కాఫ్కా, నబకోవ్ల ప్రస్తావనలేకుండా కలంకలల గురించి ఎంత చెప్పినా తక్కువే. నేనైతే వారి రచనలు చదవలేదు – ఈ బ్లాగు ద్వారానే నాకా సాహితీ స్రష్టల గురించి కొద్దిగా తెలిసింది. అందుకని నేనీ విషయంలో చెప్పగలిగేది చాలా తక్కువే. అయితే, ఒక్కటి మాత్రం చెప్పగలను – ఒక గొప్ప రచన మనలని చాలా ప్రభావితం చేస్తుంది, అందులోనూ చాలా లోతైన తాత్విక చింతన ఉన్న రచనలైతే ఎంతగా మనలని ప్రభావితం చేస్తాయంటే – ఒక్కోసారి మన అంతరంగ ప్రపంచం అంతా ఆ రచయితే ఒక దెయ్యంలా ఆక్రమించుకొని, మన చేతనాచేతన వ్యాపారాన్నంతా నడిపిస్తున్నట్టుగా ఉంటుంది. సర్వేంద్రియాలద్వారా మనం ప్రపంచాన్ని అనుభవించేలోపే, మనలో దూరిన వేరొకరి తాత్విక దృష్టి ఒక క్షణం ముందే, తానే అంతా గ్రహించేసి – మనకి మనం లేమన్నట్టుగా చేస్తుంది. అందుకే, లోతుగా ప్రభావితం చెయ్యగలిగే రచయితలతో పరిచయం పెట్టుకొనే ముందు కుసింత జాగర్త పడటం అవసరమేమో. కలంకలలలో కాఫ్కాగురించి చదివింతర్వాత నేనైతే ఆయన రచనలు నా జీవితంలో ఎన్నడూ చదవకూడదని నిశ్చయించేసుకొన్నాను.
ఫణీంధ్ర కాఫ్కాని కాకుండా – ఎమిలీ జోలానో, టి.యస్. ఇలియటో, షేక్సిపియరో, బెర్నాడ్-షావో, లేకపోతే ఒక రాబర్ట్ పిర్సిగ్ బారినో పడుంటే, కాకుంటే, కంప్యూటర్ సైన్సులో డైక్-స్త్రా, డోనాల్డ్ నూత్ లాటి వారి సైంటిఫిక్ రచనలో, విల్ డ్యూరాంట్ లాటి చరిత్రకారుల, తాత్వికుల రచనల్లోతులోకి దిగుంటే – ఇప్పుడు ఆయన ఆలోచనలు ఎలా ఉండేవి అని నాకనిపిస్తుంటుంది ఒక్కోసారి. ఇవన్నీ హైపోథిటికల్ ఆలోచనలు అనుకోండి.
పాఠకులు రాసే ప్రతి వ్యాఖ్యకి ప్రతిస్పందిస్తారు ఫణీంద్ర. “వ్యాఖ్య రాసినందుకు నెనర్లు” లాటి ఉత్తుత్త స్పందనలు కావు, ఒక్కోసారి, పాఠకులు వెలిబుచ్చిన ప్రతి అభిప్రాయానికీ, వారడిగే సందేహాలకీ, తన వ్యాసంలో సరిగ్గా అర్థం చేసుకోలేకపోయిన ప్రతి అంశానికి ఓపిగ్గా వివరణలు ఇవ్వటం ఈ బ్లాగులో కనిపిస్తుంది. ఒక్కోసారి ఈ ప్రతిస్పందనలు మరో టపా అంత పెద్దగా ఉంటాయి కూడా. ఈ మధ్య ఒక మిత్రుడు – ఆయన ఇచ్చే సమాధానాలలో చాలా అసహనం కనిపిస్తోంది, మనలాటి వాళ్ళు రాసే వ్యాఖ్యలు చూసి ఆయనకి విసుగేస్తుందేమో అన్నారు నాతో. ఒక్కోసారి ఇటువంటి అసహనం కనిపించినా, నా ఉద్దేశ్యంలో ఫణీంద్ర అసహనం పాఠకుడితోకాని, వారు రాసిన వ్యాఖ్యతో కాని కాదు. ఈ ఏకీభవించడాలు, విభేదించడాలు అనేవి పూర్తిగా నిరర్థకం, ఆయనకి సంబంధించినంతవరకూ. ఆయన వ్యాఖ్యల్లో కనిపించే అసహనం, తాను ఏదైతే చెప్పదలచుకొన్నారో, అది స్పష్టంగా చెప్పలేకపోయానన్న అసహనమే కాని, పాఠకులతో కాని, వారు వ్యక్తపరిచిన అభిప్రాయాలతోగాని కాకపోవచ్చు.
****
ఫణీంద్రగారి రచనలన్నీ చాలాసార్లు చదివిన మీదట ఈయన ఒక శైలీ చట్రంలో ఇరుక్కొన్నారేమో అని నాకనిపిస్తుంటుంది. ఎందుకిలా అంటున్నానంటే – ఏ రచనకైనా శైలి చాలా అవసరమే, కాని దాని ప్రాముఖ్యం కొంతవరకే. ప్రతి రచనకీ ఆత్మ అనేదొకటి ఉంటుంది కదా – దానిని ప్రతిఫలించేటట్టుగా రచన ఉన్నప్పుడే అది చదివేవారి హృదయాలని సుతారంగా మీటడానికి ఆస్కారం ఉంటుంది. పదాలకి అర్థాలు నిఘంటువులలో ఉంటాయి, కాని ఆ అర్థాలకి అతీతమైన ఒక శక్తి వాటికుంటుంది. కొన్ని పదాలు మనకెంతో దూరంలో ఉన్నట్టుంటాయి, కొన్ని దగ్గరగా ఉంటాయి, మరికొన్ని మనతో దోబూచులాడుతూ ఉంటాయి, ఇంకొన్ని చిరకాల స్నేహితుల్లా ఉంటాయి. కొన్ని అందమైన అమ్మాయిలలా ఉంటే, మరికొన్ని గయ్యాళి గంపల్లా ఉంటాయి. కొన్ని గంభీరంగా, ఉదాత్తంగా ఉన్నట్టనిపిస్తాయి, అవే పదాలు మరో సందర్భంలో విదూషకుల్లా అనిపించవచ్చు కూడా. ఈ శక్తి వాటికెక్కడునుంచీ వస్తుందీ అంటే చెప్పటం చాలా కష్టం. బహుశా, రచయిత సృష్టించే వాతావరణంలో అంతర్లీనంగా ఉంటుందేమో. సంగీతంలోనైతే, స్వరాలకి, రాగాలకి అతీతమైన నాదం అనేదొకటుంది. ఉదాహరణకి – “రామ చక్కని సీత” అనే పాటని అందరూ వినే ఉంటారు. ఎంతో చక్కటి సాహిత్యం, ఆ సాహిత్యానికి అనువైన సున్నితమైన గాత్ర్రం, అందులోని భావనకి అనుగుణమైన స్వరకల్పన -అన్నీ ఆ పాటలో ఉన్నాయి, కాని – అందులో హై-డెసిబల్ లెవెల్ ఎక్కువున్న Electric Guitar, Synthesizers, percussion instruments నేపథ్య సంగీతంలో వాడటం మూలంగా, గాత్రం వెనువెంటనే వినిపించే ఈ శబ్దాలు ఆ అనుభూతిని చెరిపేసేటట్టుండి, చెవుల్లో సీసం పోసినట్టు ఉంటుంది. ఆ పాటలో మామూలుగా మృదంగమో, తబలానో వాడి, అందులో ఒకచోట వాడిన వయలిన్తో సరిపెట్టుంటే ఆ పాటలోని వాయిద్య సంగీతం అంత “జారింగ్”గా అనిపించకపోయుండును. ఇది స్వరకల్పనకి ఏ మాత్రం సంబంధం లేని విషయం. ముత్యాలముగ్గులో ఇలాటి అనుభూతిని కలిగించే పాటే – “ఏదో ఏదో అన్నదీ మసక మసక వెలుతురు, గూటిపడవలో విన్నదీ కొత్త పెళ్ళికూతురు” అన్న పాట సుతారంగా, సున్నితంగా మన శరీరాన్ని తాకుతూ, మనసుకి సోకుతుందిగాని – చెవుల్లోంచి మెదడులోకి బాణంలాగ దూసుకుపోదు.
సాహిత్యంలో నాద జ్ఞానం గురించి చెప్పాలంటే తిక్కనాచార్యుల ఏ పద్యమైనా ఉదాహరణగా చెప్పవచ్చు. అందరికీ తెలిసిన పద్యమే, నర్తనశాల సినిమాలో కూడా ఉంది. ఉత్తరుడికి కౌరవవీరులని పరిచయం చేస్తూ, అర్జునుడు చెప్పిన పద్యం:
సింహలాంగూల భూషిత నభోబాగ కేతు ప్రేంఖణమువాడు ద్రోణసుతుఁడు
కనకగోవృష సాంద్ర్రకాంతి పరిస్ఫుట ధ్వజ సముల్లాసంబువాడు కృపుడు
లలితకంబుప్రభాకలిత పతాకావిహారంబువాడు రాధాత్మజుండు
ఇందులో మొదటి ముగ్గురు వీరులని ఎంతో ఉదాత్తంగా, గంభీరంగా, వీరోచితంగా పరిచయం చేసిన అర్జునుడు, కర్ణుడి విషయానికొచ్చేసరికి వాడిన పదాలెలా ఉన్నాయో చూడండి – ఒక మహావీరుడిని ముందు “లలిత” అంటూ మొదలెట్టి, చివర్లో వీడింకా అమ్మకొడుకే అంటాడు. శంఖాన్ని కూడా “కంబు” అన్న పదం వాడటం ద్వారా కూడా కొంత ఆడారితనాన్ని, ఆడంబరాన్ని సూచిస్తుంది – సాధారణంగా అందమైన మెడ ఉన్న అతివని కంబుకంఠి అంటారు. శంఖానికి ఈ పర్యాయపదం అట్లాంటి వర్ణన చేసినప్పుడే ఎక్కువగా ఉపయోగిస్తారు. అర్జునుడికి కర్ణుడి మీద ఉన్న చిన్న చూపు అలాటిది మరి. దీని ప్రతిపదార్థం తెలియకపోయినా, చదువుతున్నప్పుడే, కర్ణుడు మనకి తన ముందున్న ముగ్గురు మహావీరుల సరసన తేలిపోతూ కనిపిస్తాడు. ఈ పద్యాన్ని నర్తనశాలలో ఘంటసాల అద్భుతంగా గానం చేసారు – అప్పటిదాకా ఉదాత్తంగా చదివి, ఈ పాదం దగ్గరకి వచ్చేసరికి ఘంటసాల గొంతు మారిపోతుంది.
ఇక్కడ పద్యం చెపుతున్నది అర్జునుడు.., తిక్కన కాదు. ఆయన అర్జునుడైతే ఏమంటాడో దానినే పద్యంలో చెప్పాడు. ఇక రెండోది, ఛందస్సుల చక్రవ్యూహంలో కూడా ఆయన చూపించిన నైపుణ్యం – ముందున్న మూడు పాదాలలోనూ ఒత్తులూ, సంయుక్తాక్షరాల సాయంతో ఒక రకమైన వీరరసాన్ని పండించి, నాలుగో పాదంలో తేలికైన ‘ల’ ‘త’ లతో, పదాలకి అర్థంతెలియని వాడికి కూడ ఒక రకమైన “చిన్నచూపు” ధ్వనించేటట్టుగా చెయ్యటం ఆ మహాకవికే చెల్లింది. ఇదీ పదాలకున్న పవరు. తిక్కన పదిరోజుల పాటు ఈ పద్యానికి సానబట్టాడా? మన అర్జునుడు చెప్పినట్టుగానే ఈ పద్యం ఉందా అని ఓ పదిసార్లు సరిచూసుకునుంటాడా? లేదే, ఆయన ఆశువుగానే, ఒక పద్యం మొదలెడితే ఆపకుండానే చెప్పాడని కదా సంప్రదాయం? ఈ విద్య ఎలా అబ్బుతుందీ? ఏమో నాకూ తెలియదు – కొన్ని ఊహాగానాలు మాత్రం చెయ్యగలను. సాధన చెయ్యగా, చెయ్యగా – ఏదో ఒకరోజు, ఉన్నట్టుండి, హఠాత్తుగా – ఎక్కడో మనకందుబాటులో లేనంత లోపలెక్కడో “క్లిక్”మంటూ ఈ సాధనంతా ఒక సాధనంగా కుదురుకుంటుందనుకుంటాను. అటుతర్వాత – స్వతఃసిద్ధంగానే, సహజంగానే అక్షరాలు – ఏవైతే అవసరమో అవిమట్టుకే – కలంలోంచి జాలువారుతాయోమో. The effort eventually transforms itself into a completely new organ of perception.
ఫణి గారి రచనల్ని లోతుగా ఆస్వాదించడానికి ఈ మాత్రం వ్యాఖ్యానం కావాలి. ఆ పనికి మీరే సమర్ధులు గనక మరీ సంతోషించాను. కనీసం రెణ్ణెల్లపాటు మంచి విందూ మందూ నా బుర్రకి. ఈ లోపల ఫణి మరిన్ని కథలూ కవితలూ వెలువరిస్తారని ఆశ!
ఫణీంద్ర గారి బ్లాగుకి నేనూ అభిమానినే. కానీ..నాకు అర్థమైనంత వరకూ మాత్రమే చదివాను ఇన్నాళ్ళూ. ఈ టపా చూసాక..మిగితావి కూడా చదివి చూడాలి అనిపిస్తోంది.. 🙂
పప్పు నాగరాజా గారి సమీక్ష చక్కగానూ, లోతుగానూ, వుంది. ముఖ్యంగా “పాఠకుడిగా మనం చదవటం అయినంత మాత్రాన వాటి జీవితం ముగిసినట్టుగా మనకి అనిపించదు – వాటి ప్రయాణం వేరెక్కడికో, వాటి గమ్యం వేరేమిటో.” ఈ వాక్యం బావుంది. ఎందుకంటే రచన గమ్యం ఎప్పుడూ దాని జీవితం ముగిసిపోవడం కానేరదు. చదువరి జీవితాన్ని మరో నూతన దృక్పథంలోకి మళ్ళించి, పఠిత జీవితాన్ని పునః ప్రారభింపజేయగలగాలి.
బంగారం విలువ కంసాలికే ఎరుక అని మీసమీక్ష ఋజువు చేసింది. ఒక పరిపూర్ణ సమతౌల్య సమీక్ష వ్రాసినందుకు అభినందనలు మాస్టారూ.
సమీక్ష చాలా బాగుంది.
ఫణీంద్రగారి ఎర్లీ అభిమానుల్లో నేనొకడిని. ఆయన రచనలు చదివినతర్వాత ఆ హాంగోవర్ నుంచి తేరుకోవడానికి కనీసం ఒక రోజు పడుతుంది నాకు. మీ అంత లోతుగా విశ్లేషించలేనుగానీ, to be terse… he is IRREVOCABLY ADDICTIVE (:)
Im sorry, I meant his writings are IRREVOCABLY ADDICTIVE
పార్టీలో పిత్తు-
సమీక్షలు ఇంత బాగుండొచ్చా?
ఉదా- నేను మహాప్రస్థానానికి చలం వ్రాసిన యోగ్యతా పత్రం చదివాను. శివుని ఇంటిముందు నందిలా బాగుంది.
మీ సమీక్ష ఒక రకంగా పోటీపడుతుంది మూలంతోఁ, ఇంకొద్దిగా వినయంగా నిరార్భాటంగా వుంటే బాగుండేదేమో..
————————————————————————-
తాయి ఆశీర్వాదగళముతోఁ వ్రాయడం మొదలు పట్టిన ఫణీంద్ర నిజంగా అదృష్టవంతులు.
————————————————————————-
వేరే విషయమై
తన గమ్యమేమిటో, దాన్ని చేరుకోటానికి చేయవలసిన ప్రయత్నమేమిటో, అందులోని సాధకబాధకాలేమిటో పూర్తిగా ఎరిగిన భాగ్యశాలి అన్నారు. నిజంగానంటారా? జీవితం మనకు ఎంత అందించగలదో ఎంత ఆశ్చర్యపఱచగలదో అన్న విషయాన్ని మీ వ్యాఖ్య కొంత చులకన చేయట్లేదూ?
జీవితం ఎంత అందించగలదో అన్న ఆలోచన నిత్య సత్యమేమీ కాదు – అదొక వ్యక్తి అనుభవం, అనుభూతి మాత్రమే. ఒకడు ఏమీ అనుభవించకుండానే, ఆహా ఈ జీవితం అద్భుతం అనుకోవచ్చు, ఇంకోడు చాలా అనుభవించి కూడా నిస్సారం అనుకోవచ్చు. అంచేత ఇక్కడ అభావం కాలేదు. పనిలోపని – నీకక్కడ కావలసిన మాట “చులకన” కాదు .. బహుశా యద్దేవా, వెక్కిరించడం .. అలాంటిదేదో
@ కొత్త పాళీ గారు,
నాకు కావలసిన పదం చులకనే (తక్కువ చేసి మాట్లాడడం అన్న అర్థంలోఁ). ఏమైనా అది కాస్త అప్రస్తుతం ఇక్కడ. నేను ఆ ఊసు ఎత్తకుండా వుండాల్సింది.
ఇంతకీ ఫణి గారి పుస్తకం అంటే గుర్తుకువచ్చింది. ఆయన ఎప్పుడో తన సృష్టిని ఇతరుల చేతుల్లో పెట్టడానికి భయపడుతున్నట్టు చెప్పారు (నాకు అస్సలు మాటలు గుర్తుకులేవు, వాటిని మఱీ వక్రీకరిస్తే క్షమించండి). కాబట్టి అలాంటివన్నీ ప్రక్కన పెట్టి నిజంగా ప్రచురించే రోజు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. అప్పటికి తెలుగు అచ్చు సాహిత్యానికి ఇంకా మంచి రోజులు వస్తాయని ఆశిస్తూ.
రాకేశ్వర
ఈ సమీక్షకే ఇంకెవరైనా సమీక్ష రాయాలి ఏమో…
రాకేశ్వర రావుగారు,
గమ్యం ఏమిటో తెలిసి, ఆ దిసగా ప్రయానించే వాడికి ఆశ్చర్య పడే అవకాశం వుంటుందేమో కాని, గాలి ఏటు వీస్తే అటు నడిచే వాడికి ఆశ్చర్య పడే అవకాశం ఎక్కడ వుంటుంది??
— వంశీ
mee samiksha chaduvutunte… naku aa blog eppudu choostaana anipinchindi..!! phanindra kumar gari blog address pampagalaru…
ప్రతాపరెడ్డి గారూ, ఈ సమీక్ష రాసిననాటి బ్లాగు అడ్రసు మారింది. కొత్త అడ్రసు: http://loveforletters.blogspot.com/ సంపాదకుడు