రెండ్రెళ్ళు ఓసారేసుకో, దినకర్ని ఆరేసుకో, విరగబూచిన నవ్వులు ఏరేసుకో

పూర్ణిమ తమ్మిరెడ్డి

అది హైదరాబాదులో ఒక శనివారం (ఆదివారం అయితే ఎఫెక్టు బాగుండేది, కానీ అది శనివారమే..ప్చ్!) అమావాస్య అర్థరాత్రి. అంతటా చిమ్మచీకటి-నిశ్శబ్ధం!! ఒక ఇంట్లో, ఒక గదిలో, ఒక లైటు వెలుతురులో ఇద్దరు కిందపడి మెలికలు తిరుగుతున్నారు. ఇద్దరూ ఒకటే బాధలో ఉన్నారు.. ఆయాసపడుతూ, రొప్పుతూ, దగ్గలేక, గొంతు నుండి మాట రాక, కళ్ళల్లో నీళ్ళు ఆపలేక, కూర్చోలేక, పడుకోలేక నానా అవస్థా పడుతున్నారు. అంతలో ఆ గది తలుపు “కిర్ర్..ర్ర్..” మంటూ తెరుచుకుంది. వారిని ఓసారి కసిగా చూసి, నిర్దాక్షిణ్యంగా “ఇంత అర్థరాత్రి, బుద్ధుందా?” అని అడిగిందా గొంతు. పాపం, బుద్ధికేం ఇద్దరి దగ్గరా టన్నులకొద్దీ ఉంది, కానీ వారిని పూనిన “నవ్వు”కి మాత్రం ఏ మొహమాటాలూ లేవు. మూమూలుగానే, నవ్వుతో చెప్పలేని తంటా.. ఇంక అది “రెండు రెళ్ళు ఆరు” రూపంలో వచ్చిందంటే అర్థరాత్రిగానీ, అపరాత్రిగానీ, ఆపమన్నది నాన్నవనీ, అమ్మవనీ.. విరగబడి, పగలబడి, కింద పడి, మతి చెడి, పడీ పడీ నవ్వుకుంటూనే ఉంటామన్నది నా స్వానుభవం. తెలుగు బ్లాగులతో ఏ మాత్రం పరిచయం ఉన్నా ఇది మీ అనుభవం కూడా అయ్యుంటుందని అని ఖచ్చితంగా చెప్పగలను.

2x2=6

దీన్ని సమీక్షన్న వారిని..
మరీ హింసాత్మక నిర్ణయాలు అవసరమంటారా? ఇది సమీక్ష కాదు, “సమీక్ష కాని సమీక్ష” అసలే కాదు. “మీకు నచ్చిన ఓ బ్లాగు గురించి రాయుము” అని అడిగితే, ఆ రాతకి మార్కులు, గ్రేడింగులూ లేవని తెలిస్తే అది ఈ వ్యాసంలా ఉంటుంది. ఈ వ్యాసం ఇలా బయటకు రాకూడదని నా మెదడు చాలానే కుట్రలు చేసింది. “నవ్వద్దు అనే కొద్దీ నవ్వటం, ఏడుపాపనే కొద్దీ ఏడ్వటం” తప్ప నాకే అర్హతలు లేవని వెక్కిరించింది. “నా మాట విని ఈ రి-వ్యూ గోల వదిలెయ్, నీ రేర్-వ్యూ కాస్తా తోటరాముడి కన్నెర్రకు గురైందనుకో దినకర్‌తో పాటు నువ్వూ “ఫేం” లేకుండా ఫేమస్ అయిపోతావ్. అదే చాలా నయం, ఆంధ్రదేశంలో అభిమానుల గురించి మళ్ళీ చెప్పాలా? అయినా రాస్తాననే అంటే.. నీ ఖర్మ” అని బెదిరించింది. చెప్పొద్దూ.. నాకు భయం వేసింది. నా మీద ఎన్ని కుట్రలు జరుగుతున్నా / జరగబోతున్నా మీరున్నారనే నమ్మకంతో వాటిని అధిగమించి ఇదో.. ఈ చిట్టి ప్రయత్నం చేశాను. “రెండు రెళ్ళు ఆరు”ని పరిచయం చేయాలంటే, ఆ లంకెను తెలియజేస్తే చాలంతే, అటు తర్వాత ఆ బ్లాగే చూసుకుంటుందన్నీ. మీకిప్పటి వరకూ ఆ బ్లాగు తెలీకపోతే వెళ్ళి నవ్విరండి ముందు. ఇప్పటికే ఆ బ్లాగును తెలిసిన వారు ఈ వ్యాసాన్ని తోటరాముడి ఇంగ్లీషు బ్లాగు టాగ్‌లైన్‌లా “The Table is set!” అనుకోవచ్చు. కాసేపు కబుర్లు చెప్పుకుందాం ఈ బ్లాగు గురించి.

… బినీతతో డ్యూయెట్లకి సిద్దమయిపోయారంటే అది ఆషామాషీ వ్యవహారం కాదు. వచ్చిన సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తూ సమయం వృధా చేసుకోకుండా, తెలివున్న దినకర్ స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసి వాణిజ్య మార్కెట్టులో ఓ పెను భూకంపాన్ని సృష్టించారు.

అసలెవరీ తోటరాముడు?
“ఎవరు? ఎవరిని ఎవరు అని అడుగుతున్నారో తెలుసా? ఎవరి పేరు చెప్తే..” అంటూ తోటరాముడి గురించి అనర్గళంగా అరగంట మాట్లాడేస్తాననుకున్నా; నాకే ఈ ప్రశ్న ఎదురయ్యేసరికి అవాక్కై నోరెళ్ళబెట్టాను! బ్లాగ్లోకంలోకి కొత్తగా వచ్చిన వారికి కూడా తోటరాముడు తెలీటం కాస్త కష్టమేమో అనిపించటానికి కారణాలు: 1) బ్లాగుల వాతావరణంలో తోటరాముడి నవ్వుల జడివాన, మరీ చెన్నైలో వానలా మారటం
2) తోటరాముడు పండించిన నవ్వులు బ్లాగ్లోకమంతటా వీరవిహారం చేసినా, తోటరాముడు తన తోట వదిలి విహారానికి వచ్చిన దాఖలాలు తక్కువ కావటం.
“బ్లాగ్లోకంలో హాస్యపు రారాజంటే తోటరాముడు! హ్యూమర్ అనే (క్రికెట్) పిచ్ మీద పిచ్చ కొట్టుడు కొట్టే వీరుడు తోటరాముడు! తేలికైన పదాలతో తనకు మాత్రమే సొంతమైన సెన్స్ ఆఫ్ హ్యూమర్ ని పంచిపెట్టే హాస్యకర్ణుడూ”, “కామెడీ కింగూ” లాంటివి నాలాంటి పంకాలు బాగానే చెప్తారు కానీ..”అసలెవరీ తోటరాముడు” అంటే ఎవరికీ ఎక్కువ తెలీదు! అయినా కనిపించని దేవుడి కోసం ప్రత్యేక పూజలు చేస్తున్నారని వినికిడి. అలాంటి పూజలూ, వ్రతాలూ లేకుండానే గౌతం గారు ఈ వ్యాసం కోసం నేనడిగిన కొన్ని ప్రశ్నలకి జవాబులిచ్చారు. వాటిని విడిగా వేరే చూద్దాం. (ఊహు.. స్ర్కోల్ బార్ వల్ల లాభం లేదు!)

బ్లాగు నామకరణం విషయంలో కాస్త మొహమాటపడి పెట్టినట్టున్నారు. “రెండు రెళ్ళు ఆరు” అని వినమ్రంగా అంటారేగానీ, అసలు మొదలంటూ పెట్టగానే “రెండు రెళ్ళు ఆరొందలు” అనిపిస్తారు. మనమేమో హిహిహి.. హహహ.. ఒహొహొ..అబ్బబ్బా..ఉహహ.. అంటూ ఒప్పేసుకుంటూంటాం.

ఈ తోటరాముడు మన దినకర్ ఫ్రెండ్ కూడా! 😉
ఇప్పుడు మీకర్థమైపోయుండాలి, తోటరాముడి “సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ”! మన బ్లాగ్లోకంలో బ్రహ్మానందమంత క్రేజ్ ఉన్న దినకరున్నూ, ఈ తోటరాముడున్నూ ఓ.. తెగ ఫ్రెండ్స్! తెగ అంటే ఒకే జాతనేసుకునేరు.. ఇద్దరూ చాలా తేడా. అయినా అలా కలిసిపోయారంతే! అబ్బే.. “తేడా” అనగానే తేడాగా మొహం పెట్టక్కర్లేదు. తేడా అంటే తెలుగు సినిమా వాళ్ళు చెప్పుకోరూ.. “మా సినిమా చాలా డిఫరెంటూ, ఇప్పటి వరకూ ఇలాంటి కథ రాలేదు” అనీ -అలాగన్నమాట! నిజమేటంటే.. సూర్యుడికి మేఘంలాగా, అగ్నికి నీరులాగా, పువ్వుకు తుమ్మెదలాగా, గౌతం పాలిటి దినకర్ లాగా! అన్నమాట!

తెగేంటి? తేడా ఏంటి? మధ్యన సూర్యుడు, తుమ్మెద ఏంటి? అని మీరు జుట్టుపీక్కోక ముందే, ఇదో.. నవ్వులతోటలో తోటరాముడికి జతగాడై ఓ వెలుగు వెలుగొందుతున్న “దినకర్” (ఊహాత్మక) కథ, ఈ బ్లాగు ప్రస్థానంలో:

మారెళ్ళ దినకర్ అంటే తెలుగు బ్లాగ్లోకంలోని వారికి బ్రహ్మానందం. సినీజగత్తులో సార్థక నామధేయులు బ్రహ్మానందంలానే, ఈ “దినకర్” కూడా గుర్తుకు రాగానే కారణం లేకుండానే నవ్వు వచ్చేస్తుంది. తెలుగు పదాలకు అందని “అమాయకత్వానికి” పర్యాయపదంగా అచిరకాలంలోనే (ఇన్)ఫేమస్ అయ్యి.. పోకుండా ఉన్నారు. నిత్యం చూసే జీవితాల్లా కాక, ఎంతో ఎత్తుకు ఎదిగిపోయిన దినకర్ కూడా చిన్నా చితకా పాత్రలు పోషించేవారు! మొదటి అవకాశం కోసం చాన్నాళ్ళు వేచి చూడాల్సి వచ్చింది. దినకర్ సామాన్యులు కారు, మహర్జాతకులు! (..దినకర్ జాతకం ఓ జ్యోతిష్యుడు ఇలా రాసాడు: చదువు – అద్భుతం; ధనం – అద్భుతం; కళ్యాణ యోగం – అద్భుతం (conditions apply)). పరీక్షల్లో కాపీ చేయడానికి చీటీలందిస్తూ తెచ్చుకున్న పేరుతో ఓ సినిమా తీయాలని డిఫరెంటుగా ప్రయత్నించారు. దేవుడికే దడ పుట్టి, చెవి మెలి వేయడంతో (పనిచేయని) మెదడు నరాలు వెరైటీ కోసం దెబ్బతిని, పిచ్చాసుపత్రి పాలై, చాకచక్యంగా అక్కడ నుండి తప్పించుకుని మద్రాసులో మంచుపడుతుందన్న జనరల్ నాలెడ్జ్‌తో స్వెటర్ల వ్యాపారాన్ని మొదలెట్టారు. పోలీసుల కుట్ర కారణంగా అది దివాళా తీసినా, విశ్వమానవాళి శ్రేయస్సు కొరకై ఎన్నో చీకటి రహస్యాలను ఛేదించుకుని, “కరిచే మనిషి మొరగడు” అనే నూతన సత్యాన్ని ఆవిష్కరించారు. సామాన్య వెర్రితనం నుండి, ఒక్కో మెట్టూ ఎక్కి విశిష్ట వెర్రితనానికి చేరుకున్నారు.

అదృష్టం తలుపుతట్టదూ?; “నేను రా.. నీ ఎంకమ్మా” అంటూ ఒక ఫోన్ కాల్‍ చేసి మరీ “బ్రేక్” ఇస్తుందనేలా ఒక మూడేళ్ళదాకా సా..ఆ..ఆ..ఆ..గే ఫుల్ లెంత్ కారెక్టర్ సొంతం చేసేసుకుని, బినీతతో డ్యూయెట్లకి సిద్దమయిపోయారంటే అది ఆషామాషీ వ్యవహారం కాదు. వచ్చిన సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తూ సమయం వృధా చేసుకోకుండా, తెలివున్న దినకర్ స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసి వాణిజ్య మార్కెట్టులో ఓ పెను భూకంపాన్ని సృష్టించారు. రిక్టర్ స్కేలుపైనే 7.8 భూకంపాన్ని కేవలం తన డొల్ల బుర్రతో ఆపివేసిన ఘనత వహించిన సంగతి ప్రపంచంలో మారుమోగిపోయింది. కెరీర్‌లో పైకెదిగిన ప్రతీ గొప్ప వ్యక్తి జీవితాన్నీ గమనిస్తే, వారిలో ముఖ్యంగా వెల్లడయేది ఆరోగ్యం పట్ల తీసుకునే బరువు-బాధ్యత! “బరువు తగ్గటానికి జిమ్ వాళ్ళు ఇచ్చిన పొడిని కంది పొడి లాంటిదే అనుకుని, నెయ్యి వేసుకుని అన్నంలోకి కలుపుకుని తినటం“లో వారి క్రమశిక్షణ, పట్టుదల మనకు తేటతెల్లమవుతాయి. ఇంత విశిష్ట వ్యక్తి, స్నేహానికి ప్రాణం ఇచ్చేసే రకం! ఇండియా-పాక్ క్రికెట్ ఫైనల్ లోని ఫైనల్ ఓవర్లో కూడా తీరిగ్గా చిప్స్ తినగలిగే నిశ్చింత వారి వ్యక్తిత్వాన్ని ప్రస్ఫుటం చేస్తుంది.

దినకర్ జయజయధ్వానాలు అంతటా మారుమోగిపోవటం మొదలయ్యి, కాల్ షీట్స్ ఇవ్వలేనంత బిజీ అవ్వటం వలన “క్షుర ఖర్మ“లో కేవలం ఫోటోతో నెట్టుకు రావాల్సివచ్చింది. తన రీ-ఎంట్రీని ఏకంగా గాల్లో ఆవిష్కరించి, ఆకుపచ్చ క(ప)న్నీరయ్యారు. కొందరు నటిస్తారు, చాలా కొద్ది మంది జీవిస్తారు. వీరు పెద్దగా శ్రమలేకుండానే “నాణ్యమైన వెధవ”, “సైకో సాలేగాడు” అని బిరుదాంకితులయ్యారు ఈ బ్లాగులో. ఫాన్ ఫాలోయింగ్ ఎంతలా పెరిగిందంటే – ఏ వివాహ భోజనంబుకో పేరు మార్చుకుని వెళ్ళినా సరే, జనాలు అతని మొహం గుర్తుపట్టేసేంతగా! ఆఖరికి మైకావిడలు* కూడా. “dinakarqwxyz”, “the nakar” గా ఓ.. పాపులర్ అయ్యిపోతున్నా, తన స్నేహం కోసం గౌతమ్‌కి ఒక పెణ్ణ్ కుట్టిని వెతికిపెట్టాలన్న ప్రయత్నం ప్రస్తుతానికి బెడిసి కొట్టినా, అలాంతివాటికి వెనుదీయని దినకర్ దుస్సాహసాల పర్యవసానంగా మున్ముందు ఏం జరుగుతుందో తెలియాలంటే, ఈ బ్లాగులో దినకర్ గురించి బ్లాగరి తరచుగా బ్లాగుతూనే ఉండాలి, మనం చదువుతూనే ఉండాలి అనిపిస్తోంది.

అదీ ఒక విశిష్ట వ్యక్తి కథనం. చరిత్రలో ఒక్క మగాడు.. మన దినకర్! బ్రహ్మానందం – మన దినకర్! అతడికి “బ్లాగ్ హాస్య రత్న” అవార్డు ఇవ్వాలని డిమాండ్లు మొదలయ్యే కాలం త్వరలో ఉంది.

*మైకావిడలు=మహిళా టివి యాంకర్లకు అచ్చ తెలుగు పదం! (మైక్ తెలుగు పదం కాదంటున్నారా? అక్కడ సంధి, మైకు + ఆవిడ, వివరాలకై తోటరాముణ్ణి సంప్రదించండి)

భాష సరళం – కథ సహజం – శైలి అనితర సాధ్యం:
హీరోల ఎంట్రీలు అయ్యిపోయాయి కాబట్టి “రెండు రెళ్ళు ఆరు”లో అతి ముఖ్య లక్షణాలను ఇప్పుడు చెప్పుకోవచ్చు. ఈ బ్లాగులో సెల్లింగ్ పాయింట్ ఏంటంటే, తెలుగు వాళ్ళకి అత్యంత ఇష్టమైన “హాస్యాన్ని”, చాలా వరకూ తెలుగుకి దూరమైపోయిన తెలుగోళ్ళు కూడా చదువుకోగలిగేలా ఉండటం. బ్లాగులు పరిచయం అవ్వగానే “తెలుగుతో అలవాటు పోయిందబ్బా..” అంటూ దాటేసేవాళ్ళకు కూడా ఈ బ్లాగే “లోకం” అనడానికి కారణం, ఇందులో భాషాసరళత. నిత్యం మనం వాడుకునే పదాలూ, పద్ధతులే ఉండటం వల్ల అందరికీ దగ్గరవ్వటమే కాక, దగ్గరగానే ఉండగలుగుతోంది కూడా! విపరీతంగా జనాదరణ పొందిన బ్లాగుల్లో ఇదీ ఒకటి.

అదేదో సినిమాలో తరుణ్ చాలా సింపుల్గా తేల్చేస్తాడు “అమ్మ, ఆవకాయ, అంజలి..” అంటూ. అలా తెలుగబ్బాయిల ఇష్టాలను కూడా మూడు ముక్కల్లో పెట్టేసే వీలుంటే, మనకిన్ని బ్లాగులూ, ఇన్ని శైలులూ ఉండేవా? “రెండు రెళ్ళు ఆరు”లో తోటరాముడు ఎంత చమత్కారైనా – ఆ శైలి ఎంత అనితర సాధ్యమైనా; వాటి వెనకున్న ఆలోచనలూ, ఆవేశాలూ, ఆనందాలూ, భయాలూ అన్నీ మామూలివే, ఓ పాతికేళ్ళ యువ హృదయపు గుండె చప్పుళ్ళే! పొట్ట చెక్కలయ్యేంతగా నవ్వుతూనే “అబ్బో.. సామాన్యులు కారు వీరెవరో! ఏ జంధ్యాలో, ఏ ముళ్ళపూడి రమణో” అని చదువరులను అతిశయాశ్చర్యాల్లో మునిగితేలేలా చేస్తాయి. ఈ కథావస్తువులు మాత్రం “అరే.. మన అనుభవాలే! నాకూ ఓ సారిలా..” అన్నట్టుంటాయి. తెలుగు బ్లాగుల్లో చాలావరకూ రచనాబ్లాగులు, ఓ సాహిత్య ప్రక్రియను అభ్యసించటమో / ప్రదర్శించడమో జరుగుతుంది. కొన్ని పూర్తి వ్యక్తిగతమైన బ్లాగులు కూడా ఉన్నాయి. “రెండు రెళ్ళు ఆరు” ఎంత రచనా బ్లాగో, అంతే వ్యక్తిగతం కూడా! సామాన్యంగా జరిగే అనుభవాలకు అత్యంత వైవిధ్యమైన దృక్పథాన్ని అందించి హాస్యం పండిస్తారు. వీరి పెళ్ళిచూపుల ప్రహసనం టపా అక్కడా, ఇక్కడా అని లేక, అందరినీ కదిలించింది.

తెలుగు వ్యాప్తికి బ్లాగులను ఆసరాగా చేసుకోదలచినా లేదా బ్లాగులను జనజీవన స్రవంతిలో కలపడానికి చేసే ఏ ప్రయత్నాల్లోనైనా ఈ బ్లాగు కీలకపాత్ర వహిస్తుందని నా నమ్మకం. భాషలో ఎటువంటి సంక్లిష్టత లేకుండా, తేలికైన పదాలతోనే చిర్నవ్వు నుండీ పొట్టచెక్కలయ్యే నవ్వు దాకా తెప్పించగలగడం ఈ బ్లాగు విశిష్టత. బ్లాగ్‌ ‍ప్రపంచానికి ఆవలనున్న వారిని ఈ లోకంలో కట్టుంచే తారకమంత్రం – “రెండు రెళ్ళు ఆరు”

ఇంకేం మరి.. చదివేద్దాం!
“ఇంత చెప్పాక.. ఇక నేనాగలేను, నేనోపలేను” అని ఏక బిగిన ఈ టపాలు చదివేసుకుందామనుకుంటే కుదరదు మరి! ఈ బ్లాగుని ఎక్కడ పడితే, ఎప్పుడు పడితే అప్పుడు, ఎవరితో పడితే వాళ్ళతో చదివితే… దెబ్బతినేస్తారంతే! ఒక్కరమే చదవలేం; ఏడ్చేటప్పుడు తోడున్నా లేకున్నా, నవ్వేటప్పుడు మాత్రం మనతో పాటు ఓ మనిషి ఉండాల్సిందే! ఒక్కరమే కూర్చుని పిచ్చ నవ్వు నవ్వుతుంటే పిచ్చెక్కిందా అని చూడటం లోకం తీరు కదా మరి. అలాగని పక్కనో మనిషున్నప్పుడు చదివామా.. ఇక అంతే సంగతులు!! అసలక్కడి విషయమే ఊపిరి సలపని నవ్వు తెపిస్తుంటే, ఇక పక్కనోళ్ళ నవ్వు కూడా దానికి జతైతే.. నేను ఉపోధ్ఘాతంలో చెప్పినట్టు కిందపడి దొర్లాల్సిందే! ఒకవేళ తోడున్నవారు ఏ తెలుగేతరులో అయితే, మనం నవ్వాపుకోలేక, నవ్వుల మధ్యలో మనమెందుకు నవ్వుతున్నామో చెప్పలేక.. అబ్బో అనుభవించాలంతే! అఫీసులో చదవలేం; ఎస్వీయార్‌లా విరగబడి అట్టహాసంగా నవ్వాల్సిన లైన్లకి పాత సినిమా హీరోయిన్‌లా ముఖం పక్కకు తిప్పుకుని ఓ సన్నని నవ్వేం ఏడుస్తాం? అలా అని తీరిక చేసుకుని మన సామ్రాజ్యంలో కూర్చుని ఈ బ్లాగును నవ్వటం (అదే చదవటం) మొదలెడితే అడ్డూ అదుపూ లేనందుకు ఇంటి కప్పు ఎగిరి, ఇంటోనరు ప్రత్యక్షమవచ్చు. కాఫీరంగులో ఉన్న ఈ బ్లాగు చదువుతూ కాఫీలూ గట్రా తాగుదామనుకంటే, కీబోర్డులూ, బట్టలూ కాఫీ స్వాహా అంటాయి, మనం నోరు కాల్చుకుంటాం. అలాగని ఏమీ తాగకపోతే నవ్వి నవ్వి గొంతెండిపోతుంది. నవ్వితే కడుపు నొప్పి.. నవ్వాపుకుంటే తలనొప్పి! చదవటం పాపం, నవ్వటం ఆపం! “WARNING: Humour may be hazardous to your illness” అన్నది అసలీ పాటికే ఉండాలి ఆ బ్లాగు గుమ్మంలో.

అక్షరాల వెంబడి పరుగు తీస్తూ ఆయాసంగా నవ్వుకోవటం ఒక అనుభవమైతే, చదివింది గుర్తొచ్చి, ఇప్పుడూహించుకుని మరీ నవ్వటం ఇంకో అనుభూతి. నవ్వటం వల్ల ముఖ కండరాలకి మంచి వ్యాయామం అన్నది చాలా మందికి తెలిసిందే, కానీ నవ్వటం వల్ల మొత్తం శరీరానికి “వర్క్-అవుట్” కలుగుతుందనీ, పొత్తికడుపు, ఊపిరితిత్తులు, కాళ్ళు ఇంకా వెన్నుకి సంబంధించిన కండరాలకి వ్యాయామం కలుగుతుందనీ ఈ బ్లాగు వల్లే తెలిసింది. కొత్తల్లో ఓ సారి టపా చదవగానే ఊపిరాగిపోయేంత నవ్వులో కూడా “బాబోయ్.. అసలింత నవ్వచ్చా?” అంటూ గూగుల్ని అడిగాను. పై సమాచారం తెలుసుకునే సరికి కాస్త ఊపిరి ఆడింది. ఏ ఏరోబిక్ క్లాసుకో వెళ్ళినంత అలసట కలుగుతుంది కదా మరి, విపరీతంగా నవ్వేశాక!

“ఇదేదో బాగుందే.. ఇక నుండీ ఇదే మన జిమ్” అని ఫెవికాల్‍లా ఫిక్స్ అయ్యిపోదామనే.. ఆశ, దోశ, అప్పడం, వడ, ఇడ్లీ, పూరీ, సాంబారూ, బిసిబేళా బాతూ, రాగి సంగటి, బార్బీక్యూ..హు!! పైగా ఏడాదిలో మూడు సార్లు మాత్రమే జిమ్‌కెళ్తే ఇక అయ్యినట్టే!

ఎలా రాస్తారండీ బాబూ:
ఆ ప్రశ్న అడగాలనుంది. కానీ చాలా సమయాల్లో అలాంటి ప్రశ్నలకి చిన్ని చిర్నవ్వో, “ఏదో తోచింది రాసేయడమే” అనో, “కీబోర్డ్ తో” అనో ఏవో అసంపూర్ణ సమాధానాలు వస్తాయి. అందుకే కొన్ని ఎలా సంభవించాయన్న దానికన్నా, వాటిని పూర్తిగా ఆస్వాదించడమే మెరుగు. నేను చూసిన ఏకైక బ్రహ్మానందం ఇంటర్య్వూలో “పంచ్‌ల మీద బతకలేమండీ! ఒక మాటకి నవ్వుతారు, రెండు మాటలకి నవ్వుతారేమో కానీ, అస్తమానూ డైలాగుల మీద ఆధారపడితే పని కాదు. ముఖంపై “expressions” లో వైవిధ్యం ఉండాలి. అప్పుడే సఫలం కాగలము” అని చెప్పారు. చూడడం ద్వారా నవ్వు కలిగిన సందర్భాలు కోకొల్లలు, కానీ ఒక రచన చదువుతూ ఇంతిలా నవ్వుకున్న సందర్భాలు నాకయితే చాలా అరుదు. అందులోనూ ఈ బ్లాగులో టపాలు చాలా పెద్దవిగా ఉంటాయి.. అలాంటప్పుడు, ప్రతీ రెండు మూడు లైన్లకో సారి నవ్విస్తూనే ఉంటూ, ఎక్కడా బాలెన్స్ తప్పకుండా రాసుకుంటూ పోవటం ఒక herculean task! హాస్యానికి ముఖ్యమైన ముడిపదార్థాలు చమత్కారం, వైవిధ్యంగా ఆలోచించటం, వ్యంగ్యం, నిష్ఠూరం, అపహాస్యం, నిందలతో పాటు జీవితాన్ని సునిశితంగా పరిశీలించటం కూడా కావాలి. ఏది ఏకాస్త శృతి మించినా నవ్వులపాలు కావాల్సివస్తుంది. ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుంది. ఉదా: దూలదర్శన్ టపాలో దూర‍దర్శన్‌ను విమర్శించినందుకుగాను ఆ నోటా, ఈ నోటా అసహనం వ్యక్తమయ్యింది. కామెంట్ల సెక్షన్‌లో వాటికి ఎలాంటి సమాధానమిచ్చే ప్రయత్నం చేయలేదుగానీ, ఆ తర్వాత మాత్రం ఎక్కడా పునరావృతం కాలేదు.

దిల్ మాంగే మోర్:
A1 క్వాలిటీ బ్లాగుల్లో ఒకటైన ఈ బ్లాగు, బహుశా మోస్ట్ కంప్లెయిన్డ్ బ్లాగుల్లో ఒకటి అయ్యుండచ్చు. “టపా టపాకి మధ్య ఇంత వ్యవధా”, “కాస్త విరివిగా రాయండి”, “నాకీ డోసు సరిపోవటం లేదు“, “నవ్వలేక చచ్చా..ఇలా నవ్విస్తే ఎలా?”, “రాస్తావా? కుమ్మమంటావా?” అంటూ ఇంకా నవ్వించమని కొన్నీ.. “నన్ను పని చేసుకోనివ్వవా?”, “మరీ ఇంత హాస్య రాక్షసులేటండీ బాబు?”, “యాహూ వాడి స్మైలీలు సరిపోవటం లేదనీ“, “నవ్వి నవ్వి జ్వరం ఎక్కువైతే కోర్టులో కలుద్దామనీ” అంటూ నవ్వించినందుకుగాను మరికొన్ని. కారణాలేవైనా ఈ బ్లాగులో తక్కువ టపాలున్నట్టే లెక్క. వాటిని వీలైనంతగా పెంచమన్నది మాత్రం అందరి డిమాండూ!

(పనిలో పని నా కంప్లెయింట్స్ కూడా: నా టపాల్లో అచ్చుతప్పులు చూసుకోడానికి కూడా బద్ధకం వేసి చదవను. ఈ టపాలు మాత్రం చదువుతూ గంటలు గంటలుండిపోతా. I don’t visit this blog, I dwell in it. ఈ బ్లాగులో టపాలెప్పుడూ మాకు “నెట్” లేనప్పుడే వస్తాయి. నేను నిద్రలేచేసరికి అధమం ఓ ఇరవై కామెంట్లుంటాయి. అదీ సరిపెట్టుకోవచ్చు కానీ, మా ఇంట్లో ఒక్కరూ నా బ్లాగు మొహం చూసిన పాపాన పోలేదు. పేరు కూడా తెలీదు. అప్పుడప్పుడూ వచ్చి మాత్రం, “గౌతమ్ బ్లాగులో కొత్తవేవైనా ఉన్నాయా?” అంటూ ఆరా తీస్తారు. ఇది ఓ తెలుగింటి ఆడపడుచుకి జరుగుతున్న ఘోరమైన అవమానంగా పరిగణిస్తున్నామధ్యక్షా!)

అన్నీ నా వల్ల కాదు బాబు:
ప్రతీ టపాని పరిచయం చేద్దామనుకున్నాను గానీ, అదెంత వెర్రి ప్రయత్నమో ప్రయత్నించే దాకా తెలీలేదు. ఒక్కో పోస్టు చదువుతూ “నవ్వొచ్చే లైన్లు” కాపీ పేస్ట్ చేసుకుని, వాటికి నా వ్యాఖ్యానాన్ని అందిద్దాం అనుకుని మొదలెడితే, పోస్టులకు పోస్టుల్నే కాపీ చేసుకుంటూ పోయాను. అప్పుడా వ్యాసం పేరు కాస్తా “ఇప్పుడు పొద్దులో కూడా రెండు రెళ్ళు ఆరు టపాలు” అని పెట్టాల్సి వచ్చేలా ఉందని విరమించుకున్నాను. కాపీ చేసుకున్నవాటిలో ఎస్.ఎం.ఎస్ పోల్ పెట్టి, వోట్లు ఎక్కువ వచ్చిన వాటిని పెడదామనుకున్నా. చిన్నప్పుడు నేర్చుకున్న “ఇంకీ-పింకీ” ఉండగా ఇవ్వన్నీ వ్యర్థమనిపించి ఇక్కడ నాకు నచ్చినవి కొన్ని:

“అమ్మా…సాంబార్ ఏలా చేస్తారు?”
ఎవరు?” అడిగింది అమ్మ
(అవాక్కయితే నోరెళ్ళబెట్టుకునే కాదు, నొప్పుంటేంత వరకూ నవ్వుతాం కూడా!)

కాలర్: నిన్న నాకు జ్వరంగా ఉంటే డాక్టర్‌కు చూపించాను సార్
శాంతి స్వరూప్: అలాగా…మరి డాక్టర్ ఏమన్నాడు
కాలర్: జ్వరమొచ్చిందన్నాడు
(ఇప్పుడు కాలర్ “జ్వరమొచ్చింది” అని చెప్తాడు అన్నది నా మైండులో రిజిస్టర్ అయిపోయినా కూడా నవ్వు వస్తుందెందుకో!)

అజీత్ అగార్కర్ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక చిన్న సర్వే…..
అజీత్ అగార్కర్ మంచి బౌలర్ అని అనుకునే వాళ్ళంతా చేతులు పైకి లేపండి (ఎవడా మూల చెయ్యి లేపింది…రే అజీత్ అగార్కర్‌గా… దించరా చెయ్యి)

అందుకే మొదటి సారే ఆచి తూచి బయొడాటా తయారు చేసుకోవాలి. “సిగరెట్టు, మందు అలవాటు లేదు” లాంటి చిన్ని చిన్ని అబధ్ధాలు పరవాలేదు కానీ “నేను అందంగా ఉంటాను.. రోజూ ఎక్సరసైజు చేస్తాను…అజీత్ అగార్కర్ బౌలింగ్ బాగా వేస్తాడు“… లాంటి పచ్చి బూతులు రాయకూడదు…అసలుకే మోసం వస్తుంది.

(దినకర్ ఉన్నాడు కాబట్టి సరిపోయిందిగానీ, లేకపోతే మన నవ్వుల్లో కొట్టుకుపోయేవాడు అగార్కర్! బైదవే, దినకర్-అగార్కర్ ప్రాస కూడా కుదిరింది! ఏదేమైనా దినకర్‍ది శాంతి స్వరూపుల్ని, అగార్కర్లని దాటుకొచ్చిన ఘనత మరి. ఓ సారి జై కొట్టండిలా!)

అప్సరసల్లో ఒక అత్యద్భుతప్సరస నా దగ్గరకు నడిచి వచ్చి…”Let me help you sir” అని నా బ్యాగు తీసుకుని పైన పెట్టింది…”Do you need anything else sir” అని అడిగింది….“Yes…నీ ఫొటో, జాతకం, గోత్రం, నక్షత్రం, రాసి ఇస్తే మా అమ్మకు చూపించి నిన్ను పెళ్ళిచేసుకుంటా” అని అనాలని మనసంతా ఉన్నా…ఇంత మందిలో అడిగితే సిగ్గుపడుతుందని…”నా బ్యాగు మళ్ళీ తీసి ఇవ్వరా” అని అడిగాను. కాబొయ్యే భర్త మాట ఎలా కాదంటుంది…బ్యాగు తీసిచ్చి వెళ్ళిపోయింది.
(ఈ అబ్బాయిలున్నారే…!!!)

“నా పేరు దినకర్” అన్నాడు..
“స్పెల్లింగ్ చెబుతారా?” అడిగిందా అమ్మాయి..
“Dinakarqwxyz” అన్నాడు మావాడు..
“అదేంటండి??”
దినకర్ గాడు టేబుల్ మీదకెక్కి కూర్చుని, తన సన్ గ్లాసెస్ ముక్కు మీదకు జార్చి – “నా పేరులో చివరి ఐదక్షరాలు సైలెంట్…..ఒక వేళ మీకు కష్టమనిపిస్తే ‘The nakar‘ అని రాసుకోండి” అన్నాడు..
ఆ అమ్మాయి ఏదో రాసుకుని – “మీ మెయిల్ ID ఇస్తారా..వచ్చే నెలలో మా మళయాళీ సంఘం వాళ్ళు ఒక నాటకం వెయ్యబోతున్నారు.. మీకు ఇన్విటేషన్ పంపుతాము” అంది..
“తప్పకుండా…నా మెయిల్ ID – dinakarmarella@gmail.com…. password – lakshmikrishna….. నా ఫోన్ నంబరు – 9845749659
“ఫోన్ నంబరు అవసరం లేదండి”
“పర్లేదు ఉంచండి….నంబరు మీ దగ్గరుంటే ఒకటి..నా దగ్గరుంటే ఒకటీనా..” అని తన మొబైల్ బయటకు తీసి “ఇంతకీ మీ నంబరు చెప్పలేదు” అన్నాడు…
“అవును” అని సమాధానమిచ్చింది ఆ అమ్మాయి..
జరిగేదంతా నేను నిశ్శబ్దంగా చూస్తున్నాను…ఇంత నిశ్శబ్దంగా అప్పుడెప్పుడో నా కెమిస్ట్రీ ల్యాబు పరీక్షలో మా ప్రొఫెసర్ నన్ను Viva క్వశ్చన్లు అడుగుతున్నప్పుడు ఉన్నా…..మళ్ళీ ఇన్నేళ్ళ తరువాత ఇప్పుడు…
(నేనేం మాట్లాడలేకపోతున్నా..నవ్వలేకపోతున్నా.. )

చదవండి-చదివించండి:
ఈ బ్లాగు మొత్తంలో నాకు నచ్చిన టపాలో వాక్యం “.. మంచం కింద దాక్కుని ఉన్న ‘దిగులు ‘ బయటకు వస్తుంది. ఇదో రాక్షసి. అస్సలు ఇది ఎలా వస్తుందో తెలియదు..ఏమి కావాలో అడగదు..ఎవరు పంపిస్తే వచ్చిందో చెప్పదు. ఉన్నంతసేపు ప్రాణం మాత్రం తోడేస్తుంది”. అలా చెప్పాపెట్టకుండా వచ్చి మమల్ని నలిపేసే దిగులు/ బెంగ/ బాధ/ ఇంకేమైనా.., ఈ బ్లాగు చదువుతున్నంత సేపూ మాత్రం మర్చిపోతాము. “స్మైల్” అంటే పెదాలు కొలత మించి విచ్చుకోకుండా సాగదీయడమూ, “లాఫ్” అంటే వినీ వినిపించనట్టు చేసే సన్నని ధ్వనీ అనేంత మెకానికల్‌గా మనమింకా కాలేదని గుర్తుచేసే బ్లాగు. నవ్వీ నవ్వీ అలసిపోయాక కూడా ఆలోచించగలిగితే రాజకీయ నాయకుల వ్యవహారాలపై, సినిమా ప్రస్తుత పరిస్థితిపై, జీవిత భాగస్వామిని ఎంచుకునే తంతుపై, పరీక్షలపై, మనం చూస్తున్న టి.వీ కార్యక్రమాలపై గమనించదగ్గ చాలా విషయాలుంటాయి.

చదవండీ.. నవ్వండీ! చదివించండీ.. నవ్వులు పంచుకోండి! అలా పంచుకునేటప్పుడు అసలు బ్లాగుకర్తను మరువకండోయ్! తెలియని వారికి టపాలు పంపేటప్పుడు, బ్లాగు పేరు, చిరునామా ఉండేట్టు చూసుకోండి.

ఇక ఈ బ్లాగు పురాణానికి మంగళం పాడేద్దాం:
రచన: రాకేశ్వర రావు
పాడేది: మనమంతా
తోటరాముడూ జిందాబాద్
తోటరాముడూ … జిందా… బాద్…
హుయ్ హా … హుయ్ హా … హుయ్ హా

ఈ వ్యాసంలో ఏదో మిస్సయినట్టు అనిపించటం లేదూ!? ఊఁ.. “నవ్వటం ఒక భోగం. నవ్వించటం ఒక యోగం!” అంటూ జంధ్యాలను తలుచుకోకుండా, తెలుగు హాస్యం గురించి ఇంత మాట్లాడేసుకోవటమే! హాస్యబ్రహ్మకి నమస్సులు.. కామెడీ కింగ్‌కి అభినందనలు!

నవ్వుతూ, నవ్విస్తూ- బ్లాగుతూ ఉండండి!!

———————————–

పూర్ణిమ తమ్మిరెడ్డి హైదరాబాదు‍లో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా పని చేస్తున్నారు. ఊహలన్నీ ఊసులై బ్లాగు ద్వారా ఆమె బ్లాగులోకానికి సుపరిచితులే!

This entry was posted in జాలవీక్షణం and tagged , . Bookmark the permalink.

21 Responses to రెండ్రెళ్ళు ఓసారేసుకో, దినకర్ని ఆరేసుకో, విరగబూచిన నవ్వులు ఏరేసుకో

  1. Srujana says:

    Thotaramudu blog meeru anattu gaa…aa link isthe chaalu janalaki…ika aa blog a chusukuntundhi anthaaaa

  2. అదరగొట్టారు. రెండురెళ్ళారంటే దినకరే గుర్తొస్తాడు :)))

  3. రాఘవ says:

    భలే. మీకెంత ఓపికో! అన్ని వ్యాఖ్యలూ ఎలా చదివారండీ?

    ఇంతకీ మా ఱాకేశం ఎప్పుడు వ్రాసాడీ గౌతమంగళం? (కోరమంగళలా ఉంది వినడానికి, హిహిహి). ఒక విషయం నేను ఖచ్చితంగా చెప్పగలను… నవ్వుతూ పాడటం చాలా కష్టం.

    (సత్యసాయిగారు అన్నట్టుగా) తోటరాముడు… రెండు రెళ్ల ఆరు… దినకరూ… అబ్బో నవ్వులే నవ్వులు.

  4. నాకు బాగా ఇష్టమైన బ్లాగు రెండు రెళ్లు ఆరు . నేను మొదటగా ఈ బ్లాగు చదివే ఒహో బలేరాస్తున్నారే అనుకుని బ్లాగులు చదవటం మొదలుపెట్టాను . గంగిగోవుపాలు లాంటిది ఈ బ్లాగు .

  5. గౌతం నాకూ చాట్ లో కలిసారు .
    (గాలిలో తేలినట్టుందే..పుల్ బాటిలెత్తి దించకుండా తాగినట్టుందే అని పాడుకుంటున్నాను.. )
    🙂 🙂 🙂

    మంచి రివ్యూ పూర్ణిమ గారు .

  6. Excellent review!! చదవడం మొదలుపెట్టాక కళ్ళు చివరికిచ్చేవరకూ ఆగలేదు.. మళ్ళీ చదవాలనిపించి పైకి స్క్రోల్ చేస్తుంటే గానీ అర్ధం కాలేదు ఎంత పెద్ద సమీక్షో!! కేవలం టపాలనే కాకుండా, కామెంట్లను కూడా ప్రస్తావించడం చాలా నచ్చింది.. మొదట్లో ఉన్న ‘దీన్ని సమీక్షన్న వారిని..’ ఇంకా బాగా నచ్చింది. 🙂

  7. పూర్ణిమ గారూ..
    ఆదరగోట్టేసారండీ.. రెండు రెళ్ళ ఆరు గురించి.. ఆ రేంజ్ లోనే చెప్పారు మీరు కూడా..

  8. చాలా బాగుందండీ, కానీ నా అనుమానం మీ సొంత బ్లాగులో టపాక్కూడా ఇంత శ్రమపడి ఉండరేమో 🙂 అభిమానం అంటే అదే కదా.

  9. Buchibabu says:

    thotaramudi blog excellent………..what u told is correct………thx to thotaramudu and dinakar….

  10. జాన్ హైడ్ కనుమూరి says:

    పూర్ణిమ ఏదైనా రాయగలదు అని మరోసారి చెప్పింది ఈ సమీక్ష.

    అభినందనలు
    అభినందనలు
    అభినందనలు

  11. బ్లాగుకి తగిన రివ్యూ పూర్ణిమా… great job, 11 వ తారీఖు కోసం ఎదురుచూస్తున్నా…

  12. Very nice review purnima..!11 వ తారీఖు ఎప్పుడొస్తుందా అని ఒకటే వెయిటింగ్ ఇక్కడ నేను.

  13. krishna says:

    This made me laugh again.
    Excellent blog excellent review.

  14. ఆహా! ఎంత ఓపికండీ ఇలాంటి సమీక్ష కాని సమీక్ష రాయడానికి. అభిమానులంటే మజాకా ?
    తోటరాముడూ జిందాబాద్! హుయ్.. హా.. హుయ్.. హా..

  15. షారుఖ్ says:

    ఎది పదకుండునా ఇంకా రాలెదు

  16. షారుఖ్: [ఈ అభిమానులున్నారే… 🙂 ] ప్రచురించాం చూడండి.

  17. మీ సమీక్ష చూసాను. చాలా బాగా రాసారు.

  18. నాగరాజు.వి,పెనుకొండ,కొండాపురం

    నేను మీ వ్యాసాన్ని చదివాను, చాలా బాగుందని చెప్పడానికి ఒక్క మాట చాలదనిపిస్తోంది . మీరు ఇలాగే మరెన్నో వ్యాసాలు రాయాలని కోరుకుంటున్నాను.

  19. రవి says:

    తోట రాముడు ద్వారా బ్లాగు జనాలే కాదు, బ్లాగుల గురించి అస్సలు తెలియని తెలుగు యువత కూడా ఈ మెయిల్స్ ద్వారా వచ్చిన తన టపాలను మస్తు గా ఆస్వాదిస్తున్నారు. ఆఫీసుల్లో ఈ తోట రాముడి హవా ఇలానే కంటిన్యూ అయితే, అనేక సంస్థలు, తమ ఉద్యోగులు పిచ్చి వాళ్లలా నవ్వుతూ, నవ్వుకుంటూ, పని చేయట్లేదని కఠిన నిర్ణయాలను తీసుకునే రోజు కూడా వస్తుంది.

  20. good show.
    తోటరాముడికి ఎన్నడో రావలసిన గుర్తింపిది (ఇది పూర్ణిమగారి రచనా వేగంపైన చెణుకు!) 🙂
    తోటరాముడి ఖ్యాతిలో ఒక ముఖ్యమైన అంశాన్ని మరిచిపోయారు. బహుశా మీకు ఇది తెలియక పోయి ఉండొచ్చు. అతని మొదటి టపాల్లో ఒకటి, బహుశా “పెళ్ళెప్పుడు” అనుకుంటా, చాన్నాళ్ళు సాఫ్టువేరు జనాల మధ్య ఫార్వర్డు చక్కర్లు కొట్టింది. ఫ్రీగా వస్తే ఫినాయిలు తాగేసే వీరపురుషులు, ఇలాంటి హాస్యామృతం దొరికితే ఊరుకుంటారా, కొత్తగా బ్లాగులు మొదలెట్టేసి, దీన్ని మొదటి టపాగా ప్రచురించేశారు. అఫ్కోర్సు, నాలాంటి ఇన్విజిలేటర్ల చేతిలో పట్టుబడి బ్లాగులు మూసుకుని వెళ్ళిపోయారనుకోండి.

  21. Dinakar says:

    Hi,

    Ikkada Dinakar ni baga use cheskunnaru…Maa friends ee blogs chadivi same neelage unnadu raa ee dinakar kuda…kompa teesi dinakarlu andaru neelage untara ani adugutunnarau…intaki evarandi mee dinakar???

Comments are closed.