విరోధి ఉగాది పద్యకవితాసమ్మేళనము – రెండవ అంకము

పాఠకమహాశయులకు నమస్కారం. విరోధి ఉగాది సందర్భంగా అంతర్జాల మాధ్యమంలో పొద్దు తరఫున నిర్వహించబడిన కవిమ్మేళనము మొదటిభాగాన్ని ఆస్వాదించారని ఆశిస్తూ ఈ రెండవభాగాన్ని సమర్పిస్తున్నాం. ఇందులో ప్రతిభావంతమైన సమస్యాపూరణలు, ఆశువుగా దుష్కరప్రాసలతో చెప్పబడిన సరసమైన కందాలు, గిరిగారు చెప్పిన ఒక పిట్టకథ మీ కోసం …

{కొత్తపాళీ}: గిరిధరా! సమస్యా పూరణం మీతో మొదలు పెడదాం… కన్యను ధారబోయమన కాదని పొమ్మనె పుణ్యమూర్తి తా
{గిరిధర్}: ఈ సమస్య చదవగానే నాకు పోతనామాత్యుడే జ్ఞప్తికి వచ్చాడు. అందుకే, ఇలా పూరించాను

ఉ||“అన్యుల కీయ నమ్మవె మదంబ” యనెన్, కుటిలాత్ములై భువిన్
పుణ్యుల సాధుసంగతుల బ్రోచని రాజులు వచ్చి కావ్య శ్రీ
కన్యను ధారబోయమన, కాదని పొమ్మనె పుణ్యమూర్తి, తా
ధన్యుడు పూజ్యుడయ్యె, హరి దక్క మరెవ్వరికిన్ తలొగ్గడే

{కామేశ్వరరావు}: పృచ్ఛకుని మనోగతాన్ని అవగతం చేసుకున్నారు గిరిగారూ:-) చాలాబావుంది పూరణ!
{సత్యనారాయణ}: బాగుంది
{రాఘవ}: బావుందండీ. చక్కటి పూరణ.
{కృష్ణ}: ఆహా! కాటుక కంటినీరు .. పద్యాన్ని గుర్తు చేశారు.చాలా బాగుంది.
{గిరిధర్}: అందరికీ ధన్యవాదాలు. కృష్ణగారు, ఈ మధ్యనే భాగవతం చదవడం మొదలు పెట్టాను – అందువల్లనేమో

{కొత్తపాళీ}: చాలా సరసంగా ఉంది. రామకృష్ణ కవిరాయా .. మీ పూరణ
{రామకృష్ణ}: అలాగేనండి.

ఉ|| ధన్యత నొందగా పరమ ధార్మిక భాగవతాఖ్య కావ్యమన్
కన్యను దేవదేవునకు కానుకగా నిడ నున్న పోతనా
మాన్యుని రాజు మత్తుడయి మాకు సమర్పణఁ జేయ కావ్యమన్
కన్యను ధార పోయమన, కాదని పొమ్మనె. పుణ్యమూర్తి తా.

{కొత్తపాళీ}:
great minds think alike 🙂 లేక అది సమస్యలోనే ఉన్న మహిమో?
{కామేశ్వరరావు}: రామకృష్ణగారికి “రాజుల్ మత్తులు…” పద్యం గుర్తుకు వచ్చినట్టుంది. బావుంది!
{రామకృష్ణ}: నిజమేనండి
{రాఘవ}: అది పూరించేవాళ్ల ఆలోచనాసారూప్యఫలితం
{రానారె}: హహ్హహ్హ. సమస్యను చివరిపాదంలో ఉంచడం కూడా బాగుంది.
{గిరిధర్}: ఇది ఖచ్చితంగా సమస్య మహిమే, కామేశ్వరరావుగారు అన్నారు గానీ, పృఛ్ఛకుని మనోగతం అందిరికీ సులభంగానే అవగతమైపోయింది, కదా? రామకృష్ణగారు, రానారె చెప్పినట్టు పాదాన్ని చివరలో ఉంచడం విచిత్రంగా ఉంది..పూరణ బావుంది.

{కొత్తపాళీ}: పుష్య కవీశ్వరా వింటున్నారా?
{పుష్యం}: చెప్పండి
{కొత్తపాళీ}: ఈ సమస్య మీది .. తరువులు కూల్చివేయవలె ధాత్రి జనాళి సుఖాభివృద్ధికై
{పుష్యం}: అవధరించండి

చ|| సరియగు చోటునిచ్చి నర జాతిని చల్లగ చూచు ధాత్రినిన్
కరుణతొ కాయగా వలయు కమ్మని తల్లిని కంటి పాపలా
“తరువులు కూల్చివేయవలె ధాత్రి జనాళి సుఖాభివృద్ధికై,
కరువది తీర త్రవ్వవలె గ్యాసుకు నూనెవి బావు” లంచు ఈ
ధరణిని కాలదన్ను ధన దాహపు మూర్ఖుల జుట్టుపట్టి ఆ
కురులను నున్నగా గొరిగి గుండుకు సున్నపు బొట్లుపెట్టెదన్

{కొత్తపాళీ}:
పుష్యం గారు పచ్చ కంటితో చూశారు సమస్యని
{రాఘవ}: సున్నపుబొట్లు హిహ్హిహ్హీ
{చదువరి}: నిజంగానే జుట్టుపట్టుకు కొట్టినట్టే ఉంది
{కృష్ణమోహన్}: తరువులు కూలిస్తే… కురులు గొరుగుతా అంటారు… బాగుంది.
{గిరిధర్}: కాలదన్నే వాడి జుట్టుపట్టడం బావుంది
{కొత్తపాళీ}: సత్యాగ్రహం లాగా ఇది హరితాగ్రహం
{కామేశ్వరరావు}: బావుందండి! “నరులు తరులను కురులను నరికివేయ” అని నేనెప్పుడో రాసిన పద్యం గుర్తుకువచ్చింది. అదనంగా గుండుకి సున్నపుబొట్లు పెట్టడం భలే ఉంది!
{రాఘవ}: ఔనండీ కామేశ్వరరావుగారూ. నాకూ ఆ పద్యం గుర్తొచ్చింది
{రానారె}: పుష్యకవి పద్యం చదివి ఫక్కున నవ్వొచ్చింది.
{రామకృష్ణ}: చక్కని భావగుంభనతో హెచ్చరికతో చంపకమాలిక అహా.
{పుష్యం}: నెనరులు.

{కొత్తపాళీ}: రామకృష్ణ గారు దీన్నీ పొలిటికల్ ఏంగిల్లో చూశారు. రామకృష్ణ గారూ, మీ పద్యం
{రామకృష్ణ}: మీమధ్య చంపకోత్పల సమ్మిశ్రితమై—–!

కరుణను వోటువేసె ప్రజ. గౌరవ బాహ్య ప్రవృత్త మోర్ఖులై
తరుణ మిదే యటంచు కడు దారుణముల్ పచరించుచుండె. నా
ధరణికి భారమైన ధన దాహ మదోన్మద దుష్త చిత్తులే
తరువులు . కూల్చివేయవలె ధాత్రి జనాళి సుఖాభివృద్ధికై.

{రాఘవ}:
విరుపు భలే ఉందండీ. వాళ్లు కేవల తరువులు కాదు. విషతరువులు.
{కృష్ణ}: మెడలో వేయాల్సిన మాలలతో మెడలే తీస్తున్నారే !
{పుష్యం}: అద్భుతం.. చాలా బాగుంది మాష్టారూ
{చదువరి}: బాగుందండి
{రామకృష్ణ}: ధన్యవాదాలు
{కొత్తపాళీ}: ఇదే సమస్యని గిరిధరుడు సామాజిక సమస్యల కోణంలో చూశారు. గిరీ, మీ పద్యం?
{గిరిధర్}: మన్నించండి, ఓ చిన్న విన్నపం, ఈ పూరణ శాస్త్ర సమ్మతం కాదేమో కానీ పోతనగారే లఘ్వలఘు రేఫలకి పొంతన కుదిర్చారు కాబట్టి నేను అదే చేసేసాను. అవధరించండి.

చ|| కరుగవలెన్ కదోయ్ కరడుగట్టిన ఈ కులవాదమంతయున్
చెరుగవలెన్ మనల్ చెరుపు చీకటి తంతులు, రమ్ము రమ్ము, యం
తరువులు కూల్చివేయవలె ధాత్రి జనాళి సుఖాభివృధ్ధికై
దరువుల వేయగా పెకలితంబగు శోకపు చెట్లు! ధన్ ధనా

{చదువరి}:
అంతరువులు కూల్చివేయవలే – భలే!
{పుష్యం}: ధనా ధన్ కూల్చేసారు.. బగుంది..
{కొత్తపాళీ}: గిరి, శకటరేఫతో ఉన్న ఆ మొదటి పాదం లేకపోయినా, పద్యం భావం బాగానే ఉంది.
{రాఘవ}: ధన్ ధనా… కరుగవలెన్ కదోయ్.. భలే గుప్పించారు వీటిని. అభినందనలండీ. పూరణ బావుంది.
{కామేశ్వరరావు}: “కరగవలెన్ కదోయ్!” చక్కని వాడుక ప్రయోగం.
{రామకృష్ణ}: అంతరువులు ఓహో! చాలా బాగుంది
{సత్యనారాయణ}: “ధన్ ధనా” బాగుంది 🙂
{కామేశ్వరరావు}: ఈసారి మటుకు మీరొక్కరే పృచ్ఛకుని మనసుని పసిగట్టారని ఘంటాపథంగా చెప్పగలను:-)
{గిరిధర్}: కామేశ్వరరావు గారు, పృఛ్చకులు మీరేనా?
{కామేశ్వరరావు}: అంతే కదండీ మరి
{రానారె}: అంతరువులు కొత్తపదం, గిరిగారి సృష్టేననుకుంటా.
{చదువరి}: అంతరువులు కొత్తపదం – కాదనుకుంటా, నిఘంటువులో ఉంది!
{రాఘవ}: అంతరువు అంటే తేడా
{గిరిధర్}: రానారె. అంతరువు అంటే తారతమ్యమని నిఘంటువులు చెపుతున్నాయి – ఉన్న పదాలే సరిగ్గా తెలియని నాకు కొత్తపదాల వీరతాళ్ళు అప్పుడే తొడగకండి
{రానారె}: బాగుంది. నెనర్లు.
{గిరిధర్}: ధన్యుణ్ణి

{కొత్తపాళీ}: రాఘవ కవీ, మాలికలల్లు భామ తన మావటి వానికి ప్రేమతో సదా .. ఈ సమస్య మీది
{రాఘవ}: నారాయణస్వామిగారూ

ఉ|| వేళకు పువ్వులమ్మి తన ప్రేమ మరింత మరింతయై హహా
కాలెడు మండుటెండలని కాసిని ముంజెలు చల్ల నీళ్లనూ
చాల వయారవైఖరిని చక్కగ కొట్టుకు పట్టుకెళ్లె నో
మాలిక లల్లు భామ తన మావ “టి” వానికి ప్రేమతో సదా

{పుష్యం}:
చర్చ మధ్యలో చక్కని టి బ్రేకిచ్చారు.. బాగుంది.
{కొత్తపాళీ}: హ హా కాలిందా? అనుభవంతో చెబుతున్నట్టున్నారే?
{రాఘవ}: హైదరాబాదులో ఎండలు మండిపోయాయండీ ఒక రెండు రోజులపాటు ఈ మధ్యన. అన్నట్టు కొట్టుకు పట్టుకెళ్లిందంటే చౌర్యం అంటగట్టకండి 😉 నాయకికి టీ కొట్టుకి పట్టుకెళ్ళిందని కవిహృదయం 😛
{గిరిధర్}: టీ వాణ్ణి పొట్టివాడిగా విరిచి బాగా పూరించారు
{కామేశ్వరరావు}: విరుపులు చాలా బావున్నాయి. “పువ్వులు+అమ్మి”, “పువ్వుల+అమ్మి”
{గిరిధర్}: కామేశ్వరరావు గారు, మీరు చెప్పేదాకా నేనా విరుపు గమనించలేదండీ – ఏదైనా ఇంతులని బానే వెదికి పట్టేస్తున్నారు మీరు
{కామేశ్వరరావు}: రాఘవగారి అంతరంగాన్ని నేను బహిర్గతం చేస్తున్నానంతే:-)
{రాఘవ}: చల్ల కూడా పట్టుకెళ్లింది చూసారో లేదో. చల్లనీళ్లూ… చల్లా నీళ్లూ.
{జ్యోతి}: రాఘవగారికి బుట్టెడు మల్లెపూలు నావంతుగా, ఈ వేసవి కానుకగా.
{రాఘవ}: జ్యోతిగారూ… మహద్భాగ్యం. మా రామయ్యతండ్రికి అర్పణం.

{కొత్తపాళీ}: శ్యాం, మీ పద్యం చెప్పండి ఈ సమస్యమీద
{పుష్యం}: చిత్తం
{కొత్తపాళీ}: కామేశ్వరరావుగారు, అదేలేండి, మీకు టీ ఇచ్చే భామ సెట్టై పోయారు గదా!
{పుష్యం}: నా నాయకికి ఇంకా టీ గురించి తెలీదు.. రాజుల కాలం కదా.. 🙂

|| పూలతొ రాణికోసమని పూజకు దండలు గ్రుచ్చు నారికిన్
ఏలెడివారి ఇంటికడ ఏనుగు కాచెడివాడు నచ్చె; ఆ
మాలికలల్లు భామ, తన మావటివానికి ప్రేమతో సదా
వాలుగ చూపులన్ విసిరె వాటముగా తన ప్రేమ తెల్పుచున్

{గిరిధర్}: వాటముగా – వేటూరి పాట వింటున్నట్టుంది
{కామేశ్వరరావు}: అయినా అమే గడుసరే, అప్పుడే అతన్ని “తన” మావటివానిగా చేసేసుకుంది 😉
{రాఘవ}: హహహ 😀 శ్యామ్ గారూ… నాకు విక్రమార్కచరిత్రమ్‌లో భర్తృహరి కథ గుర్తొచ్చిందండీ.
{రామకృష్ణ}: మీ నాయిక సరసం మాకర్థమైందిలెండి.
{రానారె}: ఆహా… మంచి ప్రేమకథ
{రాఘవ}: మావటి మాలిక… ఒక ప్రేమకథ 😉
{చదువరి}: 🙂 పద్యం చక్కగుంది
{పుష్యం}: ధన్యుణ్ణి

{కొత్తపాళీ}: మల్లిన నరసింహా రావు గారు విచ్చేశారు, స్వాగతం
{రాఘవ}: నమస్కారం నరసింహారావుగారు
{రామకృష్ణ}: స్వాగతము మల్లినాధా!
{నరసింహ}: నమస్కారాలండి అందరికీ.
{పుష్యం}: తమ పనులు వదలి వచ్చిరి | కమనీయపు కవితలివ్వ, కవివరులు, భలే!
{రామకృష్ణ}: సుమధుర పద్యములల్లగ
{కొత్తపాళీ}: పుష్యం, పొరబడ్డారు. కవివరులకి, కవితా వ్యసనం కంటే ఇష్టమైన పని ఇంకొకటేమున్నది? 🙂
{కొత్తపాళీ}: విరుపులందు గురుని విరుపులు వేరయా .. అన్నట్టు గిరి చేసే విరుపులు చూడండి. గిరిధరా, మీ పద్యం?
{గిరిధర్}: చిత్తగించండి. ఇది సరదాగా విరిచి వ్రాసాను.

ఉ|| “నాలుగు ప్రశ్నలేస్తి సుగుణాకర పూరణ లిమ్ము” “హారమ
న్నా లతికన్ననేమి? యదునాయకి ఎవ్వతె రబ్డి? వంగు నే
న్గే లులిపడ్డదై యెవనికీ? జయపెట్టె నితిన్నెవర్తెరా?”
మాలిక, లల్లు భామ, తన మావటి వానికి, ప్రేమతో సదా

{గిరిధర్}: ముందు నేనూ టీ వాణ్ణి రంగంలోకి దింపుదామనుకుని ఎందుకో మానుకున్నాను 🙂
{పుష్యం}: విరుపులందు ‘గిరి’వి విరుపులు వేరయా..
{రాఘవ}: లల్లు భామ… గొల్లభామేమోననుకున్నాను హిహ్హీహ్హీ 😀
{రాకేశ్వర}: గిరిధర్ గారు కాస్త వంగు నేన్గే లులిపడ్డదై యెవనికీ – అన్నదాన్ని వివరించగలరా
{గిరిధర్}: రాకేశ్వరా, ఏనుగు ఎవరికి భయబడ్డదై అణిగిమణిగి ఉంటుంది – అని అర్థం
{రాఘవ}: లులిపడ్డమంటే హీనమవ్వడం
{రాకేశ్వర}: నేన్గేలో నేన్గునే నేగన లేకపోతిని 🙁 నేన్గే లో నేనుగే నాకు కనఁబడకపోయినది. నెనర్లు.
{రామకృష్ణ}: 😀
{గిరిధర్}: రాకేశ్వరా – బావుంది
{రాఘవ}: నేన్గున్గనగాన్… 😀
{చదువరి}: జయపెట్టె నితిన్నెవర్తెరా? – ఆలోచన భలే ఉంది. గభాలున అర్థం కాలేదు.
{గిరిధర్}: చదువరిగారు, జయం చిత్రాన్ని ఇరికించడానికి ప్రయాస అది
{సత్యనారాయణ}: బాగుంది. “సదా” ను కూడ బాగా ఇరికించారు
{పుష్యం}: ‘లల్లు భామ’ విరుపదిరింది..
{రామకృష్ణ}: క్రమాలంకారం?
{రాఘవ}: ఒఠి క్రమాలంకారం కాదండీ రామకృష్ణారావుగారూ, విక్రమాలంకారమండీ
{రానారె}: అయ్యబాబోయ్… త్రివిక్రమాలంకారం అది. మూడు పాదాలు మోపి, నాలుగోపాదం సమస్యపైన మోపారు 🙂
{రాఘవ}: రామనాథులవారూ…భలే
{చదువరి}: రానారె.. 🙂 🙂 ఇంకా నయం సమస్య ఇచ్చినవారిపై మోపలేదు
{కొత్తపాళీ}: రానారె భలే భలే
{గిరిధర్}: క్రమ, విక్రమ, త్రివిక్రమ – ఆహా
{కొత్తపాళీ}: చదువరి .. ఇది మరీనూ హ హ హ
{రాఘవ}: చదువరిగారూ… ఈ రోజు పగలబడి నవ్వుకోవడంతో సరిపోతుందేమోనండీ… హిహ్హీహ్హీ
{రానారె}: గిరీ, ఇదీ మీ పరాక్రమం మరి! 🙂
{గిరిధర్}: చదువరి – ప్రచ్ఛకుడు బలియై పోయేవాడే
{చదువరి}: గిరి: బలియై – అదిరింది
{రానారె}: చదువరిగారు, భలే పట్టారు. 🙂
{రాఘవ}: బలైపోకుండా బలియైపోతారా… :O
{చదువరి}: బలియౌదురు!

{కొత్తపాళీ}: సరే, ఇంకొక్క సమస్య చూసుకుని మిగతా అంశాల్లోకి వెళ్దాం. ఈ సమస్యా పూరణకి జనాల కళ్ళు బైర్లు కమ్మితే నా పూచీ ఏం లేదు. ముందే చెప్తున్నా, నల్లకళ్ళద్దాలు సిద్ధం చేసుకోండి
{పుష్యం}: నల్లని సులోచనములను మెల్లగ నే పెట్టుకొంటి మొదలెట్టండీ
{కొత్తపాళీ}: కామేశ్వర్రావు గారూ, మీరు మొదలెట్టండి దీన్ని .. హర్మ్యము నందు సంచరిలె హాయిగ పార్వతి విష్ణుమూర్తితో
{కామేశ్వరరావు}:

ఉ|| ధర్మ్య మనోజభావమె ప్రధానము దంపతి సౌఖ్యవృత్తికిన్,
భర్మ్య వినిర్మితమ్ములగు వాసములేల? మహేశుతో శిలా
హర్మ్యమునందు సంచరిలె హాయిగ పార్వతి, విష్ణుమూర్తితో
నూర్మ్య మహోధదిన్ వెలసియుండెను లక్ష్మి మనోరమాకృతిన్

{నరసింహ}:
వాహ్వా
{కామేశ్వరరావు}: ఈ ప్రాసతో చాలా ఆయాసం వచ్చింది!
{పుష్యం}: ఆర్యా.. మీకు ఆయాసమే వచ్చింది. నాకు హార్టెటాకు వచ్చింది. 🙂
{గిరిధర్}: సునాయాసంగా లాగించేసి ఆయాసం అంటున్నారు – నాకు ఆలోచనలు ఉడిగిపోయాయి
{చదువరి}: కామేశ్వరరావుగారూ, పద్యం అద్భుతం!
{నరసింహ}: నూర్మ్య అంటే
{కొత్తపాళీ}: విష్ణుమూర్తితోన్ .. ఊర్మ్య మహోదధి
{కామేశ్వరరావు}: అది “ఊర్మ్య” – కెరటాల కదలికలతో నిండి ఉన్న అని అర్థం
{రాఘవ}: దుష్కరప్రాస… విశ్వనాథ సత్యనారాయణగారు గుర్తొచ్చారండీ
{రానారె}: మనోరమాకృతిన్ … సౌఖ్యం మనసులోఉండాలంటారు కామేశ్వరరావుగారు. వారి నామ’ధ్యేయం’ చూడండి. 🙂
{సత్యనారాయణ}: దుష్కర ప్రాస కూడ మీ చేతిలో సులభ తరమయినది
{రాఘవ}: మీకు ఒక ‘పె…ద్ద న’మస్కారం
{గిరిధర్}: శిలా హర్మ్యములు కొండలేనా? బావుంది పూరణ – నాకు మటుక్కు ఇది దుష్కరాతి దుష్కర ప్రాస
{చదువరి}: ధ్యేయం – అహో!

{రామకృష్ణ}:

క|| కామేశ్వరు పూరణమది
ప్రేమాద్భుతమగుచునుండె పేర్మిని వెలయన్
పూరణ చేసిరి వారికి
ప్రేమామృతమిచ్చి గాచు ప్రీతిని శివుడున్

{కామేశ్వరరావు}:
నెనరులు!
{రాకేశ్వర}: నాదో కందం త్వరగా ఆలకించగలరు –

క|| నేన్గే లోనేన్గుని యే
నేన్గన లేదే గిరివర, నేన్గును జూపీ
పీన్గును బ్రోచితిరయ్యా
గాన్గును ద్రిప్పి తమరప్పు గట్టెద నయ్యా

{కొత్తపాళీ}:
రాకేశ్వర, హ హ హ
{భావకుడన్}: అంతే కాని నల్లి బాధ పడలేక కాదంటారు? 🙂 చాలా బావుంది.
{కొత్తపాళీ}: ఏవిటిది, అకస్మాత్తుగా రావిశాస్త్రి కథలో ఏదో పాత్ర చేత మాట్లాడిస్తున్నట్టు ఉంది
{రాఘవ}: నల్లి పిల్లి గొడవలు చెంచాడు భవసాగరాలూ అమృతం చూసే మన కోసమండీ… అమృతం తాగేవాళ్లకి కాదు
{కొత్తపాళీ}: రాఘవ, సెబాసు
{చదువరి}: రాకేశ్వర – ఈ అప్పు గొడవేంటి!?
{గిరిధర్}: రాకేశ్వరా, ప్రాసకోసం గాన్గు దాకా వెళ్ళిపోవాలా 🙂
{రాఘవ}: గాన్గు… హిహ్హీ 😀 నిజమే… భవసాగరాలు చూపిస్తున్నారు మన రాకేశ్వరులవారు
{భావకుడన్}: ఇపుడు నేను మిమ్మల్ని శంకర శాస్త్రి గారిలా ఊహించుకుని “భవ సాగారాలంటే….?” అని అడగను లెండి. 🙂
{రాకేశ్వర}: న్గు ప్రాసకి గాన్గు తప్ప ఇంకేం తట్టలేదు. అప్పు – అనగా వివరించిన ఋణం

{కొత్తపాళీ}: ఓకే, కామేశ్వర్రావు గారి చమా చమక్ చమత్కృతులు చూశారు గదా, ఇక గిరిధరుడి చేతివాటం చూడండిప్పుడు. గిరీ, మీ పద్యం
{గిరిధర్}: ఇదిగో

ఉ|| హర్మ్యమనే పదమ్ము గనినంతనె వర్షమె నా పెరేడునన్
హర్మ్యము నందు సంచరిలె హాయిగ పార్వతి విష్ణుమూర్తితో
నా? ర్మ్యని ప్రాసగా నొసగి నవ్వుచు హాయిగ కొత్తపాళిగా
రూ, ర్మ్యము మాకు పద్యముల లోబడదంచు కదా మహాప్రభో,
‘ఖర్మ్యము’ మీది పొండనుచు ఘాటు సమస్యల నీయబోవుటల్?

{కొత్తపాళీ}:
it rained on your parade? Were you in NCC?
{రామకృష్ణ}: 😀
{సత్యనారాయణ}: 🙂
{భావకుడన్}: 🙂 🙂
{గిరిధర్}: కొత్తపాళీగారు, అమెరికా వదిలినా అమెరికనిజములను వదలలేక పోవడం వల్ల వచ్చిన తంటా అది
{రాఘవ}: గడసరి పూరణ… 🙂 శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలూ అన్నట్టు గరికపాటివారిని బాగానే పట్టారు.
{కొత్తపాళీ}: హహ్హహ్హ నిజానికి ఈ సమస్య ఇచ్చింది నేను గాదు. కానీ సభాధ్యక్షుణ్ణి కాబట్టి మీరేమన్నా పడతాను, కానివ్వండి.
{కామేశ్వరరావు}: ఎవరో త్వరగా చెప్పండి…
{రానారె}: గిరిగారిది నోటి దురుసు అనడానికి వీల్లేదు. ఇది చేతివాటం అన్నారు కోత్తపాళీగారు.
{రాకేశ్వర}: పెరేడుపై వర్షంలో వర్షం – కొత్త జాతీయమా 🙂
{రానారె}: గిరిగారూ ఇప్పుడు మీరు వీరతాళ్లు వేసుకోవలసిందే.
{చదువరి}: పెరడు – ఛందము కొరకయ్యె పెరేడు!
{కొత్తపాళీ}: చదువరి, కాదు, అది పెరేడే. parade!
{గిరిధర్}: చదువరిగారు, పెరడు అని నేను ఆలోచించలేదు – పెరేడు అనే ఇంగ్లీషు పదాన్ని వాడాను
{కొత్తపాళీ}: it rained on my parade is an American expression which means some event has ruined a person’s happiness, at least temporarily
{చదువరి}: కొత్తపాళీ నెనరులు! మన ‘పొంగు మీద నీళ్ళు జల్లినట్ట’న్నమాట!
{రాఘవ}: నేను ఇంకా కంగారు పడ్డాను… అమవసనిసి తలచుకొని. పాపం మా గిరిధరుణ్ణి ఎవరైనా వెక్కిరిస్తారేమో అని.
{కొత్తపాళీ}: రాఘవ, ఇది కులాభిమానము .. కవికులాభిమానము!!
{గిరిధర్}: కవికులాభిమానం :):)
{గిరిధర్}: అమెరికన్లు తరచూ ‘rained on parade’ వాడుతూంటారు – అదే విని, ఇక్కడ వాడాను
{పుష్యం}: NCC పెరేడయితే కష్టం కానీ, అమెరికా ఫుట్బాల్ పేరేడయితే పర్వాలేదు..వర్షంలో తడిసిన చీర్లీడర్లు.. తెలుగు సినిమా చూసిన ఫీలింగు 🙂
{కొత్తపాళీ}: హమ్మో పుష్యం గారు ఎక్కడికోఓఓ వెళ్ళిపోయారు
{రాఘవ}: కొత్తపాళీగారూ, మరి అంతే కదండీ
{భావకుడన్}: పుష్యం గారు, స్వర్గానికి అడుగు దూరంలో ఉన్నారా? 🙂
{రాఘవ}: అడుగు కాదు బెత్తెడు.
{పుష్యం}: కాదు త్రిశంకు స్వర్గంలో 🙂
{కామేశ్వరరావు}: గిరిగారు ఆంగ్ల పదాలతోనే కాక ఆంగ్ల జాతీయాలతో కూడా పద్యాలనల్లగల సమర్థులన్నమాట!
{రాఘవ}: గిరిగారూ మీకు జాతీయ జాతీయతర్జుమాప్రపూర్ణ అని బిరుదివ్వాలి
{రానారె}: రాఘవా, అంతర్జాతీయ జాతీయతర్జుమాప్రపూర్ణ అంటే మీకేమైనా అభ్యంతరమా? 🙂
{రాఘవ}: మళ్లీ… విక్రమ అంటే త్రివిక్రమ అన్నారు. జాతీయ అంటే అంతర్జాతీయ అంటున్నారు. నాకు సంతోషమే మా గిరిగార్కి ఇస్తున్నారంటే. 🙂
{గిరిధర్}: రాఘవా, అభిమానానికి ధన్యవాదాలు :))
{భావకుడన్}: రానారె గారు… “అం జా త ప్ర” అన్న మాట ….”పం బం బం” లాగా
{రాకేశ్వర}: గిరిధర్ గారికి ఇంకో దుష్టకందం అంకితం-

కం|| హర్మ్యపు పద్యపు ప్రాసము
గ ర్మ్యము వచ్చెను గిరీశ గమ్మత్తుగనూ
ఈ ర్మ్యపు ప్రాసను మీరు భ
లె ర్మ్యము తోనే తెగింతిరి చిత్తరువే

{కొత్తపాళీ}:
రాకేశ్వర, సెబాసు. ఇప్పుడు రామకృష్ణ కవీంద్రుల గడుసు తనం చూడండి. రామకృష్ణ గారూ, కానివ్వండి.
{రామకృష్ణ}: తమరి ఆజ్ఞ

ఉ|| హర్మ్యము లందు సంచరిలు హాయిగ మానవు లంచు, శంభుతో
హర్మ్యము నందు సంచరిలె హాయిగ పార్వతి . విష్ణుమూర్తితో.
హర్మ్యము నందు సంచరిలె హాయిగ లక్ష్మి. మహత్వ బ్రహ్మతో
హర్మ్యమునందు సంచరిలె హాయిగ వాణి . అదెంత భాగ్యమో!

{రాకేశ్వర}:
ఈ పద్యాన్ని రామకృష్ణ మాస్టారి నోరారా విన్న భగ్యం నాదే 😉
{రానారె}: ఓకే స్టోరీలో అనేక హర్మ్యాలు. భలే.
{కామేశ్వరరావు}: అందరూ ఒకే “multi-storied” హర్మ్యంలో కాబోలు 🙂
{రాఘవ}: అపార్టుమెంటు. దుష్కరప్రాసలకి ఒక చక్కటి దారి చూపించారండీ రామకృష్ణగారూ. బావుంది.
{కొత్తపాళీ}: దేవతలక్కూడా హర్మ్యాలు కావాల్ట, అందుకే హైద్రాబాదు రియలెస్టేటు ఇలా మండి పోతోంది.
{చదువరి}: శివుడికి కూడా హర్మ్యాన్ని ఇచ్చారు మాస్టారు!
{సత్యనారాయణ}: బాగుంది. ఇది మరో అవధానపు కిటుకు అనుకుంటా! అన్ని పాదాలలోనూ ఒకే పదము వాడి మెప్పించటము.
{నరసింహ}: భావ భవ భోగ సత్కళాభావములను గుర్తుకు తెచ్చారండీ రామకృష్ళా రావు గారూ.
{కొత్తపాళీ}: నరసింహ .. హ్హ హ హ
{రాఘవ}: అపార్టుమెంట్లు ఎక్కువైనాయి కదా ఈ రోజులలో
{రాకేశ్వర}: ఆ హర్మ్యాన అపార్టుమెంటు ఖరీదు ఎంతుంటుందో మఱి 🙂
{కొత్తపాళీ}: కానీ, రామకృష్ణగారూ, మా వూళ్ళో (డెట్రాయిట్లో) బోల్డు హర్మ్యాలు ఖాళీగా ఉన్నాయండీ .. తమరేవన్నా లచ్చిందేవికి కాస్త సిఫార్సు చేయిస్తే …
{కృష్ణ}: వాలు స్ట్రీటు కు పాపం ఆమె భయపడి ఉంది. తప్పకుండా అటు వస్తుంది కోపా గారు..
{రామకృష్ణ}: ధనమున్నవారింటిలోనే త్రిమూర్తులూ, ముగురమ్మలూ వుంటారని నా అభిప్రాయం
{కామేశ్వరరావు}: అవును “సాధన”మున్న వారి యింటనే!
{గిరిధర్}: రామకృష్ణ గారు, సమస్య కొద్దీ పూరణ
{రామకృష్ణ}: ధన్యోస్మి
{గిరిధర్}: ఇది చదవగానే, చిన్నప్పుడు నా స్నేహితుడొకడు ‘వెకేషన్’ అనే పదం వాడి ఐదు వాక్యాలు వ్రాసుకురారా అంటే …
{రాఘవ}: అంటే…?
{గిరిధర్}: 1. During holidays we went to calcutta for vacation
2. During holidays we went to Delhi for vacation
..ఇలా వ్రాసేసాడు, ఐదూళ్ళు పేళ్ళు, అది గుర్తుకు వచ్చింది.
{రాఘవ}: హిహ్హ్హీహిహ్హీ 😀 పడి దొర్లడం ఔతోందండీ
{నరసింహ}: :D:D
{చదువరి}: గిరి: 🙂

{కొత్తపాళీ}: హహ్హహ్హ… కాసేపు వేరే విషయంలోకి వెల్దాం
{రాకేశ్వర}: ఈ దుష్టకందం రామకృష్ణ మాస్టారికి అంకితం-

కం||. హర్మ్యపు పద్యపు ప్రాసము
గ ర్మ్యము వచ్చెనుగ రామ గమ్మత్తుగనూ. ||
హర్మ్యపు ప్రాసను మీరును
హర్మ్యము తోనే తెగింతిరి చిత్తరువే||

{రాఘవ}: రాకేశ్వరా… భలే
{రామకృష్ణ}: కనీసం దుష్టకందమైనా అంకితంగా పొందిన ధన్యుణ్ణి.
{రాకేశ్వర}: మాస్టారు మీ దయతో నేను సైతం ర్మ్య ప్రాసగా గల ఒక పద్యాన్ని.. చెప్పాలంటే రెండనుకోండి .. వ్రాసేసాను . నెనరులు.
{రానారె}: రాకేశుని ఆశుకవిత లీ సారికి ప్రత్యేకము – అన్నమాట. 🙂
{రాఘవ}: ఉన్నమాటే
{గిరిధర్}: రాకేశా, వీకు స్టూడెంటువని రెండు వీకుల క్రితం బొంకులాడావు, కదా. ఏకుతున్నావు ఏగ్రేడు వాడిలా.
{రానారె}: వీకు గడిచింది కదా, వీకునెస్ పోయింది
{రాఘవ}: రానారె… భలే! గిరి … గ్రెనేడు లా పేలుతున్నాడు అనలేదు. నయం.
{రానారె}: కాసేపు వేరే విషయంలోకి వెళ్దామన్నారు అధ్యక్షులు. వెళ్దాం మరి.

(రెండవ అంకము సమాప్తం)

తరువాతి అంకములో మన అంతర్జాలకవుల అనువాదప్రతిభ, సందర్భానుసారంగా ఛందస్సునుపయోగించడం గురించి ఒక ఆసక్తికరమైన సంభాషణ …

This entry was posted in కవిత్వం and tagged . Bookmark the permalink.

4 Responses to విరోధి ఉగాది పద్యకవితాసమ్మేళనము – రెండవ అంకము

  1. సూర్యుడు says:

    పద్యాలలో అలంకారాల గురించి కూడా చర్చించుంటే బాగుండేది

  2. సూర్యుడుగారు,
    ఆ బాధ్యత రసికులైన పాఠకులకి వదిలేసాం! ఇక్కడ వ్యాఖ్యల రూపంలో ఆ చర్చ జరపవచ్చు.

  3. రాఘవ says:

    ఈ శృంఖలకు సంబంధించిన మొదటి లంకె వేఱే ఉండాలేమో, సరిచూస్తారా?

  4. రాఘవా, పొరబాటును సరిచేశాము. నెనరులు. ఇప్పుడు చూడండి.

Comments are closed.