ఎర్రటి బాణం ఆకాశానికి గురిపెట్టి ఉంటుంది. అది ఆ సంస్థ చిహ్నం. అచ్చు ఆ బాణంలాగే లక్ష్యమ్మీదే దృష్టి కేంద్రీకరించి వారి రాకెట్ నిలబడి ఉంటుంది. అది ఎక్కుపెట్టిన రామబాణం. శ్రీహరికోటలోని లాంచ్‌ప్యాడే కోదండం. ధనుర్విముక్తశరం లాగా నభోమండలాన్ని చీల్చుకుంటూ అది దూసుకుపోతుంటే ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగుతుంది. మంత్రించిన బ్రహ్మాస్త్రం అది. చెప్పిన పనిని చెప్పినట్టుగా, చెప్పిన సమయానికి, ఏమాత్రం గురి తప్పకుండా పూర్తి చేసేస్తుంది. ఆ బ్రహ్మాస్త్ర ప్రయోగ మంత్రం ప్రయోక్తకు బాగా తెలుసు. ఆ ప్రయోక్తే భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ – ఇస్రో!
స్వతంత్ర భారత దేశం సాధించిన విజయాలలో శాస్త్ర సాంకేతిక రంగం ప్రధానమైనది. ఈ రంగంలో పేరెన్నిక గన్న విజయగాథ ఇస్రో. అమెరికా చంద్రుడి మీదకు మనిషిని పంపించామని చెప్పుకున్ననాటికి ఇస్రో ఇంకా రూపే దాల్చలేదు. భారత అంతరిక్ష విజ్ఞానం సౌండింగు రాకెట్లతో ప్రయోగాలు చేస్తోంది -దీపావళి అవ్వాయి సువ్వాయిలు కాల్చుకుంటోందన్నమాట. నాలుగు దశాబ్దాలు గడిచాక, ఇవ్వాళ, ఇస్రో తలపెట్టిన చంద్రయానంలో మేమూ పాలుపంచుకుంటాం అని ఆ అమెరికాయే ముందుకొస్తోంది. అదీ ఇస్రో ఘనత!
పేదరికంతో అల్లాడిపోతున్న దేశానికి ఈ రాకెట్లూ, ఉపగ్రహాలూ ఎందుకు అని అన్నవారికి ఇస్రో రూపశిల్పి విక్రమ్ సారాభాయ్ దార్శనికతే సమాధానం. సారాభాయ్ ఇలా అన్నారు: “…జాతీయ స్థాయిలోను, అంతర్జాతీయంగానూ అర్థవంతమైన పాత్ర పోషించగలగాలంటే, ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని మానవ సమాజ సమస్యల పరిష్కారానికి ఉపయోగించుకోవడంలో మనం ఎవరికీ తీసిపోకుండా ఉండాలి.”
ఆ ఎవరికీ తీసిపోకుండా ఉండటమే ఇస్రో విజయాలకు మూల మంత్రం.
ఇస్రో మనకు చాలా ఇచ్చింది.. ఇంటింటికీ టీవీ కార్యక్రమాలు, వాతావరణ పరిశీలన, పర్యావరణ పరిశీలన, దూరవిద్య,.. ఇలా ఎన్నెన్నో. ఒక లెక్క ప్రకారం ఇప్పటి వరకూ ఇస్రో మీద పెట్టిన పెట్టుబడికి ఒకటిన్నరరెట్ల విలువైన సేవలను అది భారతావనికి అందించింది. అయితే వీటన్నిటికీ మించి ఇస్రో జాతికి చేసిన గొప్ప సేవ – డబ్బుల్లో కొలవలేనిది – ఒకటుంది. అదే.. ఇస్రో మనకిచ్చిన స్ఫూర్తి. మనం చెయ్యగలమా అనే స్థాయి నుండి మనమూ చెయ్యగలము అనే స్థాయిని దాటి మనమే చెయ్యగలం అనే స్థాయికి మనలను చేర్చింది ఇస్రో! అవును మరి.. పదేసి ఉపగ్రహాలను – అంతటి బరువున్న, అన్ని ఉపగ్రహాలను – ఒక్ఖ ఊపులో తీసుకుపోగలిగినది మనమే!
ఇస్రో తయారు చేసిన రాకెట్లకు రెండు వైపులా పదునే! ఉపగ్రహాలను మోసుకుంటూ అంతరిక్షంలోకి దూసుకెళ్ళినపుడు అది ఎస్సెల్వీ. ఆయుధాలను నింపుకుని శత్రువును గురిచూసినపుడు అదే ఆగ్నేయాస్త్రం.
ఇస్రోది అసలు వైఫల్యమే లేని నిరంతర విజయగాథేమీ కాదు. క్రయోజెనిక్ ఇంజన్ టెక్నాలజీ ఇస్రోకి ఇంకా కొరకరాని కొయ్యే! ఈ ఇంజన్లను స్వంతంగా తానే తయారుచెయ్యదలచి, సత్ఫలితాలు రాకపోవడం చేత రష్యా నుండి ఇంజన్లను, పరిజ్ఞానాన్ని కొనాలని తలపెట్టింది. కానీ అమెరికా సైంధవ పాత్ర కారణంగా ఆ పరిజ్ఞానాన్ని సంపాదించలేకపోయింది, కేవలం ఇంజన్లు మాత్రమే పొందింది. జీయెస్సెల్వీ ప్రయోగం వెనకబడడానికి ఇది ప్రధాన కారణం. ఇప్పుడు క్రయోజెనిక్ ఇంజన్లు కూడా తయారు చేసామని ఇస్రో చెబుతోంది. అయితే అది వివాదాస్పద అంశం. అలాగే ఇస్రో సంధించిన ప్రతీ రాకెట్టూ దూసుకుపోలేదు. కొన్ని నేలనూ పడ్డాయి. ప్రయోగాలు విఫలమయ్యాయే గానీ, ఇస్రో విఫలం కాలేదు. ప్రతీ వైఫల్యాన్నీ ఒక పాఠంగా, తరువాతి విజయానికి మెట్టుగా చేసుకుని సూటిగా అంతరిక్షంలోకి దూసుకుపోతోంది. ఈ దిగ్విజయగాథ వెనక ఎందరో భారతీయుల మేధోసంపద ఉంది. అనుకున్నది సాధించి తీరాలన్న వారి తపన, పట్టుదల ఉన్నాయి.
వైఫల్యాలను తలచినపుడు 2001 మార్చి లో జరిగిన జీయెస్సెల్వీ వైఫల్యాన్ని మననం చేసుకోవాలి. భూస్థిర కక్ష్యలో ఉపగ్రహాలను ప్రవేశపెట్టగలిగిన జీయెస్సెల్వీ మొదటి ప్రయోగమది. మొదటి దశలోని స్ట్రాప్-ఆన్ బూస్టర్లను మండించినపుడు నాలుగు స్ట్రాప్-ఆన్‌ల లో ఒక బూస్టరు మండలేదని ప్రయోగాన్ని పర్యవేక్షిస్తున్న కంప్యూటర్లు పసిగట్టాయి. వెంటనే ఇంజన్లను ఆపివేసి, ప్రయోగాన్ని రద్దు చేసేసాయి. ఒక పెద్ద ప్రమాదం జరిగి ఉపగ్రహంతో సహా వాహకనౌక పేలిపోవాల్సిన పరిస్థితిలో ప్రమాదాన్ని సమర్థవంతంగా నివారించారు. అంతేకాదు, నెల రోజుల లోపే, ఏప్రిల్ 18న అదే జీయెస్సెల్వీ డి1 ని విజయవంతంగా ప్రయోగించి జిశాట్-1 అనే ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టారు. 2003 లో బ్రెజిల్‌లో జరిగిన ఇటువంటి ప్రమాదంలోనే లాంచ్‌ప్యాడు మీద ఉంచిన వాహకనౌక ఇంజను ప్రమాదవశాత్తూ పేలిపోయి, 21 మంది మరణించారు. ఈ ప్రమాదం కారణంగా బ్రెజిల్ అంతరిక్ష పరిశోధనలు అనేక సంవత్సరాలు వెనకబడ్డాయి.
ఇస్రో తయారు చేసానంటున్న క్రయోజెనిక్ ఇంజన్ల విషయం వివాదాస్పదమైనప్పటికీ, నిర్వివాదాంశమొకటుంది.. ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయమైన రాకెట్లలో పీయెస్సెల్వీ ఒకటి. మనకే గాదు, బయటి దేశాల ఉపగ్రహాలకు కూడా ఇది విశ్వసనీయమైనదే! అందుకే ఇజ్రాయిల్ నుండి ఇటలీ దాకా తమ ఉపగ్రహాల ప్రయోగానికి ఇస్రోనే నమ్మారు. కెనడా, జర్మనీ విశ్వవిద్యాలయాల నానో ఉపగ్రహాలకూ పీయెస్సెల్వీయే నమ్మకమైనది. ఆ పీయెస్సెల్వీ పరిజ్ఞానమే రేపు చంద్రయానానికి కూడా వాహనం కాబోతోంది.
ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం, మేధ అంతరిక్ష స్థాయిలో ఉన్నా కాళ్ళు స్థిరంగా భూమ్మీదే ఉండటం బహుశా ఆ సంస్థకు సహజంగా అబ్బిన భారతీయ సంస్కృతి వలన కావచ్చు. కొన్ని సంస్థలలో ఓ మూణ్ణాలుగు నెలల ప్రాజెక్టు పూర్తి కాగానే పార్టీలు, హంగామాలు చెయ్యడం చూస్తూంటాం, కాని ఇస్రోలో అలాటి హంగామాలేవీ కనిపించవు. బహుశా విజయాలకు అలవాటు పడిపోవడం వల్ల కూడానేమో! ఇస్రో తన గురించి గొప్పలెప్పుడూ చెప్పుకోదు. గొప్ప గొప్ప పనులు చేసి చూపిస్తుంది. తన ఘన కార్యాలకు గర్వపడదు. ప్రతి భారతీయుణ్ణీ గర్వపడేలా చేస్తుంది. చంద్రుణ్ణి తీసికొస్తాము, తారకలను దూసి తెస్తాము అంటూ హోరెత్తించే నాయకులున్న దేశంలో, ఆ పనుల్ని చేసి చూపిస్తున్న మౌన ముని, ఇస్రో! అంతరిక్షాన్నంటే విజ్ఞానం తమ సొంతమైనా కూడా, ప్రతీ ప్రయోగానికీ ముందు, సర్వశక్తివంతుడైన భగవంతుణ్ణి ప్రార్థించడం ఇస్రో శాస్త్రవేత్తలకు ఆనవాయితీ.
శాస్త్ర , సాంకేతిక రంగాల్లో ముందంజ వేసి, అనేక విజయాలను అందించిన సంస్థలు పౌరులతో, ముఖ్యంగా విద్యార్థులతో నేరుగా సంపర్కం పెట్టుకుని ఆయా రంగాల గురించి మరింత అవగాహన, తద్వారా ఆసక్తినీ కలిగించవలసిన అవసరం ఉంది. మన దేశంలో అటువంటి ప్రయత్నం చేస్తున్న సంస్థలు తక్కువ. ఇస్రో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ నిర్వహణలో చురుగ్గా పాల్గొంటున్నప్పటికీ, చిన్న తరగతుల విద్యార్థుల కోసం కార్యక్రమాలు చెయ్యవలసిన అవసరం ఉంది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా మన దేశంలో ఇటువంటి కార్యక్రమాలు చేస్తోంది.
ఇస్రో వాణిజ్యపరంగా ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెడుతూ ఈ రంగంలో నిలదొక్కుకుని ఉన్న అతి కొద్ది దేశాలతో పోటీ పడగలిగే స్థాయికి చేరింది. త్వరలో జరపనున్న మొదటి చంద్రయానం తరువాత మానవ సహిత అంతరిక్ష యాత్ర చేసే ప్రణాళిక కూడా ఇస్రోకు ఉంది. ఈ ప్రయోగాలు, పరిశోధనలు, ప్రణాళికలు.. అన్నీ విజయవంతమై ఇస్రో, అంతరిక్ష పరిశోధనారంగంలో ప్రపంచంలోనే అగ్రగామి సంస్థగా ఇస్రో విశ్వస్య రాజతీ” అనిపించుకోవాలని ఆశిద్దాం.
-తుమ్మల శిరీష్ కుమార్ (చదువరి)
చదువరి గారు,
ఈ వ్యాసం ప్రచురించినందుకు చాలా ఆనందించాను. ఇస్రో సాధించిన విజయం ఆషామాషీ విజయం కాదు. మనకున్న మౌలిక వసతుల్లో మన శాస్త్రజ్ఞులు చాలా గొప్ప విజయం సాధించారు. చంద్రయాన్ పైన నాకు మంచి ఆశను కలగచేసింది ఈ విజయం. చంద్రయాన్ కూడా విజయవంతం అవాలని ఆశిద్దాం.
చాలా బావుందండీ. సాధారణంగా బయట సులభంగా తెలియరాని విషయాలు, చక్కటి భాషలో చెప్పారు.
స్వాతంత్ర్యానంతర భారత దేశ ప్రగతికి ఇస్రో సాధించిన విజయాలు ఎంతో కీలకమైనవి. హరిత, సమాచార విప్లవాలతో భారతం కూడు, గుడ్డ సాధిస్తే, ఇస్రో లాంటి సంస్థల వైఙ్ఞానిక ప్రగతి దేశ భద్రతను, ప్రతిష్టను ఇనుమడింపచెసిదనటం నిర్వివాదాంశం.
nakenduko mana research meeda koncha asmtrupti vundi………….
every indian has salute to ISRO people.
A very nice write up, Thank you verymuch sir;
and my best wishes to ISRO..!!
2013, నవంబరు 10 సాయంత్రం ఆరున్నరకు NTV లో ఇస్రోపై ఒక కార్యక్రమం వచ్చింది. దాదాపు పూర్తిగా ఈ సంపాదకీయంపైనే ఆధారపడి ఆ కార్యక్రమాన్ని తయారుచేసారు. చివరి రెండు పేరాలు తప్పించి ఈ వ్యాసం మొత్తాన్ని నెరేషన్లో వాడుకున్నారు. ముందుగా మాకు చెప్పనందుకు బాధేమీ లేదు, వ్యాసం వారికి నచ్చినందుకు సంతోషంగా ఉంది.
ఇదీ మన భరతీయుల సంస్కృతి. మీ మేధస్సుని ఉపయోగించుకున్నందులకు సంతోషించడం చక్కని సంస్కారం. ఇంత మంచి విషయాలు తెలియజెప్పినందులకు అభినందనలు.
చాలా బాగుందండీ.