-త్రివిక్రమ్
ఈమధ్య నాకు బాగా నచ్చిన బ్లాగుల గురించి మిత్రులతో చెప్తూ, “క్రాంతిగాయం అని ఒక అమ్మాయుంది, అప్పుడు ఏమి జరిగిందంటే.. అని బ్లాగు రాస్తుంది..” అని చెప్తూంటే వింటున్నవాళ్లంతా నాకేసి విచిత్రంగా చూడ్డం గమనించాక అర్థమైంది నేనేమన్నానో. దాంతో నాకు బాగా బ్లాగుచేసిందని అర్థమైపోయింది. దానికి విరుగుడుగా ఒక మంచి బ్లాగును మీకు పరిచయం చేద్దామని కంకణం కట్టుకున్నాను. ఆ బ్లాగు – మొదలుపెట్టిన అనతికాలంలోనే అత్యుత్తమ బ్లాగుల సరసన చేరిన క్రాంతిగాయం.
గత ఏడాదిగా సాగుతున్న ఆ బ్లాగు ప్రస్థానంబెట్టిదనిన…రెండువేల ఏడో సంవత్సరంలో మే నెల ఎండలు ఫెళ్ళున కాస్తున్నాయి. తెలుగువాళ్లందరూ ఆ ఎండలకు అల్లాడిపోతున్నారని హాస్యపుజల్లుల బేహారి తెలుగుబ్లాగరి విహారి “తెలుగువాడి అదృష్టం ఎన్ని సార్లు తలుపు కొడుతుంది?” అని లెక్కపెట్టుకుంటూ ఎండలకు విరుగుడుగా నెలకు నాలుగేసి వేమన పద్యాలు రాసేస్తున్నారు. సరిగ్గా అప్పుడు ఏమి జరిగిందంటే.. తెలుగుబ్లాగులోకంలో వేసవితాపాన్ని తీర్చే చల్లటి హాస్యపు జల్లు ఇంకోపక్క మెల్లగా మాంఛి సస్పెన్సుతో “ఎందుకు?” అని అడుగుతూ వచ్చి తలుపు కొట్టింది. అది త్వరలోనే కుండపోతగా మారి ఆఫీసుల్లో బ్లాగులు చదివే దురలవాటున్నవారికి ఊపిరాడనివ్వక ఉక్కిరిబిక్కిరి చేసింది.
“ఓ బ్లాగా బ్లాగా ఎందుకిలా చేశావు?” అని అడిగితే “నవ్వుతూ బతకాలిరా” అని పాడుతూ సాగిపోయింది. దాంతో అసలేమిటి ఈ బ్లాగు కథా కమా మిషూ అని చదువుతూ కూర్చున్నాను.
బ్లాగు అనేది తెరచి ఉంచిన డైరీ అనేటట్లైతే ఆ నిర్వచనానికి సరిగ్గా సరిపోతుంది ఈ బ్లాగు. ఎందుకంటే దీన్నిండా ఉన్నది క్రాంతిగారి జ్ఞాపకాలు, అనుభవాలు, అనుభూతులే. అందుకే ఒక్కో టపా చదువుతుంటే జ్ఞాపకాల దారుల్లో ఆమె వెంట మనమూ వెళ్తున్నట్లనిపిస్తుంది. పైకి చాలా అమాయకంగా కనిపించినా, తను అనుకొన్నది సాధించే పట్టుదలా, దానికి కావాల్సిన గడుసుదనం ఉన్న గడుగ్గాయి ఈమె అని అర్థమౌతుంది. ఒకటో తరగతిలోనే పట్టుబట్టి పేరు మార్చుకోవడమే అందుకు నిదర్శనం. ఇంజనీరింగు పూర్తి చేసి ఇప్పుడొక మల్టీ నేషనల్ సంస్థ రీసెర్చి అండ్ డెవెలెప్మెంటు విభాగంలో డెవెలప్మెంటు ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్న వీరికి కొత్త కొత్త ప్రదేశాలు చూడటమంటే ఇష్టం. అప్పుడప్పుడు పెయింటింగ్ చేస్తుంటారు. ఖాళీ సమయాల్లో “Concern India Foundation” వారితో కలసి పనిచేస్తుంటారు.
పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు తనది inborn talent అని ఇలా చెప్తున్నారు (పదిరూపాయల నోటు): “బళ్ళో మనం చూపించే ప్రతిభ అంతా ఇంతా కాదు. మా అక్కే నన్ను క్లాస్ లో కూర్చోబెట్టి, అంతకుముందు రోజు క్లాస్ లో నేను చేసిన వెధవ పనులు పరిష్కరించి తన క్లాస్ కి వెళ్ళిపోయేది.” అంతే కాదు, ఈ అక్క చాటు చెల్లి “ఒక్కరోజు కుడా నా స్కూల్ బ్యాగు,వాటర్ బాటిల్ నేను పట్టుకోలేదు.నా బ్యాగు,వాటర్ బాటిల్ కూడా మా అక్కే మోసుకొచ్చేది”.
మరి చదువు మాటో? “మా క్లాస్ లో నాది స్టాండర్డ్ ర్యాంక్. ఏ పరిక్ష పెట్టినా కాని నా ర్యాంకు నాకే ఉండేది. 30వ ర్యాంకు.(మరి మా క్లాస్ లో ముప్పైయ్ మందే ఉండేవాళ్ళం).” ఈ ర్యాంకుల మాటెలా ఉన్నా ప్రోగ్రెస్ కార్డు మీద సంతకం పెట్టించుకునేటప్పుడు ఆమె లాజిక్కుకు, తెలివికి “మురిసిపోయి మా నాన్న సంతకం పెట్టేవాళ్ళు. అప్పుడు నా ప్రతిభని గుర్తించని అమ్మ నాకు సూర్యకాంతం లాగా నాన్న శోభన్ బాబు లాగా కనిపించేవాళ్ళు.” అంటే ఆ ఇద్దరి రూపాలూ కళ్లముందు కదిలి నవ్వకుండా ఉండడం సాధ్యమా చెప్పండి?
ఐతే అలా ఎంతోకాలం అక్కచాటు చెల్లిగా ఉండలేక ఒకరోజు తిరుగుబాటు చేసి “నా అయిదు రూపాయలు నాకే ఇవ్వు” అని ఏడవడం మొదలు పెట్టిందా అమ్మాయి.”నా దగ్గర చిల్లర లేవురా, నీ ఫోటో కూడ అక్క తెస్తుందిలే”అని అమ్మ నన్ను సముదాయించాలని చూసింది.”చిల్లర లేకపొతే ఆ పది రూపాయల్ని రెండు ముక్కలు చేసి నా అయిదు రూపాయలు నాకు ఇవ్వు” అని ఏడుపు అందుకుందా గడుగ్గాయి. “నా తెలివికి అమ్మ అవాక్కయ్యింది. నేను ఇచ్చిన షాక్ నుండి తేరుకోవడానికి అమ్మకి ఒక అయిదు నిమిషాలు పట్టింది.”
పేరులో ఏముంది? అబ్బో, చాలా ఉంది. అసలు మీరు ఒకటో తరగతి పరీక్షలు ఎప్పుడైనా రాశారా? అని నాకోడౌటు. క్రాంతిగారైతే “ఎలాగోలా ఒకటవ తరగతి పరిక్షలు రాసేసాను.” అని నిట్టూర్చారు. పేరుమార్పిడి కార్యక్రమానికి అది నాంది. “అప్పుడు మానాన్న సికిందర్ అంకుల్ తో చెస్ ఆడుతున్నారు.(చెస్ ఆడేటప్పుడు నాన్న ప్రపంచాన్నే మర్చిపోతారు, అప్పుడు ఏమడిగినా కాదనరు). నేను నాన్న దగ్గరికి వెళ్ళి “నాన్న, నాకు ఈ పేరు నచ్చలేదు, వేరే పేరు పెట్టండి” అని అడిగాను.” అది ప్రస్తావన. .. “నేను పేరు మార్చాల్సిందేనంటూ మంకుపట్టుపట్టాను. మానాన్న స్కూటర్ ఎక్కి స్పీడోమీటర్ మీద ఒక కాలు, ముందు సీట్ మీద ఒక కాలు పెట్టి సాగరసంగమంలో కమల్ హాసన్ లా తకిటతధిమి చేసా. ఇక లాభం లేదని మా నాన్న పేరు మార్చటానికి ఒక కండిషన్ పెట్టారు.” ఇంత కష్టపడి పేరు మార్చుకున్నా అసలు ట్విస్టేమిటో తెలుసుకోవాలంటే ఆ టపా చదవాల్సిందే.
స్నేహితురాళ్ళంతా కష్టపడి కంచి యాత్ర కు బయలుదేరితే “టిక్కెట్ లో రాసిఉన్న ప్లాట్ ఫామ్ పైన కాకుండా బస్ ఎక్కడో ఆపాడని డ్రైవర్ తో పెద్ద గొడవ పెట్టుకొని మరీ బస్ ఎక్కాము… డ్రైవర్ మమ్మల్ని గుర్రు గుర్రుమని చూసాడు. కష్టపడి తమిళ్ అర్ధం చేసుకొని సినిమా మొత్తం చూసి,మనకి తమిళ్ అర్ధం అవుతుందని జబ్బలు చరుసుకొని అలసిపోయి చిన్న కునుకు తీస్తున్నాము….డ్రైవర్ నన్ను కోపంగా చూసి తమిళ్ ఏదో అన్నాడు.(ఇప్పుడు తమిళ్ అర్ధం కావటం లేదేంటి చెప్మా!!)”
“What can happen over coffee?” “A lot” (కాఫీ టేబుల్) వివరంగా చెప్పాలంటే చాలా రీసెర్చి. కొన్ని చిట్కాలు… ఐతే “అప్పుడే మా గ్రూప్ మేనేజర్ వచ్చి “మీరు బాగుపడరు” అన్నట్టు ఒక చూపు చూసి వెళ్ళిపోయాడు. ఇలాంటివన్ని మనమెప్పుడు పట్టించుకున్నాము కాబట్టి. ఏదో ఇంటర్మీడియట్లో,ఇంజనీరింగులో చేరిన కొత్తలో కాస్త రోషం,పౌరుషం ఉండేవి.తరవాత తరవాత నెమ్మదిగా నేను కూడ జనజీవన స్రవంతిలో కలసిపోయా.” ఏమిటీ మీరింకా కలవలేదా?
మీకు “తత్తి నై” అంటే ఏమిటో తెలుసా? తెలుసుకోవాలంటే క్రాంతి కంటే వాళ్లక్క-బావలను అడగాలి. వాళ్లబ్బాయి సిద్ధుగాడి గురించి చెప్పాలంటే మొదట్లో “అందరు కలసి వాడికి బుద్దిమంతుడు,మంచి బాలుడు వగైరా బిరుదులు ఇచ్చేసారు.” కాని తరవాత తరవాత వాళ్లందరూ కలిసి తొందరపడి బిరుదులు ఇచ్చేసామా అని మూకుమ్మడిగా బాధపడ్డారు. ఇలాకాదని ఆ సిద్ధుగాణ్ణి ప్లే స్కూల్లో చేరిస్తే చివరకు సిద్ధుగాడు, వాళ్ళమ్మ అజ్ఞాతంలోకెళ్లవలసి వచ్చింది. ఆ సిద్ధుగాడి వీరగాథలే “అమ్మో .. సిద్ధుగాడు“.
మనసు విరిగిపోవడం కామన్. కానీ పాటలు పాడే విషయంలో ఒక సందర్భంలో తన చిన్ని మనసు “మళ్ళీ అతుక్కోవడానికి వీలు లేకుండా చిన్న చిన్న ముక్కలైపోయింది”ట. నా రహస్య అజెండా లో “కడుపులో కెలికేసినట్టు పాడే రమణ గోగుల, చక్రి, R.P.పట్నాయక్ వీళ్ళందరికన్నా నేను బాగానే పాడతాను.” అంటూ బ్లాగులో అతిరహస్యం బట్టబయలు చేసినా కూడా తానెందుకలా చేశారో వ్యాఖ్యల్లో సమాధానమిచ్చారు. పది రూపాయల నోటు అనే టపాలో “స్టాండర్డ్ రాంక్”లో ఉన్న వీరు తన రహస్య అజెండా రూపుదిద్దుకునేనాటికి “క్లాస్ లో మొదటి మూడు ర్యాంకులు మా ముగ్గురివే. సుజాత, సునీత, నేను అన్నింట్లో ఒకరికొకరం గట్టి పోటి.” అని ప్రకటించేశారు. ఇంత మార్పు వెనకున్నది వాళ్ల బుజ్జి మామయ్య… కాదు కాదు మంజుల టీచర్. ఆ వైనం తెలియాలంటే నేను ఎందుకు చదవాల్సి వచ్చిందంటే… చదవాల్సిందే. “ఎందుకోగాని నాకు ఆవిడ భలే నచ్చేసారు”, “అబ్బో టీచర్ నాకు రోజు రోజుకి తెగ నచ్చేస్తున్నారు.ఏంటో నాకు లెక్కలు కూడ తెగ అర్దమవుతున్నాయి” అంటూ “లెక్కలు బాగ చెయ్యకపోతే మా టీచర్ బాధపడతారని” లెక్కలు చెయ్యడం మొదలుపెట్టిన వీరు “అబ్బ వీళ్ళతో చదివినా బాధే,చదవకపోయినా బాధే … ఇంక అప్పట్నుంచి మంజుల టీచర్ కోసం,నాన్న కోసం చదువుతానే ఉండాల్సొచ్చింది….ఇలా ఇంతమందిని ఇంప్రెస్ చెయ్యాలంటే మాటలా. అసలు నాలుగో తరగతి లెక్కలు ఎంత కష్టమో వీళ్ళకేమి తెలుసు?” అంటారు.
భరించలేనంత తలనొప్పి వస్తే దాన్ని కామిడీ కింద మార్చేసి టపా రాసి పాఠకులను మెప్పించడం క్రాంతి గారికే చెల్లును: తలనొప్పా!
బెంగుళూరు అనే టపా బెంగుళూరు ఎండలు, బెంగుళూరు బస్సులు, బెంగుళూరు ఆటోలు, బెంగుళూరులో తెలుగు సినిమాల గురించి ఒక సింహావలోకనంలా సాగుతుంది. బెంగుళూరులో బస్సు కోసం వేచిచూస్తూ “ఇదేమన్నా హైదరాబాదా! హైదరాబాదులో అయితే రోడ్డుమీద కాలు పెట్టగానే రయ్యిమని మన మీదకి కనీసం నాలుగు ఆటోలు దూసుకొస్తాయి. “ఆటో కావాలా మేడం” అని అడిగితే చాలు నేను ఆటో ఎక్కేస్తాను. నన్ను ఎవరన్నా మేడం అంటే చాలు నేను వాళ్ళకోసం ఏ పనైయినా చేసేస్తాను.” అని చెప్పుకొచ్చారు. దానికి స్పందనగా వ్యాఖ్యల్లో ఆమెను మేడం అని పిలవడానికి ఒకరిని మించి ఇంకొకరు పోటీ పడ్డారు. బెంగుళూరు ఆటోవాలాలతో విసిగిపోయి ఆమె ఏం చేశారో ఆమె మాటల్లోనే వినండి: “నేను ఒట్టుపెట్టుకున్నాను.మళ్ళీ ఆటో ఎక్కితే సునీల్ మీద ఒట్టు అని.సునీల్ అంటే మా మేనేజర్.చాలా గట్టోడు.ఒట్టు పెట్టిన తరవాత కూడ నాలుగైదుసార్లు ఆటో ఎక్కాను”. ఇక సినిమాల పైరసీ విషయంలో తాను మహేష్ బాబు మాటలను తూచా తప్పక ఎలా పాటిస్తున్నారనేది ఈ టపాలో కొసమెరుపు..
నవ్వి నవ్వి అలసిపోయేవారికి మంచి రిలీఫ్ నిచ్చే టపాలు “మా కాలనీ” జ్ఞాపకాలు లాంటివి.
నేను భయపడ్డాను అంటూ కొన్ని చేదు అనుభవాలు వివరిస్తున్నప్పుడు కూడా దానికి హాస్యమనే తీపి కోటింగ్ ఇవ్వడం మరవలేదు. అసలు ఎనిమిదో తరగతి వరకూ భయమంటే ఏమిటో ఎరుగని తనకు భయం కలిగించిన సంఘటనలను వివరించి చివరగా తాను దేవుణ్ణి ఇలా కోరుకుంటానంటారు: “దేవుడా,నన్ను మళ్ళీ ఆడపిల్లగా పుట్టించకు, రేపు నాకు పెళ్ళయ్యాక కూడ నాకు ఆడపిల్లనివ్వకు”. జీవితాంతం నన్ను, నా కూతుర్ని కాపాడుకుంటు బ్రతికే బ్రతుకు నాకొద్దు.
ఈ టపాలో ఈమె వివరించిన అనుభవాలు, చివరకు ఇచ్చిన ముక్తాయింపు మహిళలు ఇంట్లోంచి బయట అడుగుపెడితే వారికి ఎదురయ్యే కష్టాలపైకి పాఠకుల దృష్టిని మళ్ళించి వాటిపై మంచి చర్చకు అవకాశం కల్పించాయి.
నవ్వుతూ బతకాలిరా అనే టపా శీర్షిక గురించి రాస్తూ టపాలకి పేర్లు పెట్టడం చాలా కష్టంగా ఉంది అన్నారు – దాన్ని బట్టి, టపాలు ఏదో అలవోకగా రాసినట్టు మనకనిపించినా, ఆ రాయడం వెనక చాలా కృషి ఉంటుందని తెలుస్తోంది. అంత శ్రద్ధగా టపాలు రాసే ఈమె అరుదుగా ఎప్పుడన్నా ఒకసారి తన టపాల్లో వచ్చిన వ్యాఖ్యలకు స్పందించినా చాలా టపాల్లో వ్యాఖ్యలకు స్పందించకపోవడం, వ్యాఖ్యల్లో మంచి చర్చ జరుగుతున్నప్పుడు మధ్యలో కుప్పలుగా వచ్చిపడే స్పాములను కూడా తొలగించకపోవడం విచిత్రం.
ఈవిడ హ్యూమరులో కేవలం హాస్యమే కాకుండా ఒక కార్టూనిస్టుకుండే సునిశితమైన పరిశీలన కూడా ఉంటుంది – ఆత్మహత్య చేసుకొన్నా ఈ పాలసీ కవరు చేస్తుందట, నేను ఎందుకు ఆత్మహత్య చేసుకొంటానూ అని లైఫు ఇన్సూరెన్సు పాలసీల మీద కామెంట్లూ, ఆఫీసులో ప్రాజెక్టు మానేజరు మీద ఒట్టేసుకొని, వాడు గట్టివాడే లాటి చమక్కులూ, బెంగళూరు ఆటోలమీద, ఈవ్ టీజింగులమీద చమక్కులూ, పెళ్లైన వెంటనే జీవితం ఎలా మారిపోతుందో, సమానహక్కుల కోసం పోరాటాలు గట్రా – ఈ బ్లాగులో కార్టూనిస్టు హ్యూమర్ కి ఉదాహరణలు. ఇప్పటి నగరజీవనానికి కారికేచర్స్ లాంటివి కొన్ని ఈ బ్లాగులో ఉన్నాయి.
ఉదాహరణకు “అడ్డామీద కూలీల్లా బస్సు కోసం వెయిట్ చెయ్యాలి.మాయదారి బస్సు ఒకరోజు వచ్చిన టైమ్ కి ఇంకొక రోజు రాదు.మెడలో బిళ్ళ,చేతిలో లాప్ టాప్,పార,పలుగు,తలమీద తట్టతో రెడీగా ఉండాలన్నమాట.”
“పెళ్ళి తరవాత మా అమ్మ,అత్తయ్య విడి విడిగా,జాయింట్ గా కలిపి మొక్కిన మొక్కుబడులన్ని తీర్చడానికి మేము దాదాపు మన రాష్ట్రంలో ఉన్న పుణ్యక్షేత్రాలన్ని తిరిగాము.ఇంకా పక్క రాష్ట్రాల్లోవి కొన్ని మిగిలి ఉన్నాయి.”
“చూడగా, చూడగా జీడిపాకం సీరియల్స్ నచ్చేస్తున్నాయి నాకు.”
“అసలు బెంగుళూరులో ఉదయం తొమ్మిది గంటలకి,సాయంత్రం ఆరు గంటలకి రోడ్లపైన కార్లు,ఫుట్ పాత్ ల పైన బైకులు తప్ప ఏమి కనిపించవు.ఫుట్ పాత్ పైన బైకు నడిపేవాడి కాలర్ పట్టుకొని బైక్ ఆపి నువ్వు ఫుట్ పాత్ పైన బండి నడిపితే బస్సుల కోసం నిలబడే మేము ఎక్కడ దేబిరించాలి అని అడగాలనిపిస్తుంది.”
“ఆటోదగ్గరికి వెళ్ళి మెజెస్టిక్ బస్టాండు అని అడిగితే చీదరింపుగా ఒక చూపు చూసి మొహం తిప్పుకుంటాడు.”రాను” అని నోటితో ఒక్క మాట చెప్పొచ్చు కదా! ఆమాత్రం అదృష్టానికి కూడా నోచుకోలేదా నేను?”
“సోమవారం అప్పుడే వచ్చేసింది అన్న చేదునిజాన్ని దిగమింగి నేను నా రోజువారి కార్యక్రమాలు మొదలు పెట్టేసా.”
పిల్లల మనసుల్లో చదువు పేరిట పెద్దలు పెంచే ఒత్తిడి గురించి నవ్విస్తూనే ఘాటుగా విమర్శించారు. “ఏంటో ఈ పెద్దోల్ల మైండ్ సెట్ మారాలి.క్లాస్ లో ఫస్ట్ వస్తేనో,ఎమ్ సెట్ లో వెయ్యి లోపు ర్యాంకు వస్తేనే వాడు తెలివైనావాడు లేకపోతే ఎందుకు పనికి రాడు అన్నట్టు పిల్లల్ని మొదట్నుంచి చిత్రవధ చేస్తుంటారు.” “వాళ్ళ అమ్మ వచ్చింది.నేను ఇంకాసేపు ఆడుకుంటాను అని మొత్తుకుంటున్నా కాని బరబరా లాక్కేళ్ళింది.ఇప్పుడు ఆ అమ్మాయి ఏమన్నా IAS పరీక్షలకి ప్రిపేర్ అవ్వాలా? ఆడుకోనివ్వచ్చుకదా.అర్ధం చేసుకోరు.” (నేను ఎందుకు చదవాల్సి వచ్చిందంటే..)
“ఎంతసేపు మార్కుల గొడవే.పదో తరగతిలో 500 పైన మార్కులు రాకపోతే ఇంక అంతే.వాడ్ని పురుగుని చూసినట్టు చూస్తారు.ఇది చాలదన్నట్టు,పదో తరగతి సంక్రాంతి సెలవల దగ్గర్నుండే ఇంటర్ కాలేజీల వాళ్ళు తయారయ్యే వాళ్ళు.500 దాటితే ఎంత ఫీజు తగ్గిస్తారో 510 దాటితే ఎంత తగ్గిస్తారో.. చెప్పి చిన్న మెదడులో బోలెడంత టెన్షన్ పెట్టించేవాళ్ళు.ఇప్పుడయితే పరిస్థితి చెయ్యి దాటిపోయింది.పదో తరగతిలో 600కి 650 మార్కులొస్తేనే శ్రీచైతన్యలో కాని,నారాయణలో కాని ఇంటర్ చదవగలరు పిల్లలు.”
“మా పెద్దసార్ దగ్గర నాకు అరగంట క్లాస్.జీవితంలో ఏద్దన్నా సాధించాలంటే integration,trignometry,బెంజీన్ రింగు ఎంత ముఖ్యమో నాకు కళ్ళు తెరిపించి,మళ్ళీ ఇంగ్లీష్ పుస్తకం ముట్టుకోనని నాతో రాతపూర్వకంగా రాపించుకొని అప్పుడు లెక్కల క్లాస్ కి పంపించాడు.” (ఇంగ్లీష్ నేర్చుకుందాం)
బ్లాగులో తరచుగా ఎందుకు రాయడం లేదని ఒక పాఠకుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా తనకు ఈ మధ్య కథలు రాయాలనే దుర్బుద్ధి పుట్టిందనీ, అందుకే రాయడం తగ్గించి ఎక్కువగా చదువుతున్నాననీ అన్నారు. అదే నిజమైతే తెలుగుసాహిత్యంలో హాస్యానికి మంచిరోజులొచ్చినట్లే. ఈ బ్లాగులోని కొన్ని టపాల్లో ముళ్ళపూడి వెంకటరమణ గారి బుడుగు తరహా హాస్యం బహుపసందుగా పండింది. అందుకే ఈ “మేడం” బుడుగు అపరావతారం అనిపిస్తుంది.
వేరొక బ్లాగులో “తెలుగు ఎవరన్నా తప్పుగా రాస్తే నేను భరించలేను.” అని రాసిన క్రాంతి బ్లాగులో ముఖ్యంగా పాతటపాల్లో అచ్చుతప్పులు చాలానే ఉన్నాయి. మచ్చుకు ఈ టపా టైటిలును చూడవచ్చు: “నేను ఎందుకు చదావాల్సివచ్చిందంటే..”
చిన్నప్పుడే పెళ్ళంటూ చేసుకుంటే అందాల నటుడు శోభన్ బాబునే చేసుకోవాలని ఉవ్విళ్ళూరిన ఉలూచి ఈమె. ఆ సోగ్గాడు లేని ఈ పాడులోకంలో ఈ బ్లాగరి జీవితమిలా గడిచిపోతూ ఉండగా ఏమి జరిగిందంటే… ఆమెకు పెళ్లైంది. (బ్లాగు డిటెక్టివు కథనాల ప్రకారం ఈమె పెళ్ళి శోభన్ బాబు పోయిన మర్నాడే జరిగింది) ఆమె మాటల్లోనే చెప్పాలంటే “అదేంటో అన్ని కష్టాలు నాకే,అదీ ఒకేసారి వచ్చిపడతాయి. నాకు వచ్చిన అతి పెద్ద కష్టమేంటంటే,నాకు ఈ మధ్యే పెళ్ళయ్యింది.” అందుకేనేమో, పెళ్ళైన తర్వాత రాసిన టపాలలో అంతకు ముందున్న సెటైరు, షార్పు విట్టు లోపించినట్టున్నాయి 😉 లేదా అందుకు కారణం ఆమె దృష్టి కథలు రాయడం మీదికి మళ్లడమేనేమో?
“వివాహో బ్లాగునాశాయ” అనేది కొందరు బ్లాగరుల విషయంలో రుజువైన మేతబడ్డ బ్లామెత. అంటే పెళ్ళయాక బ్లాగోతం మొదలుపెట్టిన వాళ్లనొదిలేస్తే బ్లాగుతూ ఉండగా పెళ్లైన వారిలో చాలా మంది పెళ్ళితో తమ బ్లాగాయణానికి ఫుల్ స్టాప్ పెట్టారు. కొంతమంది వెంటనే (http://sreekaaram.wordpress.com/), మరికొంతమంది మెల్ల మెల్లగా (http://aceanil.blogspot.com). మరికొన్ని బ్లాగ్రథాలు అతికష్టమ్మీద ఆర్నెల్లకో, సంవత్సరానికో ఒకసారి “కిర్రు”మంటాయి (http://puraanaalu.blogspot.com). ఈ బ్లాగులో కూడా అ సూచనలు కనిపిస్తున్నాయి. అలా కాకుండా ఈ బ్లాగు “నిత్యకల్యాణం పచ్చతోరణం”లా నాలుక్కాలాలపాటు నవ్వుతూ, అందర్నీ నవ్విస్తూ కలకాలం ఇలాగే బ్లాగుతా తియ్యగా చల్లగా అంటూ సాగాలని కోరుకుంటూ….
ఒక బ్లాగాభిమాని
త్రివిక్రమ్
~~~~~~~~~~~~~
క్రాంతిగా బ్లాగులోకానికి పరిచయమైన గాయం క్రాంతి కళ్యాణి రెడ్డి ఇంజనీరింగు పూర్తి చేసి బెంగుళూరులో ఒక మల్టీ నేషనల్ సంస్థ రీసెర్చి అండ్ డెవలప్‌మెంటు విభాగంలో డెవలప్‌మెంటు ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నారు. ఇంటిపేరు గాయంను తనపేరుకు కలిపి తన బ్లాగుకు పేరుపెట్టుకున్నారు. కొత్త కొత్త ప్రదేశాలు చూడటమంటే ఇష్టం.అప్పుడప్పుడు పెయింటింగ్ చేస్తుంటారు.ఖాళీ సమయాల్లో “Concern India Foundation” వారితో కలసి పనిచేస్తుంటారు.
—————–
-త్రివిక్రమ్ పొద్దు సంపాదకవర్గ సభ్యుడు.
Good Review.. ee madhya kaalam lo ee blog kosam viphalam gaa praytninchaa.. Thanks for putting it here!!
అద్భుత హాస్య రత్నమయిన బ్లాగుకి మంచి సమీక్ష.
తెలుగు హాస్య బ్లాగులలో అన్నిటికన్నా మిన్నగా నాకు నచ్చే బ్లాగు ఇది.
మంచి టైమింగుతో టపాలు రాస్తారు. అందరినీ టపాలతో అలరిస్తారు.
ఎంతయినా మా “నమ్మ బెంగుళూరు” కదా 🙂
బ్లాగ్సమీక్ష చాలా బాగుంది.మంచి టపాలన్నింటినీ పొందుపరిచారు.సమీక్షకుని పేరు కూడా తెలియచేసిఉంటే ఇంకా బాగుండేది.
క్రాంతిగారికి,పొద్దువారికి అభినందనలు.
Well-deserved recognition.
క్రాంటి రచనల్లో అల్లరి, హాస్యం అదంతా ఒకెత్తు, ఆల్మోస్టు ప్రతీ పోస్టులోనూ తొణికిసలాడే ఆత్మవిశ్వాసం ఇంకో యెత్తు. అమ్మాయిలందరికీ (ఆ మాట కొస్తే అబ్బాయిలక్కూడా) ఈమె ఆత్మవిశ్వాసం కరదీపిక కావాలని ఆశిస్తున్నాను.
అన్నట్టు, ఈ సమీక్షకి టైటిలు అదిరింది! 🙂
“వివాహో బ్లాగునాశాయ” అనాలి
తాడేపల్లి గారూ!
తప్పు దిద్దుకున్నాను. నెనర్లు.