ప్రాథమిక విద్య – మన ప్రాథమ్యాలెక్కడ?

తెలుగులో మాట్లాడినందుకు, ఒక పాఠశాలలో “తెలుగులో ఎప్పుడూ మాట్లాడను” అని రాసిన పలకను పిల్లల మెడలో తగిలించారు. ఈ మధ్య ఈ వార్త రాష్ట్రంలో సంచలనం రేపింది. తెలుగు రాష్ట్రంలోనే తెలుగు భాషకు జరిగిన అవమానం పట్ల ప్రజలు క్రోధం వెలిబుచ్చారు, బాధపడ్డారు. సమంజసమైన క్రోధమే. మాతృభాషలో మాట్లాడినందుకుగాను శిక్షనెదుర్కోవాల్సిన పరిస్థితిని మనం సహించాల్సివస్తోంది. భాషాభిమానులందరికీ బాధ కలిగించే సంఘటనే ఇది. కానీ ఈ సంఘటన ఆ పాఠశాలకే పరిమితమైనదా? రాష్ట్రంలో మరే బడిలోనూ లేదా? అసలు, సమస్య అదేనా?

తెలుగు తప్ప మరో భాష రాని పసికందులను ఇంగ్లీషులో చదువుకోవాలనే/మాట్లాడాలనే శిక్ష వేస్తున్నారు. ఎందుకు వాళ్ళకీ శిక్ష? ఎవరు వేస్తున్నారీ శిక్ష?

…………

ప్రాథమిక విద్య మాతృభాషలోనే జరగాలనేది ప్రపంచవ్యాప్తంగా విజ్ఞులు చెప్పేమాట!
పుట్టినప్పటి నుంచీ బిడ్డ తెలుగులోనే మాట్లాడుతూ తెలుగే నేర్చుకుంటాడు. అతడు బువ్వ తింటాడు, ఆడుకుంటాడు, నవ్వుతాడు, ఏడుస్తాడు, కొడతాడు, పాడతాడు. అంతేగానీ హి డస్ నాట్ ఈట్, డస్ నాట్ ప్లే, డస్ నాట్ లాఫ్, డస్ నాట్ క్రై ఆర్ వీప్! తెలుగు భాషలో, తెలుగు వాతావరణంలో, తెలుగు సంస్కృతిలో మూడేళ్ళు పెరిగిన పిల్లవాడికి, బడిలో చేరగానే వాట్జ్స్యువర్నేమ్, వాట్జ్స్యువర్నిక్నేమ్ అంటూ మాట్లాడితే ఏమర్థమౌతుంది? మనల్ని హఠాత్తుగా స్వాహిలి మాట్లాడే వాళ్ళ మధ్య పడేస్తే మన పరిస్థితి ఏమిటి? “దప్పికతో నోరు పిడచకట్టుకు పోతోంది, కాసిన్ని మంచినీళ్ళు ఇప్పించండి” అని తెలుగులో ప్రాథేయపడితే, మంచినీళ్ళు ఇవ్వకుండా “నేనో తెలుగు గాడిదను” అనే బోర్డు మన మెడలో తగిలిస్తే మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఇంగ్లీషు బడిలోకి నెట్టబడిన ఆ కసుగాయల పరిస్థితీ అదే!

తెలుగులో బోధన జరిగేటపుడు, భాషతో పిల్లలకు ఇబ్బంది ఉండదు -వారికి భాష ముందే వచ్చు కాబట్టి. వాళ్ళకు అక్షరాలు రావంతే! పుస్తకాల్లోని విషయాన్ని చదవేందుకు, చదివినదాన్ని తిరిగి రాసేందుకూ ముందు పిల్లలు అక్షరాలు నేర్చుకోవాలి. అవి బడిలో చేరగానే నేర్చుకుంటారు. కానీ ఇంగ్లీషులో చదివే పిల్లలు ముందు ఇంగ్లీషు భాషను నేర్చుకోవాలి. భాష నేర్చుకోవడమంటే చదవడం రాయడం నేర్చుకోవడం కాదన్న సంగతిని ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాలి.

మనిషి నుంచి మనిషికి సమాచార ప్రవాహం విషయంలో భాష ఎటువంటి పాత్ర పోషిస్తుందో “మాతృభాషలో ప్రాథమిక విద్య శాస్త్రీయ వివరణ” పుస్తకంలో డా. పమిడి శ్రీనివాసతేజ ఇలా రాసారు:
సంభాషణ లేదా సమాచార మార్పిడి అర్థవంతంగా జరగాలంటే ఇద్దరి వ్యక్తుల మనసుల్లో ముందుగానే భాషకు సంబంధించిన ప్రోగ్రామింగు జరిగి ఉండాలి. బిడ్డ పుట్టినప్పటి నుండీ జరిగే ప్రోగ్రామింగే భాషాభివృద్ధి. మనకు తెలుగులో ప్రోగ్రామింగు జరిగితే తమిళులకు తమిళ భాషలో ప్రోగ్రామింగు జరుగుతుంది. ఎవరికి ఏ భాషలో ప్రోగ్రామింగు జరూగుతుందో దాన్ని మాత్రమే అర్థం చేసుకోగలరు.ఇతర భాషను అర్థం చేసుకోలేరు. ఒక వేళ ఇతర భాషను అర్థం చేసుకోవాలంటే దానికి సంబంధించిన ప్రోగ్రామింగు జరిగి తీరాలి. అంటే ఆ భాషను నేర్చుకుని తీరాలి.
అంటే, మన కంప్యూటరుకు తెలుగు నేర్పకుండా పొద్దును చదవడానికి ప్రయత్నించడమెలాగో తెలుగు పిల్లలకు ఇంగ్లీషులో చదువు చెప్పడమలాంటిదే!

ప్రాథమిక విద్య మాతృభాషలోనే జరగాలని ప్రపంచవ్యాప్తంగా విద్యావేత్తలు, భాషావేత్తలు అనేక పరిశోధనలు చేసి మరీ చెబుతున్నారు. మచ్చుకు:

ఐరాస పనుపున స్థానిక భాషలపై ఏర్పాటైన అంతర్జాతీయ నిపుణుల సమావేశం ఇలా అభిప్రాయపడింది: మాతృభాషలో విద్యాబోధనే పిల్లలకు మేలని గుర్తిస్తున్నారు. భాషాపరంగాను, సాంస్కృతికంగాను సంబంధం ఉన్న విద్యనే బోధించడం ఆవశ్యకమన్న భావన పెరుగుతోంది. అలాగే మాతృభాషలో చదువుకున్న పిల్లలు, పరాయి భాషలో చదువుకున్నవారి కంటే మెరుగ్గా ఉన్నారని కూడా తెలుస్తోంది. ఉచిత నిర్బంధ విద్య అమలుపై కేంద్ర ప్రభుత్వం నియమించిన అధ్యయన సంఘంవిద్యార్థి మొదటి ఐదేళ్ళ చదువు మాతృభాషలోనే సాగాల‘ని చెప్పింది. పిల్లలలో బహుభాషా ప్రావీణ్యాన్ని పెంపొందించాలని చెబుతూ, ‘మాతృభాషలో చక్కటి ప్రావీణ్యం ఉంటేనే ఇది సాధ్యపడుతుంద‘ని నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్ 2005 తన నివేదికలో చెప్పింది.

జాతీయ, అంతర్జాతీయ నిపుణులే కాదు, స్వయంగా మన రాష్ట్రప్రభుత్వం కూడా ఈ సంగతే చెబుతోంది. మాతృభాషలో బోధన జరిగితేనే పిల్లలు ఆసక్తిగా నేర్చుకోగలుగుతారన్న ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం 8 గిరిజన భాషల్లో చదువులు చెప్పించే ఏర్పాట్లు చేసింది. సర్వ శిక్షా అభియాన్ కింద ఈ ప్రయోగం చేసింది. ఆయా భాషల్లో పుస్తకాలు తయారుచేయించింది. దీనితో ఆయా గిరిజన తెగలకు చెందిన పిల్లలు బడికి హుషారుగా రావడం, బడి మానేసేవాళ్ళు తగ్గిపోవడం గమనించినట్టు ప్రభుత్వమే స్వయంగా ప్రకటించింది. గోండు, సవర వంటి భాషలలో చదువు చెప్పించే ప్రభుత్వం తెలుగు భాషలో చెప్పించకపోవడం విచిత్రంగా లేదూ?

…………

పిల్లలను ఇంగ్లీషులో చదివించడం పట్ల మనకు ఎందుకంత ఆసక్తి?

దీనికి రెండు ముఖ్యమైన కారణాలున్నాయి.

1. తెలుగులో చదివించాలంటే తగిన వసతులు లేవు: తెలుగులో చదువు చెప్పే పాఠశాలలే బహు తక్కువ. ఉన్నవాటిల్లో చదువు సరిగ్గా చెప్పరు. అందుచేత ఇంగ్లీషు మాధ్యమంలో చదివించడం తప్ప గత్యంతరం లేని పరిస్థితి మనకు ఏర్పడింది. ప్రభుత్వం మనకీ దురవస్థ కల్పించింది.

2.ఇంగ్లీషులో చదివితేనే మంచి ఉద్యోగాలొస్తాయి అనే మిథ్య: తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంగ్లీషు మీడియములో చదివించుకోవాలని తహతహలాడుతున్నారు అని ఒక వాదన ఉంది. నిజమే, తమ పిల్లలు బాగ చదువుకుని పెద్ద పెద్ద ఉద్యోగాలు చెయ్యాలని అందరికీ ఉంటుంది. కానీ, పిల్లలు ప్రాథమిక విద్యను తెలుగులో చదవడానికీ, వాళ్ళు డాక్టర్లు, ఇంజనీర్లు, సాఫ్టువేరు ఇంజనీర్లూ కాలేకపోవడానికీ సంబంధం ఏమీ లేదన్న సంగతిని గ్రహించక అలా అనుకుంటాం.

ఈ కారణాల వలన, ఎంత ఖర్చైనా భరించి, పిల్లలను ఇంగ్లీషు బడుల్లో చదివిస్తున్నాం. ప్రభుత్వానికి ఇది బాగానే ఉంది. ప్రభుత్వ పాఠశాలల మీద వత్తిడి తగ్గిపోయింది గదా, మరి! ప్రజలు ఇంగ్లీషే కావాలని కోరుతున్నారు, అంచేత ప్రభుత్వ బడుల్లో కూడా ఇంగ్లీషు మాధ్యమంలోనే చదువు చెబుతామంటూ కొత్త పుంతలు తొక్కుతోంది. ఎటొచ్చీ పిల్లలే ఇంగ్లీషు శిక్షకు గురౌతున్నారు. వాళ్ళను ఈ శిక్ష నుంచి తప్పించే ఉపాయమేమీ లేదా?

ఉంది!

ప్రభుత్వ విధానాలను మార్చాలి, మనం మారడం కాదు.

తెలుగు భాషను, తెలుగు జాతినీ, తెలుగు సంస్కృతినీ కాపాడి, రాబోయే తరాలకు అందించాల్సిన బాధ్యత అందరికంటే ప్రభుత్వానికి ఎక్కువగా ఉందని గ్రహించాలి. తెలుగులో ప్రాథమిక విద్య ఆవశ్యకతను ప్రభుత్వం గుర్తించాలి. రాష్ట్రంలోని ప్రతీ పాఠశాలలోను – ప్రభుత్వం నడిపేదైనా, ప్రైవేటుదైనా – ప్రాథమిక విద్యను తెలుగులోనే బోధించడాన్ని నిర్బంధం చెయ్యాలి. ఇంటర్మీడియేటు వరకు తెలుగు ఒక బోధనాంశంగా నిర్బంధం చెయ్యాలి. కర్ణాటక కన్నడం కోసం ఈ పనులు చేసింది. మహారాష్ట్ర మరాఠీ కోసం చేసింది. మన ప్రభుత్వం తెలుగు కోసం ఎందుకు చెయ్యదు? భాషాభిమానులు ఈ విషయమై వత్తిడి తేవాలి. మన భాషను మనం రక్షించుకోకపోతే మరెవరూ మనకోసం ఆపని చెయ్యరు.

“ఏను తెలుగు వల్లభుండ” అంటూ తెలుగు భాషను పోషించిన నృపుణ్ణి నేటికీ – 450 యేళ్ళ తరువాత కూడా – ఎల్ల జనులూ కొలుస్తున్నారు. అతడికి ముందు, అతడి తరువాతా అనేక వందల మంది పాలకులు వచ్చారు, పోయారు. కానీ రాయలొక్కడే మనకు జననాయకుడు. మన ప్రభుత్వాధినేతలు ఈ నిజాన్ని గుర్తెరగాలి.

-చదువరి

———————-

ఈ అంశంపై మీ అభిప్రాయాలను వ్యాసాల రూపంలో ఆహ్వానిస్తున్నాం.

తెలుగు భాషపై పొద్దులో వచ్చిన వ్యాసాలను చూడండి.

This entry was posted in సంపాదకీయం and tagged , . Bookmark the permalink.

33 Responses to ప్రాథమిక విద్య – మన ప్రాథమ్యాలెక్కడ?

  1. Rohiniprasad says:

    దీనితో కొన్ని ఇతర సమస్యలు కూడా ముడిపడి ఉన్నట్టుగా గమనించాలి. తమ పిల్లలకు ఇంగ్లీషు త్వరగానూ, బాగానూ రావాలనీ, ఉద్యోగం దొరికే దాకా ప్రతిస్థాయిలోనూ వారు పోటీల్లో నెగ్గాలనీ తల్లిదండ్రులు ఆరాటపడుతున్నారు. ముఖ్యంగా అందుకు అనువైన వాతావరణం తమ ఇళ్ళలో లేదని భావిస్తున్న కుటుంబాల్లో ఇది ఎక్కువ. ఇందుకోసమని స్కూళ్ళమీద ఆధారపడక తప్పదని వారు అనుకుంటున్నారు. పిల్లలు తమలో తాము తెలుగులో మాట్లాడుకుంటున్నంతసేపూ వారికి ఇంగ్లీషులో fluency రాదని భావించడంవల్లనే టీచర్లు ఆంక్షలు విధిస్తున్నట్టుగా తెలుస్తోంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని సమస్యలకు పరిష్కారాలు సూచిస్తే బావుంటుంది.

  2. Praveen says:

    ఈ ఘటన విషయంలో ఆలోచించాల్సింది ఏ మాధ్యమం అనే విషయం గురించి కాదు. పిల్లల హక్కుల గురించి ఆలోచించాలి. పోలీసులు దొంగల మెడలో పలకలు కట్టి ఫొటోలు తీసి రైల్వే స్టేషన్లలో ప్రదర్శించినట్టు, పిల్లల మెడలో కూడా అలా బోర్డులు వేస్తే పిల్లలని నేరస్తులతో సమానంగా చూసినట్టు కాదా? ఇంగ్లిష్ మీడియంలో చదివిన నేను కూడా తెలుగు బాగా మాట్లాడగలను. ఇంగ్లిష్ మీడియంలో చదివినంత మాత్రాన తెలుగు మరచిపోతారనుకోను. మన స్కూళ్ళు పాటించే అప్రామాణిక బోధన విధానం వల్ల పిల్లలు ఇంగ్లిష్ సరిగా నేర్చుకోలేకపోతున్నారు. తప్పు స్కూల్ టీచర్లూ & యాజమాన్యానిదే అయినా పిల్లల దగ్గర ఫైన్లు వసూలు చెయ్యడం, మెడలో బోర్డులు కట్టడం జరుగుతోంది.

  3. రవి says:

    “ప్రభుత్వ విధానాలను మార్చాలి, మనం మారడం కాదు.”

    ప్రభుత్వం ఎంత దివాళాకోరుతనంగా ఉందో తెలుస్తూనే ఉంది కదండి. ప్రభుత్వం మీద వత్తిడి తేవలసిన బాధ్యత భాషాభిమానులది, విజ్ఞులైన ప్రజలదీనూ.

  4. మీరు జరిగిన ఘటనని చూడాల్సిన ధృక్కోణం నుంచీ చూడటం లేదేమో అనేది నా సందేహం. జరిగిన ఘటనలో తెలుగు భాషకు జరిగిన అవమానం ఇసుమంతైనా లేదు. ఇంగ్లీషు మాట్లాడటానికి ఉద్దేశించిన స్కూలులో పిల్లలు తెలుగులో మాట్లాడారు. అంటే,స్కూల్లో నిర్ణయించిన నియమాల్ని పిల్లలు ఉల్లంఘించారు. కాబట్టి వారిని శిక్షించడం జరిగింది. ‘ఆ శిక్ష ఎంత అన్యాయమైనది,అవమానకరమైనది,పిల్లల్ని ఎంత మానసికక్షోభకు గురిచేసుంటుంది?’ ‘ఇలాంటి శిక్షలు విధించడం న్యాయమా,చట్టప్రకారం సమ్మతమా?’ అనేవి ప్రశ్నించాల్సిన విషయాలు. నేనైతే ఆ శిక్షని బాలలహక్కుల ఉల్లంఘనగా పరిగణించి కఠినచర్య తీసుకోవాలని కోరుకుంటాను.

    ఇప్పుడు భాష గురించి.50,895 ప్రాధమిక పాఠశాలలు 30,84,212 తెలుగు మీడియం విద్యార్థులున్న ఈ రాష్ట్రంలో పాఠశాలల్లో/ప్రాధమిక విద్యలో తెలుగు మృగ్యమయ్యే ప్రమాదం ప్రస్తుతానికి లేదు. కానీ బోధనావిధానం,ప్రమాణాలూ,ప్రైవేటు విద్యావ్యవస్థను ప్రోత్సహించే ప్రభుత్వ విధానాలు ఇలాగే ఉంటేమాత్రం మరో 15 సంవత్సరాలలో ఆ ప్రమాదం ఏర్పడవచ్చు.కాబట్టి ఈ చర్చ అవసరమే.

    కానీ, నాకున్న ముఖ్య సమస్యల్లా ప్రస్తుతం తెలుగులో చదువుతున్న విద్యార్థుల గురించి.క్షీణస్థాయిలో ఉన్న విద్యాప్రమాణాల గురించి. విద్యావాలంటీర్లతో ప్రాధమికవిద్యను గట్టెక్కిస్తున్న ప్రభుత్వ విధానాల గురించి. రాష్ట్ర బడ్జెట్ లో ఐదుశాతం కూడా మించని కేటాయింపుల గురించి. శిక్షణ లేని ఉపాధ్యాయుల గురించి. అత్తెసరుగా కూర్చిన సిలబస్ గురించి. ఐదోతరగతి వరకూ అందరు విధ్యార్థులకూ కనీసం చదవడం రాయడం నేర్పలేని వ్యవస్థ గురించి. ఇన్ని మూలసమస్యల్ని పక్కనబెట్టి, “తెలుగు మొర్రో” అని ఏడ్చిమొత్తుకున్నా ఒనగూరే లాభం మాత్రం ఏమీ ఉండదు.వ్యవస్థలో సమూలమైన మార్పులు వచ్చినా బోధనా పద్దతిని మార్చుకోకపోతే పదోతరగతి తరువాత తెలుగు చదివేవాళ్ళు భవిష్యత్తులోకూడా ఉండరు.

  5. రోహిణీ ప్రసాద్: మీరన్నది నిజమే! కానీ మనం మాట్లాడుకుంటున్నది ప్రాథమిక విద్య అనే ఐదేళ్ళ చదువు గురించి. తల్లిదండ్రులకు పిల్లల మీద ఆశలుండటం సహజం. కానీ పిల్లల గ్రహణ శక్తిని గమనిక లోకి తీసుకోవాలి కదా? పదో తరగతిలో పరీక్షలు, మార్కులు అనే పద్ధతి లేకుండా ఎత్తేస్తున్నారు. పిల్లలకు ఎలాగుంటే బాగుంటుందోనని కదా చేస్తున్నారు. పిల్లలకు తెలుగులో చదువు చెబితే బాగుంటుందా, ఇంగ్లీషులో చెబితే బాగుంటుందా అనేది ప్రభుత్వం నిర్ణయించాలి.

    రవి: అవునండి, అది నిజం.

    మహేష్ కుమార్: వంట్లో ఉన్న రుగ్మత కారణంగా శరీరం మీద పుండ్లు పడితే.., వాటిమీద దుమ్ము పడకుండా, ఈగలు వాలకుండా కట్టుకట్టలేదని గోల చేస్తున్నట్టుంది, మీ వాదన. అసలు రుగ్మతకు మందు వెయ్యకుండా “పుండు మీద ఆయింట్‌మెంటు మొర్రో” అని ఎంత ఏడ్చి మొత్తుకున్నా ప్రయోజనం లేదని గ్రహించాలి.

    ఇకపోతే క్షీణిస్తున్న విద్యాప్రమాణాల గురించి: అనేక సమస్యలున్నాయి, ఒప్పుకుంటాను. అసలు విద్యావ్యవస్థలో అనేకానేక విషయాల గురించి మాట్లాడాల్సి ఉంది. అన్నిటినీ తలకెత్తుకుంటే మన పరిధి చాలదు, ఈ చర్చకు అంతమూ ఉండదు. ఇక్కడ మాట్లాడుతున్నది తెలుగులో ప్రాథమిక విద్య అన్న సంగతి గురించి. దానికి పరిమితమవుదాం.

  6. Praveen says:

    ప్రభుత్వ టీచర్లు కూడా తమ పిల్లలని ఇంగ్లిష్ మీడియం స్కూళ్ళకే పంపిస్తున్నారు. తెలుగు వస్తే ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రమే ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. హిందీ లేదా ఇంగ్లిష్ వస్తే దేశంలో ఎక్కడైనా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఉద్యోగానికి కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం. అందు కోసం రెండు మూడు బాషలు నేర్చుకోవాలి కూడా. అందుకే నేను తెలుగు మెడియం కాకుండా హిందీ లేదా ఇంగ్లిష్ మీడియం స్కూల్స్ ఉండాలంటున్నాను.

  7. ప్రవీణ్: ఇక్కడ అంశం మాతృభాషలో విద్యాబోధన! వివిధ భాషలు నేర్చుకోవడం అనే అంశం కానే కాదు. అది గమనించండి.

  8. రోహిణీ ప్రసాద్ గారు, మహేష్ గారు చేసిన వాదనలలో వాస్తవం ఉంది. కానీ చదువరి గారు ప్రతిపాదించిన అంశాలు దీర్ఘకాలంలో జరిగే అనర్ధాల గురించి, పిల్లల ఒత్తిడి కి ఆంగ్ల మాధ్యమం ఎలా కారణమౌతుందో తెలియజెప్పేది గా ఉంది. ప్రస్తుత చర్చ పరిధి పిల్లలకు బోధన ప్రాధమిక స్థాయి వరకు ఏ భాష లో ఉండాలని. ప్రాధమిక స్థాయి వరకు తెలుగులో బోధన ఉంటే ఒత్తిడి ఉండదని, సహజంగా తలిదండ్రులు అపోహపడే ఉద్యోగావకాశాల ప్రభావం ఉండదని అనుకుంటున్నాను. పిల్లల ఒత్తిడి గురించి నాకు ఇంకొక సందేహం కూడా ఉంది. ఏ వయసు నుంచి బడికి పంపవచ్చు అనేదానిపై. మూడు సంవత్సరముల వయసులోనే బడికి పంపి వారి బాల్యాన్ని హరించటం సబబా? ప్రాధమిక స్థాయి వరకు తెలుగులోనే బోధన ఉంటే పిల్లలపై ఒత్తిడి తగ్గుతుందని ఎక్కువ మందికి తోచిన పక్షంలో , చర్చలకే ఈ విషయాన్ని పరిమితం చేయటం అర్ధరహితం. ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలో నేను కూడా భాగస్వామిని.
    మహేష్ గారు చెప్పిన విద్యా ప్రమాణాల గురించి తరువాత వేరే మాట్లాడుకోవచ్చు.

  9. ఒక తెలుగు మాష్టారు తన తరగతిలో తెలుగు కాక ఇంగ్లీషులో మాట్లాడినందుకు ఇలంటి బోర్డు పిల్లల మెడలో తగిలించినా సరే, అది హేయమైన పనే. దాన్ని నిరసించాల్సిందే. దీన్ని ఎవ్వరూ కాదనరు. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఆ టీచరు మీదకాని, స్కూలు యాజమాన్యమ్మీద కాని ఎలాంటి చర్య తీసుకుందో ఇంతవరకూ నాకు తెలీదు. అటు మీడియాలో కాని ఇటు అంతర్జాలంలో కాని ఎవ్వరూ ఈ విషయం గురించి పట్టించుకున్నట్టు లేదు. దీని గురించి ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఇలాంటి సంఘటనలకి అత్యంత వేగంగా స్పందించి అంతే వేగంగా మరచిపోయే అలవాటును మనందరం మార్చుకోవాలి.

    ఇక, ఇలా మెళ్ళో బోర్డుపెట్టడం లాంటి చర్యలు తెలుగు విషయంలోనే ఎందుకు జరిగాయనికూడా తప్పకుండా ఆలోచించాలి కదా. మిగతా సబ్జెక్టుల్లో సరిగా చదవని పిల్లలకి ఇలాంటి శిక్షలు వెయ్యడం ఎప్పుడు వినలేదే. మరి తెలుగులో మాట్లాడినందుకే ఎందుకిలాంటి శిక్ష విధించారు? తల్లిదండ్రులకి, టీచర్లకి ఇంగ్లీషు మీదున్న వ్యామోహం వల్ల కాదా?

    మనం మారకుండా ప్రభుత్వ విధానాలు ఎలా మారతాయి? ప్రజలనుంచి “తగినంత” వత్తిడి లేకుండా ప్రభుత్వం ఏవీ చెయ్యదు. అంచేత “భాషాభిమానులు” వత్తిడి తెచ్చినంత మాత్రాన అది సరిపోదు. భాష విషయమై తెలుగువాళ్ళకి కావలిసిన ఐకమత్యమూ(అభిప్రాయాలలో) లేదు, సరైన భావోద్వేగమూ (emotion) లేదు. మనలో ఇవి ఏర్పడే దాకా ప్రభుత్వం ఏదో చేస్తుందని, చెయ్యాలని అనుకోవడం వ్యర్థం. మనకీ ఐకమత్యం భావోద్వాగం భాషకన్నా కులం పట్ల వెయ్యి రెట్లు ఎక్కువగా ఉన్నాయి.

  10. @చదువరి: పుండు మీద కేవలం మందు వెయ్యాలంటున్నది మీరు.మూలమైన రుగ్మతను మాపాలంటున్నది నేను. మరోసారి నా వ్యాఖ్యను చదువుకోండి.

  11. క్రమక్రమంగా “తెలుగుబాధ” ఒక అర్బన్ మిత్ అనిపిస్తోంది.ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు ఇప్పటికే ఉంది. అమలౌతోంది కూడా.కాబట్టి ప్రభుత్వం పాఠశాలల్లో తెలుగు కోసం ఏమీ చెయ్యడం లేదు అనేది అపోహమాత్రమే.

    ఈ వాదనలు కేవలం తెలుగుకోసం లిప్ సర్వీస్ చేస్తూ, పిల్లల్ని మాత్రం ఇంగ్లీషు మీడియంస్కూళ్ళలో స్టాండర్డ్ బాగుందని చదివించే మిడిల్ క్లాస్ మేధావుల మేధోజనితమే అనిపిస్తుంది.ప్రమాణాలే సమస్య అయితే ప్రభుత్వపాఠశాలల్లోని విద్యాప్రమాణాల గురించి బాధపడితే అర్థముందిగానీ, తెలుగుకేదో అన్యాయం జరిగిపోతోందనే అర్థరహిత వాదనలు ఎందుకు?

    ప్రాధమిక విద్య మాతృభాషలో జరిగితే ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయని ఎన్నో పరిశోధనలు తేల్చాయి. నిజమే. కానీ,మనదగ్గర సరైన విద్యాబోధన చేసే వ్యవస్థ ఉండాలిగా? అదే లేదే!!! అలాంటప్పుడు తెలుగైనా ఇంగ్లీషైనా ఒకటే. క్వాలిఫైడ్ టీచర్లను కేంద్రప్రభుత్వస్థాయి జీతాలిచ్చి పాఠశాలల్లో నియమించమనండి. కేంద్రప్రభుత్వం infrastructure కు ఫండ్ ఇస్తోంది కాబట్టి teaching quality మీద రాష్ట్రప్రభుత్వాన్ని ఖర్చుపెట్టమనండి.

    అయినా నాకు తెలీకడుగుతాను…మన తెలుగులో రాసిన గణిత,సామాన్య,సాంఘిక శాస్త్రాలలో పిల్లలకు తెలిసిన (ఇంట్లో మాట్లాడే) తెలుగెంత? అలాంటప్పుడు సమితులు అన్నా సెట్స్ అన్నా వాడికి ఒకటికాదా! భాస్వరం అన్నా ఫస్ఫరస్ అన్నా ఒకటి కాదా!!I see a huge flow in out Telugu teaching. బహుశా అందుకే అది సహజమైన చావు ఛస్తోంది. ఆక్సిజన్ ఇచ్చినా అది ICU లోనే ఉంటుంది. జవసత్వాలు మాత్రం ఎన్నటికీ రావు.

  12. రామలింగేశ్వరరావు says:

    బగా రాసారు.

    <> రవి గారి వాదనను నెను సమర్ధిస్తున్నను.

    @కె.మహేష్ కుమార్ – సమస్య మూలంలోకి చూద్దామని తపా చెబుతుంటే మీరు పైపై కబుర్లు చెబుతున్నారు. మన దగ్గర బోధనావ్యవస్థ సరిగ్గా లేదని ఇంగ్లీషులో పాఠాలు చెప్పాలా? ఆంగ్లంలొ బాగా బోధిస్తారా?

    సమితులు, సెట్సు ఒకటైతే, భాస్వరము, ఫాస్ఫరస్ ఒక్కటే అయితే మనకు తెలుగు అక్కరలేదా? లెకుంతే, తెలుగువాళ్ళం కొత్తగా లెక్కలను, సైన్సును కనుక్కుందామని మి ఉద్దెశమా?

  13. @రామలింగేశ్వరరావు: http://parnashaala.blogspot.com/2009/07/blog-post_05.html ఈ టపాలో నా “కబుర్లు” ఇంతకన్నా లోతుగా చెప్పాను ఒకసారి చూడండి. నేను భాషాబోధనలో తర్ఫీదు పొందిన ఒక పల్లె కుర్రాడిని. సమస్య మూలాలూ,లోతులూ నిజజీవితంలో అనుభవించినవాడిని.

  14. రవి says:

    “భాష విషయమై తెలుగువాళ్ళకి కావలిసిన ఐకమత్యమూ(అభిప్రాయాలలో) లేదు, సరైన భావోద్వేగమూ (emotion) లేదు. మనలో ఇవి ఏర్పడే దాకా ప్రభుత్వం ఏదో చేస్తుందని, చెయ్యాలని అనుకోవడం వ్యర్థం. మనకీ ఐకమత్యం భావోద్వాగం భాషకన్నా కులం పట్ల వెయ్యి రెట్లు ఎక్కువగా ఉన్నాయి.”

    కామేశ్వర్రావు గారు, సరే, ఐకమత్యము, భావోద్వేగము లేవు. ఐకమత్యం ఏ విషయంలోనూ లేదు, కాబట్టి భావోద్వేగం ఒకటే మిగిలింది. అది రావాలంటే, మన అద్భుతమైన విశ్లేషణా సామర్థ్యాలను, తెలివితేటలను, లాజిక్ ను కాసేపు పెట్టి, మాతృభాషను నిర్ద్వంద్వంగా ప్రేమించాలి, కనీసం అంగీకరించాలి. కాదంటారా?

    అప్రస్తుతమైనా ఒక మాట. తెలుగును, తెలుగు భాషాభిమానాన్ని విమర్శించే వారు, తమిళుల భాషాభిమానాన్ని మాత్రం మెచ్చుకుంటారు, అబ్బో, అహా, ఓహో అంటూ చంకలెగరేస్తుంటారు. అదే ప్రేమ మనం మాట్లాడేభాష మీద ఎందుకు వచ్చి ఛావదో, స్ఫూర్తి మన భాష విషయంలో ఎందుకు వర్తించదో, ఎంత తల బద్దలు కొట్టుకున్నా అర్థమవదు నాకు.(ఇది మిమ్మల్ని ఉద్దేశించి కాదు.నిజంగానే)

    మాతృభాష మీద భావోద్వేగం ఎలా వస్తుంది?

    ఓ మంచి నాయకుడి వల్ల,
    లేదా ఎక్కడో ఓ చోట ఆలోచన మొదలయి, ప్రజల ద్వారా, క్రమక్రమంగా ఓ ఉద్యమంగా పెరిగి పెద్దదయి వేళ్ళూనుకోడం ద్వారా.

    ఇదుగో..దీనికి ఈ చర్చే ఎందుకు వేదిక కాకూడదు?

  15. స్వాతీ శ్రీపాద says:

    తెలుగా ఆంగ్లమా అని ఇక్కడ తలలు బద్దలు కొట్టుకుని చొక్కాలు చింపుకుంటుంటే ప్రపంచవ్యాప్తంగా భాషలు అంతరించిపోతున్నాయని భాషాశాస్త్రవేత్తల ఆవేదన మరోవైపున. ఇంజనీరింగ్ కోర్స్లూ వైద్య విద్యా -దానికి వచ్చే ప్రతిఫలం (సంపాదన లెఖ్ఖేసుకుని ) ప్రతివారూ నాకొడుకు ఇంజనీరో డాక్టరో కావాలని కలలు కంటూ లెఖ్ఖలకు ఒక ట్యూషన్, భౌతిక శాస్తానికి ఒక ట్యూషన్ రసాయనిక శాస్త్రానికి ఒక ట్యూషన్ పిల్లల ఖాళీ సమయాల్తోపాటూ చదివే అలవాట్లనూ ఫణంగా పెట్టి సంపాదన కలల్లో విహరించేప్పుడు , ఇతరదేశాలకు పంపి చదివించాలనే మోజులో కాన్వెంట్ల చుట్టూ , పబ్లిక్ స్కూళ్ళచుట్టూ తిరిగేఫ్ఫుడు, గుర్తు చేసుకోవలసినది ఒకటీ ఎవరిఖర్మ వారు అనుభవించక తప్పదు. పిల్లలను యంత్రాలుగా కాక మనసున్న మనుషులుగా వారి ఇష్టాఇష్టాలను గౌరవింఛగలిగితే కొందరికైనా మాతృభాష వచ్చే అవకాశంవుంటుంది.

  16. ఈ భాషాసమస్య ప్రజల నుంచి వచ్చినది కాదని అందఱూ గ్రహించే రోజు రావాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగుభాష పట్ల తన విధ్యుక్త కర్తవ్యాల్ని పూర్తిగా విస్మరించడం మూలాన ఏర్పడిన భాషాసంక్షోభం ఇది. ప్రపంచంలో ఏ భాషైనా ప్రభుత్వ ఆదరణతోనే బతికి బట్టకడుతుంది. అమెరికాలో ఇంగ్లీషైనా, అరేబియాలో అరబ్బీ అయినా !! కానీ ఇక్కడ ప్రభుత్వం మాత్రం పీకల్లోతు మైనారిటీ వోట్ బ్యాంక్ రాజకీయాల్లో మునిగి ఆ బాధ్యతని పూర్తిగా గాలికొదిలేసింది. పరాయి రాష్టాలనుంచి దిగుమతి అవుతున్న అయ్యేయెస్ లూ, ఐపీయెస్ లూ తెలుగువాళ్ళ ప్రభుత్వంలో తెలుగు అధికారభాషగా అమలు కాకుండా అడ్డుపడుతున్నారు. అంతా కలిసి కావాలని పైనుంచి తెలుగుని తొక్కేస్తూ ప్రజల్లో మార్పొచ్చిందని పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. అసలు తెలుగుని జన్మలో చదవకుండానే డిగ్రీలు సంపాదించడానికి వీలు కల్పించే ఒక అపూర్వ వ్యవస్థని, ప్రపంచంలో ఎక్కడా లేని విచిత్ర విద్యావ్యవస్థని ఆంధ్రప్రదేశ్ లో సృష్టించారు. కొద్దిమంది నాన్-తెలుగువాళ్ళని చూపించి అందఱికీ తెలుగు నుంచి మినహాయింపు ఇచ్చేస్తున్నారు. ముఖ్యంగా ఇంగ్లీషు మీడియమ్ పాఠశాలలవాళ్ళకి ! అలా తోక (భాషా మైనారిటీలు) కుక్కని (రాష్ట్రంలోని మెజారిటీ తెలుగుజాతిని) ఆడించే విడ్డూరపు వాతావరణం కల్పించారు.

  17. అన్ని దేశాల్లోను, రాష్ట్రాల్లోను ఆ దేశ/ రాష్ట్ర భాషని అభ్యసించడం తప్పనిసరి. కానీ ఈ ఆం.ప్ర. ప్రభుత్వం మాత్రం తన వోట్ బ్యాంకు రాజకీయాల కోసం దాన్ని ఇక్కడ తప్పనిసరి చెయ్యడం లేదు. ఆ కారణం చేత జన్మలో ఎప్పుడూ తెలుగు చదవకుండానే డిగ్రీలు పుచ్చుకునే అపూర్వ సదుపాయం ఆంధ్రప్రదేశ్ లో కల్పించబడినట్లయింది. ఈ సమస్య కేవలం ప్రభుత్వసృష్టి. చాలామంది అనుకుంటున్నట్లు ప్రజల్లో వచ్చిన మార్పూ కాదు, నా తలకాయా కాదు. ప్రజలదేముంది ? పరీక్షలకి ఒక సబ్జెక్టు తగ్గినా తగ్గినట్లే అనుకుంటారు. అలా మీరు ఇంగ్లీషుని తీసేసినా సంతోషించేవాళ్ళు ఇక్కడ మిలియన్లాదిమంది.

    ఈ ప్రభుత్వం ముస్లిములంతా ఉర్దూవాళ్ళనే భ్రమలో ఉంది. మనల్ని ఆ భ్రమలో ఉంచుతున్నది కూడా. నిజానికి తెలంగాణాలోని ఒకటిరెండు జిల్లాల్లో తప్ప మన రాష్టంలోని ముస్లిములెవరూ ఉర్దూవాళ్లూ కారు. ఆ సో-కాల్డ్ ఉర్దూవాళ్ళక్కూడా దైనందిన వ్యవహారాల్లో తెలుగు మాట్లాడ్డం వచ్చు. “మీరు ముస్లిములు, కాబట్టి మీరు ఉర్దూవాళ్లు” అని ఈ ప్రభుత్వమే వాళ్ళకి బళ్లు పెట్టి మఱీ ఉర్దూ నేర్పిస్తున్నది. అలా వాళ్ళని ఇండియాలో పాకిస్తానీలుగా మారుస్తున్నది. ఇలా ఉర్దూబళ్ళు పెట్టి జాతిలో ఇంకో ఉపజాతిని, చెవిలో జోఱీగలాంటి శత్రువర్గాన్ని తయారు చేసుకోవడం మనకి అర్జెంటా ? సరే, వాళ్లు ఉర్దూవాళ్ళయితే రాష్ట్రభాష అయిన తెలుగుని వాళ్ళకి చట్టబద్ధంగా నేర్పడానికి ఆటంకమేంటో నాకు తెలియదు. వేలాది కిలోమీటర్ల అవతల ఉన్న ఇంగ్లీషునే తెలుగువాళ్ళు నేర్చుకుంటున్నప్పుడు.

    ఫ్రాన్సులో మిలియన్లాదిగా అల్జీరియన్సు నివసిస్తున్నారు. వాళ్ళంతా ముస్లిములే. వాళ్ళందఱి మాతృభాష అరబిక్. కానీ వాళ్ళంతా బళ్ళలో ఫ్రెంచి తప్పనిసరిగా నేర్చుకుంటారు. మఱి ఇక్కడ మనవాళ్ళే అయిన మన తెలుగు ముస్లిములకి తెలుగు నేర్పడానికి ఈ తెలుగుప్రభుత్వం ఎందుకు సంకోచిస్తుందో, “తెలుగుని తప్పనిసరి చెయ్య” మని అడిగినప్పుడల్లా “అమ్మో ముస్లిములేనైనా అనుకుంటా”రంటూ ఎందుకు కుంటిసాకులు చెబుతుందో నాకు తెలియదు. కానీ ఈ కుట్ర ఇంకెంతకాలం ? ఇహనైనా కుక్కే లేచి తోకని ఆడించాలి. ఆ రోజు ఎప్పుడో మనమంతా చచ్చాక కాదు, వెంటనే ఇప్పుడే రావాలి.

    కానీ నాన్-తెలుగులకిచ్చిన ఈ రకమైన భాషాపరమైన వెసులుబాట్లనీ, exemptions నీ తెలుగు పాఠశాలలవాళ్ళు ఉపయోగించుకుంటూ తెలుక్కి ఎసరు తెస్తున్నారని జనం గుర్తించడంలేదు. ఈ మాతృభాషా విధ్వంసం ఏదో ఇఱవయ్యొకటో శతాబ్దపు ట్రెండ్ అనే ఘోరభ్రమలో ఉన్నారు. ఈ భాషాసమస్య పూర్తిగా ప్రభుత్వాల సృష్టి. ఇందులో ప్రజల పాత్ర అసలు లేనేలేదు. ప్రజలేమీ తమ మాతృభాషకి శత్రువులు కారు. చదవమంటే చదువుతారు. కానీ తెలుగువాళ్ళని అన్యాయంగా అలా చిత్రిసున్నారు. ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు సిస్టమేటిగ్గా తెలుగుని తమ నీచ, హీన రాజకీయాల కోసం బలి చేసేస్తున్నాయి. ఇది.గ్రహించి మనవాళ్లెప్పుడు కార్యాచరణకి దిగుతారు ?

  18. ఇక్కడ మైనారిటీ మెజారిటీ మతసమస్య ఎక్కడ్నించీ వచ్చింది? ప్రభుత్వం తెలుగును వదిలేసి ఉర్దూనో లేక ఫార్సీనో ప్రమోట్ చెయ్యటం లేదే!

    ఇప్పటివరకూ ముస్లింలు తెలుగు భాషకు వ్యతిరేకంగా ఎక్కడా మాట్లాడిన దాఖలాలు లేవు. పైగా నాకు తెలిసీ కడప,గుంటూరు,చిత్తూరు,నెల్లూరు ముస్లింలు బ్రహ్మాండమైన తెలుగు మాట్లాడతారు.వారిలో తెలుగు టీచర్లు,తెలుగులో రాసే రచయితలూ-కవులూకూడా ఉన్నారు. ఇక ప్రభుత్వం తెలుగు విషయంలో ముస్లింల “మనోభావాల్ని” తెచ్చిన ఘటన ఒక్కటీ లేదు.ఎక్కడిదెక్కడికో కలగలిపి…చివరికి “అక్కడికే” రావడం విచారకరం.

  19. రహమ్మతుల్లా says:

    మహేష్ కుమార్,
    మీరు తెస్తేనే వచ్చింది ఇక్కడ మైనారిటీ మెజారిటీ “మత”సమస్య. “ఇప్పటివరకూ ముస్లింలు తెలుగు భాషకు వ్యతిరేకంగా ఎక్కడా మాట్లాడిన దాఖలాలు లేవు” అని స్టేటుమెంటిచ్చారు. ముస్లిములు వ్యతిరేకంగా మాట్లాడారనిగాని, దాఖాలాలు ఉన్నాయనిగాని ఎవరన్నారిక్కడ? ముస్లిములతో ఏ ప్రమాదమూ లేదు. ముసలం తెస్తున్నవాళ్లుతోనే ప్రమాదం. కడప,గుంటూరు,చిత్తూరు,నెల్లూరు ముస్లింలేకాదు, మీకు తెలీని చాలా మంది ముస్లిములు బ్రహ్మాండమైన తెలుగు మాట్లాడతారు. కవిత్వం కూడా రాస్తారు. కొత్తగా ఏమీ చెక్కనక్కరలేదీసంగతి. ఆ బ్రహ్మాండమైన తెలుగే బ్రహ్మపదార్థమైపోతూంది బడుల్లో. దానికి సూచనే మెడలకు పలకలు కట్టడం. Tip of the iceberg లాంటి ఆ విషయాన్ని ఒక టీచరు చేసిన తప్పిదంగా పరిమితం చెయ్యబునడం కళ్లూమూసుకొని పాలు తాగుతూ నన్నెవరూ చూళ్లేదనుకునే దొంగపిల్లి లాంటివాడు చేసే పని. “ఇక ప్రభుత్వం తెలుగు విషయంలో ముస్లింల “మనోభావాల్ని” తెచ్చిన ఘటన ఒక్కటీ లేదు” అన్నారు. మనోభావాలా? మనోభావాలు కూడా కనిపెట్టేశారా? ఐనా మనోభావాల్ని “తేవడమేమిటీ”? ఎక్కడెక్కడికో కలిపుతున్నది, చివరికి “అక్కడికే” వస్తున్నదీ ఎవరో తెలుస్తూనేవుంది. నాన్-తెలుగులకిచ్చిన ఈ రకమైన భాషాపరమైన వెసులుబాట్లనీ, exemptions నీ తెలుగు పాఠశాలలవాళ్ళు ఉపయోగించుకుంటూ తెలుక్కి ఎసరు తెస్తున్నారని జనం గుర్తించడంలేదు అనే వాక్యాన్ని మళ్లీ చదువుకోండి. కళ్లున్నగుడ్డివాళ్లకు ప్రభుత్వం తెలుగును వదిలేసిందనేది కనబడదు. విచారకరమే మరి!

  20. @రహ్మతుల్లా: ఒకసారి తాడేపల్లిగారి వ్యాఖ్య చదువుకోండి. ఉర్దూమాట్లాడే ముస్లింలను పాకిస్తానీలన్న ఆయన విశాల ధృక్పధాన్ని అర్థం చేసుకోండి.

  21. కత్తి మహేష్ కుమార్: మీరు తెలుగు గురించి మాట్లాడుతున్న విధానం అనుచితంగా ఉంది. సమస్యలోని లోతును చూడకుండా అనుచితమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.

    “ఇప్పటివరకూ ముస్లింలు తెలుగు భాషకు వ్యతిరేకంగా ఎక్కడా మాట్లాడిన దాఖలాలు లేవు.” – ఏ సంబంధమూ లేకుండా మధ్యలో మీరు ఈ మత కోణాన్ని తీసుకొచ్చారు. తాడేపల్లి గారి వ్యాఖ్యలోని భావాన్ని వక్రీకరిస్తున్నారు.

    మీ భావాలకు అనుకూలంగా ఈ వ్యాసము, ఇక్కడి వ్యాఖ్యలూ ఉండకపోవచ్చు. అంతమాత్రాన, సమస్యను పక్కదారి పట్టించే విధంగా వ్యాఖ్యానించవద్దని కోరుతున్నాను.

  22. రహమ్మతుల్లా says:

    మహేశ్ కుమార్,
    తెలుగుదనాన్ని తెలుగుగడ్డమీద పుట్టిన పెరిగినవాళ్లంతా కాపాడుకోవాలని ఈ సంపాదకీయం చెప్తున్న విషయాన్ని వదిలి, మతాలూ మనోభావాలూ అంటూ లేనిపోని మాటలు చెప్పి, ముస్లిముల తరఫున మీరు వకాలత్ చెయ్యనవసర్లేదు. దృక్పథాలూ, మనోభావాలూ మీరు చెప్పేదాక అర్థం చేసుకోలేమనుకోకండి.

  23. “మీరు ముస్లిములు, కాబట్టి మీరు ఉర్దూవాళ్లు” అని ఈ ప్రభుత్వమే వాళ్ళకి బళ్లు పెట్టి మఱీ ఉర్దూ నేర్పిస్తున్నది. అలా వాళ్ళని ఇండియాలో పాకిస్తానీలుగా మారుస్తున్నది. ఇలా ఉర్దూబళ్ళు పెట్టి జాతిలో ఇంకో ఉపజాతిని, చెవిలో జోఱీగలాంటి శత్రువర్గాన్ని తయారు చేసుకోవడం మనకి అర్జెంటా ?” దీని భావమేమి తిరుమలేశా????????

    ““తెలుగుని తప్పనిసరి చెయ్య” మని అడిగినప్పుడల్లా “అమ్మో ముస్లిములేనైనా అనుకుంటా”రంటూ ఎందుకు కుంటిసాకులు చెబుతుందో నాకు తెలియదు. కానీ ఈ కుట్ర ఇంకెంతకాలం ? ” దీని అర్థమేమి శ్రీనివాసా?????

    చదువరిగారూ మీ ఆభిజాత్యానికి నా సలాం!

  24. ముందుగా తెలుగుకు అవమానం చేసిన ఉపాధ్యాయులను శిక్షిస్తూ, ఆ పాఠశాల గుర్తింపును రద్దు చెయ్యాలి. అలాగే పదవతరగతి వరకు నిర్భంద తెలుగు ఉండాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. ప్రస్తుతానికి ఈ రెండింటికి మించిన పరిష్కారాలు నాకు కనబడటం లేదు. తెలుగు కోసం పోరాడితే తప్ప, మాటలతో పని జరిగేది కాదు.

    అసలు తెలుగు మాట్లాడితే ఫైన్లు, అవమానాలు అంటూ మొదలుపెట్టింది క్రైస్తవ మిషనరీ పాఠశాలలే. ముందుగా ఈ క్రైస్తవ మిషనరీ పాఠశాలలన్నీ తెలుగు మీడియంలోనే ఉండాలని డిమాండు చెయ్యాలి. ఇకనుంచి క్రైస్తవ మిషనరీ పాఠశాలలకు ఇంగ్లీషు మీడియంలో బోధించడానికి అనుమతిని ఇవ్వకూడదు.

  25. kcubevarma says:

    ఇది ఈ చర్చ ఎటో ఎటో మళ్ళుతోంది. క్రైస్తవ మిషనరీలు గురించికూడా కలిపేసారు. నిజానికి మిషనరీ పాఠశాలలు లేకపోతే చాలామంది దళిత విద్యార్ధులు చదువుకు మరింత దూరమయ్యేవారు. వారు మత ప్రచారానికి అనువుగా నడుపుకుంటున్నా సరే వాటి వలన కొంత మంచే జరుగుతోంది.

    మహేష్ గుర్తు చేసిన విషయం పట్ల ఎందుకంత వ్యతిరేకత, తాడేపల్లి గారు అన్న విషయం పాకిస్తానీలుగా ముస్లింలను జమకట్టనది నిజం కాదా? దానిని ఖండిస్తూనే మిగిలిన చర్చను కొనసాగించడంలో తప్పేమిటి. అది మతపరమైన వ్యతిరేకతనే సూచిస్తోంది చదవగానే. భాషకు మత పరమైన రంగు దేనికి. తెలుగు వాళ్ళమంతా హిందువులమా?

    ఇక్కడ మనం చర్చించాల్సిన విషయం విద్యా ప్రమాణాలు కూడా. వీటిని ప్రైవేటు కాన్వెంటు పాఠశాలలు పట్టించుకున్న దాఖలాలు లేవు. కనీసం విద్యార్హత లేనివారు కూడా పనిచేస్తున్నారు చిన్న చిన్న పట్టణాలలో. అన్ని అర్హతలునా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు తమ వృత్తిధర్మాన్ని సరిగా నిర్వర్తించక పోవడంతో గ్రామీణ ప్రాంతాలలో సైతం ఈనాడు స్కూళ్ళలో విద్యార్థులు లేక వెల వెల బోతున్నాయి. చిట్టీ వ్యాపారాలు, వడ్డీ వ్యాపారాలు. చైన్ బిజినెస్ లతో బిజీగా గడిపేస్తున్న టీచర్ల వలన, అవినీతి అధికారుల వలన ప్రభుత్వ విద్య భ్రష్టుపట్టి పోయి మరో గత్యంతరం లేక తల్లిదండ్రులు అప్పుల పాలైనా కాన్వెంటుల వెంట పడుతున్నారు. ఇది వ్యవస్థాపరమైన వైఫల్యం కాదా?

  26. మిషనరి పాఠశాలలే దలితులకి విద్య నేర్పిస్తున్నారా.. అదీ ఫ్రీగా.. గవర్న్మెంట్ స్కూల్ దలితులని చేర్చుకొమంటున్నాయా? లేక రెజర్వషన్స్ మిషనరి పాఠశాలల్లొనే అమలవుతుందా ?? భలే జొకులు..

    అసలు ఈ దరిద్రాన్నతటికి కారణం ఆ మిషనరి స్కూల్లే.. మత మార్పిడి అనే దురుద్దెశ్యం తొ వున్నవాళ్ళు చేసె మంచి ఎమిటి.. పనికిమాలిన జాడ్యాన్ని కొని తెచ్చుకున్న.. ఇప్పుడు అనుభవిస్తున్నాం..

    అయినా తెలుగు చచ్చిపొయిన పర్లేదు అని స్టేటెమెంట్లు ఇచ్చిన బాషాద్రొహుల తొ తెలుగు గురించి చర్చేమిటి ?

  27. >>”మిషనరీ పాఠశాలలు లేకపోతే చాలామంది దళిత విద్యార్ధులు చదువుకు మరింత దూరమయ్యేవారు.”

    వర్మ గారు, మా ఊర్లో ఒక్క మిషనరీ పాఠశాల కూడా లేదు. ఉన్నది కేవలం ప్రభుత్వ బడి మాత్రమే. మరి మా ఊరిలోని దళితులు విద్యావంతులెట్టా అయ్యారు?. ప్రభుత్వ బడిలో అందరితో పాటేగా పాఠాలు చెప్పేది. నేను చదువుకున్నది అక్కడే, నా తోటి దళిత స్నేహితులు చదువుకున్నది అక్కడే. ఇంకా నాతోపాటుగా ఐ.ఐ.టి.లో M.Tech చేస్తున్న దళితుల్లో ఎవ్వరూ కూడా క్రైస్తవ మిషనరీ బడిలో చదువుకోలేదు.

    ఇంతకీ క్రైస్తవ మిషనరీ బడులల్లో దళితులకు ఉచితంగా చదువు చెబుతున్నారంటారా?

    >>”ఇది వ్యవస్థాపరమైన వైఫల్యం కాదా?”

    కెక్యూబ్ వర్మ గారు, అందరూ అంటుంది కూడా ఇదే. పైన టపాలో కూడా చదువరి గారు అదే చెప్పారు. “ప్రభుత్వ విధానాలను మార్చాలి, మనం మారడం కాదు.” అని.

    ప్రభుత్వ ఉపాధ్యాయులు అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు అనడం తప్పితే ఏనాడైనా ఈ విషయం గురించి ప్రజలు నిలదీశారా?

    ప్రైవేటు బడుల వాళ్ళు, ఇష్టానుసారం ఫీజులు పెంచితే, తగ్గించాలని ఆ మధ్య ధర్నా చేశారు. రోడ్లు మీద ఫీజుల కోసం పిల్లలను అడుక్కోమని చెప్పి నిరసన ప్రదర్శించారు.

    మరి అదే నిలదీత ప్రభుత్వ బడుల విషయంలో చేసుంటే, ఈనాడు ఫీజుల కోసం వాళ్ళ పిల్లలు రోడ్ల మీద అడుక్కునే దుఃస్థితి కనిపించేదా?.

    జరిగిందేదో జరిగిపోయింది. కనీసం ఇప్పటికైనా నిలదీద్దాం అంటున్నారు. మన భాషను, సంస్కృతినీ రక్షించుకుందాం.

  28. తెలుగు అందరూ కావాలంటున్నారు. కానీ వ్యక్తిగత అభిప్రాయాలతో మళ్ళీ ఒకరికి ఒకరు విభేదిస్తున్నారు. తెలుగు పై భావోద్వేగం అందరికీ ఉంది కాబట్టి పైన రవి గారు చెప్పినట్లు ఈ విషయంలో (సంపాదకీయం లో వివరించిన) మరొక్కసారి ఆలోచించగలరు.

  29. kcubevarma says:

    ఇక్కడ నేను ప్రస్తావించినది వాటి వలన జరిగిన సాయంగురించి మాత్రమే. మా చుట్టుపక్కల ఊళ్ళలో వున్న దళిత విద్యార్థులు చాలావరకు నా చిన్నప్పుడు ఐదో తరగతితో ఆపేసేవారు. వారికి బోర్డింగ్ సౌకర్యాన్ని కల్పించిన ఆర్.సి.ఎం.స్కూలు ఏర్పడటంతో తరువాతి చదువును కంటిన్యూ చేసి మంచి పొజిషన్ లో వున్నారు. మత మార్పిడి అన్నది ఎప్పుడూ వున్నదే. చర్చ ఆ వైపు ఎందుకు లెండి. ప్రభుత్వం ఈ మద్య ఏర్పాటు చేసిన బ్రిడ్జిస్కూళ్ళవలన కొంతమేర విద్య సాధ్యమవుతుంది.

  30. sri says:

    స్వయం గా ఆంధ్ర ప్రభుత్వం ముస్లిం లో మెజారిటి వారు (>70%) వెనుక బడిన తరగతుల నుంచి కన్వర్ట్ అయ్యారని కోర్టుకు నివేదిక ఇచ్చింది. మన ఆంధ్రా లో ఎంత మంది ముస్లింలు ఉర్దు మాట్లాడు తున్నారు? ఉర్డు భాష మాట్లాడె వారిని అడ్డు చూపి తెలుగు చదవటాన్ని తప్పని సరి చెయటం లేదు అనే వాదం లో వీriకి కనిచ్పించిన విపరీత అర్థమేంది?

  31. మైదుకూరు స్కూల్లో తెలుగు భాషకు జరిగిన అవమానం పై మైదుకూరులో ఉద్యమం ప్రారంభించాం!
    తెలుగు గొంతుకతో గీపెట్టి అరిచాం.
    తెలుగు ప్రజలు ప్రజలూ, పత్రికలూ, ఛానల్లూ ముక్త కంఠంతో నిరశించాయి.
    పదకొండు రోజుల తర్వాత నవంబరు 6 వ తేదీన పోలీసులు కేసు నమోదు చేశారు.
    అదీ కంటి తుడుపు గానే ! పిల్లలను అవమాన పరిచారనేది మాత్రమే కేసు సారాంశమట! ఇక్కడ మన తెలుగు తల్లి అనాధగా కనిపించలేదూ?
    తల్లి కంటే జన్మభూమి గొప్పదని అంటారే!
    జన్మభూమి కంటే భాష గొప్పదనీ, ఎవరి మాతృభాష వారికి ఇంకా గొప్పదనీ, చట్టాలు గుర్తించే రోజు ఎప్పుడొస్తుందో కదా!
    మైదుకూరు ఉద్యమం పై ఈరోజు ఆంధ్రజ్యోతి సంపాదకీయపు పేజీలో వ్యాసం చదువగలరు.
    http://www.andhrajyothy.com/editshow.asp?qry=/2009/nov/6edit2

  32. Phani says:

    కె.మహేష్ కుమార్ garu matram edo okati matladali matladathunnaru……ikkada matlade visyatm enti…ayina Muslim and hindu topic enduku techharo naku artham ithe kaledu..భాషకు మత పరమైన రంగు దేనికి. తెలుగు వాళ్ళమంతా హిందువులమా?

Comments are closed.