జీవశాస్త్ర విజ్ఞానం – సమాజం

– డి. హనుమంతరావు

ఆ మధ్య టి.వి.లో ఒక ప్రకటన చూసాను. కొత్తగా విడుదలైన కంప్యూటర్‌ ప్రకటన అది. అది కొని ఇంట్లో పెట్టిన ఓ ఇల్లాలు దానికి కుంకుమతో బొట్టుపెట్టి నిమ్మకాయ+మిరపకాయలు వేలాడదీస్తుంది. కుటుంబ సభ్యుల చప్పట్లతో ప్రకటన ముగుస్తుంది. ఓ వైపు సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నా దానికి సాంప్రదాయాలను ఎలా జోడించి ప్రచారం చేస్తున్నారో ఈ ప్రకటన ద్వారా తెలుసుకోవచ్చు.

సైన్సును ప్రచారం చేస్తున్న వాళ్ళ ఉద్దేశాలను రెండు రకాలుగా విభజించవచ్చు. 1. ఓ కొత్త టెక్నాలజీనో, ఓ కొత్త సిద్ధాంతాన్నో ప్రచారం చేయడం. మనం టి.వీలు, రేడియోలు, పత్రికలలో వీటిని విరివిగా చూస్తాం. సక్రమంగా పరిశీలిస్తే అవి ఏదో ఒక కంపెనీ ఉత్పత్తిని మార్కెట్‌ చేయడానికి ఉద్దేశించినవి అయి వుంటాయి. 2. సైన్స్‌ సిద్ధాంతాలను ప్రచారం చేసి వాటి ద్వారా ప్రజలలో సైన్స్‌ ఆలోచనా ధోరణులను కల్పించడం. వీటినే శాస్త్రీయపద్ధతి, శాస్త్రీయ దృక్పథం అంటుంటాం. ఈ రెండవ రకమైన వ్యాసాలు, పుస్తకాలు చాలా తక్కువ. ప్రజలలో హేతుబద్ధమైన ఆలోచనలను పెంచాలనే గాఢమైన అనురక్తి ఉంటేగాని అది సాధ్యం కాదు. ఆ కోవకు చెందిన పుస్తకం ‘జీవశాస్త్ర విజ్ఞానం – సమాజం’. దాని రచయిత డా||కొడవటిగంటి రోహిణీ ప్రసాద్‌.

తెలుగు సాహిత్యంలో తనదైన ముద్రను వేసిన కొడవటిగంటి కుటంబరావు గారి కుమారుడు కొడవటిగంటి రోహిణీ ప్రసాద్‌. అణుధార్మిక శాస్త్రవేత్తగా వుంటూ 70కి పైగా పరిశోధనా పత్రాలను సమర్పించాడాయన. సంగీతం పట్ల మక్కువతో హిందూస్థానీ, కర్నాటక సంగీతాల్ని నేర్చుకుని ఎన్నో ప్రదర్శనలకు సంగీత దర్శకత్వం వహించి, ప్రసంగాలు చేసారు. పుస్తకం కేవలం తెలుగు రచనల పరిధిని పెంచడానికి కాక విద్యార్థులు వీటిని చదివి సైన్స్‌ పట్ల ఇష్టాన్ని పెంచుకుని శాస్త్రవేత్తలుగా ఎదగడానికి తోడ్పడుతుంది. మరీ ముఖ్యంగా ప్రజలలో మూఢనమ్మకాల్ని తొలగించే హేతువాదాలకు, ప్రగతివాదాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఇందులో మొత్తం 53 వ్యాసాల ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం ప్రజాసాహితి కోసం రాసినవి. విగిలినవి అరుణతార, విశాలాంధ్ర, కొన్ని వెబ్‌ పత్రికల కోసం రాసినవి. మామూలుగా సైన్స్‌ వ్యాసాలు ఇంగ్లీష్‌ నుండి అనువాదం చేసినట్లుగా వుంటాయి. కానీ ఈ పుస్తకంలోని వ్యాసాలు మహీధర నళినీమోహన్‌ వ్యాసాల వలె స్వతంత్ర తెలుగు రచనలు.

మన మదిలో మెదిలే ప్రశ్నలను ముందుగానే పేర్కొంటూ సమాధానాలివ్వడం, ఆ సమాధానాలకు అవసరమైన ఆధారాలను, గణాంకాలను, సిద్ధాంతాలను వివరించడం పుస్తకంలోని వ్యాసాలన్నింటిలో కనిపిస్తుంది. సైన్స్‌లో లోతైన పరిజ్ఞానం లేనివారికి సైతం అరటిపండు ఒలిచిన చందంగా అవగాహన చేయించడం రచయిత రచనాకౌశలానికి నిదర్శనం. వ్యాసాలకు పెట్టిన శీర్షికలు కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఉదాహరణకు ”మనిషి కారణజన్ముడా!”, “చావు పుట్టుకలు”, “విశ్వంలో మనిషి స్థానం”, “మెదడులోని దేవుళ్ళు”, “ముసలితనం ఎందుకు వస్తుంది?”, “జన్యువుల జగన్నాటకం”, “మతాలు – జన్యువులు”, “జన్యువుల ఆత్మహత్య”, “జగదేకవీరులు – సూక్ష్మజీవులు”, “సూక్ష్మజీవులతో మనకాపురం” చూడండి.

ప్రధానంగా ఈ వ్యాసాలు మూడు రకాల అంశాల చుట్టూ తిరుగుతాయి. మానవాళి మనుగడలో కీలకమైన ఆ మూడు అంశాలు 1.జీవపరిణామం 2. జన్యువులు 3. సూక్ష్మజీవులు.
ఏ వ్యాసానికా వ్యాసం స్వతంత్రం, శుద్ధ వైజ్ఞానికం అని అనిపించినప్పటికీ మొత్తం మీద ఒక ఉమ్మడి సామ్యం కనిపిస్తుంది. అది ప్రజలలో తరతరాలుగా కొనసాగుతున్న తప్పుడు అవగాహనన లేదా మత సంబంధమైన మూఢనమ్మకాన్ని పేర్కొని దానిని తప్పు అని నిరూపిస్తూ ఆ అంశం పట్ల సరైన సమాచారాన్నివ్వడం, వాస్తవాలను తెలియజేయడం.

“మనిషి కారణజన్ముడా!” అన్న వ్యాసంలో ఇతర జీవరాశులు ఎలా అభివృద్ధి చెందుతున్నాయో వివరిస్తారు. ఒక్క మనిషి పేగులలో వుండే బాక్టీరియా సంఖ్య మొత్తం భూమి మీద ఉన్న పెద్ద ప్రాణులన్నింటి కన్నా ఎక్కువ అని వివరిస్తారు. భూమి మీద జీవరాశి ఏర్పడుటకు గల పరిస్థితులు అదృష్టవశాత్తు ఏర్పడినవి కావని, వీటి వెనుక జరిగిన అనేక రసాయనిక పరిణామాల గుట్టును ”మనకు అనువైన భూమి పుట్టుక, స్వరూపం”లో వివరిస్తారు. ఈ విశాల విశ్వం గురించి ”విశ్వంలో మనిషి స్థానం”లో వివరిస్తారు. మానవ శరీరం ఎంత సంక్లిష్టమైనదో అది జీవపరిణామంలో భాగంగా ఎలా మారుతూ, ఎదుగుతూ వచ్చిందో విశ్లేషిస్తారు. భావాలకు కేంద్రమైన మెదడును గురించి, అది సృష్టించిన భ్రమలే దేవుళ్ళని ఋజువు చేస్తారు. ఆత్మలు, పూనకాలు ఉత్తుత్తివని తేలుస్తారు.

”ముసలితనం ఎందుకు వస్తుంది?”వ్యాసంలో డి.ఎన్‌.ఎ. మనుగడకు శతవిధాలా ప్రయత్నిస్తుందని, మన శరీరాన్ని యాంత్రికంగా రిపేరు చేసుకుంటూ ఎల్లకాలం నడపడం కన్నా దాని స్థానంలో అదే జన్యుపదార్థం కలిగిన మరొక ప్రాణిని పెంచి పెద్ద చేయడం ప్రకృతికి తక్కువ ఖర్చుతో కూడిన పనిగా చావు గుట్టును విప్పుతారు. ప్రాణుల ప్రవర్తనకు కీలకమైన జన్యువులను గూర్చిన అనేక వ్యాసాలు ఇందులో ఉన్నాయి. ”సూక్ష్మజీవులతో మన కాపురం”వ్యాసంలో మన ఇళ్లలోనే కాదు మన వంటిలో కూడా ఎన్నెన్ని సూక్ష్మజీవులు ఉన్నాయో, అవి మనతో నిత్యం ఎలా ఘర్షణ, సహజీవనం సాగిస్తున్నాయో వివరిస్తారు. కళ్ళు మూసుకుని ఆ సంఖ్యను ఊహించుకుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. అన్నట్లు సూక్ష్మజీవుల వలన లాభాల్నే కాదు నష్టాల్ని చెప్పారు రోహిణీ ప్రసాద్‌ గారు. బాక్టీరియాలు, వైరస్‌లపై ప్రత్యేక వ్యాసాలున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వైరస్ లు సృష్టించిన విలయాన్ని విశదపరిచారు. ”భౌతిక దృక్పథం ఆవశ్యకత” అన్న వ్యాసంతో ఈ సంకలనం ముగుస్తుంది.

పాలపుంతను ఇడ్లీ ఆకారంతో పోల్చడం, బాక్టీరియాల పరిణామాన్ని వివరించడానికి పెన్సిల్‌తో కాగితంపై పెట్టిన చుక్కలో లక్ష బాక్టీరియాలు ఇమిడిపోగలవు అని వివరించడం స్కూలు పిల్లలకు సైతం సులువుగా అర్థమవుతాయి. మూతికి గుడ్డ కట్టకునే జైనులకు ఆ గుడ్డ గుండా వెళ్ళే సూక్ష్మజీవుల సంఖ్య తెలియదు అని ఎద్దేవా చేస్తారు. నోబెల్‌ బహుమతి గ్రహీత బాబీ మార్షల్‌ కథనం స్ఫూర్తిదాయకం. అక్కడక్కడా మతవాదుల వాదనలపై చెణుకులు తళుక్కున మెరుస్తుంటాయి.

ఈ గ్రంథం చిన్నదిగా అనిపించినా దీని కోసం రచయిత పడిన శ్రమ, వెలువరించిన వ్యాసాల విలువ అమూల్యం. జన్యువుల గురించి వ్యాసాలు రాసేటప్పుడు ఒక సమస్య వస్తుంది. అనువంశికతకు ప్రాముఖ్యతనివ్వడం, పరిసరాలకు ప్రాముఖ్యత తగ్గించడం జరుగుతుంది. ఇలా జరిగితే అవతలి గ్రూపు రెచ్చిపోతారు. ”అణగారిన వర్గాలు వెనకబడడానికి వారి జన్యువులే కారణం అని, తెలివితేటలు అగ్రవర్ణాల సొత్తు”‘ అంటూ కొందరు వాదిస్తారు. పై వాదనలన్నింటినీ ”అణచివేతకు గురికావడం జన్యులోపమా?” అన్న వ్యాసంలో రోహిణీ ప్రసాద్‌ ఖండించడం గమనార్హం. సమాజ గమనంలో సామాజిక శక్తికే ఆయన పెద్దపీట వేసారు. ఒకేసారి రాసినవి కాకపోవడం వలన పునరుక్తి దోషం వుంటుంది. అయినా అది పాఠకుడికి ఇబ్బంది గాదు.

ముందుమాటను కూడా పుస్తకంలో భాగంగా గుర్తిస్తే మూఢనమ్మకాలను తొలగించి శాస్త్రీయ దృక్పథాన్ని నెలకొల్పడానికి ఇలాంటి రచనలు ఎంత అవసరమో చక్కగా ముందుమాటలో వివరించిన పి.భాస్కరరావుగారు అభినందనీయులు. ఇంత చక్కటి గ్రంథాన్ని ప్రచురించినందుకు జనసాహితిని ప్రశంసించవలసిందే. డా||రోహిణీ ప్రసాద్‌ గారు ఆశించినట్లే వరికొందరు రోహిణీ ప్రసాద్‌లు తయారు కావడానికి ఇది తప్పక ఉపయోగపడగలదు. ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన గ్రంథం ”జీవశాస్త్ర విజ్ఞానం – సమాజం”.

జీవశాస్త్ర విజ్ఞానం – సమాజం
జీవశాస్త్ర విజ్ఞానం - సమాజం
రచయిత : డా||కొడవటిగంటి రోహిణీ ప్రసాద్‌
వెల : రూ.50/-
పేజీలు : 210
ప్రతులకు : మైత్రీ బుక్‌ హౌస్‌, జలీల్‌ వీధి,
కార్ల్‌ మార్క్స్‌ రోడ్‌,
విజయవాడ – 520002
ఫోన్‌ : 9848631604

(‘స్వేచ్ఛాలోచన’ మాసపత్రిక నవంబర్ 2008 సంచిక నుండి)

This entry was posted in వ్యాసం and tagged , . Bookmark the permalink.

4 Responses to జీవశాస్త్ర విజ్ఞానం – సమాజం

 1. రఘు says:

  డా||కొడవటిగంటి రోహిణీ ప్రసాద్‌ గారు తన వ్యాసాల్లో సైన్స్ గురించి అందరికి అర్ధం అయ్యే రీతిలో చాలా బాగా వివరిస్తారు. నిజమే ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం… తెలియజేసినందుకు నెనర్లు.

  మరమరాలు

 2. Rohiniprasad says:

  వెబ్ పత్రికల్లో నా వ్యాసాలకు వస్తున్న కొద్దిపాటి lukewarm రెస్పాన్స్ చూసి నేను సైన్స్ వ్యాసాల పుస్తకం ఎవరు కొంటారులే అనుకున్నాను. అయితే 2008 మే 31న ఆవిష్కరించబడిన నా వ్యాసాల సంకలనం వెయ్యి కాపీలూ దాదాపు 4 నెలల్లోనే అమ్ముడైపోయాయని విని నాకే ఆశ్చర్యం కలిగింది. విజయవాడ బుక్ ఫెయిర్ జరిగే సమయానికి కాపీలేవీ మిగలలేదని విన్నాను. రెండో ముద్రణకూ, మరొక సంపుటానికీ ప్రయత్నాలు జరుగుతున్నాయి.

 3. ఎంతమాటన్నారు రోహిణీప్రసాద్ గారూ. మీరు సరళ సుబోధకరంగా రాసే వ్యాసాలలో ప్రజాసాహితి, వీక్షణంలలో వచ్చేవన్నీ నేను తప్పక చదువుతాను. ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాను. రాత పరిణామం గురించి వీక్షణంలో వచ్చిన వ్యాసంపై శ్రీకాకుళంలో చర్చకూడా మా మిత్రుల మధ్య జరిగింది. సైన్సును ఇంత సరళంగా తెలుగులో చెప్తున్న రచయితలు ఒక చేతివేళ్లకంటే చాలా తక్కువ. ఈ పరిచయ వ్యాసం బాగుంది. పొద్దుకు అభినందన.

 4. అవును, ఈ వ్యాసాలు మెప్పించేవిగా ఉంటై, ప్రజాసాహితిలో కొన్నిటిని చదివాను. రోహిణీప్రాసాద్ అభినందనీయుడు.
  ఈగ హనుమాన్ (nanolu.blogspot.com)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *