– డి. రామచంద్ర రాజు
జీవితాన్ని వస్త్రంలా చిలక్కొయ్యకు తగిలించకు
మాసిపోతుందని మరీ… భద్రంగా దాచకు
ప్రమాదాల ముంగిట్లో మురిపాలాడనీ
ప్రమోదాల కౌగిటిలో ముచ్చటలాడనీ
ఎంతగా పైకెగసిన అలయైనా తిరిగి పడక తప్పదు
ఎంత భాగ్యం ఇంటనున్నా మృత్యుకౌగిలి వీడిపోదు
జీవితమంటే నిలకడాగాదు నిబద్ధతాగాదు
జీవితమంటే అవిశ్రాంత నిర్ఝర ఝ్ఝరీ విహారం
అవిక్రాంత యుద్ధభేరీ శంఖారావం –
జీవితమంటే భక్షణమూ కాదు వీక్షణమూ కాదు
జీవితమంటే జ్ఞానాజ్ఞాన విచక్షణా జాలం
దృశ్యాదృశ్య సాదృశ జాలం
జీవితమంటే మురిపెమూగాదు ముచ్చటాగాదు
జీవితమంటే తిక్త మధురముల జమి
భవానుభవాల రమి
————
పుస్తక పరిచయం: ఈ కవిత డి.రామ చంద్ర రాజు గారి కవితాసంపుటి “స్వప్న సత్యం” లోనిది. 32 కవితలున్న ఈ కవితా సంపుటిలో “స్వప్న సత్యం”, “కళ్లల్లో సెలయేళ్లు”, “హృదయంలో ఉప్పెన”, “మౌనం”, “అమ్మి”, “నత్తగుల్ల” మొదలైన కవితలున్నాయి. ఈ కవితల గురించి ప్రఖ్యాత కవి, కథారచయిత పాపినేని శివశంకర్ ఇలా అన్నారు:
“మంచి కవితలు రాశారు. ముఖ్యంగా ‘స్వప్న సత్యం’ నేను రాసి ఉండకూడదా అనిపించింది. ‘స్వప్న సత్యం’లోని భావచిత్రాలు – ఉపచేతనను ఉపరితలం మీదికి రప్పించి వ్యాఖ్యానించిన తీరు నాకెంతో నచ్చింది.” (From the blurb)
“స్వప్న సత్యం” కవితా సంపుటి
వెల: చదివి కట్టండి చూద్దాం.
చదివే తీరిక లేదంటే ఏం చేస్తాం పాపం!…
ఓ యాభై పెట్టండి చెప్తాం… థ్యాంక్స్.
ప్రతులకు: శ్రీమతి డి. సుజాత
డోర్ నంబర్: 4-6-25, మిద్దె మీద,
రిజర్వాయర్ కాలనీ,
తిరుపతి.
ఫోన్: 9849904514.