-స్వాతి కుమారి
విద్య అంటే ఆనందించే శక్తిని వృద్ధిచేయడం, సౌందర్యానికి కళ్ళు తెరవడం, బాధల్నించీ, కష్టాల్నించీ తప్పించుకునే నేర్పునివ్వడం, ఇతరుల స్వేచ్ఛను అడ్డగించే స్వార్థపరత్వం నించీ, అంతా తనకే కావాలని దాచుకునే కాపీనం నుంచీ, భయాల నించీ తప్పించడం. – చలం
పై నిర్వచనం విద్య యొక్క విస్తృతార్థాన్ని, ఎకడమిక్ పుస్తకాల్లో ఇమడని దాని పరిధి ని తెలియజేస్తుంది. విద్యంటే అక్షరాస్యత మాత్రమే కాదు. అలాగే పట్టభద్రులంతా విద్యావంతులు కాదు. మనిషి తనని తాను నిరంతరం మెరుగుపరుచుకుంటూ కొత్త విషయాలను నేర్చుకోవటమే విద్యార్జన.
విద్య అంటే ఏమిటి అని ప్రశ్నించుకున్నప్పుడు విద్య కానిదేది అనిపిస్తుంది. ఈ విశాల విశ్వం లో ఇంతటి సుధీర్ఘ జీవిత కాలం లో అమీబా, అంతరిక్షం, ఆర్థిక మాంద్యం ఇవన్నీ తెలుసుకోదగ్గవే. ఇన్ని వేల శాస్త్రాల్లో, సిద్ధాంతాల్లో, క్షణ క్షణానికీ కొత్త విషయాలను ఆవిష్కరించే కాల గమనం లో అందరూ అన్నీ నేర్చుకోలేరు. కానీ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నేర్చుకోవలసినవి ఖచ్చితం గా కొన్ని ఉంటాయి. స్థూలం గా చెప్పాలంటే:
-> తన శరీరానికీ, ఆరోగ్యానికి సంబంధించిన కనీస పరిజ్ఞానం.
-> తన సామాజిక , భాషా,సాంస్కృతిక నేపథ్యాన్ని అవగాహన చేసుకోవటం.
-> మానసిక వికాసం, సృజనాత్మక శక్తి ని పెంపొందించుకోవటం.
-> దైనందిన జీవితం లో కనీస అవసరాలకు తనపై తను ఆధారపడగల ఆత్మ విశ్వాసం. వేరే మార్గం దొరకనప్పుడు ఆకలి తీరడానికైనా వంట వచ్చి ఉండాలి కదా.
-> సమస్య స్థాయి ని దాటి పరిష్కారాన్ని ఆలోచించగల నేర్పు.
-> ఒంటరిగా సాధించగల సమర్థత తో పాటు ఇతరులతో కలిసి పనిచెయ్యటాన్ని అస్వాదించగల సుహృద్భావాన్ని పెంపొందించుకోవటం.
-> భావావేశాల్ని నియంత్రించుకోవటం, సమయానుకూలం గా ప్రదర్శించగల మానసిక సమతుల్యత.
-> ఆత్మ సౌందర్యాన్ని, శ్రమ విలువని గుర్తించి గౌరవించగల మానసిక పరిపక్వత.
-> పరస్పర అవగాహన, అభివృద్ధి సాధించగల కుటుంబ, మానవ సంబంధాలను పెంపొందించుకోవటం .
-> ఆర్థిక వృద్ధి తో పాటు సేవా దృక్పథం, సామాజిక బాధ్యతను గుర్తించగలగటం.
-> స్వయం నిర్దేశిత వ్యక్తిగత విలువలకు కట్టుబడి ఉండగల నైతిక నిబద్ధత.
-> లక్ష్య సాధనలో ఎదురయే సవాళ్ళను స్వీకరించగల ఆత్మ స్థైర్యం.
->తన ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకోవటం తో పాటు ఇతరుల ఆత్మగౌరవాన్ని కించపరచని విధం గా ప్రవర్తించటం.
-> ఏ విషయాన్నైనా తర్కించి అంత:శోధన ద్వారా అర్థం చేసుకునే తార్కిక, తాత్విక చింతన.
పిల్లల ప్రయోజకత్వాన్ని వాళ్ళకొచ్చిన మార్కుల ద్వారా మాత్రమే నిర్ణయించటం, కధల పుస్తకాలు కూడా చదవనివ్వకపోవటం ద్వారా వారిలో ఉన్న ఊహా శక్తి ని, సృజనాత్మకతని, ఇతర రంగాల్లో వాళ్ళ ఆసక్తి ని నిర్దాక్షిణ్యం గా చంపెయ్యటమే. ఇప్పటి మన చదువులు ఏం నేర్పుతున్నాయి.? పక్కవాణ్ణి తోసి ముందుకు పరిగెట్టటం. తన తోటి వారంతా తప్పులు చేసినప్పుడే తను మొదటి రాంక్ లో ఉంటాననే అభిప్రాయం కలిగాక అందరూ కలిసి ఎదగటమనే ఆలోచన ఎలా కలుగుతుంది? చదువు పరమార్థం విదేశీ ఉద్యోగాలు మాత్రమే అని మనసులో నాటుకున్నాక కరెన్సీ లో విలువ కట్టలేని నీతి సూత్రాల్ని, సుమతీ శతకాల్ని ఎందుకు తెలుసుకుంటారు? పెద్ద చదువులు చదివిన వారిలో సైతం నాటుకుపోయిన మూఢ నమ్మకాలను చూస్తే మన చదువులు ఏ మాత్రం తార్కిక దృష్టి ని ఇస్తున్నాయో అర్థమౌతుంది. బ్రతకటానికీ, బ్రతికించటానికీ ఎన్నో గౌరవనీయమైన మార్గాలుండగా, మనిషి సంతోషం గా ఉండటానికి కావల్సిన మనో వికాసం, సృజనాత్మకత గుర్తింపబడని సమాజం లోనే పరీక్షలు ఫెయిలైన విద్యార్థులు ఆత్మ హత్య లు చేసుకోవాల్సి వస్తుంది.
చదువుకోవటం, నేర్చుకోవటం లో మొదటి దశ లో పాఠశాల పాత్ర ముఖ్యమైనది. కాబట్టి విద్యా విధానం సమగ్రం గా ఉండాలి. వ్యక్తి సాంఘిక, ఆర్థిక సుస్థితి, శక్తి సామర్థ్యాలు, సృజనాత్మకత పట్ల శ్రద్ధ వహించే విద్యా వ్యవస్థ ప్రధాన లక్ష్యాలుగా జాతీయ విద్యా విధానం (NPE)లో పేర్కొన్నవి:
1. శారీరక, మానసిక పరిపూర్ణతతో బాటు సౌందర్యాత్మక దృష్టితో జీవించేటట్లుగా వ్యక్తిత్వం రూపొందించడం.
2. కొత్తవాటిని కనుగొనే ఉత్సుకతను పెంచి ఇదివరలో పరిచితం కాని అననుకూల పరిస్థితులను ఎదుర్కొనగల ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడం
3. భౌతిక, సాంఘిక, సాంకేతిక విజ్ఞాన, సాంస్కృతిక వాతావరణానికి సంబంధించిన అవగాహన కల్పించడం
4. కాయకష్టం పట్ల, ఒళ్ళు వంచి పనిచేయడం పట్ల గౌరవభావాన్ని కలిగించడం
5. లౌకిక దృక్పథం, సామాజిక న్యాయం పట్ల నిబద్ధత ఏర్పడేటట్లు చేయడం
6. దేశ పురోభివృద్ధికి పాటుపడేటట్లు దేశగౌరవం, దేశసమగ్రత కాపాడడానికి సర్వసన్నద్ధత కలిగించడం
7. అంతర్జాతీయ అవగాహన పెంచడం
ఇంతటి ఉన్నత లక్ష్యాలతో రూపొందింపబడిన విద్యా విధానం ఆచరణ లో పరిపూర్ణం గా అమలవ్వాలని ఆశిద్దాం.
naku yeppatinimcho ee curriculam to mana education system umte bagumdunu ani umtumdi
బావుంది స్వాతి
అద్భుతం గా వుంది. చాలా బాగా చెప్పారు. నా graduation పూర్తయ్యే సమయం లో ఒక పుస్తకం చదివాను. అందులో వుంది కదా… గ్రాడ్యుయేట్ పుర్తి చేస్కున్న యువకుడు ప్రపంచం వద్దకు వెళ్ళి నేనిప్పుడు చదువు పూర్తి చేశాను అంటాడు. అప్పుడూ ప్రపంచం అంటుంది, అయితే ఇక్కడ కూర్చుని మిగిలిన అక్షర మాలను ఇప్పుడు పూర్తి చెయ్యి అని. (ఆంగ్లం లో ఇలా వుంటుంది. World says to the Graduate, now sit down and learn rest of the ABCD’s. సరిగ్గా గుర్తు లేదు.) అప్పటిలో ఇది నాకు అర్ధం కాలేదు. ఇప్పుడు అర్ధం అవుతోంది నిజమైన చదువుకి ఈ జీవిత కాలం సరిపోదు అని.
చాలా అందం గా ఉంది మీ కల. దీన్నెలా నిజం చేస్తారు ?
వ్యాసం చాలా బాగుంది. చాలా కాలంగా మేధావులు, సంఘ సంస్కర్తలు, సామాజిక కార్యకర్తలు, విద్యావిధానంలో సమూలమైన మార్పుకోసం ఉద్యమిస్తూనే ఉన్నారు. ఫలితం శూన్యం.
Pingback: మరి కొన్ని చోట్ల « కల్హార