ఊ’కందం’పుడు

-స్వాతి కుమారి

అంతర్జాలంలో నానాటికీ విస్తరిస్తున్న తెలుగు బ్లాగుల సంఖ్య వందల్లో ఉన్నా నాణ్యత, విషయ పరిజ్ఞానం దృష్ట్యా వర్గీకరించవలసి వస్తే మంచి బ్లాగుల కోవలోకి వచ్చే కొన్నింటిలో ఊకదంపుడు ఒకటి. గత సంవత్సరం జులైలో బ్లాగు మొదలెడుతూనే ‘ఎందుకు?’ అని ప్రశ్నించిన వాళ్ళకి “ఎందుకేమిటండీ .. ఎందుకు ఊరికే ఉండాలి? పైగా ప్లాజరిజం తప్పు గాని బ్లాగరిజం తప్పుకాదుకదా!” అని ధైర్యంగా సమాధానం చెప్పి దంపుడు ప్రక్రియకి ఉపక్రమించారు ఈ బ్లాగరి. “వీడా? నన్ను పట్టేదని పెన్నేడిస్తే కన్నీరు కాగితం మీద పడి .. ఊకదంపుడు!” అని చమత్కారంగా తనని తాను తక్కువ చేసుకున్నా, “ఊక దంచేశారు, ఇక్కడంతా గట్టి గింజలే” అని రసజ్ఞుల చేత అనిపించుకున్న బ్లాగు ఇది.

ఈయనకున్న తూగులయ్య పదాల వ్యసనంతో పాటు తోటి బ్లాగర్లని కందాలు, సీసాల కల్లు పాకల్నుండి బయటికి రానివ్వట్లేదని ఒక ఆరోపణ. ఆ మధ్య కాలంలో బ్లాగు తోటలో కందాల పంట పండింది.

తలుపు తెరిచి ఇక్కడేముందో అని చూడబోయేంతలో “నన్ను నేను చూసుకుందామని నీ కళ్లలోకి తొంగి చూస్తే కనిపించింది నేను లేని విశ్వం!” అని తన ఇటీవలి టపాలో కవితాత్మకంగా చెప్పిన ఈ బ్లాగుని తవ్వుకుంటూపోతే ఎన్నో నిధి నిక్షేపాలు బయట పడతాయి. మచ్చుకి కొన్ని రత్నాలిక్కడ ఏరుకుందాం.

నాగవల్లీ దళము, దానీ విశిష్టతా మీకు తెలియదా? ఐతే ఒకసారిక్కడ తాంబూల చర్వణం చెయ్యాల్సిందే. “అద్భుతం! శృంగారహాస్యరసకర్పూరాలతో మేళవించిన ఇలాంటి సాహిత్య తాంబూలాలు ఊకదంపుడులో మాత్రమే దొరుకుతాయి.” అని ప్రశంసలందుకుని మరిన్ని విశ్లేషణల్ని లేవదీసిన టపా ఇది. ఇంత చర్చా అయినా ఇంకా తనివితీరక మరొక చోట..“భామజుట్టిన ఆకువక్కలు” పండు యాశల “మోయగా.. మొదట మ్రోయగా అని రాసి, ఆకు వక్కల్లో వచ్చే మోత (ధ్వని) ఏమిటో అన్న పాఠకుల సందేహానికి “ఆకులు చుట్టేటప్పటి కరకంకణ నిక్వాణమేమో” అని గడుసుగా బదులు చెప్పటమే కాకుండా దానిని “మోయగా” అని మార్చి ధ్వనితో పాటు, ఆశల బరువుని కూడా ఆకువక్కలతో మోయించి, చమత్కారం కొంత, స్వీయానుభవం మరింత మేళవించి చదివిన వారి నోర్లు ఆశ్చర్యంతో పండించారు.

ఈయనకున్న తూగులయ్య పదాల వ్యసనంతో పాటు తోటి బ్లాగర్లని కందాలు, సీసాల కల్లు పాకల్నుండి బయటికి రానివ్వట్లేదని ఒక ఆరోపణ. ఆ మధ్య కాలంలో బ్లాగు తోటలో కందాల పంట పండింది. కొందరు ఔత్సాహికులు సమస్యా పూరణాల సాగూ చేశారు. ఈ తరుణంలో “తాటక తనయుడు కర్ణుడు” అని రానారె ఇచ్చిన సమస్యను ఈ కింది పద్యంతో ఎంతో గడుసుగా పరిష్కరించి తన సత్తా మరోమారు చాటుకున్నారు ఈ బ్లాగరి.

మునివరమును శంకింతువె
పనిగట్టుకొనిటుల కుంతి? బలివైతివిగా
క్షణమున విధివింతాటకి!
తనయుడు కర్ణుడు కలడన ధరకన్నియకున్ !”

ఈ పద్య వ్యసనానికి పరాకాష్టగా తన అభిమాన సినీ కవి వేటూరికో ఉత్పలమాల కూడా వేశారు. ఈ బ్లాగు లోని మొత్తం టపాల సంఖ్యలో పద్యాల శాతం తక్కువే ఐనా, వాటిలోని భావమూ, చమత్కారమూ చెప్పుకోదగ్గవి. ఉదాహరణకీ మత్తేభాన్ని చూడండి.

“కనుమా ఎందరొ వీధివీధికిని, ఆకల్లుంగొనంగూలిరో,
వినుమా, నీదు శరీరమున్ తొలచి నిర్వీర్యుండజేయుంగదా,
అనుమా మద్యము జోలికెళ్ళనని బ్రహ్మానందమౌనాలికిన్,
మనమా ఒద్దిక నాదు మాట వినుమా, మర్యాద కాపాడుమా”

’ఆకల్లుంగొని’ అనే ప్రయోగంలో ఆ కల్లుని సేవించి అనే అర్ధం గోచరిస్తున్నా, వ్యసన పరుల పైన ఆధరపడిన వారు ఆకలితో వీధుల పడ్డారనే అంతరార్ధమూ స్ఫురిస్తుంది. ఇలాంటి వాసి గల టపాలు ఈ బ్లాగరుకి శ్లేషరి, బ్లాగ్శేషుడు అనే బిరుదుల్ని సార్థకం చేసి పెట్టాయి.

సినిమాలు గానీ, బ్లాగు శీర్షికలు గానీ, ప్రతీ టైటిల్ కి ఒక టాగ్‌లైనుండటం తప్పనిసరై పోయిన నేపథ్యంలో రాబోయే ఉపశీర్షికలు ఎలా ఉండొచ్చన్న ఒక సందర్భోచిత హాస్యస్ఫోరకమైన ఊహ నామవాలము – వాలనామముగా దర్శనమిచ్చింది మరొక జాబులో. దాన్లోంచి కొన్ని ఉపశీర్షికలు రుచి చూడ్డం కోసమిక్కడ :

మాయాబజార్ -పెళ్లి నాకు పిడిగుద్దులు మీకు
దేవదాసు -ఓ రిఛ్చోడి ప్రేమకధ
స్వాతి ముత్యం -ఓ పిచ్చోడి పెళ్ళికధ
రుద్రవీణ -సంఘం కోసం సంగీతం

ఆంగ్ల పదాలను ఆలవోకగా పద్యపాదాల్లో పలికించి మళ్ళీ తనే ఆంగ్లభాష అయిస్కాంతమై మదర్ టంగు తెగిందని ఈ పద్యంలో వాపోయారు. మాతృభాషాభిమానులందరిలానే తన బాధని ఆవేశంతో వ్యక్తం చేసినా, ఇదికాదు దారి అనుకున్నారేమో ఇంగ్లీషూ యు లివ్ లాంగా అని ప్రశ్నార్ధకమైన ఆశీర్వాదాన్ని అందించి తన ఆలోచనల్లో బోలెడు నవ్వుల్ని రంగరించి మన మీద ఒక వ్యాస శృంఖలను ’నవ్వుకోండిక మీ ఓపిక’ అని వదిలారు. “BUFFOON బఫూన్ ఐతే.. BAFE బఫే ఎలా అవుతుంది, BUFFE బఫే అవుతుంది కానీ” అని విలాసంగా ఒక రహస్యాన్నీ చెప్పేసి “మీ అనువాద వేగాన్నందుకోవటం కష్టం సుమండీ” అని పాఠకులతో అనిపించుకున్న స్పార్క్ ఈ బ్లాగరికి ఊకతో దంచిన విద్య. ’విష్ణు శర్మ ఇంగ్లీష్ చదువు’ సంగతి నాకు తెలీదు కానీండి బహుశా అదీ ఇలానే ఉంటుందేమో అని ఈ వ్యాసాల్ని అసాంతం చదివిన వారొకరు అనుమానపడ్దారు.

“నా మిత్రులందరూ గ్రంథసాంగులే, పుస్తకంలో చూసే పాటలు పాడతారు”, “రిటైరవ్వకముందు ఇంటికి మూలపురుషుడు, రిటైరయ్యాక ఇంట్లో మూలపురుషుడు” లాంటి ఫన్ తరంగాలు ఈ బ్లాగులో కొన్ని సార్లు ఉవ్వెత్తున లేచాయి. వర్డ్ ప్రెస్సు వాడు సభ్యనామం ఇవ్వమనడిగితే, “మా ఆవిడే పక్కనే ఉండి ఉంటే, మీకు అసభ్యనామం కూడా ఉందా అని అడిగేది కదా” అని కొసమెరుపుగా భయపడ్డారోసారి. ఒక తోటి బ్లాగరి అన్నట్టు దీన్నే కాబోలు ట్రాకీజామెడీ అంటారు ఆంగ్లంలో …

పద్యమూ, హాస్యమూ ఈ బ్లాగు ప్రధాన ఆకర్షణలైతే కావచ్చు కానీ, రాసే వ్యక్తిలోని లోతు తెలియాలంటే ఎప్పుడో ఒకసారి కనిపించినా కట్టిపడేసే కొన్ని భావ వ్యక్తీకరణలే ప్రమాణాలు. ఉదాహరణకి; “వాడిది అధివాస్తవికత, నాది అలౌకికత, మా ఇద్దరిని ఈ రెంటితో సంబంధంలేని ఇంకో ముగ్గురితో కలిపి ఒకే ఇంట్లోనే అద్దెకి ఉంచేది, ఆర్ధిక అశక్తత.” అని తాత్వికంగా అంటారు తన Tvs50 ప్రహసనంలో ఒక చోట. తన సహజ ధోరణితో పాటు వైవిధ్యం కోసం అడిగినదే తడవుగా కొత్తపాళీ గారి ప్రేరణతో ఎప్పట్నుంచో దాచుకున్న తెల్ల కాగితం పై ’ఇది కథ కాదు’ అని చెబుతూనే ఒక కథ కూడా రాసేశారు. అప్పుడప్పుడు చిన్నపాటి కార్టూన్ లు, పద్య కార్టూన్ ల రాజకీయ సెటైర్ లు దంచుతూ పన్లో పనిగా సినిమా పాటలకి పేరడీలు కూడా కడుతుంటారు. అవధానం గురించి ఒక నెజ్జనుడి సందేహానికి స్పందన రాకపోవటం చూసి ఇక లాభం లేదనుకుని అవధాన విధి విధానాలను క్లుప్తంగా తన బ్లాగుకెక్కించారు.

పొరుగు వారి బ్లాగులకు అందులోని జాబులకు లింకులివ్వటంలో ఎంతో ఉదారంగా ఉండే ఈ బ్లాగరి తన వ్యక్తిగత వివరాలు ప్రకటించటానికి మాత్రం సుముఖంగా లేకపోవటంతో సమీక్ష పొడుగునా బ్లాగు పేరు తోనే వ్యవహరించవలసి వచ్చింది.

————-

-స్వాతి కుమారి పొద్దు సంపాదకవర్గ సభ్యురాలు.

About స్వాతికుమారి

స్వాతికుమారి పొద్దు సంపాదకవర్గ సభ్యురాలు.

This entry was posted in జాలవీక్షణం and tagged , . Bookmark the permalink.

11 Responses to ఊ’కందం’పుడు

  1. Anonymous says:

    బ్లాగు విశ్లేషణ బాగుంది.వ్యాస నడక చదివించేదిలా ఉంది.

  2. కం. ఊకందంపుడు పేరే
    కేక సమీక్షావివరణ కేక – సెబాసో…

    ఓ కవిసత్తమ! తెలుసును
    మీ కలము పేరు, అసలుకి మీ పేరేంటీ?

  3. అదేమిటీ నా వ్యాఖ్య ఎక్కడికి పోయింది ??

    సరే మళ్ళీ:

    చక్కని సమీక్ష…
    “ఊక దంపుడు” వైవిధ్యభరితమయిన టపాలతో బ్లాగరులందరినీ అలరిస్తుంది. ఇంకా మరెన్నో చక్కని టపాలు అందులో రావాలి.

  4. radhika says:

    చక్కని విశ్లేషణ . బాగుంది

  5. vikaTakavi says:

    సమీక్ష బాగుంది.అయ్యా దంపుడు సార్వభౌమా, ఈ రూపేణా అయినా తమరి నామధేయం మాకు తెలియపరచవచ్చును కదా.

  6. విమర్శణాత్మక విశ్లేషణ… బాగుంది…

  7. విశ్లేషణ మీదైన స్టైల్లో చాలా బావుంది..

  8. shiva-speaks says:

    బాగుంది.

  9. ఈయని అసలి పేరు కనుగున్నవారికి బహుమతి ప్రకటించాల్సిందేనేమో… 🙂

  10. ఊక మహాశయులు తెలుగు ఉగాది సందర్భముగా జర్గిన పొద్దు భువన విజయ కార్యక్రమములో “విశ్వామిత్ర” పేరిట పద్య కవిత్వ విశ్వరూపము చూపినారు. ఆయన చమత్కారాలు .. చాలా సార్లు సుమవర్షం .. ఎప్పుడైనా శరవర్షం కూడా. అభినందనలు.

  11. విశ్వామిత్ర says:

    కొత్తపాళీ గారు,
    ధన్యోస్మి.

    స్వాతికుమారి గారు,
    సమీక్ష బావుంది.
    సమీక్షకి ఎంచుకున్న శీర్షిక బావుంది – ఊకన్ దంపుడు అంటూ అందరినీ ఉసికొల్పటం. 🙂

    కొత్తపాళీ గారు “చమత్కారం” అన్నతరువాత చెయ్యి కాల్చుకోక తప్పింది కాదు… ఇవి సుమసదృశాలే..
    పొద్దు లో latest editor మీరే కదా ?

    నేరక ఎడిటరగుటయే
    నేరము ఐనట్లు, తమకు , నిర్దయతోడన్
    “మీరుసమీక్షింపుడ”నియె
    “సారులు” నాబ్లాగిడిరిలె స్వాతి కుమారీ!

    రాఘవ గారు
    “డూ”కును దీర్ఘమిడి తమరు
    ఏకవచనమాడిపిలువ ఏమిది యనబోన్
    కాకనె “ఊదం” యనుచో
    రాకనె పోదునె వడివడి రాఘవ సుకవీ!

    పద్యం మొదటి లోనే వ్యాకరణ దోషం ఉంది, “డు” కి దీర్ఘమిస్తాం కాని, “డూ” కు దీర్ఘమివ్వం కదా.. కాని చెప్పేటప్పుడు “డు” కి దీర్ఘమివ్వు అనటం కష్టం, మన ప్రమేయం లేకుండానే “డూ కు దీర్ఘమివ్వు ” అంటాం.

    రాకేశ్వరా,
    మీకు కన్నడా సాలేగూడు కూడా ఉందా? చిరునామా ఎక్కడ?
    పేర్లు బావున్నాయి – “దంపుడు సార్వభౌమా”, “ఉక మహాశయుడు”
    అందరికీ నెనరులు …

Comments are closed.