<< మూడవ పేజీ
ఆఖరికి రాముడిలో కూడా యీ వేదన కనిపిస్తుంది. రాముడు మాయామానుష స్వరూపుడంటారు. అంటే తాను అవతార స్వరూపుడన్న జ్ఞానం తనకి లేదు. అందుకే అతను మానవ సహజమైన వేదనకి అతీతుడు కాడు. అదే రామాయణాన్ని రసవత్తర కావ్యంగా మార్చింది. అరణ్యవాసంలో ఏ రాక్షసుణ్ణి సంహరించినా అతను వారి గురించి ఆవేదన చెందుతూనే ఉంటాడు, ఎందుకీ రాక్షసులు మూర్ఖులై యిలా తమ చావుని తాము కొనితెచ్చుకుంటున్నారని.
అమ్మా! దేహమనన్ విచిత్రమగు దుఃఖారామ మంపించు దే
హమ్మున్నంతన జీవి పొందనగు బాధా సహ్యతల్ చెప్ప శ
క్యమ్మా? యొక్కొక జీవి యొక్కొక విధంబై పొందు దుఃఖమ్ము, రా
జ్యమ్మో! రాణియొ, కాననంబొ, ఋషి భార్యారత్నమో చెప్పగన్
రాముడు కౌసల్యతో అనే మాటలివి. ఇది రామునిలోని జీవుని వేదన. కల్యాణమైన కొన్నాళ్ళకి ఏదో విచిత్రమైన వైరాగ్యం, దుఃఖం రాముని మనస్సుని ఆక్రమిస్తుంది.
ఏమోగా కనిపించు, లోయెడదలో నింకున్ సమస్తావనీ
స్వామీత్వాధిక భావనా విషయ వాంఛాపూర్ణ వేశంతముల్
తా మండించెడు గ్రీష్మ మెచ్చటిది! తాతా! నన్ను మన్నింపవే”
అని వెళ్ళి వశిష్ఠునితో మొరపెట్టుకుంటాడు. వశిష్ఠుడు రామునికి యోగ రహస్యాలని బోధించి కొంత ఉపశమనం కలిగిస్తాడు. అయినా రాముని లోని వైరాగ్యం అతన్ని వెంటాడుతూనే ఉంటుంది. చివరికి సీతాదేవి స్వయంగా అతన్ని నిలదీస్తుంది. కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఆ కన్నీళ్ళతో రాముని కన్నీళ్ళు కలిసిపోతాయి. ఈ సన్నివేశమంతా చాలా రసార్ద్రంగా సాగుతుంది.
అని బాష్ప స్నపితాక్షిగల్లయును గాంతాకార దుఃఖంబునై
చను సీతం గని, రామచంద్రుడును బాష్పంబుల్ సుధా రమ్య వా
హినిగా మిశ్రిత శోకమోదవినయహ్రీ రుద్ధ కంఠుండు చా
చిన బాహా జటలన్ గ్రహించికొనియెన్ సీతా వియద్వాహినిన్
సీత కన్నులు కన్నీళ్ళతో నిండిపోయాయి. స్త్రీరూపం దాల్చిన దుఃఖంలా ఉన్న ఆ సీతని చూసి రామునికి కూడా కన్నీళ్ళు ఉబికాయి. అవి సుధా రమ్యంగా ఉన్నాయి, ఎందుకంటే అవి అంత స్వచ్ఛమైనవి కాబట్టి. దుఃఖము, ఆనందము, వినయము, లజ్జ ఇవన్నీ కలగలిసి పొంగుకొచ్చి గొంతు గద్గదమైపోయింది. కన్నీళ్ళలో ములిగిపోయిన సీత ఆకాశగంగలా ఉంది. ఆ గంగని, చాచిన తన చేతులనే జడలతో తనలోకి తీసుకున్నాడట ఆ రాముడు!
రాముడు తన వైరాగ్యం నుండి తేరుకొని, ఆమెతో అంటాడు:
శ్రీవశిష్ఠర్షి సాక్షిగా చెప్పుచుంటి
నస్వతంత్రమ్మయైన దేహమ్ము నందు
నౌనొ కాదొ వచింపగ లేను కాని
యాత్మ నిన్ను నిత్యంబుగా హత్తుకొందు
స్వేచ్ఛ లేని యీ దేహం సంగతి చెప్పలేనుకాని, ఆత్మలో నిన్ను నిత్యమూ హత్తుకొనే ఉంటానన్న రాముని మాటల్లో అద్వైత భావం ఎంతగా దేదీప్యమానమవుతోందో గమనించండి! అంతగా ఒకరికొకరు ఊరడిల్లినా, ఏదో తెలియని ఒకానొక భీతి, భవిష్యత్తులో కలిగే వియోగాన్ని సూచిస్తూ సీతారాముల మనసులని వెన్నాడుతూనే ఉందట.
హత్తిన ప్రీతి యిర్వురకు నాత్మలయం దెడబాటు భీతికిన్
గత్తళమై భజించియు నొకానొక దూర వియోగరేఖలో
నొత్తిన యట్లు తోచిన ముహుర్ముహురావృత గాఢ కాములై
చిత్తములం దొకళ్ళొకరు చేరగనీరు విరామ భావమున్
దూరంగా కనిపించే ఒకానొక వియోగ రేఖకి ఆత్మలో భయమున్నా, మళ్ళీ మళ్ళీ గాఢమైన అనురాగంతో ఒకళ్ళనొకళ్ళు సముదాయించుకుంటూ, మనసుల్లో విరామ భావనాన్ని చేరనివ్వకుండా రోజులు గడిపారట. ఆ తర్వాత అరణ్యవాసంలో ఆ ఎడబాటు కలగనే కలుగుతుంది. ఆ తర్వాత సీత కోసం రాముడు పొందిన ఆవేదనే కథని నడిపిస్తుంది. రాముడు జీవాత్మ అయితే, సీత పరమాత్మ. ఆ పరమాత్మకి దూరమై జీవుడు పొందిన ఆవేదనే రామాయణ కావ్యమయింది.
తనలోని జీవుని వేదనని శాంతింప చేసుకోనే ఆశయంతోనే కవితారూప తపస్సుచేసి, రామాయణాన్ని అద్వైత మత ప్రాతిపదికగా శాంత రస ప్రధానంగా సృజించారు విశ్వనాథ. తద్వారా రససిద్ధి పొందారు.
విశ్వనాథలోని యీ వేదనని పరిపూర్ణంగా అర్థం చేసుకున్నప్పుడే అతని కవిత్వాన్ని లోతుగా అనుభవించగలం, ఆ అనుభూతిలో మనమూ మమైకమవ్వగలం.
దానికి యీ వ్యాసం ఏ కొంతైనా తోడ్పడుతుందని ఆశిస్తాను. ఇది విశ్వనాథ సాహిత్యాన్ని గురించి నిష్పక్షపాతమైన విమర్శా కాదు, సమగ్రమైన పరిచయమూ కాదు. కేవలం నేనెఱిగిన విశ్వనాథ కవిత్వాన్ని గురించి కొద్దిపాటి వివరణ మాత్రమే. ఎప్పుడైనా కవిత్వంలోని గొప్పదనం తెలియాలంటే, దాన్ని స్వయంగా చదివి, అర్థం చేసికొని, అనుభవించవలసిందే!
…దవ్వు పిల్లనగ్రోవి రవము
ప్రాకి పసిత్రాచు పిల్లలు దూకినట్లు,
జల్లుపడినప్డు పరుపైన రాళ్ళ మీద
వెండి నీళ్ళులు జలజల వెడలినట్లు,
నీల మధుమూర్తి గుండెలో నిండినపుడు
యోగి చెక్కిళ్ళ కన్నీళ్ళు సాగినట్లు,
నవ్వుచును పసివాడు స్తన్యంబు గ్రోలు
చమ్మ మొగమును చూచుచో నార విడుచు
సెలవులందున క్షీరమ్ము చిందినట్లు,
ఉపనిషద్దేవి ప్రక్కల కొరిగి నవ్వి
నట్లు, వేదముల్ గలగల లాడినట్లు…
మురళీ గానాన్ని వర్ణిస్తూ విశ్వనాథవారు రాసిన పద్యం యిది. చిన్న త్రాచు పిల్లలు దూకినట్లుగా, వానజల్లు పడినపుడు నున్నని రాళ్ళపై ఆ చినుకుల ధార జలజలా పారినట్లుగా, తాను ఆరాధిస్తున్న స్వామి తన గుండెలో నిండినపుడు ఉబికిన కన్నీళ్ళు యోగి చెంపలపై సాగినట్లుగా, నవ్వుతూ చనుబాలు తాగే పసివాడు మధ్యలో అమ్మని చూసినప్పుడు పాల బొట్లు చిందినట్లుగా, ఉపనిషత్ దేవి కాస్త పక్కకి ఒరిగి చిరునవ్వు నవ్వినట్లుగా, వేదాలు గలగలమన్నట్టుగా…
అలా ఉందట ఆ వేణు రవం.
కృష్ణశాస్త్రి వేణునాదం తీయనిదైతే విశ్వనాథది కడు విచిత్రమైనది. అతని కవిత్వమూ అంతే!
************************************
విశ్వనాథ రచనలు:
పద్య/గేయ కావ్యాలు
1. కోకిలమ్మ పెళ్ళి
2. కిన్నెరసాని పాటలు
3. పాము పాట
4. మ్రోయు తుమ్మెద
5. గిరికుమారుని ప్రేమ గీతాలు
6. సౌభద్రుని ప్రణయ యాత్ర
7. ఆంధ్ర పౌరుషం
8. ఆంధ్ర ప్రశస్తి (http://www.new.dli.ernet.in/scripts/FullindexDefault.htm?path1=/data/upload/0004/311&first=1&last=76&barcode=2020120004308)
9. తెలుగు ఋతువులు
10. భ్రష్ట యోగి
11. మూగ నోము
12. శశి దూతం
13. బద్దన సేనాని
14. శాక్య ముని
15. రెండు నక్షత్రాలు
16. శృంగార వీథి
17. గోపికా గీతలు
18. భ్రమర గీతలు
19. శ్రీకృష్ణ సంగీతము
20. ప్రద్యుమ్నోదయము
21. శ్రీ కుమారాభ్యుదయము
22. ఝాన్సీ రాణి
23. శివార్పణము
24. విశ్వనాథ మధ్యాక్కరలు (పది శతకాలు)
25. మా స్వామి (విశ్వేశ్వర శతకము)
26. వరలక్ష్మీ త్రిశతి
27. విశ్వనాథ పంచశతి
28. రామాయణ కల్పవృక్షము
29. నా రాముడు
30. రురుచరిత్రము
తెలుగు నాటకాలు
1. నర్తనశాల
2. అనార్కలీ
3. వేనరాజు
4. త్రిశూలము
5. ధన్య కైలాసము
6. తల్లిలేని పిల్ల
7. అంతా నాటకమే
8. ప్రవాహము
9. సత్యాగ్రహము
10. లోపల – బయట
11. అవతార పరివర్తనము
12. ఆకాశరాజు
13. భస్మాసుర చయనము
14. కావ్య – వేద హరిశ్చంద్రములు
15. సౌప్తిక ప్రళయము
సంస్కృత రచనలు
1. అమృత శర్మిష్ఠము (నాటకం)
2. గుప్త పాశుపతం (నాటకం)
3. దేవీ త్రిశతి
4. శివ సహస్రము
నవలలు
1. తెఱచి రాజు
2. మా బాబు
3. బాణావతి
4. కడిమి చెట్టు
5. వీర పూజ
6. ధర్మ చక్రం
7. సముద్రపు దిబ్బ
8. బాణామతి
9. స్నేహఫలము
10. చందొవొలు రాణి
11. లలితాపట్టణపు రాణి
12. శార్వరినుండి శార్వరి దాకా
13. దిండుకింద పోకచెక్క
14. నందిగ్రామ రాజ్యం
15. విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు
16. ఏకవీర
17. హాహా హూహూ
18. వీరవల్లుడు
19. స్వర్గానికి నిచ్చెనలు
20. జేబుదొంగలు
21. పరీక్ష
22. ఆరు నదులు
23. పునర్జన్మ
24. దమయంతీ స్వయంవరము
25. వల్లభ మంత్రి (http://www.new.dli.ernet.in/scripts/FullindexDefault.htm?path1=/data_copy/upload/0068/859&first=1&last=226&barcode=2990100068854)
26. అంతరాత్మ
27. పాతిపెట్టిన నాణెములు
28. భ్రమర వాసిని
29. చెలియలి కట్ట
30. వేయిపడగలు
31. ఆత్మ కథ
32. పులి ముగ్గు
33. …మొత్తం అతని నవలలు 34 అని అంటారు. అవి కాక,
34. పురాణవైర గ్రంథమాల (12 నవలలు)
35. కాశ్మీర రాజ చరిత్ర నవలలు (6 నవలలు)
36. నేపాళ రాజ చరిత్ర నవలలు (6 నవలలు)
కథలు
24 కథలు, అందులో కొన్ని
1. య్యో-ర్హిషిఖెయ్
2. చామర గ్రాహిణి
3. మాక్లీ దుర్గంలో కుక్క
4. రాజు
5. పరిపూర్తి
6. తిరోధానము
7. ముగ్గురు బిచ్చగాళ్ళు
8. కపర్ది
9. ఇంకొక విధము
10. సప్తాశ్వము
11. ఉరి
12. కాళిదాసు అపకీర్తి
13. ఆద్యంతములు
14. దొరగారు – దివాంజి
15. ఏమి సంబంధము
16. నా ఋణం తీర్చుకున్నా
17. పుణ్య ప్రేమము
18. జీవుడి ఇష్టము
19. అల్లాహ్ కే ఫకీర్
20. వియోగిని
విమర్శ రచనలు
1. నన్నయ్య ప్రసన్న కథా కలితార్థయుక్తి
2. అల్లసానివాని అల్లిక జిగిబిగి
3. ఒకడు నాచన సోమన
4. శాకుంతలముయొక్క అభిజ్ఞానత
5. సాహిత్య సురభి
6. కావ్యానందము (సాహిత్య మీమాంస)
7. కావ్య పరీమళము
8. కల్పవృక్ష రహస్యములు
సంపాదకత్వం నిర్వహించిన పుస్తకాలు
1. ఆంధ్ర క్రియా సర్వస్వ మణి దీపిక
2. తెలుగు సామెతలు
3. గద్య చంద్రిక
ఇవి కాక ముద్రిత అముద్రిత పద్య ఖండికలు, కథలు, వ్యాసాలు, పీఠికలు అనేకం ఉన్నాయి!
భైరవభట్ల కామేశ్వరరావు గారికి తెలుగు భాషా సాహిత్యాల మీద ఎంతో ఆసక్తి. రాయగల శక్తి ఉన్నవారు కూడాను. పద్యాలంటే మక్కువ ఎక్కువ. ఈమాటలో కథలూ, కవితలూ, వ్యాసాలూ రాస్తూంటారు. పొద్దు కోసం గడిని కూర్చుతూ ఉంటారు. తెలుగు పద్యం అనే బ్లాగును ఇటీవలే మొదలుపెట్టి ప్రఖ్యాతి గాంచిన పద్యాల విశేషాలను వివరిస్తున్నారు.
naaku “kalpavRksham” tution ceptaaraaa plssssss
mee article chadivinadaggari nuncii manasantaa elaagO ayyindi, plss cheppanDi sir
కామేశ్వరరావుగారూ, నమోవాకములు. ఇంత విశిష్టమయిన విశ్లేషణ నేను చదివి చాలాకాలమయింది. చాలా సంతోషంగా వుంది మీవ్యాసం చదువుతుంటే. ధన్యవాదాలు.
కామేశ్వరరావు గారు,
చక్కటి వ్యాసాన్ని అందిచ్చినందుకు ధన్యవాదాలు.
చక్కని వ్యాసం!!అద్భుతమైన పద్యాలు!నేను మొదట విన్న విశ్వనాధ వారి పద్యం
“ఏ రాజు పంచెనో ఇచట శౌర్యపు పాయసమ్ములు నాగుల చవితినాళ్ళ
ఏ యెఱ్ఱ సంజెలో నెలమి పల్లవ రాజ రమణులు కాళ్ళపారాణి నిడిరొ….”
ఎంత అందమైన భావన ! ఎంత చదివినా, ఎన్ని సార్లు చదివినా, చదివిన ప్రతిసారీ ఆయన కవితాసౌందర్యానికి ఆశ్చర్య పోతూనే ఉంటాను.
ధన్యవాదాలు.
చాలా అద్భుతంగా చెప్పారు. ఓ రచనలో తాదాత్మ్యత చెందితే తప్ప ఇంత ప్రగాఢమైన వ్యాసం వెలువడదు. పొద్దు వారికీ, మీకూ హృదయపూర్వక అభినందనలు.
ఇక –
“పక్క అంతయు జిమ్మితి పద్మనాభ!
అన్న చూడుము, పుస్తకమ్మట్లు పండు
కొనును, నీవేమొ పక్కంత కుమ్మి కుమ్మి
పక్క యటులుండ నీవిట్లు పండుకొందు”
అచ్చంగా మా పాపాయి ఇంతే. నిన్నే మనసులో అనుకున్నాను, “ఏమీ చంటిది, ఇలా గడియారం ముల్లు లా తిరుగుతోంది పక్క మీద అని.” పై పద్యం, నా మనసు నాతో మాట్లాడినట్టు ఉన్నది.
విశ్వనాథవారి కృతులు కచ్చితంగా చదవాలన్న కుతూహలాన్ని పెంచేలా వ్రాసారు. బావుంది. 🙂
విశ్వనాధ వారిపై ఇంత చక్కటి విశ్లేషణతో కూడిన వ్యాసం ఈ మధ్య కాలంలో ఇదే చదవటం! మీకూ, పొద్దు వారికీ హృదయపూర్వక ధన్యవాదాలు..
భైరవభట్ల గారూ
మీరెరిగిన విశ్వనాథను చూసి, ఒకవేళ బ్రతికి ఉంటే, అసలు విశ్వనాథ కూడా మిమ్మల్ని అభినందించేవారు 🙂
భైరవభట్లగారికి
అద్బుతమైన వ్యాసం చదివించారు. విశ్వనాధవారికి భయపడుతూనే అభిమానించేవారిలో నేనొకరిని.
పద్యాల తాత్పర్యాలు, విశేషార్ధాలు ఎక్కడివక్కడ వివరించటం వల్ల పద్య అందాలు అర్ధంచేసుకోవటంలో దోహదపడ్డాయి.
వ్యాసం ఆద్యంతం మెదడుకు మేతపెడుతూనే, మీరిరువురిపట్ల గౌరవాన్నినుమడింపచేస్తూ సాగింది.
బొల్లోజు బాబా
అద్భుతమైన వ్యాసం! ముఖ్యంగా సీతారాముల అద్వైతాన్ని వివరించే పద్యాన్ని మీరు వివరించిన తీరు!!
మీ వ్యాసాలు, ఈమాటలో మోహన గారి వ్యాసాలతో పద్య సాహిత్యాన్ని క్షుణ్ణంగా చదవాలన్న కోరిక బలపడింది. ఎప్పటికి నెరవేరుతుందో చూడాలి!
వ్యాఖ రాసిన అందరికీ నెనరులు.
@లలితగారు, కల్పవృక్షానికి ట్యూషన్ చెప్పేంత సీను నాకు లేదండి. అందులో నాకు నచ్చిన అంశాలని, నాకున్న అతి తక్కువ పరిథిలో, వివరించే ప్రయత్నం వీలువెంబడి చేస్తాను.
కల్పవృక్ష కావ్యానికి అర్థ వ్యాఖ్యానాలతో ఒక్క ప్రచురణా లేకపోవడం దురదృష్టం. ఈ కాలంలో అది చెయ్యగలవాళ్ళు కూడా చాలా చాలా అరుదైపోయారు. సమీప భవిష్యత్తులో వాళ్ళుకూడా ఉండకుండా పోతారు. ఎవరైనా పెద్దవాళ్ళు పూనుకొని ఆ పని చేస్తే బావుంటుంది.
@వెన్నెల గారు, మీరు చెప్పిన అద్భుతమైన పద్యం కూడా ఆంధ్రప్రశస్తిలోనిదే. ఆంధ్రభారతి సైటులో ఆంధ్రప్రశస్తి పద్యాలున్నాయి. ఆసక్తి ఉన్నవాళ్ళు చదువుకోవచ్చు.
చాలామంచి వ్యాసం! ఒకటికి రెండుసార్లు చదివించిన వ్యాసం. “కన్నె కాటుక కళ్ళు” కవితను పాటగా మా నాన్నగారు పాడటం చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నాను. అది విశ్వనాధ వారి కవిత అని మా నాన్నగారు కొన్నేళ్ళ క్రితం ఏదో సందర్భం లో చెప్పినపుడు, “పాషాణా పాకా’ అనిపించుకున్న ఆయనేనా ఇంత సరళమైన,సొగసైన పదాలతో అంతటి సుకుమారమైన కవిత వ్రాసింది అని ఆశ్చర్యపోయాను.అందమైన పద్యాలు ఎన్నో పరిచయం చేసారు.ధన్యవాదాలు.
విశ్వనాధని ఇంత గొప్పగా పరిచయం చేయడం మీకే చెల్లింది.
భైరవభట్ల కామేశ్వరరావు గారు విశ్వనాధ వారి కవితా వైభవాన్ని వారి వివిధ కావ్యాలనుండి సోదాహరణంగా వివరిస్తూ వ్రాసిన వ్యాసం చాలా బావుంది. అనేకానేక విషయాలు చక్కగా విశదీకరింపబడినవి.
విశ్వనాధ వారి మహా కావ్యం రామాయణ కల్పవృక్షం యొక్క వైశిష్ట్యాన్ని విశ్లేషిస్తూ చక్కగా విపులీకరించారు.
శ్రీ రామచంద్ర స్వామివారికి శబరి పూలు,పండ్లు తీసుకెళ్ళే దృశ్యాన్ని చాలా మనోహరంగా విశ్వనాధ వారు చిత్రీకరించారు.
“తుట్టకొక ఎండిన చెట్టు కొమ్మ
శేఖరంబున యందు పుష్పించినట్లు”
ఇది కేవలం ఒక అందమైన భావమే కాదు; కేవలం ఒక భౌతికమైన ,సుందరమైన దృశ్యమే కాదు ;దీని ప్రత్యేకత కేవలం దీని లోని మెటఫారికల్ బ్యూటీ మాత్రమే కాదు.వయోభారం శరీరాన్ని కృశింపచేసినా ,ఒక మహదాశయం ,ఒక నిరంతర నిరీక్షణ ,ఒక నిస్వార్ధ సేవా తత్పరత, ఏ మాత్రం ఏనాటికీ సడలని పట్టుదల మనిషిని బ్రతికిస్తాయనేది ఇక్కడ సూచితార్ధం.ప్రేమతొ,భక్తితో,ఆనందంతో,తన జీవిత పరమార్ధం నెరవేరబోతుందనే పారవశ్యం తో శబరి నెమ్మది నెమ్మది గా ముందుకుసాగటం గొప్ప కమనీయమైన,కరుణామయమైన దృశ్యం.రామచంద్రస్వామి వారికి పూలు,పండ్లు సమర్పించుకోవటం వారి పాదాల చెంత సంపూర్ణమైన శరణాగతి కోరుకోవటమే.
మరొక విషయం:
శూర్పణఖ ఎపిసోడు లో ఒక గొప్ప స్పిరిచ్యువల్ సింబాలిజం ఉంది.దుర్బుద్ధితో,దుష్టశక్తులనుపయోగించి ,మాయాజాలంతో సంతరించుకున్న కృత్రిమసౌందర్యం రామస్వామివారి లాంటి ధర్మదీక్షాతత్పరుని ముందు కకావికలై పోతుందనేది సూచితం.
ఇంకొక విషయం:
మారీచుడు మాయలేడి రూపంలో వచ్చి వంచనతో ,అతి తెలివితేటలతో, నమ్మించాలనే ఉద్దేశ్యంతో చేసే నటనతో కూడిన కౌటిల్యపుటాటలు రామచంద్రమూర్తి వారిలానే ధర్మదీక్షా తత్పరుడైన లక్ష్మణస్వామివారి ముందు సాగవు.ఇదంతా గమనిస్తున్న రావణుడు లక్ష్మణస్వామి వారి కుశాగ్రబుద్ధికి విస్తు పోతాడే కానీ ఆయన ధర్మ దీక్షా నిరతి వాని బుద్ధికందనట్టి ఎత్తులోనే నిలిచిపోతుంది.
వీటన్నింటా గొప్ప తేజోమయమైన కవితాశిల్పం !!!
శ్రీమద్రామాయణ మహోదధిలో ఎన్నెన్ని అనర్ఘ రత్నాలో!!
ఇంతటి చక్కని వ్యాసాన్ని అందించిన భైరవభట్ల వారికి అభినందనలు!!!!
సి.ఎస్.రావు