ఈ చిరునామా వెతికి పెట్టండి

– జోగధేను స్వరూప్‌కృష్ణ

ఈ చిరునామా వెతికి పెట్టండి
శతాబ్ధాలుగా తిరుగుతున్నా
సందుల్లో, గొందుల్లో, చెట్లకిందా, పుట్టల్లో
కొండల్లో, లోయల్లో, నదులు, పర్వతాలు,
వీధులు, చౌరస్తాలు, కూడళ్ళు,
మనిషి గుండెల్లో పెనులోతుల్లో
మనసుల్లో, మష్తిష్కాలలో
ఎంతని వెతికినా, ఎక్కడ వెతికినా
మచ్చుకైనా ఆచూకీ తెలియకుండా
కొన్ని సార్లు దొరికినట్టే దొరికి తప్పించుకుపోయింది
దయచేసి ఈ చిరునామా కాస్త వెతికిపెట్టండి.

నిప్పులాంటి నిజం చెప్పిన పాపానికి
చైతన్యం నూరిపోసే ప్రయత్నం చేసినందుకు
జైలు గోడల్లో బంధించి
విషాన్ని గొంతులోతుల్లో నింపి
నిజాన్ని సమాధి చేసినప్పుడే
శోకంతో కుమిలిన సోక్రటీస్
గొంతెత్తి అరిచాడు ఈ చిరునామా వెతికి పెట్టండని
అప్పుడు దారి తప్పింది
మళ్ళీ ఇప్పటి దాకా వెతుకుతూనే ఉన్నాను
దయచేసి ఈ చిరునామా కాస్త వెతికిపెట్టండి.

అహింస పరమ ధర్మమని
మనిషే దేవుడని
కొత్త రాజ్యాన్ని స్థాపించే ప్రయత్నంలో
రక్తాన్ని చిందించిన ప్రభువును
ముళ్ళ కిరీటం, శిలువలతో సత్కరించినపుడు
అమాయకులంతా అరిచారు
ఈ చిరునామా వెతికి పెట్టండని
వాళ్ళతో గొంతు కలిపి అప్పట్నుంచి అరుస్తూనే ఉన్నా
అప్పుడూ దారి తప్పింది
మళ్ళీ ఇప్పటి దాకా వెతుకుతూనే ఉన్నాను
దయచేసి ఈ చిరునామా కాస్త వెతికిపెట్టండి.

కత్తికి పూలు కట్టి
వేటుకో తలనరికి
రక్తపు పూల సువాసన మరిగిన
అశోకుడు కళింగ యుద్దంలో పారించిన
రక్తపు టద్దంలో చరిత్ర హీనంగా కనిపించినప్పుడు
ఆ ప్రతిబింబాల్లో కనిపించిన వికృతం
వినిపించిన వికటాట్టహాసం
చరిత్ర పుటలను నలుపు చేస్తున్నప్పుడు
బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి
అన్న శబ్దాల్లో కనీ కనిపించినట్టు
కనిపించి మాయమై పోయింది
అప్పుడూ దారి తప్పింది
మళ్ళీ ఇప్పటి దాకా వెతుకుతూనే ఉన్నాను
దయచేసి ఈ చిరునామా కాస్త వెతికిపెట్టండి

దేవాలయం మెట్లమీద కత్తికో కండగా
హైందవుల ప్రాణాలను తీసి
పిలక మీద పన్ను, జుట్టు మీద పన్ను
నడిస్తే పన్ను, ఏడిస్తే పన్ను
జన జీవనాన్ని అతలాకుతలం చేసి
సంస్కృతి ని ఛిన్నాభిన్నం చేసినప్పుడు
ఈ చిరునామా వెతికి పెట్టండి అన్న
నిర్భాగ్యుల ఆక్రందనలు విని
ఇప్పటికీ వెతుకుతూనే ఉన్నా
అప్పుడూ దారి తప్పింది
మళ్ళీ ఇప్పటి దాకా వెతుకుతూనే ఉన్నాను
దయచేసి ఈ చిరునామా కాస్త వెతికిపెట్టండి

ఒక్కడు పూనుకొని
దరిద్ర నారాయణులకు తోడై నిలిచి
సత్యం, అహింసల తోడుగా యుద్ధం చేసి
జాతి శృంఖలా ఛిన్నం చేస్తే
ప్రార్థన చప్పుళ్ళలో తుపాకీ చప్పుళ్ళు
హే రాం……….
మహాత్ముడెక్కిన మరణ శయ్యలో
వెతికినప్పుడు
ఎక్కడో దాక్కుంది మళ్ళీ కనిపించలేదు
అప్పుడూ దారి తప్పింది
మళ్ళీ ఇప్పటి దాకా వెతుకుతూనే ఉన్నాను
దయచేసి ఈ చిరునామా కాస్త వెతికిపెట్టండి

మితి మీరిన సామ్రాజ్య దాహం
ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకుందామని
రాక్షసత్వానికి పరాకాష్ఠ
హిరోషిమా నాగసాకి
ఊళ్ళకి ఊళ్ళే ధ్వంసం చేసే
మారణకాండలో మగ్గిన జనం
గొంతెత్తి అరిచారు ఈ చిరునామా వెతికి పెట్టండని
అప్పుడూ దారి తప్పింది
మళ్ళీ ఇప్పటి దాకా వెతుకుతూనే ఉన్నాను
దయచేసి ఈ చిరునామా కాస్త వెతికిపెట్టండి

స్వర్ణాలయంలో సిక్కుల ఊచకోత
మసీదుల్లో ప్రార్థనల మధ్య పేలిన
టిఫిన్ బాంబులు
పేలిన శరీరాలు
పవిత్ర వాక్యాల మధ్యలో
ఈ చిరునామా వెతకండన్న అరుపులు
అప్పుడూ దారి తప్పింది
మళ్ళీ ఇప్పటి దాకా వెతుకుతూనే ఉన్నాను
దయచేసి ఈ చిరునామా కాస్త వెతికిపెట్టండి

మొన్నామధ్య గాంధి చౌరస్తాలో
తెగిన తలలు
రక్తం కక్కిన కొడవళ్ళు
ముఠా కక్షల్లో భూమికి రక్త తర్పణం
చుట్టూ మూగిన జనం గుసగుసల్లో
ఈ చిరునామా కోసం ఆరాటం
అప్పుడూ దారి తప్పింది
మళ్ళీ ఇప్పటి దాకా వెతుకుతూనే ఉన్నాను
దయచేసి ఈ చిరునామా కాస్త వెతికిపెట్టండి

సున్నితమైన ప్రేమ భావనకు
విలువనియ్యక
కత్తి మెడమీద పెట్టి
ప్రేమిస్తావా చస్తావా అంటూ
చదువుల తల్లి నిలయంలో
యాసిడ్‌తో, కత్తితో దాడి
అప్పుడే వికసిస్తున్న మొగ్గలను
నేలరాచినప్పుడు
లోకం గొంతెత్తి ఈ చిరునామా కోసం వెతికితే
అప్పుడూ దారి తప్పింది
మళ్ళీ ఇప్పటి దాకా వెతుకుతూనే ఉన్నాను
దయచేసి ఈ చిరునామా కాస్త వెతికిపెట్టండి

కళ్ళు మూసుకుపోయి కామంతో
పసి మొగ్గలని కూడా చూడకుండా
ఒక్కసారిగా కబళించి
పసి జీవితాలతో ఆడుకున్న వైనం
పేపర్లో చదివి టీ కొట్టు దగ్గర
గుంపులు గుంపులుగా చర్చించుకుంటూ
ముక్కు మీద వేలేసుకున్నప్పుడు
ఈ చిరునామా వెతికి పెట్టండని అరిచా
దొరకలేదు.,…
దయచేసి ఈ చిరునామా వెతికి పెట్టండి…

కనీ పెంచిన కన్నపేగు
కొన్నేళ్ళుగా పడిన బాధలను
మొక్కకు అంటుకట్టిన వైనాన్ని
పాదులు తీసి ఎరువులు వేసి పెంచిన వైనాన్ని
పట్టించుకోకుండా
రెక్కలు రాగానే గుండెలమీద తన్నిన
తాపులను చూస్తూ, పున్నామో నరక త్రాయతి ఇతి పుత్ర ఒకప్పుడు
పుట్టినప్పుడే నరకం చూపించే పుత్రులు ఇప్పుడు…
బతకలేక వీధులపాలైన తల్లిదండ్రుల ఆక్రందనల్లో
ఈ చిరునామా కోసం అరుపులు వినిపించాయి…

నిజాన్ని సమాధి చేసే సంస్కృతి
బాల్యం గుండెల్లో తూట్లు పొడిచే వికృతత్వం
కామంతో పసిమొగ్గలను చిదిమేసే వికారత్వం
ప్రాణం విలువ తెలిసీ గొంతు నులిమే రాక్షసత్వం
నవ్వుతూనే విషం చిమ్మగలిగే బహు నాటకత్వం
ముఖానికి మాస్క్ వేసుకుని
అసలు రంగు కనిపించనీయకుండా మసలే మూర్ఖత్వం
బంధాలు మరచిపోయి
అనుబంధాల ఊసే లేని
ప్రేమలకు చోటు లేని
విలువలు లేని జీవితాలు
నిజానికి ప్రపంచం పేలిపోతోంది
నాగరికత ముసుగులో అనాగరికత తాండవం
చూడలేక పారిపోయింది….
ఎక్కడుందని వెతకాలి

ఎక్కడా కనిపించని ఈ చిరునామా
మరేమీ కాదు….
నేను వెతుకుతున్నది
మానవత్వం కేరాఫ్ ప్రపంచం,
మనిషి పుట్టినప్పుడే సహజ లక్షణం
మానవత్వం కోల్పోయిన దశలో
తరతరాల చరిత్ర పుటల్లో
ప్రతి పేజీలో
మరకలే, మానవత్వం మరుగున పడిన సందర్భాలే
ఇప్పుడు జనారణ్యాలలో తిరుగుతున్న కౄర మృగాలను
వేటాడ్డానికి ఎవరో రావాలి
మానవత్వం పంచే ఒక మదర్
అహింసను బోధించే ఒక జీసస్
సత్యాన్ని నేర్పే ఒక మహాత్ముడు
విలువల్ని కాపాడే ఒక రాముడు
మళ్ళీ వస్తే చిరునామా దొరికినట్టే
ఈ చిరునామా దొరకాలి…..

————

స్వరూప్ కృష్ణమూర్తి

డా. జోగధేను స్వరూప్ కృష్ణ, ఎం.ఏ., ఎం.ఫిల్, పి.హెచ్.డి, కడప జిల్లా ప్రొద్దటూరు లోని ఎస్. సి. ఎన్. ఆర్. కళాశాలలో తెలుగు శాఖలో రీడర్ గా పని చేస్తున్నారు. ఇప్పుడో నది కావాలి ( కవిత సంపుటి), Intangible cultural heritage of folk arts of Rayalaseema లను ప్రచురించారు. వీరి స్వంత వెబ్ సైటు – http://renatisuryachandrulu.com. 24fps.co.in లో కూడా రాస్తూంటారు. సుజనరంజనిలో కళా జానపదం శీర్షికను నిర్వహిస్తున్నారు. రేడియో ప్రసంగాలు, తెవికీలో రాయడం, కవితలు రాయడం వీరి ఇతర వ్యాసంగాలు.

This entry was posted in కవిత్వం. Bookmark the permalink.

8 Responses to ఈ చిరునామా వెతికి పెట్టండి

  1. Vasu says:

    chala bagundi sir

  2. radhika says:

    caalaa baagumdamDi.

  3. కొత్తపాళీ says:

    WOW!!

  4. saikrishna says:

    nijaaniki akshara rupam ….. adbhutam guruvu gaaru

  5. లింగేశ్వర్ says:

    జీవిత సత్యం చెప్పారు మీరు…

  6. రాధ కృష్ణ, హైదరాబాద్ says:

    చాల …..ఎంచుకున్న ఉదాహరణలు కొన్ని చోట్ల అంత స్పష్టంగా లేక పోయినా మొత్తంమీద చాలా బాగుంది..

  7. కృష్ణ్ గారు,
    సమాజం లో నిత్యం జరుగుతున్న అన్యాయలకు , దిగజారుతున్న విలువలకు ప్రజలు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారేగాని తమ వంతు భాధ్య్తతగ ఎదుర్కున్న సంఘటనలు చరిత్రలో చాల అరుదు అనే చెప్పవచ్చు . వీటిలో కూడా చాలా సందర్భాలలో
    రచయితలు తమ రచనలు ద్వారా ప్రజలను కార్యోన్ముఖులను చేసినవే అనేకం. మీ ఆవేదన లో అర్ధమున్నది.
    తప్ప కుండా ” ఆ చిరునామా” దొరుకుతుంది. కాని ఒక విషయం నాకనిపిస్తుంది. ఈ “ఆవేదన” ని… ఒక సోక్రటీసు,ఒక మదర్, ఒక జీసస్, ఒక మహాత్ముడు, ఒక రాముడు…ఇలా ఎందరో అనుభవించారు. కానీ వారె వరు “ఎవరి” కోసమో ఎదురు చూడలేదు కదా. ఆ ‘ ఎవరో’ మనమే ఎందుకు కాకూడదు. ఆలోచించండి…..కాని కొన్ని చోట్ల ఐడియాలు రిపీట్ అయి నవి అని పిస్తుంది. ఉదా: బంధాలు, అను బంధాల గురించి రెండు సార్లు ప్రస్తావించారు. మొత్తం మీద కవిత చాలా బాగుంది.

  8. ramacharybangaru says:

    గౌరవనీయ కృష్ణ గారు,
    మీ ఆర్తిని సహృదయంతో గ్రహించినాను. ఒక్కింత మానవత్వంతో ఆలోచించి ఇతరుల కోసం మనమేదైనా చేస్తే మీరు కోరుకుంటున్న చిరునామా తప్పకుండా దొరుకుతుందన్న ఆశ నాలో బాగా ఉంది.
    ramachary bangaru.
    12.11.2008 7.25pm

    [ఈ వ్యాఖ్య RTS నుంచి తెలుగులోనికి మార్చబడింది. -సం.]

Comments are closed.