించినా ముఖ్యంగా కావలిసినవి, మొదటిది వస్తునిష్ఠ, రెండోది రచయిత ‘స్వకీయమయిన ప్రతిభావ్యుత్పత్తులు ఆవిష్కరించడానికి యత్నం చేస్తున్నాడు’ అన్న స్పృహ. కథలు చెప్పడంలో వివిధరీతులు. అందరూ ఒక్కలాగే మూసలోంచి తీసిన అచ్చుల్లా రాసేట్లయితే ఇన్నికథలక్కరేలేదు. ప్రతివారికీ తమదైన ముద్ర వుంటుంది. పెద్దరచయితలలో స్ఫుటంగా కనిపిస్తే, కొత్తగా కలం పుచ్చుకున్నవారిలో ఛాయామాత్రంగా కనిపించొచ్చు.
మీరు ఈనాటి సంపాదకులూ, పాఠకులూ సాహిత్యంలో అవగాహన వున్నవారు అంటున్నారు. సామూహికంగా అనుకోడానికి బాగానే వుంది కానీ విడివిడిగా, ఒకొక వ్యాఖ్యా తీసుకుని చూసినప్పుడు స్వాతిశయం ప్రకటించే వ్యాఖ్యాతల సంఖ్య కూడా తక్కువేం కాదు అనిపిస్తోంది నాకు. ఇది తప్పు అని మీకు అనిపిస్తే చెప్పండి. దిద్దుకుంటాను.
సంపాదకుల సూచనలూ, వ్యాఖ్యాతల అభిప్రాయాలూ కూడా రచయితలకి ప్రతిబంధకాలూ, నిరుత్సాహపరిచేవీ అవనంతకాలం రాణిస్తాయి.
నా ఈ-పుస్తకంగురించి మీరు అడిగారు. అంటే మీ అభిప్రాయం నా చాతకపక్షులగురించి అనుకుంటాను. అది పిడియఫ్ పైలు మాత్రమే కదా. సంపూర్ణంగా పుస్తకరూపంలో ఎమెస్కోవారి పరిశీలనలో వుంది. పైగా జాన్ హైడ్, అరిపిరాల -ఇద్దరూ ఈ-పుస్తకాలు ప్రచురించారు కనక నాది మొదటి ప్రచురణ కాదు.
కథల పట్ల నాదృక్పథం – నేను ముందే చెప్పినట్టు ప్రతి చిన్నవిషయం నాలో అనేక ఆలోచనలు రేపుతుంది. కథకి తగును అనుకున్నప్పుడు, తగినంత ఆవరణ ఏర్పడినప్పుడు కథగా మలుస్తాను. నా శైలీ, నేను ఎంచుకున్న ఇతివృత్తంలో ఆసక్తి గలవారు చదువుతారు. కొందరయినా చదువుతున్నారు అని తెలిసినప్పుడు నాకు సంతృప్తిగా వుంటుంది. అంతకంటె నాకథలు సాధించే ప్రయోజనం ఏమీ వుందనుకోను. కథలలో సందేశం చూసి మనుషులు మారిపోతారన్న నమ్మకంలేదు నాకు. నాజీవితకాలంలో నేను చూడలేదు. మహా అయితే కథలో నాప్రతిపాదనతో ఏకీభవించవచ్చు, మంచి జాతీయాలూ. చమత్కారం వున్న కథలు నన్ను ఎక్కువగా ఆకట్టుకుంటాయి. సిద్ధాంతచర్చలు చేసే రచనలలో నాకు ఆసక్తిలేదు. అందుకే రావిశాస్త్రిగారు ఇజాలకి లోబడి రాసిన నవలలు – రాజూ మహిషీ, గోవులొస్తున్నాయి జాగ్రత్త వంటి నవలలు నేను చదవలేదు. ఇప్పటికీ నేను చదివితే, ఆయన తొలిదశలో రాసినవే మళ్లీ చదువుతాను. సిద్ధాంతాలు దృష్టిలో పెట్టుకురాసినవి సృజనాత్మకరచనలుగా రాణించడం చాలా కష్టం. పాత్రలని ఉదాహరణలకి వాడుకుంటూ రాసిన సైద్ధాంతిక వ్యాసాల్లా కనిపిస్తాయి అవి నాకు. ఆయన మేధావి. కథలు కూడా విశ్లేషణాత్మకంగా రాస్తారు. కాని, పాత్రలు మాత్రం 2-డైమెన్షనల్. ఆయనకథల్లో నాకు నచ్చినవి చాలా తక్కువ.
మీరు “మా మే స్త్రీత్వమ్”గురించి ప్రశ్నించారు. నేను ప్రతీకాత్మకంగా రాసిన కొద్ది కథల్లో ఇది ఒకటి. స్త్రీ రాగద్వేషాలకి ప్రతీక. చైతన్యానికి ప్రతీక. చైతన్యం రాగద్వేషాలతో, కోపతాపాలతో కూడుకున్నది. నాకథలో వూరు స్థబ్ధంగా – అంటే రాగద్వేషరహితంగా వుంది. ఆమె వచ్చి ప్రేమ చూపడంతో ద్వేషానికి కూడా స్థానం ఏర్పడింది. కథలో ఒక మధ్యవయస్కుడు ఒక పసివాడిని తీసుకువచ్చాడు. మధ్యవయస్కుడు అనడంవల్ల ఆమెకంటె చిన్నవాడు అని తెలుస్తుంది. పసివాడు మనవడు అనుకోవచ్చు, ఆవూరికి (స్థబ్ధతలోనికి) ఆమె తీసుకొచ్చిన ప్రేమతోపాటు ద్వేషం కూడా వచ్చింది. ఆమె చేరదీసిన అబ్బాయి ఈర్ష్యతో కొత్తగా వచ్చిన అబ్బాయిని కొట్టిస్తాడు. ఆకొట్టినవాళ్లు మళ్లీ ఆమెని క్షమించమని వేడుకుంటారు. ఈ చిన్నకథలో మనకి నిత్యజీవితాల్లో తటస్థపడే కోపాలూ, తాపాలూ, అభిమానాలూ, ఈర్ష్యలూ – అన్నీ భాగాలే, ఇష్టాలతో అయిష్టాలూ, రాగాలతో ద్వేషాలూ పెనవేసుకుని వుంటాయి అని చెప్పడానికి ప్రయత్నించాను. ఈకథకి ప్రేరణ చివరలో ఉటంకించిన శ్లోకం. ఎక్కడ చూసేనో గుర్తులేదు. మా మే స్త్రీత్వమ్ – నాకు స్త్రీత్వమ్ (అంటే రాగద్వేషాలవంటి గుణాలే కానీ. స్త్రీ దేహం అని కాదు) వద్దు. మా మూర్ఖత్వమ్. – మూర్ఖత్వం వద్దు. మిధ్యాదృష్టిర్మా – చక్కని విచక్షణాజ్ఞానం లేనిదృష్టి వద్దు జాతౌ, జాతౌ – జన్మ జన్మలా (ఏజన్మలోనూ వద్దు) అని. 1966లో కృష్ణవేణి మాసపత్రికలో ఇది ప్రచురించుకున్నారు. ఇప్పటి సంపాదకులయితే తిరిగి చూడకుండా పారేసేవారేమో స్పష్టత లేదని 🙂 కథాకాలం చూస్తే అప్పటికి నాకు నిండా 30 ఏళ్లు కూడా లేవు.
నాకు మొదట్నుంచీ జీవితాన్ని గూర్చిన మీమాంస, సదసత్సంశయాలూ వుండేవి. రకరకాల ఇతివృత్తాలు తీసుకుని, ఇతివృత్తానికి తగినశైలిలో ఆవిష్కరించడం నాకు ఇష్టం. ఒకే అంశాన్ని భిన్నదృక్కోణాలలో ఆవిష్కరించగలగడం, ఇతివృత్తాలలో వైవిధ్యం చూపడం మంచి కథకుడి లక్షణంగా భావిస్తాను. చివరిమాటగా, నాకథల్లో ఇది మంచికథ అని నేను ఎంచి చెప్పలేను. నేను రాసిన ప్రతికథకీ వెనక ఏదో ఒకకారణం వుంది. లేకపోతే రాసేదాన్ని కాదు. అంచేత మీకు నచ్చినకథలేవో మీరు చెప్తే నేను ఏదృష్టితో ఆకథ రాసేనో చెప్పగలను. అమెరికా వచ్చేక, ఇక్కడ పరిస్థితులు అర్థం చేసుకుని నా జీవనసరళి ఏమిటో అర్థం చేసుకోడానికి చాలాకాలం పట్టింది. చూస్తూన్నకొద్దీ, మనకీ మౌలికమయిన మానవవిలువలలో అమెరినులకీ మనకీ వ్యత్యాసం లేదనిపించింది. పెద్దలయందు గౌరవం, సాటిమనిషిని మనిషిగా ఆదరించడం, స్వలాభం కొంత మానుకు ఎదటివారికి తోడ్పడడం – ఇవన్నీ ఇక్కడా వున్నాయి. ఆత్మగౌరవం పేరున స్వోత్కర్షా, సాంఘికవిజయం పేరున తమదారిలో వున్న వారందరిమీదా కాలేసి పైమెట్టుకి ఎగబాకడం – ఈమధ్య వచ్చిన విలువలుగా కనిపిస్తున్నాయి.
నేను అమెరికా వచ్చేక రాసినకథలన్నీ ఈ రెండు సంస్కృతులలోనూ గల తారతమ్యాలను పరిశీలిస్తూ రాసినవే. మొట్టమొదట రాసిన కథ “కొనేమనిషి”. కథలో ప్రధానాంశం – ప్రధానపాత్ర చిన్నప్ప మేనల్లుడిని తనఇంట్లో పెట్టుకు చదివిస్తాననడమే అయినా అతనిమాటతీరులో ఈమధ్యనే సర్వసాధారణమయిన వ్యాపారసరళి ద్యోతకమవుతుంది. కుటుంబంలోవారికి సాయం మన సంస్కృతిలో వుంది. అలా చేసినప్పుడు దానిలో ఏదో “లాభం” కూడా చూసుకోవడం జరగడం కొత్తగా వచ్చినవిలువ. అలాగే మన దృక్కోణాలలో మార్పు రావడం మరింత ప్రస్ఫుటంగా చూపిన కథ “డాలరుకో గుప్పెడు రూకలు”. మొదటికథ అమెరికాలో జరిగితే, రెండోకథ అమెరికాలోవున్న ఎన్నారయ్య కుటుంబం ఇండియా చుట్టపుచూపుగా వచ్చినప్పుడు జరిగినకథ.
కథను విశ్లేషించినప్పుడు మీరు ఏం చూస్తారు? కథకుడు ఆవిష్కరించిన అంశం ఏమిటి? ఏం చెప్పదల్చుకున్నాడు? శక్తివంతంగా చెప్పగలిగాడా? అన్నది నాకు ప్రధానాశం. రెండోది, నిజానికి అంతగానూ ముఖ్యమయిన అంశం శైలి. ఏరచయితనయినా వేరుగా నిలబెట్టేది శైలే. ముందు ఆవిష్కరించిన అంశం అంటే ఇతివృత్తం గురించి చెప్తాను. ఇది ప్రస్తుతం నేను రాస్తున్న డయాస్పోరా కథల విషయంలో ఇది ఇంకా ముఖ్యం. దాదాపు అనువాదాలలాగే ఇందులోనూ అపార్థాలకి చాలా తావుంది. మామూలుగానే చిన్నకథల్లో రచయిత వాచ్యం చేసేది తక్కువ -కథకి వస్త్వైక్యత ముఖ్యం కనక. పాఠకుల ఊహకి చాలా వదిలిపెట్టడం జరుగుతుంది చిన్నకథలో. అంచేత ఇతర సంస్కృతిగురించి రాసేటప్పుడు ఆ సంస్కృతిగురించి వున్న స్టీరియోటైపులని మరింత పటిష్టం చెయ్యకుండా జాగ్రత్త పడాలి.
ఈ సందర్భంలో నాకథ “నిజానికీ, ఫెమినిజానికీ మధ్య” కథనిగురించి రెండు మాటలు చెప్తాను. ఆకథలో నేను అమెరికా వచ్చిన కొత్తలో గమనించిన తెలుగువాళ్ల మానసిక ప్రవృత్తినీ, ప్రవర్తనలనీ – ఒక అయోమయస్థితిని ఆవిష్కరించడానికి ప్రయత్నించేను. ఆదశకంలో మగవారికి ఉద్యోగాలలో నిలదొక్కుకోడం ఎంత కష్టమయిందో, ఇంట్లో ఆడవారికి అలవాటులేని చాకిరీ, ఎల్లవేళలా మూసుకున్న తలుపులవెనక జైలుజీవితం, పనిగట్టుకు వీధిలోకెళ్తే తప్ప కనిపించని మొహాలూ అంతా కటకటగా వుంటుంది. “కప్పు కాఫీ పెట్టుకోవాలంటే మూడు గిన్నెలు కడుక్కోవాలని కాఫీ మానేసిన రోజులున్నాయి” అంటుంది సీత. ఆనాటి పరిస్థితి అది. ఇప్పుడయితే బయటికి వెళ్లి తాగుతారు. ఇంట్లో భర్తలు కాఫీ పెట్టివ్వడానికి వెనకాడరు. భార్యాభర్తలమధ్య ఎడం పెరిగిపోవడానికి కారణాలు అనేకం. వాటిలో తేలిగ్గా ఉపయోగించగలిగిందీ, కథకి బలం చేకూర్చేదీ, ఆనాడు ఆంధ్రాలో చురుగ్గా సాగుతున్నదీ – ఒకరకమయిన చాపల్యంతోనే వాడుకున్నాను. అప్పట్లో అది కథకి బలాన్నిచ్చేదిగా తోచింది.
రంగనాయకమ్మ రాసిన పుస్తకంలో నాకథని వాడుకున్న తీరుకి నాఅభ్యంతరాలు: అసలు ఆ పుస్తకం మంచిరచయితకి వుండవలసిన సంయమనంతో ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించేదిగా కాక, తనకి మరెవరిమీదో వున్న కక్ష తీర్చుకోడానికి రాసింది. నా కథని ఒక ఆయుధంగా వాడుకున్నట్టు కనిపిస్తుంది. ఏ రచయితకి గానీ అది గర్వపడదగ్గ విషయం కాదు. సాహిత్యపరంగా ఆమె విశ్లేషణలో లోపం – “సీత అలా ఆత్మవంచన చేసుకుంటూ కొన్నాళ్లుండి …” అన్న వాక్యం. రంగనాయకమ్మవంటి మహా మేధావికి ఆత్మవంచన అంటే ఏమిటో తెలీదని అనుకోలేం కానీ నేను మరోసారి చెప్పకుండా వుండలేను. లేనిదాన్ని వున్నట్టు తన్ను తాను నమ్మించుకోడం ఆత్మవంచన. ఒక సమస్యని గుర్తించడం, దానికి కారణాలు వెతుక్కోడం, ఎదుటివ్యక్తిని ప్రశ్నించడం, పరిష్కారం, నిర్ణయం – ఇవి ఆత్మవంచన కాదు. నా రెండో అభ్యంతరం – నాకథలో ఒక వాక్యాన్ని తీసుకుని “మార్చి” వాడుకున్నానని చెప్పడం. నిజానికి నాదృష్టిలో అది సామాన్యంగా అలాటి సందర్భంలో తేలిగ్గా ఎవరయినా అనగలిగిన వాక్యం. దాన్ని ఆవిడ “మార్చడం”లో నేనేదో అసభ్యకరమయిన మాట రాసినట్టు, తాను దాన్ని శిష్టజన వ్యావహారికం చేసినట్టు ధ్వని వుంది. నాకథలో వాక్యం భార్యకీ, వెలయాలికీ గల తారతమ్యం ఎత్తి చూపుతుంది. రంగనాయకమ్మ వాక్యానికి (మీ ప్రేయసులలో ఒక ప్రేయసిగా వుండను) ఆ అర్థం రాదు. అంచేత అది పూర్తిగా ఆవిడవాక్యమే. అక్కడ నావాక్యమేదో తాను వాడుకున్నాననడం అనవసరం.
నేను విశ్లేషించినప్పుడు శైలి కూడా ప్రత్యేకంగా చూస్తాను. శైలి భాషకి సంబంధించినది. నాకు తెలుగుభాష అంటే అభిమానం కనక మంచి తెలుగు వాడిన కథలు నాకు బాగుంటాయి. ఈరోజుల్లో చాలామంది వస్తువుకే ప్రాధాన్యం ఇస్తున్నట్టు కనిపిస్తోంది. అంతేకాదు. కథని విమర్శించినపుడు కథని కథగా చూడడం నేర్చుకోవాలి మన రచయితలూ, విమర్శకులూ. కథలో పాత్రలని ఫలానా ఆయన, ఫలానా ఆవిడ అని గుర్తులు పెట్టి, కథలని జీవితచరిత్రలలాగ వ్యాఖ్యానాలు చెయ్యడం మనతెలుగుదేశంలోనే వుందేమో అనిపిస్తోంది. రచయిత తనకుతాను ఆత్మకథ రాస్తున్నానని ప్రకటించుకున్నప్పుడు మాత్రమే అలా చెయ్యడం న్యాయం. నిజానికి అలా రాసినప్పుడు కూడా కొంతమార్పులూ, చేర్పులూవుండడానికి అవకాశం వుంది. రచయిత తన అక్రమప్రవర్తన గురించి రాస్తున్నప్పుడు కూడా ఒకవిధమయిన స్వాతిశయంతోనే రాస్తాడు. (నాకు మరో సందేహం కూడా ఇప్పుడే కలుగుతోంది. రంగనాయకమ్మ స్వీయచరిత్ర రాసిందా అని. ఎవరైనా తెలిస్తే చెప్పగలరు).
నాజీవన దృక్పథం. నాకు జీవితంలోనూ సాహిత్యంలోనూ కూడా ఒకే విలువలు. చిత్తశుద్ధీ, ఆత్మవివేచనా, ఉన్నదానితోనే తృప్తిపడడం నాకు చిన్నప్పట్నుండీ ముఖ్యమయిన విలువలుగా వుంటూ వచ్చేయి. నేను సాధారణంగా ఎవరికీ మాట ఇవ్వను, చెయ్యగలనని గట్టిగా నమ్మితే తప్ప. చేస్తానని చెప్పి, ఏదో మొక్కుబడిగా చెయ్యటం కూడా లేదు. నాలో లోపం, అందరూ అలాగే వుంటారనుకోడం. ముఖ్యంగా నా స్నేహితులమని చెప్పి, ఇది చేస్తాం, అది చేస్తాం అని వాళ్లు చెప్పడం, నేను నమ్మి, తరవాత బాధ పడడం జరిగింది. అందరూ అలా వుండరని తెలుసుకునేసరికి నాజీవితంలో ముక్కాలువాసి అయిపోయింది., 🙂 ముందెక్కడో చెప్పేననుకుంటాను.. నాచుట్టూ వున్నజనాలకీ నాకూ మధ్యన ఎప్పుడూ బెత్తెడు ఎడం వుంటున్నట్టు నేను సదా ఫీలవుతానని. అమెరికా వచ్చేక ఆ ఎడం బారెడయింది. ఇప్పటికీ “నేను ఇక్కడిప్రజలలో ఒకమనినిషిని” అని నాకు అనిపించదు. దీనివల్ల లాభమూ, నష్టమూ కూడా వున్నాయి. లాభం ఏమిటంటే నాజీవితానికి నేను కూడా ఒక ప్రేక్షకురాలిని అయినట్టు దూరంనుంచి నా జీవితాన్ని పరిశీలించుకోగలగడం. నష్టం అమెరికాలో జీవితంతో రాజీ పడలేకపోవడం. అంచేతే నా సాహితీలోకమే నాలోకం. ఇది ఊహాజగత్ కావచ్చు.
మహిళగా నా ఆలోచనలు. చెప్పేను కదా, మాయింట్లో నన్ను ఆడపిల్ల వేరు అన్నట్టుగా పెంచలేదు కనక నాకు మొదట్నుంచీ ఆ దృష్టి లేదు. అంచేత నా ఆలోచనలు మహిళని అన్న పరిమితిలో కాక నేనొక మనిషిని అన్న విస్తృతపరిధిలో అంటే నేనొక మనిషిని అన్న దృష్టితో ఆలోచిస్తాను. హింస – మగాళ్లు ఆడవాళ్లని హింసించడంతో ఆగిపోలేదు. నాఅభిప్రాయంలో హింసకి మూలం బలం. అర్థబలం కావచ్చు, అంగబలం కావచ్చు. మనిషికి ఆ బలం నిరూపించుకోవాలన్న కోరిక కలిగించేది అహంకారం. ప్రతి ఒక్కరూ ఎదుటివారిమీద తన ఆధిక్యత చూపించుకోడానికే బలం ప్రదర్శిస్తారు. అంచేత ముందు రావలసింది వైయక్తిక విలువలలో, సామాజికవిలువలలో మార్పు. ఎదటివారిని గౌరవించడం నేర్చుకున్నవారు ఏ జండరువారినయినా గౌరవిస్తారు. అందుకే నాకథల్లో బాధలు అనుభవించిన స్త్రీలు వున్నారు కానీ కేవలం అదే అన్నికథలకీ ప్రాతిపదిక కాదు. అనేక వస్తువులలో అదొక వస్తువు అంతే. ఉదాహరణకి, మంచుదెబ్బ కథలో వకుళ మౌనాన్ని ఆయుధంగా వాడుకుంది. దీన్ని passive aggressive అంటారు. “నవ్వరాదు” కథలో కమలిని హాస్యాన్ని థెరపీగా వాడుకుంది. అంటే నేననడం ప్రతివ్యక్తీ తనకి అనువైన మార్గాన్ని వెదుక్కుంటుంది ఆపత్సమయంలో. ఈకథల్లో కేవలం బాధల్ని మాత్రమే గుర్తించి, ఆ పాత్రల వ్యక్తిత్వాలని గుర్తించకపోతే కథ సరిగ్గా అర్థం చేసుకోలేదన్నమాటే. ఏ పత్రికలో చూసేనో గుర్తులేదు కానీ ఒక పత్రికవారు నా ”నిజానికీ ఫెమినిజానికీ మధ్య” కథకి, ఓ స్త్రీ బొమ్మ నెత్తిన చెంగుతో, పెద్ద కన్నీటిబొట్టుతో వేశారు. నా దృష్టిలో ఆ పత్రికవారూ, ఆ చిత్రకారుడూ కూడా కథని సరిగ్గా చదవలేదనే.
స్త్రీలు తమ అనుబంధాల్ని, ఆత్మ గౌరవాన్ని ఏకకాలంలో నిలబెట్టుకోగలరా? జీవితంలో ఏ విలువల కోసం తపించాలి, దేనీ కోసం దేన్ని వదలుకోవటానికి సిద్ధపడాలి.
ఇది క్లిష్టమైన ప్రశ్న. అవి చర్చించేంత సాంఘికశాస్త్ర పరిజ్ఞానం నాకు లేదండీ. అంతేకాదు. నేను చెప్పలేకపోవడానికి మరో కారణం కూడా వుంది. మనకి చెప్పేవారు ఎక్కువయిపోవడంవల్లే సగం బాధలు వస్తున్నాయి. వారు చెప్పేదొకటీ, చేసేదొకటీ – అలాటివారికి మిగిలిన సగంమంది – ఏ బాధలూ లేనివాళ్లు బ్రహ్మరథాలు పడుతున్నారు. నాకు తెలిసిందల్లా ప్రతి ఒక్కరి జీవితం తమచుట్టూ వున్న మనుషులూ, సంఘటనలూ, అనుభవాలూ – ఇన్నిటితో ముడిపడి వుంటుంది. వీటి ప్రభావం వ్యక్తులు తమజీవితంలో తీసుకునే ప్రతి అడుగుమీదా వుంటుంది. అంచేత ఎవరికి వారే తమ జీవితాన్ని దిద్దుకోడానికి సమర్థులు. ఎవరినైనా అనుసరించాలనుకుంటే వారు తమమాటలు ఆచరణలో పెడుతున్నారో లేదో కూడా చూసుకోండి. లేకపోతే మాఅమ్మ మాటల్లో “వాళ్ల బోధగురువులు కారు, బాధగురువులు.” ఇంతకుముందు మీరు అడిగిన ప్రశ్నకి నేను స్త్రీలకి వేరే సాహిత్యం అనాదిగా వుంటూనే వుంది అన్నాను. అదేమాట ఇక్కడ కూడా చెప్తాను. స్త్రీగా అనుభవం, వ్యక్తిగా అనుభవం – ఇవి వేరు కావచ్చు, ఒకటే కావచ్చు. రచయితలు ఏ దృష్టితో ఆ అనుభవం ఆవిష్కరిస్తున్నారు అన్నది, పాఠకులు సూక్ష్మదృష్టితో పరిశీలించుకోవాలి. ఉదాహరణకి, ఈనాటి దంపతులలో పరస్పర గౌరవం పూర్వంకంటే మెరుగ్గా వుంది. మళ్లీ నేను మొదటికే వస్తున్నాను. స్థూలంగా ఆడవాళ్లు ఇలా చెయ్యాలి, మొగవాళ్లు అలా చెయ్యాలి అని సిద్ధాంతాలు చెయ్యడం కాదు ఇప్పుడు కావలసింది. ప్రతివారూ ఎవరికి వారు ఆలోచించుకుని నిర్ణయాలు చేసుకోవాలి. ఈనాటి విద్య పిల్లలకి నేర్పవలసింది అదే.
అమెరికా ఇండియా సంస్కృతుల మధ్య తేడా చూసిన వారు కాబట్టి మన సమాజం లోని కట్టుబాట్లు, వ్యక్తిస్వేచ్ఛపై పరిమితులు, వీటి వల్ల మనం నష్టపోతున్నామా?
దీనికి కూడా పైప్రశ్నలాగే నాలుగుమాటల్లో చెప్పగల సమాధానం లేదు. మనదేశంలో వున్నలాటి కట్టుబాట్లు అమెరికాలో కూడా వున్నాయి. మన సినిమాల్లో పతివ్రతాధర్మాల్లాగే మీడియా “అతి” చేస్తోంది, అమెరికాలో స్వేచ్ఛని. నిజంగా దైనందిక జీవితాలు పరీక్షగా చూస్తే, అమెరికాలోనూ ఇండియాలోనూ కూడా రెండూ – కట్టుబాట్లూ, స్వేచ్ఛా కూడా కనిపిస్తాయి. ముందు చెప్పేను కదా.. మాయింట్లో నాకు స్వేచ్ఛ బాగానే వుండేది. నేను మా అమ్మాయిని అమెరికాలో పెంచేను కనక అదే అమెరికన్ ధర్మంలా కనిపిస్తుంది. కాని నిత్యజీవితంలో కొన్ని విషయాల్లో సూక్ష్మదృష్టికి తేడాలు కనిపిస్తాయి. నా కథల్లో ఇలాటివిషయాలు సందర్భానుసారం చొప్పిస్తుంటాను. (అయిపోయింది)
———————
gave a good reading experience
మాలతిగారూ,
ఒక్క ముక్కలో చెప్పాలంటే – వందనాలు. పాసివ్ అగ్రెసివ్ అంటే ముందెప్పుడో మీరు ప్రస్తావించినప్పుడు అన్వయించుకోలేకపోయాను. ఇది చదివేక అదేమిటో బాగా అర్థమయింది. చుట్టూ ఉన్న విషయాల పట్ల ఇంత సున్నితంగా, అంతే ఖచ్చితంగా వ్యవహరించే మీ శైలి మరెవరికైనా అసాధ్యం.
పొద్దు సంపాదకులకూ, స్వాతికుమారిగారికీ మరోసారి ధన్యవాదాలు నాకీ అవకాశం ఇచ్చినందుకు.
రెండు పొరపాట్లు దొర్లేయి. ఒకటి పొద్దువారు సవరించేరు. ధన్యవాదాలు.
రెండో పొరపాటు, పైన కథలపట్ల నాదృక్పథంలో చివర ఆయన అన్నది రావిశాస్త్రిగురించి కాదు. “పాత్రలని ఉదాహరణగా తీసుకుని …” అన్న వాక్యాలు కొడవటి కుటుంబరావుగారి కథలగురించి. ఈవిషయం స్పష్టంగా రాయలేకపోయినందుకు విచారిస్తున్నాను, క్షమాపణలు. – మాలతి
ఏరచయితకి అయినా తనదయిన ఆలోచనా, శైలీ వుంటాయన్నది. విమర్శనాత్మం, పరిశీలనాత్మకం అయిన వ్యాసాలకి భిన్నంగా సృజనాత్మకంగా చేసే కథలూ, కవితల్లో రచయిత తనకే ప్రత్యేకమయిన ఆలోచనలను తనదైన శైలిలో చెప్తాడు. అలా చెప్పగల స్వేచ్ఛ వున్నప్పుడే అతడి ప్రతిభావ్యుత్పత్తులు ద్యోతకం అవుతాయి. అంతే గానీ, సంపాదకుల, వ్యాఖ్యాతలమనసులో వున్నకథ కాదు కదా రచయిత రాస్తున్నది. అలా రాయలేరు. అలా రాయడమే జరిగితే, మూసకథలే వస్తాయి కానీ రచయిత ప్రత్యేకతని ఎత్తిచూపేకథలు రావు………….”
భలే చెప్పారు మాలతి గారు! మొదటినుంచీ చదువుతున్నాను ఈ సిరీసు!
ఒక్కోవిషయం మీదా స్పష్టంగా ఖచ్చితంగా వ్యక్తపరిచిన అభిప్రాయాలు చాలా చక్కగా ఎవరినీ నొప్పించకుండా మీ శైలిలో ఉన్నాయి. చాలా బాగుంది మీ ఇంటర్వ్యూ అన్ని భాగాలూ! బాగుండటమే కాదు, ఉపయోగకరంగా కూడా ఉంది.
ప్రింట్ అవుట్స్ (తెలుగులో ఏమంటారో?!) తీసుకొని భద్రపరచుకోవాల్సిన మాటలివి.
ప్రచురించిన పొద్దు వారికీ, చక్కని ప్రశ్నలు సంధించిన స్వాతిగారికీ, ఓపిగ్గా వివరించిన మాలతి గారికీ అభినందనలు!
ఏమిటండి ముగించేసారా?నేనస్సలు ఒప్పుకోను.
రచయితల హక్కుల గురించిన విషయం లో మీ అభిప్రాయమే నాదీను.కొన్ని విషయాల గురించి విపులం గా చెప్పారు బాగున్నాయి.మీ కధల మీద,పాత్రల మీద మీ రివ్యూలు చదవాలని వుంది.[ఇక్కడ అసంపూర్ణం గా చెప్పినట్టు అనిపించింది.]
చాలా ఉపయోగకరమైన వ్యాసాలు.భద్రపరుచుకుంటున్నాను.
@ బొల్లోజుబాబా, అరుణ, సుజాత, – మీకు నచ్చిందంటే నాకు మరింత సంతోషం.
@ పూర్ణిమా, మహేష్ కుమార్, – ఇక్కడ ప్రచురించేక, ఇంకా కొత్త ఆలోచనలు వస్తున్నాయి. మళ్లీ మరొకసారి చూసి, పిడియఫ్.లో పెడతాను. అంచేత దీనిని మీరు డ్రాఫ్టుగానే గుర్తించాలి. నిజానికి ఈమాట స్వాతి మొదట్లో నాతో అన్నారు కూడాను. ఎంత రాసినా ఇంకా చెప్పవలసింది వుంటుంది అని. 🙂
రాధికా, కథలమీదచర్చ సంగతి పైన చెప్పేను కదా. మీరే ఫలానాకథ అని ఎంపిక చేస్తే దానిమీద చర్చ చేద్దాం. ఇక్కడ ఇప్పటికే చాలా పెద్ద వ్యాసం అయిపోయింది కదా. ఏమయినా నాకు కూడా చెయ్యాలనే వుందని చెప్పడానికే ఇది. మరి మీదే ఆలస్యం. 🙂
మరొకసారి, అందరికీ మరోసారి నాసంతోషం తెలియజేస్తూ – మాలతి
“స్థూలంగా చూస్తే అటూ ఇటూ కూడా ఎవరికి వారు తమంతవారం తాము అని అనుకోవడంవల్లే వస్తున్నాయి ఈ విబేధాలు అనుకుంటాను.”
ఎప్పుడైనా అంతే కదండీ! తాము (సంపాదకులు, పరిశీలకులు) బాగులేవనుకున్న రచనలని పత్రిక ఎలా ప్రచురించగలదు? (ఎలాటి)పాఠకుల ఇష్టాయిష్టాలని ఎంతవరకూ వాళ్ళు తెలుసుకోగలుగుతున్నారన్న విషయం ఎంత కాలం ఎంతమంది ఆ పత్రికని ఆదరిస్తున్నారన్నదాని బట్టి తెలుస్తుంది. ఇది ఒక రెండు సంఘటనల బట్టి నిర్ణయించలేం కదా.
ప్రజాకర్షకంగా ఉండడమే కొన్ని పత్రికల ధ్యేయం కావచ్చు. అలాటి పత్రికలు ప్రచురించే రచనలు ఒకలా ఉంటాయి. కొన్ని పత్రికలు ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉండవచ్చు. అవి అట్లాంటి రచనలనే ప్రచురిస్తాయి, అలాంటి పాఠకులే ఆదరిస్తారు. కొన్ని పత్రికలు కొన్ని ప్రమాణాలని ఏర్పరచుకొని దానికి అనుగుణంగా నడపాలనుకోవచ్చు. దానికి తగిన రచనలనే వారు ప్రచురిస్తారు. అవి రుచించే పాఠకులే ఆ పత్రికని ఆదరిస్తారు.
ఇందులో చోద్యమేవుంది!
“ఈసందర్భంలోనే మరోమాట కూడా చెప్తాను. పైన చెప్పినవిధంగా సూచనలు అందుకున్న ఒక వర్థమాన రచయిత తాను కథలు రాయలేనేమోనని నిరుత్సాహపడినట్టు రాసారు నాకు. సంపాదకులు ఈవిషయం కూడా గమనించాలి.”
సూచనలివ్వకుండా కథని తిరగ్గొడితే, అకారణంగా తిరగ్గొట్టేరంటారు (వేరే కారణాలేవో కూడా ఊహించేస్తారు!). కాదూ మాట్లాడకుండా ప్రతి కథని ప్రచురించేస్తే అడ్డమైన ప్రతి చెత్తా ప్రచురించేస్తున్నారంటారు. సూచనలిస్తేనేమో నిరుత్సాహపరుస్తున్నారంటారు. పత్రికా సంపాదకులది చచ్చేచావేనే! (నేను ఏ పత్రికకీ సంపాదకుడిని కానందుకు మొదటిసారి సంతోషిస్తున్నాను 🙂
కామేశ్వరరావుగారూ, నేనన్నది అది కాదండీ. “ఎవరికి వారు తమంతటివారు లేరు” అనుకోడంలో తమఆలోచనలలు మాత్రమే సరయినవి అని పట్టు పట్టడంతో వస్తోంది తంటా అంటున్నాను. ప్రతి పత్రికకి ఒక ధ్యేయం వుంటుంది అని నేను కూడా ఒప్పుకుంటాను. అందుకే, తమపరిధిలో ఆకథ ఆదరణీయం అవునో కాదో చెప్తే చాలు. ఆపైన సలహాలు ఇచ్చేటప్పుడు రచయితలకోణాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని అన్నాను.
రెండో ప్రశ్న – సూచనలవిషయంలోనూ అంతే. నాకాలంలో ఏపత్రికలూ కారణాలు చెప్పలేదు. “మీ రచన అంగీకరింపబడలేదు” అని ఒక మూసవాక్యం పంపేవారు తిరగ్గొట్టినకథతో. ఇప్పుడు కూడా చాలా పత్రికలు అంతే చేస్తున్నాయి. నాకయితే, అసలు ఇండియాలో పత్రికలనుండీ ఏ జవాబూ రావడమే లేదు. మొత్తమ్మీద స్పష్టమవుతున్నది రచయితలకీ, సంపాదకులకీ మధ్య సామరస్యం కావలినంతగా లేదు అని. ఎంచేతంటారు?
మాలతిగారు,
రచనలని స్వీకరించనప్పుడు, దానిగురించి సూచనలో సలహాలో ఇవ్వడం మంచిదా కాదా? మీ ఉద్దేశం నాకు పూర్తిగా బోధపడలేదు.
>>”ఆపైన సలహాలు ఇచ్చేటప్పుడు రచయితలకోణాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని అన్నాను”
రచయితల కోణాన్ని దృష్టిలో పెట్టుకోవడం అంటే ఏమిటో కొంచెం వివరిస్తారా? రచయిత చెప్పదలచుకున్నది ఆ రచనలోనే కదా ప్రతిఫలించాలి?
నా (కొద్దిపాటి)అనుభవంలో సంపాదకులు/పరిశీలకులు ఇచ్చిన సూచనలు నాకు చాలా ఉపయోగపడ్డాయి.
>>”రచయితలకీ, సంపాదకులకీ మధ్య సామరస్యం కావలినంతగా లేదు”
అసలు మనుషుల మధ్యే సామరస్యం తగ్గిపోతున్నాది కదండీ. బహుశా ఇదికూడా అందులోని భాగమేనేమో!
చాలా ఓపికతో, సంయమనంతో(ఈ కాలంలో చాలా అరుదుగా కనిపించే లక్షణాలు!) మీరు ఇస్తున్న వివరణ, చేస్తున్న చర్చ చాలా ఆనందాన్ని కలిగిస్తోంది.
పత్రికల నిర్వహణలోనూ, రచయితలు పత్రికలతో, పత్రికలు రచయితలతో వ్యవహరించే తీరులోనూ ఒకే సూత్రం పని చెయ్యదు సర్వకాల సర్వావస్థల యందూ. కొత్తగా అప్పుడప్పుడే రాస్తున్న వారితో వ్యవహరించినట్టు కాస్త చెయ్యి తిరిగిన వారితో వ్యవహరించరు కదా. రచయితల పక్క నించి చూస్తే, కోంతమందికి తమ రచనని గురించి వివరమైన విమర్శనాత్మకమైన సమీక్షలు అందుకోవడం ఇష్టం .. అది వాళ్ళకి పనికొస్తుందని నమ్మకం. కొందరికి ఇటువంటివి పరమ చిరాకు – వేస్కుంటే వేస్కోండి లేకపోతే లేదు, నాకు నీతులు మాత్రం చెప్పొద్దు అన్నట్టు ఉంటుంది వాళ్ళ పద్ధతి. ఇదే విధంగా వ్యాఖ్యలూ వ్యాఖ్యాతలూ కూడా.
సంపాదకుడు – రచయిత – పాఠకులు అన్న హద్దులు చెరిగి పోతున్న ఈ జాలప్రపంచంలో అప్పుడప్పుడూ ఇలాంటి విషయాలు నిక్కచ్చిగా మాట్లాడుకుంటూ ఉండాలి.
మాలతిగారూ, మీ చిన్నప్పటి అమూల్యమైన అనుభవాల్నే గాక, ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్ని గురించి మనందరం ఆలోచించాల్సిన ఎన్నో విషయాల్ని నిక్కచ్చిగా ప్రస్తావించినందుకు మీకేమివ్వగలం? నమ్రతతో ఒక నమస్కారం!
కామేశ్వరరావుగారూ, “నా (కొద్దిపాటి)అనుభవంలో సంపాదకులు/పరిశీలకులు ఇచ్చిన సూచనలు నాకు చాలా ఉపయోగపడ్డాయి” – నాక్కూడా వుపయోగపడిన సందర్భాలు వున్నాయనే చెప్పేను కదండీ. మీరు దయచేసి ఈఅంశాలమీద నేను రాసినభాగాలు మరొకసారి చూడండి. తెలుగుతూలికలో “కలంబలం అంటే …” వ్యాసంలో విపులంగా చర్చించేను ఎలాటి సూచనలు ఫలప్రదం కావో. ఆవ్యాసం, వాటిమీద పాఠకుల అభిప్రాయాలూ కూడా చదవమని అర్థిస్తున్నాను.
కొత్తపాళీ వెలిబుచ్చిన అభిప్రాయం గమనార్హం. చక్కగా చెప్పేరు.
చివరిమాటగా, ఇవి నాఅనుభవాలమూలంగా నాకు కలిగిన అభిప్రాయాలు. ఆపరిధిలోనే వీటిని గ్రహించాలి.
కొత్తపాళీ, మీ అభిమానానికి కృతజ్ఞతలు.
స్వాతికుమారిగారికీ,మాలతి గారికీ అభినందనలు!
మాలతి గారు , కామేశ్వరరావు గారన్నట్టు చాలా ఓపికతో, సంయమనంతో వివరిస్తున్నారు .నిజంగా ఈ కాలంలో చాలా అరుదుగా కనిపించే లక్షణమే !అంతేకాదు మీ జ్ఞాపక శక్తి కి కూడా నమస్సులు .
మధ్యే మార్గం : ఫలానా రచన వేస్కుంటామో లేదో చెప్పేసి, సూచనలు తర్వాత ఇవ్వడం.
అంటే, ఇవి చేస్తేనే వేస్కుంటాం అన్నట్లు కాక..
1. మీ కథ మా ప్రమాణాలకు తగ్గదిగా లేదు, ఈ సూచనలు పాటిస్తే ఉండొచ్చు
2. మీ కథ బాగుంది. వేస్కుంటాము. కానీ, ఈ మార్పులు చేస్తే ఇంకా బాగుంటుంది. అని
రెంటిలో ఏదో ఒకటి చెప్పొచ్చని నా అభిప్రాయం. వైదేహి గారు నా కథ
పంపమన్నప్పుదు ఇలాగే సూచనలు ఇచ్చారు, కానీ రెండో పద్ధతి లో.
ఈ రెండూ కాక మూడో పద్ధతి ఉంటుందే – అదే నాకు imposing గా అనిపించేది.
ఇవి నా వ్యక్తిగత అభిప్రాయాలు.
మాలతిగారూ, మీ రచనా ప్రస్థానం,అనుభవాలు,జ్ఞాపకాలు గురించి విపులంగా ,ఓపికగా అందరితో పంచుకున్నందుకు మీకు,అందుకు “పొద్దు”ను వేదికగా చేసినందుకు పొద్దు సంపాదకవర్గానికి ధన్యవాదాలు.
ఇకపోతే,సంపాదకులు -రచయితలు గురించిన చర్చ మీద నా వినమ్ర అభిప్రాయం:
సునిశితమైన విమర్శనా దృష్టి,నిజాయితీ ,రసహృదయం ఉన్న సంపాదకులే కాదు,తోటిరచయితలు/పాఠకుల సూచనలు నిస్సందేహంగా ఒక రచన స్థాయిని పెంచుతాయనే నా నమ్మకం,అనుభవం కూడా. రచయితలలో/రచనలలో స్థాయీ భేదాలున్నట్లే ,సంపాదకులు/పీర్స్/పాఠకులలో స్థాయీభేదాలున్నాయి. ఎవరి సూచనలు ఎంతవరకు తమరచనలకు ఉపయోగపడతాయనేది ,ఉద్వేగరహితంగా,ఆబ్జెక్టివ్ గా రచయిత నిర్ణయించుకోవాల్సిన విషయం. అలాగే ఒక రచనకు సూచనలు చేస్తున్నపుడు ,రచనా పరిధిని అధిగమించకుండా,రచయిత అభివ్యక్తికి విరుద్ధం కాకుండా,ఔచిత్యాన్ని అతిక్రమించకుండా ఏ మేరకు సూచనలు చేయవచ్చు అనేది సంపాదకులు నిర్ణయించుకోవాల్సిన విషయం.పరస్పర హక్కుల పట్ల గౌరవం, సంయమనం మాత్రం తప్పనిసరి అనిపిస్తుంది.ఉన్నత సాహిత్య ప్రమాణాలను మాత్రమే ధ్యేయంగా రచయితలూ/సంపాదకులూ పెట్టుకున్నప్పుడు వారిమధ్య సామరస్యం కుదురుతుందనే నా ప్రగాఢ విశ్వాసం. సాహిత్యం మనుగడకు మంచి రచయితలు ఎంత అవసరమో,మంచి సంపాదకులూ,పాఠకులూ కూడా అంతే అవసరం .సాహిత్యమనే అద్భుత స్ఫటికానికి రచయితలు/సంపాదకులు/రసజ్ఞులైన పాఠకులు వెలుగులు విరజిమ్మే భిన్న కోణాలని నా అభిప్రాయం.
“హింస – మగాళ్లు ఆడవాళ్లని హింసించడంతో ఆగిపోలేదు. నాఅభిప్రాయంలో హింసకి మూలం బలం. అర్థబలం కావచ్చు, అంగబలం కావచ్చు. మనిషికి ఆ బలం నిరూపించుకోవాలన్న కోరిక కలిగించేది అహంకారం. ప్రతి ఒక్కరూ ఎదుటివారిమీద తన ఆధిక్యత చూపించుకోడానికే బలం ప్రదర్శిస్తారు. అంచేత ముందు రావలసింది వైయక్తిక విలువలలో, సామాజికవిలువలలో మార్పు. ఎదటివారిని గౌరవించడం నేర్చుకున్నవారు ఏ జండరువారినయినా గౌరవిస్తారు.”
అక్షరలక్షలు విలువైన మాట. నేను మనుషులని గమనించి అర్ధం చేసుకున్నదిదే. ఈహింసకి ఆడామగా తేడాలేదు. ఎటొచ్చీ ఆడవాళ్ళబాధకి ఎక్కువమంది జాలి పడేవారు దొరుకుతారు. ఒక సాహిత్యశాఖ కూడా ఉంది. కానీ మూలం మీరు చెప్పినదే. మంచి విషయాలు తెలిసాయి మీద్వారా.