అభినవ భువనవిజయము -1- ప్రార్థనతో ప్రారంభము

ప్రియమయిన పాఠకమహాశయులారా,

ఆ ప్రకారముగా… ఈ అభినవ భువనవిజయములో పాల్గొన్న కవులలో దాదాపు అందరూ కొత్తగా ఛందస్సును తెలుసుకొని, పద్యరచన నభ్యసిస్తున్న విద్యార్థులేయైనా, ఆశువుగా పద్యం చెప్పగల సమర్థులు వీరిలో లేకపోలేదు. అయితే, మంచి నాణ్యమైన పద్యాలను సృష్టించగల సౌలభ్యం కోసం కవులందరికీ కొద్ది రోజుల సమయం ఇవ్వబడింది. తామల్లిన పద్యాలతో ఒకరిద్దరి మినహా కవులందరూ ఉత్సాహంగా నిర్ణీత సమయానికి సిద్ధమయ్యారు. అధ్యక్షుల తొలిపలుకులతో సభ ప్రారంభమయింది. చిత్తగించండి…

‹కొత్తపాళీ› సర్వధారి నామ సంవత్సర ఉగాది సందర్భంగా ఈ అభినవ భువన విజయానికి విచ్చేసిన కవిపుంగవులకు స్వాగతం.
‹కొత్తపాళీ› గణపతిని తల్చుకుని సభ మొదలు పెడదాం. ఈ స్తుతి లలిత కవి శ్రీ తాడేపల్లి వారి రచన.

సీ. నిశ్శేష విజ్ఞాన నిధికాది గురువని,
గురువులు స్ఫురియింపఁ గొలుతు నిన్ను
నెల్ల సురలలోన నేకైక లఘువని,
లఘువులు తోప స్తోత్రంబొనర్తు
ఛాందసాగ్రేసరుఁ డందరిలోనని,
ఛందముల్ తట్టఁగా సన్నుతింతు
వర్తులాకృత మోదకార్తుండని తలంచి,
వృత్తముల్ కుదురఁగా వినుతి సేతు

తే.గీ.
మూషకుల్ మా తలంపుల మ్రుచ్చిలింప
కుండ నీ మూషికమునకు దండమిడుదు
కందములకెల్ల పెనుమూలకందమైన
గణపతికి మ్రొక్కెదన్ సాధుగణములొదవ.

గురు లఘువుల్తో మొదలు పెట్టి కంద వృత్తాల్ని కలుపుకుని కవికుల కంద మూలంగా గణపతిని స్తుతించారు ‘లలితకవి’ గారు.

‹భట్టుమూర్తి› ఏకైక లఘువు, ఛాందసాగ్రేసరుడు, మోదకార్తుండు, పెను మూల కందము – గణపతినిలా ఎందుకన్నారో!?

‹కొత్తపాళీ›

ఏకైక లఘువు – దేవతలలోకెల్లా పొట్టివాడు
ఛాందసాగ్రేసరుఁడు – ఛందస్సులు (వేదములు) చదివినవారిలో అగ్రేసరుఁడు. వేదపండితులలో కెల్లా గొప్పవాడు.
మోదకార్తుఁడు – ఉండ్రాలకై (అవి తినుటకై) ఆతురత గలవాడు.
కందము = మూలము
పెను-మూల-కందము = మూలములకే పెద్దమూలము
(వ్యంగ్యార్థం : కందపద్యాలకు ప్రేరణమైనవాడు)

‹రాకేశ్వరుడు› అద్భుతం. చాలా బాగుంది. శుభారంభము.

‹భట్టుమూర్తి› ఆహా! ఇప్పుడు… అర్థం తెలిశాక పద్యం బ్రహ్మాండంగా వుందనిపిస్తోంది. తాడేపల్లి మాస్టారూ, మీకు ధన్యవాదాలు మరియు అభినందనలు.

‹రాఘవ› కళ్ళు తెరవచ్చా కొత్తపాళీ గారూ 🙂
‹కొత్తపాళీ› రాఘవ కవీంద్రా .. మీ కళ్ళు మళ్ళీ మూయిస్తున్నాం! కానివ్వండి మరి
‹రాఘవ› ఆగండాగండి… అన్నట్టు ఎక్కడోగానీ కవి అంటే కనబడకుండా వినబడేవాడని చదివాను… ఇప్పుడు కవి అంటే కనబడుతూ వినబడనివాడని చెప్పాలేమో!

‹రాఘవ› ఇక… సరస్వతీస్తుతి

ఉ. ఫుల్లసరోరుహాక్షి విభవోన్నతకీర్తి విధాతృనాయికా
తొల్లిట సన్నుతింతుఁ సితతోయజ కుంద మరాళ చంద్ర శం
ఖోల్లసితాస్యవైన నినుఁ గూర్పగఁ బద్యములెన్నొ వాణి నీ
చల్లని చూపువెన్నెలలె చాలును మాకుఁ మహాసరస్వతీ.

‹రాఘవ› .
‹గిరి› రాఘవ, చివర్లో ఓ చక్కని చుక్కను వదిలేసుకున్నారేమీ! బావుంది, విధాతృనాయికా ప్రయోగం నచ్చింది. రెండవ పాదం చివరనుంచి మూడవ పాదం మొదలు – కాస్త వివరించాలి.
‹కొత్తపాళీ› హమ్మయ్య చల్లని చూపుతో సరిబెట్టారు.
‹రాఘవ› శ్వేతపద్మాసనా, శ్వేతగన్ధానులేపనా… అని కొలువబడే తెల్లని తల్లి కాబట్టి, యా కున్దేన్దుతుషారహారధవళా అన్నదారిలో, సితతోయజ (తెల్లతామర) కుంద (మల్లె) మరాళ (హంస) చంద్ర శంఖ ఉల్లసిత (ప్రకాశించే) ఆస్య (ముఖము). ఏమండీ… అలా చల్లని చూపుతో సరిబెట్టారు అన్నారు?
‹కొత్తపాళీ› ఎక్కడ కాటుక కంట నీరు పెట్టిస్తారో అని భయపడ్డాను .. ఎంతైనా “చంటి” వారు కదా!
‹రాఘవ› సగోత్రీకులమే గానీ… పోతన గారెక్కడండీ… ఏదో జానపదులం అంతే
‹విశ్వామిత్ర› మీరు జ్ఞానపదులు కూడ
‹రాఘవ› ఇంకా నయం. జాణపదులన్నారు కాదు 😉
‹విశ్వామిత్ర› ఆ విషయం ఇక్కడ అందరకీ తెలిసిందే అని ప్రస్తావించ లేదు

‹కొత్తపాళీ› సరస్వతీ దేవి ముఖం చంద్రునిలా ఉంది అంటూ చూపు వెన్నెల కురిపించడం – బాగా రక్తి కట్టింది.
‹విశ్వామిత్ర› “సాధు గణములొదవ”, “జల్లని చూపులు” బాగు బాగు
‹రాకేశ్వరుడు› ఉత్పలమాలలోఁ ఉత్పలాన్ని పలు మార్లు తలచి ఆనందింపజేసారు రాఘవా.

‹నాగరాజు› మహాసరస్వతీ అంటే?
‹రాఘవ› మహాకాళి, మహాలక్మి అన్నప్పుడు మా సరస్వతికేం తక్కువండీ, మహాసరస్వతే…
‹గిరి› మహబాగా చెప్పారు
‹భట్టుమూర్తి› రాఘవ, గడుసైన సమాధానం.

‹కొత్తపాళీ› వికటకవి గారు ఇష్టదేవతా ప్రార్ధనగా శ్రీరామచంద్రుని మీద ఒక కందం పంపారు.

అల దేవప్రముఖుల కో
ర్కెల దీర్పగ నీవు పుట్టి ఇల రాముడవై
జలజాక్షి జానకిం పెం
డిలియాడి ముదంబు గూర్చి విలసిల్లు మికన్

‹కొత్తపాళీ› చూశారా రాఘవా, ఎంత రామచంద్రుడైనా జానకి చెట్టబట్టితే గాని విలసిల్లడుట!
‹విశ్వామిత్ర› అవునండి, అయనను సీతా పతి అంటారు గాని, మా జానకీదేవిని “రామయ్యభార్య” అని పిలవరు ఊరూ వాడా.
‹రాఘవ› విశ్వామిత్ర, బావుంది మీ వరస… అమ్మాయి (ధరణిజ) పుట్టింట్లో అల్లుణ్ణే గదా కూతురి మొగుడనేది!
‹రాకేశ్వరుఁడు› రాంప్యారీ అనే పిలుపు లేకపోలేదు.
‹విశ్వామిత్ర› అది నా తాంబూలంలో ఓ విశేషం రాకేశా.

—————–

(తరువాయి భాగము >>)

——————-

సంకలనం: రానారె

This entry was posted in కవిత్వం and tagged . Bookmark the permalink.

3 Responses to అభినవ భువనవిజయము -1- ప్రార్థనతో ప్రారంభము

  1. పద్యాలు అదిరిపోయాయి. ఇంకా ఆ పాడింది ఎవరో కాని వారికి ప్రత్యేక అభినందనలు.
    మిగతా వాటి కోసం ఎదురు చూస్తున్నాం.

  2. అష్ట దిగ్గజాల్లో భట్టుమూర్తికి చాలా విషయాల్లో ప్రత్యేకత ఉన్నది – అందులో సంగీత పరిజ్ఞానం కూడా ఒకటి. వసుచరిత్రలో వారు సృష్టించిన నాయిక గిరిక ఏడుపొచ్చినప్పుడు “కాంభోజీ రాగ మేళ విపంచీ” స్వనంతో “సుధాపూరంబు తోరంబు”గా ఏడ్చిందిట!
    పేరు పెట్టుకున్నందుకు మన భట్టుపల్లె వీరుడు దీటైన వాణ్ణే అనిపించాడు. ఈ పాడి వినిపించటం పాయసంలో జీడిపప్పులు తగిల్నట్టుంది.

  3. కొత్తపాళీగారూ,

    ” …దీటైన వాణ్ణే అనిపించాడు” అన్నందుకు కృతజ్ఞతలు. కాకపోతే ఆ మాటకు అర్థం మరోకోణంలో వుందని ఇప్పుడే తెలిసింది. 🙂

    ఆచార్య ఎస్వీరామారావు గారి వ్యాసం ‘ప్రాచీన సాహిత్యంలో హాస్యం’ అనే వ్యాసం చదువుతూ వున్నాను. అందులోనుంచీ ఒక ముక్క చూడండి:
    ————-
    వరూధిని ‘కలస్వనంబుతో’ (మనుచరిత్ర), సత్యభామ ‘బాలపల్లవ గ్రాస కషాయకంఠ కలకంఠ వధూ కల కాకలీధ్వని’తో (పారిజాతాపహరణం), గిరిక ‘కాంభోజీమేళ విపంచికా రవసుధాపూరంబు తోరంబుగా’ (వసుచరిత్ర) శోకించిన పద్యాలు ప్రసిద్ధాలు. ఈ ముగ్గురు నాయికల ఏడ్పులు విన్న తెనాలిరామకృష్ణుడు

    అల్లసాని వాడల్లనల్లన యేడ్చె
    ముక్కుతిమ్మన ముద్దు ముద్దుగా నేడ్చె
    భట్టుమూర్తి బావురుమని ఏడ్చె

    అని చమత్కరించినాడు.
    ————-

Comments are closed.