క్షణికమ్

-రానారె

“ఆస్వాదించడంతో పాటే అభినందించడమూ నేర్చుకోవాలి. బహుశా నాకిది చిన్నప్పణ్ణించీ కచేరీలకి వెళ్ళడం వల్ల కొంత అలవాటైంది అనుకుంటా. కచేరీ జరుగుతూ ఉండగానే … భలే, శెబాష్ అంటూ ఉండటం, కచేరీ ఐపోయాక, పాడిన వారి దగ్గిరికి వెళ్ళి నచ్చిందని చెప్పడం .. మా అమ్మ నవ్వేది .. ఒరే అంత పెద్ద గాయకులైన ఆయన దగ్గిరికి నువ్వెళ్ళి చెప్పక పోతే తనకి తెలీదా తాను చాలా బాగా పాడుతున్నానని అని. నేను ఒప్పుకోలేదు. ఆయన ఎంత విద్వాంసుడైనా .. ఎప్పటికప్పుడు .. రసికుడు ఎంత చిన్నవాడైనా .. బాగుంది అనే కామెంటు కళాకారుడి మనసుకి ఉత్తేజాన్నిస్తుంది. నేనిది మహామహుల ముఖాల్లోనే ప్రత్యక్షంగా చూశాను.

ఇక రచయితల విషయానికి వస్తే .. కవులూ రచయితలూ ఇదివరకు తమ రచనని తామే గానం చేసి వినిపించేవారు. మెప్పో తప్పో సభాముఖంగా పొందేవారు మిగతా కళాకారుల్లాగే. కానీ ప్రింట్ మీడియా వచ్చాక వీళ్ళు పాఠకులకి దూరమై పోయారు. అభిమానుల ఉత్తరాలు తప్పించి రచయితకి feedback అందే అవకాశం లేదు.

మీబ్లాగులో ఉన్న కంటెంటుకంతటికీ, కామెంట్లతో సహా – మీరే బాధ్యులు. ఎటువంటి కామెంట్లు వస్తాయి అనేది మీరు రాసే అంశాలపై, మీ శైలిపై, సాధారణంగా – మీరు వ్యాఖ్యలకి, మిగిలిన బ్లాగర్లతో ఎలా వ్యవహరిస్తారు వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది.

ఈ నాడూ మళ్ళీ అంతర్జాలం పుణ్యమా అని రచయితా పాఠకుడూ ఒకే లెవెల్ మీద తారసిల్లుతున్నారు. పాఠకుడి ముఖతః రచయిత వినే అవకాశం యిప్పుడున్నది. అది బాధ్యత గల పాఠకుడు తప్పక వినియోగించుకోవాలి. ఇందులో యింకో సూక్ష్మం ఉంది. సమాజపు తీరుకి భిన్నంగా ఒక ఇతివృత్తంతో రచనేదైనా (కథ అనుకో) వచ్చినప్పుడు, ఆ కథ రాయడానికి రచయిత చాలా మథనపడి ఉంటాడని మనం గ్రహించొచ్చు. ఎందుకంటే అటువంటి రచన మనం చెయ్యాలంటే మనం ఎంత మథన పడతామో కదా! కానీ కొన్ని సార్లు అటువంటి రచనలు అవసరం. మనం ప్రోత్సహిస్తే తప్ప రచయితకి అది తెలిసే అవకాశం లేదు. మళ్ళీ అటువంటి రచనలు చేయలేడు. ప్రోత్సహిస్తే, పదిమంది దాన్ని గురించి మాట్లాడితే … మిగతా రచయితలు కూడా దాన్ని గురించి రాసే ధైర్యం చెయ్యొచ్చు.”

కృతజ్ఞత, అభినందన మొదలైన భావాలను వ్యక్తపరచడం గురించి చాలా రోజుల క్రితం జరిగిన ఒక తేలికపాటి సంభాషణలో నాతో ఒక మిత్రుడు చెప్పిన కొన్ని మాటలివి.

————

ప్రముఖ మిమిక్రీ కళాకారుడైన నేరెళ్లవేణుమాధవ్ ఒకసారి పాకిస్తాన్ పర్యటనలో ఒక టాక్సీలో ప్రయాణిస్తుండగా ఆయన ప్రజ్ఞను మాటల సందర్భంలో గ్రహించిన ఆ టాక్సీడ్రైవరు ఆయనతో మాటలు కలిపి, అప్పటి మన హిందీనటుల గొంతుకలను కూడా అడిగి అనుకరింపజేసి విని ముగ్ధుడై, “అయ్యా, మీ వద్ద గొప్ప విద్య వుంది. నిన్ను ఓదార్చేవారివద్దనే యేడవమని – మా పెద్దలు ఒక సామెత చెప్పేవారు. తమ ప్రజ్ఞపై కలిగిన అభిమానంతో తమకిది చెప్పాలనిపించింది.” అన్నాడట. ఒక ఆదివారం రేడియోలో బాలల కార్యక్రమంలో తన అనుభవాలను పంచుకొంటూ మరచిపోలేని ఒక అనుభవంగా ఈ ఘటనను చెప్పుకొచ్చాడాయన.

దీన్నిక్కడ ఎందుకు ఉదహరిస్తున్నానంటే – అంతర్జాలంలో, జాలపత్రికలలో, ముఖ్యంగా బ్లాగులలో ఒకే వేదికపై తారసిల్లుతున్న రచయితకు, పాఠకుడికి ముఖాముఖి పరిచయం, దాని పర్యవసానాలు చర్చించదగిన అంశమే కనుక, వేణుమాధవ్ గారు ఉటంకించిన మాటలు ఈ సందర్భంగా ఇద్దరికీ పనికొస్తాయని. ఇందులో, ఇటు రచయితా, అటు పాఠకుడూ కూడా ఈ సౌకర్యాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలన్నది ఇప్పుడు ఎవరికివారు నేర్చుకోవాలి.

————

పెదవి దాటితే, పృథివి దాటుతుందనే సామెత అంతర్జాలంలో అక్షరసత్యం. మనకంటూ, అంతర్జాలంలో ఓ విలాసం వచ్చాకా, మన విలాసాలు, విన్యాసాలు కాస్త గమనించుకోవాలి. మన అభిప్రాయాలు, ఆలోచనలూ అందరికీ నచ్చకపోవచ్చు, చాలామందికి నచ్చవు కూడా – వారు నచ్చడం, నచ్చకపోవడమనేది వారికిష్టమైన రీతిలో తెలియజేస్తారు. ఓ సారి బ్లాగంటూ మొదలెట్టాకా, మనమీద విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు తప్పనిసరిగా ఎప్పుడో ఓ సారి వస్తాయి, తప్పదు. వీటిని చూసి భయపడి బ్లాగు మూసేసుకోవడమో, లేకపోతే – ప్రతి విమర్శకూ తీవ్రంగా స్పందించటమో మొదలెడితే – మనకే ఇబ్బంది, సమయం వృధా.

మీబ్లాగులో ఉన్న కంటెంటుకంతటికీ, కామెంట్లతో సహా – మీరే బాధ్యులు. ఎటువంటి కామెంట్లు వస్తాయి అనేది మీరు రాసే అంశాలపై, మీ శైలిపై, సాధారణంగా – మీరు వ్యాఖ్యలకి, మిగిలిన బ్లాగర్లతో ఎలా వ్యవహరిస్తారు వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది.

టపా రాయగానే – ఇది ఎటువంటి స్పందనలని కలుగచేస్తుందో, టపా పోస్టు చేసేముందు ఓసారి ఆలోచించుకోవటం ఉత్తమం. మరీ వివాదస్పదమయ్యే అంశాలు కనిపిస్తే, భాషని గాని, దానిని రాసే, చెప్పే పద్దతిని గాని కొంచెం మార్చుకొంటే, చాలా వరకూ వ్యక్తిగత విమర్శలని, దాడులని తప్పించుకోవచ్చు. వీలైతే, మీ టపాని – పోస్టు చేసేముందు కొంతమంది స్నేహితులకి అభిప్రాయంకోసమో, సమీక్షకోసమో పంపితే ఇంకా మంచిది.

ఏదైనా టపా ఆవేశంలో రాస్తే, ఓ మూడు రోజులాగి పోస్టు చెయ్యాలా వద్దా అని ఆలోచించుకోవటం మేలు. చాలాసార్లు, మన కోపం తగ్గగానే, మనం రాసింది మనకే అసహ్యంగా అనిపిస్తుంది. తనకోపమె తన శత్రువు అని మరవవొద్దు.

బ్లాగులో, మీరు వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారు అనేది ఒక పాలసీగా పెట్టుకొంటే – అది మీకు, పాఠకులకి కూడా చాలా ఉపయోగం.

వచ్చిన ప్రతి వ్యాఖ్యకూ వెంటనే స్పందించటం – వ్యాఖ్య రాసినందుకు నెనర్లనో, వ్యాఖ్య నచ్చకపోతే దానిపై ప్రతివ్యాఖ్యో రాయటం. ఈ పాలసీ ఉన్నప్పుడు, వ్యాఖ్య కనిపించగానే స్పందించడం కాకుండా – ఓ రెండు మూడు రోజులాగి అన్ని వ్యాఖ్యలు ఓసారి చదువుకొని, అప్పుడు సమాధానం రాయటం మంచిది. ఇందులో ఒక లాభమేమిటంటే, ఒకవేళ ఎవరైనా ఘాటుగా దాడికి దిగితే, మీకన్నా ముందే వేరే వారెవ్వరైనా ఆ వ్యాఖ్య రాసిన వారిని వారిస్తూనో, మరోవిధంగానో మీకు సపోర్టు చేసే అవకాశం చాలా ఎక్కువ – అందువల్ల, మిమ్మలని మీరే సమర్ధించుకొనే తలనొప్పి తగ్గుతుంది.

అసలు ఏ వ్యాఖ్యకూ స్పందించకపోవడం – దీనివల్ల, మీకు వచ్చే వ్యాఖ్యల సంఖ్య తగ్గుతుందేమో కాని, తుంటరివ్యాఖ్యలు – కేవలం మిమ్మలని రెచ్చగొట్టడానికి మాత్రమే రాసే వ్యాఖ్యలు తగ్గుతాయి. ఈ బ్లాగరు ఎలాగు ఏ వ్యాఖ్యకి సమాధానం రాయడు అని ఓ ముద్ర పడిపోతుంది గదా – ఇలాటి వారితో తుంటర్లు టైము వేస్టు చేసుకోరు.

వ్యక్తిగతమైన దాడులు ఉన్న వ్యాఖ్యాతలకి మాత్రం స్పందించకపోవడం. దీనివల్ల – పోను, పోనూ మీ గౌరవం పెరుగుతుందేగాని తగ్గదు. కొంతమంది వారి అభిప్రాయాలని ప్రశ్నల రూపంలో సంధిస్తారు – ఇటువంటి వ్యాఖ్యలే, చాలా వరకూ చర్చలని లేవదీస్తాయి. ప్రశ్న వేరు, అభిప్రాయం వేరు.

మీరు ఎంత సంయమనం పాటించినప్పటికీ కొన్నిసార్లు మిమ్మల్ని నొప్పించే వ్యాఖ్యలు రావొచ్చు. బ్లాగంటూ ఒకటి మొదలు పెట్టాక ఇలాంటి సందర్భాలను ఎదుర్కొనడం మొత్తంమీద బ్లాగరుకు, ఒకోసారి వ్యాఖ్యాతకు కూడా అంతిమంగా మంచి చేసే అనుభవమే. నెటిజనుల ముందుకొచ్చి, ఓ నాలుగుముక్కలు రాయటం, ఆ రాసిందానివెనక నిల్చోడంలో ఉన్న కష్టమేమిటో తెలీనివాళ్ల వ్యాఖ్యల సంగతి ఇది. ఈ మధ్యకాలంలో – బ్లాగులు లేకపోయినా, కేవలం కామెంట్లు రాసేవాళ్ళు ఎక్కువమందే ఉన్నారు. ఇది శుభ పరిణామమే!

సదుద్దేశంతో చేసే విమర్శ కూడా సరిగ్గా రాయకపోవడం వలన ఒక్కోసారి మనస్తాపం కలిగించిన సందర్భాలున్నాయి. సదుద్దేశంతో చేసిన విమర్శను బ్లాగరి సరిగా అర్థం చేసుకోలేక ఆవేశంగా స్పందించిన సందర్భాలూ వున్నాయి.

ఆవేశంలో టపాలుగానీ, వ్యాఖ్యలుగానీ రాసేముందు గుర్తుంచుకోవలసింది చట్టం చేతులు చాలా పెద్దవని కూడా. సైబర్ నేరాల చిట్టాలో ఏమేమున్నాయో తెలియదుగానీ మన భావవ్యక్తీకరణ స్వేచ్ఛకుండే చట్టపరమైన పరిమితులు వెబ్బులో కూడా వర్తిస్తాయని గుర్తుంచుకోవాలి. సభ్యతా మరియు నైతిక పరిమితులను ఉల్లంఘించడం, కోర్టుధిక్కారం, ఇతరులను నిందించడం, పరువునష్టం కలిగించడం, వ్యక్తులనుగానీ, సమూహాలనుగానీ రెచ్చగొట్టేవిధంగా రాయడం, దేశసమైక్యత, సార్వభౌమత, దేశరక్షణ, ఇతరదేశాలతో ఉండే స్నేహసంబంధాలు, శాంతిభద్రతలకు భంగం కలిగించే రాతలు రాయడం ఇవన్నీ శిక్షార్హమైన నేరాలే. వీటిని గుర్తెరిగి మసలుకోవడం బ్లాగరులకు విధాయకం.

అంతర్జాలంలో తెలుగు రచన వెలుగొందుగాక!

This entry was posted in సంపాదకీయం and tagged . Bookmark the permalink.

27 Responses to క్షణికమ్

  1. @ రానారె గారు
    మంచి టపా. మీ సంపాదకీయాన్ని అభినందిస్తున్నాను. బ్లాగ్ప్రపంచానికి పొద్దు ఇలాంటి సంపాదకీయాలతో కరదీపికగా వెలుగొందగలదు.

  2. చాలా బాగా వ్రాశారు. చాలావరకు తెలుగు బ్లాగులలో భాష ఒక ముఖ్యమైన సమస్య. చెప్పుకోవటానికి తెలుగు బ్లాగైనా, అందులో వ్రాసే భాష అంత చెప్పుకో తగ్గదిగా ఉండడంలేదు. భావాల విషయమై ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. బ్లాగులలో వ్రాసేది మన భావాలు కాబట్టి, అవి ఎంతోమంది చదువుతారు కాబట్టి, వాటిని ఎంతో జాగ్రత్తగా వ్యక్తీకరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. స్పష్టత లేకపోతే అపార్ధాలకి అవకాశం ఎక్కువ.మన బ్లాగు ఒకరకంగా మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవలసిన భాద్యత ఆ బ్లాగు యజమానిదే అని నా ఉద్దేశ్యం. ఇకపోతే, వ్యాఖ్యలు, వ్యాఖ్యాతయొక్క వ్యక్తిత్వానికి నిదర్శనం కాబట్టి వాటిగురించి బ్లాగు యజమాని పట్టించుకోనవసం లేదేమో, మరీ ప్రమాదకరమైన వ్యాఖ్య అయితే, దాన్ని తొలగించవచ్చు. ఆవసరమనుకుంటే, వ్యాఖలకు స్పందించనూవచ్చు 🙂

    నమస్కారాలతో,
    సూర్యుడు 🙂

  3. bollojubaba says:

    మీ సూచనలు బాగున్నాయి.
    మంచి సంపాదకీయం.
    కొత్త విషయాలు తెలిసినయ్.
    బొల్లోజు బాబా

  4. బావుంది రానారె…
    సరయిన సమయంలో చక్కని వ్యాసం.

  5. “నేనిది మహామహుల ముఖాల్లోనే ప్రత్యక్షంగా చూశాను.”
    తెలుగు బ్లాగర్లు గణనీయంగా పెరుగుతున్న నేపధ్యంలో ఇలాంటి వ్యాసాలు రావడం ముదావహం. వారికివి కొంత దిశానిర్దేసం కూడా చేస్తవి.
    రాసిన రానారె కి అభినందనలు,
    ప్రచురించిన పొద్దు కి థాంకులు.

  6. Purnima says:

    ఇంతకు ముందెప్పుడో విహారి గారి “బ్లాగులు ఎలా రాయాలి?”, ఇప్పుడు ఈ “వ్యాఖ్యలకు ఎలా స్పందించాలి?” లాంటి (“How to” guides) వ్యాసాలను కూడాలి, జల్లెడ లాంటి సైట్లల్లో కనిపించేలా ఒక లంకె పెడితే.. కొత్తగా మొదలు పెట్టాలనుకునేవారికి, పెట్టి తడబడతున్నవారికీ ఉపయోగకరంగా ఉంటాయని నా అభిప్రాయం. కుదురుతుందేమో చూడగలరు

    రానారె: మీ సూచనలు, సలహాలు చాలా బాగున్నాయి. ఇప్పటిదాకా నేనెలా వ్యాఖ్యలను అర్ధం చేసుకున్నానో ఆలోచింపజేసేలా.. ఇక పై మార్గదర్శకం గా ఉంది. మీకు బోలెడన్ని నెనెర్లు!!

  7. నరేంద్ర భాస్కర్ S.P says:

    రానారె గారికి, నమస్కారాలు, నేనూ ఒక కొత్త బ్లాగర్ని, మీ అమూల్య సూచనలకు ధన్యవాదలు,
    జీవితపు సారాన్ని, అనుభవాన్ని, వేరేవారితొ పంచుకొవడం కొంచెం విశాలదృక్పదం ఉన్నవారు మాత్రమే చెయవలసిన పని, కాస్త వైయుక్తిక అభిప్రాయలు తీవ్రంగా ఉన్నవాళ్ళకు ఈ పని చెయడం కొంచెం కష్టమే, ఐనా మనవైన అభిప్రాయలను గాయకుని పాటలా గొంతెత్త గలగడమంటే మన జీవితాన్ని అంతే ప్రేమించడం. మన జీవితం మనది, మన ఇష్టాలు, సుఖాలు, కష్టాలు మనవే, ఇతరుల కేవలం అభిప్రాయాలకే కదలి, జీవితపు పాట పాడడం వదలే వాళ్ళు గుర్తుంచుకొవలసిన విషయం ” కోకిల పాట కాకి పాట రెండూ ప్రకృతి అనే ఒకే ప్లాట్ ఫాం మీద ఏక కాలం లో జరెగే రెండు వెర్వేరు సంఘటనలు, ఈ రెంటిలొ ఏదీ గొప్ప కాదు”. తధాగతుదు చెప్పినట్టు “ప్రపంచం అనే సరస్సులో నీల, లొహిత, శ్వేత ఇలా అనేక వర్ణాల కలువలున్నాయి కొన్ని సరస్సు అడుగునే పుట్టి అడుగునే మరణిస్తాయి, కొన్ని మధ్యవరకూ రాగలుగుతాయి, చాలా కొన్ని మాత్రమే సరస్సు పైవరకూ రాగలుగుతాయి, స్తాయీ భేధాలు జీవితమంత సహజాతాలు అని.

  8. teresa says:

    Informative article with an apt title.
    మొదటి పేరా చదివినప్పుడు ఇది కొత్తపాళీగారు రాశారా అని confuse అయ్యాను!

  9. – డిటో – ప్రవీణ్ గార్లపాటి

  10. రవి says:

    సకాలంలో సరైన సంపాదకీయం రాసారు. ఒక్క విషయం. బ్లాగులోకానికి సంబంధించినంత వరకు, ఎప్పుడో కొన్ని టీ కప్పులో తుఫానులు వచ్చినా, ప్రోత్సాహం మాత్రం మెండుగా దొరుకుతున్నది.

    మీరు చెప్పిన నేరెళ్ళ వేణుమాధవ్ ఉదంతం దూర దర్శన్లో కూడా ఓ ముఖాముఖిలో వచ్చింది. నేరెళ్ళ గారు ఆ టాక్సీ అతనికి పృథ్వీ రాజ కపూర్ గొంతును అనుకరించి ఆనందింపచేసారట.

  11. pedaraydu says:

    గత రెండు మూడు దశాబ్దాలుగా తెలుగుకి ఆదరణ తగ్గుతూ వస్తోంది. ఇటీవలి కాలంలో అంటే సమాచార విప్లవం తెచ్చిన ఒరవడి వల్ల తెలుగు అభిమానులు తమ దాహార్థిని తీర్చుకో గలుగుతున్నారు. ఇప్పుడు చిరుజల్లుల్లో తడవటానికి వువ్విళ్ళూరుతున్నారు. ఈ సందర్భంలో ఇటువంటి చర్చలు ఆహ్వానించదగినది. రచయితలు, పాఠకులు ఇటువంటి కొన్ని మార్గదర్శకాలను పాటించి హద్దులు మీరకుండా సంయమనంతో వ్యవహరిస్తే బ్లాగులు వినోద సాధనాలుగానే కాకుండా మంచి చర్చా వేదికలుగా నిలుస్తాయి. సమాచార విప్లవం ప్రసాదించిన ఈ వరాన్ని మన సాహిత్యాభివృద్దికి సోపానాలుగా నిర్మించడానికి మన వంతు పాత్రని సద్వినియోగ పరుద్దాం.

    – పెదరాయ్డు

  12. Srividya says:

    చాలా బాగా రాసారు. మంచి ఉపయోగకరంగా వుంది

  13. chavakiran says:

    వ్యాసం బాగుంది. కానీ ఇంకొంచెం వివరంగా ఇంకొంచెం రీసఎర్చ్ చేసి వ్రాసి ఉణ్డవలసింది. మరిన్ని ఉదాహరణలతో…

  14. సంపాదకీయాలంటే ఇలానే బోరింగా వుంటాయేమో.

  15. అయ్యో.. వ్యాఖ్య వ్రాసి, మూడు రోజులు ఆగి పంపించాలాలో వద్దో నిర్ణయించుకోవల్సింది. తప్పుజరిగింది.
    కానీ నా వ్యాఖ్యకు మీరే బాధ్యులు కాబట్టి నేను ఊపిరి పీల్చుకోవచ్చనుకుంట.
    కానీ నా ఈ వ్యాఖ్యకు వచ్చే ప్రతివ్యాఖ్యలకు బాధ్యుడను నేనౌతాను కదా… బాభోయ్…

  16. radhika says:

    చాలా బాగా వ్రాశారు.మీ సూచనలు బాగున్నాయి.పొద్దు కి నెనెర్లు.

  17. రమణి says:

    మంచి సూచనలు అందజేసారు రానారే గారు. నిజంగా కొత్త బ్లాగర్లకి, మాలాంటి అనుభవం లేని బ్లాగర్లకి ఇవి పాఠాల లాంటివి.

  18. చాలా బాగా రాశావు రాంనాథా!

  19. విష్ణుభొట్ల లక్ష్మన్న says:

    రానారె గారూ:

    బాగా రాసారు. గత పదేళ్ళ పైగా వచ్చిన మార్పుల్లో కొన్ని: ముందుగా ఈ-మైల్ తో మొదలయ్యి, ఛాట్ గ్రూపులు, వెబ్ పత్రికలు ఈ మధ్య వచ్చిన (ఇంకా వస్తున్న) బ్లాగులు తెలుగులో సమాచారం ఇతరులతో పంచుకోటానికి సహాయ పడ్డాయని (పడుతున్నాయని) వేరే చెప్పక్కరలేదు. దాదాపు పదేళ్ళ క్రితం “ఈమాట” పత్రిక ప్రారంభించిన తర్వాత తెలుసుకున్న ఒక విషయం: “ఒక కథ, కవిత, వ్యాసం, సమీక్ష – ఏది అంతర్జాలంలో చదివినా, తొందరగా అభిప్రాయం చెప్పటం కన్నా, ఆ ఆలోచనలని కొంత కాలం అభిప్రాయంలా చెప్పటం ఆపి, అదే విషయాన్ని గురించి మళ్ళీ ఆలోచించిన తరవాత చెప్పినప్పుడు ఆ అభిప్రాయంలో ముందు లేని కొన్ని లోతులు ఉండటం గమనించాను. ఇదే విషయాన్ని మీరు చెప్పటం ఆనందంగా ఉంది.

    ఎంత పెద్ద కళాకారుడైనా ఒక చిన్న మెచ్చుకోలుని సాదరంగా అహ్వానిస్తాడు, అన్న మీమాట సత్యం. అయితే, ఒక రచన బాగా లేదు అని చెప్పి ఎందువల్ల బాగాలేదో చెప్పినా, అందరు రచయితలు దాన్ని సరైన విధంగా తీసుకోటం కష్టం అన్నది చాలా విషయాల్లో నిరూపించబడింది. ఇటువంటి విమర్శలను సరైన రీతిలో తీసుకోటం, ఆ రచయిత “సంస్కారం, అభిరుచి, తప్పులు దిద్దుకుందామన్నా తపన” లపై ఆధారపడి ఉంటుంది.

    మొత్తానికి ఒక మంచి రచన అందించారు.

    అభినందనలతో,

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  20. రానారె గారు,
    బాగుందండి వ్యాసం! సరైన సమయంలో రాశారు కూడాను! మన టపాల మీద వచ్చే వ్యాఖ్యలను కొన్ని సార్లు సీరియస్ గా తీసుకోవాలని అనిపించినా , అన్ని సార్లూ అది వీలవని పరిస్తితి! టపా పోస్ట్ చేసేముందు ఒకటికి మూడు సార్లు ఆలోచించుకోవాలన్న సూచన చాలా బాగుంది.

  21. వ్యాఖ్యాతలందరికీ నమస్కారం. ఇందులో నేను చెప్పిన విషయాలన్నీ కూడా నాతో కొందరు మిత్రులు, పెద్దలు అడపాదడపా చెప్పిన మాటలే. అభినందనలన్నీ వాళ్లకే చెందాలి. నిత్యజీవితంలో అంతర్జాలంలోకానీ మరెక్కడయినాగానీ ‘సంభాషణల్లో సంయమనం పాటించడం ఇలాగ’ అని చెప్పే స్థితి నాకింకా కలగలేదు. ప్రతి మానవుడూ తన జీవితమంతా ఈ సమతౌల్యం సాధించే ప్రయత్నం చేస్తూనే వుంటాడని మీరంగీకరిస్తారనుకుంటాను. కృతజ్ఞతలు.

  22. జాన్ హైడ్ కనుమూరిJ says:

    బాగుంది

    అభినందనలు

    జాన్ హైడ్ కనుమూరి

  23. మంచి ఆలోచన. కొట్టగా బ్లాగు మొదలు పెట్టేవారికి ఒక కరదీపికలా ఉంది వ్యాసం. ఇంట మంచి తప రాసినందుకు రానారే గారికి అభినందనలు.

  24. మనందఱి బాధ్యతనీ మళ్ళీ గుర్తుచేశారు. నెనర్లు.

    మన బ్లాగులకు వచ్చేవారు మన దగ్గర ఏదో తెలుసుకోదగిన కొత్త విషయం ఉంటుందనే ఆశతో వస్తారు. క్రోధావేశ పూరితమైన టపాలు (ఉరఫ్ చెత్త టపాలు) రాసి వారిని నిరాశకు గుఱిచెయ్యడం కన్నా మహాపాపం లేదు. పాఠకుడనేవాడు మన ఆవేశ కావేశాల చెత్తని డంపు చేసే డస్టుబిన్ కాడు.

    (అరుదుగా తప్ప) మనల్ని attack చేసే దురుద్దేశంతో ఎవరూ మన బ్లాగులకు రారు. ఎవరైనా అలా attack చేస్తూ వ్యాఖ్యలు రాస్తే సదరు రచయిత యొక్క వ్యక్తీకరణ శైలిలో, కోణంలో ఏదో లోఫం ఉందనే విషయాన్ని అది సూచిస్తుంది.

  25. చాలా మంచి టాపా ఇన్నాళ్ళు మిస్ అయ్యను.

  26. sunita says:

    చాలా రోజుల్నుంచి రానారే బ్లాగ్ లొ కొత్త టపా కంపించడం లేదు ఏమా! అనుకున్నాను. మంచి వ్యాసం.

  27. vinay chakravarthi says:

    baagundi…………..nenu okasari kottapali gari blog lo iits gurinchi edo raasinapudu aavesham lo raasanu but taruvata anipinchindi……..endukuraasana ani……
    andaru tadepalli gaaru pina cheppinatlu fallow ithe chala baguntundi..maa lanti teluguni ishta pade vallaki meeru help chesinatlu avutundi…………..

Comments are closed.