సమీక్షకులు: స్వాతి కుమారి
నాగుమణి నవ్వింది – కథాసంపుటి
రచయిత – డి. రామచంద్ర రాజు
ఈ సంపుటిలో మొత్తం పది కథలున్నాయి. అన్నీ వివిధ పత్రికల్లో ప్రచురించబడినవే. ఈ కథల్లో, సగటు మనిషి బలహీనతలు, మధ్యతరగతి జీవితంలోని కష్టనష్టాలు, వానలు కురవక, బ్రతకటానికి చావటానికీ దిక్కు తోచని రైతుల దుస్థితి.. ఇలా చాలా వరకూ వాస్తవ జీవిత చిత్రణలే ఉన్నాయి. కథ చివర్లో అద్భుతమైన మలుపు తిరిగి కష్టాలు గట్టెక్కటం, మనుషుల్లో అకస్మాత్తుగా మార్పు రావటం లాంటి ప్రయోగాలు చాలా తక్కువనే చెప్పాలి. ఇక ఒక్కో కథనూ విడిగా పరిచయం చెయ్యాల్సి వస్తే..
“ఈ ప్రపంచంలో మనిషి బ్రతకాలంటే పవరు గావాల. ధైర్యమనుకో, బలమనుకో, తెలివనుకో!” ఒక గొప్ప జీవిత సత్యాన్ని చాలా సులువైన రీతిలో చెప్పారు “పవర్” అనే కథలో. డబ్బు, తెలివితేటలు ఏమీ లేని తల్లిదండ్రులు అడుగడుగునా మోసపోవటం చూసి కొడుకు దొంగగా మారే కథ ఇది.
“కన్నీటి వాసన” కథలో వానలు కురవక, వేరే దారి లేకా నీరు పోసి పెంచిన చెట్లను కట్టెలుగా మార్చి అమ్మాల్సిన పరిస్థితిలో రైతు పడే ఆవేదన, ఆ పరిస్థితులతో ఏ మాత్రం సంబంధం ఉన్నవాళ్ళకైనా కంట తడి పెట్టిస్తుంది.
“తృప్తి” అనే కథలో ముసలి తాతని నిర్లక్ష్యం చేస్తున్న తల్లిదండ్రులకి చదువుకున్న కొడుకు బుద్ధి చెప్పడం మనం కొన్ని చోట్ల విన్న కథల్లాంటిదే ఐనా, తాతా మనవళ్ళ మధ్య అనుబంధం, చివర్లో మనవడు ఆవేశంగా స్పందించటం లాంటి అంశాలు కథలో జీవాన్ని నింపాయి. కాకపోతే ఇతివృత్తానికీ కథ పేరుకీ ఉన్న సంబంధం ఏమిటో అర్థం కాలేదు.
“చీకటి సవ్వడి” అనే కథలో కువైట్‌లో పని చేసి, కుటుంబాన్ని గట్టెక్కించాలని వెళ్ళిన వారి వెతలు, ఎండమావులను నమ్మినవాళ్ళ జీవితాల్లో ఎదురైన దుష్పరిణామాలు అతి సహజమైన సన్నివేశాలతో చిత్రీకరించిన విధానం చూస్తే, ఇదే నేపథ్యంలోని కొన్ని వాస్తవ గాథలు రచయితని ఈ కథ రాయటానికి పురిగొల్పి ఉంటాయేమో ననిపిస్తుంది.
ఫ్యాక్షనిజాన్ని హీరోయిజంగా చూపించే సినిమాలకి అలవాటు పడిపోయాం మనం. కానీ ఒక ఫ్యాక్షన్ నాయకుడి వద్ద విశ్వాసపాత్రులైన అనుచరులుగా పనిచేస్తూ దాని విషపు కోరల్లో బలైపోయిన బడుగు జీవులు తమ నాయకుణ్ణే అంతం చేసే కథ, “ఏటిదరి మాను”. తాము నాశనమవుతూ వినాశనాన్ని సృష్టిస్తున్నామని కనువిప్పు పొందటం ఈ కథ లోని మంచి అంశం. అసలు ఫ్యాక్షన్ ఆధారిత కథలతో సినిమాలు రావడం మొదలవకముందే ఫాక్షన్ సమస్యకు వినూత్న పరిష్కారాన్ని చూపిన ఈ కథకు 1997లో న్యూజెర్సీ తెలుగు కళాసమితి, రాజ్యలక్ష్మి ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీలో తృతీయ బహుమతి లభించింది.
“చెమట చిత్తరువు” కథలో తాము ఉన్న వాస్తవ పరిస్థితులు మనవడికి వివరించి చెబ్తాడు తాత. అప్పటిదాకా కులాసాగా చదువు, కథల్లో మునిగి ఉన్న కుర్రవాడికి తను పని చేసి కుటుంబాన్ని ఆదుకోవలసిన అవసరం గుర్తింపుకు వస్తుంది. తమకు ఉన్న ఆఖరి అవకాశంగా పొలంలో చెట్లను కొట్టి పట్నంలో అమ్మబోతారు ఇద్దరూ. అప్పుడు వారికి అడుగడుగునా ఎదురైన మోసాలు మనవడ్ని అవేశానికి గురిచెయ్యటం ఈ కథలోని విషయం. ఈ కథ సాహిత్య నేత్రం ప్రథమ జన్మదిన ప్రత్యేక సంచిక (ఏప్రిల్ – జూన్ 1996), చీరాల సాహితీ వేదిక నిర్వహించిన కథల పోటీలో తృతీయ బహుమతి పొందింది.
ఇక పుస్తకం పేరుగా ఉన్న కథ “నాగుమణి నవ్వింది” కథ.. తాను ప్రేమించి, ధైర్యం లేక పెళ్ళి చేసుకోలేకపోయిన అమ్మాయి అత్తవారింట కట్నం కోసం ఇబ్బంది పడుతోందని తెలుసుకుంటాడు అతను. ఆ డబ్బు సంపాదన కోసం ఆమె ఎంచుకున్న మార్గం తెలుసుకుని నివ్వెర పోతాడు. ఈ కథలో నాటకీయత పాలు కొంచం ఎక్కువగా కనిపించింది. తన సమస్యకి నాగుమణి ఎంచుకున్న పరిష్కారం, సామాజిక విలువల్ని ధిక్కరించిన తర్వాత కూడా తిరిగి ఆమె అత్తవారింటికి వెళ్ళి కష్టాలు పడటానికి సిద్ధమవటం ఒకదానికొకటి విరుద్ధంగా అనిపిస్తాయి.
“ద వెయిట్” అనే కథ కూడా పరోక్షంగా వరకట్నం గురించే. అందమైన ఒక పేద అమ్మాయితో ప్రేమ సాగించి ఆమెకి తెలియకుండానే మరో పెళ్ళి చేసుకునే పాత్ర శశికాంత్‌ది. తనకి తెలిసిన ఒకమ్మాయి డబ్బున్న అబ్బాయిని వల్లో వేసుకుంది అని భావించే హిమ తను మాత్రం శశిని నిజంగానే ప్రేమించాననుకోవటం, అతని బైక్ అలవాటయ్యాక బస్ ఎక్కటం విసుగ్గా ఉందనుకోవటం బహుశా ఆమె లోని ద్వంద్వ ప్రవృత్తిని చిత్రీకరించటానికి రచయిత చేసిన ప్రయత్నం కావచ్చు.
“గుండె చప్పుళ్ళు” అనే కథలో గయ్యాళి నాగమ్మ తోటలో మామిడి కాయలు దొంగతనం చేసిన చిన్నారి అక్కాతమ్ముళ్ళు ఆమెకి దొరక్కూడదని చేసే ప్రయత్నాలు ఉత్కంఠను రేపగా చివర్లో అంతటి గయ్యాళిలోనూ మరుగున పడ్డ మానవత్వాన్ని, ఆర్తిని రచయిత విజయవంతంగా ఆవిష్కరించగలిగారు.
“ఇదిగో ఇక్కడిదాకా” – ఇది కథనం పరంగా మంచి కథ అని చెప్పవచ్చు. శ్రీలక్ష్మి, తిరపతి మద్రాసు నుంచి పారిపోయి నందలూరు వస్తారు. ఆమె దగ్గరున్న బంగారమంతా పెట్టుబడిగా పెట్టి వ్యాపారంలో నష్టపోతారు. తిరిగి మద్రాసు వెళ్ళిపోదామనే అతని ప్రతిపాదన ఆమెకి నచ్చదు. వేరే చోటికెక్కడికైనా వెళ్దామని ఆమెని నమ్మించి రైల్వే స్టేషనులో వదిలి వెళ్తాడు తిరపతి. అప్పట్నుంచి ఆమె పిచ్చిదై అక్కడే కాలం గడుపుతుంటుంది. చివరికి అతని మరణ వార్త వినగానే ఆమె కూడా చనిపోతుంది.
మొత్తమ్మీద ఈ కథల్లో సహజత్వం ఉంది. అనుభవాల్లోంచి నేర్చుకున్న సత్యాలు, ప్రకృతితో మనిషి అవసరం, అనుబంధం పల్లె జీవితంలోని మట్టి వాసన కథలకి చదివించే గుణాన్ని చేకూర్చాయి. ఆదర్శవంతులైన హీరోలు, కర్కోటకులైన ప్రతినాయకులు, సమస్యలకి ఐడియల్ సొల్యూషన్లు లాంటి టెక్నిక్‌లు లేకుండా, రచయిత నిజాయితీగా తనకు తెలిసిన జీవితాలను ఆవిష్కరించడం కనిపిస్తుంది. “ఆశ అరవైనాళ్ళు, మోహం ముప్ఫైనాళ్ళు” లాంటి రాయలసీమ నుడికారము, ఆ ప్రాంతానికి చెందిన మాండలికం ఈయన కథల్లో విరివిగా కనిపించి రచయితకి తన నేలతో పెనవేసుకుపోయిన అనుబంధాన్ని తేటతెల్లం చేస్తాయి.
ఈ పుస్తకం వెల ఎంతో నేరుగా చెప్పకుండా “చదివి కట్టండి చూద్దాం.” అని ప్రకటించడంలో తన కథల మీద ఆయనకున్న ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది.
నాగుమణి నవ్వింది కథాసంపుటి
రచయిత: డి. రామచంద్ర రాజు
ప్రతులకు: శ్రీమతి డి. సుజాత
డోర్ నంబర్: 4-6-25, మిద్దె మీద,
రిజర్వాయర్ కాలనీ,
తిరుపతి.
ఫోన్: 9849904514
వెల: చదివి కట్టండి చూద్దాం.
తీరిక లేదా? పెట్టండి ఓ వంద… థ్యాంక్స్!
స్వాతి కుమారి పొద్దు సంపాదకవర్గ సభ్యులు
Pingback: sonson
Nice…