బెల్లం టీ

-నెమలికన్ను మురళి
చిన్నప్పుడు నన్ను ‘మనవడా’ అనీ, నేను కొంచం పెద్దయ్యాక ‘మనవడ గారా..’ అనీ పిలిచేది. నేనేమో ఆవిణ్ణి మరీ పసితనంలో ‘వెంకాయమ్మా..’ అనీ కొంచం జ్ఞానం వచ్చాక ‘నానమ్మ గారూ..’ అనీ పిల్చేవాడిని.

“బాబూ.. మొహం కడుక్కుని రా. తల దువ్వుతాను. నాన్నగారు నిన్ను వెంకాయమ్మ గారింటికి తీసుకెళ్తారుట…” తల దువ్వించుకోవడం నాకు చాలా చిరాకైనా పనైనా, ఆ చివరి మాటలు వినగానే మంత్రించినట్టుగా నూతి దగ్గరకి పరిగెత్తే వాడిని చిన్నప్పుడు, మొహం కడుక్కోడం కోసం. వెంకాయమ్మ గారింటికి వెళ్ళడం అంటే ఒక చిన్న సైజు పండుగ అప్పట్లో.

బెల్లం పాకం తో చుట్టిన జీడిపప్పు ఉండలు, బెల్లం పూతరేకులు, గోర్మిటీలు, మడత కాజాలు.. వీటిలో కనీసం రెండు రకాల మిఠాయిలని ఇత్తడి పళ్ళెంలో పెట్టి అందిస్తారా.. అవి తినడం పూర్తి కాకుండానే ఓ పేద్ద ఇత్తడి గ్లాసు నిండా నురుగులు నురుగులుగా బెల్లంటీ ఇచ్చేస్తారు. మనం ఇంకేమీ అనడానికి ఉండదు. బుద్ధిగా తాగేయ్యడమే.. పైగా నాన్న కూడా ‘వద్దు’ అనరు.

రెండు చేతులతోనూ గ్లాసుని గట్టిగా పట్టుకుని, ఊదుకుంటూ తాగుతుంటే బెల్లంటీ ఎంత బాగుంటుందంటే.. ఆ రుచి వర్ణించడానికి రాదు. తియ్యగా, వగరుగా, అదోలాంటి వాసనతో.. అంత పేద్ద గ్లాసు చూడగానే అస్సలు తాగ గలమా? అనుకుంటాం.. కానీ తాగుతుంటే ఇంకా తాగాలని అనిపిస్తుంది.. మన ఇంట్లో పాలు తాగినట్టు బెల్లంటీ చివరి చుక్కవరకూ తాగ కూడదు.. ఎందుకంటే గ్లాసు అడుగున నలకలు ఉంటాయి.. అందుకని కొంచం వదిలెయ్యాలి.

వెంకాయమ్మ గారు.. మా ఊళ్ళో పరిచయం అక్కర్లేని పేరు. ఆవిడ మామూలుగా మాట్లాడిందంటే నాలుగు వీధులు వినిపిస్తుంది.. ఇంక కోపం వచ్చిందంటే ఊరంతటికీ వినిపించాల్సిందే. యాభయ్యేళ్లు పైబడ్డ  మనిషైనా అంత వయసులా కనిపించేది కాదు. నల్లని నలుపు, చెయ్యెత్తు మనిషి. జరీ నేత చీర, ఐదు రాళ్ళ ముక్కు పుడక, బేసరి, చెవులకి రాళ్ళ దిద్దులు, మెడలో నాంతాడు, చంద్రహారాలు, కంటె, కాసుల పేరు, చేతులకి అరవంకీలు, కాళ్ళకి వెండి కడియాలు, పట్టీలు.. ఆవిడ పేరంటానికి వచ్చిందంటే సాక్షాత్తూ లక్ష్మీదేవి నడిచొచ్చినట్టు ఉందని అనేది అమ్మ. వీటిలో సగం నగలు నిత్యం ఆవిడ వంటిమీద ఉండాల్సిందే..  మా ఊరి గుళ్ళో అమ్మవారి మెడలో మంగళ సూత్రాల తర్వాత, మళ్ళీ అంత పెద్ద సూత్రాలు ఆవిడ మెడ లోనే చూశాను నేను.

వాళ్ళ ఇల్లు చూస్తే కోనసీమ మొత్తాన్ని చూసేసినట్టే. వీధివైపు కొబ్బరి చెట్లు. మల్లె పొదలు, జాజితీగలు,  బంతి, కనకాంబరం మొక్కలు. దాటి లోపలి వెళ్తే పేద్ద పెంకుటిల్లు. పెరటి వైపున వంటకి ఇంకో చిన్న వంటిల్లు. ఓ పక్కగా కోళ్ళ గూడు, మరో పక్క వంట చెరకు. కాస్త దూరంలో నుయ్యి. నూతి గట్టుని ఆనుకుని వాళ్ళ కొబ్బరి తోట, కొంచం ముందుకెళ్తే వాళ్ళదే వరి చేను. ఈవిడ  వంటగదిలో నుంచి కేకేసిందంటే పొలంలో కూలీలు ఉలిక్కి పడి, మాటలు ఆపి పని మొదలు పెట్టాల్సిందే.

నేనూ, నాన్నా ఎప్పుడు వెళ్ళినా వాళ్ళ పెరటి అరుగు మీద కూర్చునే వాళ్ళం. ఆవిడ వంట ఇంట్లో పని చేసుకుంటూనే, ఓ పక్క నాన్నతో మాట్లాడుతూ మరో పక్క పొలంలో పనిచేసే కూలీల మీద అజమాయిషీ చేసేది. చిన్నప్పుడు నన్ను ‘మనవడా’ అనీ, నేను కొంచం పెద్దయ్యాక ‘మనవడ గారా..’ అనీ పిలిచేది. నేనేమో ఆవిణ్ణి మరీ పసితనంలో ‘వెంకాయమ్మా..’ అనీ కొంచం జ్ఞానం వచ్చాక ‘నానమ్మ గారూ..’ అనీ పిల్చేవాడిని. నాన్నని ‘అబ్బాయి’ అనీ అమ్మని ‘కోడలు గారు’ అనీ అనేది. నేనంటే భలే ముద్దు ఆవిడకి.

మా ఊరివాడైన నరసింహ మూర్తి గారిని పెళ్లి చేసుకుని తన పన్నెండో ఏట మా ఊరికి కాపురానికి వచ్చిందట వెంకాయమ్మ గారు. ఆవిడ పుట్టిల్లు మా ఊరికి నాలుగైదు ఊళ్ళు అవతల ఉన్న మరో పల్లెటూరు. జీడి తోటలకీ, మావిడి తోటలకీ ప్రసిద్ధి. కలిగినింటి ఆడపడుచు కావడంతో భూమి, బంగారం బాగానే తెచ్చుకుందని మా ఇంట్లో అనుకునే వాళ్ళు. ఆవిడ వచ్చాకే నరసింహ మూర్తి గారికి దశ తిరిగిందిట. ఆయన స్వతహాగా అమాయకుడు. కష్టపడతాడు కానీ, వ్యవహారం బొత్తిగా తెలీదు.

నలుగురు పిల్లలు బయలుదేరగానే ఇంటి పెత్తనం మొత్తం వెంకాయమ్మగారు తన చేతుల్లోకి తీసుకుందిట. వాళ్లకి ఆరుగురు ఆడపిల్లలు, ఒక్కడే మగపిల్లాడు. మొదటి నుంచీ ఆవిడకి ఆడపిల్లలంటే చిన్నచూపు, ఆస్తి పట్టుకుపోతారని. కొడుకంటే విపరీతమైన ప్రేమ. ఆవిడ పెత్తనం తీసుకున్నాక అప్పటివరకు ఖాళీగా పడున్న పోరంబోకు భూమిని మెరక చేసి కొబ్బరితోట గా మార్చింది. ఉన్న పొలానికి తోడు, మరికొంత పొలం కౌలుకి తీసుకుని వరి, అపరాలు పండించడం మొదలు పెట్టింది. పాడికి పశువులు, గుడ్లకి కోళ్ళు సర్వకాలాల్లోనూ ఇంట్లో ఉండాల్సిందే.

చివరి సంతానానికి నీళ్ళూ, పాలూ చూడడం అయ్యేసరికి పెద్ద కూతురి పిల్లలు పెళ్ళికి  ఎదిగొచ్చారు. అంత సంసారాన్నీ ఈదుతూనే ఊరందరికన్నా ముందుగా తన ఇల్లంతా గచ్చు చేయించింది వెంకాయమ్మ గారు. “ఎదవ కోళ్ళు.. కొంపంతా నాసినం చేసి పెడతన్నాయి..వందలు తగలేసి గచ్చులు సేయించినా సుకం లేదు” అని విసుక్కుందోసారి. “మరెందుకు కోళ్ళని పెంచడం? తీసేయొచ్చు కదా?” అని నేను జ్ఞానిలా సలహా ఇచ్చాను, ఆవిడ పెట్టిన లడ్డూ కొరుక్కుంటూ.

“మీ మావలొచ్చినప్పుడు కోడి గుడ్డట్టు కంచంలో ఎయ్యకపోతే మీ అత్తలు ముకం మాడ్సరా నాయినా? ఈటిని తీసేత్తే గుడ్లెక్కడినుంచి అట్రాను?” అని అడిగిందావిడ. “మా ఆడపడుచుల చేత ఇల్లలికించారు.. మా తోటికోడలు కష్ట పడకూడదని గచ్చులు చేయించేశారు అత్తగారు” అని వేళాకోళం చేసింది అమ్మ. ఊళ్ళో వాళ్ళు ఆవిడ నోటికి జడిసినా, ఏదైనా అవసరం వచ్చినప్పుడు మొదట తొక్కేది ఆవిడ గడపే. ఇంటికి వచ్చిన వాళ్ళని వట్టి చేతులతో పంపదని పేరు. “అవసరం రాబట్టే కదా మన్ని ఎతుక్కుంటా వచ్చారు.. మనకి మాత్తరం రావా అవసరాలు?” అనేది ఆవిడ.

పొలం పనుల రోజుల్లో వాళ్ళిల్లు పెళ్ళివారిల్లులా ఉండేది. పెరట్లో గాడి పొయ్యి తవ్వించి పెద్ద పెద్ద గంగాళాల్లో ఉప్మా వండించేది.. ఓ పెద్ద ఇత్తడి బిందెలో బెల్లం టీ మరుగుతూ ఉండేది. “కడుపు నిండా ఎడతాది.. మారాత్తల్లి” అనుకునే వాళ్ళు కూలీలు. పని కూడా అలాగే చేయించేది. గట్టున నిలబడి అజమాయిషీ చేయడమే కాదు, అవసరమైతే చీరని గోచీ దోపి పొలంలోకి దిగిపోయేది. సాయంత్రానికి కూలీ డబ్బులు చేతిలో పెట్టి పంపించేది. “ఆళ్ళని తిప్పుకుంటే మనకేవన్నా కలిసొత్తాదా” అంటూ.

వెంకాయమ్మ గారికి భక్తి ఎక్కువే. కార్తీక స్నానాలకీ, మాఘ స్నానాలకీ సవారీ బండి కట్టించుకుని గోదారికి బయలుదేరేది. ఎప్పుడైనా సినిమా చూస్తే అది భక్తి సినిమానే అయ్యుండేది. ఆవిడ సవారీబండి కట్టించిందంటే అది మా ఇంటి ముందు ఆగాల్సిందే. మేము బండిలో కూర్చోవాల్సిందే. నాన్నని నోరెత్తనిచ్చేది కాదు. “ఆయమ్మని నువ్వూ ఎక్కడికీ తీస్కెల్లక, నన్నూ తీసుకెళ్ళనివ్వక.. ఎట్టా నాయినా?”  అని గదమాయించేది.

ఎప్పుడైనా నాన్న ఊరికి వెళ్ళాల్సి వచ్చి, ఇంట్లో మేము ఒక్కళ్ళమే ఉండాల్సి వస్తే రాత్రులు మాకు సాయం పడుకోడానికి వచ్చేది ఆవిడ. పనులన్నీ ముగించుకుని ఏ పదింటికో తలుపు తట్టేది. “ఉడుకు నీల్లతో తానం చేసొచ్చాను కోడలగారా.. మా మనవడు సెవటోసన అనకుండా” అనేది. అది మొదలు అమ్మా, ఆవిడా అర్ధ రాత్రివరకూ కష్టసుఖాలు కలబోసుకునే వాళ్ళు. నేను నిద్రపోయానని నిశ్చయం చేసుకున్నాక, ఆవిడ బయటికి వెళ్లి అడ్డ పొగ పీల్చుకుని వచ్చేది. నాకు తెలిస్తే నవ్వుతానని ఆవిడ భయం. నాకు తెలిసినా తెలీనట్టు నటించే వాడిని. ఆవిడ సాయానికి వచ్చినప్పుడు అమ్మ నిద్రపోయేది కాదు. దొంగాడెవడైనా వెంకాయమ్మ గారి నగల మీద కన్నేసి, ఆవిడ మా ఇంట్లో ఉండగా పట్టుకుపోతే ఆ పేరు ఎప్పటికీ ఉండిపోతుందని అమ్మ భయం.

నాకు జ్వరం వస్తే టీ కాఫీలు తరచూ ఇమ్మని చెప్పేవారు డాక్టరు గారు. నేనేమో బామ్మ తాగే కాఫీ అయినా, వెంకాయమ్మ బెల్లం టీ అయినా కావాలని గొడవ చేసేవాడిని. అమ్మకేమో అంతబాగా చేయడం వచ్చేది కాదు. ఒక్కోసారి వారం పదిరోజుల వరకూ జ్వరం తగ్గేది కాదు. అలాంటప్పుడు ఖాళీ చేసుకుని నన్ను చూడ్డానికి వచ్చేది వెంకాయమ్మ గారు. “వెంకాయమ్మ ఇచ్చే టీ లాంటిది కావాలని గొడవ చేస్తున్నాడు మనవడు. నాయనమ్మగారు ఏం మందు కలిపి ఇస్తారో మరి” అనేది అమ్మ.

“అదేవన్నా బాగ్గెవా బంగారవా నాయినా.. మీ సిన్నత్త సేత అంపుతానుండు..” అనడమే కాదు, మర్చిపోకుండా వాళ్ళ చిన్నమ్మాయికిచ్చి పంపేది. ఎప్పుడు జ్వరం వచ్చినా “వెంకాయమ్మ బెల్లం టీ తాగితే కానీ నీ జ్వరం తగ్గదురా” అని ఏడిపించేది అమ్మ. టీ ఒక్కటేనా? పత్యం పెట్టే రోజున వాళ్ళ పెరట్లో బీరకాయలో, ఆనపకాయో ఎవరో ఒకరికి ఇచ్చి పంపేది.

“టీ తాగి వెళ్ళు బాబూ..” అంది అమ్మ. “నీ టీ ఎవరిక్కావాలి.. నేను బెల్లం టీ తాగుతాను,” అని అమ్మ చెప్పేది వినిపించుకోకుండా వాళ్ళింటికి బయలుదేరాను. “రండి మనవడ గారా.. రండి” ఆవిడ ఎప్పటిలాగే ఆహ్వానించింది.

ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు కాగానే వాళ్ళ అబ్బాయికి సంబంధాలు చూడడం మొదలు పెట్టింది  వెంకాయమ్మ  గారు. అతనికి పెద్దగా చదువు అబ్బలేదు. వ్యవసాయం పనులు గట్టు మీద నిలబడి అజమాయిషీ చేయడం కూడా అంతంత మాత్రం. వెంకాయమ్మ గారు బలపరిచిన ఆస్తి పుణ్యమా అని సంబంధాలు బాగానే వచ్చాయి. ఆవిడ అన్నలే పిల్లనిస్తామని ముందుకొచ్చారు. ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలున్న ఇంటి నుంచి కోడల్ని తెచ్చుకుంటే కొడుక్కి ముచ్చట్లు జరగవని తన తమ్ముడి ఏకైక కూతురితో కొడుకు పెళ్ళికి ముహూర్తం పెట్టించింది.

ఆవిడ పుట్టిన ఊళ్ళో, పుట్టింట్లోనే కొడుకు పెళ్లి. మా ఊరి నుంచి ఎడ్ల బళ్ళు బారులు తీరాయి. కేవలం మాకోసమే ఒక సవారీ బండి ఏర్పాటు చేసింది వెంకాయమ్మ గారు. పెళ్లింట్లో మాకు ప్రత్యేకమైన విడిది.. మాకు కావలసినవి కనుక్కోడానికి ప్రత్యేకంగా ఒక మనిషి. అంత సందట్లోనూ ఆవిడ మమ్మల్ని. మర్చిపోలేదు. మధ్యలో తనే స్వయంగా వచ్చి ఏం కావాలో కనుక్కుంది. పుట్టి బుద్దెరిగిన ఆ పదేళ్ళ లోనూ అంతటి పెళ్లి నేను చూడలేదు. పెళ్లి కాగానే ముత్యాల పల్లకీలో ఊరేగింపు. పల్లకీ మా ఊళ్లోకి రాగానే కొడుకునీ, కోడలినీ మా ఇంటికి తీసుకొచ్చింది ఆవిడ.

ఆవిడ కోరుకున్నట్టే అల్లుడిని బంగారంతో ముంచెత్తడమే కాక, కొత్త మోటారు సైకిల్ కొనిచ్చాడు మావగారు. మా ఊళ్ళో కొత్త మోటర్ సైకిల్ నడిపిన మొదటి వ్యక్తి వెంకాయమ్మ గారి అబ్బాయే. మూడు బళ్ళ మీద సామాను వేసుకుని కాపురానికి వచ్చింది కొత్త కోడలు. పందిరి మంచం, అద్దం బల్లా, బీరువా.. ఇలా..   అందరిలా ఊరికే ఒక లడ్డూ, మైసూరు పాక్, అరటిపండూ కాకుండా సారె కూడా ఘనంగా తెచ్చుకుంది. మొత్తం తొమ్మిది రకాల మిఠాయిలు. ఊరందరూ చాలా గొప్పగా చెప్పుకున్నారు. పుట్టింటికి వెళ్ళినప్పుడల్లా అన్ని మిఠాయిలు సారె తెచ్చుకునే అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని అమ్మకి కచ్చితంగా చెప్పేశాను.

నేను పొరుగూరు హైస్కూలు చదువులో పడడంతో వాళ్ళింటికి పెత్తనాలు తగ్గాయి. అదీ కాక ఆ కొత్త కోడలంటే తెలీని బెరుకు. పాపం ఆవిడా బాగానే మాట్లాడేది. అయినా మునుపటి స్వేచ్చ ఉండేది కాదు. కాలం తెలియకుండానే గడిచిపోతోంది.

ఒకరి తర్వాత ఒకరు వెంకాయమ్మ గారికి ఇద్దరు మనవరాళ్ళు బయలుదేరారు. ‘మగ పిల్లలు కావాల్సిందే’ అని పంతం పట్టడమే కాక, ఆ పంతం నెగ్గించుకుంది ఆవిడ. తర్వాత వరుసగా ఇద్దరు మనవలు. “సొంత మనవలు వచ్చేశారు.. నానమ్మగారికి ఇంక ఈ మనవడు ఏం గుర్తుంటాడు లెండి” వాళ్ళ చిన్న మనవడిని చూడ్డానికి వెళ్ళినప్పుడు అన్నాను. “ఎంత మాట నాయినా.. నీ తరవాతోల్లే నీ తమ్ముల్లు” అందావిడ ఆప్యాయంగా.

నేను కాలేజీలో చదవడం ఆవిడకి ఎంత సంతోషమో. “మీరూ అన్నయ్య గారిలా సదుంకోవాలి” అనేది తన మనవల్ని ఒళ్లో కూర్చోబెట్టుకుని. వయసు పెరగడం, ఆవిడకి ఓపిక తగ్గడం తో వ్యవహారాల్లో కొడుకు జోక్యం పెరిగింది.. ఆవిడ జోక్యం క్రమంగా తగ్గింది. చేతినిండా డబ్బు ఆడుతుండడంతో అతను వ్యసనాలకి అలవాటు పడ్డాడు. ఒకటీ రెండూ కాదు, వ్యసనాల జాబితాలో ఉండే వ్యసనాలన్నీ అతనికి అలవడి పోయాయి. విపరీతమైన ప్రేమ కొద్దీ కొడుకు మీద ఈగని కూడా వాలనిచ్చేది కాదు వెంకాయమ్మ గారు. ఎక్కువరోజులు పుట్టింట్లోనే ఉండడం మొదలు పెట్టింది ఆవిడ కోడలు.

ఉద్యోగం వెతుక్కుంటూ నేను ఇల్లు విడిచిపెట్టాను. ఇంటికి రాసే ఉత్తరాల్లో మర్చిపోకుండా వెంకాయమ్మ గారి క్షేమం అడిగేవాడిని. జవాబులో ముక్తసరిగా ఒకటి రెండు వాక్యాలు రాసేది అమ్మ. దొరికిన ఉద్యోగం చేస్తూ, మంచి ఉద్యోగం వెతుక్కునే రోజుల్లో ఇంటికి రాకపోకలే కాదు, ఉత్తర ప్రత్యుత్తరాలూ తగ్గాయి. ఫలితంగా కొన్నాళ్ళ పాటు ఆవిడ విషయాలేవీ తెలియలేదు నాకు. కొంచం కుదురుకున్నాక ఊరికి వెళ్లాను, రెండు రోజులు సెలవు దొరికితే. వెళ్ళినరోజు సాయంత్రం ఇంటికి వచ్చిందావిడ. “మనవడు గారికి ఈ నానమ్మ గుర్తుందో లేదో అని ఒచ్చాను నాయినా..” అనగానే నాకు సిగ్గనిపించింది. “రేపు నేనే వద్దామనుకుంటున్నానండీ,” అన్నాను.

ఆవిడెందుకో ఇబ్బంది పడుతోంది అనిపించింది కానీ, విషయం పూర్తిగా అర్ధం కాలేదు. “పొయ్యి మీద పాలు పొంగిపోతున్నాయేమో చూసిరా బాబూ,” అంది అమ్మ. నేనక్కడ ఉండకూడదని అర్ధమై, అక్కడి నుంచి మాయమయ్యాను. ఆవిడ వెళ్ళిపోయాక కూడా అమ్మెందుకో ఆ విషయం మాట్లాడడానికి పెద్దగా ఇష్ట పడలేదు.. “వాళ్ళ పరిస్థితి ఇదివరకట్లా లేదు” అంది అంతే.. మళ్ళీ ఏడాది వరకూ ఊరికి వెళ్ళడానికి కుదరలేదు నాకు. ఊళ్లోకి అడుగు పెట్టగానే చిన్నప్పటి జ్ఞాపకాలతో పాటు నానమ్మగారి బెల్లం టీ కూడా గుర్తొచ్చింది. ఈసారి మిస్సవ్వకూడదు అనుకున్నాను.

మర్నాడు మధ్యాహ్నం ప్రయాణమయ్యాను వెంకాయమ్మగారింటికి. “టీ తాగి వెళ్ళు బాబూ..” అంది అమ్మ. “నీ టీ ఎవరిక్కావాలి.. నేను బెల్లం టీ తాగుతాను,”  అని అమ్మ చెప్పేది వినిపించుకోకుండా వాళ్ళింటికి బయలుదేరాను. “రండి మనవడ గారా.. రండి” ఆవిడ ఎప్పటిలాగే ఆహ్వానించింది. ఆవిడలోనే కాదు, వాళ్ళింట్లో కూడా చాలా మార్పు కనిపిస్తోంది. పాత చీరలో, మెళ్ళో పసుపు తాడుతో ఉందావిడ. నేను చూడడం గమనించి కొంగు భుజం చుట్టూ కప్పుకుంది. మనిషి బాగా వంగిపోయినా మాటలో కరుకుదనం తగ్గలేదు. నరసింహ మూర్తిగారు మంచంలో ఉన్నారు. కొంచం ఇబ్బందిగా అనిపించిది నాకు ఆ వాతావరణం.

“ఉజ్జోగం సేత్తన్నారంటగా.. అబ్బాయి సెప్పేడు. జాగర్త నాయినా.. అమ్మా, నాయినా జాగర్త.. ఆళ్ళ పేనం నీమీదే ఉన్నాది.. నువ్వే దాటించాలి..” ఆవిడ గొంతులో నేనెప్పుడూ వినని వైరాగ్యం. ఇది నేను ఊహించని వాతావరణం. కోడలు ఎక్కడా కనిపించలేదు. “అమ్మాయ్.. మనవడగారొచ్చేరు.. టీ ఎట్టియ్యి.. పనజ్దారెయ్యకు.. ఆరికి బెల్లం టియ్యంటే ఇష్టం..” అన్నేళ్ళ తర్వాత కూడా ఆవిడ నా ఇష్టాన్ని గుర్తు పెట్టుకోడం కదిలించింది నన్ను. అంతకు మించి లోపలి గదిలో నుంచి ఎలాంటి స్పందనా రాక పోవడం ఆలోచనలో పడేసింది. అప్పుడు చూశాను వంటింటికి తాళం. పరిస్థితి పూర్తిగా అర్ధమయ్యింది.

“అమ్మిచ్చిందండీ.. ఇప్పుడే తాగేను.. ఇంక ఇప్పుడేమీ తాగలేను” అన్నాను నమ్మకంగా.. కాసేపు మాట్లాడి ఇంటికి వచ్చేశాను. ఆవిడా, నరసింహ మూర్తిగారూ వాళ్ళ గంజి వాళ్ళు వేరుగా కాచుకుంటున్నారుట. మిగిలిన కాసింత భూమినైనా తన పిల్లలకి మిగల్చాలని మొత్తం పెత్తనం కోడలు తీసుకుందిట. పరిస్థితి అంతవరకూ వచ్చినా వెంకాయమ్మగారు కోడలినే తప్పు పడుతోంది తప్ప, కొడుకుని పల్లెత్తు మాట అనడం లేదుట.. వంటి మీది నగలన్నీ కరిగిపోవడంతో ఇల్లు కదిలి రాలేకపోతోందిట. తప్పని పరిస్థితుల్లో ఎప్పుడైనా రాత్రి వేళ మా ఇంటికి వచ్చి నాన్న దగ్గర చేబదులు పట్టుకెడుతోందిట. నేను గుచ్చి గుచ్చి అడిగితే అమ్మ చెప్పిన సంగతులివి.

బస్సులో వెళ్తున్నాను కానీ ఆలోచనలన్నీ వెంకాయమ్మ గారి చుట్టూనే తిరుగుతున్నాయి. ఎలాంటి మనిషి..ఎలా అయిపోయింది.. ఊరందరి అవసరాలకీ ఆదుకున్న మనిషికి ఇప్పుడు ఒకరి ముందు చెయ్యి సాచడం ఎంత కష్టం? “నాన్నగారు వాళ్ళింటికి వెళ్ళడం కూడా ఆవిడ ఇష్ట పడడం లేదు.. ఎప్పుడో ఓసారి తనే వస్తోంది.. కొబ్బరి తోట దింపుల మీద వచ్చే డబ్బులతో ఆయనా, ఆవిడా కాలక్షేపం చేస్తున్నారుట,” అమ్మ చెప్పిన మాటలు పదే పదే గుర్తొచ్చాయి. బాధ పడడం మినహా  ఏం చేయగలను నేను?

కొడుకు ఇక ఎప్పటికీ ఇంటికి అతిధి మాత్రమే అనే నిజం నెమ్మదిగా అర్ధం కావడంతో కష్టపడి మా ఇంట్లో ఫోన్ పెట్టించారు నాన్న. టెలిఫోన్ కనెక్షన్ కోసం జనం ఏళ్ళ తరబడి తపస్సు చేసిన రోజులవి. వారానికో ఉత్తరం, ఒక ఫోన్.. అలా ఉండేది కమ్యూనికేషన్. ఓ ఆదివారం సాయంత్రం ఇంటికి ఫోన్ చేసినప్పుడు “ఉదయాన్నే నరసింహ మూర్తి గారు పోయార్రా.. నాన్నగారింకా వాళ్ళింటి దగ్గరే ఉన్నారు” అని అమ్మ చెప్పిన వార్త పిడుగు పాటే అయ్యింది నాకు. అమ్మతో సహా అందరూ వెంకాయమ్మ గారి పసుపు కుంకాల గురించి మాత్రమే బాధ పడుతున్నారు.. కానీ అంత పెద్ద వయసులో, రాజీ పడ్డం అలవాటు లేని మనస్తత్వం ఉన్న ఆవిడ ఒంటరిగా ఎలా బండి లాగించగలదు?

దేవుడు ఆవిడకి తీరని అన్యాయం చేశాడనిపించింది.. డక్కామక్కీలు తినగలిగే వయసులో చేతినిండా భాగ్యాన్నీ, అధికారాన్నీ ఇచ్చి, సాఫీగా సాగాల్సిన చివరి రోజుల్లో ఇన్ని పరిక్షలు పెట్టడం ఏమి న్యాయం అనిపించింది.. ఏ పని చేస్తున్నా నా ఆలోచనల నిండా వెంకాయమ్మ గారే. కేవలం కొడుకు మీద చూపించిన అతి ప్రేమకి ఇంత శిక్ష అనుభవిస్తోందా? అనిపించింది. మూడు రోజుల తర్వాత, ఆఫీసుకి ఫోనొచ్చింది. ఇంటినుంచి అమ్మ.. “వెంకాయమ్మ గారు చనిపోయారు.. ” అదిరి పడ్డాను నేను.

“నరసింహమూర్తి గారు పోయినప్పటి నించీ తిండి తినలేదు, నీళ్ళు తాగలేదు.. నిద్ర అన్నది అసలే లేదు.. పొద్దున్నే ఉన్నట్టుండి విరుచుకు పడిపోయారు. డాక్టరుని తీసుకొస్తే ఆయన చెప్పాడు ఆవిడ చనిపోయిందని… అదృష్ట వంతురాలు.. పసుపుకుంకాలతో పార్వతీదేవిలా…” అమ్మ చెబుతూనే ఉంది కానీ నాకు వినిపించడం లేదు.. తర్వాత ఇంకెప్పుడూ నాకు బెల్లం టీ తాగాలనిపించలేదు.

This entry was posted in కథ. Bookmark the permalink.

38 Responses to బెల్లం టీ

  1. మురళీ, అభిమానాలూ.. ఆప్యాయతలూ.. అతిప్రేమలూ.. నిష్టూరాలూ.. స్వాభిమానాలూ.. అతిశయాలూ.. ఎన్నెన్ని మానసిక సంబంధాలో ఈ కధనిండా! పూర్తవుతూనే ఒక గాఢమైన నిట్టూర్పు వెలువడింది.. మనసు పట్టలేని భావాలతో సతమతమౌతుంటే మెదడు మాత్రం ‘ఇప్పుడిప్పుడే ఇంకేపని చెప్పకంటూ’ ఇంకా వెంకాయమ్మగారింట్లోనే తిరుగుతోంది!
    వరసలతో నోరారా పిల్చుకుని మానసిక దగ్గరతనం పెంచుకోవడమే తప్ప వారికి నిజజీవితంలో సహాయపడలేని నిస్సహాయతనం మీదకూడా కోపం వస్తుంది కదా! ఈ కధ (స్వానుభవం) చెప్పిన తీరుతో మీరు రచయితగా ఇంకో మెట్టు ఎదిగారు!

  2. laxmi says:

    ముందుగా రచయితగా ఇంకొకడుగు ముందుకు వేసినందుకు మనఃపూర్వక అభినందనలు మురళి గారు. వెంకాయమ్మగారు, ఆవిడ బెల్లం టీ సజీవంగా కళ్ళముందు నిలిచాయి. ఆ కాలంవారు నిజంగా అమరజీవులే, వారి ప్రేమ ఆప్యాతలతో మన మనసుల్ని ఎప్పుడూ కట్టి పడేస్తూనే ఉంటారు. చాలా హృద్యంగా ఉంది మీ కథ, మరొకసారి అభినందనలు

  3. మాటలు రావట్లేదు.

  4. raj says:

    excellent….

    Your narration has taken my soul to the village and her house…wonderful..

  5. parimalam says:

    మురళి గారు , మనసును కొన్నేళ్ళ వెనక్కి …అమ్మమ్మగారి ఊరివైపు తీసుకెళ్ళి …బాల్యస్మృతులు నెమరువేసుకోనేంతలో మనసును భారంచేసే ముగింపు…ప్చ్ …నిషిగంధ గారన్నట్టు వారికి నిజజీవితంలో సహాయపడలేని నిస్సహాయతకు బాధగా ఉంటుంది.
    మీశైలి బావుంది ఎప్పటిలాగే …మరో కధ కోసం ఎదురుచూస్తాం …

  6. chinni says:

    మనస్సంతా భరువుగా అయ్యింది .లాభం లేదు మీరు వారపత్రికలకి ఇక మీదట రాయవలసిందే .కళ్ళకి కట్టిన వర్ణన ,ఆ పాత్ర వెంటాడుతున్న తీరు వెరసి మీరో గొప్ప రచయితా కాబోయే సూచనలు ..

  7. sunita says:

    ఇది చదివాకా కొద్దిగంటలైనా వెంకాయమ్మగారి చుట్టూనే ఉంటుంది మనసంతా. పైన నిషిగంధ గారి కామెంటుతో ఏకీభవిస్తాను. ఇంతకీ మిసెస్ మురళీ గారి పేరు ఏమిటో?ఎందుకంటే “పుట్టింటికి వెళ్ళినప్పుడల్లా అన్ని మిఠాయిలు సారె తెచ్చుకునే అమ్మాయినే పెళ్ళి చేసుకుంటానని అమ్మకి కచ్చితంగా చెప్పేసాను.”అవునో, కాదో కనుక్కుందామని:-)

  8. కథ చాలా బావుందండీ మురళిగారూ..కథకుడిగా బాల్యం నుంచి వెంకాయమ్మగారి చివరిదశవరకు ఆ పాత్రని చూపిస్తూ వివిధ దశలలో ఆవిడ అనుభవించిన వైభవాన్ని,అతిదైన్యాన్ని చిత్రించిన తీరు చాలా బావుంది. జీవితంలో స్త్రీగా వ్యవహారదక్షతతో కుటుంబాన్ని సమర్థంగా నడిపి ఎంతో వైభవంగా జీవితం గడిపినా,
    కేవలం కొడుకుమీద అతిప్రేమ అనే బలహీనత ఆవిడ స్థితిని ఎలా దిగజార్చిందో కథకుడి దృష్టికోణంనుంచి మాత్రమే చూపించినా వెంకాయమ్మగారి పాత్రని సంపూర్ణంగా ఆవిష్కరించారు.
    పల్లెటూరు జీవితంలోని నిష్కపటమైన అనురాగాలను, బంధుత్వంతో నిమిత్తంలేని వరస కలపి పిలిచే ఆప్యాయతలను అనుభవిస్తూ కథ ముగియగానే మన ఆత్మీయులను పోగొట్టుకున్నభావన కలిగించారు.
    మంచి కథ ప్రచురించిన పొద్దుకు ధన్యవాదాలు.

  9. మురళీ గారూ..
    మీ కథ చదువుతూ మీతో పాటు మీ జ్ఞాపకాల్లో నేనూ తిరిగొచ్చాను.
    నిజం చెప్పాలంటే ‘బెల్లం టీ’ చుట్టూనే ఇంకా తిరుగుతోంది మనసు. ఇంకా వెనక్కి రాలేదు.
    మొదటి కథ ఇంత హృద్యంగా రాసినందుకు, పొద్దులో ప్రచురించబడినందుకు..మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
    మీనుండి మరిన్ని మంచి మంచి కథలు రావాలని ఎదురుచూస్తాను.

  10. jaya says:

    మురళి గారు, వెంకాయమ్మగారిని తల్చుకుంటుంటే మనసంతా బాధతో మెలితిరిగి పోతోంది. కథాంతా చదువుతూ పోతుంటే, అబ్బా,కోనసీమ ఎంతబాగా కళ్ళకుకట్టారు, అని అక్కడ ఉండి అన్నీ చూసిన అనుభూతి పొందాను. కాని క్రమంగా కథ జరుగుతున్న పరిణామాలు ఆ ఆనందాన్ని చెరిపి వేసాయి. ఇంత విషాదం భరించటం చాలా కష్టం.

  11. jyothisha says:

    Murali garu,

    Nenu mee blog ni kramam tappakunda chaduvutu untanu. eppudu vakhyalu rayaledu. mee katha chala bagundi. mee blog chadivaka chala manchi pustakala gurinchi inka chala manchi vishayala gurinchi telisindi.
    katha chaduvutunte nijamga choostunna anubhooti kaligindi. ilanti manchi kathalu meeru inka chala rayalani korukuntunanu.

  12. padmarpita says:

    మీశైలి బావుంది ఎప్పటిలాగే …మరో కధ కోసం ఎదురుచూస్తాం!

  13. శ్రీరమణ ధనలక్ష్మి కథ గుర్తొచ్చిందండీ.
    మీ స్వంతమార్కు అబ్జర్వేషన్లు నూలుపోగుల్లో జరీపోగుల్లా తళుక్కుమన్నాయి కథనంలో.
    ఇంతకూ మా చెల్లెలుగారు ఏమి మిఠాయిల సారె తెచ్చుకున్నారేమి? 🙂

  14. srilalita says:

    కథ చాలా బాగుంది. పట్టుతో చివరివరకూ చదివించింది. చివరన కంటతడి పెట్టించింది. చదివాక మనసంతా భారమయ్యింది.

  15. భావన says:

    మురళి గారు. చాలా బాగుందండి. బెల్లం టీ రుచి మనసుకు అనుభందాల గుర్తులు కళ్ళకు గుర్తొచ్చాయి ఇంకో సారి.

  16. jwalitha says:

    mi katha manasunu baalya smrutulloki netesi talupumusesindi

  17. jwalitha says:

    mi bellam tea baalya smrutulloki manasunu nettesi talupulu musindi bayata pada leka chaana sepu tannuku laadinam

  18. munnaswamy says:

    paatha saampradayaanni marachipookundaga bellam chai mariyu preemalu saampradayalu gurinch kavigaru chala manchiga vraasaru

  19. na chinnappudu taagina Bellam Tea gurthochindi, norurindi.

    Kadhalo manava sambandhalu, aapyayatalu knabaddai.

    VYASANALAKU baanisalavute jeevitaalu enta durbharamavutayo teta tellam chesindi.

  20. Kuntamukkala says:

    Chala bagundi murali garu..

  21. కథా రచయితగా మరో ముందడుగు వేసినందుకు అభినందనలు. కథా, కథనం కట్టిపడేసాయి. ఆర్థ్ర పూరితంగా ఎక్కడా పట్టు సడలకుండా నడిపించారు. శుభాకాంక్షలు.

  22. vinodini says:

    Chala Chala bagundandi…………
    Alanti apyayatha lu eemadya kanpinchatledu;;;;;;;;;;;;;;;;;;;;;
    Kallu chemarchayiiiiiiiiiiiii

  23. malapkumar says:

    చాలా బాగుంది .మనసు భార మై పోయింది .

  24. Srinu.kudupudi says:

    అప్రయత్నం గానే అందరి కళ్ళల్లోంచి జారిన కొన్ని కన్నీటి చుక్కలు …చాలవా మీ “కథ” కి ఈ బహుమతులు ?.ఇంతకీ కోనసీమలో మీది ఏ ఊరు అండీ?

  25. Sreenivas Pappu says:

    “అవసరం రాబట్టే కదా మన్ని ఎతుక్కుంటా వచ్చారు.. మనకి మాత్తరం రావా అవసరాలు?” అనేది ఆవిడ.
    “ఉడుకు నీల్లతో తానం చేసొచ్చాను కోడలగారా.. మా మనవడు సెవటోసన అనకుండా” అనేది.
    “కడుపు నిండా ఎడతాది.. మారాత్తల్లి” అనుకునే వాళ్ళు కూలీలు
    ఆవిడ పేరంటానికి వచ్చిందంటే సాక్షాత్తూ లక్ష్మీదేవి నడిచొచ్చినట్టు ఉందని అనేది అమ్మ,మా ఊరి గుళ్ళో అమ్మవారి మెడలో మంగళ సూత్రాల తర్వాత, మళ్ళీ అంత పెద్ద సూత్రాలు ఆవిడ మెడ లోనే చూశాను నేను.
    చిన్నప్పుడు నన్ను ‘మనవడా’ అనీ, నేను కొంచం పెద్దయ్యాక ‘మనవడ గారా..’ అనీ పిలిచేది.
    పాత చీరలో, మెళ్ళో పసుపు తాడుతో ఉందావిడ. నేను చూడడం గమనించి కొంగు భుజం చుట్టూ కప్పుకుంది.
    ఊరందరి అవసరాలకీ ఆదుకున్న మనిషికి ఇప్పుడు ఒకరి ముందు చెయ్యి సాచడం ఎంత కష్టం?
    కొడుకు ఇక ఎప్పటికీ ఇంటికి అతిధి మాత్రమే అనే నిజం నెమ్మదిగా అర్ధం కావడంతో కష్టపడి మా ఇంట్లో ఫోన్ పెట్టించారు నాన్న.
    డక్కామక్కీలు తినగలిగే వయసులో చేతినిండా భాగ్యాన్నీ, అధికారాన్నీ ఇచ్చి, సాఫీగా సాగాల్సిన చివరి రోజుల్లో ఇన్ని పరిక్షలు పెట్టడం ఏమి న్యాయం అనిపించింది..
    “వెంకాయమ్మ గారు చనిపోయారు.. ” అదిరి పడ్డాను నేను.(నేను కూడా…)
    అదృష్ట వంతురాలు.. పసుపుకుంకాలతో పార్వతీదేవిలా…” అమ్మ చెబుతూనే ఉంది కానీ నాకు వినిపించడం లేదు.. తర్వాత ఇంకెప్పుడూ నాకు బెల్లం టీ తాగాలనిపించలేదు.
    (నాకు కూడా…)
    కామెంటాలంటే నాకు తెల్సిన భాష సరిపోదేమో మురళీ.కంప్యూటర్ స్క్రీన్ మొత్తం మసగ్గా మసగ్గా కనిపిస్తోంది.ప్చ్.

  26. ragamanjeera says:

    katha chala bagundi. Gramaseemallo inka aa pilupulu sajeevamga unnai.Dhanam kolpoyina abhimanalaki,apyathalaki lotuledani chaticheppina ee katha amogham.Thanks to muraligaru….

  27. చాలా బావుంది.. మరిన్ని మంచి కథలు రాయండి.

  28. maitreyi says:

    చాలా సహజం గా ఉంది. వెంకాయమ్మ గారి లాంటి వారి కి ఇంట్లో వాళ్ళు ఎదురు తిరిగినా ఊరు ఉండేది. స్నేహితులు ఉండే వాళ్ళు. మన తరం లో అదీ లేదు.
    నిషిగంధ గారు సహాయం చెయ్యలేక పోవటం గూర్చి రాసారు. నాకు తోచినంత వరకు ఆమెకు తినటానికి లేక పోలేదు సహాయం పొందే స్తితి కాదు. అయితే వెనకటి గొప్ప అధికారం లేవు. అల్లాంటి వారికి సహాయం చెయ్యాలంటే బహు జాగ్రత్తగా వాళ్ళ అభిమానంచెడ కుండా చెయ్యగలగాలి.

  29. కథ చాలా బాగుంది. చివరివరకూ చదివించింది. చదివాక మనసంతా భారమయ్యింది. శుభాకాంక్షలు.

  30. my diary says:

    చదువుతుంటే కళ్ళు చెమర్చుతున్నాయి, అవును నిజమే ఆనాటి ఆప్యాయతానురాగాలు ఈ రోజులలో మచ్చుకయినా కనబడవు.

  31. రాంబాబు says:

    మీ కథ బాగుంది.భెల్లం టీ,అమ్మమ్మ ఊరు,ఆ ఆప్యాయతలు బాగా గుర్తు చేసారు.
    మా అమ్మమమ్మ ఆవిరి కుడుములు ,కుండ పెరుగు ,చిలికిన వెన్న …వోహ్! ఆ కమ్మటి జ్ణాపకాల వాసనల జడివానలో తడిపినందుకు…..అబినందనలు

  32. వేణు says:

    మురళీ, కథ బాగా రాశారు. సూక్ష్మాంశాలను కూడా వదలకుండా శ్రద్ధగా, ఆత్మీయ శైలిలో కథనం సాగింది. అభినందనలు!

    అయితే వెంకాయమ్మ గారి పాత్ర ‘పూర్తిగా’ నాకు నచ్చలేదు.

    కూలీలతో పనిచేయించుకుని, వారికి డబ్బులు సాయంత్రానికే ఇవ్వటానికి ఆమె చెప్పే జస్టిఫికేషన్ ఏమీ బాగా లేదు. కొడుకు పెళ్ళి విషయంలో నిర్ణయాన్ని ఆమే ఏకపక్షంగా తీసుకున్నట్టనిపించింది. ఆ ‘కలవారి ఆడపడుచు’ కొడుకుపై చూపిన అతి గారాబం అతడు వ్యసనపరుడు అయ్యేలా చేసింది. అలా ఆమెకు చరమదశలో దయనీయ స్థితి ఏర్పడటం చాలా సహజమే!

  33. ప్రణీత.స్వాతి says:

    మీ కధలో వెంకాయమ్మగారు మా బామ్మా అచ్చంగా ఒకేలా వున్నారు.
    అదే ఆప్యాయత, ఆత్మీయత, మమకారం..
    ఏం చెప్పాలో తోచడంలేదు మురళిగారూ ..
    మనసంతా భారంగా వుంది.

  34. Ramu says:

    nigamga
    maa peddamma vari intlo
    bellam tea thaginatlu undi

  35. uma maheeswari says:

    katha chalaa baagundi andi

  36. Ashok says:

    అద్భుతం. స్క్రీన్ మసక బడింది, ఒక కధ చదివి కంట నీరు రావడం జరిగి చాలా రోజులు అయ్యింది . తెలుగు కధా యువనిక పైన మరో ధ్రువతార వస్తూన్న సూచన పంపారు మీ ఈ కధ తో.

  37. vinaychakravarthi says:

    boss idi kadha na…………….?

    idi kadha ani telisaaka baaga kopam vachhindi mee meeda enduko teleedu.

  38. కధ చాలా బావుంది మురళి గారు. ఎంతో గొప్ప వారి కైనా కూడా ఏదో ఒక బలహీనత ఉంటుండేమో వారిని బలహీన పరచడానికి….అది వెంకాయమ్మగారి విషయంలో కొడుకునేమీ అనలేకపోవడం కావచ్చు. చివరివరకూ వదలకుండా చదివించింది.. అభినందనలు..

Comments are closed.