నీ రాక కోసం..

నిషిగంధ

చేతికంటిన ముళ్ళ గోరింట
రంగు వెలిసిపోతోంది
ఈసారైనా కాస్త ముందొస్తావనుకున్నా..

నువ్వొస్తేనే కదా
స్వప్నాలు నిద్రలేచేది
మనసు ఆదమరిచేది..

ఒక్కోసారి మంచు తడియారకుండానే
కళ్ళ ముందుంటావ్..
ఆ ఆకస్మిక ఆనందం మళ్ళీ ఎప్పుడో!?

కాలికింద నలిగిన
ఎండుటాకుల నిర్లిప్తత
రాత్రంతా గుచ్చుకుంటూనే ఉంది..

ఇంకెన్నిరోజులిలా!?

దిగులుతో బాధేసి, కోపమొచ్చి
ఎదురుచూపుల్ని దుప్పట్లో కప్పేస్తుంటే
వినిపించింది నీ ఆగమన రాగం!

కిటికీ అవతల నిశాంతంలో
కొమ్మ కొమ్మకీ కొత్త ఆశల
చిగురులద్దుతూ నువ్వు!
నీ అడుగుల వెనక
అలుముకుంటున్న రంగుల్లోకి
జారిపోయేముందు
అందరికీ చెప్పిరానీ
నా ప్రియసఖి వసంతమొచ్చిందని!!

————-
నిషిగంధశ్రీవారికి ప్రేమలేఖతో సుప్రసిద్ధులైన నిషిగంధ విజయవాడలో పుట్టి, పెరిగారు. ప్రస్తుతం అమెరికాలో, మయామిలో సిస్టమ్స్ ఎనలిస్ట్ గా పనిచేస్తున్నారు. వదలకుండా పుస్తకాలు చదవడం, కదలకుండా సినిమాలు చూడటం, ఆపకుండా పాటలు వినడం, విడవకుండా స్నేహితులతో కబుర్లు చెప్పడం, అలవకుండా వంట చేయడం ఆమెకు ఇష్టమైన విషయాలు. సంతోషంగా ఉండటమే ఆమె జీవితాశయం.

About నిషిగంధ

నిషిగంధ గారు పుట్టి పెరిగింది విజయవాడలో. ప్రస్తుతం ఉంటున్నది మయామి, యు.ఎస్.ఎ లో. సిస్టమ్స్ ఎనలిస్ట్ గా పని చేస్తున్నారు. ఇష్టమైన విషయాలు - వదలకుండా పుస్తకాలు చదవడం, కదలకుండా సినిమాలు చూడటం, ఆపకుండా పాటలు వినడం, విడవకుండా స్నేహితులతో కబుర్లు చెప్పడం, అలవకుండా వంట చేయడం.. జీవితాశయం సంతోషంగా ఉండటం.
This entry was posted in కవిత్వం. Bookmark the permalink.

9 Responses to నీ రాక కోసం..

  1. జాన్ హైడ్ కనుమూరి says:

    కాలికింద నలిగిన
    ఎండుటాకుల నిర్లిప్తత
    రాత్రంతా గుచ్చుకుంటూనే ఉంది..బాగుంది

    గోరింటాకును మాత్రమే చేతికిపెట్టుకుంటారు
    ముళ్ళగోరింటను కాదు
    మీరే అర్థంలో రాసారో?
    అభినందనలు

  2. radhika says:

    మీరు చెప్పిన ప్రతీ పదానికి ఒక దృశ్యం మెదులుతుంది కళ్ళముందు
    ప్రతీ భావానికి ఒక అనుభూతి కలుగుతుమంది మనసునందు
    అదేమిటో ఈ మధ్య వసంతం చాలా త్వరగా వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది.కానీ మీ ఈ వసంతగీతం మాత్రం గ్రీష్మంలో కూడా తోడుండేట్టువుంది చూస్తూవుంటే.
    జాన్ గారూ మామూలు గోరింటకన్నా ,ముళ్ళున్న గోరింట చెట్టు ఆకు బాగా పండుతుందని,ఎక్కువకాలం పోకుండా వుంటుందని అంటారు.నిషిగారి ఉదేశ్యంకూడా అదే అనుకుంటున్నాను.

  3. రమ్య says:

    చాలా బాగుందండీ.
    వసంత సౌరభాన్ని ఇప్పుడూ ఆస్వాదించేశా:)

  4. కవిత ప్రచురించినందుకు ‘పొద్దు ‘ వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు..

    నెనర్లు జాన్ గారు, రాధిక గారు, రమ్య గారు..

    ‘ముళ్ళ గోరింట ‘ విషయంలో పొద్దు సంపాదక వర్గానికీ ఇదే సందేహం కలిగింది.. ముళ్ళ గోరింట పూలు సామాన్యంగా అందరికీ తెలిసి ఉంటాయన్న నా అంచనా తప్పు అయినట్లుంది.. నేను యు.ఎస్ కి వచ్చేవరకు కూడా మా ఇంట్లో ఆ పూల చెట్టు ఉండేది.. కానీ ఇది కేవలం ప్రాంతీయం అయి ఉండొచ్చు. ఈ వివరణ చూడండి..

    — ముళ్ళ గోరింట రంగు వెలిసిపోతోంది
    ఇది గోరింటాకు కాదు.. మనకి డిసెంబర్, జనవరిల లో డిసెంబర్ పూలు, ముళ్ళ గోరింట పూలు (పసుపు రంగు) పూస్తాయి. డిసెంబర్ పూలు (తెలుపు, పింక్ రంగులు) జనవరి చివరికల్లా ఆగిపోయినా ముళ్ళ గోరింటలు ఒక్కోసారి మార్చి చివరి వరకూ పూస్తాయి.. ఇంకో విషయం ఏమిటంటే ఆ పూల పుప్పొడి చేతికంటుకుని చాలా సేపటి వరకు వదలదు.. చేతులకి అక్కడక్కడా పసుపు అంటించినట్లుంటుంది.. ఈ రంగు పోతోంది కానీ నువ్వు రావేంటని నిలదీయడం…

    మరి మీరేమంటారు? 🙂

  5. కామేశ్వర రావు says:

    చాలా బావుందండీ కవిత.
    ఎండుటాకుల నిర్లిప్తత రాత్రంతా గుచ్చుకోవడం…ఎదురుచూపుల్ని దుప్పట్లో కప్పేయడం… మీదైన కవితా సుమగంధాన్ని గుబాళిస్తున్నాయి!
    నాకు తోచిన ఒక్క రెండు చిన్న సవరణలు. “మంచు తడియారకుండానే” కన్నా అక్కడ “మంచుతడి ఆరకుండానే” అంటే ఇంకా బావుంటుందేమో.
    చివర్న మీ ప్రియసఖి వసంతమని మళ్ళీ ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రియసఖి వచ్చిందంటే సరిపోతుంది.

  6. radhika says:

    అయితే మీరు చెప్పిన ముళ్ళ గోరింట గురించి నాకు తెలియదు.నాకు తెలిసిన”ముళ్ళ గోరింట” సాధారణంగా పెళ్ళి కూతుళ్ళకి ప్రిఫర్ చేస్తారు.దాని ఆకులు దూస్తూ[కోస్తూ] వుంటే చిన్నగా అంతగా మొనలేని ముళ్ళు చురుక్కు చురుక్కుమని గుచ్చుతూవుంటాయి.కాని అది అరచేతిలో పండినప్పుడు రంగు చూస్తే కళ్ళు మెరుస్తాయి.

  7. జాన్ హైడ్ కనుమూరి says:

    నాకూ ముళ్ళగోరింట, గోరింటతో అనుబంధం వుంది
    కానీ కోస్తున్నప్పుడు అంటుకొనేది అనేవిషయం కవిత చదవగానే స్పురించటంలేదు.
    అందుకే గోరింటాకు అనుకొన్నా. ముళ్ళగోరింట ప్రాతీయం కావచ్చు. సాధారణంగా ఆడవాళ్ళు అందులోనూ కన్యలు ఎక్కువగా ఉపయోగిస్తారు. కొన్ని ప్రాంతాలలో ఆషాఢమాసానికి తప్పని సరిగా పెట్టుకొని, పండిన రంగును బట్టి ఎలాంటి మొగుడొస్తాడో అని చెపుతారు. కానీ గోరింట ప్రాతీయం కాదు. ఒక దగ్గరితనమేమిటంటే రెండింటికీ ముళ్ళుంటాయి.

  8. VS says:

    ముళ్ళ గోరింట రేకులంత మెత్తని కవిత్వాన్ని రాయటమే కాదు,చాలా రోజుల తర్వాత ముళ్ళగోరింట పూలని గుర్తు చేసారు,అలాగే ఎన్నో జ్ఞాపకాలను కూడా.వత్తుగా పెరిగిన పొదలకి ఆకు కనిపించకుండా పసుపు పచ్చని నక్షత్రాల్లా పూసే ఈ చెట్ట్లు గుంటూరు జిల్లా ప్రాంతాలలో ఎక్కడ చూసినా కనబడుతుండేవి.అప్పట్లో మా ఇంటి వెనుక కూడా ఉన్నట్లు గుర్తు.

  9. bollojubaba says:

    నిరీక్షణను చాలా రమ్యంగా చెప్పారు. కవిత చాలా బాగుంది.

    వీలైతే నాబ్లాగు దర్శించండి.
    బొల్లోజు బాబా
    http://sahitheeyanam.blogspot.com

Comments are closed.