-చదువరి
అమెరికాతో అణు ఒప్పందం మనకు తగునో కాదో మనకు తెలీదు. ఇదిగో ఈ కారణాల వలన అది మనకు మంచిది అని ఎవరైనా చెబితే.., ఓహో కాబోలనుకుంటాం. ఇదిగో ఇందుకని ఇది మంచిది కాదు అని మరొకరు చెబితే ఔన్నిజమే కదా అనిపిస్తుంది. వివరాలు సరిగ్గా తెలీనప్పుడు వాదనలన్నీ సరియనే అనిపించే అవకాశం ఉంది. కానీ ఆ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు తెలిసికోవాలని ఉందా.. ఈ బ్లాగరి ఏమైనా రాసారేమో చూడండి.
తెలంగాణాకు అన్యాయం జరిగిందని అందరూ చెప్పేవారే.. ఆ అన్యాయం ఎలా జరిగిందో వివరించేవారు మాత్రం అరుదు. ఆ సంగతులు తెలుసుకోవాలనుకుంటే ఈ బ్లాగు చూడండి.
సరళీకృత ఆర్థిక వ్యవస్థలో సామాన్యుడి జీవితం ఏ విధంగా ఉంది, ప్రభుత్వ విధానాలు ప్రజలకు ఎలా కంటకంగా తయారయ్యాయి వంటి అంశాలపై వివరణాత్మక వ్యాసాల కోసం ఈ బ్లాగును పలకరించండి.
బ్లాగుల్లో అనేకానేక విషయాలపై స్పందిస్తూ, విశ్లేషిస్తూ, విమర్శిస్తూ, ప్రజలు, సమాజం, రాజకీయ నాయకులు ఏం చెయ్యాలో దిశానిర్దేశం చేస్తూ జాబులు చూస్తూంటాం. తాము రాసినవాటిని నిజజీవితంలో ఎంతమంది పాటిస్తూంటారో చెప్పలేం. సామాజిక విషయాల పట్ల తన గుండె చప్పుడును బ్లాగులో వినిపిస్తూ నిజజీవితంలోనూ ఆచరించి చూపిన వ్యక్తి దిల్, ఆయన గుండెచప్పుడే ఆ బ్లాగు.
ఒక దళారీ పశ్చాత్తాపం పుస్తకాన్ని చదివే ఉంటారు. అనువాద పుస్తకాల్లో అంతగా ప్రాచుర్యం పొందిన పుస్తకాలు మరిన్ని లేవు. ఆ పుస్తకాన్ని చక్కగా అనువదించిన కొణతం దిలీపే గుండెచప్పుడు బ్లాగును కూడా రాస్తున్నారని తెలుసుకుని ఆశ్చర్యపోయారు నెజ్జనులనేకులు. వారి ఆశ్చర్యం -కొణతం దిలీప్ బ్లాగు రాస్తున్నందుకు కాదు, దిల్‌గా అందరికీ తెలిసిన ఆ గుండెచప్పుడు బ్లాగరే కొణతం దిలీపని పదిహేను నెలల వరకు ఎవరికీ తెలీకపోవడం, (ఆ సంగతి కూడా వేరేవారి ద్వారా తెలిసింది). దళారీ పశ్చాత్తాపం ద్వారా అయన ఎంత ప్రసిద్ధుడయ్యారో అంతకంటే ఎక్కువగా గుండెచప్పుడు దిలీప్‌గా బ్లాగులోకంలో ప్రసిద్ధుడయ్యారు. స్వతహాగా రచయిత అవడమే కాకుండా సామాజిక రాజకీయ, ఆర్థిక విషయాలపై లోతైన పరిజ్ఞానం ఉంది కాబట్టి అందులో అసహజమేమీ లేదు.
గుండెచప్పుడు, విషయ పరిజ్ఞానం కోసం చదవాల్సిన బ్లాగు. గుండెచప్పుడుకు కొన్ని ప్రత్యేకతలున్నాయి.
- తెలంగాణ అంశానికి అనుకూలంగా విస్తారంగా రాస్తారు. ఒక ప్రత్యేకత ఏంటంటే.. తెలంగాణా పట్ల దురభిమానం కాక, వాస్తవాలు తెలియజేసే ధోరణిలో ఉంటుంది. తెలంగాణా వ్యతిరేకులకు తన వాదనను చెప్పి, ఒప్పించి, మెప్పించాలని చూస్తారు.
- తన పరిజ్ఞానాన్ని సందర్భోచితంగా వాడి, చదువరికి అనేక విషయాలను తెలియజేస్తారు. 610 జీవో గురించి చక్కటి సమాచారం ఇచ్చే ఈ టపా చూసినా, చరిత్ర లేని జాతిగా మిగిలిపోనున్నామా అనే ఈ టపా చూసినా ఈ బ్లాగులోని టపాల విలువ తెలుస్తుంది.
- సామాజిక, ఆర్థిక అంశాలకు ప్రాధాన్యత ఇస్తారు.
పర్యావరణం దిలీప్ అభిమాన విషయాల్లో ఒకటి. అభివృద్ధి పేరిట ప్రజలకు, పర్యావరణానికీ, సంస్కృతికీ జరుగుతున్న కీడుపట్ల దిలీప్ హృదయం బాధతోను, కోపంతోను కొట్టుకుంటుంది. అరకులోయ అందాలను ఆస్వాదిస్తూనే అక్కడి ప్రకృతి సౌందర్యానికి ఎదురౌతున్న ముప్పు గురించి హెచ్చరిస్తారు. కొత్త సంవత్సరం, పాత జ్ఞాపకాలు జాబులో మొబైలు ఫోను వచ్చి గ్రీటింగు కార్డులను ఎలా మాయం చేస్తోందో రాస్తూ నిట్టూర్చారు.
బ్లాగుల్లో రాసినదాన్ని ఆచరించడంలో కూడా దిలీప్ విలక్షణ వ్యక్తే! ప్రజల వ్యతిరేకతను పట్టించుకోకుండా తన సొంత ఊరి వద్ద స్థాపించతలపెట్టిన స్పాంజి ఐరను కర్మాగారానికి వ్యతిరేకంగా ఉద్యమం నడిపారు. ఆ వివరాలను బ్లాగులో పెట్టి సాటి బ్లాగరులకు స్ఫూర్తినిచ్చారు. పోలేపల్లి సెజ్‌కు వ్యతిరేకంగా నడుపుతున్న పోరాటంలో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు.
దిలీప్ శైలి మృదువుగా, నచ్చజెప్పే ధోరణిలో, ఆలోచింపజేసేదిగా ఉంటుంది. అయితే ఘాటుగా ఉండే జాబులూ కొన్ని లేకపోలేదు. 2007 మేలో “తల్లి” అనే అంశంపై రేగిన బ్లాగు దుమారం సమయంలో గుండెచప్పుడులో ఓ జాబొచ్చింది. అప్పటి చర్చలో దురహంకారపు ప్రేలాపన! అనే ఆ జాబు కూడా ప్రముఖంగా పాల్గొంది. ఈ పనికిరాని “జాతీయవాదం” ఎవరికి కావాలి?, భాషా ప్రయుక్త రాష్ట్రమా గాడిద గుడ్డా! వంటి జాబులూ రాసారు. “కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా మన్మోహన్” అని అడిగిన టపా చూడండి.
తన బ్లాగులో అర్థవంతమైన చర్చకోసం దిలీప్ సిద్ధంగా ఉంటారు. రెండో ఎస్సార్సీ గురించి రాసిన టపాలో జరిగిన చర్చకు సమాధానంగా సమైక్యాంధ్రలో రెండు ప్రాజెక్టుల కథ అంటూ ఒక టపా రాసారు. చర్చను పెడధోరణి పట్టించే ప్రయత్నం జరిగినపుడు చురకేసేందుకు వెనకాడరు.
అయితే తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ చేసే కొన్ని అనుచిత వాదనల్లాగానే ఉన్న ఒక వాదనను గుండెచప్పుడులోనూ చూస్తాం..బాసరకో న్యాయం బందరుకో న్యాయం అనే జాబులో తెలంగాణ ప్రజల మనోభావాలకు విలువ లేదనే అంశాన్ని ప్రస్తావించడం కొంత మితిమీరిన ఆక్రోశంలా అనిపించే అవకాశం ఉంది. ఈ టపాకు మరో ప్రాముఖ్యత ఉంది.. ప్రస్తుతం బ్లాగులనుండి తప్పుకున్న ఒకప్పటి ప్రముఖ బ్లాగరి, చాలా అరుదుగా ఇతర బ్లాగుల్లో వ్యాఖ్యానించే అంబానాథ్ ఈ జాబులో రాసిన వ్యాఖ్య, ఆయన భావజాలం తెలియని పాఠకులను ఆశ్చర్యపరుస్తుంది. తెలుగుజాతీయవాది బ్లాగు గురించి తెలియని వారు, ఇప్పుడా బ్లాగు ఎలాగూ లేదు కాబట్టి పొద్దులో వచ్చిన ఆ బ్లాగుసమీక్షను చూడవచ్చు.
కొణతం దిలీప్ గుండెచప్పుడు వినాలంటే గుండెచప్పుడు బ్లాగును చదవాలి. బ్లాగరి వామపక్ష దృక్పథం బ్లాగులోని అభిప్రాయాల్లో ప్రతిఫలిస్తూ ఉంటుంది. గుండె ఎడమవైపునేగదా ఉండేది అనే మాట ఈ సందర్భంలో గుర్తుకు రాకమానదు. తన బ్లాగు ముఖచిత్రంగా ఎంచుకునే బొమ్మలు బ్లాగరి దృక్పథాన్ని తెలుపుతూ ఉంటాయి. తాను ఇప్పటివరకూ వాడిన ముఖచిత్రాల ప్రాశస్త్యాన్ని వివరిస్తూ ఒక పేజీ రాసారు కూడాను.
బ్లాగులోని పాత టపాలను వెతకడం చాలా శ్రమతో కూడుకున్న పని. వర్గాలను పట్టుకుని టపాలను వెతుక్కుంటూ పోవడమొక్కటే మార్గం. నెలవారీగా టపాలను వెతుక్కునే లింకు లేకపోవడం, వెతుకు పెట్టె లేకపోవడం ఈ బ్లాగులోని లోటు. లేదా, వర్డ్‌ప్రెస్సు ప్రామాణిక URL పద్ధతిని అనుసరించి తేదీవారీ, నెలవారీ, సంవత్సరం వారీ టపాలను వెతుక్కోవాలి.
ముగించే ముందు, ఈ బ్లాగులోని ఉత్తమమైన ఒక టపా గురించి చెప్పుకుందాం.. దాదాపు స్వయంసమృద్ధ స్థితి నుండి బియ్యంకూడా కొనుక్కునే స్థాయికి అభివృద్ధి చెందిన తన స్వంత ఊరి గురించి దిలీప్ రాసిన ఈ టపా స్వగతాన్ని చెప్పుకునే మేటి టపాల్లో ఒకటి. ఈ టపా అచ్చు పత్రికల్లో పునర్ముద్రింపబడింది.
గత కొంత కాలంగా కాస్త మందగించిన గుండెచప్పుడు, మళ్ళీ పూర్తిస్థాయిలో వినిపించాలని బ్లాగరులు ఆశిస్తున్నారు.
-చదువరి పొద్దు సంపాదకవర్గ సభ్యుడు
దిలీప్ కొణతం గారి విభిన్న కోణాలని తెలుసుకుని ఒక పక్క ఆశ్చర్యము మరో పక్క ఆనందము కలుగుతున్నాయీ. ఎన్నొ విలువైన టపాల లింకులను ఈ టపా లో పెట్టినందుకు చదువరికి హృదయపూర్వక ధన్యవాదాలు.
Pingback: పొద్దులో నా బ్లాగ్ సమీక్ష « గుండె చప్పుడు…
“ఒక దళారీ పశ్చాత్తాపం” ని అనువదించింది ఈ దిలీప్ గారే అన్న సంగతి చాలా రోజులకు తెలిసినపుడు ఆశ్చర్యపోయాను. విలువైన బ్లాగు!అమూల్యమైన టపాలు! నిజంగానే హృదయం గల బ్లాగు.
బావుంది బ్లాగు పరిచయం. ఈ బ్లాగు ఆసాంతమూ చదవాలి.
సమగ్ర సమతుల్య సమీక్ష. బ్లాగుకి న్యాయంచేసింది.
ఒకటికి రెండు సార్లు చదివిన తరువాత ఎందుకో అసమగ్రంగా వ్యాసం వుందని తోచింది. దిలీప్ కృషిని గురించి ఇంకా రాయాల్సిన విషయాలు చాలా వున్నాయి. అయినా సరే రేఖామాత్రంగానైనా ఒక చక్కటి, మనసున్న, అన్నింటికి మించి విషయమున్న తెలుగు బ్లాగును తోటి బ్లాగరులకు పరిచయం చేసినందుకు పొద్దుకు ధన్యవాదాలు.
We came to know very rec`ently that that Dileep Konatham translated the world famous Book ‘ THE HITMAN ‘to Telugu . He is a very good speaker too with full analysis of the subject .We had the opportunity of listening to him on Metro Rail / Mytas & Satyam episodes where YSR govt & his son are main players to siphon the money illegally.
All the BEST to Dileep !!!
D.P.Reddy
TDF – India