OpenID: సర్వాంతర్యామి

ఈ వ్యాసం సాంకేతిక సమాచారంతో కూడుకున్నది కావడం వలన, అనేక ఇంగ్లీషు మాటలు అనివార్యంగా వాడవలసి వచ్చింది. పాఠకులు సహృదయంతో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం.

అంతర్జాలంలో అనేకానేక సైట్లలో మీకు ఖాతాలుంటాయి. రకరకాల పేర్లు, సంకేతనామాలతో ఖాతాలు తెరవడం, వాటిలో లాగిన్ అయి పనులుచేసుకోవడం, అప్పుడప్పుడు ఖాతా వివరాలు మర్చిపోయి తిప్పలు పడటం దాదాపు నెజ్జనులందరికీ అనుభవమే! పైగా సైట్లలో లాగిన్ అయ్యేటపుడు, మీ రహస్య సమాచారాన్ని అంతర్జాలంలో సురక్షితంగా తీసుకువెళ్ళడం ఆయా సైటుల బాధ్యత. కొందరు SSL అనే పద్ధతిలో సురక్షితంగా తీసుకువెళ్తారు గానీ, చాలామంది ఆ పద్ధతిని అనుసరించరు.

OpenIDఇలా సైటుకో ఖాతాను, పూటకో ఖాతాను సృష్టించుకోవడంలో ఉన్న ఇబ్బందులను తొలగించేందుకు తలపెట్టిన విధానమే.. OpenID- మీ విశ్వవ్యాప్త గుర్తింపు. ఈ ఒక్క ఓపెన్ ఐడీయే వందల వేల ఖాతాల పెట్టు! మీ ముక్కూ మొహమెరుగని ఏ సైటుకైనా వెళ్ళి, అక్కడ ఖాతాలాంటిదేమీ లేకుండానే దర్జాగా లాగినై, కుర్చీ వేసుక్కూచ్చుని కబుర్లు చెప్పొచ్చు – ఆ సైటు ఓపెన్ఐడీని అనుమతిస్తే చాలు!

క్లుప్తంగా OpenID అంటే ఇది

OpenID ఇచ్చే సైటు ఒకదానిలో మీరు ఖాతా తెరుస్తారు. ఈ సైటే ఓపెన్ ఐడీ ప్రొవైడరు.
ఆ సైటు మీకు గుర్తింపు నిస్తూ మీకొక URL ను కేటాయిస్తుంది. ఈ యూఆరెల్లే మీ OpenID!

ఇహ OpenID అనే ఈ URL ను పట్టుకుని మీరు దర్జాగా ఏ సైటుకైనా వెళ్ళి లాగినై పోవచ్చు. అయితే ఇక్కడో ముఖ్య విషయం.. మీరు లాగిన్ అవదల్చుకున్న సైటు ఈ ఓపెన్ఐడీ ని అనుమతించాలి. అప్పుడే మీరు లాగిన్ కాగలరు. ప్రపంచవ్యాప్తంగా వర్డ్‌ప్రెస్, బ్లాగర్ వంటి అనేక సైట్లు ఈ ఓపెన్ఐడీ ని సపోర్టు చేస్తున్నాయి. ఇప్పుడు సపోర్టు చెయ్యని సైట్లు రేపు చేస్తాయి; చెయ్యక తప్పదు. ఎందుకంటే ఈ ఓపెన్ఐడీ వాడుకరులకు అనేక ఇబ్బందులను తప్పించి వారికి సమాచారభద్రతను కల్పిస్తున్నది.

OpenID ఎవరు నెలకొల్పారు?

ఓపెన్ఐడీ ఎవరి సొంతమూ కాదు. అది ఓపెన్‌సోర్స్ సమాజం నుండి ఉద్భవించింది. ఎవరైనా ఓపెన్ఐడీ ని తెచ్చుకోవచ్చు. ఎవరైనా ఓపెన్ఐడీ ప్రొవైడరు కూడా కావచ్చును. ఓపెన్ఐడీ ని అభివృద్ధి పరచే ఓపెన్‌సోర్స్ సమాజానికి చట్టపరమైన ఉనికి కోసం గాను ఓపెన్ఐడీ ఫౌండేషను అనే సంస్థ (OIDF) 2007 జూన్‌లో ఏర్పడింది. ఓపెన్ఐడీ ని అభివృద్ధి చెయ్యాలన్న ఆలోచనను వ్యాప్తి చేసిన సంస్థలు ఈ ఫౌండేషన్ను ఏర్పాటు చేసాయి. Typepad, Movable Type, మొదలైన సోషల్ నెట్‌వర్కింగ్ సంస్థలు దీన్ని నెలకొల్పిన వారిలో ఉన్నాయి.

OpenID ని ఇచ్చేదెవరు?

blogger.com, WordPress.com మొదలైన బ్లాగు సైట్లు కూడా ఓపెన్ఐడీ ప్రొవైడర్లే! అంతేకాక, ప్రత్యేకించి కొన్ని సైట్లు ఓపెన్ఐడీ ప్రొవైడర్లుగా అవతరించాయి. సెక్యూరిటీ రంగంలో ప్రసిద్ధి గాంచిన వెరిసైన్ వంటి సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. మీ ఓపెన్ఐడీని మీకు నమ్మకమున్న ఏ సంస్థనుండైనా పొందవచ్చు. ఒక సంస్థ నుండి మరోదానికి ఎప్పుడైనా మీరు దాన్ని మార్చుకోవచ్చు. ఓపెన్ఐడీని తెచ్చుకునే పద్ధతిని ఒక ఉదాహరణ ద్వారా పరిశీలిద్దాం. ఈ ఉదాహరణలో వెరిసైన్ సంస్థ ద్వారా ఓపెన్ఐడీ పొందే విధానాన్ని చూద్దాం.

  1. వెరిసైన్ వారి OpenID పేజీకి వెళ్ళాలి – https://pip.verisignlabs.com/
  2. అక్కడ మీ వాదుకపేరు, సంకేతపదం, మీ పేరు, ఊరూ వంటి వివరాలనిచ్చి ఖాతాను తెరవాలి.
  3. ఖాతా తెరిచే ప్రక్రియ పూర్తి కాగానే, మీకు మీ ఓపెన్ఐడీ ఇస్తుంది. అది URL రూపంలో ఉంటుంది, ఇలాగ.. http://yourname.pip.verisignlabs.com

అంతే! మీ ఖాతా సిద్ధమైనట్లే. మీరిక మీ ఓపెన్ఐడీ ని వాడటం మొదలుపెట్టవచ్చు.

దాన్ని ఉపయోగించడం ఎలా?
OpenID250×250మీరు ఏదైనా సైటులో లాగిన్ కాదలచుకున్నారనుకోండి..ఉదాహరణకు పొద్దులో ఈ వ్యాసానికి మీ వ్యాఖ్య రాద్దామనుకున్నారనుకోండి. ముందు ఈ సైటు ఓపెన్ఐడీ ని అనుమతిస్తున్నదో లేదో చూడండి. (పొద్దు ఓపెన్ఐడీ ని అనుమతిస్తుంది. ఓపెనైడీని అనుమతించే సైట్ల ఈ జాబితాలో పొద్దును చూడవచ్చు) అనుమతించే పనైతే ఆ సంగతిని లాగిన్ ఫారములోనే తెలియజేస్తుంది. అలాంటి సైట్లలో మీ ఓపెన్ఐడీ ని మాత్రమే – అంటే మీ URL ను – ఇస్తే చాలు. మీరాపని పని చెయ్యగానే..

పొద్దు మీ URL ను పట్టుకుని సంబంధిత సైటుకు – అంటే pip.verisignlabs.com కు – వెళ్ళి, ‘అయ్యా ఈ ఫలానా URL లో ఉన్న వ్యక్తిni మీరెరుగుదురా’ అని అడిగి, నిర్ధారణ చేసుకుని వస్తుంది. ఈ సందర్భంగా ఒక్క సంగతి గుర్తుంచుకోవాలి. ఏ కంప్యూటరు, ఏ బ్రౌజరు నుండి మీరు పొద్దులోకి లాగిన్ అవదలచారో ఆ కంప్యూటరు, ఆ బ్రౌజరుల నుండి మీరు మీ ఓపెన్ఐడీ ఖాతాలోకి లాగిన్ అయి ఉండాలి. లాగిన్ కాకపోతే అవమని pip.verisignlabs.com మిమ్మల్ని అడుగుతుంది. లాగిన్ అయి ఉన్నా కూడా.., మీగురించి పొద్దుకు చెప్పేముందు వెరిసైన్ మీ అనుమతి తీసుకుంటుంది.. “ఏంటి, ఫలానా వారు మీ గురించి అడుగుతున్నారు, చెప్పమంటారా” అని. అప్పుడు మీరు సరేనంటే, “అవునండీ, ఫలానావారికి మా దగ్గర ఓపెనైడీ ఉన్న మాట నిజమే” అని అదే పొద్దుకు చెబుతుంది. ముందుముందు పొద్దులో మీరు లాగిన్ అవదలచినపుడు మీ అనుమతి అడిగే పని లేకుండా మీరు సెట్ చేసుకోవచ్చు.

OpenID కి ఏయే సైట్లు మద్దతునిస్తున్నాయి?
AOL, Google, IBM, Microsoft, Orange, Verisign, Yandex, Yahoo మొదలైన సైట్లు ఓపెన్ఐడీ ప్రొవైడర్లుగా పనిచేస్తున్నాయి. రాబోయే మూడో తరపు మంటనక్కలో ఈ సౌకర్యం అంతర్గతంగానే ఇమిడ్చి ఉంది.

ఓ కిటుకు:
మీరు pip.verisignlabs.com లో ఖాతా తెరిచాక వాళ్ళిచ్చే myname.pip.verisignlabs.com అనే చేంతాడంత పొడుగైన URL ను రాసే పని లేకుండా నేరుగా మీ బ్లాగు URL నే వాడుకునే ఏర్పాటూ ఉంది. దానికి కింది పద్ధతిని పాటించాలి.

  • ముందు myname.pip.verisignlabs.com అనే మీ ఓపెన్ఐడీని తెచ్చుకోండి.
  • తరువాత మీ బ్లాగు index.html పేజీలోని < head > విభాగంలో కింది కోడును చేర్చండి.

<link href=’http://pip.verisignlabs.com/server’ rel=’openid.server’/>
<link href=’http://yourname.pip.verisignlabs.com’ rel=’openid.delegate’>

అంతే.., ఇకనుండీ సైట్లలో లాగిన్ అయ్యేటపుడు myname.pip.verisignlabs.com అని కాక, మీ బ్లాగు URL నే ఇవ్వవచ్చు. అలా ఇచ్చినపుడు పొద్దు ముందు మీ బ్లాగుకు పోయి, అక్కడి నుండి myname.pip.verisignlabs.com కి వెళ్ళి సంగతి కనుక్కొస్తుంది.

ఓ విషయం: పొద్దులో మీరు వ్యాఖ్య రాయాలంటే మీ ఈమెయిలైడీ ఇవ్వడం తప్పనిసరి కదా. ఇప్పుడు మీ OpenID ఇస్తే, ఈమెయిలు ఐడీ ఇవ్వకపోయినా పరవాలేదు. ఓపెన్ఐడీ నిర్ధారణ సమయంలో మిమ్మల్ని అడుగుతుంది.. “పొద్దు మీ ఈమెయిలు ఐడీ అడుగుతూంది ఇమ్మంటారా” అని. మీరు ఒద్దంటే మానేస్తుంది. ఇదో సౌకర్యం వాడుకరికి! అయితే ప్రస్తుతం ఇది ఇంకా ప్రయోగాత్మకమే!

ఓపెనైడీకి సంబంధించిన లింకులు: ఈ వ్యాసం రాయడం కోసం ఈ లింకులలోని సమాచారాన్ని వాడుకున్నాం.

  1. ఓపెనైడీ గురించి చెప్పే అధికారిక సైటు.
  2. ఓపెనైడీని వాడటం ఎలా? – సామాన్యుల కోసం
  3. గీకుల కోసం
  4. మీ ఓపెనైడీ సరైనదో కాదో తెలుసుకునే చోటు

చివరగా..
నెజ్జనులకున్న ప్రధాన సమస్యను ఓపెన్ఐడీ పరిష్కరిస్తుంది. వెంటనే మీ OpenID ని తెచ్చుకోండి. సాంకేతికంగా ముందంజలో ఉన్న తెలుగు బ్లాగరుల్లో ఈ సరికే ఈ ఓపెన్ఐడీని వాడుతున్నవారు కొందరు ఉన్నారు.

———-

-పొద్దు

This entry was posted in జాలవీక్షణం and tagged , , . Bookmark the permalink.

9 Responses to OpenID: సర్వాంతర్యామి

  1. ఇక్కడ కోడు స్నిప్పెట్ లో కొద్దిగా తప్పుందండీ వెరీసైన్ బదులు లైవ్‍జర్నల్ అని వాడారు.

  2. ప్రవీణ్ గారూ, తప్పు సరిదిద్దాం. చూపించినందుకు నెనరులు.

  3. ఒక చిన్న పరీక్ష 🙂

  4. పొద్దులో open ID ఇప్పవచ్చు అని అన్నారు, కానీ ఇంతకు ముందుకీ ఇప్పటికీ తేడా ఏమీ కనపటం లేదు, ఆ సైటు నాకు చెందినదా కాదా అని నిర్ధారించుకోవటం లేదు 🙁

  5. ప్రదీపు గారూ,
    మీది బ్లాగరు ఇస్తున్న ఓపెనైడీ. అది ఈసరికే ఇక్కడ ఆథెంటికేటు అయి ఉందేమో చూసారా? మళ్ళీ మళ్ళీ ఆథెంటికేటు చెయ్యాల్సిన అవసరం లేదనుకుంటా!

  6. మాష్టారూ , నేనూ మొదటిసారిగా ఇక్కడే పరీక్షిస్తున్నాను – మన్నించాలి .

  7. చాలా వివరంగా తెలిపారు మాష్టారూ – నెనర్లు .
    నేనూ మొదటిసారిగా ఇక్కడే పరీక్షిస్తున్నాను .
    మన్నించాలి …

  8. అంతా బాగానే ఉంది కానీ…
    నేను వ్యాఖ్యానించిన ప్రతి చోటా నా పేరుకి బదులు చంతాడులా http://kamudhar.blogspot.com అని కన్పిస్తుంది. దీన్ని వదిలించుకునే దారి లేదా?

Comments are closed.