ఉపజాతి పద్యాలు – ౪

కందం

— ముక్కు శ్రీరాఘవకిరణ్

మూడు ముఖ్యమైన ఉపజాతులు నేర్చుకున్నా మిప్పటి వరకూ, జాతులలో ముఖ్యమైన కందాన్ని నేర్చుకుందా మీ సారి. మామూలు మాటలు కూడా కందాల్లోనే చెప్తే బాగుంటుందేమోనని అనిపించేంతటి[1] నా కందానుబంధం ఈ వ్యాసపాఠానికి ఊపిరి పోయగలదని ఆశపడుతున్నాను.

కందపద్యలక్షణం

1. కందపద్యాల్లో కేవలం చతుర్మాత్రా గణాలు మాత్రమే వాడుతారు. అంటే (ముందు చెప్పుకున్నట్టుగా) భ, జ, స, నల, గగ లు మాత్రమే ఉపయుక్తాలన్నమాట.
2. బేసి (1,3) పాదాలలో మూడేసి గణాలూ, సరి (2,4) పాదాలలో ఐదేసి గణాలూ ఉంటాయి (రెండు పాదాలకి మొత్తం ఎనిమిది గణాలు చొప్పున).
3. ఈ (రెండు పాదాలకీ కలిపి లెక్కబెడితే వచ్చే) ఎనిమిది గణాలలోనూ బేసి గణం జగణం కాకూడదు (లేదంటే కందంతో జగడం వస్తుంది). ఇలా ఎందుకు కాకూడదు అని తర్కించే కన్నా ఇలాంటి నియమముండడం వల్ల అందం పెరిగిందని కందపద్య గతినీ స్వరూపాన్నీ చూస్తే అర్థమౌతాయి.
4. అలాగే ఈ ఎనిమిది గణాలలోనూ ఆరవ గణం జగణం కానీ నలం కానీ అవ్వాలి. అంటే రెండవ పాదంలో మూడో గణం జ కానీ నల కానీ కావాలి. ఈ నియమం వల్ల కందంలో పొందిక (symmetry) పెరుగుతుంది.
5. తర్వాత ఈ ఎనిమిదో గణం చివర్న దీర్ఘం రావాలి (చదువుకోవడానికి అనువుగా). అంటే ఎనిమిదవ గణం గగ కానీ స కానీ అవ్వాలి.
6. కందపద్యం జాతుల కోవలోకి వస్తుంది కాబట్టి ప్రాస నియమం పాటించాలి (ప్రాసనియమం పాటిస్తున్నాం కాబట్టి జాతి అయ్యింది అని కూడా అనుకోవచ్చు).
7. ఏ పద్యమైనా యతి తప్పనిసరి. ఐతే కందపద్యాల్లోని బేసిపాదాలు చిన్నవి కాబట్టి ఆ బేసి పాదాలలో యతి చెల్లించకుండా, సరి పాదాలలో మాత్రం మొదటి నాల్గవ గణాల మొదటి అక్షరాలకి యతి చెల్లిస్తాము.

కందమా… ఎందుకూ?

అందం కావాలన్నా
పొందిక క్లుప్తత సరళత పొందాలన్నా
కందమె తప్పనిసరి యని
ఛందోపాఠం నడుమన చక్కగ చెప్తా.

పైకిన్ని నియమాలు కనబడ్డా ఈ నియమాల ఉండడం వల్లే కందానికి మాత్రమే పరిమితమైన ఒక వింత అనుభవైకవేద్యమైన సోయగం అబ్బుతుంది. లేకపోతే కందంలో ఉన్న(న్ని) చాటువులు వేరేవాటిల్లోనూ ఉండేవే కదా?

చిన్న పదాలతో తయారైయ్యే చిన్న చిన్న పద్యాలు కందాలు. వస్తువు చిన్నగా ఉన్నప్పుడు కందాన్ని ఎంచుకోవడం వల్ల వచ్చే అందం ఒక రకమైతే, గహనమైన లేదా కష్టమైన విషయాలని చెప్పేటప్పుడూ కందాన్నే తీసుకోవడం వల్ల వచ్చే శోభ వేరొక రకం. కష్టమైన విషయాలేముంటాయీ అంటారా… మన సమస్యాపూరణాలే తీసుకోండి ఉదాహరణకి. బలరాముడు సీతఁ జూచి ఫక్కున నగియెన్ అన్న సమస్య చాలు విషయాన్ని ఎంతైనా జటిలం చేయచ్చు కందంలో అని నిరూపించడానికి.

ఇప్పుడు కందమొకటి వ్రాద్దామా?

వస్తువేం తీసుకుందాం? పూర్వకవులకి అందరికీ కంద-నమస్కారం చేద్దామా? నన్నయ తిక్కన ఎఱ్ఱన పోతన శ్రీనాథుడు పెద్దన తిమ్మన ధూర్జటి మొల్ల … ఇత్యాదులు, అందరికీ వందనములు.

గమనించే ఉంటారు, అందరికీ వందనములు అన్నప్పుడు మూడవ గణం (అదే ద-న-ము-లు) నలం ఔతోంది. కాబట్టి దానిని యథాతథంగా చక్కగా ఒక సరి పాదం ప్రారంభంలో వాడుకోవచ్చు. అప్పుడు అం తో యతి సరిపోయేలా (నాలుగైదు గణాలకి) పదాలు ఎంచుకోవాలి. యతి సరిపోతోంది కాబట్టి వందనములు అన్న పదాన్నే వాడెయ్యొచ్చు. ఐతే అందరికీ కి వందనములు కి మధ్యలో ఏం చెప్పాలో గణాలు సరిపోయేలా చెప్పాలి. శతసహస్ర అనచ్చు, వేలవేల అనచ్చు, భక్తియుక్త అనచ్చు, వినయసహిత అనచ్చు… ఇలా మన ఇష్టం. మూడో గణం జగణమో నలమో అయ్యేలా చూసుకోవాలి అంతే. అలాగే వందనములు తరవాత ఓ గురువు రావాలి కదా… అప్పుడే పాదం పూర్తయినట్టు. వందనములు తర్వాత గురువేం చెప్తాం? బాగోదేమో? కాబట్టి, అందరికీ వందనములు అన్నదాన్ని అలగే వదిలేసి యతి సరిపోయేలా పదాలు వెతుక్కోవడమో లేదా అందరికీ వందనములు ప్రయోగాన్ని బేసి పాదంలో వాడుకోవడమో చెయ్యాలి.

ఇప్పుడు ఈ ఆలోచనలు అన్నీ కాసేపు పక్కన పెట్టి అసలు ప్రాస సరిపోయేలా పదాలు ఏం వాడాలో చూద్దామా? ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు[2], కంద వందనం. మరి నాలుగో ప్రాసకి ఏం చేయాలి? సందర్భం, నందనం, అందలం, సుందరం, మంది, సందు, సందడి, వంద, చందము, ఛందస్సు, జందెము, చిందులు, కందువ, తుందురు, తొందర, చిందర వందర, పంది, ఇందు, కందులు, కుందె, నింద. చూసాం కదా, ంద ప్రాసాక్షరం కుదిరేలా పదాలు కో…కొల్లలు[3]. ఇప్పుడు వీటిలో ఏరుకుందాం మనకి కావల్సినవాటిని, ఎంత సులభం! సుందర అని మొదలు పెడదామా పద్యాన్ని? సుందర, అందమైన. ఏది అందమైనది? తెలుగు కవుల గురించి చెప్పదలుచుకున్నాం కాబట్టి తెలుగు సుందరమైనది, మన కవుల కవితలు సుందరమైనవి. సుందరమైన కవిత్వము అని చెప్పచ్చు. మొదటి పాదం ఐపోయింది! సుందరమైన కవిత్వము.

అటువంటి కవిత్వాన్ని మనకి ఇచ్చిన కవులకి నమస్కారం అని కదా చెప్పాలి. ఇప్పుడు సుందరమైన కవిత్వము అనేశాం కాబట్టి అందించిన అనచ్చు. ప్రాస కూడా సరిపోతోంది. సుందరమైన కవిత్వము నందించిన. ఇప్పుడు కనీసం ఒక్కరి పేరైనా చెప్పాలి కదా. పోతన లేదా ఆదికవి నన్నయ గారిని పేరు చొప్పిద్దాం. అందించిన అన్న తర్వాత ఇంకా రెండు మాత్రలు రావచ్చు, జగణమో నలమో వచ్చే ముందు. పోతన లేదా నన్నయ అన్నప్పుడు రెండూ భగణాలే కాబట్టి పోతన లేదా నన్నయ అని ఇక్కడే వెంటనే చెప్పచ్చు. ఇప్పుడు మొదలైన అని చెప్పాలి. మొదలైన. లై కి అం కి యతి సరిపోయినా అంత అందంగా లేదు. పోనీ మొదలైనకి బదులు ఏమైనా (పర్యాయ) పదాలు వాడగలమా? ఆది అనచ్చు. పోతనాది లేదా నన్నయాది. ఇప్పుడు మాటల క్లుప్తతా పెరిగింది, మొదలైన ఉన్నంత ఎబ్బెట్టుగానూ లేదు. తర్వాత? వీరంతా ఎవరు? కవులు. కవులు యతి కూడా సరిపోతుంది. కవులు అందరికీ నమస్కారం. కవులందరికీ నమస్కారం. కవులందరికీ నాలుగైదు గణాలకి సరీగ్గా అతికినట్టు సరిపోతుంది. ఇప్పుడు రెండో పాదం పూరించాం అందించిన నన్నయాది (పోతనాది) కవులందరికీ అని.

ఇప్పుడు మనం వాళ్లకి నమస్కారం ఎందుకు చేద్దావఁనుకున్నాం? ఏదో కందాలు వ్రాయడం నేర్చుకుంటున్నాం. ఆ కందాలు నేర్చుకుంటూ వందనాలు చేస్తున్నాం. పెద్దవాళ్ళకి నమస్కరిస్తే వాళ్ల ఆశీర్వాదం మనకుంటుంది. మనకన్నా పద్యంలో పైన చెప్పుకున్నట్టుగా పోతనాది కవులంతా గొప్పవారే కాబట్టి మరీ మంచిది. అ…య్యొ! కందాలు నేర్చుకుంటూ అన్నది మూడో పాదంగా వాడేసుకోవచ్చునే. ఐతే మనకిప్పుడు చివరి పాదం మాత్రమే మిగిలింది వ్రాయడానికి. వందనములు అని మొదలుపెడదాం. వందనములు చేస్తున్నాం. వందనాల ద్వారా మన గౌరవాన్ని చూపిస్తున్నాం. వందనాలు అనే పుష్పాలు సమర్పిస్తున్నాం. వందనాలనే నందనవనంలో విరబూసిన పూలని అందిస్తున్నాం. వందన నందన పుష్పాలు. పుష్పాలు అంటే గణాలు సరిపోవు కాబట్టి సుమములు అందామిక్కడ. ఆ పూలని ఏం చేస్తున్నాం? అర్పిస్తున్నాం. అర్పిస్తున్నాం అని అలాగే వాడేసుకోవచ్చు. అప్పుడు నాలుగో పాదం… వందన నందన సుమములు అర్పిస్తున్నాం. వందన నందన సుమముల నర్పిస్తున్నాం.

పద్యం పూర్తయ్యింది:

సుందరమైన కవిత్వము
నందించిన నన్నయాది (పోతనాది) కవులందరికీ
కందాలు నేర్చుకుంటూ
వందన నందన సుమముల నర్పిస్తున్నాం.

కందం వ్రాసినవారే కవి

ఇది బాగా ప్రసిద్ధిచెందిన నానుడి. కందానికి నియమాలెక్కువ కాబట్టి ఇలా అన్నారని తెలుస్తున్నా నేను దీనితో పూర్తిగా ఏకీభవించలేను. కవిత్వాన్ని కందంలో చెప్పగలవాడే (గొప్ప) కవి అనాలి అంటాను. లేకపోతే కవిత్వం కాని మామూలు మాటలు కూడా కందాల్లో చెప్పాలని ఉవ్విళ్లూరే నాలాంటివాళ్లందరూ కవులమైపోమూ!

అభ్యాసం

కందం ఎలా వ్రాయాలో నేర్చుకున్నాం కదా. ఇప్పుడు చేయవలసినవి.

(అ) చంకలు గుద్దుకోవడం… కందం ఒకటి వ్రాసాం కాబట్టి 😉

(ఆ) బద్దెన గారి సుమతీ (కంద-పద్య) శతకాన్ని తలచుకోవడం

(ఇ) మరో కందం వ్రాయడం (మీకు తోచిన వస్తువు తీసుకోండి).

(ఈ) ఈ కందపద్య సమస్యకి పూరణ చెయ్యడం: మొగుడు పడతి కాలు పట్టె ముదమున సభలోన్.


[1]

శ్రీరాఘవకిరణని నా
పేరు గృహాహ్వయము ముక్కు వేంగీనాట్లం
శ్రీరాముడు కులదైవత
మూ రమలాపురము కందములు నా కిష్టం.

[2] ప్రస్తుతానికి ఈ ప్రయోగపు కాపీహక్కులు కాకర్ల కులోద్భవుడైన త్యాగరాజు గారి దగ్గర కొనుక్కున్నాం అనుకుందాం…

[3] బిందు సహిత దకారానికి ప్రాస సరిపెట్టడం సుళువే. కానీ ఇలా కాకుండా కొన్ని ప్రాసాక్షరాలకి పదాలు వెతుక్కోవడం చాల కష్టం. అలాంటప్పుడు దానిని దుష్కర ప్రాస అని వ్యవహరిస్తారు. విశ్వనాథవారి కల్పవృక్షంలో ఇలాంటి ప్రయోగాలు బోలెడు. ఉదాహరణకి ఓ పద్యంలో ఆయన క్ష్ణ అన్న పదంతో ప్రాస సరిపెట్టారు!

—————————————————-

ముక్కు శ్రీ రాఘవ కిరణ్

ప్రథమ శ్రేణి పద్య బ్లాగరి ముక్కు శ్రీ రాఘవ కిరణ్ తన వాగ్విలాసము బ్లాగులో పద్యాలు రాస్తూంటారు. చిత్ర గీత సాహిత్యము, అనే బ్లాగు కూడా రాస్తూంటారు. గతంలో చిత్రోల్లాస అనే బ్లాగును కూడా రాసేవారు.

This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.

10 Responses to ఉపజాతి పద్యాలు – ౪

  1. దైవానిక says:

    ఆ పైన వ్రాసిన పద్యములో యతి సరిపోయినట్టులేదు, గమనించగలరు
    ‘అం’ కి ‘క’ కి కుదరదు. అలాగే ‘వం’ కి ‘న’/’అ’ కి కూడా సరిపడదు.

  2. యతుల గురించి చింతా రామకృష్ణారావు గారు ఆంధ్రామృతం బ్లాగులో చక్కగా విశదీకరించారు.. లింకు http://andhraamrutham.blogspot.com/2008/10/blog-post_23.html

  3. రాఘవ says:

    దైవానిక గారూ, నెనర్లు.
    http://poddu.net/?p=856#comment-3031 చూడగలరు.

  4. Satya says:

    కం. అగరొత్తులు, పాలు, పడక,
    మొగిలి సువాసన, ఫలములు మురిపపు రాత్రిన్
    మిగుల సభతీరి యుండిన
    మొగుడు పడతి కాలు పట్టె ముదమున సభలోన్!

    -సత్య

  5. రాఘవ says:

    సత్యనారాయణగారూ, భలే భలే.

    వికటకవిగారు కష్టపడుతున్నట్టున్నారు. నా పూరణ చెప్పమన్నారా? వద్దులెండి, ఇప్పటికి చిన్న హింటిస్తాను. అల్లుడంటే కూతురిమొగుడు అని అర్ధం!

  6. టేకుమళ్ళ వెంకటప్పయ్యగారి పద్యమంజూష బ్లాగులో కందపద్య నియమాలు చెబుతూ, మొదటి పాదం గురువుతో మొదలైతే, మిగతా పాదాలు కూడా గురువుతోనే మొదలవ్వాలని, అలాగే లఘువైతే లఘువుతోనె మొదలవ్వాలని చెప్పారు. ఈ నియమం మీరు చెప్పిన దాంట్లో కనిపించట్లేదు. కొంచం వివరిస్తారా?

  7. రాఘవ says:

    @అసంఖ్య గారూ:

    మొదటిపాదాన్ని గురువుతో ప్రారంభిస్తే, తక్కిన పాదాల మొదళ్లు గురువులే కావాలన్న నియమం కూడా ప్రాస క్రిందికే వస్తుందని నా ఊహ. రమా-రామ లకు ప్రాస కుదఱదు.

  8. రాఘవగారు, నా సందేహం ఇంకా పూర్తిగా తొలగలేదు. ఉదాహరణకి మొదటిపాదం “రమణీమణి…” అని రెండోపాదం “రామయతండ్రీ…” అని ఉందనుకోండి. అంటే ఒకటొ గణం “స”, అయిదవ గణం “భ”. ప్రాసాక్షరం “మ”. ఇక్కడ ఏవిధంగాఛందొభంగం అయ్యిందో కొంచం వివరిస్తారా? లేక ఇక్కడ “మ” కి ప్రాస కుదరదా?

  9. అవును, ఇది ప్రాస నియమంలో భాగం. వృత్తాల విషయంలో ఇది ప్రత్యేకించి తెలియదు (ప్రతిపాదానికీ గురులఘు క్రమం ఒకటే కాబట్టి). ప్రాస ముందరి అక్షరం గురువైతే గురువు, లఘువైతే లఘువు అవ్వాలన్నది ఈ నియమం. ప్రాసయతి విషయంలో కూడా ఈ నియమం వర్తిస్తుంది.

  10. ఇప్పుడర్ధమయ్యింది. మీరిరువురికీ ధన్యవాదములు.
    (పై ఉదాహరణలో “భ” గణం నాలుగవది. అయిదు అని తప్పు దొర్లింది)

Comments are closed.