-త్రివిక్రమ్
కథలకు, ఆ మాటకొస్తే సాహిత్యానికి, ముడిసరుకు జీవితమే. జీవితాన్ని ఎంత నిశితంగా పరిశీలిస్తే అంత గొప్ప కథావస్తువులు దొరుకుతాయి. ఆ కథాంశాలకు చక్కటి కథారూపమివ్వాలంటే రచయితకు గొప్ప శిల్పదృష్టి, రాతపై అదుపు ఉండడం అత్యవసరం. తాము నిత్యం గమనించే జీవితాలు, పరిస్థితుల నుంచి విలక్షణమైన మంచి కథాంశాలను ఏరుకోగలిగే నేర్పు కొందరికే ఉంటుంది. అలా ఏరుకున్నాక ఆ కథాంశాలకు అలవోకగా అందమైన కథారూపమివ్వగలగడం అరుదుగా, కొందరికే అబ్బే కళ. అలాంటి కళాకారుల్లో ఒకరు శశిశ్రీ అని అర్థమౌతుంది దహేజ్ కథాసంపుటి చదివితే. పది కథలుండే ఈ సంపుటిలో ఒక్క షేక్ హ్యాండ్ తప్ప మిగిలిన కథలన్నీ పేద, మధ్యతరగతులకు చెందినవాళ్ళ, దిగువ కులాలకు చెందినవాళ్ళ గాథలు. ఇజ్జత్, వలిమా, దహేజ్, కంకర్, నదీకేపాల్ కథలు ముస్లిం కుటుంబాల గాధలు.
ఈ కథలు చదువుతుంటే రచయిత మనతో మాట్లాడుతున్నట్లే అనిపింపజేస్తుంది ఆయన రచనాశైలి. కడపప్రాంత వ్యావహారిక భాషను తగుమాత్రం వాడుతూ, ఆ నుడికారపు సొబగులను తన రచనలకు అందంగా అద్దగలిగే సమర్థుడైన రచయిత శశిశ్రీ. ఇక కథల్లోకి వెళ్తే… దహేజ్ కథలో మొదట ‘సైతాన్ కా డబ్బా అది’ అని పెళ్లికొడుకు తండ్రి లాంఛనాల్లో టీవీ వద్దని చెప్పినా “ఆయనకేం తెలుసయ్యా రోజంతా బయట ఉండేవానికి? నాలుగు గోడల మధ్య బిక్కుబిక్కుమంటు బతికే మాకు” అది తప్పక కావాలి అని దహేజ్ (పెళ్లి లాంఛనాలు) లో టీవీ లేకపోవడం పెద్ద నేరంగా నిందించిగొడవ చేస్తుంది పెళ్లికొడుకు తల్లి రబియా బీ. దానికి సమాధానంగా వియ్యంకుడు టీవీతో బాటు దహేజ్ లో చేర్చిన చివరి అంశం రెండు కఫన్ గుడ్డలు (శవాన్ని కప్పడానికి ఉపయోగించేవి)! వాటిని చూపిస్తూ ఆయన “నా బిడ్డ భర్త ఉండగా చచ్చిపోతే ఎర్ర కఫన్ గుడ్డా, భర్త పోయాక చచ్చిపోతే ఈ తెల్ల కఫన్ గుడ్డా దయచేసి వాడండి. ఇదే… నేను దహేజ్ లో మరచిపోయింది! ప్రతి ఆడబిడ్డ తండ్రీ గుర్తుంచుకోండి!! దహేజ్ లో బిడ్డకు కఫన్ కూడా ఇవ్వండి.. మరచిపోకుండా ఇవ్వండి” అంటూ సొమ్మసిల్లి కిందపడిపోతాడు. ఆ మాటలు కట్నం కోసం పీడించబడే అందరు పెళ్ళికూతుళ్ళ తండ్రుల ఆవేదనకు అద్దం పడుతాయి. ఈరోజుల్లో కూతుర్ని కాపురానికి పంపడం కూడా కాటికి పంపడంలానే భావించవలసి వస్తోందన్న కఠోరవాస్తవానికి కథారూపం దహేజ్!
“ఏటి ఇసుక సేద్యం పేదోళ్ళ సేద్యం”. ఏరు పొంగితే ఏటిపాలయేది ఒక్క పంట మాత్రమే కాదు.ఆ రైతుల జీవితాలు కూడా. నదికేపాల్ లో కథాంశం అదే. పెళ్లయీ అవగానే కట్నం డబ్బే పెట్టుబడిగా డబ్బుసంపాదించడానికి భర్త కువైట్ వెళ్ళగా పుట్టిల్లు చేరింది రమీజా. ఆమె నగలు కుదువ పెట్టి ఏటి ఒడ్డున దోసపంట వేస్తారు నాన్నా, తమ్ముడు. అత్తింటివాళ్ళు దౌర్జన్యంగా నగలు లాక్కోవాలని చూస్తే పుట్టింటివాళ్ళు ఆప్యాయంగా లాక్కున్నారు! భర్త తిరిగిరావడంతో రమీజా కాపురానికి వెళ్ళడానికి సిద్ధమౌతుంది. తను వెళ్ళేటప్పటికి పుట్టింటివారు తన నగలు తెచ్చిస్తారో లేక ఇంకో గొడవ చేసి తనను భర్తకు దూరం చేస్తారో, తను కఠినంగా నిలవకపోతే కాపురం నిలవదు అనుకుంటూ కష్టాలే మనిషికి తెలివితేటలు నేర్పిస్తాయి అంటే ఇదేనేమో అనుకుంటుంది రమీజా. ఈలోపే ఏరుపొంగుతుంది. ఆ ఏట్లో దోసపంటతో బాటు తన కూతురి కాపురం కూడా కొట్టుకునిపోతున్నట్లు భావించిన ఆమె తండ్రి ఆ ఏట్లోనే పడి కొట్టుకునిపోతాడు.ఆర్థికావసరాలు కుటుంబ సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తాయో ఈ కథలో అద్భుతంగా చూపిస్తాడు రచయిత.
సంసారం అచ్చంగా ఒక చదరంగమే. తమ వంతు వచ్చినప్పుడు వెయ్యడానికి ఎత్తులు-పై ఎత్తులు ముందుగానే సిద్ధం చేసి పెట్టుకుంటారు ఆటగాళ్ళు. కంకర్ కథలో చెల్లెలి పెళ్ళిలో తేడా వచ్చిన రెండు తులాల బంగారు రాబట్టుకోవడం కోసం అన్న పెళ్ళప్పుడు చాకచక్యంగా కథ నడిపిన ఆమె అత్త గడుసుదనం చూసి విస్తుపోతాం. అందులోనే బావ మంచితనం, మూఢనమ్మకాలపై నిరసన, మనుషులంతా ఒక్కటే అనే సందేశం సొగసుగా ఇమిడిపోయాయి. భార్యాపిల్లల ఇజ్జత్ ఇంటి యజమాని కాపాడితే అతడి ఇజ్జత్ ఆత్మబంధువులు కాపాడుతారనేది ఇజ్జత్ కథాంశం. ఇందులో దర్జీ మస్తాన్ సాబ్ సాటి మనిషి పట్ల చూపిన ఔదార్యం ప్రత్యేకించి చెప్పుకోదగినది.
తన పెళ్లికి వచ్చిన చదివింపుల డబ్బుతో పెళ్ళికోసం చేసిన అప్పులు తీర్చగలననుకుంటాడు వలిమా కథలో పెళ్ళికొడుకు సత్తార్. కటికవాడు కరీం వలిమా (పెళ్ళిభోజనం) కోసం మాంసం ఇచ్చేటప్పుడే ఖరాఖండిగా చెప్పేశాడు చదివింపులు తనే రాబట్టుకుని, తన అప్పుపోగా మిగిలిందే సత్తారుకిస్తానని. అన్నంతమాత్రాన తన మెడ మీద కత్తి పెట్టినట్లు కటికవాడు చదివింపులు రాబట్టుకోవడానికి స్వయంగా వచ్చి తన పక్కనే కుర్చీ వేసుకుని కూర్చుంటే ఇబ్బందే కదా? తీరా చూస్తే వచ్చిన చదివింపులు డెబ్భై రూపాయలు! అప్పెలా తీర్చగలనా అని మధన పడుతున్న పెళ్ళికొడుకు చివరకు కరీం చూపిన సౌహార్ద్రానికి కదిలిపోతాడు. ఆపత్సమయంలో సగటుమనిషి ఆలోచనలెలా సాగుతాయో రచయిత అత్యంత సహజంగా వర్ణిస్తాడు ఈ కథలో.
అందివచ్చిన అవకాశాలను అందుకుని చకచకా పైకెగబాకడమే తెలిసినవాళ్లకు గతం గుర్తుండదు. రియల్ ఎస్టేట్లో లాభాలు ఊరిస్తుంటే అవసరంలో తనకు సాయం చేసినవారికి తాను చేయగలిగిన సాయం కూడా చెయ్యకుండా ఇంకా ఒత్తిడి పెంచి నిలువనీడ లేకుండా చేస్తాడు రాజు స్టేటస్ కథలో. అందుకు కారణం ఇద్దరి స్టేటస్ లలో వచ్చిన మార్పే. ఆత్మబంధువు కథలోని సుగాలి సీతమ్మ రాజు లాంటి నాగరికురాలు కాదు కాబట్టే తన కూతురి విషయంలో ఒకసారి మానవత్వం ప్రదర్శించిన సుబ్బరాయుడి మేలు మరచిపోక అతడికి ఆత్మబంధువుగా మారి ఎవరూ చేయనంత ప్రత్యుపకారం చేసిందేమో అనిపిస్తుంది ‘ఆత్మబంధువు ‘ కథ చదివితే.
ఒకప్పుడు బాగా బతికిన కుటుంబం వరస కరువులతో చితికిపోయినా పేదవాళ్లలా అటు ఏటిగట్టుసేద్యం చెయ్యలేరు, ఇటు చూస్తే పూటగడవదు. ఒకప్పుడు తన కింద పనిచేసిన పాలేరు పండించిన దోసతోటలోనే దొంగతనం చేయబోయి, దొరికిపోయినంతపనై అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుంటాడు కిష్టప్ప. కథాప్రారంభంలోనే ‘దొంగతిండి తినబోతే ఇదే గతి’ అని హైనాను ఉద్దేశించి రాసినమాటల్లో భావి కథాంశాన్ని అన్యాపదేశంగా అతినేర్పుగా సూచించాడు రచయిత. చేలలో రాత్రి కాపలా ఉండేవాళ్ళు ఇంటి దగ్గర తినీతినకా హడావుడిగా బయలుదేరడమూ, చేలలో కాసినవాటినే కాయలో, పళ్ళో కోసుకుతినడమూ కూడా సహజంగా వర్ణించాడు.
షేక్ హ్యాండ్ కథలో రచయితగా, బిసి కులస్థునిగా కాస్త గుర్తింపు రాగానే ‘గెలుపు నాకు గాక ఎవనికి దక్కుతుంది?’ అనుకుని ఎమ్మెల్సీ ఎలెక్షన్ బరిలో దిగిన శంకర్ నారాయణకు ‘దిగితేగానీ లోతు తెలియలేదు’. అలాగని పోటీ నుంచి విరమించుకోవడానికి మనసొప్పలేదు. అలాంటి సమయంలో ‘ఐన ఖర్చుకు రెట్టింపు ఇస్తాను. మీ మద్దతు నాకివ్వండి’ అని వచ్చిన పోటీదారుని ప్రతిపాదన తిరస్కరించినా వీడ్కోలుగా అతడికి ఇచ్చిన షేక్ హ్యాండ్ నే తన రాజకీయ బ్రహ్మాస్త్రంగా మలచుకున్న ప్రత్యర్థి దెబ్బకు మట్టికరుస్తాడు.
దహేజ్, కంకర్, నదీ కే పాల్ లాంటి కథల్లో సమస్యలకు వ్యక్తులను కాకుండా పరిస్థితులను బాధ్యులుగా చూపే గడుసుదనం ప్రదర్శించాడు రచయిత. రచయిత శశిశ్రీ తనకు తెలిసిన సమాజాన్ని నిశితంగా పరిశీలించి, నిజాయితీగా రాసిన కథలివి. చక్కటి మానవీయ దృష్టి, జీవనసంఘర్షణ ఉన్న ఈ కథలు అందరూ తప్పక చదవవలసినవి.
ప్రచురణ: నేత్రం పబ్లికేషన్స్, కడప. ప్రతులు విశాలాంధ్ర అన్ని శాఖలలోను లభ్యం. వెల 40 రూపాయలు. నేరుగా నేత్రం పబ్లికేషన్స్, 21/107, సెవెన్స్ రోడ్స్, కడప-1 లేదా శశిశ్రీ, 1-778(2ఎ), జర్నలిస్టుల కాలనీ, కడప-516004 నుంచి కూడా తెప్పించుకోవచ్చు.
త్రివిక్రమ్ పొద్దు సంపాదకవర్గ సభ్యుడు
శశిశ్రీ గారు రచయితగానే కాకుండా సంపాదకత్వం వహించి సాహిత్య నేత్రం అనే త్రైమాసిక పత్రిక కూడా వెలువరిస్తున్నారు.
దహేజ్ అనే ఈ కథ సంకలనం పై నా అభిప్రాయాలను ఇదివరకే నేను నా బ్లాగు లో (http://kollurisomasankar.blogspot.com/2007/11/blog-post.html) రాసాను. అవి కూడా చదవండి.
ఈ పుస్తకం నిజంగానే మంచి కథల సమహారం.
త్రివిక్రమ్ గారు:
శశిశ్రీ కథలు పుస్తకంగా రావడం బాగుంది. ఇంత విపులమయిన/విశ్లేషణాత్మక సమీక్ష రాసినందుకు మీకు ధన్యవాదాలు.
శశిశ్రీ కి అభినందనలు తెలపండి.
అఫ్సర్
trivikram gaaruu..! saahitya nEthrm lO telugu taip yelaa chEyaalO teliyaTam Ledu. naa mail lO charchha lO raayaTaaniki ibbandidaa vundi.
ఆదిశేషా రెడ్డి గారూ,
సాహిత్యనేత్రం వెబ్సైటులో ఇప్పుడు నేరుగా తెలుగులోనే వ్యాఖ్యలు రాసే సౌలభ్యం కల్పించబడింది. గమనించగలరు. -త్రివిక్రమ్
తెలుగుభాషకు ప్రాచీనహోదా దక్కించటంలో తెలుగు అధికారభాషా సంఘం అధ్యక్షుడు, ప్రముఖ పాత్రికేయులు ఏ.బి.కె.ప్రసాద్ చేసిన కృషి ప్రశంసనీయం. కేంద్రంలో ఉన్న కమిటీకి నివేదికలు ఇవ్వడం, సచివాలయంలో సంప్రదింపులు జరపడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడితేవడంలో ఏ.బి.కె.ప్రసాద్ కీలక పాత్ర వహించారు.ప్రాచీన హోదాకు కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తూ, తెలుగు భాష ప్రాచుర్యానికి విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ మధ్యనే తెలుగు భాషా పతాకాన్ని రూపకల్పన చేసి ఆవిష్కరింపజేశారు. వచ్చేఉగాది నుంచి ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లోనూ తెలుగువారి ఇళ్ళ ముంగిట ఈ పతాకం రెపరెపలాడాలని ఆయన ఆకాంక్షించారు. సరిగ్గా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవానికి ఒకరోజు ముందు కేంద్ర ప్రభుత్వం పాచీనహోదా కల్పించడంతో రాష్ట్రమంతా పండుగ వాతావరణం నెలకొంది.స్వంత భాషలకు తిలోదకాలిచ్చి నిజమైన అభ్యుదయాన్ని సాధించలేరన్న గాంధీజీ మాటలు తనకు స్పూర్తి అంటారు ఏబికే.
నేరుగా తెలుగులోనే వ్యాఖ్యలు రాసే సౌలభ్యం కల్పించండి
భారత ముస్లింలలో 85% మంది పూర్వీకులు హిందూ దళితులే!
కుల వివక్ష భరించలేకే మత మార్పిడులు
మానవ వనరుల అభివృద్ధి శాఖ సలహాదారు నివేదిక
న్యూఢిల్లీ, ఆగస్టు 10: మనదేశంలోని ముస్లింలలో 85 శాతం మంది పూర్వీకులు హిందూ దళిత, వెనుకబడిన కులాల వారేనని తాజా నివేదిక వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోసం కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ సలహాదారు కృష్ణన్ ఇచ్చిన ఈ నివేదిక దేశంలోని ముస్లింల పూర్వాపరాలు, వారి పరిస్థితులను వెలుగులోకి తెచ్చింది. వర్ణవ్యవస్థ నుంచి బయటపడేందుకు వచ్చిన అవకాశాలలో భాగంగానే వీరు ఇస్లాం మ తాన్ని స్వీకరించారంది. హిందువులు ఇస్లాంలోకి మారడం మధ్యయుగంలోనే ప్రారంభమైందని కృష్ణన్ పీటీఐకి చెప్పారు.
‘హిందూమతంలోని కులవ్యవస్థ చాలా కఠినమైనది. అధికారక్రమంలో అది ఒక్కో కులానికి ఒక్కో స్థానా న్నిచ్చింది. అణగారిన కులాలను ఆ వ్యవస్థ పైకి రానీయదు. అందుకే వారు ఇస్లాంను స్వీకరించారు’ అన్నారు. హిందూయిజంలో కొన్ని కులాలను అంటరానివారుగా చూస్తారని నివేదిక వెల్లడించింది. అవకాశం వచ్చినప్పుడల్లా వారంతా బయటపడేందుకు ప్రయత్నించారని, వారందరికీ ఇస్లాం ఉపశమనం కలిగించిందని అన్నారు. ఆంధ్రపదేశ్‌లోని క్రైస్తవులలో 98 శాతంమంది పూర్వీకులు హిందూమతంలోని దళిత కులాల నుంచి వచ్చినవారేనని కృష్ణన్ చెప్పారు.
పంజాబ్‌వాసులు సిక్కుమతాన్ని స్వీకరించారని తెలిపారు. వీరు మతం మారినా వెనుకబాటుతనం వారిని విడువలేదన్నారు. దీన్ని గుర్తించే అనేకమంది పాలకులు ముస్లింల కోసం రిజర్వేషన్‌ను ప్రవేశపెట్టారని, వారు జనజీవనస్రవంతిలోకి వచ్చేలా సహాయం చేశారని తెలిపారు. ‘కొల్హాపూర్ మహారాజు తొలిసారిగా 1902లో ముస్లింలకు రిజర్వేషన్ ప్రవేశపెట్టారు. 1921లో మైసూర్ మహారాజు కూడా అదే చర్య చేపట్టారు. బాంబే ప్రెసిడెన్సీ, అనంతరం మద్రాసు ప్రెసిడెన్సీ కూడా ఈ కోటాను ప్రవేశపెట్టాయి’ అని పేర్కొన్నారు. వివిధప్రాంతాల్లో పర్యటించి, భారత్‌లో సామాజిక వ్యవస్థపై సాహిత్యాన్ని పరిశీలించి వాటి ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.(ఆంధ్రజ్యోతి 11.8.2008).