సంక్రాంతి శుభాకాంక్షలు

-శ్రీమతి పింగళి మోహిని

ఉ:

బంతులు బంతులై కనుల పండువు చేయగ, గోమయంబుచే
కాంతలు గొబ్బిళుల్ మిగుల కౌతుక మొప్పగ తీర్పరించగా
వింతగు బొమ్మలన్ కొలువు వేడుక మీరగ తీర్చి దిద్దు, సం
క్రాంతి శుభోదయంబు మనగావలె జాతికి భవ్యక్రాంతియై !

ఇంతలు ఇంతలై పుడమి యీవలె సస్యము మానవాళికిన్
చింత రవంత లేని సుఖ జీవన భాగ్యము కల్గజేయగా
శాంతి సమానతా సుగుణ సంపద తుష్టిని పుష్టి నిచ్చు, సం
క్రాంతి శుభోదయంబు మనగావలె జాతికి భవ్యక్రాంతియై !

లేతలిరాకు జొంపముల లీలగ తోచుచు పూచినట్టివౌ
పూతలు పిందెలై పెరిగి వేలఫలంబులొసంగునట్లు గా,
జాతి హృదంతరాశలను శాశ్వతరీతి ఫలింప చేయ, నీ
నూతన వత్సరంబునకనూన ముదావహ స్వాగతంబిదే !

———————-

శ్రీమతి పింగళి మోహిని, బి.ఏ,బి.ఇడి కృష్ణాజిల్లా చల్లపల్లిలో శ్రీమాన్ యస్.ఆర్.వైస్.ఆర్.పి.జూనియర్ కళాశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. పద్యరచన ఆమె ప్రవృత్తి.

This entry was posted in కవిత్వం and tagged . Bookmark the permalink.

7 Responses to సంక్రాంతి శుభాకాంక్షలు

  1. vihaari(kbl) says:

    మీకు సంక్రాంతి శుభాకాంక్షలు

  2. చంద్ర మోహన్ says:

    పద్యాలు చాలా లలితంగా బాగున్నాయి. మోహిని గారికి అభినందనలు!

  3. రవి says:

    చక్కటి రంగవల్లుల లాంటి అందమైన పద్యాలు చెప్పారు. మీకూ, తోటి పాఠకులందరికీనూ సంక్రాంతి శుభాకాంక్షలు. పొద్దు సంపాదకులకు అభినందనలు.

  4. రాఘవ says:

    మూడు పద్యాలూ సంక్రాంతిలక్ష్మిలాగానే అందంగా ఆహ్లాదకరంగా ఉన్నాయి. అభినందనలు.

  5. శ్రీమతి పింగళి మోహన్ గారికి, “పొద్దు” పాఠకులకు
    “సంక్రాంతి” పర్వ దిన శుభాకాంక్షలు

    చక్కని రంగవల్లికలు స్వాగత గీతుల పాడినట్లుగాన్
    చుక్కలలో పతంగముల సోయగ మింపుగ చేరినట్లుగాన్
    మక్కువ మీర పొంగళుల మాధురి నాల్కకు తాకినట్లుగాన్
    మిక్కిలి నచ్చె పద్యములు – మీకివె పర్వదినాభినందనల్!

    – “పద్య కళా ప్రవీణ” డా. ఆచార్య ఫణీంద్ర

  6. yakoob says:

    yes a letter exlent me

  7. yakoob says:

    om laxmi namaha

Comments are closed.