తేటి రాజకీయం

-సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి

తేటినాయకమణి తమిదీర నైదు
ఋతువులకు విరిజన విదుర మధువు
గ్రోలి పదవెక్కి ,… కరువుల గూలిపోవు
వారినీనాడు జూడగా వచ్చి బలికె.

“కమ్మతావుల తెరల బుక్కాము పరుపు
మృదులకేసర తల్పాన యదుక బరచి
రంగురేకుల స్వాగతాల్ రాసి నాకు
నై యెదురుగనియెడి పూల యతివలేరి?

కరకు కరమును చిరుమృదు కంఠదారి
హృదయ కుహరాన జొనిపి తన్మధుర మధు
రసము నేకొల్లగొట్ట, పరవశులగుచు
సోలి నానందపడు విరి సుదతులేరి?

జుమ్మురని మేము పాడిన విమలగాన
వీచి నురగలు తెమ్మెర వీధి గదలి
వచ్చుటను గాంచి సంతోష వార్ధి మునుగు
పరువములు వెల్గు చిరుపూలపడతులేరి?

నలువగు పూలకన్నె సదనంబుకు నే బరువెత్తువేళ, రె
ప్పల కొనయంచులందడవి, కమ్మని తావుల గుప్పి, శీతలాం
బలముల సేదదీర్చి, పరువాలకు పానకమిచ్చి, వేడియై
దొలగెడి చల్లగాలుల మృదూక్తుల సవ్వడులేల లేవొకో?

విరి తరుణి పైన వ్రాలేటివేళ మా స్వ
పక్షముల గాలి తాకిడి బెదరి చెదరి
సుడివడుచు లేచి మమ్మేచి చుట్టుముట్టు
కమ్మతావుల పసమించు దుమ్ములేవి?

పరువముల మాదుకౌగిలి బరచి ముదము
గనెడి సఖులను పరికించి గంపమంద
మేను, తమిహెచ్చ, తరుణము మించునంచు
కన్నెలుగ మారు మొగ్గల చిన్నెలేవి?

వెలుగు బుట్టెడి చల్లని వేళ పూవు
కన్నె కౌగిలి చిరువేడి గరగు మేము
వదలు వూపిరి పొగమంచు విధము తపను
కరములను బట్టి నిలిపేటి కాలమేది?

ఎన్నియో పూల దొరసాను లెవరిచెంత
జేరగలవాడ? రమ్మని చెరగు పరచి
యన్ని దలలూపు. స్మృతివెల్గునట్టి నాటి
గుండె బొంగెడి కాలపు గురుతులేవి?

నా కొరకు, నన్ను తమ ప్రియ నాథు జేయు
కొరకునై ఘర్షణలు బడి కోరి వొకరి
నొకరు రాసుక రాలు ప్రేమైక మూర్తు
లేరి? యేమైనవారొ? ఎందేగినారొ?

ఏరి? నా యీ పథమునకు సిరి పదవికి
కారకులు, లేతబుగ్గల కంగిసపడు
సిగ్గునిధులున్న సుమబాల శ్రేణులంత.
యెచట వెదకిన కనరారె? ఎదురురారె?

పలుకరేం? మాదు గాన స్రవంతి వీచి
యెగసిపడి గాలి భుజములనెక్కి పర్వి
వారి గుండెలోతుల దిగి స్పందనలను
కలుగజేయదె! సంతోష కలితలైరె!

పక్షములజొచ్చి తడబడి పడుచులేచి
సుడివడుచు పర్వులిడి శిరస్సులను దాకి
భుజముదట్టుచు మా రాక పూలకన్నె
చెవిని జెప్పదె చిరుగాలి? చెలులు రారె?

ఏమిటిది? అయ్యొదేవుడా! ఏమిటీ క
రాళ మృత్యు విహార సరాగలీల
రంగురంగుల మా పూల రాణులంత
కాలి కమిలి కాఠిన్యమై రాలినారె?

మధుర భావమిచ్చు మా స్పర్శ గనినంత
పొంగి పొరలి నవ్వు పూలకన్నె
తగలి తగలనంత తావు బోకార్చియు
మంటి చెలిమిజేసె మాట విడిచి.

పొరబడితినేమొ! నేను మా పూల సతుల
ముళ్ల ముంగిళ్ల కొస్తినా యెరిగి? .. లేక
దారి తప్పితినేమి? .. యీ దారులన్ని
నిప్పుకణికల మయములై నెగడుచుండె.

ఎక్కడ నా నును బుగ్గలు?
ఎక్కడ నా తరుణకాంతు లేవీ మధువుల్?
చిక్కని గాటపు కౌగిలి
దక్కెడి చిరుగాలి యెచట దాగెనొ? లేదే!”

***********************

మీ చిరుగుండె లోపొరల మిట్టల సందులనిండి కంపనల్
రాచిన మేని తేనియల రాశులపై బడి గిచ్చి గుచ్చి దా
తోచిన రీతి ద్రావి తమిదూలెడి సోలెడి మాదు జిహ్వకిం
కే చెలి దిక్కు? కోరికల నేవిధి దాచుట? నెందు దోచుటల్?

కరువు రక్కసి కోరల విరుగునపుడె
క్షణము ముందుగ మా చెవి పనవి వుంటె
అర్హతలు లేని భూతానికందకుండ
మీకు గుర్తుగా మధువును లాగుకొననె!

నా కలిమి జీవితమున మరొక్కసారి
మీకు మాత్రమె సాధ్యమై మెరయు నూర్ధ్వ
పథము నిర్మించుకొని మిమ్ము ముదము నొంద
జేయనైతినెంత వెధవ జీవినొక్కొ!

రాళ్లసీమ కరవు బీళ్లలో బుట్టిన
మెరుపుతీగలార! మేని పసల
పరుపు పరవకుండ పారినారెచటికి?
విందులిత్తురెవరు పిలిచి నాకు?

మధురమౌ మీ స్మృతిని నేను మరవలేను
గురుప్రబంధము నిర్మించి గూర్తు మీకు
కడు శిలావేదికల్ నేడె గట్టజేతు
యిచటి రాళ్లనె వీటికై యెత్తుకెళుదు.

ఏమిటీ? ఎక్కడా మూల్గు? … ఎవరు? … అయ్యొ..
నీవటే విరికన్నెకా?… నేలవాలు
చివరి ఘడియల నిలిపితే జీవమకట!
నాకునై యెంత గుందితో… యాగుమాగు…

చెప్పు చెలి! యేమి వలయునో… చేసిపెడుదు.
నవ్య రసవత్ప్రబంధమా?… నల్లరాతి
వేదికా?… రమ్యగీతమా?… యేది?… నీవు
కోరుకో. యిత్తునిప్పుడే కోర్కెదీర…”

*******************

కరకరలాడిన రేకుల రాపిడి
మరగిన గుండెల మంటల వెలినిడి
అరగిన కంఠస్వరమున చిరుసడి
మెరయగ బలికెను విరిసతి సిరిజెడి

*******************

“రసవిహీనత వడలి, శిరస్సువాలి
చెవులు హోరెత్త, కన్నుల చెలిమలెండ
మరణ శయ్యలో బడుకొను మాకు నీవు
యేదిజేసిన మిత్రమా! యేమి ఫలము?

ఇంతసేపు నువ్వేడ్చిన యేడ్పుఝరులె
అమృతధారలయ్యె సఖుడ! అంత్యఘడియ
లందు నీ గాన జలనిధి యలల నూగు
భాగ్యమబ్బెను మాకు. నేపాటి వరమొ?

ఏమనుచు యేడ్చితోయి? నీకింపుగూర్చు
మధువిడు సఖులు లేరనా? మధువు నీకు
గావలయుగాని మా చావు కథలు గాదు.
నిక్కమేగద? ఎంతగా నేర్చినావు?

ఇన్నిరోజులు మానుండి యెన్నరాని
లబ్దిబొందితివేగాని లవము మాకు
నై పరిశ్రమించితె? బ్రతుకాశ హెచ్చ
నాసరానిచ్చి నిలిపితె? యకటనీవు.

క్రమముదప్పని శబ్దాల రవళిమించు
నీ యరుపులతో మాకుక్షి నింపజూసి
నావె! మమ్ము మైమరపించి నటనమాడి
మా రసముబీల్చి యీ పాటి మగడవైతె!

దప్పిబెరిగి గొంతెండుతూ దవిలి యెన్ని
సార్లు కేకేసితిమి నీళ్లు నీళ్లటంచు.
ఒక్కసారైన చూపు మాదిక్కు విసరి
యార్తికేకలొ జేజేలొ యరసినావె?

కరకుటాకలి దప్పుల గాలుమమ్ము
గనుటకై నుత్తచేతుల గదలనీకు
సిగ్గులేదొక్కొ? యారెక్క చివరినొక్క
నీటిచుక్కను దెచ్చుటకేటి బరువు?

ఇంతసేపును మావల్ల నెనయు సౌఖ్య
పథములను యేడ్చితివిగాని, వలసి మమ్ము
లాదుకొను యేడ్పులొకటైన నీదునోట
వెడలనే? ఎంత స్వార్థపు యెడద యకట?

మరులుగొన్నది మాలోని మధువుపైన
నేగదా నీవు! త్రావుము… ఇగురలేదు
చివరి బొట్టింక… తృప్తిగా చీకివెళ్లు
గగన పథములబడి – మమ్ముగాతుననుచు.

సఖుడ! ఇంకెప్పుడీ నీచ సరణి జనుల
మోసగించకుమోయి. నీ ముందు యెల్ల
వేళలొకరీతినుండవు. వెళ్లు మిచటి
నుండి వేవేగ చిరుగాలి బండినెక్కి.

***************

రాజకీయాల గడిదేరి రాళ్లపిండు
పూలచెండ్లని, తెగడిన పొగడిరనుచు
నర్థలబ్ధికి, పదవికై యాసపడెడి
తేటి నాయకమణి నవ్వు దెలియ బలికె.

*****************

“మీకునై,… మీదు తృప్తికై, … మీ యెడంద
నిలిచి… నాపేర వెలుగు తేనియలగ్రోలి
దైవతార్పణ తృప్తితో దనియు భక్త
వరుల వలె మిమ్ము సంతోషపరులజేతు.

మీ చివరి కోర్కె దీర్చుతూ.. మీరు తిరిగి
నాకునై.. నా పథముల నిల్ప .. నవ్య మధుర
మధువునందించ .. జన్మించి మనుదురనెడి
యాసతో .. వత్తు .. సఖులార! .. ఆగిపోండి..

ఐదు ఋతువులకొకసారి యెదురుజూచు
మీ దరికి వచ్చు నను మెచ్చి మీ ధవునిగ
యెన్నుకొనుచున్న, జీవితమున్నవరకు
మీకు సౌఖ్యాలనందింతు మిగుల.. వత్తు..

About సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి

వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి కవిగా, కథా-నవలా రచయితగా ప్రసిద్ధుడు. 1980లలో కవితలు రాయడం మొదలుపెట్టాడు. 1980లలో వచ్చిన అత్యుత్తమ కవితలను ఏర్చికూర్చిన కవితాసంకలనం "కవితా! ఓ కవితా!!" లో ఈయన రాసిన 2 కవితలు చోటు సంపాదించుకున్నాయి. పల్లె ప్రజల నెత్తుటిలో మలేరియా క్రిమిలా వ్యాపించిన హీనరాజకీయాల్ని - వాళ్ళ బతుకుల్నిండా చీడై కమ్ముకున్న కరువు గురించి - ప్రభుత్వ సవతి ప్రేమను గురించి ఆవేదన చెందుతూ వాటికి ఆస్కారమిచ్చిన మూలాల గురించి నిరంతరం అన్వేషిస్తూ ఉన్న అరుదైన రచయిత వెంకటరామిరెడ్డి.
This entry was posted in కవిత్వం. Bookmark the permalink.