తిక్కన స్థాయిని చేరుకొన్న కవులెవరూ లేరనుకోండి, అందులోనూ ఒక ఔత్సాహిక రచయితని తిక్కనతో పోల్చటం – ఒకరికి అన్యాయం, మరొకరికి అవమానం చేసినట్టవుతుందేమో, కాని – ఒక్కోసారి, ఒక విషయాన్ని ఎత్తిచూపటానికి Extreme Examples అవసరం అవుతాయిగదా?
ఈ వ్యాసం రాసేముందు, ఫణీంద్రని ఇంతవరకూ మీ బ్లాగులో ఉన్న రచనలన్నిటిలోకి మీకు నచ్చిన రచనేది అనడిగాను. సరిహద్దుకిరువైపులా అన్న కథని సూచించారు ఆయన. అందుకని ఆ కథనే ఎన్నుకొందాం. ఈ కథలో పదేళ్ళు సంసారం చేసినా, మానసికంగా ఒకరికొకరు దూరమైపోయిన ఒక భార్యా భర్తల జంట – చివరకి ఒక చిన్న సంఘటనాధారంగా విడిపోతారు. ఈ కథ – ఇద్దరి కోణంలోనూ చెప్పబడింది. మొదటిసారి చదివినప్పుడు ఓహో అనిపించినా, ఏదో వెలితి కనిపించింది. ఆపైన ఈ కథని నేను పదిసార్లకంటే ఎక్కువే చదివాననుకొంటా. ఇందులో వర్ణనలు, ఉపమానాలు, ఒక సంఘటనని రచయిత పట్టుకొన్న తీరు అన్నీ చాలా గొప్పగా ఉన్నాయి – వాటిల్లో వేలెత్తి చూపటానికేం లేదు. కాని, కథలో పాత్రలు రెండూ మాత్రం – రక్తమాంసాదులున్న సజీవమైన ఇద్దరు వ్యక్తుల్లా కాకుండా, రచయిత సృష్టించిన ఒక ప్రపంచంలో రెండు ‘వస్తువులు (mere objects)’ గానో, రెండు “కాన్సెప్ట్స్”లాగానో అనిపించాయి నాకు – ముఖ్యంగా ఈ కథలో సుజాత అనే పాత్ర.
ఈలోపం ఎక్కడుందీ అని ఈ కథనంతా ఒక మైక్రోస్కోపులో పెట్టి వెతికి చూస్తే:
1. సుజాత తన కోణంలోంచి మనకీ కథని ఎప్పుడు చెపుతోంది – “నాకు డివోర్సు కావాలి” అని చెప్పి, ఇల్లు వదిలి వెళ్ళిపోయింతర్వాత. అటువంటుప్పుడు – ఆమె మనకేం చెప్తుందీ? ఆమె కథని ఎక్కడ ప్రారంభిస్తుందీ? ఆమె కథలో ముఖ్యమైన అంశం ఒకరోజు బెడ్రూములో జరిగిన సంఘటనా? తన భర్త రాసిన కథలోని ఒక రెండు పేరాగ్రాఫులా? తమ మధ్య జరిగిన ఒక వాదనా? లేక, తాను తీసుకొన్న నిర్ణయానికి దారితీసిన పరీస్థితులా? ఆ నిర్ణయం వెనక – తాను ఎన్నో సంవత్సరాలుగా అణచుకొన్న బాధా, తనలో పేరుకుపోయిన స్థబ్దతా మొదలైనవా? బహుశా, ఒక నిజమైన ప్రాణమున్న, సజీవమైన సుజాతైతే – తాను తన తల్లి తండ్రుల నుంచీ అందుకొన్న ప్రేమాభిమానాలతో ప్రారంభించి, అవి తన సంసారంలో ఎలా కరువయ్యాయో, అందుకు దారి తీసిన పరిస్థితులమీద ఎక్కువగా కేంద్రీకరించేదేమో.
2. తనకి నచ్చని ఒక కథని, తాను చించిపారేసిన ఒక కథని, అందులోనూ ఏ వర్ణనైతే తాను పదిమందికీ చేరకూడదనుకొందో అదే వర్ణనని, మక్కీకి మక్కీ గుర్తు పెట్టుకొని తిరిగి మనకి చెప్తుందా? కనీసం చెప్పటానికి ఇష్టపడుతుందా? ఆమె రచయిత కాదు, వాక్చాతుర్యం తనకి లేదని స్వయంగానే చెప్పుకొంది – అటువంటప్పుడు – టి.వి.లో వచ్చిన ఒక ప్రకటని కళ్ళకి కట్టినట్టు వర్ణిస్తుందా? అసలా సన్నివేశం ఆవిడవైపు నుంచీ చెప్పిన కథలో అవసరమా?
3. “ఇంతే, దిగంతంలో ఎక్కడో కలుస్తాయని భ్రమింప జేసే రైలు పట్టాల్లా వాదన అనంతంగా సాగిపోతూనే ఉంటుంది.”, “మరో కన్నీటి చుక్క తరుముకొచ్చింది. నాసిక అంచున నిలిచిన మొదటి కన్నీటి చుక్కని కలసి “ఛలో దూకేద్దా”మంది. రెండూ జతగా క్రిందకు రాలిపోయాయి.” ఇటువంటి వాక్యాలు సుజాతవా, లేక రచయితవా అనే సందేహం వస్తుంది.
4. ఇంకోరకంగా చూస్తే, సుజాత మరోవిధంగా తన కథని చెప్పే ఆస్కారమే లేదు. ఎందుకంటే, మనం చదువుతున్నప్పుడు అది సుజాత స్వగతం అనిపించినప్పటికీ, అది నవీన్ అని ఆ కథలో మరో పాత్ర్ర రాసిన కథ. నవీన్ కి సుజాతని అంతకన్నా ఎక్కువగా అర్థం చేసుకొనే పరిణితిలేదు. రచయిత నవీన్ అని ఒక పాత్రని సృష్టించి, ఆ పాత్రని సుజాతలో పరకాయ ప్రవేశం చేయించి, ఆమె స్వగతాన్ని అతని ద్వారా చెప్పంచటం ఈ కథలో ఒక విశిష్టత. ఇలాటి రికర్సివ్-స్ట్రక్చర్స్ అంటే ఫణీంద్రగారికి చాలా ఇష్టమనుకొంటా, ఆయన రాసిన కథలన్నిటోనూ సుమారుగా ఇలాటి మెలికోటి ఉంటుంది. కాని, ఈ కథకి ఇలాటి మెలిక అవసరమా?
5. ఈ కథలో ఒక్కోచోట వాడిన Tense Usage అక్కడక్కడ ఇబ్బంది కలిగించింది. ముందుగా, అతడు – ఒక గదిలో జరుగుతున్న సన్నివేశాన్ని మనకి జరుగుతున్నట్టుగా చెపుతుంటాడు. ఉదాహరణకి: “ఇవాళెందుకో కోరికల తుఫానులో దేహం చిగురుటాకులా వణికిపోతుంది” – ఇక్కడ, వణికిపోతుంది అనడం వల్ల, ఆ గదిలోంచి మనం కథలోకి వచ్చేస్తాం. “వణికిపోతోంది” అంటే బాగుండేదేమో.
ఈ కథపై ఒక పదిపేజీల వ్యాసం రాయవచ్చును. ఇక్కడ క్లుప్తంగా – అందులో, నాకనిపించినంతలో – కరువైన “ఎనర్జీ”ని ప్రస్తావించడానికి మాత్రమే ఇక్కడ ఈ ఉదాహరణలు పేర్కొన్నాను. మెత్తం మీద – The Story comes across as a tad too intellectual. ఈ కథలాగనే, సుమారుగా ఆయన రచనలన్నీ ఒక రకమైన తీక్షణతని తలపిస్తూ ఉంటాయి. ఎక్కడో ఒకచోట, వేరొక సందర్భంలో అనుకోండి “తొందర్లోనే ఇది వదలిపోబోతోంది” అన్నారాయనే.
*****
<<ముందు పేజీ — తరువాతి పేజీ>>
ఫణి గారి రచనల్ని లోతుగా ఆస్వాదించడానికి ఈ మాత్రం వ్యాఖ్యానం కావాలి. ఆ పనికి మీరే సమర్ధులు గనక మరీ సంతోషించాను. కనీసం రెణ్ణెల్లపాటు మంచి విందూ మందూ నా బుర్రకి. ఈ లోపల ఫణి మరిన్ని కథలూ కవితలూ వెలువరిస్తారని ఆశ!
ఫణీంద్ర గారి బ్లాగుకి నేనూ అభిమానినే. కానీ..నాకు అర్థమైనంత వరకూ మాత్రమే చదివాను ఇన్నాళ్ళూ. ఈ టపా చూసాక..మిగితావి కూడా చదివి చూడాలి అనిపిస్తోంది.. 🙂
పప్పు నాగరాజా గారి సమీక్ష చక్కగానూ, లోతుగానూ, వుంది. ముఖ్యంగా “పాఠకుడిగా మనం చదవటం అయినంత మాత్రాన వాటి జీవితం ముగిసినట్టుగా మనకి అనిపించదు – వాటి ప్రయాణం వేరెక్కడికో, వాటి గమ్యం వేరేమిటో.” ఈ వాక్యం బావుంది. ఎందుకంటే రచన గమ్యం ఎప్పుడూ దాని జీవితం ముగిసిపోవడం కానేరదు. చదువరి జీవితాన్ని మరో నూతన దృక్పథంలోకి మళ్ళించి, పఠిత జీవితాన్ని పునః ప్రారభింపజేయగలగాలి.
బంగారం విలువ కంసాలికే ఎరుక అని మీసమీక్ష ఋజువు చేసింది. ఒక పరిపూర్ణ సమతౌల్య సమీక్ష వ్రాసినందుకు అభినందనలు మాస్టారూ.
సమీక్ష చాలా బాగుంది.
ఫణీంద్రగారి ఎర్లీ అభిమానుల్లో నేనొకడిని. ఆయన రచనలు చదివినతర్వాత ఆ హాంగోవర్ నుంచి తేరుకోవడానికి కనీసం ఒక రోజు పడుతుంది నాకు. మీ అంత లోతుగా విశ్లేషించలేనుగానీ, to be terse… he is IRREVOCABLY ADDICTIVE (:)
Im sorry, I meant his writings are IRREVOCABLY ADDICTIVE
పార్టీలో పిత్తు-
సమీక్షలు ఇంత బాగుండొచ్చా?
ఉదా- నేను మహాప్రస్థానానికి చలం వ్రాసిన యోగ్యతా పత్రం చదివాను. శివుని ఇంటిముందు నందిలా బాగుంది.
మీ సమీక్ష ఒక రకంగా పోటీపడుతుంది మూలంతోఁ, ఇంకొద్దిగా వినయంగా నిరార్భాటంగా వుంటే బాగుండేదేమో..
————————————————————————-
తాయి ఆశీర్వాదగళముతోఁ వ్రాయడం మొదలు పట్టిన ఫణీంద్ర నిజంగా అదృష్టవంతులు.
————————————————————————-
వేరే విషయమై
తన గమ్యమేమిటో, దాన్ని చేరుకోటానికి చేయవలసిన ప్రయత్నమేమిటో, అందులోని సాధకబాధకాలేమిటో పూర్తిగా ఎరిగిన భాగ్యశాలి అన్నారు. నిజంగానంటారా? జీవితం మనకు ఎంత అందించగలదో ఎంత ఆశ్చర్యపఱచగలదో అన్న విషయాన్ని మీ వ్యాఖ్య కొంత చులకన చేయట్లేదూ?
జీవితం ఎంత అందించగలదో అన్న ఆలోచన నిత్య సత్యమేమీ కాదు – అదొక వ్యక్తి అనుభవం, అనుభూతి మాత్రమే. ఒకడు ఏమీ అనుభవించకుండానే, ఆహా ఈ జీవితం అద్భుతం అనుకోవచ్చు, ఇంకోడు చాలా అనుభవించి కూడా నిస్సారం అనుకోవచ్చు. అంచేత ఇక్కడ అభావం కాలేదు. పనిలోపని – నీకక్కడ కావలసిన మాట “చులకన” కాదు .. బహుశా యద్దేవా, వెక్కిరించడం .. అలాంటిదేదో
@ కొత్త పాళీ గారు,
నాకు కావలసిన పదం చులకనే (తక్కువ చేసి మాట్లాడడం అన్న అర్థంలోఁ). ఏమైనా అది కాస్త అప్రస్తుతం ఇక్కడ. నేను ఆ ఊసు ఎత్తకుండా వుండాల్సింది.
ఇంతకీ ఫణి గారి పుస్తకం అంటే గుర్తుకువచ్చింది. ఆయన ఎప్పుడో తన సృష్టిని ఇతరుల చేతుల్లో పెట్టడానికి భయపడుతున్నట్టు చెప్పారు (నాకు అస్సలు మాటలు గుర్తుకులేవు, వాటిని మఱీ వక్రీకరిస్తే క్షమించండి). కాబట్టి అలాంటివన్నీ ప్రక్కన పెట్టి నిజంగా ప్రచురించే రోజు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. అప్పటికి తెలుగు అచ్చు సాహిత్యానికి ఇంకా మంచి రోజులు వస్తాయని ఆశిస్తూ.
రాకేశ్వర
ఈ సమీక్షకే ఇంకెవరైనా సమీక్ష రాయాలి ఏమో…
రాకేశ్వర రావుగారు,
గమ్యం ఏమిటో తెలిసి, ఆ దిసగా ప్రయానించే వాడికి ఆశ్చర్య పడే అవకాశం వుంటుందేమో కాని, గాలి ఏటు వీస్తే అటు నడిచే వాడికి ఆశ్చర్య పడే అవకాశం ఎక్కడ వుంటుంది??
— వంశీ
mee samiksha chaduvutunte… naku aa blog eppudu choostaana anipinchindi..!! phanindra kumar gari blog address pampagalaru…
ప్రతాపరెడ్డి గారూ, ఈ సమీక్ష రాసిననాటి బ్లాగు అడ్రసు మారింది. కొత్త అడ్రసు: http://loveforletters.blogspot.com/ సంపాదకుడు